ప్రేమ ‘భ్రమ’రం - 4
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link

'Prema Bhramaram - 4' New Telugu Web Series
Written By Vasundhara
రచన: వసుంధర
వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం నాలుగవ భాగం
గత ఎపిసోడ్ లో...
రమణయ్య నాతో మాట్లాడుతూ తన కొడుకు కిషోర్, స్వర అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడని చెబుతాడు. వాళ్ళను వేరు చెయ్యమని కోరుతాడు.
స్వర నాతో మాట్లాడుతూ తను కిషోర్ ని ప్రేమించడం లేదనీ, తన బావ భవన్ ని ప్రేమిస్తున్నాననీ చెబుతుంది.
కానీ భవన్, ముక్తను ఇష్టపడుతున్నాడని చెబుతుంది.
ప్రేమ‘భ్రమ’రం - 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రేమ‘భ్రమ’రం - 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రేమ‘భ్రమ’రం - 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక ప్రేమ ‘భ్రమ’రం నాలుగవ భాగం చదవండి ...
‘‘ముక్త ఎవరు?’’ అన్నాను మొదటిసారిగా ఆ పేరు విన్నట్లు.
‘‘ఎవరంటే ఏం చెప్పను? సాటి ఆడపిల్లనయుండీ - ఆమె అసామాన్య సౌందర్యవతి అని చెప్పడానికి సంకోచించనని చెప్పనా?’’ అంది స్వర.
ఫలానా హీరోయిన్ బాగుంటుందంటే - ‘నాకంటేనా?’ ఆని చిరాకు పడే చెల్లి గుర్తుకొచ్చింది.
ఇప్పుడు కాదు - పదేళ్ల వయసప్పుడే అదలా అనేది.
‘‘ఆడవాళ్లంరా - ఎవరికి వాళ్లమే అందగత్తెలం. నాటి వైజయంతిమాల, హేమమాలిని, శ్రీదేవి అయినా - నేటి ఐశ్వర్య, రాకుల్, రశ్మిక అయినా - ఎవరైనా మా తర్వాతే అనుకుంటాం’’ అని అమ్మ కూడా చెల్లిని సమర్థిస్తూ మాట్లాడేది.
‘‘అంటే ఆ ముక్త పరిచయం - అందమొక్కటేనా?’’ అన్నాను - నేను అందానికి ప్రాధాన్యమివ్వనన్న దర్పాన్ని గొంతులో పలికిస్తూ.
‘‘అందమంటే అది మామూలు అందం కాదు. ఆ అందాన్ని వర్ణించడానికి ఆడపిల్లలు కూడా కలం పడతారు. కుంచె అందుకుంటారు. గాత్రాన్ని సవరిస్తారు’’ అంది స్వర.
అర్థమయింది.
భవన్ ముక్త అందానికి పడిపోయాడు.
అందుకు స్వర అతణ్ణి తప్పు పట్టడం లేదు. అంత అందానికి ఏ మగాడు పడడూ - అన్న భావాన్ని వ్యక్తపరుస్తూ సమర్థిస్తోంది.
‘‘మీరు ముక్తని చూశారా?’’ అన్నాను.
‘‘భవన్ ముక్తని చూసినప్పుడు నేను పక్కనే ఉన్నాను. నిజానికి నేనే ముందామెను చూసి, ‘ఎంత బాగుందో, చూడు’ అంటూ చూపించాను. అంతే! అంతకాలం నన్ను ప్రేమిస్తున్నాడనుకున్న భవన్‌కి - తొలిచూపులోనే ముక్తపై ప్రేమ పుట్టేసింది’’ అంది స్వర.
పద్మ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆమె చిన్నప్పట్నించీ ఇష్టపడ్డ కవన్ - ముక్తని చూసి ప్రేమలో పడ్డాడు.
‘‘ఆ విషయం మీకెలా తెలిసింది?’’ అడిగాను.
‘‘భవన్ నిజాయితీపరుడు. చూసిన మరుక్షణమే నాకా విషయం చెప్పేశాడు’’ అంది స్వర.
ఏడిసినట్లుంది నిజాయితీ! ప్రేమించిన అమ్మాయి పక్కనుండగా - మరో అమ్మాయి కంటికి నదురుగా కనిపిస్తే - పాత ప్రేమకి గుడ్‌బై చెప్పేయడం నిజాయితీ అనిపించుకుంటుందా?
