top of page

ప్రేమ ‘భ్రమ’రం - 6

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link


'Prema Bhramaram - 6' New Telugu Web Series


Written By Vasundhara


రచన: వసుంధర


వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఆరవ భాగం


గత ఎపిసోడ్ లో...


రావి చెట్టు దగ్గర తన అనుభవాలు చెబుతాడు నా స్నేహితుడు శ్రీను.

నేను కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాను.

అక్కడ ఉన్న వ్యక్తి నా కోసమే ఎదురు చూస్తున్నట్లు చెబుతాడు.



ఇక ప్రేమ ‘భ్రమ’రం ఆరవ భాగం చదవండి ...


‘‘మీరెవరో నాకు తెలియదు....’’ అన్నాను.

ఆ విషయం అతడికి తెలియదనా - తన గురించి ఏమైనా చెప్పడానికి ఓ పలకరింపు, అంతే!.


‘‘కూర్చోండి’’ అన్నాడతడు నవ్వుతూనే.

గొంతు మృదువుగా మనోహరంగా ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి గొంతు అలాగే ఉండేదేమో!


కూర్చుందుకు అతడి అనుమతి అవసరం లేదు. కానీ అతడు చెప్పకపోతే, అలాగే నిలబడి ఉండిపోయేవాణ్ణేమో అనిపించింది.

కూర్చున్నాను.


‘‘నా పేరు అమోఘ్‌’’ అన్నాడతడు.

‘‘నేను విచల్‌’’ అన్నాను.


‘‘మీరిక్కడికెందుకొచ్చారు?’’ ఆన్నాడతడు.


నేనా ప్రశ్నకి బదులివ్వకుండా, ‘‘నేనిక్కడికొస్తానని మీకెలా తెలుసు?’’ అన్నాను.


అతడు మళ్లీ నవ్వాడు, ‘‘నేనడిగిందానికి బదులిస్తే, జవాబు అందులోనే ఉండొచ్చు’’ అన్నాడు.


తిరకాసుగా మాట్లాడుతున్నాడు. కానీ నాకు కోపం రావడం లేదు.

‘‘నిజం చెబుతున్నాను. నేనెందుకొచ్చానో నాకు తెలియదు’’ అన్నాను.


‘‘అంటే నా సంకల్పబలమే మిమ్మల్నిక్కడికి రప్పించిందన్న మాట! ఐతే నేను చెప్పేది మీరు వినాలి’’ అన్నాడతడు.

అప్పుడు నాకూ అనుమానమొచ్చింది. నేనొచ్చింది ప్రశాంతత కోసమా? లేక అతడి సంకల్పబలాన్ని అనుసరించా?

అతడు నాకేదో చెప్పాలనుకుంటున్నట్లు నాకు అర్థమౌతోంది.


ఏమో - అతడు చెప్పేది వినడంవల్ల నాకు ప్రశాంతత లభిస్తుందేమో! ‘‘చెప్పండి’’ అన్నాను.

‘‘నేనొక ప్రేమికుణ్ణి’’ అన్నాడతడు.


అంటే - అతడు నాకు వినిపించబోయేది ప్రేమ కథ అన్న మాట! కొంపదీసి ఇతడు కూడా ముక్తను ప్రేమించడం లేదు కదా!

‘‘చెప్పండి. మీ కథ విని చేతనైతే సాయం చేస్తాను’’ అన్నాను.


‘‘సాయమంటే, ఎలాంటి సాయం?’’ చప్పున అడిగేడతడు.

‘‘సాధారణంగా ప్రేమకథల్లో అవసరపడే సాయమే! పెద్దల్ని ఒప్పించడమో, వాళ్లొప్పుకోకపోయినా మీ పెళ్లికి సాయపడ్డమో, మీ జంటకి ఆశ్రయంఇవ్వడమో - వగైరా వగైరా....’’ అన్నాను.


‘‘నా ప్రేమ ఆ కథలన్నీ దాటిపోయింది’’ అన్నాడు అమోఘ్‌.

‘‘అంటే?’’ అన్నాను.


