top of page
Writer's pictureLakshmi Sarma B

మూగకు మాటొస్తే

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Mugaku matosthe' written by Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ

శరత్ చంద్ర ఒక ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకున్నాడు. నిండుసభలో సన్మానం జరుగుతోంది. అంతలో అతని రచనల వెనుక వున్న వ్యక్తి ఎవరో అందరికీ తెలిసిపోయింది. ఆ తరువాత ఏంజరిగిందనేది ఆసక్తికరంగా రాశారు ప్రముఖ రచయిత్రి లక్ష్మీశర్మ గారు.



హాలంతా చప్పట్లతో మారుమ్రోగుతోంది. కరతాళ ధ్వనులతో అందరు

అభినందిస్తున్నారు. పూలమాలలతో శాలువాలతో వూపిరి సలపనంతగా

సన్మానాలు చేస్తున్నారు. ఆనందంతో వుక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు శరత్

చంద్ర. గొప్ప నవలా రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందాడు.

ఇంతమంది రచయితల మధ్య, తనకు సన్మానాం జరుగుతుంటే

పొంగిపోతున్నాడు. ఒకింత గర్వం కూడా కలిగింది నా అంత గొప్ప రచయిత

లేడని.

ఒక రచయిత లేచి మైకు ముందుకు వచ్చి చెబుతున్నాడు. “శరత్ చంద్ర

లాంటి రచయితలు మనకు దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాను.

ఎందుకంటే… ఆయన రాసే రచనలలో, సంస్కారం వుట్టి పడుతుంది. చిన్న పెద్దా అందరిని చదివించేలా వుంటాయి. వ్యర్థమైనా సంభాషణలకు

తావుండదు. ఎన్నో అవార్డ్ లు, మరెన్నో బిరుదులు పొందిన శరత్ చంద్ర గారి గురించి… ఎంత చెప్పినా సరిపోదేమో అనిపిస్తుంది. ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాము” అంటూ తన ఉపన్యాసం ముగించాడు.

చిరునవ్వుతో లేచి, మెడలో వున్న శాలువను సవరించుకొని, మైకు

ముందుకు వచ్చి తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. హాలంతా చప్పట్లతో

మారుమ్రోగింది శరత్ చంద్రను చూడగానే. అందమైన రూపం… దానికి

తగ్గట్టుగా ఎప్పుడు చిరుదరహాసం చిందిస్తూ వుంటాడు. ఆడవాళ్ళు మరీ మరీ ఇష్టపడతారు ఆయనంటే, అందులో ఆయన రచనలు ఆడవాళ్ళకు సపోర్టుగా వుంటాయి. ఆయన నవలల కోసం ఎదురు చూస్తుంటారు.

“పాఠక మహాశయులకు… మరియు వేదికనలంకరించిన పెద్దలకు, నా తోటి

రచయిత్రులకు నమస్సుమాంజలి చేస్తున్నాను. నేను మిమ్మల్ని

విసిగించకుండా మూడు ముక్కలు మాట్లాడుతాను” అంటూ మొదలుపెట్టాడు.

“నేను రచనా వ్యాసాంగం మొదలు పెట్టి సరిగ్గా పది సంవత్సరాలు

అవుతుంది. నేను రాసినా ప్రతి నవలా, మిమ్ములను అంతగా ఆకట్టుకుంది

అంటే, నాకు చాలా ఆనందంగా వుంది. మీ కోసం నేను మరిన్ని నవలలు

రాయడానికి మీ యొక్క అభిమానమే, అదే నాకు వెయ్యి ఏనుగుల నెక్కినంత బలముగా వుంది. నాకు ఓపిక వున్నంత కాలము… మీ ఆనందం కోసమే పాటు పడతాను. మీ అందరికి మరోసారి నా కృతజ్ఞలు తెలుపుతూ! సెలవు తీసుకుంటూన్నాను” అన్నాడు.

