మట్టిలో మాణిక్యం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

https://youtu.be/_IbzbIyPEJ0

'Mattilo Manikyam' written by Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ


ఒకరిద్దరు కాదు.

నలుగురు కొడుకులు రాఘవయ్య గారికి.

అతని జీవితంలో ఇక కొదవే ఉండదని అనుకున్నారందరూ.

నెమ్మదిగా భ్రమలు తొలిగాయి.

తనను ఆదరించే వారెవరో తెలుసుకున్నాడు.

ప్రముఖ రచయిత్రి లక్ష్మీశర్మ గారు రచించిన హృదయాన్ని కదిలించే ఈ కథ చదవండి.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్


కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం


పూజముగించుకొని బయటకు వచ్చాడు రాఘవయ్య.

“జానకీ కాఫి తీసుకురా.” అంటూ వెళ్ళి కుర్చీలో కూర్చోని పేపరు

చూస్తున్నాడు.

“కాఫి తీసుకోండి .”అంటూ రాఘవయ్య చేతికి కాఫి ఇచ్చి. పక్కనే ఉన్న

కుర్చిలో కూర్చుంది రాఘవయ్య భార్య జానకి.

కాసేపటి తరువాత. “జానకీ! మన పెద్దోడికి. రెండోవాడికి పెళ్ళిళ్ళు చేసామంటే. మనకు కొంత బాధ్యత తీరుతుంది ఏమంటావు?” భార్యను అడిగాడు రాఘవయ్య .

“నిజమేనండి… వయసు వచ్చిన పిల్లలను ఇంకా అలానే వుంచకూడదు. త్వరగా మంచి సంబంధాలు చూడండి. కోడళ్ళు వస్తే నాకు విశ్రాంతి దొరుకుతుంది.” చెప్పింది జానకి.

“కొన్నాళ్ళు పోతే నేను రిటైర్డు అవుతాను. పెద్దోడికి రెండోవాడికి

వుద్యోగాలున్నాయి. ఇక మూడోవాడికి కూడా వుద్యోగం వస్తే బాగుంటుందని మా మేనేజర్ ను అడిగాను. రెండు రోజుల తరువాత తీసుక రమ్మన్నాడు. చిన్నోడి చదువయ్యేవరకు మనము కొంత విశ్రాంతి తీసుకోవచ్చు.” బరువుగా నిట్టూర్పు విడుస్తు అన్నాడు రాఘవయ్య.

“ఏమండీ … మీరు ఒక మారు అబ్బాయిని అడిగి పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఎందుకైనా మంచిది.” అంది జానకి.

“జానకీ.. వాళ్ళు నా మాట కాదంటారా! ‘బాబు… ఇదిగోరా నువ్వు పెళ్ళి చేసుకునే అమ్మాయి. మూడు ముళ్ళు వెయ్యరా’ అంటే వేస్తారు. వాళ్ళెవరనుకుంటున్నావు జానకీ? నా కొడుకులు. నా పెంపకంలో పెరిగారు. వాళ్ళేనాడూ నాకు ఎదురు చెప్పరు.” అంటూ మీసం మెలేసాడు రాఘవయ్య.

“బావుందండి మీ బడాయి. వాళ్ళు ఎలాగూ ఎదురు చెప్పరని మీకు నచ్చిన అమ్మాయిని తీసుక వచ్చి మూడుముళ్ళు వెయ్యమనగానే వెయ్యాలా? వాళ్ళకు కూడా అమ్మాయి నచ్చాలి. రేపు కాపురం చేసేది వాళ్ళు. మనం

కాదుగా. తొందరేం లేదు. వాళ్ళకు నచ్చిన అమ్మాయిని చూసే పెళ్ళి చేద్దాం” అంది జానకి.

“సరేలే! నేను మాత్రం అంత వెర్రివాడినా. నాలాగా నా పిల్లలు ముక్కు ముఖం చూడకుండా పెళ్లి చేసుకోవడానికి…. ఇదేమన్నా మన కాలం అనుకున్నావేమిటి?” ఎగతాళిగా అన్నాడు రాఘవయ్య.