అతడు వివరంగానే చెప్పాడు.

అమోఘ్‌ రిక్త అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా అతణ్ణి ప్రేమించింది.

ఇరుపక్షాల పెద్దలూ ఒప్పుకోలేదు. వాళ్ల పెళ్లి జరిగితే - రిక్తని చంపేస్తామని అతడి పెద్దలన్నారు. అమోఘ్‌ని చంపేస్తామని రిక్త పెద్దలన్నారు.


వాళ్లు తమవాళ్లనించి దూరంగా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలు వాళ్లని వెలేసి, వాళ్ల మానాన వాళ్లని బ్రతకనిస్తే - అది మామూలు ప్రేమకథే!

కానీ ఇక్కడ పెద్దలు వాళ్లని వెంటాడుతూనే ఉన్నారు. పట్టుకుందుకో, లాలించడానికో కాదు - వాళ్లది వేట!


వేటంటే వేసెయ్యడమే!

వాళ్ల వేట ఆపడానికి ఆ దంపతులిద్దరూ ఓ పథకం వేశారు.


అమోఘ్‌ లేకుండా బ్రతకలేననీ, ఆత్మహత్య చేసుకుంటున్నాననీ - రిక్త తనవాళ్లకి ఉత్తరం వ్రాసింది. రిక్త చావుకి కారణమైన తనవాళ్లని క్షమించలేననీ, ఇక తన జోలికి రావద్దనీ - అమోఘ్‌ తనవాళ్లకి ఉత్తరం వ్రాశాడు.


అమోఘ్‌ ఈ ఊరొచ్చి చిన్న ఇల్లు కొన్నాడు. అందులో భార్యతో కాపురం పెట్టాడు. ఐతే ఇంట్లో తనొక్కడే ఉంటున్నట్లు - ఇరుగుపొరుగుల్ని భ్రమలో ఉంచాడు.


ఇద్దరూ కలిసి బయట తిరగాలంటే ఆమె పురుషవేషం ధరించి బయటికొస్తుంది.

ఇంటికెవరొచ్చినా ఆమె అలికిడి తెలియకుండా జాగ్రత్త పడేవారు.

వాళ్ల పడకగది సౌండ్‌ప్రూఫ్‌. శబ్దం బయటకి వినిపించదు.


అనుకోకుండా హఠాత్తుగా ఎవరైనా ఇంటికి వస్తే ఆమె బురఖాలోకి మారిపోయి పనిమనిషిలా నటిస్తుంది.

అతడు బ్రహ్మచారి అని చుట్టుపక్కలవాళ్లు ఎంతలా నమ్మేరంటే - కొందరతడికి సంబంధాలు కూడా చూస్తున్నారు.


‘‘ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను’’ అని అతడు అందరికీ స్పష్టం చేశాడు. ఐనా ఒకోసారి ఒత్తిడి తప్పడం లేదు....

ఇలాంటి ప్రేమకథ నేనెక్కడా వినలేదు.


‘‘పెళ్లయి కాపురం చేస్తున్నా ఆ విషయం దాచాల్సొచ్చిన విచిత్రమైన ప్రేమ కథ మీది’’ అన్నాను.


‘‘ఔను. మేము ప్రేమికులమే ఐనా మామూలు మనుషులం కూడా. కలిసి సరదాగా బయట తిరగాలనీ, షాపింగులు చెయ్యాలనీ, ఇంటికి వరినైనా పిలిచి ఆతిథ్యమిచ్చి అతిథుల మెప్పు పొందాలనీ - రిక్తకు ఉంటుంది. ఈ చిన్ని సరదాలు కూడా ఆమెకు తీరడం లేదు’’


నిజమే -

ప్రేమించుకున్నారు, పెళ్లి చేెసుకున్నారు. అంతవరకూ వాళ్ల ప్రేమ విజయం సాధించినట్లే!

ప్రేమకీ, తపస్సుకీ అదే తేడా....