మనకు నచ్చినవాళ్లు ఏంచేసినా - ఏదో విశిష్టతని వెదికి పట్టుకుని వాళ్లకి అంటగట్టాలనిపిస్తుంది. లేకపోతే - ఇంతమంది రాజకీయ నాయకుల్ని, సినీతారల్ని, రచయితల్ని, కళాకారుల్ని ఎలా భరిస్తున్నాం?
కుతూహలం పట్టలేక అడిగేశాను, ‘‘ఎలా చెప్పాడు? ఏమని చెప్పాడు?’’
స్వర వివరిస్తోంది.
భవన్ స్వరని ప్రేమిస్తున్నానని అనుకున్నాడు కానీ అది నిజమైన ప్రేమ కాదుట. సాన్నిహిత్యంనుంచి పుట్టిన ఆకర్షణని ప్రేమగా భ్రమ పడ్డాడుట. నేడు ముక్తని చూడగానే - అసలైన ప్రేమంటే తెలిసిందిట.
స్వరని ఇష్టపడ్డాడు కానీ, ఆమె లేకుండా బ్రతకలేనని అతడికెన్నడూ అనిపించలేదుట. ముక్తని చూసిన మరుక్షణంనుంచీ - ఆమె లేకుండా బ్రతకలేననిపిస్తోందిట.
‘‘భలే మగాడు. రేపు మరో లావణ్య కనపడితే - ముక్తకీ ఇలాగే చెబుతాడేమో’’ అన్నాను.
‘‘నేనూ ఆ మాటే అన్నాను. కానీ భవన్ చలించలేదు’’ అంది స్వర నీరసంగా.
‘‘ఏమన్నాడు?’’ అన్నాను కుతూహలంగా. ఆమె చెప్పింది…
‘‘ఎవరినైనా నిజంగా ప్రేమించినవారికి ఇలాంటి అనుమానం రాదన్నాడు’’ అన్నాడు భవన్.
‘‘నేను నిన్ను నిజంగా ప్రేమించాను. మరి నాకెందుకొచ్చిందీ అనుమానం’’ అంది స్వర.
‘‘చెప్పానుగా, మన మధ్యనున్నది సాన్నిహిత్యంలో కలిగిన ఆకర్షణే తప్ప ప్రేమ కాదని’’ అన్నాడు భవన్.
‘‘నీ విషయంలో అది నిజం కావచ్చు. నా విషయంలో కాదు. నేను నిన్ను నిజంగానే ప్రేమించాను’’
‘‘సరే, అలాగే అనుకుందాం. మరి నేను లేకపోతే బ్రతకలేనని నీకనిపిస్తోందా - అది చెప్పు’’ అన్నాడు భవన్.
స్వరకి ఏమనాలో తెలియలేదు.
ఆమె అతణ్ణి ఇష్టపడింది. అతడితో జీవితం పంచుకోవాలనుకుంది. అతడు లేకుండా బ్రతకలేనని మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. అంతమాత్రాన తనది ప్రేమ కాకుండా పోతుందా?
అదే అడిగిందామె.
‘‘ఆకర్షణ సాన్నిహిత్యాన్ని కోరుతుంది. సాన్నిహిత్యం ఇష్టాన్ని పుట్టిస్తుంది. కానీ ప్రేమ మనసు తలుపు తడుతుంది. ఈ తేడా నీకూ తెలియాలంటే నాకు ముక్త తటస్థపడినట్లే, నీకూ ఎవరో ఓ ఎక్స్ కనబడాలి’’ అన్నాడు.
‘‘నా ఎక్స్‌వి నువ్వే. నువ్వు తట్టగానే నా మనసు తలుపులు తెరిచాను. నిన్నిక మర్చిపోవడం అసాధ్యం. నిన్ను దక్కించుకుందుకు ఏమైనా చెయ్యగలను’’ అంది స్వర.
‘‘నన్ను దక్కించుకోవాలనుకుంటే - అది స్వార్థం. నాకోసం ఏమైనా చెయ్యాలనుకుంటే అది ప్రేమ’’ అన్నాడు భవన్ చటుక్కున.
‘‘సరే, నాది ప్రేమ అని నిరూపించుకుందుకు ఏంచెయ్యాలో చెప్పు. చేస్తాను’’ అంది స్వర.
