top of page

ప్రేమ ‘భ్రమ’రం - 3

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Prema Bhramaram - 3' New Telugu Web


Series Written By Vasundhara


రచన: వసుంధర


వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం మూడవ భాగం


గత ఎపిసోడ్ లో...

నా పేరు విచల్.

మా పెదనాన్నగారమ్మాయి సరయు.

పై చదువులకు అమెరికా వెళ్లాలనుకుంది సరయు.

తాను అక్కడ ప్రేమలో పడకూడదన్న షరతు మీద పెదనాన్నని ఒప్పిస్తాను.

కానీ నేను ప్రేమ వివాహం చేసుకుంటే తను కూడా అలానే చేస్తానంది సరయు.

నా క్లాస్‌మేట్‌ కిషోర్‌ వాళ్ళ నాన్న రమణయ్య కాల్ చేసి, నన్ను రమ్మంటాడు.

ట్రైన్ లో నాకు ఒక జంట పరిచయమవుతారు.


ఇక ప్రేమ ‘భ్రమ’రం మూడవ భాగం చదవండి ...


‘‘భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానం ప్రేమ. ప్రియుడికీ ప్రేయసికీ అనుసంధానం ప్రేమ’’


ఈ మాట నాకు కిషోర్‌ చెప్పాడు. అది ఉపదేశం కాదు. నా ఉపదేశానికి సమాధానం.

కిషోర్‌ నాకు కాలేజిలో క్లాస్‌మేటు. వేర్వేరు కంపెనీల్లోనే ఐనా ఒకే ఊళ్లో ఉద్యోగాలు చేస్తున్నాం.


వాడు, స్వర అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇరుపక్షాల పెద్దవాళ్లూ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు.


ఆ పెళ్లి జరిగితే రెండు కుటుంబాలూ వాళ్లని వెలేస్తాయి. అది తెలిసీ వాళ్లు పెళ్లికి సిద్ధపడ్డారు.


ఆ పెళ్లి జరక్కుండా ఆపాలని రెండు కుటుంబాలూ తీవ్రంగా ప్రయత్నాలు మొదలెట్టాయి.


ఏ పుట్టలో ఏ పాముంటుందోనని తెలిసినవాళ్లందరికీ చెప్పి రాయబారాలు పంపుతున్నారు.


అంతవరకూ ఇది మామూలు ప్రేమ కథ.


రాయబారానికి కిషోర్‌ తండ్రి ఎంచుకున్నవారిలో నేను కూడా ఉండడంతో - ఈ ప్రేమకథలో నేనూ ఒక పాత్ర కావాల్సి వచ్చింది.


‘‘మావాడూ నువ్వూ మంచి మిత్రులు. వాడి చెడు గుణాల్లో ఒక్కటీ నీకు అలవడలేదు. నీ మంచి గుణాల్లో ఒక్కటీ వాడికి వంటబట్టలేదు’’ అని ముందు నన్ను పొగిడాడు కిషోర్‌ తండ్రి.


నా గురించి ఆయనకి అంతగా తెలియదని తెలిసినా, పోనీ పొగిడాడులే అని సంబరపడ్డాను. ఐతే - ‘పొగడ్తల్లో ఎప్పుడూ ఓ క్యాచ్‌ ఉంటుంది సుమా’ అని మనసు హెచ్చరించింది.


‘‘ఇది తప్పకుండా మా పెంపకం లోపమే. మగపిల్లాడని చిన్నప్పట్నించీ గారం కాస్త ఎక్కువ చేశాం’’ అని పశ్చాత్తాపపడ్డాడు.


నా దగ్గర పశ్చాత్తాపపడ్డం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఐతే - ‘ఎంతోకొంత రాజకీయముంటే తప్ప మనిషి పశ్చాత్తాపపడడు’ అని మనసు హెచ్చరించింది.


‘‘వాడు మా మాట వినడు. కానీ నువ్వంటే వాడికి మహా గురి. నువ్వు తలచుకుంటే వాడి మనసు మార్చి - మా కుటుంబాన్ని కాపాడగలవు’’ అన్నారు.


వినడానికి బాగున్నా - ‘ఇంత గొప్ప సత్యానికి అధారాలేమిటో’ అని మనసు ఎక్కదీసింది.

కిషొర్‌ తండ్రిని చూస్తే.... మొసలి నోటికి కాలు చిక్కిన గజేంద్రుడిలా ఉన్నాడు. చూపులు నన్ను శ్రీమహావిష్ణువుని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి.


‘సిరికిం జెప్పడు’ లెవెల్లో ఫీలైపోతున్నావేమో - నువ్వేంటో ఆయన కాదు, నువ్వు తెలుసుకోవాలి - అని హితవు చెప్పింది మనసు.


మనసుని కాస్త పక్కన పెట్టి - నా ఆలోచనల్ని కిషోర్‌ మీదకి మళ్లించాను.

అసలు కిషోర్‌ ఇలా చేసేడంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది.

వాడికి వాళ్ల అమ్మా నాన్నా మాట వేదం.


కాలేజిలో పరీక్ష ఫీజు కట్టడానికి వాళ్ల నాన్న పెట్టించిన ముహూర్తం పాటించేవాడు. వాడి బట్టల సెలక్షన్‌ వాళ్లమ్మ చేస్తుందని గర్వంగా చెప్పేవాడు. అమ్మ చెప్పిందని - కాలేజిలో కొంచెం ఫాస్టుగా ఉండే అమ్మాయిలకు వీలైనంత దూరంలో ఉండేవాడు.


సినిమాలు తన కుటుంబంతోనే చూసేవాడు. ఎప్పుడైనా ఫ్రెండ్సుతో వెళ్లినా - తలిదండ్రులు అప్రూవ్‌ చేసిన వాటికే వెళ్లేవాడు.


అమ్మకూచి, నాన్నకూచి - అని కొందరు వాణ్ణి ఎగతాళి చేస్తే పట్టించుకునేవాడు కాదు.

‘‘పెద్దవాళ్ల మాట వినకపోతే తప్పు కానీ, వినడం తప్పు కాదు కదా’’ అనేవాడు.


అన్ని విషయాల్లోనూ వాడి అభిప్రాయాలు నాకు నచ్చకపోయినా - తనకి తోచింది చెయ్యడానికి సిగ్గు పడకపోవడం మాత్రం - అరుదైన గొప్ప గుణం అనిపించేది.


‘‘మనం ఇరవయ్యొకటో శతాబ్దంలో ఉంటున్నాం. కాలానికి తగ్గట్లు మసలాలి’’ అని అప్పుడప్పుడు హెచ్చరించేవాణ్ణి.


‘‘నేనేమైనా అల్లరి పనులు చేసేనా, ఉగ్రవాదులతో కలిసేనా, మందు కొడుతున్నానా, పొల్యూషన్‌ పెంచుతున్నానా - నాకెందుకీ ఉపదేశాలు?’’ అని అభ్యంతరం చెప్పేవాడు.

నిజమే - వాడేం తేడాగా ఉండడం లేదు.