మళ్ళీ చప్పట్లు మ్రోగాయి. కానీ! అందరు నిరాశకు గురయ్యారు. ఎందుకంటే, ఆయన ఎంతో బాగా మాట్లాడాలని, నవలల్లో రాసినట్టుగా ఆయన నోటినుండి,

ఆ లాలిత్యపు మధురవచనాలు… ప్రేమ పిపాసి… తపనలు వినాలని,

ఎంతగానో ఎదురు చూసారు. ఆయన క్లుప్తంగా ముగించేసరికి అందరికి గ్యాస్

తీసిన బెలూన్ లాగా అయిపోయారు.

అప్పటికి ఒక పాఠకురాలు లేచి, “సార్। ఇదన్యాయం, మీ నోటి నుండి

మేము ఎన్నో వినాలని వువ్విళ్ళూరుతుంటే, మీరు మాకు ఆ అవకాశం

ఇవ్వకుండా… తొందరగా మీ వుపన్యాసం ముగించి మమ్మల్ని నిరాశపరచారు” అంది.

వెంటనే “అవును!అవును! శరత్ చంద్ర గారు ఇంకాసేపు మాట్లాడాలి.

మేమందరము ఎదిరి చూసింది అందుకోసమే” అంటూ గోలగోల చేసారు.

ఆర్గనైజర్ వచ్చి మైకు పట్టుకుని చెప్పారు. “మీరన్నట్టుగానే శరత్ చంద్రగారు కాసేపు మాట్లాడుతారు. కాబట్టి! మీరందరు కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి” అని చెప్పాడు.

అందరి ముఖాలు వికసించాయి. గమ్మున కూర్చుండిపోయారు అందరు.

మళ్ళీ తప్పలేదు శరత్ చంద్రకు మైకు ముందుకురావడం. “ప్రియమైనా నా అభిమానులు నన్ను క్షమించండి. నేను మిమ్మలను ఇబ్బంది పెట్టకూడదని, ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాను. నా నవలలు మిమ్మల్నీ ఇంతగా ప్రభావితం చేసాయంటే, అదీ… మీకు నామీదున్న గౌరవం. మీలో ఎవరైనా అడగండి, ఏ విషయం గురించి మాట్లాడమంటారో” అన్నాడు.

“సార్… మీరు రాసినా నవలల్లో, ఎక్కువగా మా ఆడవాళ్ళ కష్టసుఖాల

గురించే రాసారు కదా !ఎందుకు సార్, మీరు అంతగా చలించి పోయారంటే,

ఎవరినైనా అంత దగ్గరగా చూసారా? లేకపోతే మీరూహించిన కథలేనా,

వాస్తవానికి దగ్గరగా వున్నాయని అడుగుతున్నాను” అంది.

“చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మీరన్నట్టుగా… నా కథలన్నీ వాస్తవానికి దగ్గరలోనే వుంటాయి. ఎందుకంటే, నా చిన్నప్పటినుండి చూస్తున్నాను మా చుట్టుపక్కల వారిని, ఇంట్లో జరిగే సన్నివేశాలు ఇవన్నీ నా మీద ప్రభావం చూపాయి. అందుకే అక్షరాల రూపంలో బయటపెట్టాను” అని చెప్పాడు.

“సార్! మీరు ఇంత బాగా అర్ధం చేసుకుంటున్నారు ఆడవారి సమస్యలు

అంటే , మీ ఆవిడను… మీరెంత బాగా చూసుకుంటారోననీ మేము

అనుకుంటున్నాము. అంతే కాదు, ఆమె మీద మాకుకొంత జెలసిగా వుంది.

ఎందుకంటారా! ఇంత మంచి మనసున్న భర్తను పొందినందుకు” అంది

ఇంకొకావిడ.