‘‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌తో - నాకూ, ముక్తకీ మధ్య అడ్డుగా నిలవకు’’ అన్నాడు భవన్ వెంటనే.
స్వర తెల్లబోయింది. ఇక తను ఏమనగలదు?
ముందు భవన్ తనని ప్రేమించడంలేదని స్ప్టష్టంగా చెప్పేశాడు. ఇప్పుడు తనకీ ముక్తకీ మధ్య అడ్డు రావద్దంటున్నాడు.
అదీ స్వర ప్రేమ కథ!
నాకు కొంచెం ఆశ్చర్యం, కొంచెం జాలి. అప్రయత్నంగా నిట్టూర్చాను. ‘‘ఇందులో నేను చెయ్యగలిగిందేముంది?’’ అన్నాను.
‘‘మీరు ముక్తకీ, భవన్‌కీ జరగబోయే పెళ్లి ఆపాలి’’
అప్పుడు - ‘‘నువ్వు ముక్త-కవన్‌ల పెళ్లి చెడగొట్టాలి’’ అన్న పద్మ మాటలు చెవుల్లో గింగురుమన్నాయి.
ముక్త కవన్‌ని పెళ్లి చేసుకునే మాటైతే, ఈ భవన్ ఎక్కణ్ణించి వచ్చాడు?
ఆ ముక్త, ఈ ముక్త ఒకరేనా - లేక....
అనుమానమొచ్చి, ‘‘మీరేమన్నారూ - కవన్ అని కదూ!’’ అన్నాను.
ఆమెకి కవన్ కథ తెలుసో లేదోనని - ఇలా పరోక్షంగా అడిగాను.
ఆమె అదోలా నన్ను చూసి, ‘‘మీరు శ్రద్ధగా వింటున్నట్లు లేదు. నేను భవన్ గురించి చెబుతుంటే, మధ్య ఈ కవన్ ఎవరు?’’ అంది.
‘‘సారీ - ఎందుకో డౌటొచ్చింది?’’ అన్నాను మాట తప్పిస్తూ.
‘‘మీరు ముక్తకీ, భవన్‌కీ జరగబోయే పెళ్లి ఆపాలి - అందులో డౌటేం లేదుగా?’’ అందామె.
నాకో డౌటుంది. ముక్త పెళ్లి చేసుకునేది భవన్‌నా, కవన్‌నా అని. కానీ అది తీర్చడం స్వర వల్ల కాదు.
‘‘డౌటేం లేదు కానీ, వాళ్లిద్దరికీ ఇష్టమై పెళ్లి చేసుకుంటుంటే - మధ్య నేనెందుకు ఆపాలి?’’ అన్నాను.
‘‘వాళ్లిద్దరికీ ఇష్టమని ఎవరన్నారు? ముక్త భవన్‌ని ప్రేమించలేదు’’ అంది స్వర.
ఈ అమ్మాయి మనసులో ఏముందో, ఏం చెప్పదల్చుకుందో కానీ - నాకు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా షాకులిస్తోంది.
‘‘ప్రేమించకపోతే పెళ్లికెందుకు ఒప్పుకుంది?’’ అన్నాను.
‘‘ముక్త మీ టైపు. పెద్దల అభీష్టానికి తల వంచింది’’ అంది స్వర.
ఏమంటాను?
‘‘అలాగా - ఐతే ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోను’’ అనేశాను.
‘‘అప్పుడు నాకూ, కిషోర్‌కీ పెళ్లి జరుగుతుంది. అటు పెద్దలూ, ఇటు పెద్దలూ ఘొల్లుమంటారు. అది మీకిష్టమైతే సరే’’ అంది స్వర.
ఇది చాలా బాగుంది.
ఏదో - కిషోర్ తండ్రిని సంతోషపెడదామని ఈ ప్రేమ గోతిలో దిగాను. చూస్తే అది గొయ్యి కాదు, ఊబిలా ఉంది.
కిషోర్ తండ్రి నిరాశపడతాడని - ఊబిలో దిగుతానా?
‘‘మరి మీరు కిషోర్‌ని ప్రేమించడం లేదుగా’’ అన్నాను.
‘‘ప్రేమించిన భవన్‌ని పెళ్లి చేసుకోలేకపోతే - ఏ కోన్‌కిస్కాగాడైనా ఒకటే నాకు! అలాంటప్పుడు కిషోర్‌ని చేసుకుందుకేం? అతగాడు నాకు మంచి మిత్రుడు కూడా’’ అంది స్వర.
