top of page

ప్రగతి ప్రేమికులు 6


'Pragathi Premikulu episode 6' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma

'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ:


బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు అతడు.


శ్రీ వివేకానంద స్వామీజీ అసలు పేరు నరేంద్రుడు.

శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యుడుగా మారారు.


1893 వ సంవత్సరం చికాగో నగరంలో సర్వమత మహాసభలో పాల్గొన్నారు. అమెరికన్లను బాగా ప్రభావితం చేశారు. స్వామీజీకి తన నౌకాగృహంలో మహా విచిత్రమైన భావన, అనుభూతి కలిగాయి.


1902 నాటికి స్వామీజీ రోగ్యం బాగా దెబ్బ తింది.

1902వ సం: జూలై 4వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీ వివేకానందస్వామీజీ మహా సమాధి పొందారు.

స్వామిజీ కథను చదవడం పూర్తి చేసాడు యస్.ఐ. వివేకానంద.


తమ్ముడు విజయానంద ని కలుస్తాడు.

తాము కలుసుకున్న విషయాన్ని గోప్యంగా ఉంచమని తమ్ముడికి చెబుతాడు.



ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 6 చదవండి..


"హాల్లో అందరూ కూర్చోవడానికి అరేంజ్ చేయండి. కోటయ్యగారూ..!" అని చెప్పాడు వివేకానంద.


"అలాగే సార్. పది నిముషాల్లో అయిపోతుంది.” చెప్పి కోటయ్య వెళ్ళిపోయాడు.


వివేకానంద కుర్చీనుంచిలేచి, ఆఫీస్లోని అన్ని గదులను, ఆఫీస్ వెనక వున్న ఖాళీ స్థలాన్ని, ముందున్న పరిసరాలను వీక్షించాడు. గదుల్లో ఫైల్సు క్రమంగా అమర్చి లేవు. వెనక వున్న ఖాళీ స్థలంలో నలిపిపారేసిన కాగితాలు ప్లాస్టిక్ కవర్లు, గడ్డి ఏకంగా వున్నాయి. తనకు ముందున్న పరంధామ్ ఆఫీస్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకొన్నదీ అతనికి అవగాహన అయింది.


వెనుదిరిగి హాల్లోకి వచ్చాడు. అందరూ నిలబడి వున్నాడు. వున్న కుర్చీలు, బెంచీలు హాల్లో చేర్చబడ్డాయి. తను ఒక కుర్చీలో కూర్చుంటూ...

“అందరూ కూర్చోండి.” అన్నాడు వివేకానంద.


అందరూ కూర్చున్నారు. అందరి కళ్ళూ వివేకానంద మీదే. హెడ్ కానిస్టేబుల్, వివేకానంద ప్రక్కగా నిలబడ్డాడు. అతన్ని చూచి, “మీరు కూర్చోండి సార్” అన్నాడు.


వెనక వున్న స్టూలు మీద కోటయ్య కూర్చున్నాడు.


“ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీకందరికీ తెలిసినవే. మీలో చాలామంది నాకంటే పెద్దవారు. ముందుగా అందరూ మీ పేర్లను చెప్పండి."


అందరూ వారివారి పేర్లను చెప్పారు.


“చాలా సంతోషం మనమందరం ఇకపై కలసి పని చేయబోతున్నాము. మనమధ్య చక్కటి అవగాహన అవసరం. ఇది మీకు తెలిసిందే. యీ ఆఫీస్ పరిసరాలు ఎలా వున్నాయో చూసారా..! మన చుట్టూ వున్న పరిసరాలను శుభ్రంగా వుంచుకోవడం మన బాధ్యత. మనం పబ్లిక్ సర్వెంట్లం. ఎందరో వస్తూ పోతూ వుంటారు. ఇప్పుడు ఆఫీస్ వెనక వున్న స్థితిని చూచి వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించండి. గదుల్లో ఫైల్సు గందరగోళంగా వున్నాయి. వాటినన్నింటిని క్రమంగా ఏది కావాలన్నా వెంటనే తీసుకొనగలిగేలా అమర్చుకోవడం ఎంతైనా అవసరం.

