top of page

పాపం సన్నాసి రావు


'Papam Sannasi Rao' - New Telugu Story Written By Penumaka Vasantha

'పాపం సన్నాసి రావు' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత


"కాస్త ఆ పేపర్ హాల్లో కి వెళ్లి చదువుకోవచ్చుగా.. ? నా ఎదురుగా పడకుర్చిలో పడుకుని చదవకపొతే, " విసుగ్గా అన్న భర్త సన్నాసి రావుతో " మీకూ! నేను ఎదురుగా ఉంటే, బావుంటుంది అంటారుగా! అదీ కాక నేను తోడు లేకుంటే ఏ పని చేయలేనంటారు. అలా! మీరు ఒంటరిగా ఫీల్ అవకూడదని.. నేను ఇక్కడ కూర్చుంటున్నా" అంది దుర్గ.


"అది పెళ్ళైన కొత్తల్లో అన్నానులే" ఇపుడు కాదు. నువ్వు ఎదురుగా కూర్చుని పేపర్ చదువుతూ.. మధ్యలో ఇంకా బాగా కడగండేం.. బాగా ఉతకండే.. అంటుంటే నాకు కాలుతుంది ఇక్కడ " అన్నాడు సన్నాసిరావు.


"అయ్యో, అయ్యో! అవేమీ మాటలండీ, నాకు మాత్రం సరదానా? మీచేత పని చేయించటానికి! మీరు పని చేస్తుంటే చూడలేక పేపర్ చదువుతున్నా తెలుసా! అది ఏనాడైనా గుర్తించారా మీరు" అంటూ కళ్ళు, ఒత్తుకుంది దుర్గ.


"నువ్వు కాదే ఏడవటం నేను, నేను, ఏడవాలి ఈ పనులు చేయలేక. ఇవి అవ్వగానే ఆఫీస్కి వెళితే మా బాస్ అడ్డమైన చాకిరీ చేయిస్తున్నాడు. ఇక్కడ ఇంట్లో నువ్వు మొగుడివైతే అక్కడ బాసు మొగుడు. ఇద్దరు మొగుళ్ళతో చస్తున్నా.. " అని విసుక్కున్నాడు సన్నాసి రావు.


"మీరేమో? నన్ను విసుక్కుంటున్నారు నేనేమో ! మీరంటే పడి ఛస్తున్నాను" అన్న దుర్గతో.

"నేనంటే అంత పడి చచ్చేదానివైతే నా చేత ఇంత పని చేయించవు. " అన్నాడు సన్నాసిరావు


"అయ్యో! ఎందుకండీ అలా అంటారు? నేను ప్రతి రోజు దేవుణ్ణి! ఏడేడు జన్మలకు మీరే కావాలని కోరుకుంటున్నా. మీరేమో ! నన్ను ఎపుడూ ఆడి పోసుకుంటారు. "


"ఇంకా మిగిలిన ఆరు జన్మల్లో కూడా నేనే అంట్లు తోముతూ.. బట్టలు ఉతుకుతూ.. ఛీ ఎదవ బతుకు నా మొహం మీద కాకి రెట్ట వెయ్యా. నీకేమి ద్రోహం చేసానే ఇ లా.. నామీద పగ తీర్చుకుంటున్నావు" అని సన్నాసి రావు గట్టిగా అరిచాడు.


"అబ్బా! అలా అరవకండి. బీపీ పెరిగి మీ ఆరోగ్యం పాడైతే మన ఇంటి పనులు.. ఎవరు? చేస్తారు. మీ మీద నాకు పగా.. పాడా ? మీకు ఒకసారి వంట్లో బాగాలేకా! మీరు బెడ్ మీద ఉంటే గుళ్ళో పవిత్ర బంధం లో సౌదనర్య లా గుడి చుట్టూ, పోర్లు దన్నాలు పెడుతుంటే, పూజారి గారు చెప్పాడు.

అమ్మా ! మీ ఆయన బాగుపడాలంటే.. నీకు ఇష్టమైన వాటిని త్యాగం చెయ్యి అంటే నాకు ఇష్టమైనవి ఇంటి పనులే కదా! అపుడు దేవుడి కి మొక్కుకున్నా. స్వామి మా వారికి తగ్గి లేచి తిరిగితే నా కిష్టమైన పనులు అంట్లు తోమటం, బట్టలు ఉతకటం మీ చేత చేయిస్తానని మొక్కుకున్నా ఇది తప్పా" అని మళ్ళీ చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంది దుర్గ.

"ఏ స్వీటో, పండో తినమనీ! మొక్కుంటారు.. కానీ, ! ఇదేమి గోలే నా చేత పని చేయిస్తానని మొక్కోవటం నా ఖర్మ కాకపోతే" అని మళ్ళీ గట్టిగా అరిచాడు సన్నాసి రావు.

"అబ్బా! గట్టిగా అరవకండి చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికే మీకు దిష్టి పెడుతున్నారు పనులు బాగా చేస్తారని. నేను కూడా మా వారు కిక్కురు మనకుండా.. పనులు చేస్తారు అని చెప్పా. మీకేమి తెలుసు నేను మిమ్మలని ఎలా కాపాడుకుంటున్నానో! మొన్నటికి మొన్న, నా బెస్ట్ ఫ్రెండ్, పనిమనిషి రావటంతో లేదే అంటూ, నా వైపు చూస్తే, నేను దాని మాటలకు అర్థం గ్రహించి, మా ఆయనకు ఒంట్లో బాగోటం లేదన్నాను తెలుసా! అంది దుర్గ.


