top of page

నాకు సమాధి కట్టండి - పార్ట్ 2



 'Naku samadhi Kattandi - Part 2/2' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 20/02/2024

'నాకు సమాధి కట్టండి పార్ట్ 2 /2' పెద్దకథ ప్రారంభం

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



జరిగిన కథ: 

ఊరి పంచాయితీకి వచ్చిన శాంతమ్మ తనకు సమాధి కట్టమని కోరుతుంది. కారణమడిగితే తనకు పిల్లల మీద నమ్మకం లేదని చెబుతుంది. 


ఇక నాకు సమాధి కట్టండి పార్ట్ 2 చదవండి. 


నా కొంగుపట్టుకు తిరిగిన వీళ్లు, తల్లికి తిండి పెట్టలేనంతగా సానా మారారు. ఒక తల్లి, పదిమంది పిల్లలను, తన కట్టంతో పెంచుతుంది. అదే తల్లికి, పదిమంది పిల్లలు ఎందుకెయ్యటం లేదు ముద్ద. అందుకే మీ బుద్దుల మీద నమ్మకం పోయింది. నాతో ఆశ్రమంలో నున్న నా స్నేయితురాలు వీరమ్మ పోతే, వాల్ల వాల్లేవరూ రాలేదు తగలెయ్యటానికి. డాక్టరుగారు, ఆశ్రమంలోని వారు, ఆమెకు దినం చేసారు. 


 వీరమ్మకు డబ్బులేదు. గనుక వాళ్ళెవరూ రాలేదు. నాకు అందరున్నారు. అయినా నన్ను తగలేత్తారని గ్యారంటీ లేదు. నాకు తెలవక అడుగుతాను పోతూ! డబ్బులిస్తేనే అమ్మాఅయ్యల్ను సూసే పిల్లలున్నంత కాలం ఈ దేసం ఏమి బాగుపడుద్ది?వానలు ఎందుకు కురుత్తాయి? అదేదో దేసంలో తప్పు సేస్తే వురి తీత్తారంటా! అమ్మాఅయ్యకు బువ్వ పెట్టని వాళ్లకు, ఇట్లాంటి సిచ్చలు యేత్తే బాగుండు. నాలా పతి తల్లి పంచాయితీలకు తిరగడం సేయదు. 


 చెడ్డ పిల్లలుంటారంట, కానీ చెడ్డ తల్లులు వుండరనేది మాయమ్మ. మా యమ్మకు, మా అన్నలు బువ్వ పెట్టకపోతే, నేనే తెచ్చి సూసినా. అమ్మను సూత్తే ఆ పున్నెము, ఏడికి పోదులే అనుకొన్నా. మరి ఇది కలికాలం అంటగా, నీతీ, నాయము వుండవని గుళ్ళో పూజారిగారు సెప్పారులే. నాలాగా, పతి ఇంట్లో ఒక ముసలి, అమ్మాఅయ్య ఉంటారు, వాళ్లకు నాకు పట్టిన గతి పట్టకూడదనే ఈ సోదంతా సెప్పటం!


 ఇదివరకు బస్తీల్లో ఈ వృద్ధాశ్రమాలు, వుండేయని విన్నా. ఇవి వూల్లకి కూడా, ఇట్టా, పాకుతాయనుకొలేదు, పల్లెల్లో, పేమలు వుంటాయంటారు. అపుడొచ్చినా కరోనా, లాగా, పేమా, దయ జాలి లేని ఈ రోగాలు అందరికీ, అంటుకున్నాయి. ఈ పేమలు, దయ జాలి వుండే మందు, ఒకటి వత్తే బాగుండనగానే అక్కడున్న వాళ్ళు, తెలియకుండానే, చప్పట్లు కొట్టారు. ముసలివాళ్ళ కళ్ల నుండి, నీళ్ళు కారుతున్నాయి శాంతమ్మ మాటలకు. 