ఇక డ్యూటీ విషయంలో సమయానికి విలువనివ్వాలి. విధి నిర్వహణలో తనమన బేధాలు వుండకూడదు.


లంచాలను ఆశించకూడదు. నీతికి, న్యాయానికి

కట్టుబడి వుండాలి. జనం మన చర్యలకు సంతోషపడాలి.

పుట్టిన ప్రతి వ్యక్తి ఒకనాడు పైకి పోవలసిందే. మనం పోయినా, మన చుట్టూ వున్న జనం మనలను గురించి మంచిగా చెప్పుకొనే రీతిగా నడచుకోవడం నాకు ఇష్టం.

నా తత్వాన్ని మీకు చెప్పాను. మనమందరం కలసి పనిచేయాలి కాబట్టి. ఇక మీరంతా నాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇక మీరంతా మీ డ్యూటీని అటెండ్ చేయండి. జైహింద్, జై ఆంధ్రా." వివేకానందలేచి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.


వెనకాలే కోటయ్య వచ్చి, టేబుల్ కుడివైపున వున్న ఫైల్సును చూపిస్తూ, “మీరు వాటిని చూచి అవసరం అయితే నన్ను పిలవండి సార్.” వినయంగా చెప్పాడు కోటయ్య.


“అలాగే కోటయ్యగారూ!...”


కోటయ్య వెళ్ళిపోయాడు. మిగతా అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు.


ఫోన్ మ్రోగింది. వివేకానంద చేతికి తీసుకొన్నాడు.


“సార్... చెరువు కట్ట దగ్గర నలుగురు సారాయి తాగి చచ్చిపడున్నారు సార్.” ఎంతో ఆందోళనగా చెప్పాడు ఆ వ్యక్తి.


“మీ పేరు..?"


"ముత్యాలు.”


“ఎక్కడ వున్నావు?”


చెరువు కట్టకు ఎల్లేదార్లో టీ బంకు దగ్గరండే..! యీ ఫోను ఆ టీ బంకాయనదేనండే..!" విచారంగా చెప్పాడు.


“నీవు అక్కడే వుండు. నేను వస్తున్నాను.”


కుర్చీనుంచి లేచి “కోటయ్యగారూ..!" గట్టిగా పిలిచాడు వివేకానంద.


కోటయ్య పరుగున వచ్చాడు. విషయాన్ని అతనికి చెప్పి, ఇద్దరు పోలీసులతో కలసి ఆ స్పాట్ కు బయలుదేరాడు వివేకానంద.


టీ బంకు ప్రాంతానికి చేరేటప్పటికి అరగంట పట్టింది. వీరు అక్కడికి చేరేటప్పటి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ ఏకాంబరం నలుగురు పోలీసులతో వీరిని కలిశాడు. అందరూ చెరువు కట్ట దగ్గిరికి చేరారు. శవాలను వీక్షించారు. వివేకానంద

అప్పటికే అక్కడ చేరిన జనాన్ని దూరంగా వెళ్ళమని చెప్పి ఫోటోలు తీశాడు. ఎనిమిది సారా బాటిల్సు ఆ శవాల ప్రక్కన పడి వున్నాయి.


అక్కడ చేరివున్న వారిలో శవాల తాలూకు మనుషులూ వున్నందున వారి పేర్లను, కుటుంబ వివరాలను సేకరించి, శవాలను పోస్టుమార్టమ్ కు పంపించేశారు పోలీస్ సిబ్బంది.

అక్కడి వాతావరణాన్ని చూచిన వివేకానందకు వారు త్రాగిన సారాయిలో పాయిజన్ కలిసి వుండవచ్చు అనే అనుమానం కలిగింది. ఆ విషయాన్ని ఏకాంబరంతో చెప్పాడు.


“మీరన్నది నిజమే అయ్యుంటుంది సార్.” వివేకతో ఏకాంబరం ఏకీభవించాడు.