తపస్సు పూర్తిగా వ్యక్తిగతం. తపస్సు చేసేవాడు - జనాల్ని వదిలి ఏ ఆడవిలోనో ఒక్కడూ ముక్కు మూసుకుని ధ్యానంలో పడిపోవచ్చు. తపస్సు ఫలిస్తే తానొక్కడూ మోక్షం పొందొచ్చు.


ప్రేమ మొదట ఇద్దరికి సంబంధించినది. అది ఫలించిన తర్వాత వారు జంటగా సమాజంలో అంతర్భాగంగా ఇమిడిపోతారు.


ప్రేమికులు కలిసి ఉండడానికి ఎంత ఇష్టపడతారో - జంటగా సమాజంలో అంతర్భాగంగా ఉండాలనీ అంతగా కాంక్షిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకుని మనుషులకి దూరంగా ఏ అడవికో పోయి జివించాలని ఏ ప్రేమ జంటా అనుకోదు. ఎందుకంటే - ప్రేమకు సంతానఫలముంటుంది. ఆ సంతానానికి సమాజం అవసరముంటుంది.

అందుకే ప్రేమకథల్లో గజిబిజి.


అమోఘ్‌, రిక్త కలిసి జీవిస్తున్నా - అది రహస్యం. రిక్తకి ఐతే జీవితమే ఓ రహస్యం.

వారికి ప్రేమమాధుర్యంలో జీవనమాధుర్యం కొరవడింది.


‘‘పెద్దల అనుమతితో పెళ్లి చేసుకునుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పని మీకిప్పుడైనా అనిపిస్తోందా?’’ అంటూ నా సిద్ధాంతాన్ని ప్రవచించాను.

అమోఘ్‌ నవ్వాడు.


‘‘ఇంతకాలం పెద్దలంటే ప్రేమమూర్తులనుకునేవాణ్ణి. వాళ్ల మాట వినకపోతే వేటాడాలనుకునే స్వభావం వాళ్లదని మా ప్రేమ బయట పెట్టింది. అసలైన ప్రేమ మాది. మేమిద్దరం ప్రేమించుకుని ఎవర్నీ వేటాడాలని అనుకోవడం లేదు. కలిసి బ్రతుకుదామనుకున్నామంతే! మా ప్రేమతో పెద్దల ప్రేమలో హిపోక్రసీని బయటపెట్టామని ఎంతో గర్వంగా ఉంది’’ అన్నాడు అమోఘ్‌.


ఒక విధంగా అతడు చెప్పింది నిజమే. ‘ప్రేమించుట పిల్లలవంతయితే - దీవించుట పెద్దల వంతు’ - అని వాళ్లెందుకనుకోరు?

ఐతే ప్రతివిషయానికీ ఎవరి కోణాలు వారికుంటాయి.


‘‘ఈనాటి పెద్దలు ఒకప్పటి పిల్లలే కదా! అలాగే నేటి మనం రేపటి పెద్దలం కదా! అప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయో!’’ అన్నాను.


‘‘మన వ్యవస్థలో సమస్యే ఇది. గతాన్ని తవ్వుతాం. రేపటికి భయపడతాం. వర్తమానాన్ని సుఖమయం చేసుకోవాలనుకోం. జీవితమంటే వర్తమానమేనని గ్రహిస్తే - ఎన్నో సమస్యలకి పరిష్కారం దానంతటదే లభిస్తుంది. కాదంటారా?’’ అన్నాడు అమోఘ్‌.


‘‘ఔను. జీవితమంటే వర్తమానమే. కానీ మీ ప్రేమజంట జీవితంలో వర్తమానమూ రహస్యమైపోయింది. ఇలా ఎన్నాళ్లు?’’ అన్నాను.


‘‘నాకూ రిక్తకీ కూడా - ఇలా ఎన్నాళ్లనిపించడం మొదలైంది. మా సమస్యకి పరిష్కారం దొరకాలని ఇద్దరం తపిస్తున్నాం. ఆ తపన ప్రభావమో ఏమో, నిన్న రాత్రి రిక్తకి ఓ కలొచ్చింది’’ అన్నాడు అమోఘ్‌.


