top of page

ప్రగతి ప్రేమికులు 3


'Pragathi Premikulu episode 3' New Telugu Web Series Written By Ch. C. S. Sarma

'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ...


బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు అతడు.


శ్రీ వివేకానంద స్వామీజీ అసలు పేరు నరేంద్రుడు.

శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యుడుగా మారారు.

1893 వ సంవత్సరం చికాగో నగరంలో సర్వమత మహాసభలో పాల్గొన్నారు. అమెరికన్లను బాగా ప్రభావితం చేశారు.


ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 3 చదవండి..


వారిలో ముఖ్యులు హేల్ కుటుంబం, లెగ్లెట్ దంపతులు, కుమారి మాక్లిమోడ్, శ్రీమతి ఓలబ్బుల్, డా॥ఆలన్ డే, కుమారి వాల్డో, ప్రొఫెసర్ రైట్, డా॥ స్ట్రీట్.


మంచిని మంచిగా చూచి, గౌరవించి, అభిమానించి, ఆచరించడం అనేది ఆ భగవత్ ప్రసాదిత మహోన్నతవరం. ఏ కొందరికో యిది సాధ్యమౌతుంది. లభ్యపడుతుంది. దాన్నే మన హైందవత, పురాకృత సుకృతం అంటుంది.


యీ తత్వానికి వ్యతిరేకం అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లోనూ వుంది. ఆ రోజుల్లో అమెరికాలో, శ్రీ వివేకానందస్వాముల వారి ప్రవచనాలతో, హిందూ మత విశ్లేషతను గ్రహించిన కొందరు, ఆ మహనీయుడు పుట్టిన భారతదేశానికి తమ మత ప్రచారకులను పంపించడం అవసరమా..?, అనే ప్రశ్నను మత సభ్యులు, మత ప్రచారం పేరిట అమెరికన్ల నుండి డబ్బు గుంజుకోవడటం యికపై అసాధ్యమౌతుందని భావించి స్వామీజీని ద్వేషించారు. దూషించారు.


వారికి మనదేశపు దివ్య జ్ఞాన సమాజస్థులు, బ్రహ్మ సమాజనేత ప్రతాప చంద్రమజుందారు, వారి బృందం స్వామీజీ నిజమైన సన్యాసి కాదనీ, హిందూ మతంలోని ఏ సాంప్రదాయానికీ వారు ప్రతినిధి కాదనీ, దుశ్శీలుడనీ, అమెరికన్ గృహస్థులెవరూ, స్వామీజీని తమ యిండ్లకు ఆహ్వానించడం ప్రమాదమని హెచ్చరికలు చేశారు.


కానీ…! ఆమెరికాలోని స్వామీజీ మిత్రులు వారి పవిత్ర శీలాన్ని గురించి, సత్కర్మానుష్టానాన్ని గురించి, సత్య బద్ధమైన ప్రవచనాలను గురించి, ప్రత్యక్షంగా చూచిన వారైనందున యీ విమర్శలనన్నింటినీ ఖండిస్తూ జవాబులు యిస్తూ స్వామీజీ వారికి అండగా నిలిచారు.


ఆ కాలంలో ఆమెరికా నుండి భారతదేశానికి వుత్తర ప్రత్యుత్తరాలు జరపటం కాలహరణంతో కూడిన పని. కొంతకాలం తర్వాత, స్వామీజీ మద్రాసు శిష్యులకు వ్రాసిన ఉత్తరాల వలన, యదార్థ విషయాన్ని గ్రహించిన స్వామీజీ శిష్యులు, ఆయా ప్రాంతంలో ప్రముఖులై వారి అధ్యక్షతన భారతదేశపు ప్రముఖనగరాల్లో బహిరంగ సభలను నిర్వహించి, స్వామీజీ విజయ పరంపరలను, సభికులందరికీ తెలియజేశారు.


ఈ సభోపన్యాసాలు స్థానిక పత్రికలలో ప్రచురణ జరిగింది. శిష్యులు ఆ వార్తా పత్రికల కత్తిరింపులను అమెరికాకు పంపారు. వాటిని అక్కడి స్వామీజీ అనుమాయులు కొన్ని అమెరికన్ పత్రికలలో ప్రచురించారు. ఆ రీతిగా, స్వామీజీ మీద అసూయా పరులు చేసిన దుష్ప్రచారం అబద్ధాలని రుజువైంది.


