top of page

ప్రేమ వీరుడు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Prema Virudu' New Telugu Story Written By Vasundhara

రచన: వసుంధర

దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని వాడు వీరుడు.

ఎదుటి వారి ప్రాణాలకు సైతం విలువనిచ్చే వాడు ప్రేమ వీరుడేమో...

ప్రముఖ రచయిత్రి వసుంధర గారి కథలో మానవత్వపు విలువల గురించి తెలుస్తుంది.

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం.


రాజు గురించి అలాంటి విశేషం వింటానని కల్లో కూడా ఊహించలేదు. వినగానే ఒక్కసారిగా కాళ్లకింద భూమి కదిలిపోతున్నట్లయింది.

ఏడాదిగా పరిచయం నాకు రాజుతో. తొలిపరిచయంలోనే ఎందుకో బాగా నచ్చేశాడు.

మా ఇద్దరికీ చాలా విషయాల్లో పోలికలున్నాయి.

నాకు పెళ్లయింది. తొమ్మిదేళ్ల కొడుకు, ఏడేళ్ల కూతురు.

రెండేళ్లక్రితం నాన్న రిటైరయ్యాడు. అప్పట్నించీ- అమ్మా, నాన్నా నాతోపాటే ఉంటున్నారు. ఇంకా ఇంజనీరింగ్ ఫైనలియర్లో ఉన్న చెల్లి.

అంతా సామరస్యంగా ఉంటాం.


ఏడాది క్రితం మా పక్కింట్లో దిగింది ఓ కుటుంబం. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు,

పన్నెండేళ్ల మనుమడు, ఎనిమిదేళ్ల మనుమరాలు. ఇంచుమించు మా కుటుంబం లాంటిదే.

కొడుకుది నా వయసే కానీ, ఇంకా పెళ్లి కాలేదు. అతడే రాజు!

మావాళ్లంటే నాకు చాలా ప్రేమ. కానీ దేశాన్ని వాళ్లకంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఎవరైనా ఏదైనా నాకు నా దేశం తర్వాతే.


దేశంకోసం ప్రాణాలొడ్డిన దేశభక్తులు, నాయకులు, గూఢచారులు వగైరాల గురించి చదివిన కథలు చిన్నప్పుడే నామీద గొప్ప ప్రభావం చూపాయి. వాళ్లపట్ల ఆరాధనాభావం పెంచుకుంటూ, వాళ్లనే ఆదర్శం చేసుకుని, ప్రేమవీరుడు కావాలన్నది నా జీవితాశయం.

మావాళ్లు మాత్రం అలా కాదు. వాళ్లకి దేశమైనా, ఇంకేదైనా సరే, కుటుంబసభ్యుల తర్వాతే!


అమ్మ విషయమైతే ఇక చెప్పనక్కర్లేదు.

అలాగని అమ్మకు స్వార్థమూ లేదు. తనకంటే ఎక్కువగా మిగతా కుటుంబసభ్యుల గురించి ఆలోచిస్తుంది.

నా విషయానికొస్తే తను నన్ను ప్రేమించినంతగా- నన్ను నేనే ప్రేమించుకోలేననిపిస్తుంది.


నా మనోభావాలు అమ్మకి తెలుసు. ఐతే తనకీ ఓ లాజిక్కుంది.

‘మనం బాగుండాలంటే దేశం బాగుండాలి. దేశం ముందుకెడితేనే మనం ముందుకెడతాం. అందుకు దేశభక్తి, జాతీయతాభావం అవసరమే. కానీ దేశమంటే ఏమిటి? మనిషి కృత్రిమంగా నిర్ణయించిన కొన్ని భౌగోళిక సరిహద్దులకు పరిమితమైన మట్టి అనుకోవాలా? లేక మహాకవి గురజాడ అన్నట్లు- దేశమంటే మట్టి కాదు, మనుషులు అనుకోవాలా? దేశమంటే మనుషులు అనుకుంటే, జాతీయతా భావానికి మానవత్వపు పరిమళాలు అంటాలి. అప్పుడే ప్రగతి అర్థవంత మౌతుంది. మరి మానవతాభావం మొదలయ్యేది కుటుంబం నుంచే కదా! మనకంటూ కుటుంబం లేకపోతే, వసుధైక కుటుంబం అనే మాటకి అర్థమేమిటి’ అంటుంది అమ్మ.