రొండు రోజుల తర్వాత వారి యిండ్లకు వెళ్ళి, చనిపోయిన వారికి ఎవరితోనైనా గొడవలేమైనా వున్నాయా..! అనే వివరాలు సేకరించి, తనను కలవమని చెప్పి స్టేషన్ కు వెళ్ళిపోయాడు వివేకానంద.

***


ఇది ఎవరిల్లు మామా..!”


“ఒరే..! నీకు తెలవదా..! ఇది మాజీ యం.ఎల్.ఏ. ధనుంజయరావుగారి భవంతిరా!...”


“ఈ కార్లేంది..! యీ జనం ఏంది మామా..!"


“ఓరే పిచ్చినాయాలా..! ధనుంజయగారి కొడుకు అమెరికాలో డాక్టర్ గా చదువుకొని వచ్చినాడంట. ఆ కారణంగా ధనుంజయగారు తన పార్టీ వాళ్ళకందరికీ

విందు భోజనాలు ఏర్పాటు చేసినాడంట.”


“మామా..! మనం లోపలికి పోతే...”


“యీది కుక్కను కొట్టినట్టు కొట్టి బయటికి తరిమేస్తరు.” పకపకా నవ్వాడు కోటిగాడు.


కోటిగాడి ముఖంలోకి చురచుర చూచాడు వెంకటేసు.


వెంకటేసు, కోటిగాడు యాచకులు. పది యిళ్ళల్లో యాచించి, ఆ యిండ్ల తల్లులు పెట్టిన మెతుకులను ఓ చెట్టుక్రింద కూర్చొని తిని, కుళాయి నీళ్ళు తాగి, రైల్వేస్టేషన్ దగ్గర వున్న వేపచెట్టు క్రింద రాత్రిళ్ళు పడుకొంటారు.


“ఇక పదరా..! మన పని మనం చూచుకొందాం." అన్నాడు కోటిగాడు.


వెంకటేసు నిట్టూర్చి... “సరే మామ పద.” అన్నాడు.

ఇరువురూ యాచకానికి చెరో వీధిలో ప్రవేశించారు.


ధనుంజయరావు తన కుమారుడైన త్రివిక్రమరావును తన పార్టీ మెంబర్సుకు అందరికీ పరిచయం చేశాడు.

తను ఓడిపోయి, ఎలక్షన్ గెలిచిన ఏకాంబరం మరణించడంతో, బై ఎలక్షన్ త్వరలో రానున్నందున ఆ ఎలక్షన్లో తన కొడుకు త్రివిక్రం పోటీ చేయబోతాడని, అందరూ అతనికి మద్దతును యివ్వాలని, గెలిపించాలని

తెలియజేశాడు. అందరూ ఏకకంఠంతో త్రివిక్రమరావు పేరును ఘోషిస్తూ జేజేలు పలికారు.తర్వాత అందరూ కలసి మందును, విందును కబుర్లతో ఆరగించారు.


త్రివిక్రంకు తండ్రి నిర్ణయం, ఆయన చేసిన ప్రకటనా నచ్చలేదు. యం.బి.బి.యస్ చదివి, యం.స్. స్టేట్సులో చేసి వచ్చిన తనకు రాజకీయాల్లో దిగడం యిష్టం లేదు. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకొని నడపాలన్నది అతని వుద్దేశ్యం. పేదలకు ఉచిత సేవ చేయాలని అతని నిర్ణయం. అందరి ముందూ తండ్రి మాటను కాదనడం సభ్యత కాదని మౌనంగా వుండిపోయాడు. రాజకీయాల్లో దిగితే తను కొందరికి హితుడు, ఎందరికో అహితుడు. అందరికీ ఆశలు వుంటాయి. అందరి కోర్కెలను తీర్చేదానికి, తృప్తి పరిచేదానికి సామర్థ్యం, ఏ రాజకీయ నాయకునికీ వుండదు.


