top of page

ప్రగతి ప్రేమికులు 4


'Pragathi Premikulu episode 4' New Telugu Web Series Written By Ch. C. S. Sarma

'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ...


బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు అతడు.


శ్రీ వివేకానంద స్వామీజీ అసలు పేరు నరేంద్రుడు.

శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యుడుగా మారారు.

1893 వ సంవత్సరం చికాగో నగరంలో సర్వమత మహాసభలో పాల్గొన్నారు. అమెరికన్లను బాగా ప్రభావితం చేశారు. స్వామీజీకి తన నౌకాగృహంలో మహా విచిత్రమైన భావన, అనుభూతి కలిగాయి.


ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 4 చదవండి..


దక్షిణేశ్వరంలో పూర్వం గురుదేవుల సన్నిధిలో జగన్మాత అనుభూతిని పొందినట్లు, వారి అక్కడొక దివ్య అనుభూతి కలిగింది. లోకంలో కనిపించే సమస్తమైన బాధ, దుఃఖం, అంధకారంలో వారి మనస్సు లీనమైంది. ఈ దృశ్యమాన అనేక తత్వాలకు వెనుకవుండే ఏకత్వాన్ని వారు యీ విచిత్ర మార్గాన కనుగొన నిశ్చయించుకొన్నారు. ఫలితంగా వారికి 'భీకరకాళీ దర్శనం' అయింది. భావావేశంతో జగన్మాతను గురించి పరవశంతో కవితను వ్రాశారు.


ఆ అనుభూతి వారిని అంతగా ఆవహించింది. కవిత వ్రాయడం పూర్తి కాగానే కలం వారి చేతినుండి జారి క్రింద పడిపోయింది. భావ సమాధి స్థితులైన స్వామీజీ మృతప్రాయులవలె పడిపోయారు.


ఆ తర్వాత శిష్యులతో భీషణ ఆరాధనను గురించి, జగన్మాత ప్రేమ వదనాన్ని చూడ్డాన్ని గురించి, తరచూ మాట్లాడ సాగారు. సెప్టెంబర్ 30వ తేదీన స్వామీజీ ఒంటరిగా ప్రసిద్ధ మాతృదేవాలయమైన 'క్షీరభవాని' కి వెళ్ళారు. అక్కడవారు ఆరు రోజులు కఠోరమైన తపస్సు చేశారు. ప్రతిరోజూ హోమం చేసి, పాలను జగత్ జననికి నివేదించారు. స్వామీజీ స్వభావం యిక్కడ పూర్తిగా మారిపోయింది.

నేత, కార్మికుడు, ఆచార్యుడు మొదలైన భావాలన్నీ వారి ఎరుక నుడి మాయమై పసిబిడ్డగా మారిపోయారు.


ఆరురోజుల తర్వాత శిష్యులు వున్న చోటికి స్వామీజీ తిరిగి వచ్చారు. తన అనుభవాలను వారికి వివరిస్తూ యిలా అన్నారు. నాలోవున్న దేశభక్తి, అభిమానం, పథకలా స్థానంలో, యిప్పుడు నిలచి వున్నది 'అమ్మ.. అమ్మ' మాత్రమే.


ఒకరోజు స్వామీజీ గతంలో నాశనం గావించబడి, శిధిల స్థితిలో వున్న ఆ ఆలయంలో కూర్చొని వారు ఇలా ఆలోచించారు.


"నేను గనక అప్పుడు వుండివుంటే, నా రక్తాన్ని ధారపోసి యీ ఆలయాన్ని పరిరక్షించే వాణ్ణికదా.. !” అన్న భావన వారి మదిలో కలిగింది. మరుక్షణంలో వారికి గంభీరమైన 'జగన్మాత' మాటలు వినిపించాయి.