“అబ్బో …నేను మాత్రం ఈ అందగాణ్ణి చూసి చేసుకున్నానేమిటి? మన అదృష్టం బాగుండి చక్కని జంటగా పేరు తెచ్చుకున్నాము.” నవ్వుతూ అంది జానకి.

“ఉండండి పిల్లలు లేచారేమో చూస్తాను.” అంటూ లోపలికి వెళ్ళింది.

అప్పటికే పెద్దబ్బాయి మోహన్ స్నానం కూడా చేసాడు. రెండోవాడు వినయ్

పళ్ళు తోముతున్నాడు.

“బాబూ.. మోహన్! మీ నాన్న పిలుస్తున్నారు ఒకసారి వెళ్ళు.” అని చెప్పి.

“వినయ్! నువ్వుకూడా వెళ్ళు. నాన్నగారు రమ్మంటున్నారు” అంది వినయ్

దగ్గరకు వచ్చి.

“బాబు నరేశ్. రమేశ్. లేవండిరా ఎంత పొద్దయిందో చూడండి.”

అంటూ వాళ్ళిద్దరిని కూడా లేపింది.

“నాన్నా… పిలిచారట.” ఎంతో వినయంగా అడిగాడు మోహన్. ఆ వెనకాలే

చేతులు కట్టుకుని నిలుచున్నాడు వినయ్ విద్యార్థిలా.

.”మీతో మీ పెళ్ళి విషయం మాట్లాడాలని పిలిచాను ఇలా కూర్చోండి.” అన్నాడు రాఘవయ్య. ఎదురుగా కూర్చున్నారు కొడుకులిద్దరు.

“నేను కొద్ది రోజులలో రిటైర్డ్ మెంట్ అవుతున్నాను. ఈలోపల మీ పెళ్ళిళ్ళు చేసేయ్యమని మీ అమ్మ పోరుపెడుతుంది. నీకు. వినయ్ కి ఇద్దరికి ఒకేసారి చెయ్యాలని అనుకుంటున్నాను. ఏమంటారు.” అడిగాడు కొడుకులను.

“నాన్నా! నన్ను క్షమించండి మీ మాట కాదంటున్నందుకు. నేను ఒకమ్మాయిని ప్రేమించాను. తను మా ఆఫీసులోనే వుద్యోగం చేస్తుంది. అమ్మాయి చాలా బాగుంటుంది. పెద్దగా వున్న వాళ్ళు కాదు. ఆ అమ్మాయి నేను ఒకటయిపోయాము” అంటూ గబగబా విషయాలన్నీ చెప్పేసాడు టీచర్ కు పాఠం అప్పచెప్పిన విద్యార్థిలా.

జానకి ఎప్పుడు వచ్చిందో గానీ, అంతా విన్నతరువాత “ఇంతకూ అమ్మాయిది ఏం కులం” అని అడిగింది.

“అమ్మా! తనది… తనది మన కులం కాదు, క్రిస్టియన్” చెప్పాడు భయపడుతూ.

నెత్తిన పిడుగుపడ్డట్టుగా అదిరిపడ్డారు జానకి రాఘవయ్యలు.

“బాగుంది… చాలా బాగుంది. మన కులం కాని అమ్మాయిని తీసుకవచ్చి పరువుగల ఇంటికి కోడలిని చేద్దామనుకున్న నీ ఆలోచన. ఇంటి పరువు ప్రతిష్టలు మంటగలపడానికి ససేమిరా ఒప్పుకోను. మేము చూసిన సంబంధం చేసుకో. ఆ పిల్లను మరిచిపో. పిచ్చి పిచ్చివేషాలు వేసావంటే ఈ ఇంట్లో నీకు స్థానం వుండదు.”ఆవేశంతో వూగిపోతు చెప్పాడు తండ్రి.