కష్టపడి చదివినందుకు తనకు గల జ్ఞానాన్ని తన ఇష్టానుసారంగా, ధర్మబద్ధంగా పదిమందికి మంచిని చేసే రీతిగా వర్తించడంలో ఎంతో ఆనందం వుంటుంది. సముద్రాలు దాటి వెళ్ళి, లక్షలు కోట్లు సంపాదించాలనే ఆశ తనకు లేదు. తనకున్న పరిజ్ఞానాన్ని, తన వారికి, తన దేశానికి ఉపయోగపడేలా నడుచుకోవాలన్నది అతని ఆశయం. కుగ్రామ వాసులకు ఉచిత రీతిగా సేవ చేయాలనేది అతని సంకల్పం.


కానీ..! తండ్రి నిర్ణయం తన భావనలకు పూర్తి వ్యతిరేకం. మనస్సు మెచ్చని మార్గంలో తను నడువలేడు. తండ్రికి రాజకీయ వారసుడుగా తన తమ్ముడు ఉపేంద్ర వున్నాడు. తన నిర్ణయాన్ని మరుదినం వివరంగా తండ్రికి చెప్పాలని

నిర్ణయంచుకొన్నాడు త్రివిక్రం.


మరుదినం ఉదయం ధనుంజయరావు, త్రివిక్రం, ఉపేంద్ర, డైనింగ్ టేబులు ముందు కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. తల్లి రాజేశ్వరి వడ్డిస్తూ వుంది. తన నిర్ణయాన్ని తండ్రికి తెలియజేయడానికి ఇదే మంచి సమయం అన్న

నిర్ణయానికి వచ్చిన త్రివిక్రం..


“చెప్పరా పెద్దోడా..!” భార్యవంక చూచి, "రాజా!... కొంచెం ఆ ఎఱ్ఱకారం ఎయ్యి.” అన్నాడు ధనుంజయ.


రాజేశ్వరి కారాన్ని అతని ప్లేట్లో వేసింది.


త్రివిక్రం తండ్రి ముఖంలోకి చూచాడు. కారాన్ని అతిగా తింటూ వున్నందువల్ల ముఖమంతా చమట, పై పంచెతో ముఖాన్ని తుడుచుకొని త్రివిక్రం వైపు చూచి…


"నీ మనస్సులో వుండేదేందో చప్పరా..!” అన్నాడు. ధనుంజయరావు.


"నాన్నా..! నాకు మీ రాజకీయాలంటే ఇష్టం లేదు.” చెప్పి, తల్లి ముఖంలోకి సహాయాన్ని అర్థిస్తున్నట్లు చూచాడు.


ధనుంజయరావు త్రివిక్రం అన్న మాటలకు ఆశ్చర్యపోయాడు. కోపాన్ని అణచుకొని నవ్వుతూ.. "అయితే వేరే ఏం చేయాలనుకొంటుండావ్..?"


“అమ్మ పేరున హాస్పటిల్ను పెడతాను.”


"ఏడ..?"


“ఈ వూర్లోనే నాకు సాయంగా నా స్నేహితుడు శివానంద్ వుంటాడు, వాడు నాతో కలసి పని చేస్తాడు." చెప్పాడు త్రివిక్రం.


“రాత్రి నేను అందరి ముందూ నా కొడుకు నా రాజకీయ వారసుడని చెబతావుంటే, అప్పుడు ఈ మాటెందుకు చెప్పలేదురా..!" కోపంగా అరిచాడు ధనుంజయరావు.


“ఇది నా సొంత విషయం. వాళ్ళందరికీ తెలియజేయడం అనవసరం కాబట్టి చెప్పలేదు.” తన నిశ్చితాభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పాడు త్రివిక్రం.


“వాణ్ణి వాడి ఇష్టానుసారం… ”రాజేశ్వరి ఏదో చెప్పబోతూ వుండగా…


"నీవు నోరుముయ్యి. నీకేం తెలుసే వాడికి సంబంధించిన విషయంలో ఏది మంచో... ఏది చెడ్డో..!” గర్జించాడు ధనుంజయ.