“సారీ అండి. మీరలా అంటుంటే, మీ భర్తగారు వింటే ఏమనుకుంటారు

చెప్పండి. మీరన్నట్టుగా … నా భార్య అదృష్టవంతురాలే, తనను పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టుగా చూసుకుంటాను” అన్నాడు.

“సార్… మీ అవిడ వచ్చిందా? వస్తే ఒకసారి ఆమెను చూడాలని వుంది చూపించరు,అని వద్దు! మీరు పిలవద్దు, ఇంత పెద్ద సన్మాన కార్యక్రమానికి ఆవిడా రాకుండా వుంటుందా? ఇక్కడే ఎక్కడో వుండి వుంటుంది. నేనే పరిచయం చేసుకుంటా” అంటూ, “ఫ్లీజ్” ప్రముఖ రచయిత శరత్ చంద్ర గారీ సతీమణి… వేదిక మీదకు రావాలసిందిగా కోరుతున్నాము” అంది చుట్టు కలయచూస్తూ.

“సారీ అండి. మీరూ పిలిచినా ఆమె రాలేదు. ఎందుకంటే ,ఆమె ఈ సభకు రాలేదు కాబట్టి. తనకు ఈ సన్మానాలు సభలు చూసే అదృష్టం లేదు. ఎందుకంటే తను పుట్టు మూగది. ఒక కాలు పని చెయ్యదు ఇంటికే పరిమితం అంటుంది. నేను చాలా సార్లు చెప్పాను నువ్వు నాతో రావాలి అని. కానీ తనేమంటుందో తెలుసా? ఏమండి మీరింత మంచి రచయితలు కదా!

మిమ్ములను చూసి అందరు ఎంతో గొప్పగా వూహించుకుంటుంటే, నాలాంటి

మూగదాన్ని, అవిటిదాన్ని చూసి అందరు ఎంత బాధపడతారో, మీలాంటి

రచయితకు ఇదేం కర్మ అని. మీ సంతోషం నాది కాదా! నేను రాకపోతేనేమి మీరు వచ్చాక, నా కళ్ళకు కట్టినట్టు చెబుతారు అది చాలదా! అంటుంది” అంటూ చెప్పడం ఆపాడు.

“చాలా మంచి మనసు సార్ మీది. మీరు రాస్తున్న “”మూగకు మాటొస్తే””

సీరియల్ లో ముగింపు ఎప్పుడెప్పుడా… అని ఎదురుచూస్తున్నాము. మీ కలం పేరు “శ్రీజా”అని పెట్టారు కదా, అంటే దాని అర్థం చెబుతారా. అడిగింది ఇంకో అభిమాని.

“ మూగకు మాటొస్తే “ సీరియల్ త్వరలోనే ముగింపుకు వస్తుంది. నా కలం పేరు “ శ్రీజా” అంటే, “శ్రీమతి జానకి “ అది నా భార్య పేరు చెప్పాడు.

ఆనందంతో హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది హాలంతా.

అందరు చూస్తుండగానే ఓ అమ్మాయి సరాసరి స్టేజి పైకి వచ్చి మైకు చేతిలోకి తీసుకుని.

“అందరికి నా నమస్కారాలు” అంటూ మొదలుపెట్టింది. “మీరందరు నన్ను క్షమించండి. ఎందుకంటే, నేను మీ పర్మిషన్ లేకుండా ఇలా వచ్చి ప్రసంగం చేస్తున్నందుకు… అని రెండు చేతులు జోడించింది. అందరు మంత్రముగ్దలైపోయారు ఆ కంఠస్వరానికి వీణ మీటినట్టుంది. నాదస్వరం విన్న నాగినిలా తల ఎత్తి ఆమె వైపు చూడసాగారు అందరు ఏం చెబుతుందోనని.