‘‘ఔననుకో - మరీ అమ్మకూచి, నాన్నకూచిగా ఉంటే - నలుగురూ నవ్వుతారు కదా!’’ అన్నాను.


వాడు నవ్వి, ‘‘నేనేమన్నా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతున్నానా, ఎక్కడికైనా వెళ్లడానికి నాన్న సాయం తీసుకుంటున్నానా? అమ్మ సెలక్షన్‌ నాకు నచ్చుతుంది. నాన్న పెట్టే ముహూర్తాలమీద నమ్మకముంది. అంతే! నువ్వెప్పుడైనా మా ఇంటికొస్తే తెలుస్తుంది. ఇంట్లో చాలా విషయాల్లో నా మాటే నెగ్గాలి. నన్ను కాదనే ధైర్యం మావాళ్లకెవరికీ లేదు. మా బామ్మయితే - నన్నో పెంకి ఘటాన్ని చేశారని అమ్మనీ, నాన్ననీ తిట్టి పోస్తుంటుంది’’ అన్నాడు.


వాడు తనని కవర్‌ చేసుకుంటున్నాడో, నిజమే చెబుతున్నాడో అప్పుడు నాకు తెలియలేదు.


కానీ - ఈ విషయం తెలిసిన మరో మిత్రుడన్నాడు - ‘‘వీడు చెప్పింది నిజమైతే - ఏదో రోజున వీడు ప్రేమలో పడి, పెద్దవాళ్లని ఎదిరిస్తాడు’’ అన్నాడు. ఇప్పుడదే నిజమైంది.


పరీక్ష ఫీజు కట్టడానికి తండ్రి పెట్టిన ముహూర్తాన్ని అనుసరించినవాడు - వేసుకునే బట్టల ఎంపికకి తల్లిపై ఆధారపడినవాడు -

ఇప్పుడు తన జీవితభాగస్వామి ఎంపికని తనే చేసుకున్నాడు. అదీ వారి ఇష్టానికీ, అభీష్టానికీ వ్యతిరేకంగా...


తండ్రి అసహాయుడై, తన పెంపకంలో లోపముందని వాపోతూ నన్ను పిలిచాడు. తనవల్ల కాని పని నేను చెయ్యగలనని ఆశ పడుతున్నాడు.


నాకు తెలుసు - ఏ పుట్టలో ఏ పాముంటుందోనని ఆయన నన్ను పిలిచాడని!

నేను పుట్టలో పాముని కాదు, గోదావరీదేవాడికి కుక్కతోకలాంటివాణ్ణని నాకు తెలుసు. కానీ అంత పెద్దమనిషి - నాలాంటి సామాన్యుణ్ణి శ్రీమహావిష్ణువు అన్నట్లు చూస్తే - ఎలా లైట్‌ తీసుకోగలను?


ఏదో సాధించాలన్న పట్టుదలతోనే వాడి గదికి వెళ్లాను.

ఈ ప్రేమా గీమా అన్నవి చిన్నప్పట్నించీ నచ్చవన్న ముద్ర ఎలాగూ నామీద పడింది.

అది నా పట్టుదలకు తోడయింది.


ఐతే, నేను ప్రేమ పెళ్లిళ్లకి వ్యతిరేకినని వాడి దగ్గర నొక్కించి ప్రయోజనముండదని నాకు తెలుసు. అందుకే, ‘‘పాతికేళ్లు పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నల ప్రేమకంటే, నిన్న కాక మొన్న పరిచయమైన స్వర ప్రేమ నీకెక్కువైందా?’’ అని - ఇలాంటప్పుడు అంతా వాడే రొటీన్‌ సెంటిమెంటల్‌ డైలాగ్‌ వాడాను.


కానీ కిషోర్‌ ప్రేమలో ముదిరిపోయినట్లున్నాడు.

‘‘అమ్మా నాన్నా పాతికేళ్లు పెంచారంటున్నావ్‌. నా వయసిప్పుడు ఇరవయ్యారు. అంటే వాళ్లో ఏడాది మిస్సయ్యారు. ఆ ఏడాదిలో వాళ్ల ప్రేమ పలచనై పోయిందేమో’’ అన్నాడు వెంటనే.


‘‘పోనీలే, డైలాగు మారుస్తాను. ఇరవయ్యారేళ్లు పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల ప్రేమకంటే.....’’ అని ఏదో అనబోతుండగా - ‘‘అది సరే - స్వర నాకు నిన్న కాక మొన్న పరిచయమైందన్నావ్‌. కానీ మేము ప్రేమించుకోవడం మొదలెట్టే ఏడాది దాటింది.....’’ అన్నాడు కిషోర్‌.


‘‘నాయనా - కోడిగుడ్డుకి ఈకలు పీకకు’’ అని, ‘‘అదిగో అప్పుడే ఏదో అనబోతున్నావ్‌ - అర్థమయిందిలే - నువ్వు నాకు నాయనవెప్పుడయ్యావనేగా - ఇప్పుడు నేను వాడినవన్నీ పెద్దమనుషులు వాడే పడికట్టు పదాలు. వాటి అర్థం ఆరా తియ్యకూడదు. అర్థం చేసుకోవాలి’’ అన్నాను.


‘‘ఇంతకీ నువ్వు నాకంటే పెద్దమనిషివి ఎప్పుడయ్యావ్‌?’’ అన్నాడు కిషోర్‌. వాడు వయసులో నాకంటే రెండో మూడో నెలలు పెద్ద.


‘‘ఇది వయసుతో వచ్చే పెద్దరికం కాదు. ఎప్పుడైతే ప్రేమలో పడ్డావో అప్పుడే నువ్వు కాస్త చిన్నవాడివయ్యావ్‌! ప్రేమలో పడలేదు కాబట్టి నాలో ఇంకా ఏ మార్పూ లేదు. కాబట్టి లేనిపోని లాజిక్కులు తియ్యక, చెప్పేది జాగ్రత్తగా విను. ప్రేమంటే అమ్మది. ప్రేమంటే నాన్నది. ప్రేమంటే రక్తసంబంధీకులది. మిగతావన్నీ అవసరాలు, ఆకర్షణలు, మోహాలు, వ్యామోహాలు. వాటికి మనం ప్రేమ అనే పేరు పెట్టి అసలు సిసలు ప్రేమకు దూరమవుతుంటాం’’ అన్నాను.


కిషోర్‌ నాకేసి అదోలా చూసి అదోలాగే నవ్వాడు. ఆ నవ్వు నాకంటే బాగా పెద్దవాడు నా అమాయకత్వాన్ని చూసి నవ్వినట్లుంది.


‘‘నీ నవ్వుతో జవాబివ్వకుండా తప్పించుకోలేవు. మాటకి మాటలోనే బదులివ్వాలి’’ అన్నాను. ఐనా కిషోర్‌ మళ్లీ నవ్వాడు. ఐతే ఈసారి నవ్వి ఊరుకోకుండా జవాబు కూడా ఇచ్చాడు. ఆ జవాబులో - నాకు కూడా స్వానుభవమైన కొన్ని జీవిత సత్యాలున్నాయి.