ఆమె ఆ సింహ గర్జనకు బెదిరిపోయింది. ఇరవై ఎనిమిది సంవత్సరాల వారి దాంపత్య జీవితంలో రాజేశ్వరికి వాక్స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది.


ధనుంజయరావు అర్ధాంగిని, పెద్దోణ్ణి పురుగులను చూచినట్లు చూచాడు.


“వాడి యిష్టంలేకపోతే వాడి దారిన వాణ్ణి పోనీ నాయనా…!

నేనున్నానుగా…! నీవు చెప్పినట్టు నడుచుకొనేదానికి.” గర్వంగా అన్న వంక చూస్తూ చెప్పాడు ఉపేంద్ర.


“ఆ విషయం నాకు తెలుసురా చిన్నోడా..!" నవ్వాడు ధనుంజయ.


“నా నిర్ణయాన్ని మీకు తెలియజేశాను. ఉపేంద్ర వాడి నిర్ణయాన్ని తెలియజేశాడు. మా ఇద్దరిలో ఎవరో ఒకరు మీకు రాజకీయ వారసులు అవుతున్నందుకు సంతోషించండి. అనవసరంగా ఆవేశపడకండి నాన్నా.” కుర్చీ నుంచి లేచి వేగంగా బేసిన్ వైపుకు నడిచాడు త్రివిక్రం.


చిన్నతనంనుంచీ త్రివిక్రం... మొండితత్వాన్ని ఎరిగిన ధనుంజయరావు చేసేది లేక మౌనంగా వుండిపోయాడు.


***

"ఎవరు ఈ దారుణానికి మూల కారకులు మిస్టర్ ఏకాంబరం..?


ఒకటా..! రొండా..! నాలుగు ప్రాణాలు. నాలుగు కుటుంబాలు పెద్దలను కోల్పోయాయి. ఒకతనికి ముగ్గురు పిల్లలు, రెండవ వ్యక్తికి ఐదుగురు పిల్లలు, మూడో వ్యక్తికి నలుగురు సంతాం, అందరూ ఆడపిల్లలే..! నాల్గవ అతనికి మాత్రం ఇద్దరు మొగ సంతతి. వీరంతా పేదవారే..! ఆ తల్లులను ఓదార్చేదెవరు..?

ఆ చిన్న పిల్లలకు భవిష్యత్తును కల్పించేదెవరు..? వారిని తలుచుకొంటే, మనస్సుకు చాలా బాధగా వుంది మిస్టర్ ఏకాంబరం. రాక్షస ప్రవృత్తికీ,అమానుషత్వానికీ, ఇది నిదర్శనం.


ఆ నేరస్థులను పట్టుకోవాలి. వారికి తగిన శిక్ష పడేలా చూడాలి. ఇది మన కర్తవ్యం. మీరేమంటారు..?” ఆవేశంతో అడిగాడు వివేకానంద.


“తప్పకుండా త్వరలో పట్టుకొంటాం సార్..! మీ ఫీలింగ్ నాకూ అర్థం అయింది సార్ కానీ..!"


"కానీ..! ఏమిటి మీ సందేహం..?”


“యిందులో... నా యంక్వయిరీ ప్రకారం ధనుంజయరావుగారి చిన్నకొడుకు ఉపేంద్ర యిన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది సార్.”


“ధనుంజయరావు ఎవరు?...”


"మాజీ యం.ల్.ఎ. సార్.”


“ధనుంజయరావు...” మెల్లగా చెప్పి, సాలోచనగా కళ్ళు మూసుకొన్నాడు. ఆ వ్యక్తి తన పినతండ్రి, తన మామ ఆదిశేషయ్య చెప్పిన మాట గుర్తుకు వచ్చింది.


"అయితే మీరేం చేయాలనుకొంటున్నారు..?" శాంతంగా అడిగాడు వివేకానంద.