“మహాశయులారా ! మీరు నా కోసం ఒక పదినిముషాలు సమయం

కేటాయించండి. నేను చెప్పబోయేది శ్రద్ధగా వినండి మీరంతా… మీరు

అభిమానపడే శరత్ చంద్ర గారి గురించి, మీకు ఆయన ఎంతగొప్పవాడో, ఎన్ని విషయాలు మీనుండి దాచాడో! ఆయన చెప్పడం లేదు. ఇంత గొప్ప వ్యక్తిని మనము మాములువాడి లాగా వదిలేస్తే ఎలా? చెప్పండి. అంటూ

సభికులవైపు చూసింది.

“చెప్పండి! చెప్పండి! మా అపురూపమైన రచయిత గురించి, ఎంత

చెప్పినా మాకు వినాలనే వుంటుంది”అందరు ఒక్కసారిగా లేచి నిలబడి

అన్నారు.

విజయగర్వంతో వెలవెలబోతున్న శరత్ చంద్ర వైపు చూసింది వచ్చిన ఆ అమ్మాయి.

“నేను। సుప్రసిద్ధ నవలా రచయిత అయినా… శరత్ చంద్రగారి

కూతురును. నా పేరు ప్రణవి. ఇంతకు నేను చెప్పేది ఏమిటంటే! మీకు ఒక

గొప్ప రచయితను పరిచయం చెయ్యబోతున్నాను. ఆవిడ ఎవరో తెలుసా మీకు? మీరింత వరకు ఎవరినైతే ఆకాశంలోకి ఎత్తుకున్నారో , ఎవరి రచనలను చదివి… ఆనందం అనుభవించి సన్మానాలు చేసారో! వారి శ్రీమతి” జానకిదేవి. మా అమ్మగారు!” అంది ప్రణవి.

ఆమె అలా అనడమే ఆలస్యం అందరు లేచి, “అదేమిటి! ఆమె రచయిత్రి

అంటున్నారు, ఆవిడ మూగది అన్నారు కదా! అని ఒకరు. “మరీ, శరత్ చంద్ర గారు అబద్దాలు చెప్పవలసిన అవసరమేముంది? అని ఒకరు. “మరి ఆమె రచయిత్రి అయితే… ఆ నవలలు ఏవి? అని ఇంకోకరు. ఇలా ఎవరి మనసులోకి వచ్చింది వాళ్ళు అడిగుతున్నారు. ఎవరికి ఏమి అర్ధం కావడం లేదు.

శరత్ చంద్రకు లేచి వెళ్ళిపోవాలన్నా వెళ్ళలేని పరిస్తితి. తనకు

చెప్పుదెబ్బలు తప్పవు అనుకుని నంగి నంగి కూర్చున్నాడు. చేసిన పాపం

తరుముతుంది అనుకున్నాడు మనసులో.

“ఆగండాగండి! అన్నీ విషయాలు ఆమె సమక్షంలోనే విందురు గానీ”

అంటూ “శివాజీ! అమ్మను తీసుకురావాలి” అని మైకులో చెప్పింది.

నిండుగా శాలువా కప్పుకుని, నుదుటన పెద్ద కుంకుమ బొట్టుతో…

అరవిరిసిన మందారంలాలయలొలికించే నాట్యమయూరిలా నడుచుకుంటూ

వచ్చింది స్టేజి పైనకు. చిరునవ్వుతో నమస్కారం చేసి మైకు పట్టికుంది

చేతితో.

“నా అభిమానులందరికీ నా మనస్సుమాంజలులు. ఇన్నాళ్ళుగా నా రచనలను మీరు ఎంత బాగా ఆదరించారో! నాకు తెలుసు మావారి ద్వారా. నేను మావారిని కించపరచడానికి రాలేదు. మా పిల్లలు నన్ను ఎన్నాళ్ళు ఇలా ఆకుచాటు పిందెలా వుంటావు. నీలో ఇంత గొప్ప సాహిత్యం వుంది కదా! నలుగురిలోకి వెళ్ళకుండా ఎన్నాళ్ళు దాక్కుంటావు. ఎన్ని సన్మానాలు ఎన్ని అవార్డులు వచ్చినా, ఒక్కదానికైనా నువ్వు వెళ్ళి అందుకోవా? రచనలు చేసేది నువ్వు, సన్మానాలు సత్ కార్యాలు నాన్నకు. ఇదేం బాగా లేదమ్మా” అంటూ నానా గొడవా చేసి ఈ రోజు ఇలా బయటకు తీసుకవచ్చారు.