కల....

కల ఒకటి ఈ రాత్రే నాకూ వచ్చింది.

ఆ కలకీ, ఈ కలకీ అనుబంధముందా?

అమోఘ్‌ చెబుతున్నాడు.


ఆ కలలో ఓ అదృశ్యశక్తి రిక్తతో, ‘‘రేపు రాత్రి ఈ ఊళ్లోని బోధికొలనుకి వెళ్లు. అక్కడికో యువకుడు వస్తాడు. నీ కథ వినిపించు. మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది’’ అంది.

మెలకువొచ్చేక రిక్త ఆ విషయం చెప్పి - తనిక్కడికి వెడతానంది. కానీ అమోఘ్‌ ఒప్పుకోలేదు.


ఒకటి - రిక్త జీవితం రహస్యం.

రెండు - అర్థరాత్రి ఆడది ఒంటరిగా బయట తిరిగే స్థాయికి - ఈ సమాజమింకా చేరుకోలేదు.


భార్యకి నచ్చజెప్పి అమోఘ్‌ తనే ఇక్కడికొచ్చాడు.

‘‘నాకిక్కడ మీరు కనిపించారు. పరిష్కారం మీ దగ్గరే ఉందేమో మరి’’ అన్నాడు అమోఘ్‌.


ఈ ప్రేమకథకు నేనేం పరిష్కారం చెప్పగలను?

‘‘మీ ప్రేమకథ నాకు చెబితే, మీ సమస్యకి పరిష్కారం దొరకొచ్చన్నారు. దొరికిందా?’’ అన్నాను.


ఇద్దరం ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. ఒక్క క్షణమాగి ఇద్దరం ఒకేసారి ఫక్కుమని నవ్వాం.


కాసేపు మామధ్య మాటలు లేవు.

నాకు మాత్రం అంతా చిత్రంగా ఉంది.


నాకో కలొచ్చి - బోధికొలనువైపు తరిమింది. రిక్తకో కలొచ్చి - అమోఘ్‌ని ఇదే బోధికొలనుకి పంపింది. ఇద్దరం బోధికొలను ఒడ్డున బోధివృక్షం కింద కలుసుకున్నాం.

మానవాతీతశక్తులేమైనా మమ్మల్ని నడిపిస్తున్నాయా?


ఈ బోధికొలను ఓసారి శ్రీనుపై శరమ వేసిన నిందను పోగొట్టింది. మరోసారి అతడి మెదడుని సరైన సమయానికి పునరుజ్జీవం చేసింది.


శ్రీనుకి ఇక్కడ ఒకసారి ముసలాయన కనిపించాడు. మరోసారి ఓ యువకుడు కనిపించాడు. వాళ్లెవరు?


మనుషులా, దేవతలా, గ్రహాంతరవాసులా?

ఎవరైనా వారు శ్రీనుకి మేలు చేశారు.


వారిలో ముసలాయన నాగకన్యల ప్రసక్తి తెచ్చాడు. నిజంగానే ఈ కొలనులో అందరికీ కనిపించని నాగకన్యలు జలకాలాడతారా? వారికి ఉపకారబుద్ధి ఉందా? సమస్యల్లో ఇరుక్కున్నవారికి - వారు కలలో అదృశ్యశక్తులుగా వినబడి ఇక్కడకు రప్పించుకుని - ఉపకారం చేస్తున్నారా?


ఐతే -

ప్రస్తుతం బోధివృక్షం కింద - నేను, అమోఘ్‌ ఉన్నాం.


అమోఘ్‌ మానవాతీతశక్తి కావచ్చు, కాకపోవచ్చు. అతడు నన్ను కానీ మనవాతీతశక్తి అనుకోవడం లేదు కదా!

నేనేమిటో నాకు తెలుసు.


తనేమిటో తెలియాలంటే - నేనతడి ఇంటికి వెళ్లాలి.

ఈ ఆలోచనతో, ‘‘రేపు నేను మీ ఇంటికొచ్చి, మీ దంపతులతో మాట్లాడొచ్చా?’’ అన్నాను.