రెండు మూడేళ్ల వయసులో జరిగిన విశేషాలు కూడా కొన్ని కిషోర్‌కి చూచాయగా గుర్తున్నాయి.


అప్పట్లో వాణ్ణి చాలామందే ముద్దు చేసేవారు, చేరదీసేవారు.

కాసేపు వాళ్లు చాలా నచ్చేసేవారు. కానీ వాళ్లతో కొద్ది క్షణాలు గడపగానే వాడికి అమ్మ గుర్తొచ్చేది. అమ్మ లేకుండా ఉండలేననిపించేది.


అదే - వాడికి ఐదారేళ్లొచ్చేసరికి - అమ్మ పెంపకం తీరు మారింది.

ఆల్లరి చేస్తే తిట్టేది. చెప్పిన మాట వినకపోతే కసిరేది. వాణ్ణి ఉత్తమంగా తీర్చిదిద్దాలన్న తాపత్రయంలో క్రమశిక్షణ పాటించమనేది. నియమాలు విధించేది. అవి వాడికి నచ్చేవి కాదు. ఎదురు తిరిగేవాడు.


అప్పుడు అమ్మ వాణ్ణి మృదువుగానే అయినా శిక్షించేది. వాడు ఏడ్చేవాడు. అలాంటప్పుడు బామ్మ వాణ్ణి వెనకేసుకొచ్చి అమ్మని గట్టిగా మందలించేది.

‘‘చిన్నపిల్లాడు. వాడిమీద ఆంక్షలు పెట్టావంటే నేనూరుకోను’’ అని దెబ్బలాడేది కూడా.

దాంతో కిషోర్‌‌కి బామ్మ అమ్మకంటే ఎక్కువగా నచ్చేసేది. ఐతే అందులో వాడికి కొన్ని ఇబ్బందులెదురయ్యాయి.


బామ్మకి సేవలు చేయించుకోవడమే తప్ప చెయ్యడం రాదు. మనవణ్ణి కూడా దూరాన్నించి ముద్దులాడ్డమే తప్ప ఎప్పుడూ చేయి చాపి ఎత్తుకోలేదు. ఇంటి పనుల సంగతి సరే, మనవడి పనుల్లో కూడా ఆమె వేలి గోరు కూడా తగలనివ్వదు.


అవసరాలు అమ్మే తీర్చాలి కాబట్టి, కిషోర్‌ అమ్మను దూరం పెట్టలేకపోయేవాడు. ఐనా ఒకోసారి వాడు బామ్మ దగ్గర ఎక్కువ సేపుండేవాడు. బామ్మపై ఇష్టం కాస్త ఎక్కువగా చూపించేవాడు.


అలాంటప్పుడు అమ్మ వాణ్ణి దూరం పెట్టేది. అందుకని కూడా వాడు బామ్మకి ఎక్కువ చేరిక కాలేదు.


అమ్మని కూడా కాదని బాగా చేరికయింది - అమ్మమ్మ దగ్గరే.

ఆమె ఆప్పుడప్పుడు వీళ్లింటికి వచ్చేది. కిషోర్‌ని బాగా చేరదీసేది. అతిగా ముద్దు చేసేది. చక్కని కథలు చెప్పేది. తల్లి కిషోర్‌ని ఏమైనా అంటే - మందలించేది, దెబ్బలాడేది.

ఆమె ఏమన్నా సరే - కిషోర్‌ తల్లి ముచ్చటపడేదే తప్ప, నొచ్చుకునేది కాదు.


కిషోర్‌ అమ్మమ్మకి చేరికైతే ఆమె ఎంతో సంతోషించేది, ఇతరులతో చెప్పుకుని గర్వపడేది కూడా!


అన్నివిధాలా బాగుండడంతో - కిషోర్‌కి అనిపించేది - అమ్మమ్మ ఎప్పుడూ తమ దగ్గరే ఉండిపోతే బాగుణ్ణని!

‘‘ఇవన్నీ నాకూ స్వానుభవమే కానీ, ఇప్పుడు వీటి ప్రసక్తి ఎందుకు?’’ అన్నాను కొంచెం విసుగ్గా.


‘‘ఏమీ చెయ్యలేని అసహాయదశలో అమ్మ ప్రేమ నాకానందాన్నిచ్చిన మాట నిజమే కానీ - అవసరాలు మారుతుంటే - వేరేచోట ప్రేమను వెతుక్కునే ప్రయత్నాలు ఐదేళ్ల వయసునించే మొదలెట్టాను నేను’’ అన్నాడు కిషోర్‌.


అర్థమైంది.

అప్పట్లో కిషోర్‌ తనకేమాత్రమూ ఇబ్బంది కలిగించని విషయాల్లో మాత్రమే తలిదండ్రుల మాటల్ని బుద్ధిగా పాటించేవాడు. కానీ మానసికంగా వాళ్లని కొంత దూరంలో ఉంచేవాడు. ఇప్పుడు కిషోర్‌కి కొత్త అవసరాలు, సరదాలు కావాల్సొచ్చాయి. అవి తీరడానికి అమ్మ కాదు, అమ్మాయి కావాలి. వాడి ఉద్దేశ్యంలో ఆ అమ్మాయి స్వర.


‘‘ప్రేమంటే ఓ అవసరమో, సరదాయో అని తేల్చేశావ్‌’’ అన్నాను నిరసనగా.

‘‘నేనలా అనలేదు. నా ప్రేమని నీ భాషలోకి తర్జుమా చేసి చెప్పానంతే!’’ అన్నాడు కిషోర్‌.

దెబ్బ కొట్టాడు.


అసలు సిసలు ప్రేమ అమ్మానాన్నలదీ, రక్తసంబంధీకులదీ - అన్నాను నేను.


ఆ ప్రేమని అవసరాలతో ముడిపెట్టి - ఇప్పటి తన ప్రేమని సమర్థించుకున్నాడు కిషోర్‌.

‘‘మరి నీ భాషలో ప్రేమంటే ఏమిటో చెప్పు’’ అన్నాను.


‘‘అది భాషలకందని అనుభూతి. నీలో ప్రేమ పుట్టినప్పుడు మాత్రమే తెలుస్తుంది’’

‘‘ఐతే ఈ జన్మకి నాకు ప్రేమంటే ఏమిటో తెలిసే అవకాశం లేదు’’ నిట్టూర్చాను.


ముందనుకున్నాను - ప్రేమపట్ల నా విముఖతను ప్రస్తావించకూడదని. కానీ ఇప్పుడు తప్పనిసరయింది.


నేను పెద్దలు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వాడు గ్రహించాలి.

కాలేజి రోజుల్నించీ తెలిసినవాడు. నాకూ అంతో ఇంతో వివేకముందని ఎరిగినవాడు. నేను వెళ్లేక ఈ విషయమై సందిగ్ధంలో పడతాడని నా ఆశ!


కానీ కిషోర్‌ నా మాటని మరో కోణంలో దర్శించాడు. నాకు ప్రేమించే యోగ్యత లేదన్న నిస్పృహని అంటగట్టాలనుకున్నాడు.