“నన్ను ఒక్కరోజు కూడా సన్మానాలకు రమ్మని పిలవలేదు మావారు. నేను బయటకు వస్తే, నేనే రచయిత్రిని అని పది మందికి చెప్పుకుంటానని ఆయన భయం.

ఎట్టి పరిస్తితులలోను నేను రచయిత్రిని అని చెప్పొద్దని… మా పెళ్ళైన

కొత్తలోనే ఒట్టు వేయించుకున్నారు. అందుకే నేను బయటపడలేదు” అంది

తన గతం గుర్తుకు రాగా.

“అందరి ఆడపిల్లలాగానే నేను పెళ్ళి చేసుకుని అత్తవారింటికి

వచ్చాను. అందమైనా భర్త, అత్త మామ అందరు నన్ను బాగానే చూసుకునే వారు. ఉన్నంతలో కలిగిన కుటుంబమనే చెప్పొచ్చు… కానీ, నా భర్తకు చాలా డబ్బు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని తపనగా వుండేది.

ఒకరోజు మాటల్లో చెప్పాను… నాకు కథలు రాయడం ఇష్టం! చాలా కథలు

రాసాను కానీ! అవన్నీ నా దగ్గరే వుండిపోయాయి అని”.

“ఏమిటి… నువ్వు కథలు రాస్తావా, నాకు ఇన్నాళ్ళుగా చెప్పలేదు! ఏవి నీ కథలు నేను చూస్తాను జానకి! తీసుకురా” అడిగాడు శరత్ చంద్ర.

“వుండండి ఇప్పుడే తెస్తాను,” అని తెచ్చి ఇచ్చింది జానకి.

గబగబా పేజిలన్ని తిప్పిచూసాడు. “సూపర్ జానకి… నువ్వింత బాగా

కథలు రాస్తావనుకోలేదు! ఇక వదిలేది లేదు నిన్ను. నువ్వు రోజుకో నవల

రాయాలి. నేను దాన్ని పత్రికలవాళ్ళకు పంపుతాను, నీ పేరు

మారుమ్రోగిపోవాలి” అంటూ జానకిని రెండు చేతులతో పైకెత్తి గిరగిరా

తిప్పాడు ఆనందంతో.

జానకికి ఆనందంగానే వుంది. తనో గొప్ప రచయిత్రి అయినట్టుగా

మనసులో వూహించుకోసాగింది. “సరేనండి… మీరు చెప్పినట్టుగానే రాయడం మొదలుపెడతాను” అంది.

“జానకీ… జానకీ…” అంటూ పిలుస్తూ లోపలికి వచ్చాడు. ఆఫీస్ నుండి

వస్తూనే పేపర్ బండిల్ పట్టుకొచ్చాడు .

“ఏమిటండి। ఏమైంది అలా పిలుస్తున్నారు” అంటూ లోపలనుండి గబగబా

వచ్చింది. వస్తూనే అతని చేతిలోని పేపర్ బండిల్ చూసి ఆశ్చర్య పోయింది.

ఇంత తొందరగా పేపర్స్ తీసుక వస్తాడని తెలియక.

“ఏమిటోయ్। అలా ఒళ్ళు మరిచిపోయి చూస్తున్నావు. ఇవన్నీ నీ కోసమే తెచ్చాను… మా ఫ్రెండ్ వాళ్ళు స్వంతంగా పత్రిక నడిపిస్తారు. వాడు ఎన్ని కథలైనా వేస్తా అన్నాడు. నువ్వు రాయడమే ఆలస్యం అలా పత్రికల్లో వచ్చేస్తుంది” అంటూ ఆమె చేతిలో పేపర్సు పెన్నులు పెట్టాడు.

