నా కళ్ళు చెబుతున్నాయీ...
- Varanasi Sudhakar

- Jun 8
- 3 min read
Na Kallu Chebuthunnayee - Telugu Comedy Story | Varanasi Sudhakar
నా కళ్ళు చెబుతున్నాయీ... - తెలుగు హాస్య కథ | వారణాసి సుధాకర్
Published in manatelugukathalu.com on 08/06/2026
వృద్ధాప్యం తెచ్చే మతిమరుపు, పిల్లల బిజీ జీవితం, ఇంట్లో జరిగే చిన్న చిన్న గందరగోళాలు కలిసి కొన్నిసార్లు నవ్వుల పంట పండిస్తాయి. అలాంటి ఒక సరదా సంఘటనే "నా కళ్ళు చెబుతున్నాయీ..." కథ. కళ్ళ పవరు మారిపోయిందని భావించి డాక్టర్ దగ్గరికి వెళ్లాలని పట్టుబట్టిన నాన్నగారు, తన కళ్ళజోడు పోయిందని ఆందోళనపడుతున్న అమ్మగారు, వారి మాటలు వింటూ తలపట్టుకున్న కొడుకు... చివరికి అసలు నిజం బయటపడినప్పుడు ఇంట్లో అందరూ నవ్వకుండా ఉండలేకపోయారు. ప్రతి తెలుగు కుటుంబానికి దగ్గరగా అనిపించే ఈ హాస్య కథ మీకూ ఆహ్లాదాన్ని పంచుతుంది. 😄👓🤣
💐💐💐💐💐💐💐💐
"ఒరేయ్ నాన్నా, నా కళ్ళ పవరు మారినట్టుందిరా, నువ్వు వీలు చేసుకుని, అర్జెంటుగా కళ్ళ డాక్టరు దగ్గరికి తీసికెళ్ళి, నాకు కొత్త కళ్ళద్దాలు వేయించాలిరా.."
"నాన్న గారూ, ఈ మధ్యనే కదా మీ కళ్ళకి అన్ని టెస్టులూ చేయించి, మీకు నచ్చిన ఫ్రేముతో కొత్త కళ్ళజోడు కొన్నాను, అప్పుడే పవరు ఎలా మారిపోయింది ?"
"షుగరు వ్యాధి వున్నవాళ్ళకి, ఇలాగే కళ్ళకి పవరు త్వరగా మారిపోతుంటుందని, నిన్ననే ఫేసుబుక్కులో చదివాన్రా...పైగా, ఆ కళ్ళ డాక్టరు చెప్పాడు కూడానూ, షుగరు వ్యాధి వున్న వాళ్ళు,తరచుగా కళ్ళకి టెస్టులు చేయించుకుంటూ వుండాలని !"
"సరే అలాగే తీసికెళ్తాను కానీ, ఈ వారం అంతా నాకు ఆఫీసు పనిఒత్తిడి చాలా ఎక్కువగా వుంది, వచ్చేవారంలో ప్లాన్ చేస్తాను..."
"మరి ఈ వారం రోజులూ నేనేంచెయ్యాలి ?
పేపరు చదవకుండా, టీవీ, సెల్ ఫోనూ చూడకుండా, వారం రోజులు గడపడం అంటే, మాటలా ?
ఎలాగైనా సరే, ఓ రెండు గంటలు ఆఫీసుకి పర్మిషను పెట్టరా నాన్నా...'మా నాన్నకి సీరియస్ గా వుంది, ఆస్పటల్లో చేర్చేసి వస్తాను' అని చెప్పు !"
"ఎలా నాన్నా, అసలే మా బాసు 'ఛండశాసన...వాడు' అని మీకు తెలుసుగా ? నన్ను స్నానం, భోజనం కూడా చెయ్యనివ్వట్లేదు ! ప్రాజెక్టులో ఇష్యూ మీద ఇష్యూలు వచ్చి పడిపోతున్నాయ్. పైగా ఇప్పుడు నాకు ఉద్యోగంలో అప్రైజల్ సీజను, ఎలాగో మేనేజ్ చెయ్యండి..."
"ఏంటో...మీ గోల మీదేగాని, ముసలాళ్ళ గొడవ పట్టించుకోడం బొత్తిగా మానేశారు..."
💐💐
"ఒరే పండూ, పొద్దున్నించీ నా కళ్ళద్దాలు కనబడట్లేదురా, కాస్త వెతికి పెట్టు నాన్నా..."