వేదాంత ప్రచారం కోసం న్యూయార్కులో, వేదాంత కేంద్రాన్ని స్థాపించి, దానికి లెగ్గెట్ ను అధ్యక్షుడిగా నియమించారు. ఇంగ్లండ్ నుంచి స్వామీజీకి ఎన్నో ఆహ్వానాలు వచ్చాయి. వెళ్ళాలని నిర్నయించుకొని, 1895సం॥ ఆగష్టు 17వ తేదీన, లెగ్గెట్ తో కలిసి ఇంగ్లండ్ కు బయలుదేరారు.


మొదట పారిస్లో చిన్న మజిలీ చేసి, సెప్టెంబర్ 10వ తేదీన లండన్ చేరారు. మొదట కుమారి ముల్లర్ అతిథిగా, తర్వాత ఇ.టి స్టర్డీ అతిథిగా వున్నారు. నాలుగు మాసాలు లండన్ లో వేదాంత ప్రచారం చేసి తిరిగి అమెరికాకు వెళ్ళారు. నాలుగు మాసాలు ముఖ్య నగరాలను తిరిగి తన ప్రవచనాలతో అమెరికా సోదరులను ప్రభావితులను చేశారు. విశ్రాంతికై మిత్రులు సెవియర్ దంపతుల ప్రోద్బలంతో ఐరోపా ఖండ యాత్రకు బయలుదేరారు.


ఆ యాత్రానంతరం 1896 సం॥ సెప్టెంబర్ 17వ తేదీన లండన్ కు తిరిగి వెళ్ళి, డిసెంబర్ వరకూ అక్కడ తన పరిశ్రమను కొనసాగించారు. ప్రియమిత్రులు, పాశ్చాత్య శిష్యులూ అయిన సెవియర్ దంపతులు గుడ్విన్ ప్రభృతులతో స్వామీజీ, డిసెంబర్ 16వ తేదీన భారతదేశానికి తిరుగు ప్రయాణం చేశారు.


అమెరికాలో లాగా, ఇంగ్లండ్ స్వామీజీని గురించి క్రైస్తవ మిషనరీలు ఎలాంటి దుష్ప్రచారాన్ని చేయలేదు. ఎంతోమంది స్త్రీ, పురుషులు, మతప్రచారకులు స్వామీజీ పరిచయాన్ని పొంది మిత్రులయ్యారు. ఇంగ్లండులో తనకు లభించిన మర్యాద, ఆహ్వానాలకు స్వామీజీ ఎంతగానో సంతసించారు. ఆంగ్లేయుల పట్ల తన మదిలో అంతవరకూ వున్న విరుద్ధ భావన తొలగిపోయింది.


ఆనాటి సుప్రసిద్ధ భారతీయ తత్వజ్ఞులైన ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్, ప్రొఫెసర్ పాల్ డ్యూసేన్ కలసికొని వారితో విస్తృత చర్చలు జరిపారు. నైన్టీన్త్ సెంచరీ అనే పత్రికతో మాల్స్ ముల్లర్, శ్రీరామకృష్ణులు ఒక యధార్ధమైన మహాత్ముడని ప్రచురించిన వ్యాసాన్ని చూచి ఎంతగానో సంతోషించారు. మాక్స్ ముల్లర్ 'శ్రీరామకృష్ణ పరమహంస జీవిత విశేషాలు, బోధనలు' అనే పుస్తకాన్ని రచించారు. ఇదే శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులు సుచరిత్రకు సంబంధించిన తొలి ఆంగ్ల గ్రంథము.


జర్మనీ దేశస్థుడైన ప్రొఫెసర్ డ్యూసెన్ ప్రఖ్యాత భారతజ్ఞుడు. వేదాంత పండితుడు. స్వామీజీ ఐరోపాలో పర్యటించినప్పుడు డ్యూసెన్ తన గృహానికి స్వామీజీని ఆహ్వానించారు. ఎన్నో విషయాలను గురించి వారిరువురి మధ్యన చర్చలు జరిగాయి. హాంబర్గ్, ఆమ్ స్టర్ డాం లండన్ లకు కలసి పయనించారు.