సంతోషంతో వుబ్బితబ్బిబ్బయింది జానకి. “ఏమండి! మీరు నన్నింతగా

ప్రోత్సహిస్తుంటే, నేను చాలా కథలు రాస్తాను. ప్రోత్సహించే వాళ్ళుంటే

అంతకన్నా కావలసిందేముంది,” అంది.

“నీ పాత కథలన్నీ రేపే తీసుకవెళ్ళి డి టి పి చేయించి, మా ఫ్రెండ్ కు

ఇస్తాను. రేపు నేను ఆఫీస్ నుండి వచ్చేవరకు… నువ్వు కథ కంప్లీట్ చెయ్యాలి సరేనా!” జానకి ముక్కు పట్టి వూపుతూ అడిగాడు.

“అబ్బో… అయ్యగారికి లేడికి లేచిందే పరుగు అన్నట్టుంది కదా! మీకింత

వుత్సాహం వుంది కదా, మరి మీరే రాయచ్చొ కదా!” అంది.

“ఊ… నాకు కథలు రాయలని, నేనో పెద్ద రచయితను అవ్వాలని, పెద్ద

పెద్ద అవార్డ్ లు అందుకోవాలని నాకు చాలా కోరిక. కానీ ! పెన్ను పేపర్

పట్టుకుంటే ఒక్కముక్క కదిలితే ఒట్టు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసా…

సాధ్యం కాలేదు. అందుకేనేమో! నీ రూపకంగా నీకు నాకు కలిసింది. ఇక

చూసుకో జానకి. నీ వలన నా కోరికా తీరబోతుంది, నా పేరు కూడా

మారుమ్రోగిపోతుంది, సుప్రసిద్ద రచయిత శరత్ చంద్ర” అని చెప్పాడు

పొంగిపోతూ.

“అదేంటండి! కథలు రాసేది నేనైతే , పేరు మీకెలా వస్తుందో నా కర్ధం

కాలేదు,” అంది.

“అదేనోయ్, కిటుకు…కథలు నవలలు నువ్వు రాస్తావు! పేరు నాది

పెడతావు. ఎందుకంటే, చెప్పాను కదా… నాకు ఎప్పటినుండో కథలు

రాయలని, పేరు తెచ్చుకోవాలని ఉందని,అది ఈ విధంగా నెరవేర్చుకుంటాను,” అన్నాడు నవ్వుతూ.

“అది… మీకు సంతృప్తిని ఇస్తుందా? మీరు కష్టపడి రాస్తే ఆ తృప్తే వేరు కదండి! మీరు ప్రయత్నంచి చూడండి రాయగలరేమో? అంది.

“ఊహు…చాలా ప్రయత్నం చేసా, పేపర్లు చినిగిపోయాయే తప్పా! అక్షరం ముందుకు కదల లేదు. అసలు వూహించుకుందామన్న తట్టదు బుర్రకు,” ఇక ఏం చేస్తాను మానేసాను”

“మరీ! మీరు మీ పేరు వేసుకుంటే , ఎవరైనా ఈ కథలో ఇలా రాసారు, ఆ

నవలలో మంచిగా రాయలేదు అన్నారనుకోండి, అప్పుడు ఏం చెబుతారు

మీరు,” అడిగింది జానకి.