అతడు నవ్వి, ‘‘నేనే మిమ్మల్ని ఆహ్వానిద్దానుకుంటున్నాను. మీరే అడిగినందుకు థాంక్స్‌’’ అన్నాడు.


‘‘ఐతే, రేపు సాయంత్రం మీ ఇంటికొస్తాను’’ అన్నాను.

‘‘రేపు కాదు, ఎల్లుండి ఉదయం కలుసుకుందాం’’ అన్నాడతడు.


‘‘రేపెందుకు వీలు కాదు?’’ అన్నాను కుతూహలంగా.


‘‘రేపు సాయంత్రం థియేటర్‌ మీనాక్షిలో ఓ చారిటీ షో ఉంది. పాత నర్తనశాల సినిమా వేస్తున్నారు. ఆ సినిమాని రిక్త ఎప్పుడూ థియేటర్లో చూడలేదుట. నాతో కలిసి థియేటర్లో చూడాలని తనకి మనసు. అదీ సంగతి’’ అన్నాడు అమోఘ్‌.


‘‘కానీ మీ కాపురం రహస్యం కదా, తనతో మీరు బయటికి రారుగా’’ అన్నాను ఆశ్చర్యంగా.

‘‘తనప్పుడు పురుషవేషంలో ఉంటుంది. ఇద్దరం పురుషుల్లా కలిసి థియేటరుకొచ్చి సినిమా చూస్తాం. మా ప్రవర్తన ఎంత హుందాగా ఉంటుందంటే - భార్యాభర్తలమన్న భావన కలుగదు సరికదా, మేము అపరిచితులమా అని కూడా అనుకోగలరు’’ అన్నాడు అమోఘ్‌.


చిత్రంగా అనిపించింది.

‘‘అమ్మాయిలు పాంటు, షర్టు వేసుకోవడం రివాజైన రోజులివి. వెనుకనుంచి చూసినా ఏ వేషంలోనైనా అమ్మాయి అమ్మాయని తెలిసి పోతోంది. ఏమాత్రం పరిచయమున్నవారు చూసినా, మీ భార్యని గుర్తించే ప్రమాదం ఉంది’’ హెచ్చరికగా అన్నాను.


అమోఘ్‌ నవ్వి, ‘‘మీరూ, నేనూ కలిసి సినిమాకి వెళ్లామనుకోండి. నా భార్య అనుకునే విషయమటుంచి, మిమ్మల్నసలు ఆడది అనుకునే అవకాశముందా?’’ అన్నాడు.


అదీ ఇదీ ఒకటెలాగౌతుంది - నేను పురుష వేషధారిని కాదు, నిజంగానే పురుషుణ్ణి!

‘‘లేదు. కానీ....’’ అని ఏదో అనబోతే -

‘‘నా భార్య పురుష వేషం అలాగే ఉంటుంది’’ అన్నాడు అమోఘ్‌.


నమ్మశక్యం కాలేదు. రేపు కాపు కాసి వీళ్ల జంటని చూడాలనుకున్నాను. ఐతే ఆ మాట చెప్పకుండా, ‘‘ఏదిఏమైనా మన పరిచయం చాలా విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. ఇదింకా చాలా విచిత్రాలకు దారి తీస్తుందనిపిస్తోంది’’ అన్నాను.


‘‘ఏ విచిత్రం జరిగినా - నాక్కావలసింది, సమస్యకు పరిష్కారం. అది మీరు మా ఇంటికి రావడంవల్లనే జరుగుతుందనిపిస్తోంది. ఎల్లుండి ఉదయం మీరు మా ఇంటికి వస్తున్నారు. ఔనా?’’ అన్నాడు అమోఘ్‌.


‘‘రావాలనే ఉంది. కానీ, ఆఫీసుకెళ్లాలిగా, సాయంత్రమైతే ఎక్కువ వీలు’’ అన్నాను.

అమోఘ్ క్షణం ఆలోచించి, ‘‘ఆఫీసు ఎన్నింటికి?’’ అనడిగాడు.