ఈ రోజుల్లో ప్రేమికులు కూడా రాజకీయనాయకుల్లాగే మాట్లాడుతున్నారు.
ప్రజాద్రోహి అని నిందించినవాణ్ణే - ప్రజాస్వామ్యరక్షకుడు అంటూ తమ పార్టీలోకి ఆహ్వానిస్తారు వాళ్లు. ఇప్పుడు స్వర మాటల ప్రకారం - కిషోర్ కోన్‌కిస్కాగాడా, మంచి మిత్రుడా?
స్వర దగ్గర - తెలంగాణలో ఆంధ్రోడి పరిస్థితి ఐపోయింది కిషోర్‌ది.
‘‘అంతవరకూ వచ్చేక కిషోరే ఎందుకు? పెద్దలు చెప్పినవాణ్ణి చేసుకుంటే - అన్నివిధాలా బాగుంటుందిగా’’ అని ఆమె వ్యాఖ్యని నాకు అనుకూలంగా మార్చుకున్నాను.
‘‘అన్నివిధాలా ఎవరికి బాగుంటుందో తెలియదు. నాకు మాత్రం బాగుండదు’’ అంది స్వర.
ఆమెకు ఆలోచనల్లో క్లారిటీ ఉంది.
తను భవన్‌ని ప్రేమించింది. భవన్ ముక్తని పెళ్లి చేసుకోబోతున్నాడు.
ముక్త భవన్‌ని ప్రేమించడం లేదు. భవన్ కాదంటే ఆమె అప్సెట్టవదు.
స్వరకి సాయపడాలని కిషోర్ ఆమెతో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆ పెళ్లి ఆపడానికి ఇరుపక్షాల పెద్దలూ శాయశక్తులూ ఒడ్డుతారు.
వాళ్లకి ఉన్నదొక్కటే ఉపాయం.
ముక్తకీ, భవన్‌కీ పెళ్లి కాకుండా ఆపాలి. ఆపారూ - భవన్, స్వరలకి పెళ్లవుతుంది.
ఆపలేదూ -
తోడొకరుండిన అదే భాగ్యమూ అన్నాడు శ్రీశ్రీ.
ఒక్కరేం కర్మ - స్వరతోపాటు అప్పుడు చాలామందికే గుండెలు బద్దలౌతాయి. వారంతా ఒకరికొకరు తోడవుతారు.
‘‘అంతా మీ చేతుల్లో ఉంది’’ అంది స్వర.
ఆమెని చూస్తే -
మరీ కిషోర్ తండ్రి అంతలా కాకపోయినా -
ఆమె చూపులు కూడా ఒక లెవెల్లో గజేంద్రుడి చూపుల్లాగానే ఉన్నాయి. ఇక నేను శ్రీమహావిష్ణువుని కావడమే తరవాయి.
కాగలనా?
నా ప్రయత్నం నేను చెయ్యాలి కదా అని, ‘‘ముక్త నాకు పూర్తిగా అపరిచిత. ఆమెని కలుసుకుందుకు ఏ వంక చెప్పాలి? చెప్పినా ఆమె నన్ను కలుసుకుని మాట్లాడ్డానికి ఇష్టపడుతుందా? తానిష్టపడినా నేనిందుకు చొరవ తీసుకోగలనా?’’ అన్నాను.
‘‘నాకు సాయపడాలని నిర్ణయించుకున్నందుకు ముందు మీకు థాంక్స్!’’ అంది స్వర.
ఆ మాట నేనన్నానా?
ఇది ముందరి కాళ్లకి బంధం. స్వర వెయ్యడం వల్లనేమో ఆ బంధం నాకు బాగానే ఉంది.
‘‘యు ఆర్ వెల్‌కమ్’’ అన్నాను.
‘‘నిజానికి నాకు మీకంటే ఎక్కువ బిడియం. కానీ ప్రేమలో పడ్డాక - ఆలాంటివి వదులుకోక తప్పలేదు. ఆదీ కాక - మీలో ఏదో ప్రత్యేకత ఉంది. పరిచయమైన మరుక్షణంనుంచీ - కొత్తవారితో మాట్లాడుతున్నట్లు అనిపించలేదు. ఆప్తుడిలా, ఆత్మీయంగా అనిపించారు. చాలాకాలంగా మిత్రుడైన కిషోర్ దగ్గర కూడా చెప్పుకోలేనివి మీకు చెప్పగలిగాను’’ అందామె.