“అందుకే జానకి… నువ్వు రాసే ప్రతీది నేను చదవాలి. అందులో

ఏముందో ఏమిటో నువ్వు చెప్పాలి. ఇంత డబ్బు ఖర్చు చేసేది

ఎందుకనుకుంటున్నావు! ఇదంతా వూరకే అవుతుందనుకున్నావా? డి టి పి పని, పేపర్స్ పోస్టల్ ఖర్చులు, ఇదంతా ఎందుకు చేస్తున్నాననుకున్నావు? నా స్వార్థం కోసమే… నీ నుండి నా కోరిక తీర్చుకుంటున్నాను. నిజం చెప్పు జాను, నేను పూనుకోకపోతే నీ కథలకు ప్రాణం వచ్చేదా ! అవి అలా లోపలనే

మగ్గిపోయేవి అవునా కాదా,” చెప్పు అడిగాడు.

“నిజమేనండి! మీకెలా నచ్చితే అలానే చెయ్యండి, మీకు పేరు వస్తే నాకొచ్చినట్టు కాదా, మీరొకటీ నేనొకటీనా… ఇద్దరిలో ఎవరు పైకి వచ్చినా నాకు ఆనందమే,” అంది.

“జాను… నాకో మాటిస్తావా? ఎప్పుడు ఎవరికి చెప్పనని, ఈ కథలు, నవలలు రాసేది నువ్వేనని, ఎవరికి తెలియనివ్వనని. నాకు ప్రామీస్ చేస్తావా? అంటూ చెయ్యిచాపాడు.

మనసులో ఎక్కడో బాధనిపించింది జానకికి. ఎప్పుడూ తన పేరు

బయటకు రావొద్దు అనే సరికి, తనకు వుంటుంది కదా! నవలా రచయిత

జానకి అని చూసుకోవాలని, పోనిలే! మరుగున పడిపోతుందనుకున్న నా

రచనలు, నాలో పొంగే భావాలు రూపుదిద్దుకుంటాన్నాయి అంటే, ఇంతకంటే కావాలసింది ఏముంది అనుకుంది మనసులో.

“ఏమండి… నేను ఎప్పుడు మీ మాట జవదాటను, కాకపోతే… నా కలం

పేరు మాత్రం… నేను పెట్టుకున్నదే వుండనివ్వండి,” అంటూ అతని చేతిలో చెయ్యి వేసింది.

శరత్ చంద్రకు వెయ్యి ఏనుగునెక్కినంత సంతోషమయింది. “జాను… ఏం పెట్టావు నీ కలం పేరు?” అడిగాడు.

“ శ్రీ జ” అని పెట్టుకున్నానండి” అంది.

“ఓకే, బాగుంది… ఇక నువ్వు రేపటినుండి మొదలుపెట్టాలి, నీకు క్షణం తీరికలేకుండా అదే పనిగా రాస్తుండు, ఇంట్లో ఏదైనా సహాయం కావాలంటే… నేను చేస్తాను,” అన్నాడు.

“నా మొదటి నవలా ప్రింట్ అయిపోయి, పత్రికలో వచ్చిన రోజు మా

ఆనందానికి అంతులేదు. ఇంకా… నవలలుంటే సీరియల్ లాగా వేస్తాము,

అంటూ ఫోన్లు వచ్చాయని, చెబితే చాలా ఆనందం వేసింది. ఇక అలా

మొదలైంది… నా రచనా ప్రపంచం వెనక్కి తిరిగిచూసుకోకుండా రాస్తూనే

ఉన్నాను. పత్రికల్లో వస్తూనే వున్నాయి. పారితోషికాలు సన్మాన సత్కారాలు

జరుగుతూ వున్నాయి. నన్ను మాత్రం ఏ చిన్న ఫంక్షన్ కు కూడా నన్ను

తీసుకెళ్లలేదు. కనీసం వచ్చిన లెటర్స్ కానీ! అభిమానుల పొగడ్తలు కానీ!

చెప్పడం అన్నీ మానేసారు, నన్ను ఇంటికే పరిమితం చేసేసారు, ఒక్కరోజు

కూడా విశ్రాంతిగా వుండనిచ్చేవారు కాదు. ఈహాడావుడిలోనే పిల్లలు పుట్టడాలు, పెరగడాలు అన్నీ అయిపోయాయి. నేనూరుకున్నట్టు పిల్లలు వూరుకోరు కదా?