వారి ఇంట్లో స్వామీజీ బసచేసి వుండగా ఒక అద్భుత సంఘటన జరిగింది. ప్రొఫెసర్ పుస్తకాల అరనుంచి ఒక కవిత్వ పుస్తకాన్ని స్వామీజీ తీసి చదవసాగారు. డ్యూసెన్ స్వామీజీతో మధ్యలో మాట్లాడ ప్రయత్నించారు. స్వామీజీలో వారి మాటలకు ఎలాంటి స్పందన లేదు. స్వామీజీ పుస్తకాన్ని చదవటం ముగిసాక డ్యూసెస్, మధ్యలో తను మాట్లాడ ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతర్ముఖుడనై వున్న కారణంగా మీ మాటలను వినలేదని స్వామీజీ జవాబు చెప్పారు.


ఆ కారణంమీద డ్యూసెస్ కు నమ్మకం కుదరలేదు. విశ్వసించలేదు. దీర్ఘకాలిక యోగాభ్యాసం వలన, మనస్సు ఏదైనా ఒక విషయంమ్మీద పూర్తిగా లీనమయ్యే ఏకాగ్రతను పొందుతుందని, అలాంటప్పుడు కణకణలాడే నిప్పును శరీరంమీద వుంచినా, దాన్ని గురించి ఎరుకే వుండదని స్వామీజీ చెప్పారు. వారు చదివిన పుస్తకమునందలి ఎన్నో పద్యాలను తు.చ తప్పకుండా వల్లించారు. డ్యూసెస్ స్వామివారి ప్రతిభకు ఆశ్చర్య చకితులైనారు.


1893 నుండి 1896 వరకు ఆయా దేశాల్లో వేదాంత ప్రచార పునాదులను వేయడంతో గడిపారు. ఆ నిమిత్తం న్యూయార్క్ లోనూ, లండన్ లోను రెండు వేదాంత కేంద్రాలను స్థాపించారు. వారు పాశ్చాత్య దేశాలను వదిలి రాబోయేముందు, తమ సోదరశిష్యులైన శారదానందుడికి న్యూయార్క్ కేంద్రపు, అభేదానందుడుకి లండన్ కేంద్రపు అజమాయిషీని అప్పగించారు.


యీ రీతిగా స్వామీజీ 1893 నుండి 1896 వరకు పాశ్చాత్య దేశాల్లో, వేదాంత ప్రచార పునాదులను వేయటంలో ఎంతగానో శ్రమించారు.


భారతదేశంలో స్వామీజీ కార్యక్రమాలలో పాలు పంచుకొనే నిమిత్తం, వీరితోపాటు సేవియర్ దంపతులు, మార్గరేట్ నోబెల్ (కాలాంతరంలో వీరే సోదరి నివేదిత), కుమారి ముల్లర్, జె.జె. గుడ్విన్ మన దేశంలో స్వామివారి కార్యనిర్వాహణకు, ఎంతో దోహదం చేశారు. ముఖ్యంగా గుడ్విన్ స్వామీజీ భారతదేశంలో చేసిన సుప్రసంగాలను సంక్షిప్త లిపితో వ్రాసి ప్రచురణకు యోగ్యంగా తయారు చేశారు.


యీ విషయంలో వారి ఘనకీర్తి అద్వితీయం. స్వామీజీ తన ప్రసంగ ప్రారంభంలో 'నా గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంసగారే..!' నాకు యీ ఆధ్యాత్మిక సమన్వయ ప్రతిభను నేర్పారని' తమ గురుదేవులను స్మరించేవారు.


స్వామీజీ 1897సం॥ జనవరి 15వ తేదీన కొలంబో రేవు చేరగానే, అక్కడ స్వామివారిని చూచేటందుకు చేరిన జనసమూహం స్వామీజీకి జేజేలు పరవశులై పలికారు. పెద్ద వూరేగింపు స్తోత్రగానంతో బయలుదేరింది. పేద, రాజు భేదం లేకుండా అందరూ మహదానందంతో స్వామీజీవారికి స్వాగతం పలికారు.


ఎందరో యధాశక్తి స్వామీజీకి ఎన్నో కానుకలు సమర్పించారు. పూర్వం భారతదేశాన్ని అజ్ఞాత సన్యాసిగా పర్యటించినట్లు యీసారి స్వామీజీ దక్షిణం నుంచి ఉత్తరం వరకు భారతదేశాన్ని పర్యటించారు. హితులు, శిష్యులు, అభిమానులూ వారిని అనుసరించారు. రాజులు వారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేశారు.