“నాన్నా! మీ నిర్ణయం ఇదే అయితే నా మాట కూడా వినండి. నేను ఆ

అమ్మాయిని కాదని మరొకరిని పెళ్ళి చేసుకోలేను. మీ మాట

కాదంటున్నందుకు నన్ను క్షమించండి” అంటూ అక్కడ నుండి

వెళ్ళబోయాడు మోహన్.

“ఆగు.… నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం వుండడానికి వీల్లేదు. ఇప్పుడే నా ఇంట్లో నుండి వెళ్ళిపో. మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళు” అంటూ పెద్దపులిలా గర్జించాడు రాఘవయ్య.

అంత కోపం ఎన్నడూ భర్తలో చూడలేదు జానకి. “ఏమండీ! తొందర పడకండి. వాడికి తెలియక ఏదో తప్పు చేసాడు. కాస్తా నిదానంగా ఆలోచించండి” బ్రతిమాలింది జానకి.

“చూడు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. నా నిర్ణయం మారదు. వాడు ఇంకొక క్షణం ఇక్కడే వుంటే ఏం జరుగుతుందో నాకే తెలియదు” కోపంతో ఊగిపోతున్నాడు.

మరో మాట మాటాడకుండా సూట్ కేసు తీసుకుని బయలుదేరాడు మోహన్. తండ్రి మాటకు తిరుగుండదని తెలిసి.

తల్లికి, తండ్రికి దగ్గరకు వచ్చి తలవంచుకుని పాదాలకు నమస్కారం చేసాడు.

“నాన్నా! నన్ను మీరెప్పుడు రమ్మని పిలిస్తే అప్పుడు రెక్కలు కట్టుకొని మీ ముందు వాలిపోతాను” అంటూ చెప్పి వెళ్ళిపోయాడు.

“జానకి కి, రాఘవయ్యకు దుఃఖం పొంగుకొస్తుంది. పెద్ద కొడుకంటే పంచప్రాణాలు రాఘవయ్యకు. ఏనాడూ ఏ మాటకూ ఎదురుచెప్పని మోహన్ ఇంత కచ్చింతంగా ఎలా చెప్పగలిగాడు? ఏమైంది వాడికి.. చిన్నగా బాధపడినా ఓర్చుకోలేనివాడు ఇంత దగా చేసి వెళ్ళాడు… జీర్ణించుకోలేకపోతున్నాడు రాఘవయ్య. జానకి దుఃఖానికి అంతులేదు. కుమిలి కుమిలి ఏడుస్తున్నది.

కొన్నాళ్ళ తరువాత తేరుకున్నారు ఆ దంపతులు. కాలమే మాన్పుతుంది ఎంతటి గాయన్నైనా. నరేశ్ కు వుద్యోగం వచ్చింది. రాఘవయ్య రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చాడు. చిన్నవాడికి మెడికల్ సీట్ ఇప్పించాడు. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా నలుగురు కొడుకులకు తలా కొంత బ్యాంక్ లో డిపాజిట్ చేసాడు.

తనకొచ్చే పెన్షన్ చాలు అనుకున్నాడు. పెద్దకొడుకు ఇంట్లోనుండి వెళ్ళిపోయినా, ఏనాటికైనా తిరిగి రాకపోతాడా అనే వుద్దేశ్యం తో మోహన్ పేరు మీద కూడ డిపాజిట్ చేసాడు. ముగ్గురు కొడుకులకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసాడు. ఇక బెంగ అంటూ ఏమి లేదు హాయిగా విశ్రాంతి తీసుకుందామనుకున్నారు జానకి రాఘవయ్యలు.

కొడుకులు కోడళ్ళు కలిసి మెలిసి ఉన్నారు జానకిని ఒక్కపని ముట్టనిచ్చే వాళ్ళు కాదు. మీరు విశ్రాంతి తీసుకోండని చెప్పేవాళ్ళు. తండ్రిని కూడా కొడుకులు అలానే చూసుకుంటున్నారు. ఇంత ఆనందంలో పెద్దకొడుకును పెద్దగా గుర్తు చేసుకునేవాళ్ళు కాదు. ఇద్దరు కూర్చోని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. పురాణ కాలక్షేపం చేసేవారు. ఎంతగానో మురిసిపోతున్నారు తాము పడిన కష్టాలన్నీ ఫలించినందుకు, తమ పిల్లలు ప్రయోజకులు అయినందుకు.