‘‘పదిన్నర’’


‘‘ఇలాంటి సమావేశానికి ఉదయమైతేనే ఫ్రెష్‌గా ఉంటుంది. మీరు పెందరాళే స్నానం చేసి ఏడవకుండా మా ఇంటికొచ్చెయ్యండి. కాఫీ, టిఫిను - అక్కడే! తర్వాత అక్కణ్ణించే ఆఫీసుకెడుదురుగాని. ఓకే’’ అన్నాడు అమోఘ్‌.

ఓకే అనడానికి తటపటాయించాను.


‘‘ఆఫీసుకి అందుకోగలనా అని ఆలోచిస్తున్నారేమో! నాకు టైం సెన్సు చాలా ఎక్కువ. మిమ్మల్ని టైంకి ఆఫీసుకి పంపే బాధ్యత నాది. కానీ ఒక్క షరతు’’ అన్నాడతడు.

‘‘షరతా?’’ అన్నాను ఆశ్చర్యంగా.


‘‘ఔను షరతే! నా భార్య చేసిన టిఫిను తిన్నాక, లంచికి కూడా ఉండిపోవాలని మీకనిపిస్తే మాత్రం - నేను మిమ్మల్ని బలవంతంగా ఆఫీసుకి పంపను’’ అన్నాడతడు.


‘‘ష్యూర్‌’’ అని నవ్వి, ‘‘అనుకోకుండా ఇక్కడ మొదటిసారి కలుసుకున్నాం. కానీ ఈ కాసేపటిలోనే మనకి ఎన్నో ఏళ్ల పరిచయం ఉందనిపిస్తోంది’’ అన్నాను.


‘‘అందుకు ఒక్కటే కారణం. నేను ప్రేమికుణ్ణి. మీరూ ప్రేమికులయుండాలి. ఈ ప్రపంచంలో ప్రేమికుల జాతికి మించిన సాన్నిహిత్యం మరే జాతికీ ఉండదు’’ అన్నాడు అమోఘ్‌.


‘‘కానీ నేను ప్రేమికుణ్ణి కాదు’’ అన్నాను చప్పున.

అతడు నావంక అదోలా చూసి, ‘‘అలా ఎందుకనుకుంటున్నారు?’’ అన్నాడు.

‘‘నాకు ప్రియురాలు లేదు’’

అతడు నవ్వి, ‘‘ప్రేమికుడు అంటే ప్రియురాలు ఉండాలని రూలేం లేదు. మనసు నిండా ప్రేమ ఉండాలంతే. అది మీలో పుష్కలంగా ఉండబట్టే మనమిద్దరం ఇంత సన్నిహితంగా మాట్లాడుకోగలిగాం. మీలోని ఆ ప్రేమ ఇన్నాళ్లు నిద్రాణంగా ఉండడమే విశేషం. నేను చెబుతున్నాను. త్వరలోనే మీకో ప్రియురాలు దొరుకుతుంది. అప్పుడు మీరు ప్రేమికుడిగా నన్నే మించిపోగలరు’’ అన్నాడు.


అది దీవెనో, శాపమో తెలియదు కానీ వినగానే గతుక్కుమన్నాను.

ఇద్దరం సెలవు తీసుకున్నాం.

- - - - -

ఇల్లు చేరేసరికి తెల్లవారు ఝామున నాలుగు.

జరిగిందంతా చిత్రంగా ఉంది నాకు.


నేను అమోఘ్‌ని చూడ్డం నిజమేనా? మా మధ్య జరిగిన సంభాషణ నిజమేనా?

ఇల్లు చేరగానే ముందు నెట్‌ చెక్‌ చేశాను.


రేపు సాయంత్రం 6కి మీనాక్షి థియేటర్లో స్క్రీన్‌ నంబర్‌ టూలో నర్తనశాల పాత సినిమా చారిటీ షో ఉన్న మాట నిజం. అంటే అమోఘ్‌ని నేను కలవడం నిజమే!