"అమ్మా, నువ్వు ప్రతిరోజూ నీ కళ్ళజోడు ఎక్కడెక్కడో పెట్టేస్తావు, ఆ తులసికోట దగ్గిరో, పూజ గదిలోనో పెట్టేసుంటావు, నీ కోడల్ని వెతకమను, నాకు ఖాళీ లేదు..."
"ఏవిటో, ఈ వయసులో ఈ దిక్కుమాలిన మతిమరుపొకటి వచ్చిపడింది ! ఏది ఎక్కడ పెట్టానో గుర్తుండి చావడం లేదు ! నిన్న, నాదనుకుని, కోడలు చీర కట్టేసుకున్నాక, నీ కొడుకు నవ్వుతుంటే తెలిసింది, ఆ చీర నాది కాదని !
మొన్నొక రోజు, నాకాలి చెప్పు ఒకటి, మీ ఆవిడ కాలి చెప్పు ఒకటీ వేసుకుని, బజారుకి వెళ్ళాక తెలిసింది. ముందు ముందు ఇంకా ఎన్ని చేస్తానో అని భయంగా వుందిరా..."
రాత్రి పడుకునేముందు, హనుమాన్ చాలీసా చదువుకుని, నా కళ్ళజోణ్ణి తలగడా పక్కనే పెట్టినట్టు గుర్తు ! మా గదిలో పెట్టిన వస్తువులు ఎవరూ తియ్యరు కదా, మీ నాన్న తప్ప ?"
"నాన్న గారూ...ఏదీ, మీ కళ్ళజోడిలా ఇవ్వండి..."
"ఈ వున్నది కూడా తీసేసుకుంటే, నాకు ఏమీ కనబడదని నీకు తెలుసు కదురా ?"
"మీరు పొద్దుట్నించీ అమ్మ కళ్ళజోడు పెట్టుకుని, పవరు మారిపోయిందని, నన్ను సతాయించేస్తున్నారు !
అమ్మేమో, 'నా కళ్ళజోడు పోయింది, ఎవరు తీసేశారో...' అని బాధ పడిపోతోంది !
అమ్మ కళ్ళజోడు అమ్మకి ఇచ్చెయ్యండి, మీ కళ్ళజోడు ఎక్కడ పెట్టేశారో వెతకడానికి, నా పిల్లల్తో ఓ సెర్చి కమిటీ వేస్తాను...హహ్హహ్హా..."
"అయ్యో, పొద్దుట్నించీ మీ అమ్మ కళ్ళజోడు పెట్టుకుని, పవరు మారిపోయిందని, తెగ బాధపడిపోయాన్రా...ఇంకా నయం, తొందరపడి, కళ్ళ డాక్టరు దగ్గరికి వెళ్ళలేదు !"
"మీరూ, మీ కళ్ళ డాక్టరూ బాగానే వుంటారు గానీ, ముందు నా కళ్ళజోడు నాకివ్వండి, మీరు పెట్టుకుంటే, అది కాస్తా సాగిపోయి, నాకు లూజయిపోయి, ముక్కుమీదనించి జారిపోతుంది, అసలే మీది పులిహార పళ్ళెం అంత మొహం..."
(అందరూ కలిసి) "హహ్హహ్హా..."
వారణాసి సుధాకర్.
💐💐💐💐💐💐
చాలా ఇళ్ళలో జరిగే ఈ కామెడీని, చిన్న కథగా మార్చింది, నేనే !
***
వారణాసి సుధాకర్ గారి కొన్ని ఇతర రచనలు:
వారణాసి సుధాకర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
అందరికీ నమస్కారం.
నా పేరు వారణాసి సుధాకర్.
పుట్టినది, పెరిగినది, తణుకు పట్టణంలో...
హైస్కూలు దశలో చదువుతో పాటు, వివిధ కళలలో, ఆటలలో, చురుకుగా పాల్గొని, వందల బహుమతులు పొందాను.
కాలేజీ విద్యార్థి దశనుంచి, విజయచిత్ర లాంటి సినిమా పత్రికలలో రచనలు చేసి, బహుమతులు పొందాను.
LIC లో సీనియర్ మేనేజర్ గా పనిచేసి, విశ్రాంత జీవితం గడుపుతూ, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ, ప్రజలకు ఎంతో కొంత ఉపయోగించే విషయాలను తెలియజేసే కథలు రాస్తూ, వివిధ ఫేస్ బుక్ గ్రూపుల్లో సుమారు వందకు పైగా కథలు రాశాను, ఇంకా రాస్తున్నాను.
ప్రస్తుతం పిల్లలు, మనవలతో అమెరికాలో వుంటున్నాను.
ఇదీ క్లుప్తంగా నా పరిచయం.
🙏









Comments