కాలం సాఫీగా సాగిపోతుంది. ఆనందంగా వుండడం విధికి ఇష్టం వుండదేమో! విధి రాతను ఎవరు తప్పించగలరు? అందుకే వున్నట్లుండి కొడుకులకు, కోడళ్ళకు దుర్బుద్దులు పుట్టాయి.

ఒకరోజు “నాన్నా! మేము వేరుగా ఉండాలనుకుంటున్నాము” చెప్పాడు వినయ్ తండ్రి తో.

“అవును నాన్నా! నేను కూడ పట్నం వెళ్ళి చిన్న హాస్పిటల్ పెడదాము అనుకుంటున్నాను ” వెంటనే తన వంతు అన్నట్టుగా చెప్పాడు రమేశ్.

వినయ్ రమేశ్ చెప్పారు. ఇక నరేశ్ ఏం చెబుతాడోనని అతని వైపు చూసాడు.

“నాన్నా! మా మామగారు బ్యాంక్ లో ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఈ చిన్న జీతంతో ఏం సరి పోతుంది మీరే చెప్పండి.” అన్నాడు నరేశ్.

ముగ్గురూ మూడు గునపాలు దించారు గుండెల్లో. నిలువునా కంపించిపోయారు ఆ దంపతులు. హాయిగా విశ్రాంతి తీసుకుందామనే సమయంలో పిడుగులాంటి తుపాన్. ఇది ఆగేదెలా ! దీన్ని ఆపేదెవరు? దీనికి బలి ఆ దంపతులేనా. కన్నందుకు వీళ్ళు ఇచ్చే బహుమానమా ఇది.

“ఓరేయ్! ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారురా. ఈ ఆలోచన మీకే వచ్చిందా? మరెవరైనా చెప్పారా” అంటూ కోడళ్ళవైపు చూసాడు.

“దీనికి వేరేవాళ్ళు చెప్పాలిసిన అవసరం ఏముంది. మా నిర్ణయాలు మేము తీసుకున్నాము. రేపు మాకు పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు… అప్పుడైనా తప్పదు కదా నాన్నా!” చెప్పాడు వినయ్.

“మరి మమ్మల్ని ఎవరికి వదిలి పోతున్నారు. మేము ఎవరి పంచన బ్రతకాలి.. అది కూడా నిర్ణయం తీసుకున్నారా?.” అడిగాడు ఆవేదనగా.

“ఇంకా అదేం ఆలోచించలేదు. అయినా ఎవరి దగ్గరో వుండవలసిన కర్మ మీకేమిటి? పింఛన్ వస్తుంది కదా! దానితో హాయిగా గడిపేయ్యవచ్చు.” చెప్పాడు నరేశ్.

చప్పట్లు కొడుతూ “బాగుందిరా…చాలా బాగుంది మీ ఆలోచన. ఎంత ఎదిగిపోయారు నా కొడుకులు… అప్రయోజకులు కాదు, చాలా గొప్పవాళ్ళయి పోయారు. ఎంత పొరపడ్డాను నేను! నా వేలుతోనే నా కన్ను పొడిచేంత ప్రయోజకులయ్యారని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే మీరు నా ఇంట్లోనుండి ఎంత త్వరగా వెళితే అంత మంచిది” గట్టిగా అరుస్తు చెప్పాడు.

“మీరు అంత కోపానికి వస్తే ఎలా మామయ్యా. ఇంత మంది పట్టణాలలో బ్రతకాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా! పెద్ద ఇల్లు కావాలి. దానికి బోలెడు అద్దెలు. అన్నింటికి ఇబ్బందులే వుంటాయి. పెద్దవారు! మీరు అర్థం చేసుకోవాలి.” అంది వినయ్ భార్య శైలజ.