నేనొప్పుకోను. ‘మనుషుల్ని సంఘటితం చెయ్యడానికి- దేశానికి తప్పనిసరిగా భౌగోళికంగా ​సరిహద్దులుండాలి. ఓ పేరూ ఉండాలి. పౌరుల రక్షణకూ, భద్రతకూ, బలానికీ, సౌభాగ్యానికీ- చేయాల్సిన కృషికీ దేశానికున్న ఆ పేరే ప్రేరణ ఔతుంది. ఆ పేరే మనుషుల్ని ప్రగతి మార్గంలో నడవడానికీ ప్రేరణ ఔతుంది’ అంటాను నేను. ఐతే నా మాటలు వాళ్లపై చూపిన ప్రభావం సున్నా.


వాళ్లకి స్వతంత్రదినం, రిపబ్లిక్ డే లాంటివి కూడా- కులాసాగా గడపడానికి లభించిన సెలవులు.

అంతకుమించి వాటిని పట్టించుకోరు. పండుగలంటే వాళ్లకి సంక్రాంతి, ఉగాది, దసరాలాంటివి.

వేడుకలంటే పుట్టినరోజు లాంటివి.

ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లు నా పుట్టిన రోజుకిచ్చిన ప్రాధాన్యం స్వతంత్ర దినానికివ్వరు.


రాజుతో మొదటిసారి మాట్లాడినప్పుడే తెలిసిపోయింది- అతడూ నాకులాగే దేశభక్తుడని.

తేడా ఏంటంటే- వాళ్లింట్లోవాళ్లు మావాళ్లలా కాదు. అందరికీ కూడా ముందు దేశం- ఆ తర్వాతే కుటుంబ సభ్యులు.

అప్పుడే రేగాల్సింది నాలో అనుమానం. కానీ అతడి చిరునవ్వు నన్ను మాయలో పడేసింది.

ఎంత అదృష్టవంతుడో అనుకున్నాను. మా ఇంట్లోవాళ్లకి కూడా చెప్పని రహస్యం అతడితో పంచుకుందామా అనికూడా అనిపించింది.

నేను ఆ ఊళ్లోనే ‘సైబర్‌లాండ్’ కంపెనీలో మంచి జీతం తెచ్చుకుంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ని.

మావాళ్ళకి నా గురించి అంతే తెలుసు!

నా ఉద్యోగం గురించి అమ్మ ఒక్కతే అంత హ్యాపీ కాదు. ‘ఇంటిపట్టునుండకుండా అస్తమానూ ఈ టూర్లేంటిరా, ఉద్యోగం మారకూడదూ’ అని తరచుగా చిరాకు పడుతూంటుంది.


అమ్మంటే నాకిష్టమే కానీ ఆ ఉద్యోగాన్నెలా వదులుకుంటాను?

అది ప్రేమవీరుణ్ణి కావాలని నేను కన్న కలలకి సాకారం. అజ్ఞాతంగా నేను చేసిన కృషి అపారం. అది ఫలించడం నా అదృష్టం.

‘సైబర్‌లాండ్’- ప్రభుత్వ రహస్య సమాచార విభాగానికి చెందిన ఓ ముఖ్యసంస్థ- అన్న విషయం అమ్మ తో సహా వాళ్లెవ్వరికీ తెలియదు.


రాజు మెడికల్ రిప్రజెంటేటివ్. తనూ తరచు ఊళ్లు తిరుగుతాడు. అందుకే మేమిద్దరం కలుసుకుని మాట్లాడే అవకాశాలు అరుదు. ఆ కలిసినప్పుడే- అతడి మాటల్లో దేశం పట్ల ధ్వనించే భక్తిభావానికి ముగ్ధుణ్ణయ్యేవాణ్ణి.

అలాంటివాడు మా సంస్థలో చేరితే బాగుణ్ణనిపించి, “ఉద్యోగం మారే ఆలోచనుంటే చెప్పు. మా కంపెనీలో నీ అర్హతకు తగిన మంచి ఖాళీలున్నాయి” అన్నానోసారి. సైబర్‌లాండ్ అసలు ఉద్దేశ్యం చెప్పలేదు.