అప్పుడు నాకు అనిపించింది -

‘ఎ క్వయిట్‌ ప్లేస్‌’ సినిమాకీ, అమోఘ్‌ ప్రేమకథకీ కూడా అవినాబావ సంబంధముండొచ్చని.


ఆ సినిమాలో మనుషులు మాట్లాడకూడదు. చిన్న చప్పుడు కూడా చెయ్యకూడదు. చేస్తే వాళ్లు ఫినిష్‌!


అమోఘ్‌ ప్రేమకథలో - ప్రేమికులిద్దరూ కలిసే ఉంటారు. కానీ కలిసి కనబడకూడదు.

రిక్త బ్రతికే ఉంది. కానీ చనిపోయినట్లు అందర్నీ నమ్మించాలి.


అలా జరగలేదూ - రిక్త చుట్టాలో, అమోఘ్‌ చుట్టాలో - వాళ్లమీద ఏలియన్సులా దాడి చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అమోఘ్‌ రిక్తతో కలిసి సినిమాకి వెడదామనుకుంటున్నాడు.

దొరికిపోతే?


దొరకదనీ - పురుషవేషంలో ఉండగా రిక్తనెవరూ గుర్తించలేరనీ నమ్మకంగా ఉన్నాడు అమోఘ్‌,

ఇక నాలో ఒకటే కుతూహలం.


అమోఘ్‌ భార్య రిక్తని నేను చూడలేదు. ఐనా - పురుష వేషంలో ఆమె ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం నన్ను చాలాసేపు వేధించింది.

ఎలాగో కాసేపటికి నిద్ర పట్టింది.


మెలకువొచ్చేసరికి ఏడు దాటింది. లేవగానే మరో టాపిక్కే లేనట్లు - మళ్లీ రిక్త పురుషవేషం గురించిన ఆలోచనలు....

ఎలాగో మనసుని సముదాయించి చకచకా తెమిలాను.


ఆఫీసుకెడితే అక్కడా రిక్త పురుషవేషం గురించిన ఆలోచనలు.

ఆఫీసులో పనిమీద దృష్టి లేదు. ఏదో అక్కడ ఉన్నాననిపించాను.


సమయం గడుస్తున్నకొద్దీ నా మనసు మీనాక్షీ థియేటర్‌ వైపు పోతోంది.

అక్కడికి వెళ్లాలని ముందే నిశ్చయించుకున్నాను కానీ - మరీ ముందే వెళ్లాలనుకోలేదు.


ఉండబట్టలేని మనసు నన్ను ఐదుకల్లా మీనాక్షి థియేటరు దగ్గర ఉండేలా చేసింది.

సినిమా చూడ్డానికి కాక థియేటరుకొచ్చే ఓ మనిషిని చూడ్డానికి వెళ్లడం - బహుశా డిటెక్టివులో, గూఢచారులో చేస్తారేమో -


రిక్తని చూడాలన్న కోరిక నాలో అంత బలంగా ఎందుకు నాటుకుంది?

ఆమె పురుషవేషం గురించి అమోఘ్‌ అంతలా చెప్పడమే అందుకు కారణమా?


ఇలా తలుపులు తియ్యగానే అలా థియేటర్లో దూరిపోతే - ఆమెని మిస్సవుతానని భయం. అందుకే ఐదుకల్లా అక్కడున్నాను.


అది మల్టీప్లెక్సు. స్క్రీన్సుతో పాటు, షాపులు కూడా ఉన్నాయి. మనం టికెట్టు కొనకపోయినా, సినిమా చూడ్డానికొచ్చినవాళ్లని చూసే వీలుంది.

అప్పటికి థియేటర్లో రెగ్యులర్‌ సినిమా ఏదో నడుస్తోంది.


ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. దృష్టంతా రిక్త పురుషవేషంమీదే ఉంది.

నేను అమోఘ్‌కి కనబడదల్చుకోలేదు. అవకాశమున్నంతలో మొహం చాటెయ్యాలనే అనుకున్నాను. అందుకే ఎన్నడూ లేనిది నెత్తిమీద టోపీ ఒకటి పెట్టుకుని కొంచెం నుదుటిమీదకీ లాగాను.