నా ఛాతీ చప్పున ఇంచ్‌కి పెరిగింది. ‘‘థాంక్స్’’ అన్నాను.
‘‘ఇక ముక్త విషయం చెబుతాను’’ అందామె.
ముక్తకి ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ ఆమె తన నోటితో కాదనదు.
ఎవరో వస్తారనీ ఏదో చేసి ఈ పెళ్లి చెడగొడతారనీ ఆమె గట్టిగా నమ్ముతోంది.
అపరిచితులు తనని కలుసుకునే ప్రయత్నం చేసినా అందుకేనని నమ్ముతుంది.
ఆమెని కలుసుకుందుకు ఏ వంకా అవసరం లేదు.
‘‘మీకామె నంబరిస్తాను. ఒకసారి ఫోన్ చెయ్యండి. మిగతాదంతా తనే చూసుకుంటుంది’’ అంది స్వర.
‘‘ఇంతకీ ముక్తకి భవన్‌తో పెళ్లి ఎందుకిష్టం లేదు?’’ అన్నాను.
‘‘ముక్తని కలుసుకున్నప్పుడు ఆ విషయం ఆమెనే అడగండి’’ అంది స్వర.
ఒకే దెబ్బకి రెండు పిట్టలు.
తను జవాబు చెప్పక్కర్లేదు. నేను వెళ్లి ముక్తని కలుసుకోవాలి.
‘‘పెళ్లి కుదిరిన యువతికి, అపరిచితుణ్ణయిన నేను ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది?’’ అన్నాను సంకోచంగా.
స్వర జవాబివ్వలేదు. తన పక్కనే ఉన్న వాలెట్‌లోంచీ మొబైల్ తీసింది.
‘‘నంబరిచ్చేముందు నేనన్నదానికి బదులివ్వండి’’ అన్నాను.
ఆమె మాట్లాడలేదు. తన మొబైల్ నాకు చూపించింది.
అందులో ఒక ఫొటో. చూస్తే....
దేవలోకంలో అందాల పోటీకోసం విధాత రచించి దాచి ఉంచుకున్న నమూనాలా -
ఓ అపురూప దివ్య సుందరి!
ఆమెని చూడ్డమే ఓ అదృష్టం. ఆమెను కలుసుకుని మాట్లాడే వరం దొరుకుతుందంటే - తపోదీక్షలో విశ్వామిత్రుణ్ణి మించిపోవా లనిపించదూ!
ఒకసారి స్వర వంక చూస్తే -
ఫోన్ చేస్తే ఏం బాగుంటుందన్న నా ప్రశ్నకి సమాధానం ఆ ఫొటోయేనన్నట్లు చూస్తోందామె నన్ను.
అప్పుడామె నన్ను అర్ధిస్తున్న వనితలా లేదు. నాకు వరమిస్తున్న దేవతలా అనిపించింది.
- - - - -
రాత్రి పది.
మొబైల్లో అమెజాన్ ప్రైమ్‌లో ‘ఎ క్వయిట్ ప్లేస్’ సినిమా పూర్తి చేశాను.
గంటన్నర సినిమా.
ఆ సినిమా నిన్న మొదలెట్టాను. ఓ అరగంట కాబోలు చూశాను.
కథేమిటంటే -
ఇతర గ్రహాల్నుంచి వచ్చిన ప్రాణులేవో భూమ్మీద దాడి చేసి - మొత్తం జీవజాలాన్ని నాశనం చేశాయి.
మనుషులెవరూ లేని ఓ ఊళ్లో మిగిలింది ఓ కుటుంబం.
కడుపుతో ఉన్న భార్య, భర్త, ఓ చెవిటి కూతురు, ఆమె ఇద్దరు తమ్ముళ్లు.
ఉండడానికి ఇల్లుంది. తాగడానికి నీళ్లున్నాయి. తినడానికి తిండి ఉంది. కంప్యూటర్లు, టివి వంటి ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి.
ఒకే ఒక్క ఇబ్బంది.
కొన్ని గ్రహాంతర ప్రాణులు అక్కడే తిరుగుతున్నాయి.