అతడు థాంక్స్ చెప్పి ఊరుకున్నాడు.


నేను నిరుత్సాహపడలేదు. కానీ ఎందుకో కానీ కాస్త బలవంతపెడితే, ఒప్పుకుంటాడేమో అనిపించి, ఆఫీసులో కాస్త సీనియరైన ఓ కోలీగ్‌కి చెప్పి, ‘అతడికి మన సంస్థ గురించి చెప్పొచ్చా’ అని సలహా అడిగాను,

అతడు ఒప్పుకోలేదు, “చటుక్కున ఎవర్నీ నమ్మెయ్యకూడదు. రాజు నీకు ఏడాదినుంచేగా తెలుసు!

​అంతకుముందేం చేసేవాడో, మన ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటుచేత ఆరా తీయించు” అన్నాడు.

నాకు రాజుమీద పూర్తి నమ్మకముండడంతో అలాగే చేద్దామనుకున్నాను.

నావద్ద రాజుతో తీసుకున్న సెల్ఫీ ఉంది. అతడి వివరాలిస్తూ, ఆ ఫొటో మా ఇన్వెస్టిగేషన్

డిపార్టుమెంట్లో ఇచ్చాను.


నాలుగు రోజులు గడిచేక మా చీఫ్ నన్ను పిలిచాడు. అప్పుడు తెలిసింది షాకింగ్ న్యూస్!

రాజు పది రోజులక్రితం ఓ ఇంట్లో దొంగతనానికెళ్లి, చిన్న పొరపాటు చేసి పోలీసులకి దొరికాడు.

ఇన్వెస్టిగేషన్లో అతడు మామూలు నేరస్థుడు కాదనీ, శత్రుదేశపు గూఢచారి కావచ్చన్న సూచన

వచ్చింది. అతడిది మారువేషమయుండొచ్చని అనుమానించిన పోలీసులు, మేకప్ తొలగించి ఫొటో కూడా తీసుకున్నారు. తర్వాత ఎలా వాళ్ల కళ్లు కప్పాడో కానీ అతడక్కణ్ణించి తప్పించుకున్నాడు.


సాధారణంగా అలాంటప్పుడు పోలీసులు వెంటనే మా డిపార్టుమెంటుని సంప్రదిస్తారు. ఐతే మా రెండు డిపార్టుమెంట్సుకీ మధ్య కొంచెం ప్రొఫెషనల్ జెలసీ కూడా ఉంది. అందుకేనేమో, వాళ్లా విషయాన్ని మాదాకా రానివ్వలేదు.


ఈలోగా నేనిచ్చిన ఫొటోని మా డిపార్టుమెంట్ వాళ్లు కొన్ని పోలీస్ స్టేషన్లకు పంపడంతో, రాజు ఆచూకీ వాళ్లకి తెలిసింది. అప్పుడూ వాళ్లు మమ్మల్ని కన్సల్ట్ చెయ్యకుండా- ఓ రాత్రి రాజు ఇంటిమీద రహస్యంగా మెరుపు దాడి చేశారు. రాజు వాళ్లకి దొరకలేదు సరికదా, ఆ ఇంట్లోవాళ్లు రాజు ఫొటో చూసి ఎవరో తెలియదన్నారు. వాళ్లా ఇంట్లో అణువణువూ సోదా చేస్తే, ఎక్కడా రాజు ఆనవాళ్లే లేవు.


అరెస్టులో ఉండగా పోలీసులతడి నిజస్వరూపాన్ని కెమెరాలో బధించారుగా- మరి జాగ్రత్త పడడూ!

పోలీసుల్నించి తప్పించుకున్నాక తను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తన ఆనవాళ్లు లేకుండా చేయమని ఇంట్లోవాళ్లకి సందేశం పంపిఉంటాడు.

పోలీసులు రెయిడ్ చెయ్యగానే రాజు కుటుంబమంతా అలర్ట్ అయింది. ఇక రాజుని పట్టుకోవడం అసాధ్యం.