'నాస్తికులు నా ఆలయంలో ప్రవేశించి, నా విగ్రహాన్ని పగులగొట్టితే ఏం..? నన్ను రక్షించేది నువ్వా..?, నిన్ను రక్షించేది నేనా..? నాకు యిష్టమైతే కావలసినన్ని మఠాలు, ఆలయాలు కల్పించుకోలేనా..?, అవసరమైతే యీ క్షణంలోనే యిక్కడ ఏడంతస్థుల బంగారు భవనాన్ని లేవదియ్యగలను’.


యీ తల్లి మాటలతో స్వామీజీ హృదయం పులకించింది. వారి మదినిండా ఆ మాతృమూర్తి నిండిపోయింది. అక్టోబర్ 18వ తేదీన అందరితో కలసి కలకత్తాకు స్వామీజీ తిరిగి వచ్చారు. విపరీతమైన చలి, పర్వత ప్రాంత సంచారపు అలసట, చిత్రమైన అనుభవాలు, అనుభూతులు, కారణంగా వారి గుండె వ్యాకోచించింది.


ఉబ్బసం కూడా వారిని బాధించసాగింది. యీ యాత్రతో వారి మనోభావం పూర్తిగా మారిపోయింది. ఆ స్థితిలో స్వామీజీ, శిష్యులకు యిలా తెలియజేశారు.


'ప్రస్తుతం నేను భక్తితో నిండిపోయాను. వయస్సు మళ్ళే కొద్ది జ్ఞానం స్థానాన్ని, భక్తిభావం ఆక్రమిస్తోంది.’


మఠ ప్రతిష్టాపన బేలూరులో జరిగిన తర్వాత కొన్ని నెలలు స్వామీజీవారు సన్యాస శిష్యులకు శిక్షణ జరపటంతో కాలం గడిపారు. ఆ రోజుల్లోనే ఆరోగ్య రక్షణకు వైద్యనాధ్ వెళ్ళి వచ్చారు. తాము ప్రాంభించిన కార్యక్రమాలు పాశ్చాత్యాన ఎలా కొనసాగుతున్నాయో చూచి రావాలనే సంకల్పంతో 1898 సం॥ డిసెంబర్లో పాశ్చాత్య పయనాన్ని గురించి వెల్లడి చేశారు. 1899 సం॥ జూన్ 20వ తేదీన తురీయానందస్వామి, సోదరి నివేదితతో స్వామీజీ రెండవసారి పాశ్చాత్యానికి

ప్రయాణమయ్యారు.


నౌక తుఫానులతో కూడిన గాలితో, సముద్రంలో పయనించవలసి వచ్చినందున, లండన్ చేరటానికి 42 రోజులు పట్టింది. స్వామీజీ.. లండన్ నగరంలో రొండు వారాలు వుండి, ఆగష్ట్ 17వ తేదీన బయలుదేరి 28వ తేదీన న్యూయార్క్ చేరుకొన్నారు.


అభేదానందస్వామి అక్కడ వేదాంత ప్రచార నిర్వహణ బాగా చేయడం, స్వామీజీకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. అనారోగ్య కారణంగా ఎక్కువ ప్రసంగాలు చేయలేకపోయారు. రిటోబ్లీ అనే గ్రామ పరిసరాల్లో విశ్రాంతి తీసుకొన్నారు.


ఒకనాడు స్వామీజీ అభేదానందస్వామిగారితో యిలా అన్నారు. “చూడు సోదరా.. !నా ఆయుర్ధాయం చాలా తక్కువ. మహా ఐతే యిక మూడు నాలుగేళ్ళ కంటే ఎక్కువ కాలం బతకనని తోస్తూ వుంది. ”


బదులుగా ఆ స్వామి.. “మీ నోటినుండి యిలాంటి మాటలు వెలువడకూడదు. మీరు తలపెట్టిన కార్యం బాగా యిప్పుడిప్పుడే రూపుదిద్దుకొంటూ వుంది. మీరు మాకందరికీ మార్గదర్శకులుగా నూరేళ్ళు వుండాలి. ” సవినయంగా పలికారు అభేదానందస్వామివారు.