‘‘అలా నిరాశ పడకు. ఒక్కసారి స్వరని కలుసుకుని మాట్లాడు. నన్ను హెచ్చరించినందుకు నొచ్చుకుంటావు. అంతే కాదు - ప్రేమంటే ఏమిటో నీకు ఈ జన్మలోనే తెలుస్తుంది’’ అన్నాడు కిషోర్‌.


ఊహించలేదు వాడలాగంటాడని!

వాడి మాటల్లో మరో కోణాన్ని వెదకడానికి కొన్ని క్షణాలు పట్టింది.


‘‘తను నిన్ను ప్రేమలోకి దింపడమే కాక - ప్రేమ గురించి ఇతరులకు ప్రవచనాలు చెప్పడం కూడా మొదలెట్టిందా నీ స్వర?’’ అన్నాను చిరాగ్గా.


‘‘కాలానుగుణంగా ప్రవర్తించడంలో తప్పేముంది? ఈ శతాబ్దం నాది అన్నాడు మహాకవి శ్రీశ్రీ ఇరవయ్యో శతాబ్దంలో. సరేనన్నాం. ఇప్పుడు ప్రవచనాలొచ్చి, ఈ ఇరవయ్యొకటో శతాబ్దం మాది - అంటున్నాయి. దాందేముంది, సరేనందాం’’


‘‘నీకు తెలియదేమో - నేను ప్రవచనాలకు విముఖుణ్ణి’’ అన్నాను.

‘‘అరే, అంటే - నువ్వు సంప్రదాయాన్ని పాటించేది ఒక్క పెళ్లి విషయంలోనేనా?’’ అన్నాడు కిషోర్‌.


గట్టి దెబ్బే కొట్టాడు. ప్రవచనాలు మన సంప్రదాయంలో భాగం. వాటిని చిన్నబుచ్చడం, వాటికి విముఖంగా ఉండడం - కనీసం సంప్రదాయవాదులమని చెప్పుకునేవారికి తగదు.

‘‘వేదాలు, పురాణాలు వంటి అతి ప్రాచీన సాహిత్యాన్ని ఔపోసన పట్టిన పండితుల ప్రవచనాలకు నేనెప్పుడూ విముఖుణ్ణి కాను. నా విముఖత - ప్రేమ ప్రవచనాలమీద’’ వివరణ ఇచ్చాను.


‘‘నువ్వు నాకు సంజాయిషీలూ, వివరణలూ ఇవ్వనక్కర్లేదు. ఒక్కసారి స్వరని కలుసుకో. నీకు తోచింది నువ్వు చెప్పు. తను చెప్పింది విను. ఆ తర్వాత నా దగ్గరకొచ్చి - నీకు తోచిన ఉపదేశం చెయ్యి. బుద్ధిగా వింటాను. శ్రద్ధగా పాటిస్తాను’’ అన్నాడు కిషోర్‌.


వ్యంగ్యంగా అన్నట్లు లేదు - ఆ గొంతులో ధ్వనించిన నిబద్ధత ఉంది మరి! ఎంత నిబద్ధత అంటే - నన్ను ఆరాధించే కజిన్‌ సిస్టర్‌ సరయుని గుర్తు చేసింది.

తెల్లబోయాను.


నాకు మాత్రం కిషోర్‌ మాటిస్తున్నట్లు లేదు. సవాలు చేస్తున్నట్లుంది!

ఇంతకీ కిషోర్‌ నాకు చెప్పదల్చుకున్నదేమిటి?


ఒక్కసారి స్వరని కలుసుకుంటే నా ఆలోచనలు పూర్తిగా మారిపోతాయనా? ఐనా ఎందుకు మారిపోతాయి. ఎలా మారిపోతాయి?

ఆలోచిస్తే -

స్వర అందమైనది.


అందమైన ఆడపిల్లని నొప్పించాలని నా వయసు యువకుడెవరూ అనుకోడు. నేను స్వరని కలుసుకుని - ‘మా కిషోర్‌ని పెళ్లి చేసుకోకు’ - అని చెప్పగలనా? ఆమె ప్రేమ కథకి నేను విలన్‌ అన్న భావన ఆమెలో రేగడం భరించగలనా?

అదేనా కిషోర్‌ ధైర్యం?


అప్పుడు నాకు సరయు గుర్తుకొచ్చింది.

పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకోమని ఆమెని ప్రబోధించాను. నా ప్రబోధాన్ని తెలివిగా నాకే తిప్పికొట్టిందామె.


పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకోవడం ఆశయం నాకు. ఆ ఆశయాన్ని బాధ్యతగా మార్చిందామె.


ఏదిఏమైనా స్వతహాగా బిడియస్థుడినని నా గురించి నేననుకుంటాను. కానీ నన్ను చూస్తే -

నాతో సరయు - భవిష్యత్తులో తన పెళ్లి గురించి మాట్లాడింది.


నాతో పద్మ - తన ప్రేమ గురించి మాట్లాడ్డమే కాక, ముక్త ఆనే అపరిచిత యువతిని కలుసుకునేందుకు పురిగొల్పింది.


ఇప్పుడు కిషోర్‌ తెలివిగా నన్ను తన ప్రియురాలు స్వర వైపు తరిమాడు.

చిన్నప్పట్నించీ తెలిసిన సరయుకి, నాకు చెల్లి వరస ఐన సరయుకి - ఆడపిల్లయిన కారణంగా మనసు నొప్పించే సలహా ఇవ్వలేకపోయాను.


స్వర నాకు అపరిచిత. తలిదండ్రుల్ని కూడా కాదని కిషోర్‌ ఆమెని కావాలనుకుంటున్నాడంటే - తను అందగత్తె అయుండాలి.

నేను యువకుణ్ణి. ఆమె అందమైన అపరిచిత యువతి.


నేనామె వద్దకు వెళ్లి, పెళ్లికి సంబంధించినంతవరకు ప్రేమ ఎంత చెడ్డదో చెప్పాలి.

అదెంత కష్టమైన పనో ఊహించడం కష్టం కాదు. ఐనా - సరయు, పద్మలు నాకిచ్చిన ధైర్యాన్ని నమ్ముకుని సరేనన్నాను.


కానీ అందులో ఊహించని ప్రమాదం దాగి ఉండొచ్చన్న అనుమానం నాకప్పుడు కలుగలేదు.

‘‘వేడి చల్లారేలోగానే పెనంమీద మరో అట్టు వేసెయ్యాలి. ఈ సాయంత్రమే నీకు స్వరని పరిచయం చేస్తాను’’ అన్నాడు కిషోర్‌.


తన ప్రియురాల్ని పరిచయం చేయడానికి వాడికి అంత ఆత్రమేమిటో అని నవ్వుకున్నాను....

- - - - -

ఆ పార్కు పేరు ప్రేమవనం.

అందులో పరిమళాలు వెదజల్లే పూలమొక్కలున్నాయి. మండుటెండలోనూ చల్లని నీడనిచ్చే వృక్షరాజాలున్నాయి. కనుచీకటికి కనువెలుగయ్యే రంగురంగుల దీపాలున్నాయి. ఆ వెలుగుకి శోభనిచ్చే జలయంత్రాలున్నాయి.