ఫిరంగులను కాల్చారు. వారు కూర్చున్న గుర్రపు బండిని జనం స్వయంగా లాగారు. మేళతాళాలను మ్రోగించారు. సిలోన్ లో ముఖ్యపట్టణాలను దర్శించి, ఉపన్యసించి, 1897వ సం॥ జనవరి 26వ తేదీన స్వామీజీ పాంబస్ పట్టణంలో భారతావని మీద కాలు మోపారు. రామేశ్వరం, రామనాడు, పరమగుడి మానా మధురై, ముధురై, కుంభకోణం, తిరుచిరాపల్లి మొదలగు పట్టణాల మీదుగా స్వామీజీ మద్రాసుకు చేరారు.


అక్కడ ఆరు ప్రసంగాలను మన సమగ్ర జాతిని గురించి, మన సనాతన అధ్వయిత భారతదేశ ఔన్నత్యాన్ని గురించి, మహదానందంతో కొనసాగించారు. పాశ్చాత్యానుకరణం యీ దేశ సంతతికి తగదని హెచ్చరించారు.


తరతరాలుగా మహాఋషులు సంప్రాప్తంగా, మనదై మనకు లభించిన ఆధ్యాత్మిక చింతనే మన భారతావనికి ప్రాణం అని, దీన్ని వృద్ధి చేయడమే దేశసౌభాగ్యానికి ఖచ్చితమైన తగిన మార్గమని వుద్ఘాటించారు.


పాశ్చాత్యులనుండి మనం నేర్చుకొనవలసినది, విజ్ఞానాన్ని గురించి, పారిశ్రామిక నైపుణ్యాన్ని గురించి, సమాజ పురోభివృద్ధి విధానాలను గురించి, అన్న ఆ విధానాలను గురించి మన వారికి తెలియజేశారు. యితర దేశాలతో మనం సంబంధాలను కల్పించుకోవాలని, మానవజీవిత విధానానికి ఉపయుక్తమైన విధానాలను వారి నుండి నేర్చుకోవాలని, వీటన్నిటితోపాటు, మన భారత జాతీయతకు ప్రాణమైన, ఆధ్యాత్మికతను యావత్ దేశప్రజలు పాటించి ఆచరించాలని, ఆ ఆధ్యాత్మికత యీ మన భారతదేశపు వ్యక్తిత్వమని ఘోషించారు.


మన పూర్వులు, మన సామాన్య జన సముదాయాన్ని నిర్లక్ష్య పరచి, మన పురాణాలను, భగవద్గీతాసారాన్ని, ఉపనిషత్తులను, వేదాలను యితర పవిత్ర గ్రంథ సారాంశాలను, ఆయా అమూల్య జ్ఞాన భండారాన్ని, సాటివారికి పంచకుండా వారిని వంచితులను చేయడం, యీ దేశ పతనానికి, పరదేశ వాసుల ప్రవేశానికి, కారణాలని విశదీకరించారు.


నిజానికి తాను అమెరికా వెళ్ళింది, విశ్వమత మహాసభలో పాల్గొనేదానికి కాదని, మనకున్న వున్నత భావాలను, మనలోని ఔనత్యాన్ని పవిత్రతను, వారికి తెలియజేసి, వారినుండి ఆర్థిక సహాయం కోరడం కోసమేనని, దరిద్ర భారత సముదాయాన్ని వుద్ధరించడమే తన లక్ష్యమని అనేక సభల్లో స్వామీజీ స్పష్టపరిచారు.


బుల్సతి, కుమారి ముల్లర్, సెవియర్ దంపతులు స్వామీజీ ముఖ్య శిష్యులు, మిత్రులు. వీరు వారు నెలకొల్పిన మఠానికి తగినంత సహాయం అందించారు. పాశ్చాత్యులు అర్రులు చాస్తున్న 'ఆధ్యాత్మికత' భారతదేశంలో వుంది. దాన్ని వారికి యిచ్చి, బదులుగా వారినుండి వారి నవీన విజ్ఞానం, పారిశ్రామిక కళానైపుణ్యాన్ని, మనం నేర్చుకోవాలి. యిచ్చి పుచ్చుకోవటం స్వామీజీ మతం. జాతీయ ఐక్యతాభావం వారి లక్ష్యం. తను పుట్టిన ఈ భారతావని 'భరతమాత'

అంటే వారికి ప్రాణం.