“రాజుని శత్రుదేశపు గూఢచారిగా అనుమానించిన మరుక్షణం- పోలీసులు కేసుని మనకి

అప్పగించాల్సింది. కానీ మన దేశంలో ఇదే ఇబ్బంది. దేశభద్రతకు సంబంధించిన విషయాల్లో కూడా- రెండు విభాగాల మధ్య సంయమనం ఉండదు. ఏమైతేనేం, ఇప్పుడా కేసు మనకొచ్చింది. నీకు రాజుతో కొంత పరిచయముంది కాబట్టి ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. నువ్వు ఎలాగో అలా రాజుని పట్టుకోవాలి. మన డిపార్టుమెంటు ప్రిస్టేజికోసమే కాదు, ఇది దేశభద్రతకు సంబంధించిన వ్యవహారం” అన్నాడు బాస్.

దేశభక్తి కబుర్లతో నన్ను ముగ్ధుణ్ణి చేసిన రాజు దేశద్రోహి అని తెలియగానే నా కాళ్లకింద భూమి కదిలినట్లయింది.

రహస్య సమాచార విభాగంలో పని చేసే నాకు- ఎదుటివాడు చెప్పేది నిజమో, అబద్ధమో అంచనా వెయ్యగల సిక్స్‌త్ సెన్సు అలవడిందనే అనుకుంటాను. అలాంటి నేను అంత సులభంగా రాజు మాటలనెలా నమ్మాను?

ఆలోచించేక నాలో వివేకం పనిచేసింది.

​రాజు నాతో అబద్ధం చెప్పలేదు. అతడి దేశభక్తి నిజమే! ఎటొచ్చీ అతడి దేశం వేరు. అంటే అతడి కుటుంబం మన శత్రుదేశంనుండి వచ్చింది. మొత్తం కుటుంబమంతా దేశభక్తులు కావడానికి అదే కారణం.

నాకు వళ్లుడికిపోయింది. ఇంటిపక్కనే ఉంటూ- నా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ

కుటుంబమంటే- కోపం, ద్వేషం రగిలాయి.

వెంటనే రంగంలోకి దిగాను.

పొరుగువాణ్ణే కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్లడానికి నాకేం ఇబ్బందుండదు. కానీ అలాచేస్తే నన్ను నేను బయటపెట్టుకున్నట్లౌతుంది. అంటే మారువేషంలో వెళ్లాలి. ఏ వేషంలో వెళ్లినా అదో శత్రుదేశపు గూఢచారి ఉంటున్న ఇల్లు. తన జాగ్రత్తలో తనుంటాడు. నేను ప్రమాదానికి సిద్ధపడాలి. ప్రేమవీరుణ్ణి కదా- నాకు ప్రమాదమంటే భయం లేదు.

అమ్మకి చెప్పాను- రేపు ఊరెడుతున్నానని!


“ఎల్లుండి నీ పుట్టిన్రోజురా, అదయ్యేక వెడుదువుగాని” అంది అమ్మ వెంటనే.

ఆవెంటనే మిగతావాళ్లు అందుకుని, నేను వెళ్లడానికి వీల్లేదని ఏకగ్రీవంగా తీర్మానించారు.


కాస్త తక్కువ మాట్లాడే నాన్న కూడా, “ఎప్పుడూ టూర్లే కాబట్టి, నువ్వు దూరంగా ఉండడం మాకేం కొత్త కాదు. ఐనా కూడా ఇంతవరకూ నీ పుట్టిన్రోజు ఒక్క ఏడు కూడా మిస్ కాలేదురా. ఈసారీ మిస్ కానియ్యకు” అన్నాడు.

అంతా అంతలా అడుగుతుంటే నేనూ కాస్త మెత్తబడ్డాను.

ఐనా రాజెలాగూ అజ్ఞాతంలో ఉన్నాడు. నేను అతడి ఇంట్లోవాళ్లని బెదిరించి, భయపెట్టి అతడి కూపీ లాగాలి. అందుకు రెండుమూడు రోజులు ఆలస్యమైతేనేం?