ఏడాది క్రితం కాబోలు ఒకసారి నేనా పార్కుకి వెళ్లాను. అక్కడ ఎన్నో యువజంటల్ని చూసినప్పుడు నాకా పార్కు పెద్ద వలలా కనబడింది. అక్కడి సదుపాయాలన్నీ ఎరలా తోచాయి. ప్రేమికుల జంటలన్నీ ఆ వలలో చిక్కిన చేపల్లా అనిపించాయి.

మళ్లీ ఆ పార్కుకి వెళ్లలేదు.


ఈరోజు కిషోర్‌ నన్నిక్కడికి తీసుకొచ్చాడు.

సాయంత్రం ఆరింటికి అక్కడికి రావలసిందిగా స్వరకి చెప్పాడతడు.

మేమా పార్కులో అడుగెట్టేసరికి ఆరూ పదయింది.


‘‘స్వరకి టైమంటే టైమే - సంజాయిషీ ఇచ్చుకోవాలి’’ అన్నాడు కిషోర్‌.

‘‘తను ఇప్పటికే ఇక్కడికొచ్చేసి ఉంటే - అప్పుడాలోచించొచ్చులే సంజాయిషీ గురించి’’ అన్నాను.


నాకు ఆడవాళ్ల టైం సెన్సుమీద సదభిప్రాయం లేదు. వాళ్ల గడియారాలు మనసుతో నడుస్తాయి.

‘‘ఐదు ఇముషాల్లో రెడీ ఔతాను’’ అనే అమ్మ - గదిలోంచి బయటకి రావడానికి సాధారణంగా అరగంట పడుతుంది.


ఆడవాళ్లకి అది మినిమం లిమిట్‌. దానికి మాగ్జిమం లిమిట్‌ లేదు.

‘‘ఐదు నిమషాలు కూర్చోండి. రెండు నిముషాల్లో వంటైపోతుంది’’ అంటుంది అమ్మ.

రెండు నిముషాల్లో ఐపోవడానికి అమ్మ వండేది నూడుల్సు కాదు. అన్నం, కూర, పులుసు వగైరాలు.


నూడుల్సుకి రెండు నిముషాలంటే రెండు నిముషాలే కావచ్చేమో - అమ్మకి రెండు నిముషాలంటే అరగంటనుంచి రెండు గంటలదాకా కావచ్చు.


‘‘అమ్మకోసం గడియారాలని వేరే తయారు చెయ్యాలి’’ అన్నానోసారి నేను.

అమ్మ నవ్వి, ‘‘ఎప్పుడో తయారు చేశార్రా - వాటిని ఎప్పటికప్పుడు బ్యాంకులవాళ్లు కొనెయ్యడంతో మీ దాకా రావడం లేదు’’ అంది.


తనని టైం విషయంలో ఎగతాళి చేసినప్పుడల్లా - అమ్మ బ్యాంకుల ప్రసక్తి తెస్తుంది. అమ్మ చెప్పేవన్నీ మా ఇంట్లో అందరికీ స్వానుభవం కాబట్టి - ఆమె వ్యాఖ్యలు కొట్టిపారేయలేం. విషయమేమిటంటే -

మాకెవ్వరికీ తీరుబడి దొరక్క - అప్పుడప్పుడు బ్యాంకు పనులు అమ్మకే అప్పజెబుతుంటాం.


చాలా పనులు మొబైల్‌ బ్యాంకింగులో ఐపోయినా - అడపాతడపా పెర్సనల్‌గా బ్యాంకుకెళ్లాల్సి ఉంటుంది కదా - అందుకు!

బ్యాంకులో - గోడకు వేలాడేసిన ఓ బోర్డుమీద - ‘‘మీరు స్టవ్‌ మీద నూడుల్సు పెట్టండి. అవి ఉడికేలోగా మా బ్యాంకులో కొత్త అకౌంటు తెరవొచ్చు’’ అని వ్రాసి ఉన్నది అమ్మకి కంఠతా.


‘‘చెక్కు డిపాజిట్టుకి వెళ్లాను. గంట పట్టింది. కేవైసీలు ఇవ్వడానికెళ్లాను. గంటన్నర పట్టింది. ఇవి ఎక్సెప్షన్సు అనుకో. ఏ పనికీ అరగంటకి తక్కువ పట్టదు - ఒక్క ఆ బోర్డు తగిలించడానికి తప్ప’’ అంటుంది అమ్మ.


ఆ బోర్డుని చూసి తమ పనితీరుకి సిగ్గు పడాలని బ్యాంకు ఉద్యోగుల్లో ఒక్కరు కూడా అనుకోరు. వాళ్లు సిగ్గు పడాలని కస్టమర్సూ అనుకోరు.

ఎవరి గోల వారిది. ఎవరి హడావుడి వారిది.


‘‘అందరికీ నీకులాంటి పరిశీలన, స్పందన ఉంటే - మన దేశం ఇప్పటికే ఎక్కడో ఉండేది’’ అని ప్రతి ఒక్కరం ఆమెని మెచ్చుకుంటాం.

ఇలాంటి మెప్పు అమ్మని సంబరపెట్టదు.


మన దేశంలో ఇంచుమించు అందరికీ విమర్శ ఒక హాబీ అట. ఎంత గొప్ప సమస్యనైనా - ఓసారి విమర్శించేసి మర్చిపోతాముట.


‘‘జనం బ్యాంకులో ఆ బోర్డుని తీసెయ్యమని అననంత కాలం - ఇంట్లో అమ్మ గడియారాన్ని మీరు గౌరవించి తీరాల్సిందే’’ అంది అమ్మ.


ఇంతకీ -

అమ్మ కారణంగా హాల్లో సినిమాకి ఆలస్యమవదు. ప్రయాణానికి బస్సు, రైలు మిస్సవం. పరీక్షలకి కూడా ఠంచనుగా టైముకి వెళ్లగలుగుతాం.


కానీ తను చెప్పే టైం మాత్రం - యంత్రాలకి అతీతం. అందుకే అది మనసుతో పని చేస్తుందన్నాను.

అమ్మ వల్ల నేను ఆటలు, నాన్న క్లబ్బు, మేం పెళ్లిలాంటి వేడుకలు - వగైరాలకు కాస్త ఆలస్యంగా వెళ్లాల్సొచ్చేది. కానీ అమ్మెప్పుడూ సంజాయిషీ ఇవ్వలేదు.

ఇప్పుడు కిషోర్‌ స్వరకు సంజాయిషీ ఇవ్వాలంటే నవ్వొచ్చింది. కానీ పైకి ఏమీ అనలేదు.

ఇద్దరం ఓ ఐదు నిముషాలు కలిసి నడిచాం, మాటల్లేకుండా.


ఉన్నట్లుండి అన్నాడు కిషోర్‌, ‘‘అదిగో స్వర’’ అని.

అటు చూసాను.