అనేక చోట్ల స్వామివారి ఉపన్యాసాలను విని వారి అద్వితీయ తత్వాన్ని ఎరిగిన శిష్యుడు 'రోమారోలా' ఇలా వ్రాశారు.


‘రాబోయే యాభై సంవత్సరాల వరకూ మన యీ దివ్య భారతమే మన అధిష్టాన దేవతగా వెలయుగాక..! ఈమె ఒక్కతే జాగ్రదావస్థలో వుండవలసిన ప్రధాన దేవత. మూర్తీభవించిన మన జాతి స్వరూపం. సర్వత్రా ఆమె చేతులే, సర్వత్రా ఆమె పాదాలే, సర్వత్రా ఆమె చెవులే, యీ దేవత మాత్రమే సర్వవ్యాపి. మన చుట్టూ వున్న యీ అందరి పూజల్లో, యీ విరాట్ మూర్తి పూజే శ్రేష్టమైనది.


మనుషులు, పశువులు, వీరే మన ఆరాధ్యులు. మనకు దేవతలు, మనం పూజించవలసిన మొదటి దేవత మన ఈ దేశప్రజయే.


శ్రీ వివేకానందస్వాముల వారి మనస్తత్వాన్ని, వారికి తన దేశ పీడిత ప్రజలపైన వున్న అవ్యాజానురాగాన్ని, యీ సోదర శిష్యులవారిపై మాటలు ప్రత్యక్షసాక్ష్యాలు.


'జాతీయత, దేశభక్తి అనే పదాలను సరిగా అవగాహన చేసుకోవాలంటే, స్వామీజీ ప్రసంగాలు అవశ్యం పఠనీయం. స్వామీజీ దక్షిణ దేశాన్నుంచి 1897 ఫిబ్రవరి 19వ తేదీన కలకత్తా చేరారు. మద్రాసులో కేంద్రాన్ని నెలకొల్పడానికి సోదర శిష్యుడు రామకృష్ణానంద స్వామిని మద్రాసుకు పంపారు. స్వామీజీ స్థాపించిన సన్యాస సంఘి మొదటి శాఖ యిదే అనవచ్చు.


స్వస్థలం అయిన కలకత్తాలో స్వామీజీకి ఘనస్వాగతం యివ్వబడింది. అక్కడవారు రొండు ప్రేరణాత్మకమైన ప్రసంగాలు చేశారు. యింతవరకూ స్వామీజీ గావించిన తీవ్ర పరిశ్రమ కారణంగా వారి ఆరోగ్యం దెబ్బతిన్నది. శరీరంలో మధుమేహవ్యాధి లక్షణాలు కనిపించాయి.


1888 సం॥ తన సోదర శిష్యులను విడచి వెళ్ళిన స్వామీజీగారు వారినందరినీ కలసికొన్నారు. అధిక సమయం కాశీపూర్లోని గోపాలాల్ సీల్గారి ఉద్యానవనంలో గడిపారు. పగలు నానారంగాలకు సంబంధించిన సుప్రసిద్ధులతో చర్చలు జరిపేవారు. సాయంత్రం, రాత్రుల సమయంలో తన సోదర శిష్యులతో గడిపేవారు.


గురుదేవులు శ్రీరామకృష్ణపరమహంసవారు నిర్యాణం అయినప్పటినుంచీ, ఒక మఠాన్ని నిర్మించి అందులో గురుదేవుల ఆస్థులను పదిలపరచి, అక్కడ సన్యాస శిష్యులు నివసించేలా చేయాలనే సంకల్పం స్వామీజీవారి మనస్సున వున్న తీవ్ర ఆకాంక్ష. నిధుల కొరతతో గురుదేవులు నిర్యాణం అయిన తర్వాత ఆ ఆకాంక్ష నెరవేరలేదు.


స్వామీజీ భక్తురాలు కుమారి ముల్లర్ స్వామీజీకి 39వేలు యిచ్చింది. బేలూరులో గంగానది తీరాన ఏడు ఎకరాలకు పైగా వున్న స్థలాన్ని స్వామీజీ కొన్నారు. మఠ నిర్మాణానికి బుల్సతి, అమెరికన్ భక్తురాలు సహాయం చేసింది.