“వాళ్ళకు… అర్థమైంది మా వారితో చాలా సార్లు చెప్పిచూసారు, అమ్మను

తీసుకెళ్లమని,అమ్మ పేరు చెప్పండి అని, అయినా… ఇవేవి లెఖ్ఖ చెయ్యలేదు! అందుకే, పిల్లలు భరించుకోలేక… ఈ రోజు ఇలా బయటపడవలసి వచ్చింది. మావారిని ద్వేషించడానికి గాని, అతనికి చెడ్డపేరు తేవాలన్న ఆలోచనతో నేనిలా చెప్పలేదు. ముఖ్యంగా… మావారు నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను ఇచ్చిన మాట తప్పాను కాబట్టి,” అంటూ రెండు చేతులు జోడించింది శరత్ చంద్ర వైపు.

“తిరిగి ప్రియమైనా అభిమానులారా… నన్ను మా వారిని పెద్ద మనసుతో

మన్నించగలరు,” అంది.

సిగ్గుతో తల క్రిందకు దించుకున్నాడు శరత్ చంద్ర. ఒక్కసారిగా కరతాళ

ధ్వనులతో హాలంతా మారుమ్రోగిపోయింది.

“మేడమ్… మీ గొప్ప మనసుకు మా జోహార్లు. శరత్ చంద్రగారు మిమ్మల్ని చేసిన మోసానికి, ఇంకోకరు అయి వుండింటే! ఈపాటికి ఆయనకు చెప్పులదండలతో సన్మానం జరిగివుండేది. కానీ, ఆయనపట్ల అందరికి ఆదరాభిమానాలు చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడు అందరిని గౌరవంగా చూసేవారు. కాకపోతే! అయన దురుద్దేశంతో ఇలాంటి పని చెయ్యడం మా అందరికి బాధగా వుంది. అంత గొప్ప రచయితలు… మీరే, ఆయనను మన్నించగా లేనిది మేమెవరము, మేడమ్… మాకిప్పుడు అర్ధమౌతుంది, మీరు మొదలుపెట్టిన “మూగకు మాటొస్తే” సీరియల్ మీ జీవితానికి సంబంధించిందేమోననీ. నిజమా మేడమ్,” అంటూ అందరు అడిగారు.

“నిజానికి అది మాకు సంబంధించింది కాదు. కాకపోతే… ఎంతటి వారైనా ఎదిరించే శక్తి వున్నంతవరకు పోరాడగలరు. అమ్మ బాబోయ్! నన్ను మాటల్లో పెట్టి ఆ సీరియల్ ముగింపు లాగేద్దామనే? అలా చెప్పడం కుదరదు మీరు ఎదురుచూడాలిసిందే! అంది. శరత్ చంద్ర వైపు తిరిగి “ఏమండి నిజమే కదా! అంది నవ్వుతూ.

“అవునవును… అప్పుడే కదా, మా జానకికి మీ చేతులమీదుగా గొప్ప

సన్మానం, అంటూ చేతులు జోడించాడు అభిమానులవైపు. “నేను చేసిన

పోరబాటుకు, నన్ను మీరంతా క్షమించాలాని వేడుకుంటున్నాను” అన్నాడతడు.

“ఇక ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాము” అని అనౌన్స్ చేసాడు

ఆర్గనైజర్.

అందరు నవ్వుతూ లేచి వెళ్ళిపోయారు.


॥॥ శుభం॥॥

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.



లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి, నాకు ఇద్దరమ్మాలు ఒక బాబు, అందరూ విదేశాల్లోనే వున్నారు,ప్రస్తుతం నేను మావారు కూడా అమెరికాలోనే వుంటున్నాము


79 views1 comment

1 Comment


sai samaj • 8 hours ago

Super kathanam

Like
bottom of page