టైం ఐదుంపావయింది.

అమోఘ్‌ వస్తాడా?


తను నర్తనశాల సినిమాకి వెడుతున్నట్లు నాకు చెప్పేక - నామీద అనుమానమొచ్చిందేమో! నోరు జారేనని - ప్రొగ్రాం మార్చుకున్నాడేమో!

టైం ఐదున్నర.


సినిమా వదిలేరు. జనం బయటికెడుతున్నారు.

నేను లోపలికొచ్చేవాళ్లని ఓ కంట కనిపెడుతున్నాను.

టైం ఐదూ నలబై దాటేక కనిపించాడు అమోఘ్‌.


ఆరడుగుల ఎత్తు. గ్రేకలర్‌ పాంటుమీద, నిలువు చారల పొడుగు చేతుల చొక్కా ఇన్‌షర్ట్‌ చేసి చాలా హుందాగా ఉన్నాడు.

కానీ రిక్త ఏదీ?


చూస్తుండగా అతడి వెనుకనుంచి ముందుకి వచ్చాడో యువకుడు.

ఐదడుగుల ఆరంగుళాలుండొచ్చు పొడుగు. బ్లూ జీన్సు పాంటుమీద, వదులుగా నల్లని టీ షర్టు.


ముఖం చూస్తే - నేటి సినిమా హీరోలకిలా మాసిన గడ్డం. ట్రిమ్‌ చేసిన మీసాలు.

ముఖంలో ఎక్కడా నాజూకుతనం లేదు. చెప్పాలంటే అసలు ఆడతనమే లేదు.

వాళ్లిద్దరూ కలిసి స్నాక్‌ సెంటర్‌కి వెళ్లారు.


ఒకరినొకరు తాకడం లేదు. ఓ మాదిరి పరిచయమున్న కాలేజిమేట్సులా మాట్లాడుకుంటున్నారు.

థియేటర్లో తినడానికి - ఫ్రెంచి ఫ్రైసో, కర్రీ పఫ్‌లో మరేవో - ఆర్డరిచ్చారు.

నేను వాళ్లకి తెలియకుండా మొబైల్లో ఫొటో తీశాను.


ఇద్దరూ కలిసి థియేటర్లోకి వెళ్లేక నేను బైటకి వచ్చేశాను. తిన్నగా ఇంటికెళ్లి నేను తీసిన ఫొటోని లాప్‌టాప్‌లోకి మార్చి పెద్దది చేసి చూశాను. అది కూడా తృప్తిగా అనిపించక - మొబైల్‌లోంచీ 42 ఇంచిల టివిలోకి కాస్ట్‌ చేసి - చూశాను.


ఎంత చూసినా - అమోఘ్‌ పక్కనున్న వ్యక్తిలో ఆడతనం కనబడలేదు నాకు. ఐదడుగుల ఆరంగుళాల పొడవున్న ఓ మగాడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడా వ్యక్తి. అతడిలో రిక్తని ఊహించుకోవడం అసాధ్యంగా అనిపించింది నాకు.


వాళ్లు మేకప్‌లో అంతటి ప్రావీణ్యం సంపాదించారా? లేక అమోఘ్‌ నాకు అబద్ధం చెప్పాడా?


చెబితే ఎందుకు? ఆ అబద్ధంవల్ల అతడికేం ప్రయోజనం?

నాకు బుర్ర పని చెయ్యలేదు.


రేపు వాళ్లింటికెళ్లి రిక్తని చూస్తానుగా - అప్పుడు నా సందేహాలకి సమాధానం లభించొచ్చులే - అనుకున్నాను.


ఏదైనా కుతూహలం మనసుని వేధిస్తునప్పుడు - క్షణాలు యుగమౌతాయి.

కానీ కాలం శరవేగంతో పరుగెడుతూనే ఉంటుంది.


నేను అమోఘ్‌ ఇంటికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది.

ఇంకా ఉంది...


వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.



35 views0 comments

コメント


bottom of page