ఆఘోరించావులే, మొన్న ముష్టివాడికీ, ఆయనకు బాలేదు వెళ్ళు అని హింట్ ఇచ్చావుగా, మొన్న అఫీస్ నుండి వస్తుంటే "వొంట్లో బావుందా బాబయ్య, రేపటి నుండి వచ్చి అడుక్కోనా, అంటున్నాడు.

నా పేపర్ చదవటం కూడా పూర్తి అవుతుంది. ఇంకా మీ పని అవ్వలేదు కానివ్వండి. నేను లోపలికి వెళ్తున్నా. త్వరగా లోపలికి వచ్చి వంట చేసి ఆఫీస్ కి వెళ్లండి మరీ.. "నవ్వుతూ అంటున్న భార్య ను వెనకనుండి "ఆ వస్తాలే.. నువ్వు లోపలికి తగలడూ.. " అంటూ తోముతున్న చెంబును విసిరాడు కసిగా సన్నాసి రావు.

"నాకు వినపడుతునే ఉంది మీరు విసరటం అది, సూటిగా వచ్చి నాకు తగిలి నేను పోవాలనేనా!? మీ ప్రయత్నం. అలా ఏమి!? నేను పోను కానీ ఈ పాటలు వింటూ పని చేయండి" అంటూ ఆడుతూ.. పాడుతూ పని చేస్తుంటే అలుపు సోలుపు ఏమున్నది అనే పాటను ఫోన్లో ప్లే చేసి, దుర్గ వెళ్లింది.

వెనుక సన్నాసి రావు ఒసే, ఒసే! గిచ్చి, జోల పాడినట్లుంది కదే! పాటలో ఆ తర్వాతి లైన్ కూడా వినవే ఇరువురు ఒక్కటై అని ఉంది. వచ్చి కాస్త నేను తోమిన అంట్లు తొలవ వచ్చుగా" అనీ సన్నాసి రావు భార్య వినాలని పెద్దగా అరిచాడు.

ఆ! విన్నాను, కానీ వ్రత భంగం అవుతుందని ఆగా. కానీ, మీకు ఏమన్నా! అయితే నేను బ్రతకను తెలుసా! అంది దుర్గ.


'నీఎమ్మ కడుపుమాడ నేను ఈ పనులు చేసీ.. చేసీ పోయేట్లు ఉన్నా కదే !? అపుడేమీ చేస్తావే. !? అమ్మో !? వద్దులే ఒక వేళ నేను ప్రాణం పోక కొనవూపిరితో ఉంటే నాకు బాగవటం కోసం పక్క ఇంటి వాళ్ల అంట్లు నా చేత తోమిస్తానని కూడా మొక్కుతావు. అమ్మో! వద్దులే బతికుంటే అందరివీ కాక మన ఇంటి అంట్లే తోమటం బెటరు. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే.. నా కర్మ కాలి నట్లున్నది' అని సెల్ ఫోన్లో పాటతో ఏడుస్తూ జత కలిపాడు.


చెపితే వినడు.. గిల్లితే ఏడుస్తాడుటా!? నా కర్మ కొద్దీ దొరికారు. ఐదు నిముషాల్లో అయ్యే పనినీ, గంట లో చేస్తారు. అసలే మీకు హైబీపీ ఇందా నోరు పట్టండి మాత్ర వేస్తాను సన్నాసి రావు నోట్లో ఒక మాత్ర వేసి నీళ్ళు పోసి వెళ్ళింది. మీరు బాగుంటేనే ! నేను బావుంటాను అర్థం చేసుకోరు. "


'నీ ముందు చూపు మండా. నీ నోటి దాటికి ఒక్క పనిమనిషి మన ఇంటికి వచ్చి పని చేయదు. అందుకని వ్రతం, గోంగూర.. అంటూ నా చేత చేయిస్తున్నావు పనంతా. నేను ట్రాన్స్ఫర్ కి పెట్టాలే రెంటచింతలకు. నువ్వు ఈ సిటీ ని వదలవు. పిల్లల స్కూల్స్ మధ్య లో మార్చటం కుదరదనీ అక్కడికి రావు ఎటూ. నే ఒక్కడినే వెల్తా నా ఒక్కడికి ఏదో ఉడకేసుకుని తింటా. నెలకు ఒక సారి వచ్చి చూసిపోతే దీని తిక్క కుదురుతుంది అని ఆలోచిస్తున్నాడు సన్నాసి రావు.


"ఆఫీస్ కి టైం అవుతుంది. ఇక దొడ్డి వదిలి ఇంట్లో కి రారా!?" అని దుర్గ వచ్చి అనేసరికి, "ఇదిగో ఫైవ్ మినిట్స్ లో ఫినిష్ చేసి వస్తా వెళ్లవే"


"అలాగే ! కాఫీ కలుపుతున్నా.. రండి!" అని ముద్దుగా పిలుస్తూ లోపలికి వెళ్ళింది.


నీ మొహం మండా! చావగొట్టి మూవ్ ఆయింట్ మెంట్ రాయటం అంటే ఇదే కాబోలు!? అని బ్రహ్మానందం లెవెల్లో అన్నాడు మన సన్నాసిరావు.

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
35 views2 comments
bottom of page