లక్షరూపాయల విరాళం యిచ్చింది. 1889వ సం॥ జనవరి రెండవ తేదీనాటికి మఠ నిర్మాణం పూర్తి అయింది. స్వామివారి మూలంగా ఆనాడే గురుదేవుల వారి ఆస్థులను బేలూరు మఠంలో శాశ్వతంగా పదిలపరచబడ్డాయి. శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులవారి, భావ వీచికలను ప్రపంచం నలుదిశలా వ్యాపింపచేసే మూల మఠం స్థాపించబడింది.


కొద్దిరోజుల తర్వాత, స్వామీజీ ఆజ్ఞానుసారం, వారి ఆంగ్ల శిష్యులైన సెవియర్ దంపతులు హిమాలయాల్లో ఏడువేల అడుగుల ఎత్తున వున్న రమణీయకరమైన 'మాయావతి' అనే చోట 1899 సం॥ మార్చి నెలలో, అద్వైయిత ఆశ్రమాన్ని స్థాపించారు.


శీతల వాతావరణంలో సాధన సాగించడానికి, పాశ్చాత్య దేశాల శిష్యులకు అనువుగా వుండాలన్నదే యీ ఆశ్రమస్థాపన ముఖ్య వుద్దేశం.


1897వ సం॥ మే 1వ తేదీన స్వామీజీ 'శ్రీరామకృష్ణ మిషన్' పేరిట ఒక సంఘాన్ని స్థాపించారు. శ్రీ రామకృష్ణుల వారి సన్యాస శిష్యులు, గృహస్థ శిష్యులు కలిసి, వారి ఆధ్యాత్మిక భావ ప్రచారాన్ని, ప్రజాసేవ చేయడమూ, యీ సంస్థ ముఖ్య వుద్దేశ్యం.


శ్రీరామకృష్ణపరమహంస గురుదేవుల బోధన 'జీవుల పట్ల చూపవలసినది దయ కాదు. సాక్షాత్ శివుడుగా భావించి సేవ చెయ్యి.' యీ అమోఘ సందేశాన్నే, స్వామీజీ తన శిష్యులకు, హితులకు ఉపదేశించారు.


శ్రీ రామకృష్ణుల వారి సంకల్పమే, స్వామీజీ ద్వారా వ్యక్తమౌతూవుందని భావించి, శిష్యులు వారి నిర్దేశాలను అనుసరించారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి కోసం జూన్లో డార్జిలింగ్ వెళ్ళారు. అత్యవసర కార్య నిమిత్తం నెలరోజుల లోపునే కలకత్తాకు తిరిగి వచ్చారు. 1897వ సం॥ మే 6వ తేదీన ఆల్మోరాకు వెళ్ళారు. అక్కడినుండి వేదాంత ప్రచారార్ధమూ, ఆరోగ్య నిమిత్తమూ, కొన్ని నెలలు వాయవ్య భారతంలో పర్యటించారు.


పంజాబ్, సింధు, రాజపుత్రస్థానం, బెరెల్లీ, అంబాలా అమృతసర్, ధర్మశాల, ముర్రే, డెహ్రాడూన్, ఢిల్లీ ప్రాంతాలను, అభిమానులు, శిష్యులు, వ్రాసిన లేఖలను

అనుసరించి పర్యటించి, తమ అమోఘోపన్యాసాలతో అక్కడి వారినందరినీ ఆనంద పరిచారు.


యీ యాత్రలో స్వామీజీకి కాశ్మీర్ లోని నౌకాగృహంలో ఎంతో అవసరమైన ఏకాంతం విశ్రాంతి లభించాయి.


1897 డిసెంబర్ 1వ తేదీన ఢిల్లీ నుండి క్షేత్రీకి వెళ్ళారు. స్వామివారి పాశ్చాత్య పయనానికి సహాయం అందించినది, ఆ ఖేత్రీమహారాజు అజిత్ సింగ్ గారే. వారు స్వామీజీకి ముఖ్య శిష్యుడు. ఖేత్రీకి వెళ్ళేదారిలో ఆళ్వార్, జైపూర్, పట్టణాలను శిష్యుల కోరికపై సందర్శించారు. క్షేత్రీని విడిచి, ఆజ్మీర్, జోధాపూర్ ఇండోర్ మీదుగా ఖండ్వా చేరుకొన్నారు.