“అవునక్కా ! ఒక కుటుంబాన్ని పోషించాడానికే చాలా కష్టంగా వుంటుంది.. అలాంటిది ఇంకో కుటుంబమంటే ఎంత ఇబ్బంది.” అంది రమేశ్ భార్య రాణి.

“అవునమ్మా! నువ్వు చెప్పింది చాలా బాగుంది. మీరనుకున్నట్టుగా నేను అనుకుని వుంటే మీరిలా మాట్లాడేవాళ్ళు కాదు. నేను నా కోసం ఏమీ మిగుల్చుకోకుండా మీ మొగుళ్ళకు వుద్యోగాలు పెట్టించాను. వాళ్ళ పేరు మీద బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసాను చూడు. అది నా బుద్ది తక్కువతనం. ఆ డబ్బుంటే మా బ్రతుకులు మేము బ్రతికేవాళ్ళం.. మీ ఆడవాళ్ళ పుణ్యమా అని మా నుండి విడదీస్తున్నారు. రేపు మీకు కొడుకులు పుట్టి మిమ్మల్ని ఇంతకన్న ఘోరంగా పరాభవించాలి. అప్పుడు మీరు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. పొండి నా కళ్ళ ముందునుండి వెళ్ళండి. మళ్ళీ మీ ముఖాలు మాకు చూపించకండి. ఒరేయ్! రేపు నేను గాని, మీ అమ్మ గాని చనిపోతే, తలవికొరివి పెట్టాడానికి మీరెవ్వరు రావడానికి వీల్లేదు. ఎవరైన బిచ్చగాడితో తలకొరివి పెట్టించుకుంటేనన్నా మా ఆత్మలు శాంతిస్తాయి. వెళ్ళండిరా వెళ్ళండి.” దుఃఖం బాధ పొంగుకు రాగా చెప్పాడు రాఘవయ్య.

జానకికి నోట మాట రావడం లేదు. కళ్ళ వెంబడి కన్నీరు ధారగా ప్రవహిస్తుందే తప్ప ఒక్కమాట కూడ బయటకు రావడం లేదు. నిశ్చేష్టురాలై నిలుచుంది. వెళ్ళే ముందు కనీసం వెళుతున్నామని కూడా చెప్పకుండానే వెళ్ళి పోయారు.

“ఏమండి… అయిపోయిందండి. అంతా అయిపోయిందండి. మనమెవరి కోసం బ్రతకాలండి? అబ్బాయిలను చూస్తే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు మనిద్దరం ఎలా బ్రతుకుదామండి.” అంటూ భర్తను కౌగిలించుకుని బోరు బోరున ఏడుస్తుంది జానకి.

ఏనాడూ కంటతడిపెట్టని రాఘవయ్య కూడా ఆరోజు ఏడిచాడు. ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు. కాలం ఎవరికోసం ఆగదు. దాని పని అది చేసుకుపోతుంది. జానకమ్మలో, రాఘవయ్యలో మునుపటి ఉత్సాహం లేదు. ఎవరి కోసమో అన్నట్టుగా గుర్తుకు వచ్చినప్పుడు తింటే తిన్నట్టు.. లేకపోతే లేదు.

చూస్తుండగానే నాలుగుసంవత్సరాలు గడిచిపోయాయి. ఈ నాలుగేళ్ళలో ఏ ఒక్కరూ వచ్చి చూసిన పాపాన పోలేదు. ఆ బెంగతో మంచం పట్టింది జానకి. తనకు తెలిసిన డాక్టర్ కు చూపెడుతూ మందులు వాడుతునే వున్నాడు. అయిన వ్యాధి తగ్గడం లేదు. రోజు రోజు కు ముదిరిపోతుంది. డాక్టర్ కే అంతు చిక్కకుండా వుంది.

“రాఘవయ్య… ఎందుకైనా మంచిది. మీ ఆవిడను పట్టణం లో పెద్ద డాక్టర్ కు చూపించడం మంచిదనిపిస్తుంది. వెంటనే వెళ్ళండి.” చెప్పాడు డాక్టర్.