ఐనా వెంటనే ఒప్పుకోకూడదనుకుని, “టూర్లున్న ఉద్యోగంలో చేరి ఊళ్లెళ్లనంటే ఎలా? పొరుగింటి రాజుని చూడండి. నాకంటే కూడా టూర్లెక్కువ. నిజానికీసారి నా పుట్టిన్రోజుకి తననీ పిలుద్దామనుకున్నా. ఏడీ పది రోజులుగా పత్తా లేడు” అన్నాను.


దానికి మా అబ్బాయి వెంటనే, “రాజు అంకుల్ ఊళ్లో లేకపోవడమేంటి? నిన్ననే వాళ్లింట్లో చూశాను” అన్నాడు.

ఉలిక్కిపడ్డాను. ఇది నాకు ఊహించని సమాచారం.

మనసులో ఆత్రమున్నా బయటపడకుండా నింపాదిగా విచారిస్తే కాస్త వివరంగానే చెప్పాడుః

నిన్న సాయంత్రం వీధిలో మావాడు కొంతమంది పిల్లలతో కలిసి టెన్నిస్ బంతితో ఫుట్‌బాల్ ఆడుతున్నాట్ట. ఓ కుర్రాడు తంతే అది వెళ్లి రాజు ఇంటి బాల్కనీలో పడిందిట. బంతి తేవడానికి మావాడూ, రాజు అక్క కొడుకూ వెళ్లారుట.

తలుపు తట్టగానే రాజు అక్క వచ్చి తలుపు తీసి, విషయం తెలిసి, ‘రాజూ’ అని పిలిచిందిట.

అప్పుడు రాజు బంతి తీసుకుని మేడమీంచి దిగొచ్చేట్ట.

మావాడు చెప్పిందాన్ని బట్టి నాకు రెండు విషయాలు స్పష్టమయ్యాయి.

ఒకటి- రాజు ఇంట్లోనే ఉన్నాడు. అనుమానించదగ్గవాళ్లు వస్తే దాక్కునేందుకు ఆ ఇంట్లోనే రహస్య స్థలమేదో ఉండి ఉండాలి.

రెండు- ఆ ఇంట్లోవాళ్లకి నా ఉద్యోగం గురించి ఇంకా తెలియదు. తెలిస్తే రాజు మా

అబ్బాయికి దర్శనమిచ్చేవాడు కాదు.

అంటే- నేను త్వరపడాలి.

ఆఫీసువాళ్లు నాకు పర్మిషన్ ఇవ్వలేదని ఇంట్లోవాళ్లని నమ్మించాను. నేను రాజు ఇంట్లో ప్రవేశించేక ఆ ఇంట్లోంచి ఎవరూ తప్పించుకు పారిపోకుండా బయట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించాను.


మొత్తం వ్యవహారమంతా మావాళ్లకు కూడా తెలియకుండా జరిగిపోయేటంత రహస్యంగా ఉంచాను.

ఉదయం పదింటికి మా ఇంటికి ఆఫీసు ఏర్పాటు చేసిన టాక్సీ వచ్చింది. అందులో ఊరు దాటి వెళ్లాను.

ప్రయాణంలో ఉండగానే కార్లో ఉన్న మేకప్ కిట్టుతో రూపురేఖలు మార్చుకున్నాను.

ఉంగరాల జుత్తు స్థానంలో బట్టతల. బుగ్గమీసాలు. ఒత్తైన కనుబొమలు. మరీ ఎబ్బెట్టుగా అనిపించని ఎత్తుపళ్లు.

అప్పుడు నన్ను చూస్తే అమ్మ కూడా గుర్తుపట్టలేదు.


బుల్లెట్‌ప్రూఫ్ బనియన్లు ఒకదానిమీద ఒకటి వేసుకున్నాను. పైన చారల టీషర్టు వేసుకున్నాను.

చేతికి స్పెషల్ వాచి.

రాత్రి ఏడయ్యేసరికి రాజు ఇంట్లో- మొత్తం కుటుంబసభ్యులంతా ఉంటారని తెలుసు. ఇప్పుడు రాజు కూడా ఉన్నాడని తెలిసింది.

టాక్సీలో ఎక్కడెక్కడో తిరిగాను. సరిగ్గా ఏడున్నరకి రాజు ఇంటిముందు టాక్సీ దిగాను.