రంగలు మారుస్తున్న నీటి జల్లులతో శోభాయమానంగా ఓ జలయంత్రం. దాని ఎదుట కాస్త దూరంలో ఓ సిమెంటు బల్ల. బల్లకి అటు, ఇటు ఎర్రటి పూలతో రమణీయంగా గులాబి మొక్కలు. ఆ బల్ల మధ్యలో ఒకే ఒక అమ్మాయి.


సాలోచనగా జలయంత్రాల్నే చూస్తున్న ఆమె మమ్మల్ని చూడలేదు.


కాస్త దగ్గరయ్యేసరికి -

ఆకు పచ్చని చీర, అదే రంగు బ్లవుజు. కట్టు, బొట్టు - అన్నీ మ్యాచింగు.

జలయంత్రాల రంగులు ప్రతిఫలించడం వల్లనేమో - ఆమె ముఖం కూడా ఓ సవర్ణపుష్పంలా ఉంది.


బల్ల మధ్య మరో పూల మొక్కలా ఉన్న ఆమె - పార్కుకి తనూ ప్రత్యేక శోభనిచ్చింది.

ఆమె మమ్మల్ని చూడగానే, చటుక్కున లేచి నిలబడి సన్నగా నవ్వింది.


ఆ నవ్వు ఏం వెలుగులు చిందించిందో జలయంత్రాలు కొత్త రంగులకు మారాయి.

‘‘విచల్‌’’ అన్నాడు కిషోర్‌ నన్ను స్వరకి పరిచయం చేస్తూ.

చేతులు జోడించాను.


‘‘స్వర’’ అందామె నాకు చేతులు జోడించి.

ఆమె కోకిల కాదు. ఎందుకంటే - అందానికి తగ్గ గొంతు ఆమెది.


సహజంగా కొంత. వయసువల్ల కొంత - ఆమె చాలా అందంగా ఉంది.

కిషోర్‌ ఆమెని ప్రేమిస్తున్నాడని తెలుసు కాబట్టి - ఆమెని చూడగానే నాకు సరయు స్ఫురించింది. ఆ స్ఫురణ - తదుపరి మా మధ్య మాటలకు ప్రయోజనకారి ఔతుందని కూడా అనిపించింది.


‘‘మీరు మాట్లాడుకుంటూండండి. నేనో అరగంటలో వస్తాను’’ అని వెళ్లిపోయాడు కిషోర్‌. మరో మాట అనే అవకాశం ఇద్దరికీ ఇవ్వలేదు.

ఎలా మొదలెట్టాలా అని తటపటాయిస్తున్నాను.

స్వరకు చొరవ ఉంది - ‘‘కూర్చోండి’’ అంది.


ఎక్కడ కూర్చోవాలో తెలియడానికి అన్నట్లుగా - తను బెంచిమీద అటు ఓ గులాబికి దగ్గర్లో కూర్చుంది.


అప్పుడామె ఆ గులాబికి ప్రత్యేక అలంకరణలా అనిపించింది.

నేను ఇటు మరో గులాబికి దగ్గర్లో కూర్చున్నాను.


మనుషుల్లో అందమంటే ఆడవాళ్లదేనన్న నిజం ఒప్పుకోక తప్పదు. నా పక్కనున్న గులాబి - అటువైపు గులాబిని చూసి అసూయ పడుతున్నట్లు అనిపించింది.

‘‘మిమ్మల్ని చూడగానే నాకు మా సరయు గుర్తుకొచ్చింది’’ అన్నాను సంభాషణకి ఉపక్రమిస్తూ.


‘‘సరయు ఎవరు?’’ అందామె కుతూహలంగా.

‘‘మా పెదనాన్నగారమ్మాయి. బీటెక్‌ చేసి పై చదువులకి అమెరికా వెళ్లింది’’ అన్నాను.

తనని చూసి చెల్లిని గుర్తు చేసుకున్నానంటే - అందమైన ఆడపిల్ల మెచ్చుకుంటుందా, నొచ్చుకుంటుందా?


మెచ్చుకోమని ఒకప్పటి మన సంప్రదాయం చెబుతుంది. కానీ - ‘మోస్ట్‌ డిజైరబుల్‌ వుమన్‌’ అనిపించుకోవాలని తాపత్రయపడుతున్న అమ్మాయిల సంఖ్య ఇప్పుడు బాగా ఎక్కువగానే ఉంది.


కానీ స్వర ప్రేమ ప్రవచనకర్త అనీ, ఆమె ఆలోచనల తీరే వేరనీ మర్చిపోయాను.

‘‘నన్ను చూస్తే గుర్తొచ్చిందంటే - తను కూడా ఎవరితోనైనా ప్రేమలో పడిందా?’’ అంది స్వర.


‘‘ఓహో ఈ రూటులో ఆలోచించావా?’’ అనుకున్నాను.

‘‘ఏ రూటులో ఆలోచించినా తనిప్పుడు నీకు దొరికిపోయింది. సరయు కథ చెప్పే అవకాశం తనే నీకిచ్చింది’’ అంది మనసు.


మనసుకి థాంక్సు చెప్పి, ఆ ఆవకాశం ఉపయోగించుకున్నాను.

పైచదువులకి అమెరికా వెడుతూ కూడా - పెళ్లి విషయంలో సంప్రదాయాన్ని పాటిస్తానని మాటిచ్చిన సరయు కథంతా తనకి చెప్పాను.


‘‘అర్థమయింది. మీరు సంప్రదాయాన్ని బాగా గౌరవిస్తారు. ఎంతలా అంటే సంప్రదాయాన్ని కాపాడ్డానికి మీ పెద్దవాళ్లు కూడా మీపై ఆధారపడతారు’’ అంది స్వర.

‘‘కరెక్టుగా గ్రహించారు. మరి మన సంప్రదాయంమీద మీ అభిప్రాయమేమిటి?’’ అన్నాను.

‘‘మన సంప్రదాయమంటే నాకూ ఇష్టమే అనుకునేదాన్ని. కానీ ప్రేమని గౌరవించదని తెలిసేక ఆ అభిప్రాయం మారింది’’ అంది స్వర.

‘‘ఎందుకని?’’ అన్నాను అర్థం కానట్లు.


‘‘మహాత్మా గాంధీ విదేశపాలనని నిరసిస్తూనే కుల మత వర్గ రహిత ప్రేమని ప్రబోధించాడు. మదర్‌ థెరిసా ప్రేమకే తన జీవితాన్ని అంకితం చేసి దీనజనుల్ని సేవించుకుంది. అలాంటి ప్రేమని నిరసించే ఏ తత్వాన్నీ నేను గౌరవించలేను - అది సంప్రదాయమైనా సరే!’’ అంది స్వర.


ఆమె తప్పు అభిప్రాయంలో ఉంది. అది తక్షణం సవరించడం నా బాధ్యత.

‘‘సంప్రదాయం అలాంటి ప్రేమని ఎన్నడూ నిరసించదు. నిరసిస్తే - నేనూ సంప్రదాయాన్ని ఏవగించుకునేవాణ్ణి’’ అన్నాను వెంటనే.