చూడ్డానికి భయంకరంగా ఉంటాయి. చూడ్డానికి కళ్లు లేని వాటి బలం అపరిమితం. చీమ చిటుక్కుమన్నా వినగల అద్భుతమైన వినికిడి శక్తి వాటికుంది. అదే వాటి వేటకి ఉపయోగపడుతుంది. చిన్న మాట పలికినా, చప్పుడు వినబడినా - పసికట్టి దాడి చేసి మనుషుల్ని చంపి తినేస్తాయవి.
ఎవ్వరూ మాట్లాడ్డానికి లేదు. చప్పుడు చెయ్యడానికి లేదు.
ఆ కుటుంబంలో చిన్నపిల్లాడికి ఆటల సరదా. ఇల్లాలికి పురిటి సమయం.
కానీ ఆ కుటుంబం నిశ్శబ్దంలోనే జీవించాలి.
వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, శబ్దమన్నది లేకుండా సైన్ లాంగ్వేజ్ వాడతారు. క్షణ క్షణం భయంతో జీవిస్తూ - ఆ గ్రహాంతరవాసుల్ని ఎలా అంతం చెయ్యాలా అని ఆలోచిస్తుంటారు. శబ్దం తప్పనిసరైనప్పుడు - అంతకంటే పెద్ద శబ్దాలొచ్చే వేరేచోటకి శత్రుజీవుల్ని మళ్లించడానికి ఉపాయాలు పన్నుతుంటారు.
వారి వద్ద తుపాకులున్నాయి. కానీ గ్రహాంతర ప్రాణుల చర్మం పెళుసు. తుపాకి గుళ్లు ఛేదించలేవు.
ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబపు జీవన పోరాటమే ఆ చిత్రం.
భయం, ఉత్కంఠల మధ్య -
చావుని తప్పించుకోలేని అసహాయతలు, మనసుని కదిలించే త్యాగాలు, తెలివికి పదునుపెట్టే ఉపాయాలు....
ఏకబిగిన చూడాల్సిన సినిమా అది.
నా మనసుని ముక్త ఎక్కువగా ఆక్రమించుకోవడం వల్ల - నిన్న సినిమామీద పూర్తి దృష్టి పెట్టలేక అరగంటలో ఆపేశాను.
కానీ సినిమా ప్రభావం కూడా బాగానే ఉంది.
ముక్తతోపాటు ‘ఎ క్వయిట్ ప్లేస్’ కూడా నా ఆలోచనల్ని వెన్నాడుతోంది.
ఈ రాత్రి ఒక్కణ్ణీ మంచంమీద పడుకుని మిగతా సినిమా పూర్తి చేశాను.
చేశాను కానీ ముక్త గురించిన ఆలోచనల ప్రభావం - నన్ను డామినేట్ చెయ్యడంవల్ల - మనసులో కొన్ని సందేహాలుండిపోయాయి.
కథలో మిస్సయిన పాయింట్లకోసం - గూగుల్‌కి వెళ్లాను.
గూగుల్‌లో మొత్తం కథ, నేపథ్యం దొరికాయి. పెద్దగా మిస్సయిందేం లేదని గ్రహించాను.
మరోసారి సినీ దృశ్యాల్ని మననం చేసుకుని ఆస్వాదిద్దామంటే - ముక్త వదలదే!
ఎవరీ ముక్త?
సమాధానమివ్వాల్సిన మనసు - ‘ఎ క్వయిట్ ప్లేస్’గా మారిపోయింది.
లేచి కూర్చుని పక్కనే టీపాయ్ మీదున్న పాడ్ తీసి దానిమీద రాసింది చదువుకున్నాను.
ముక్త మధ్యతరగతి అమ్మాయి. చాలా మామూలు అమ్మాయి.
ఆమె తండ్రి విశ్వనాథం - ఓ ప్రయివేట్ కంపెనీలో మామూలు గుమస్తా. తల్లి ప్రభాదేవి మామూలు గృహిణి.
ఆమెకో అక్క, తమ్ముడు. అక్క శరావతికి మామూలుగా పెళ్లయింది. తమ్ముడు గుణశేఖర్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని మామూలుగా ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
ముక్త మామూలుగా బీయస్సీ కంప్యూటర్సు చేసింది. మామూలుగా కాకపోయినా మామూలుదే ఓ ఆన్‌లైన్ ఉద్యోగం చేస్తోంది.