అనారోగ్య కారణంగా, ఎన్నో ఆహ్వానాలను సభలను రద్దుచేసి, ఖాండ్వా నుండి బయలుదేరి, 1898 సం॥ జనవరి రొండవ వారం కలకత్తా చేరుకొన్నారు.


భారతీయ మహిళల ఉద్ధరణకు మనదేశానికి వచ్చిన మార్గరేట్ నోబెల్(సోదరి నివేదిత) కు స్వామీజీ ప్రత్యేక శిక్షణ యివ్వసాగారు. ఆమెతోపాటు వచ్చిన కుమారి ముల్లర్, కుమారి మాక్లిమోడ్, బుల్సతి ఈ పాశ్చాత్య శిష్యులందరు మఠానికి సమీపంలోనే వుంటూ వుండేవారు. ఆ పాశ్చాత్య శిష్యులతో కలసి స్వామీజీ 1898వ సం|| మే నెలలో నైనిటాల్ మీదుగా, ఆల్మోరాకు వెళ్ళారు.


వారు అక్కడ వుండగా, వారికి అత్యంత ప్రీతి పాత్రులయిన, విశ్వాసపాత్రులైన శిష్యుడు పవహారిబాబా, సంక్షిప్త లిపికారుడు గుడ్విన్ మద్రాసు నుండి వెలువడు 'ప్రబంధ భారత పత్రిక' సంపాదకుడు రాజం అయ్యర్ల నిర్యాణవార్త స్వామీజీని ఎంతగానో దుఃఖితులను చేసింది.


సోదరి నివేదిత 'స్వామీజీతో పర్యటనలు' అనే పేరున వారి పర్యటన ప్రాంతాల వర్ణన, స్వామివారి వుపన్యాసాల వివరణా ఎంతో గొప్పగా పుస్తకరూపంలో విశదీకరించింది.


స్వామీజీవారి హిమాలయ ప్రాంతపు యాత్రలో 'అమర్నాథ్' చాలా విశిష్టమైనది. సాగర మట్టానికి 18000 అడుగుల ఎత్తునవున్న నిటారుగా వున్న ఈ పర్వత యాత్ర చాలా శ్రమకరమైనది. స్నానం చేసి అమర్నాథ్ గుహలో ప్రవేశించిన స్వామివారి దేహం భావావేశంతో కంపించసాగింది. ఆ గుహ చాలా విశాలమైనది. ఒక మూల చీకటిలో మంచుగడ్డతో రూపొందిన పెద్ద శివలింగం. కర్పూర వర్ణంతో ఎంతో తేజోవంతంగా ప్రకాశిస్తున్న ఆ లింగంపై నిరంతరాభివేకమో అన్నట్లు, పైనుంచి నీటి బిందువులు పడుతూ వుంటాయి. ఆ మహా పవిత్రమైన శివ సాన్నిధ్యంలో, స్వామీజీ శివ భావావేశులయ్యారు.


ఆ మహాదేవుని భావం స్వామీజీని ఆవేశింపజేసింది. కొన్ని రోజుల పాటు 'శివుడు, శివుడే సర్వస్వం, అతడే శాశ్వితుడు, మహాయోగి, జగత్తును నడిపే మహాదేవుడు.' యీ భావన స్వామీజీని పూర్తిగా ఆవహించింది. నిద్రాహారాలను వర్జించి అంతర్ముఖులైనారు.


అమర్నాధ్ యాత్రనుండి శ్రీనగర్ కు తిరిగి వచ్చాక స్వామీజీ హృదయం ‘జగన్మాతృ' భావంతో పరిపూర్ణమయింది. నిద్రాహారాదుల మీద ఆసక్తి నశించింది. సెప్టెంబర్ 2వ తేదీనాటి రాత్రి స్వామీజీ, తన నౌకాగృహంలో ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ వారికికొక మహాద్భుతం, మహా విచిత్రమైన భావన, అనుభూతి కలిగాయి.

=================================================================================

ఇంకా ఉంది...

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


21 views0 comments

Comments


bottom of page