జవాబుగా స్వామీజీ.. “నువ్వు నన్ను అర్థం చేసుకోలేక పోతున్నావు సోదరా.. ! నేను చాలా పెద్దవాణ్ణి అవుతున్నట్లు నాకు తోస్తూ వుంది. నా ఆత్మ ఎంత విస్తృత మవుతున్నదంటే యిక యీ దేహం దాన్ని భరించజాలదని తోస్తూ వుంది. యీ ఎముకల గూడు నన్ను ఎక్కువరోజులు భరించలేదు. ” నవ్వుతూ పలికారు.


స్వామీజీని మిత్రులు, హితులు, దర్శించే వారు, వారి సందేహాలకు, ప్రశ్నలకు వివరణను తెలిపేవారు, మూడు నెలలు యిలా న్యూయార్క్ రిట్ జ్లీలలో గడపి, నవంబర్ 22వ తేదీన కాలిఫోర్నియాకు బయలుదేరారు. దారిలో ఒక వారం షికాగోలో ఆగారు.

అనారోగ్యంగా వున్నా సంకల్ప బలంతో, ఆరు నెలలు ఆయా ప్రాంతాల్లో వేదాంత ప్రచారం చేశారు. స్వామివారి యీ రెండవ పర్యటనలో అమెరికాలో వారికి బ్రహ్మచారి గురుదాస్ ఎంతో సన్నిహితులైనారు. వారి నిరాడంబరతకు ఎంతగానో ఆశ్చర్యపోయారు. స్వామివారికి అత్యంత సన్నిహితులైనారు.

స్వామీజీవారి సాన్నిధ్యంలో తనకు కలిగిన అనుభవాలను గురించి బ్రహ్మచారి గురుదాస్ యిలా వ్రాశారు.


"స్వామీజీ నిరాడంబర స్వభావం కలవారు. ప్రవర్తనతో వారు మాలో ఒకరిగానే నాకు కనిపించారు. అందరి మాదిరి గదిలో నడిచారు. నేలమీద కూర్చున్నారు. పరిహాసాలాడుతూ, మాట్లాడుతూ, నవ్వుతూ, అందరితో కలసి మెలసి సామాన్యులుగానే ప్రవర్తించారు.


“కానీ.. వేదికమీద నిలబడినప్పుడు వారిలో కలిగే హఠాత్పరివర్తన వర్ణనాతీతం. ఎంత మహనీయత, ఎంత పౌరుషత్వం, ఎంతటి వ్యక్తిత్వం, ఏమిటా వాగ్దాటి, వారిని యితరులతో పోల్చి చూస్తే, వారు వీరి ముందు గమనార్హులుగానే కనుపించరు. వారి యొక్క యీ ఘనతకు, ప్రత్యేకతకు, కారణం నా ఊహకు అందని విషయం, శేషప్రశ్న.


స్వామీజీలో అనంతమైన 'శక్తి' ఏదో వున్నట్లు నాకు గోచరించింది. వారు తలచిన స్వర్గ నరకములను కూడా తలక్రిందులు చేయగలరని నాకు తోచింది. ఈ ప్రగాఢ శాశ్వత అభిప్రాయం వారిపట్ల నాకు కలిగింది.


స్వామివారి సుప్రసంగాన్ని వింటున్న శ్రోతలలో కొందరు లేచి బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నించిన కొందరు, వారు స్వామివారి భావాలను అంగీకరించుట వలననో, లేక ఏదో అజ్ఞాత శక్తి ప్రేరణ వలననో, తమ భావన విషయంలో తికమక పడటం వల్లనో, మరలా వచ్చి కూర్చొని మంత్ర ముగ్ధులై స్వామివారి ప్రసంగాలను ఆలకించేవారు.