ఆ మామూలు ముక్తకి కవన్‌తో పెళ్లి అని - కవన్‌ని ప్రేమించిన నా కజిన్ పద్మ అంటుంది. అదే మామూలు ముక్తకి భవన్‌తో పెళ్లి ఆని - నా మిత్రుడు కిషోర్ ద్వారా పరిచయమైన స్వర అంటుంది.
ముక్త గురించి నాకు తెలిసిన విశేషాలన్నీ - మామూలుని అంటిపెట్టుకుని ఉన్నాయి.
ఆ మామూలు ముక్త పెళ్లి ఆపమని - అటు పద్మ, ఇటు స్వర నన్ను కోరారు.
ఎలాగో అలా ప్రస్తుతానికి ముక్త పెళ్లిని వాయిదా వెయ్యగలిగితే చాలు - ఇద్దరికీ సాయపడినట్లే!
కానీ కవన్ కథ స్వరకి తెలియదు. భవన్ కథ పద్మకి తెలియదు.
అంటే ముక్త గురించి వాళ్లిద్దరికీ కొంతే తెలుసు.
నేను వెళ్లి ముక్తని కలుసుకుంటే అసలు కథ తెలుస్తుంది.
కానీ అప్పుడు నేను ముక్తను ప్రేమించడం మొదలెడితే...
అలా ఎందుకు జరుగుతుంది?
ముక్త అందగత్తె అనడంలో సందేహం లేదు. కానీ నేను అందగత్తెని పెళ్ల్లి చేసుకోవాలని కల కనడం లేదు. పెద్దలు చెప్పిన అమ్మాయి మెడలో తాళి కట్టి - ఆమెతో కలిసి నూరేళ్లు మామూలు జీవితం గడపాలని అనుకుంటున్నాను.
ప్రేమ పెళ్లి చేసుకుంటే - అది మూణ్ణాళ్ల ముచ్చటే కావచ్చునని నా భయం.
అంతే కాదు -
ముక్త సౌందర్యం ఇంతా అంతా కాదని ఫొటో చూసినప్పుడే నాకర్థమైంది. ఆమెతో ప్రేమలో పడి, విజయం సాధించి - ఆమెను నా భార్యగా చేసుకుంటే....
నేనే అందగాణ్ణి. కానీ నన్నే కాకిముక్కుని చెయ్యగల దొండపండు ఆమె సౌందర్యం.
నాకు ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్సు కలగొచ్చు. కలక్కపోతే ఇతరులు నన్ను రెచ్చగొట్టి కలిగేలా చెయ్యొచ్చు.
అదలాగుంచితే....
పెళ్లయినంత మాత్రాన కొత్త కవన్‌లూ, భవన్‌లూ ఆమె వెంటబడరని గ్యారంటీ లేదు.
ఏంచెయ్యాలి నేను?
ఇలా నా ఆలోచనలు చాలా దూరం వెళ్లిపోవడానికి కారణముంది.
స్వర మొబైల్లో ముక్త ఫొటో చూసినప్పట్నించీ - ఆమె రూపం మేనకగా మారి నన్ను విశ్వామిత్రుణ్ణి చేస్తోంది. ఇక ఆమెను స్వయంగా చూశానంటే - నా మనసు నా స్వాధీనంలో ఉంటుందనిపించదు.
దాంతో ఇన్నాళ్లుగా తెచ్చుకున్న పేరంతా ఒక్కసారిగా పోతుంది.
ప్రస్తుతం నన్ను ఆకాశానికెత్తేస్తున్న కిషోర్ తండ్రి - నువ్వూ నా కొడుకులాగేనని ఈసడిస్తాడు.
అందుకే ఆలోచిస్తున్నాను - ముక్తని లవ్ చెయ్యాలా వద్దా ఆని!
అంటే ఆమెని కలవాలా వద్దా అన్నది తేల్చుకోవాలి. కలిస్తే లవ్ చెయ్యడం తథ్యమని నా వయసు, మనసు బెదిరిస్తున్నాయి.
ఆలోచిస్తూనే నిద్రపోయాను. ఆ నిద్రలో ఓ కల! అందులో ముక్త!
ఆమెకు అటు ఇటూ కవన్, భవన్ ఉన్నారు.
ఆమె నన్ను చూస్తోంది. ఐలవ్యూ చెప్పాలనిపించింది.