“వారిని వ్యతిరేకిస్తే మనం యిక్కడ వుండలేము సార్..!” విచారంగా చెప్పాడు ఏకాంబరం.


వివేకానంద నవ్వాడు. “ఉద్యోగికి దూరభూమి అంటూలేదు. పెద్దల యీ నానుడిని వినలేదా మీరు..? ట్రాన్స్పర్కు భయపడి తెలిసిన నిజాన్ని అబద్ధంగా మార్చాలను కొంటున్నారా మీరు..?" నిశితంగా ఏకాంబరం కళ్లల్లోకి చూస్తూ అడిగాడు వివేకానంద.


“సార్..! నేను చెప్పేదేమిటంటే..!”


“చాలు. ఇక శ్రమపడి మీరు ఏమీ చెప్పకండి. నేను చెప్పింది చేయండి. ఉపేంద్ర పేర వారంట్ కు అప్లయి చేసి, దాన్ని తెచ్చి నాకు యివ్వండి. నేను ఉపేంద్రను అరెస్టు చేస్తాను.”


ఏకాంబరం మెల్లగా చెప్పబోయింది పూర్తికాక మునుపే, తన నిర్ణయాన్ని వివరంగా తెలియజేశాడు వివేకానంద.


“అలాగే సార్.. ఇక నే వెళతాను.” కుర్చీ నుంచి లేచి చెప్పాడు ఏకాంబరం.


“మంచిది. ఆ.. ఒక్కమాట! నేరస్థులకు భయపడి మనం వేసుకొన్నఈ కాకీబట్టలకు కళంకం వచ్చే ఏ ఆలోచననూ మనస్సులోకి రానీకండి. అలాచేస్తే మనలను మనమే మోసగించుకొన్న వాళ్ళం అవుతాం. నిర్భయంగా వెళ్ళిరండి. మీ వెనక నేనున్నాను. యస్.ఐ. ఏకాంబరంగారు భయపడకండి” అన్నాడు వివేకానంద. సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు ఏకాంబరం.


వివేకానంద, హెడ్ కానిస్టేబుల్ కోటయ్యను పిలిచి, ఉపేంద్ర దినచర్యను, ఏ సమయంలో ఎక్కడ వుంటాడో వివరంగా తెలుసుకొని తనకు చెప్పవలసింది చెప్పి, టెన్నిస్ కోర్టుకు వెళ్ళిపోయాడు.


“ఏయ్... రాజా..! నీ పెద్దకొడుకు తన నిర్ణయాన్ని మార్చుకొన్నాడా..! లేదా..!” గద్దించినట్లు అడిగాడు ధనుంజయరావు.


"లేదు... వాడికి ఇష్టంలేని పనిని చేయమని చెప్పడం మీకు న్యాయమా..?" ఎదురు ప్రశ్న వేసింది రాజేశ్వరి.


“నీవూ వాడికే సపోర్టు చేస్తావుండావన్నమాట..!”


“అవును. వాడు దారిన పోయే దానయ్య కాదు. నా కొడుకు. వాడి యిష్టాఅయిష్టాలను తెలుసుకొని వర్తించడం మన ధర్మం.” తన అభిప్రాయాన్ని తేటతెల్లంగా చెప్పింది రాజేశ్వరి.


“సరే..! పెళ్ళయినా మన ఇష్ట ప్రకారం చేసుకొంటాడంటనా అదీ వాడి యిష్టమేనా..!”


“వాడి పెళ్ళి వాడి ఇష్ట ప్రకారమే జరగాలి. పిల్లని చూపడం మన వంతు. నిర్ణయం తీసుకొనేది వాడి వంతు.”


“అంటే... యిక మీదట వాడికి సంబంధించిన ఏ విషయంలోనూ, నా ఇష్టాఅయిష్టాలతో పనిలేదన్నమాట..!" భార్య ముఖంలోకి కోపంగా చూస్తూ అడిగాడు ధనుంజయరావు.


“అవును.” ఖచ్చితంగా చెప్పింది రాజేశ్వరి.