'అద్వైత వేదాంతాన్ని జనసామాన్యానికి బోధించరాదని, భారతదేశంలో నాతో కొందరు అన్నారు. కానీ.. పనివాడు సైతం అర్థం చేసుకొనే రీతిగా, నేను బోధించగలను. మహోన్నత సత్యాలను చక్కగా బోధించటం మొదలు పెట్టడానికి సరైన సమయం పసితనమే. యీ అద్వయిత వేదాంతాన్ని మానవులందరూ గ్రహించవలయునని నా అభిప్రాయము. ' తన ఉపదేశ సారాన్ని, సత్సంకల్పాన్ని

ఆ రీతిగా స్వామీజీ విశదీకరించారు.

1900వ సం|| ఏప్రిల్లో షాన్ ఫ్రాన్సిస్కోలో వేదాంత కేంద్రాన్ని, లాస్ ఏంజిల్స్, పసదెనా, ఓర్లాండ్, అలమెడా నగరాల్లో అధ్యయన సంఘాలను నెలకొల్పారు స్వామీజీ. ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలమైన 160 ఎకరాల విస్తీర్ణమైన 'శాంతి' ఆశ్రమాన్ని కాలిఫోర్నియాలోని లోయలో నెలకొల్పే కార్య భారాన్ని తురీయానందస్వామికి అప్పగించి, మే 30వ తేదీన కాలిఫోర్నియాను విడచి న్యూయార్క్ బయలుదేరారు.


తమ వుపన్యాసాల ప్రచురణ నిమిత్తం, న్యూయార్క్

ఒకటిన్నర నెలలు స్వామి వారు పరిశ్రమించారు. జూలై 26వ తేదీన పారిస్ కు బయలుదేరారు.


వైదిక మత ఉద్భవం, సాలగ్రామ, శివలింగాల పూజా పద్ధతులను గురించి అక్కడివారు ప్రసంగవలసినదిగా స్వామీజీ కోరారు. వారి కోర్కె ప్రకారం వుపన్యాసాలను

కొనసాగించారు. యీ సమయంలో ఫ్రెంచ్ చరిత్ర, సంస్కృతులను అధ్యయనం చేశారు. వీటిని గురించి తమ అమూల్య అభిప్రాయాన్ని స్వామీజీ ప్రాచ్యం-పాశ్చాత్యం, ఐరోపా యాత్ర అనే రచనలలో విశదీకరించారు.


పారీస్ లో మూడు నెలలు గడిపాక ఐరోపా ఖండాన్ని సందర్శించడానికి, లోయిసస్ దంపతులు, జూల్స్ బోయిస్, ప్రఖ్యాత గాయని మాడమ్ కాల్వే, కుమారి మాక్లియోడ్లతో కలసి 1900 సం॥ అక్టోబర్ 24వ తేదీన స్వామీజీ బయలుదేరారు.

హంగేరి, సెర్బియా, రుమేనియా, బల్గేరియా, గ్రీసు, ఈజిప్టు, కైరో సందర్శించారు. కైరోలో వుండగా తన ప్రియశిష్యుడు సెవియర్ యిక ఎక్కువ రోజులు బతకడని వారి మనస్సుకు స్ఫురించింది. వెంటనే భారతదేశానికి తిరిగి రావడానికి నిశ్చయించుకొన్నారు.


1990 సం॥ నవంబర్ 26వ తేదీన ఓడ ఎక్కి డిసెంబర్ 6వ తేదీన బొంబాయికి చేరారు. రైలు ఎక్కి 9వ తేదీ రాత్రి బేలూరు మఠం చేరుకొన్నారు. హఠాత్తుగా స్వామీజీని చూచి, సాధువులందరూ ఆశ్చర్యానందాలతో పరవశులయ్యారు. స్వామీజీ వారినుండి కొద్దిరోజుల క్రింద జరిగిన సెవియర్ మరణవార్త విని ఎంతగానో విచారించారు.