‘‘ఇష్!’’ అన్నట్లు పెదాలపై వేలుంచి మిగతా వాళ్లిద్దర్నీ చూపించింది ముక్త - అచ్చం ‘ఎ క్వయిట్ ప్లేస్’లో హీరోయిన్‌లా.
అటు చూస్తే - నాకు భవన్, కవన్ ఏలియన్సులా కనిపించారు.
భయమేసి అరవబోయాను కానీ - శబ్దం చెయ్యకూడదుగా - పెదవి కూడా విప్పలేదు.
తర్వాత భవన్ ఏదో మాట్లాడబోతే - ‘‘ఇష్’’ అని నన్నూ, కవన్‌నీ చూపించింది ముక్త.
అప్పుడు భవన్ కళ్లలో భయాన్ని చూసి నివ్వెరపోయాను.
ఒక మనిషి కళ్లలో అంత భయాన్ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు.
బహుశా - అతడికి నేనూ, కవన్ ఏలియన్సులా కనిపించామేమో!
ఐతే మాలో ఎవరు ఏలియన్స్?
అప్పుడు నా చెవిలో, ‘‘ఒక అమ్మాయిని ఇద్దరో ముగ్గురో ప్రేమిస్తే - ఆ ప్రేమికులు ఒకరినొకరు కబళించాలనుకుంటారు. అలా ఒకరికొకరు ఏలియన్సు ఔతారు’’ అని వినబడింది.
ఏదో అదృశ్యశక్తి - నాకు విషయం చెప్పింది. మరి - ఆ సమస్యనుంచి ఎలా బయటపడాలి?
అదృశ్యశక్తిని అడుగుదామంటే - గొంతు విప్పాలి. గొంతు విప్పితే ఏలియన్సు మీదపడి కబళించెయ్యడం తథ్యం.
కాసేపు ఆలోచించాను.
సినిమాలో సన్నివేశాన్ని గుర్తు చేసుకుని - అక్కణ్ణించి దూరంగా పరుగెత్తాను. పరుగెడుతున్నప్పుడు - కాళ్లు చప్పుడు చెయ్యకుండా జాగ్రత్త తీసుకున్నాను.
ఆశ్చర్యం - సినిమాలో లాగే నేనూ ఓ జలపాతం చేరుకున్నాను. అది హోరు పెడుతుంటే నా మాట నాకే వినిపించదు.
ఆ ధైర్యంతో, ‘‘నా చెవిలో వినబడుతున్న అదృశ్యశక్తీ! ఈ ఏలియన్సు ప్రమాదంనుంచి నేనెలా బయటపడాలో చెప్పు’’ అని గట్టిగా అరిచాను.
నా మాట నాకే వినబడ్డం లేదు. అదృశ్యశక్తి వింటుందా అని అనుమానించాను కానీ -
ఆ శక్తి నాలోనే దాగుని ఉన్నట్లుంది - ‘‘బోధివృక్షం కింద సిద్ధార్థుడికి జ్ఞానోదయమైంంది. నీకు ప్రేమోదయమౌతుంది’’ అని నా చెవిలో చెప్పింది.
‘‘బోధివృక్షమా, దానికోసం గయ వెళ్లాలా?’’ అన్నాను.
‘‘ఉయ్యాల్లో పిల్లాణ్ణెట్టుకుని ఊరంతా వెదికినట్లుంది నీ పద్ధతి. బోధివృక్షానికి గయ వెళ్లాలా?’’ అని చెవిలో నవ్వు.
ఆ నవ్వు వికట్టాహాసమై చెవులు బద్దలై జలపాతపు హోరుని మించి పోతుంటే - పెద్ద కేక పెట్టాను.
చటుక్కున మెలకువొచ్చింది. కల కరిగిపోయింది.
నిజంగా కేకెట్టానో లేదో తెలియదు. కానీ కలలో బోధివృక్షం ప్రసక్తి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ బోధివృక్షం నాకు దగ్గరోనే ఉంది….
ఇంకా ఉంది...
ప్రేమ‘భ్రమ’రం - 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

వసుంధర పరిచయం మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
https://www.manatelugukathalu.com/profile/vasumdhara/profile
వసుంధర అక్షరజాలం | తెలుగు సాహితీ సుధా కథా వేదిక (wordpress.com)