 నేను, నా పిల్లలకు పొలంమిచ్చినా, ఇల్లిచ్చినా. మొన్న నాకు జొరమొచ్చి ఫోన్ చేస్తే, ఈ నా కొడుకులు, ఫోన్ తీయలేదు. ఒకేలా నేను పోయానని, ఫోన్ చేసినా వీళ్ళు, ఫోనెత్తుతారనే నమ్మకం లేకనే, ఈడకు వచ్చినా! నాయము కోసము. ఎందుకంటే నేను, వట్టిపోయిన గొడ్డును గనక, వట్టిపోయిన గొడ్డును, కబేలాకు తోల్తారు. కానీ! ఇక్కడ, మేమే, ఆశ్రమాలకు, వెలతాము. అదీ! తేడా మాకు గొడ్డుకు. 


 మా ఆయన, మా అత్తను సూడకన్నాడు. మా అన్నలుండి సూసుకోకపోతే, మనమెందుకు!? సూడాలన్నాడు. నేను ఆయనకు, దొబ్బులు పెట్టినా,! ఇపుడు మీయమ్మను, సూడటానికి వొంతులేసుకుంటే, రేపు నిన్ను నన్ను, సూడటానికి, కూడా వంతులేసుకుంటారు మన, పిల్లలు. ఆమె తినే ఒక ముద్ద మనకాడ లేకపోలేదన్నాను. "నీ సావు నువ్వు సావు, నాకే పని సెప్పకు" అన్నాడు వీల్ల అయ్య. 


 అట్టాగే, మా ఆయనతో పోరుకులాడి మా అత్తను, సూసినా. ఇది సూసి నా కొడుకులు, నన్ను సూత్తారనుకొన్నా, కాని, అది వాళ్ళలో ఇసుమంత కానరాకనే, ఆశ్రమంలో చేరినా. నేను, సత్తే ఆశ్రమం వాళ్ళు దీనికెవ్వరూ లేరని! జాలి తలచి తగలేత్తారు. అది నా కిట్టం లేదు, వాళ్ళు నాకు, ముద్ద, పెడుతున్నారు. ఇప్పటికే నేను వాళ్లకి రుణపడున్నా! కొడుకులకు ఆస్తులూ! తగలేసే కర్చులు, ఆశ్రమం వాల్లకా. ఇది చూసి, అందరు కొడుకులు, వాళ్ల, తల్లులను, ఈ ఆశ్రమాల కాడ వదిలేత్తారనే, బాధతో నేనిట్టా సేయటం తప్పా! సెప్పండి. నే సెప్పేది తప్పైతే, ఈడనే ఈ సెట్టుకు కట్టి కొట్టండి. తన రకతమాంసాలు, ఇచ్చి పెంచిన కన్న తల్లికి, ఎవరు ముద్ద పెట్టకపోయినా, పర్లేదుకాని అనాద శవాలగా మాత్రం, పోనియ్యబాకండి ఇదే నా ఇన్నపం. 


 మా ఆయన, సమాధి పక్కనే, నా సమాధి కట్టమంటున్నా. నాకు, దినవారాలు, సేయకపోయినా పరవాలేదు. కనీసం, ఈ సమాధిలోనైనా, నా శవాన్ని పడేసి, పైన బండేయ్యండి. కట్టెలు కొనే కర్చు తప్పుతది నాకొడుకులకు. దానికి, ఇక్కడున్న మీరందరూ! సాచ్చాలు. నాది, పెద్ద ఫోటోలు ఈది సివరెట్టి దండలు వేయమాకండి. ఆ ఖర్చుతో ఆశ్రమంలో ఉన్నోళ్లకు, ఒకపూట భోజనం పెట్టండి, అది సాలు నాకనీ!" కన్నీళ్లతో వేడుకుంది పంచాయితీ పెద్దలను, శాంతమ్మ. 