‘‘అలాంటి ప్రేమని నిరసించదన్నారు. మరి సంప్రదాయం ఎలాంటి ప్రేమని నిరసిస్తుంది?’’ అంది స్వర తనూ వెంటనే.

మంచి ప్రశ్న!


నేనామెకు ఏం చెప్పాలని వచ్చానో - అది చెప్పడానికి అవకాశమిచ్చే ప్రశ్న!

అప్పటికి నాకు ఆమెతో మాట్లాడ్డానికి బెరుకు కూడా తగ్గిందేమో, ‘‘మహాత్ముడి ప్రేమలోనూ, మదర్‌ థెరెసా ప్రేమలోనూ స్వార్థం లేదు. స్వార్థమున్న ప్రేమల్ని మాత్రమే సంప్రదాయం నిరసిస్తుంది’’ అన్నాను.


‘‘అంటే నా ప్రేమని సంప్రదాయం నిరసించదన్న మాట!’’ అంది స్వర చటుక్కున.

విషయంలోకి తనే వస్తుందనుకోలేదు. వచ్చినా అంత తొందరగా వస్తుందనుకోలేదు. నా ప్రశ్నని తన ప్రేమని సమర్థించుకుందుకు ఉపయోగించుకుంటుందని మొదలే అనుకోలేదు.


ఓ క్షణం ఏమనాలో తెలియలేదు. ‘‘కిషోర్‌ చెబితే ఏమో అనుకున్నాను. మీరతడికి నిజంగా చాలా మంచిమిత్రులు’’ అంది స్వర తనే మళ్లీ.


తెలివైనది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ, నన్ను తన పక్షాన కలిపేసుకుందుకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. అదే తెలివిని ఆమెపై తిప్పికొట్టాలి.

కానీ అందమైన ఆడపిల్ల - ఏం తిప్పికొట్టినా ఆమె మనసు నొచ్చుకోకూడదు.

‘‘మంచిమిత్రుణ్ణని నేననుకోవడం కాదు. వాడూ అనుకుంటున్నాడన్నమాట! చాలా సంతోషం’’ అన్నాను.


ఆమె మృదువుగా నవ్వింది. ఎంత బాగా అంటే - ఆ నవ్వు మళ్లీ మళ్లీ చూడాలనిపించింది.

ఆమె పెదాలపై ఆ నవ్వు మాయమైతే, అందుకు కారణం నేనే ఐతే - నన్ను నేనే క్షమించుకోలేను.


‘‘మీరు, కిషోర్‌ ప్రేమించుకుంటే - ఆ ప్రేమకి పెద్దల అంగీకారం లభించడం ఇంకా సంతోషంగా ఉంది’’ అన్నాను.


లభించలేదని నాకు తెలుసు. కానీ తెలివిని తిప్పికొట్టడమంటే అలాగే ఉంటుంది.

ఆమె తడబడి అదోలా చూసింది, ‘‘ఈ మాట మీకెవరు చెప్పారు?’’ అంది.

‘‘మీ ప్రేమని సంప్రదాయం నిరసించదన్నారు కదా! సంప్రదాయమంటే పెద్దలే కదా! రెండు రెళ్లు నాలుగు’’ అన్నాను.


ఆమె నవ్వింది - ఇందాకటికంటే మనోహరంగా. ‘‘మీకలా ఆర్థమైందా?’’ అంది.

ఉన్నట్లుండి నాలుగు వైపులనుంచీ చల్లని గాలి అలలా వచ్చింది. ఆ తాకిడికి కాబోలు జలయంత్రాల నీటిజల్లులు మామీదకు మళ్లాయి.

ఆమెకు ముఖం తడిసింది. నాకు భుజం తడిసింది.


ఇద్దరం ఆ జలస్పర్శానుభూతిని ఆస్వాదించామే తప్ప - తుడుచుకునే ప్రయత్నం చెయ్యలేదు.


అప్పుడామె ముఖం చిన్ని చిన్ని ముత్యాలు అద్దిన పెద్ద ముత్యంలా ఉంది.

‘‘ఔను. నాకలాగే అర్థమైంది. అందుకే సంతోషంగా అనిపించింది’’ అన్నాను.

అది నిజం కాదని నాకు తెలుసు. కానీ నా ముఖభావాల్లో అదామె పసికట్టలేదని నాకు నమ్మకమే!


‘‘ఐతే మీకు అసలు విషయం చెప్పాలి. నేను కిషోర్‌ని ప్రేమించడం లేదు’’ అంది స్వర.

ఉలిక్కిపడ్డాను. ఊహించలేదేమో - ఆ మాట నాకు షాకిచ్చింది కూడా!

‘‘అదేమిటి?’’ అన్నాను అప్రయత్నంగా.


‘‘నేను భవన్‌ని ప్రేమిస్తున్నాను. ఆ విషయం కిషోర్‌కి తెలుసు’’

నేనడగాలనుకున్న ప్రశ్నకి అడక్కుండానే జవాబిచ్చింది. ఆ జవాబులోనూ షాకుంది.

‘‘భవన్‌ ఎవరు?’’ అన్నాను అప్రయత్నంగా.


‘‘చెప్పానుగా, నేను భవన్‌ని ప్రేమిస్తున్నానని’’ అదే జవాబన్నట్లు అందామె.

భవన్‌ ఎవరైతేనేం - ఆమె ప్రియుడు. నాకు సంబంధించి భవన్‌ గురించి అంతకంటే పరిచయం అవసరం లేదని ఆమె అభిప్రాయమా?

అంతేనేమో - అనిపించింది.


నేను కిషోర్‌-స్వరల ప్రేమని భంగం చెయ్యాలనుకున్నాను.

ముందు కిషోర్‌తో ప్రయత్నించాను. అతడు నన్ను స్వరకు పరిచయం చేసి వదిలేశాడు.

తను కిషోర్‌ని కాకుండా వేరే అతణ్ణి ప్రేమిస్తుంటే - ఆ విషయం కిషోర్‌కి కూడా తెలిసుంటే -

ముందు కిషోర్‌నీ, ఇప్పుడు స్వరనీ నేనెందుకు కలుసుకున్నట్లు? కిషోర్‌ మా ఇద్దర్నీ ఎందుకు కలిపినట్లు?


నాకంతా అయోమయంగా అనిపించింది.

‘‘మీరు ఎవరో భవన్‌ని ప్రేమిస్తున్నారు. ఆ విషయం కిషోర్‌కి తెలుసు. కానీ కిషోర్‌ నాకు మీరిద్దరూ పరస్పరం ప్రేమించుకుంటున్నట్లు చెప్పాడు. అది అబద్ధమైతే వాడు నాకా అబద్ధం ఎందుకు చెప్పినట్లు?’’ అన్నాను.


స్వర నవ్వింది. ‘‘స్వతహాగా మీకు బిడియమట కదా! ఆడవాళ్లకు ఆమడ దూరంలో ఉంటారుట కదా! మీరు నన్ను కలుసుకోవడానికి - అబద్ధం చెప్పక తప్పదని కిషోర్‌ నాతో అన్నాడు’’ అంది.