తలుపు తట్టగానే రాజు మేనల్లుడు వచ్చి తలుపు తీశాడు.


హాల్లో టివి చూస్తున్నట్లున్నారు- కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారు- రాజు తప్ప. అతగాడు మేడమీదే ఉంటున్నాడో, లేక తలుపు తట్టిన చప్పుడు విని పైకి వెళ్లిపోయాడో!

“కరోనా చెక్” అన్నాను బొంగురు గొంతుతో. అది మారువేషానికి అనుగుణంగా మార్చుకున్న గొంతు.


వాళ్లింట్లో అందరికీ టీకా రెండు డోసులూ ఐపోయాయి. ఒకో పేరే చదువుతూ రాజు గురించి అడిగాను.

నా దగ్గరున్నది వాక్సినేషన్ సెంటర్నించి కలెక్ట్ చేసిన సమాచారం. రాజు ఎవరో తెలియదనడానికి వీల్లేదు.

“టూర్లో ఉన్నాడు. వాడికీ రెండు డోసులూ ఐపోయాయి” అంది రాజు తల్లి.

వెంటనే వీధి తలుపులు మూసి, “టూర్లో ఉంటే ఎలా? నేనొచ్చిందే రాజుని చూడ్డానికి. ఒకసారి పిలవండి” అన్నాను.


ఇంట్లోవాళ్లకి అర్థమైపోయింది- వచ్చింది పోలీసులో, అలాంటివారోనని!

వాళ్లు అలర్ట్ అయ్యేలోగా రివాల్వర్ తీశాను, “ఎవరూ కదలొద్దు. ఇంటి చుట్టూ కాపలా ఉంది. ఒక్కరూ తప్పించుకుపోలేరు. నాకు సహకరిస్తే- మీలో ఏ ఒక్కరికీ నానుంచి ఏ ప్రమాదమూ ఉండదు” అన్నాను.

అంతా స్థాణువుల్లా నిలబడిపోయారు.


“సహకరించడమంటే?” అడిగాడు రాజు తండ్రి,

​“ఈ ఇంట్లో రాజు అనే దేశద్రోహి ఉన్నాడు. అతణ్ణి అప్పగించండి, చాలు” అన్నాను.

రాజు తండ్రి వెంటనే, “రాజు దేశద్రోహి అని మాకు తెలియదు. కొంతకాలంగా పేయింగ్ గెస్టుగా ఉంటున్నాడిక్కడ. ఎక్కువగా టూర్లలో ఉంటాడు. ఇప్పుడూ టూరనే వెళ్లాడు. వస్తే తప్పక మీకు తెలియబరుస్తాం. మొబైల్ నంబరిచ్చి వెళ్లండి” అన్నాడు.


రాజుకి పొరుగింటివాణ్ణి నేను. వాళ్లకీ రాజుకీ ఉన్న అనుబంధం నాకు బాగా తెలుసు. తల్లి పుట్టిల్లు గురించి మేనమామ దగ్గర దాచే ప్రయత్నం చేస్తున్నట్లు వాళ్లకి తెలియదు.

“మీకెక్కువ సమయం లేదు. మాటలు కట్టిపెట్టి తక్షణం రాజుని అప్పగించండి. అందుకు

భయపడాల్సిన పని లేదు. మీ రక్షణ బాధ్యత నాది” అన్నాను సానునయంగా.

ఒక్కరూ నోరు విప్పలేదు.


“పది అంకెలు లెక్కిస్తాను. పూర్తయ్యేలోగా రాజుని అప్పగించాలి. లేదూ- మిమ్మల్ని ఒకొక్కరుగా షూట్ చేస్తాను”

అప్పుడూ వాళ్లందరిదీ ఒక్కటే మాట- రాజు ఆచూకీ తమకి తెలియదని!

రివాల్వర్ గురి పెట్టినా వాళ్లలో మార్పులేదు.

‘మా ఇంట్లో అంతా దేశభక్తులే!’ అన్న రాజు మాటలు గుర్తుకొచ్చాయి.