ఉపేంద్ర వేగంగా హాల్లోకి వచ్చాడు. అతని వదనం ఎంతో ఆందోళనగా వుంది. తండ్రి ప్రక్కన సోఫాలో కూర్చున్నాడు.

“నాయనా..!”


“ఏందిరా చిన్నోడా... చాలా గాబరా గుండావ్..?”


"పరంధామ్ యస్.ఐ మారిపోయాడంట. వాడికి బదులు ఎవరో వివేకానంద అనేవాడు వచ్చాడంట.”


“అట్టాగానా..!”


“అవును.”


రాజేశ్వరిలోనికి వెళ్ళిపోయింది. పెద్దవాడు శ్రీరాముడైతే ఈ చిన్నోడు రావణుడు. అన్నీ తండ్రి పోలికలే. 'అమ్మా..! దుర్గమ్మ తల్లీ ఈ తండ్రీ కొడుకులకు మంచి బుద్ధినివ్వు.' అనుకొంది మనస్సున రాజేశ్వరి.


“ఆ స్టేషన్ నెంబర్ నీ కాడవుందా..!”


“వుంది నాయనా..!”


“ఆ నెంబరు నొక్కి ఆ కొత్త యస్.ఐ ఆఫీస్ వుండాడో లేదో కనుక్కో....”


ఉiపేంద్ర స్టేషన్ నెంబర్ నొక్కాడు. హెడ్ కానిస్టేబుల్ ఫోన్ తీశాడు. కొత్తగా వచ్చిన యస్.ఐ.ని గురించి విచారించాడు. స్టేషన్లో వున్నట్లు తెలిసింది.


“నాయనా..! స్టేషన్లోనే వుండాడంట..!" సెల్ ధనుంజయరావు చేతికి యిచ్చాడు ఉపేంద్ర.


“హలో..!” అది అహంకారంతో కూడిన ధనుంజయ స్వరం.


“ఎవరు మాట్లాడేది..? నేను ధనుంజయరావును...” ఠీవిగా చెప్పాడు.


“సార్..! నమస్కారం... నేను హెడ్ కానిస్టేబుల్ కోటయ్యను సార్....”


"ఫోను మీ కొత్త యస్.ఐ. చేతికీ..!”


వివేకానంద ఏదో ఫైలు చూస్తూ... రింగ్ అయిన ఫోన్ ను కోటయ్యను ఎత్తమన్నాడు.


“సార్...” భయంగా పిలిచాడు కోటయ్య.


“ఎవరు కోటయ్యగారూ..!" ఫైల్ను చూస్తూనే అడిగాడు వివేకానంద.


“ఉపేంద్ర నాన్నగారు ధనుంజయరావు. మీతో మాట్లాడాలంట.” ఆందోళనతో చెప్పాడు కోటయ్య.


వివేకానంద కోటయ్య చేతిలోని ఫోన్ ను అందుకొన్నాడు.

“యస్.ఐ. వివేకానంద. గుడ్ ఈవినింగ్ సార్...”


“నువ్వేనా కొత్తగా వచ్చిన యస్.ఐ.”


“అవును.”


"ఏడనుంచి వచ్చినావో..?"


“రాజమండ్రి.”


“మనల్ని గురించి మీవోళ్ళు చెప్పినారనుకొంటా..!”

నవ్వుతూ... “నా సెల్ ***, నోట్ చేసుకో. ఏదైనా అవసరం వుంటే ఫోన్ చెయ్యి పంపిస్తా. మనలను గురించి స్టేషన్ లో పాతోళ్ళనడిగి తెలుసుకో. ఓ సాయంత్రం ఫోన్ చేసిరా. ఓ రెండు గంటలు ఆనందంగా నాతో గడుపుదువుగాని. సరేనా..!” వికటంగా నవ్వుతూ చెప్పాడు ధనుంజయరావు.


“ప్రస్తుతానికి నాకు ఏ అవసరాలూ లేవు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. థ్యాంక్యూ..." ఫోన్ ను రిసీవర్పై వుంచాడు వివేకానంద.