అంటే అబద్ధం చెప్పడానికి కిషోర్‌ స్వర అనుమతి కూడా తీసుకున్నాడన్న మాట!

ఆమె నిజమే చెబుతోందనుకోవాలి. ఎందుకంటే - నాకు బిడియమనీ, ఆడవాళ్లకు ఆమడ దూరంలో ఉంటాననీ - కిషోర్‌ ఆమెకు నిజమే చెప్పాడు. కానీ -

‘‘ఇంతకీ మీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం - ముందు నాకు వాడి తలిదండ్రుల ద్వారా తెలిసింది. వాడు వాళ్లకీ అబద్ధం చెప్పాడా?’’ అన్నాను.


‘‘ఊఁ’’ అంది స్వర.

‘‘ఎందుకీ అబద్ధాలు?’’ అన్నాను ఆశ్చర్యంగా.


‘‘కిషోర్‌ నాకు మంచిమిత్రుడు. నా ప్రేమకి తన సాయం అవసరమైంది. ఆ సాయానికి మీ జత అవసరమని తననుకున్నాడు’’ అందామె.


‘‘ఇలాంటి విషయాల్లో సాయపడే శక్తి, ఆసక్తి నాకు లేవని వాడికి తెలుసు’’ అన్నాను.

‘‘మీరు తనకి మంచి మిత్రులనీ, తన మాట కాదనరనీ కిషోర్‌ చెప్పాడు’’

ఏడిసినట్లుంది. నేనిక్కడికొచ్చిందే వాడి ప్రేమని చెడగొట్టాలని....

తన ప్రేమ విషయంలో సాయపడాలంటోందీమె.


‘‘నేను ఆడవాళ్లకి ఆమడ దూరంలో ఉంటానని చెప్పిన కిషోర్‌, ప్రేమ వ్యవహారాలకి అంతకంటే దూరమని మీకు చెప్పలేదా?’’ అన్నాను.


‘‘ఏమీ అనుకోనంటే ఓ మాట! నేను మీకు అపరిచితను. మనమిద్దరం ఇందాకట్నించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఆడవాళ్లకి ఆమడ దూరమని ఒక్క క్షణం కూడా నాకు అనిపించలేదు’’ అంది స్వర.

ఖంగు తిన్నాను.


నిజమే! ఇందాకట్నుంచి ఆమెతో మాట్లాడుతున్నాను. బిడియపడ్డానని నాకూ అనిపించలేదు.

ఇప్పుడామె నన్ను అభినందించిందా, తప్పు పట్టిందా?


‘‘మీరు చెప్పింది నిజమే - ‘‘ అన్నాను. నా గొంతులో కొద్దిగా ఆపరాధభావం.

‘‘అందుకు కారణం నాకు తెలుసు. మిత్రుడిపై మీకున్న అభిమానం మీ బెరుకుని జయించింది’’ అందామె.


ఆ మాటకి నా అహం కొంచెం తృప్తి పడింది. ‘‘కానీ - ప్రేమ వ్యవహారాలపట్ల నాకున్న విముఖతని మాత్రం ఏ శక్తీ జయించలేదు’’ అన్నాను.

‘‘మీ విముఖత ప్రేమ వ్యవహారాల పట్ల కాదు. సంప్రదాయం నిరసించని ప్రేమని మీరు మనస్పూర్తిగా సమర్థిస్తారని కిషోర్‌ అన్నాడు’’ అంది స్వర.


‘‘ప్రేమని సంప్రదాయం సమర్థించడమా - ఇంపాసిబుల్‌’’ అనేశాను.

అన్నప్పుడు ఎదుటనున్నది అందమైన ఆడపిల్లని కూడా స్ఫురించలేదు. మాట కాస్త కటువుగానే వచ్చింది.


స్వర నొచ్చుకుంటుందని అనుకున్నాను. కానీ ఆమె అభిమానంగా నా వంక చూసి, ‘‘నా ప్రేమకథ వింటే - తప్పక మీ అభిప్రాయం మార్చుకుంటారు’’ అంది.

అంటే ఆమెది ఉత్త ప్రేమ కాదు. ప్రేమకథ!


ఆప్రేమకథని నాకు వినిపించాలనుకుంటోందని అర్థమైంది.

విచిత్రమైన పరిస్థితి. ఒక అపరిచిత యువతి ఒక అపరిచిత యువకుడికి తన ప్రేమ కథ వినిపిస్తోంది.


‘‘చెప్పండి’’ అన్నాను.

ఆమె గొంతు సవరించింది.....

- - - - -

భవన్‌ స్వరకి బావ.

చిన్నప్పట్నించీ కలిసి పెరిగారు. ఒకరి భావాలొకరికి తెలుసు. ఒకరి అభిరుచులొకరికి తెలుసు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. పెద్దలు వాళ్లిద్దరికీ పెళ్లి చెయ్యాలనుకున్నారు ఏడాది క్రితం.


ఎక్కడా మలుపులు లేవు. ప్రతిబంధకాలు లేవు. ఇదేం ప్రేమకథ?

‘‘ప్రేమకథంటే - ఆహ్లాదంగానే కాదు, ఆసక్తికరంగానూ ఉండాలి’’ అన్నాను.


‘‘పాఠకులు, ప్రేక్షకులు అలా అనుకుంటారు. ప్రేమికులకి అలా అనిపించదు. పిల్లికి చెలగాటమైతే ఎలక్కి ప్రాణసంకటం కదా!’’ నిట్టూర్చింది స్వర.


నిజమే మరి! ప్రేమికులకి ఏ ఆటంకాలూ లేకుండా దగ్గరవాలని ఉంటుంది. ప్రేక్షకులకి - ప్రేమికులకి ఎన్ని ఆటంకాలొస్తే అంత ఉత్కంఠ!

‘‘అయాం సారీ’’ అన్నాను.

‘‘యు ఆర్‌ వెల్కమ్‌!’’ అని నవ్వింది స్వర.


నేనూ నవ్వి, ‘‘మీకు మంచి సెన్సాఫ్‌ హ్యూమరుంది’’ అన్నాను.

‘‘థాంక్స్‌’’ అంది స్వర. ఆ గొంతులో విషాదముంది.

అప్పుడొచ్చింది నాకు సందేహం - ‘‘అంటే ఏడాది క్రితమే మీ ఇద్దరికీ పెళ్లయిపోయుండాలి కదా!’’ అన్నాను.


‘‘ఔను. కానీ సరిగ్గా ఏడాది క్రితమే భవన్‌ ఓ పెళ్లిలో ముక్తని చూశాడు’’ అంది స్వర.

ముక్త పేరు వింటూనే ఉలిక్కి పడ్డాను.

ఎవరీ ముక్త?


హెలెన ఆఫ్‌ ట్రాయ్‌లా ఎంతమందిని తన చుట్టూ తిప్పుకుని - ప్రేమకథల్లో కల్లోలం సృష్టిస్తుంది?

ఇంకా ఉంది...


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.


44 views0 comments

Comments


bottom of page