శ్రీమతి సెవియర్ ను అనునయించే దానికి స్వామీజీ 27వ తేదీన మాయావతికి బయలుదేరారు. 1901వ సం॥ జనవరి 3వ తేదీన మాయావతి చేరారు. కొండల బాట గుండా జరిగిన ఆ ప్రయాణంలో మంచు, వర్షం, వడగళ్ల మూలంగా ఆలస్యమయింది.


1899వ సం|| మార్చి నెలలో ఆ ప్రాంతంలో ఏర్పరచిన అధ్వయిత ఆశ్రమ బాధ్యతలను, తన ప్రియ శిష్యుడు స్వరూపానందస్వామికి ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను

అప్పగించారు. పూజాది తంతుతో కూడిన భక్తి మార్గాన్ని వీడి కేవలం అద్వైత సాధన కోసం, ఆ ఆశ్రమం నెలకొల్ప బడింది.


‘అద్వైత జ్ఞానం మాత్రమే మనిషికి సంపూర్ణ అధికారాన్ని

ప్రసాదించగలుగుతుంది. బాధలను భరించకలిగే శక్తిని, కార్యసాధనా శక్తిని ప్రసాదించి, చివరకు మనిషికి పరిపూర్ణ స్వాతంత్ర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ అద్వైతం అన్ని రకాల మూఢవిశ్వాసాల నుండి బలహీనతల నుండి అతీతంగా

ఆచరింపబడుతూ, కేవలం పరిపూర్ణమైన ఐక్యతా సిద్ధాంతం మాత్రమే యిక్కడ బోధింపబడుతుంది.


ఆచరించబడుతుంది. అద్వైతానికి మాత్రమే యీ ఆశ్రమం అంకితం. ఇది ఆ ఆశ్రమాన్ని గురించిన స్వామీజీవారి ప్రబోధం. ఆ ఆశ్రమవాసులైన శిష్యులకు, ఇక్కడక్, ధ్యానం, శాస్త్రపఠనం, అద్వైత ప్రచారం మాత్రమే జరగాలని ఆదేశించారు. ఆ ఆశ్రమంలో శ్రీరామకృష్ణ పరమహంస గారి మూర్తిని మాత్రం వుంచేదానికి స్వామీజీ వారు అంగీకరించారు. వారు స్వామీజీ వారి గురుదేవులు కదా.. !


1901వ సం|| జనవరి 13వ తేదీ నాటికి స్వామీజీకి 38 సంవత్సరములు పూర్తయ్యాయి. 18వ తేదీన మాయావతిని వీడి 24వ తేదీన బేలూరు చేరుకొన్నారు.


తన సోదర శిష్యులైన బ్రహ్మానంద, ప్రేమానంద, శివానంద,

శారదానంద, అఖండానంద, త్రిగుణాతీతానంద, రామకృష్ణానంద, అద్వైతానంద, సుబోధానంద, అభేదానంద, తురీయానందలను ధర్మాధికారులుగా

నియమించి, అంతవరకూ తన పేరున వున్న మఠ ఆస్తిపాస్తులను వారి ఆధీనంలోకి మార్పించారు.


తనకు అనారోగ్యంగా ఉన్నా, భక్తుల సాదర ఆహ్వానాన్ని మన్నించి, ఢాకా(బంగ్లాదేశ్)కు బయలుదేరారు. తోటి మానవ సోదరులకు సహకరించాలనే ఉద్దేశ్యంతో, ఆరోగ్య స్థితిని లెక్క చేయకుండా ఢాకాలోనూ, షిల్లాంగ్లోనూ, అనేక సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఎంతో శాంతి సహనాలతో దర్శకుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానలను యిచ్చారు.


చంద్రనాథ్, కామాఖ్య, దేవభోగ్ నగరలను దర్శించారు. తీవ్రమైన మధుమేహవ్యాధితోనూ, ఉబ్బసంతోనూ బాధపడుతూ స్వామీజీ మే 12వ తేదీన మఠానికి తిరిగి వచ్చారు.


మాతృదేవి సన్నిధిలో శాస్త్రోక్తంగా బ్రహ్మాండంగా దుర్గామాయి పూజను జరిపించారు. డిసెంబర్లో కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది.


యీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, బాలగంగాధరతిలక్ స్వామీజీవారిని చూడదలచి మఠానికి వచ్చి, వారిని

సందర్శించారు. ప్రసంగించారు.


1902వ సం|| జనవరి 6వ తేదీన జపాన్ నుంచి కుమారి మాక్లియోడ్ ఓకకూరా స్వామీజీని సందర్శించ వచ్చారు. లోగడ ఓకకూరా స్వామీజీవారికి తమ దేశానికి రావలసినదిగా ఉత్తరాల ద్వారా అభ్యర్థించారు. స్వామీజీ కూడా ఈ సారి నేరుగా వచ్చి వారు కోరిన కోర్కెను ఆమోదించారు. కానీ.. వైద్యులు వారు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ఎక్కడకూ కదలకూడదని గట్టిగా నిషేధించారు.

యదార్థంగా స్వామీజీ జపానుకు వెళ్ళి, అక్కడినుండి చైనా మీదుగా అమెరికా వెళ్ళదలచుకొన్నారు. వైద్యుల సలహా మేరకు ఆ సంకల్పాన్ని, విరమించుకొన్నారు.


భారత దేశంలో బౌద్ధుల పవిత్ర తీర్ధాలను, దర్శించాలన్న విషయాన్ని ఓకకూరా స్వామీజీతో చెప్పారు. 1902వ సం॥ జనవరి 29వ తేదీన స్వామీజీ 39వ జన్మదినం.


అనుమాయులతో, ఓకకూరాతో.. కలసి వారు గయకు

చేరుకొన్నారు. యిదే వారి చిట్టచివరి తీర్థయాత్ర. స్వామీజీ శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవుల శిష్యరికం చేసే రోజుల్లో దర్శించిన మొట్టమొదటి పుణ్య తీర్థం కూడా యిదే క్షేత్రం.


గయ నుండి బుద్ధగయకు శిష్యులతో కలిసి వెళ్ళారు. అక్కడ హిందూ మహంత్ గారి అతిధిగా వారంరోజులు గడిపారు. అక్కడినుండి వారణాసికి బయలుదేరారు.


అక్కడ కొందరు యువకులు కలిసి 'దీనజన నివారణ సంఘం' పేరిట చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఆ సమాజానికి స్వామీజీ 'శ్రీ రామకృష్ణ సేవాశ్రమం' అనే కొత్త పేరును పెట్టారు. కాలాంతరంలో ఆ సేవాశ్రమం శ్రీరామకృష్ణమిషన్ సేవాశ్రమంగా రూపుదిద్దుకొంది.


మార్చి 8వ తేదీన స్వామీజీ బేలూరు మఠానికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఒక కన్ను చూపును కోల్పోయింది. ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు

మహానందసేన్ గుప్త స్వామీజీకి చికిత్స చేశారు. మండు వేసవిలో రోజుకు ఎన్నోమార్లు నీళ్ళు త్రాగే అలవాటువున్న స్వామీజీ సేన్ గుప్తగారి సలహా మేరకు, వారు నిర్దేశించిన

విధంగా ఉప్పును, నీటిని త్యజించారు.


21 రోజులు నీటిని త్రాగలేదు. నీటితో నోరు పుక్కిలించినప్పుడు కూడా, ఒక్కచుక్క నీరు గొంతులో క్రిందికి దిగకుండా నోటి కండరాలు మూసుకుపోయేవి. శిష్యులు యీ స్థితిని చూచి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినప్పుడు "మనస్సులో దృఢంగా నిశ్చయించుకొన్నప్పుడు, శరీరం దాన్ని

అనుసరించి తీరాలి. " నవ్వుతూ స్వామీజీ.. జవాబు చెప్పేవారు.

=================================================================================

ఇంకా ఉంది..

=================================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

26 views0 comments
bottom of page