 ఇప్పటినుండే, నీగొయ్యి నువ్వే, ఎందుకు. తవ్వుకోవటం ఇంకో పదేళ్ళు నువ్వు, బతికావనుకో, అపుడు, సూడచ్చుగా ఆ గొయ్యి, యవ్వారం, ఇంకో పెద్దమనిషి పుల్లయ్య, పొగాకు కాడను, చీలుస్తూ, వెటకారంగా అన్నాడు. 


 "పుల్లయ్యా! అంత ఎటకారమొద్దులే, నా కన్నా! నీకే అవసరం గొయ్యి. నువ్వు మీ అమ్మను, ఎంత బాగా, సూసావో!, నాకు మా బాగా తెలుసు. నిన్నేంత, బాగా నీ కొడుకులు, సూత్తారో! చూద్దాము" అంది శాంతమ్మ. 


 శాంతమ్మ కొడుకుల వైపు చూస్తూ, "మీ అమ్మ కోరిక తీర్చండి, ఆ గొయ్యేదో తవ్వి" కోపంగా అన్నాడు పుల్లయ్య. "పుల్లయ్యా! నువ్వు ఆపంటూ మీ పిల్లల చేత,నీకు ఇపుడు, సమాధి, కట్టించాలి అంతేగా పిన్నమ్మ!" అన్నాడు రాయుడు. 


 "అంతే! ఈ కాగితాల మీద, రాపించి మా కొడుకుల సేత, వేలిముద్రలను ఏపించనీ! కాగితాలు, తీసిచ్చింది రాయుడుకు. వాటి మీద సాచ్చి సంతకంగా, నువ్వు వుండమాకు. మనూల్లోనే అడుక్కుతినే, ఈ బిచ్చపతి, సేత వేలిముద్ర, ఏపించు. ఎందుకంటే, నీ మాదిరి కాకుండా, తను అడుక్కొచింది, తన తల్లికి పెడుతున్నాడు. నువ్వు, మీ అమ్మకు, ముద్దెయ్యకపోతే, మీ మామయ్య, సూత్తున్నాడు. ఆయన చేత ఇంకో సాచ్చి, సంతకం పెట్టించు. 


 నాకిప్పుడు, డెబ్భైఏళ్లు మా అమ్మ, ఈ వయసులోనే సనిపోయింది. ఎవరికి తెలుసు! ఆమె సాలోచ్చి నేను రేపే, పోతానేమో! మొన్న సచ్చిన, వీరమ్మ సందేలవరకు బానేవుంది. ఆ రేతిరి నాతో, మాటాడింది కూడా! తెల్లారేసరికి, లేదు. వాన రాకడ పానం పోకడ, ఎవరికి! తెలుసు. ఆ వీరమ్మ, సావే నేనిట్లా సేయటానికి, వూతమిచ్చింది. వచ్చే వారమే మొదలెట్టండి, నా సమాధి పనులని" చెప్పింది శాంతమ్మ


 "అమ్మా! మమ్మలని ఇంత పెద్ద చేసి మా పెళ్ళిళ్ళు, మేనబావలకే ఇచ్చి చేసినావు. వాళ్ళు నిను సూత్తే, ఏమనరు. ఇపుడైనా మా కాడికి రామ్మా, అన్న కూతుళ్లతో! మీరు సూసినా, మీ మొగుళ్ళ ముకాల్లో మీ కొడుకులు, సూడకపోతే, మేము సూసామనేమాట నా కొడుకులకు రాకూడదనే, నేను ఆశ్రమంలో సేరాను. మీరు, మీ అత్తల్ను సూత్తే నన్ను సూసినట్టే" అంది శాంతమ్మ. 


 ఆ మాటలకు అక్కడందరూ! శాంతమ్మ, కొడుకుల,ముఖాల్లోకి చూస్తుంటే తలలు దించుకున్నారు కొడుకులు. పెద్దకొడుకు కొడుకు ప్రశాంతు, "నానమ్మ నిన్ను నేను చూసుకొంటాను నా దగ్గరికి రా" అన్నాడు. 