కోటయ్య ముఖంలోకి చూస్తూ..."కోటయ్యగారూ..!”


“సార్..!”


"మీరు అదోలా అయిపోయారు కారణం..?”


"ఆ మనిషి అంత మంచివాడు కాదుసార్....”


"మీరు ఇక్కడ ఎంత కాలంగా పని చేస్తున్నారు..?”


“నాలుగు సంవత్సరాలుగా సార్..!”


“అంటే వారి గురించి మీకు బాగా తెలుసన్నమాట.’


"కొంతవరకూ తెలుసు సార్..”


“సమయం వచ్చినప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పండి. నేను మీకు అండగా వుంటాను. యిక మీరు వెళ్ళవచ్చు."


“అలాగే. థ్యాంక్యూ సార్..! ” సెల్యూట్ చేసి కోటయ్య వెళ్ళిపోయాడు.


సెల్ మ్రోగింది. నెంబర్ చూచాడు. అది తన గురువుగారి కాల్.


“హల్లో సార్... గుడ్ యీవినింగ్....” ఆనందంగా చెప్పాడు వివేకానంద.


"హవ్ ఆర్ యు వివేక్!...”


"అయాం ఫైన్ సార్... మీరేలాగున్నారు?...”


"నేను... నీ దగ్గరకు వస్తున్నాను.”


"అంటే సార్...”


"నాకు ప్రమోషన్ వచ్చింది. ఆ వూరికి నేను డి.ఐ.జి.గా వస్తున్నాను...” నవ్వాడు త్రిపాటి.


వివేకానందకు ఎంతో ఆనందం. త్రిపాటి క్రింద తను మూడేళ్ళు వైజాగ్ లో పనిచేశాడు. తనలాగే త్రిపాటి ముక్కుకు సూటిగా వ్యవహరించే వ్యక్తి. తను వారికి

ప్రియశిష్యుడు ద్రోణాచార్యులకు అర్జునుని వలె.


"సార్..! చాలా మంచి వార్తను వినిపించారు. నా సంతోషాన్ని మాటలతో చెప్పలేను. కంగ్రాచులేషన్స్ సార్. మరలా మీ క్రింద పనిచేయడం అంటే అది ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం సార్..! ఎప్పుడు వస్తున్నారు..?” ఆత్రంగా అడిగాడు వివేకానంద.


“ఈ రోజు యయిటీన్ కదా..! ట్వంటి ఫోర్తున అక్కడ జాయిన్ అవుతాను.”


“వెల్కమ్ సార్... వెల్కమ్..!”


“పెట్టేస్తున్నా వివేక్..! థ్యాంక్యూ..!” త్రిపాటి కాల్ కట్ చేశాడు.


"త్రిపాటి సార్ ఇక్కడికి వస్తున్నారు. వారు తనకు అన్ని విధాలా సపోర్టుగా వుంటారు. అవినీతిని, అన్యాయాన్ని అణచి వేసేదానికి, వారు తన క్రింది నిజాయితీ పరులకందరికీ అండగా వుంటారు. సపోర్టు చేస్తారు.

నాలుగురోజుల క్రిందట చెరువు కట్ట క్రింద చనిపోయిన నలుగురి కేసును తను నిర్భయంగా కొనసాగించవచ్చు. నేరస్థులు ఎవరైనా సరైన దండనను అనుభవించేలా చేయవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న రౌడీలను, గుండాలను పేరుకు పెద్దమనుషులుగా మేకతోలు కప్పుకున్న పులుల కోరలను పీకి వేయవచ్చు. సామాన్య జనం హాయిగా బ్రతికేలా చేయవచ్చు. తను ఎరిగిన రాజమార్గంలో వెన్ను

విరుచుకొని ముందుకు నడవవచ్చు..” అనుకొన్నాడు వివేకానంద.

=================================================================================

ఇంకా ఉంది..

=================================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


20 views0 comments

Comments


bottom of page