రాఘవయ్యకు మనసు స్థిమితం లేకుండా అయింది. “డాక్టర్. పట్టణమంటే చాలా కష్టం కదా! నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. మాకు అక్కడ తెలిసినవారు కూడ లేరు. ఏం చెయ్యాలో తోచడం లేదు” బాధపడుతూ చెప్పాడు.

“అదేంటి రాఘవయ్య! మీ అబ్బాయిలు అక్కడే కదా వున్నది. ఇలాంటి సమయంలో వాళ్ళు మీకు తోడుగా వుంటారు మీరు వెళ్ళండి. మీ అబ్బాయిలకు అన్నీ తెలుస్తాయి పైగా మీ వాడొకడు డాక్టర్ కదా. తొందరగా వెళ్ళండి” చెప్పాడు డాక్టర్.

“వాళ్ళు ఎక్కడుంటారో కూడ నాకు తెలియదు. వాళ్ళ అడ్రసులు తెలియవు” తనలోతానే గొణుగుతున్నట్టుగా అన్నాడు రాఘవయ్య.

“చూడండి… మీరు ఇలాంటి సమయాలలో పంతాలు వదిలెయ్యాలి. చిన్నవాళ్ళు తప్పు చేస్తే తల్లి తండ్రులుగా మనమే పెద్ద మనసుతో వాళ్ళను క్షమించాలి. కాని ఇలా పంతాలకు పోవద్దు . మీరు ఇలానే పట్టుదలతో వుంటే మీ అవిడ మీకు దక్కదు. మీ చిన్నబ్బాయి అత్తవారిల్లు మీకు తెలుసన్నారు కదా! మీరు అక్కడికి వెళ్ళండి. ఎంతయినా కన్న కొడుకులు కదా! ఆ మాత్రం ప్రేమలు వుండవా” అంటూ హితబోధ చేసాడు.

సరేనంటూ జానకిని తీసుకోని ప్రయాణమయ్యాడు చిన్నకొడుకు వద్దకు. వీళ్ళు వెళ్ళే సమయానికి రమేశ్ ఇంట్లోనే వున్నాడు. చూసి చూడనట్టే వూరుకున్నాడు.

“బాబూ రమేశ్! బాగున్నావా” తనే పలకరించాడు రాఘవయ్య.

“ఆ ..ఆ . బాగున్నాను. మీరు బాగున్నారా?.” పొడిపొడిగా అడిగాడు రమేశ్.

ఆ తల్లితండ్రులకు మనసు చివుక్కుమన్నది ఆ పలకరింపుకు. ఎంతో ఆత్రుతగా దగ్గరకు పరుగెత్తు కొస్తాడని, ప్రేమగా పలకరిస్తాడని ఆశతో ఎదురు చూసిన వాళ్ళకు నిరాశే ఎదురైంది.

“బాబూ! మీ అమ్మకు ఏదో వ్యాధి వచ్చింది. అక్కడ డాక్టర్ కు చూపించినా ఫలితం లేకపోయింది. పట్టణం తీసుకవెళ్ళి పెద్ద డాక్టర్ కు చూపించమని పంపాడు అక్కడి డాక్టర్. నీకు ఎవరైనా మంచి డాక్టర్ తెలిసే వుంటారని ఇక్కడకు వచ్చాము” దీనంగా చెప్పాడు.

“చూడరా బాబూ! నాకే వ్యాధి లేదు. నేను మంచిగానే వున్నాను నా మాట వినకుండా ఇలా తీసుక వచ్చారు. పోనిలే. ఈ విధంగానైన మిమ్మల్ని చూసాను.” కళ్ళనుండి ఆనందభాష్పాలు రాలుతుండగా చెప్పింది జానకి. ఆమెలో ఎక్కడలేని ఉత్సాహం వస్తోంది.

“నాన్నా! నాకు పెద్దగా తెలిసిన డాక్టర్లు ఎవరు లేరు. అయినా నా వద్ద కూడ అంత డబ్బు లేదు. ఇక్కడ హాస్పిటల్ అంటే చాలా