 "లేదులే రా మనవడా! కాటికి, కాలు జాపుకున్న, నన్ను, ఆ బస్తి తీసుకెళ్ళి యాడ ఇబ్బంది, పడతావు. ఆమాట అన్నావు, సాలురా! మీ అయ్యను, అమ్మను సరిగా సూసుకుంటే నన్ను సూసుకొన్నట్లే,"అంది శాంతమ్మ. 


 "ఈ వూళ్ళో, పెద్ద మడుసులను, నేను కోరేది ఒకటే. పతి ఏటా, వినాయక సవితి, సీరామనవమి, సేత్తున్నారుగా! వాటికి, గనంగా డబ్బులు కర్చు పెడుతుండారే! ఆ డబ్బులతో ఈ ఊరిలో ముసలమ్మలకు అన్నం పెడితే, ఆ తల్లుల కళ్ళలో మెరిసే సంతోసాల దీయనలు, మీకు సీరామరచ్చ. 

 అందరూ! ఆలోసించండి నే సెప్పిన దాని గూర్చి. అపుడు నాలాగా! ఏ తల్లి బాధ పడదంది" కళ్లనీళ్ల తుడుచుకుంటూ! శాంతమ్మ


 కల్లా కపటం లేని, మడిసి శాంతమ్మ, ఉన్నదున్నట్లు సెప్పుద్ధి. ఒకటే మాట,మీద వుంటది. ఎవరిని కట్టపెట్టే మడిసి కాదనుకున్నారు, అక్కడకు వచ్చిన అందరూ. 


 ఆశ్రమంలో కూడా ఎంతో పద్దతిగా వుండేది. వంటమనిషి వున్నా కూరలు కోసిచ్చేది. అందరూ!తలా ఒక పని సేత్తే, అందరికీ, కట్టముండదనేది. ఖాళీ ప్లాస్టికు డబ్బాల్లో మట్టిపోసి, కూరగాయలు పండించేది. తనను చూసి మిగతావాళ్ళు కూడా, పనులు చేయటం ఆరంభించారు. 


 శాంతమ్మ అన్నట్లుగానే, ఒక వారం రోజులకు, చనిపోయింది. ఆమె, చెప్పినట్లే సమాధి కట్టారు పిల్లలు, ఊరివాళ్ళు కలిసి. 

 

 శాంతమ్మ, చెప్పినట్లుగా ఆ వూరిలో ఎవరు! ఇంట్లో ముసలి తల్లితండ్రులకు, అన్నం పెట్టకపోయినా శిక్ష పడెట్లుగా చేసారు పంచాయితీ పెద్దలు. రాయుడు తన తల్లిని ఇంటికి తెచ్చుకుని చూసుకోసాగాడు. ఊళ్లో ఉన్న ముసలమ్మలు శాంతమ్మకు ప్రతిరోజూ దణ్ణం పెట్టుకుని ముద్ద తింటున్నారు, ఇదంతా నీ చలవేనంటూ. ! 


 ఉత్తమ పంచాయితీగా ఎన్నికైంది శాంతమ్మ వూరు. ఒక తల్లి దీవెన్లుంటే, ఏ ఊరు బాగుపడదు! చెప్పండి. పంచాయితీ ఆఫీస్లో శాంతమ్మ ఫోటో పెట్టారు, ఆ ఫోటోలో శాంతమ్మ, తను సాధించిన విజయానికి పొంగిపోతూ, అక్కడికి వచ్చిపోయేవాళ్ళను, చూస్తూ నవ్వుతున్నట్లుగా ఉంది. 

========================================================================

సమాప్తం

========================================================================

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


26 views1 comment

1件のコメント


Tulasidevi Sanka

4 hours ago

Suupar vunda ndi kadha

いいね!
bottom of page