మా ఇంట్లోనూ అలాగుంటే ఎంత బాగుణ్ణని అప్పుడు నాకు అనిపించింది.

అందుకేనేమో- వాళ్లందర్నీ చూడగానే నాకు మావాళ్లు ఒకొక్కరుగా గుర్తుకొస్తున్నారు.


క్షణం తమాయించుకున్నాను. ఇది సెంటిమెంట్లకు సమయం కాదు. వాళ్లని నేనిప్పుడు నా పొరుగువాడు రాజు కుటుంబ సభ్యుల్లా కాదు, దేశద్రోహికి ఆశ్రయమిచ్చిన వాళ్లలా చూడాలి. లేదూ వాళ్లే ఓ దేశద్రోహుల ముఠా అనుకోవాలి.

సెకన్లు నిముషాలుగా మారుతున్నాయి. ఒక్కరూ నా హెచ్చరిక లెక్క చెయ్యలేదు.

అంకెలు లెక్కపెట్టడం మొదలెట్టాను.


“ఒకటి…..”

రివాల్వర్ వాళ్లకి గురిపెట్టి ఉంది.

వాళ్లు మౌనంగా నన్నే చూస్తూ అంకెలు వింటున్నారు తప్ప- నోరు విప్పడం లేదు.

షూటింగ్ చెయ్యక తప్పేలా లేదు. మనసొప్పక అంకెకూ అంకెకూ మధ్య వ్యవధి ఎక్కువ

చెయ్యాలనుకున్నాను.

“రెండు…..”

వాళ్లలో ఏ మార్పూ లేదు.

“మూడు….”

ఉలకరు. పలకరు. బొమ్మల్లా కదలరు…

“నాలుగు…. ఐదు…. ఆరు…..”

అంకెలు మర్చిపోయి గుర్తు చేసుకుంటున్నవాడికిలా చాలా నెమ్మదిగా ఒకో అంకే చెబుతున్నాను.

“ఏడు…. ఎనిమిది…. తొమ్మిది….”

​ఎంత నెమ్మదిగా చెప్పినా పది వంతు ఇట్టే వచ్చేసిందనిపించింది.

గుండె రాయి చేసుకున్నాను.


నేనిప్పుడు నా పక్కింట్లో లేను. యుద్ధభూమిలో ఉన్నాను. నా ముందున్నది- సామాన్య మధ్య తరగతి కుటుంబీకులు కాదు.

నాకు బాగా తెలిసిన పొరుగింటివాళ్లు కూడా కాదు.

ట్రిగ్గరుమీద వేలు కదులుతుంటే, ఒక్క క్షణం- చేయి వణికింది. కానీ ఒక్క క్షణమే!

రాజు తండ్రిని షూట్ చేశాను.

రివాల్వరుకి సైలెన్సరు అమర్చబడింది. కాబట్టి శబ్దం కాలేదు.

రాజు తండ్రి కూడా శబ్దం చెయ్యకుండా నేల కూలాడు.

శబ్దం మిగతావాళ్ల నుంచి వచ్చింది- అదీ సన్నగా ఏడుపు.

ఏడుపు గొంతులోంచీ వస్తోంది. కానీ రాజు గురించి చెప్పడానికి నోట్లోంచి మాట మాత్రం రావడం లేదు.

రెచ్చిపోయాను. నా రెండో లక్ష్యం రాజు తల్లి.

ఆమె కూడా నిశ్శబ్దంగా నేల కూలింది.

వాళ్లనుంచి అదే స్పందన. అదే ఏడుపు.

తర్వాత రాజు అక్కని, బావని, మేనల్లుణ్ణి వరుసగా షూట్ చేశాను.

అదే స్పందన. అదే ఏడుపు.

ఇక మిగిలింది ఎనిమిదేళ్ల పాప. రాజు మేనకోడలు.


నా ఎదుట కూలబడిన ఐదు శరీరాలు. వాటి వెనుక ఎనిమిదేళ్ల పాప.

ఎంతో హృదయవిదారకమైన దృశ్యమది. కానీ అప్పుడు నాకు హృదయమేదీ!

దేశరక్షణ బాధ్యతను నిర్వహించే సమయంలో నా గుండె వెళ్లి దేశమాత వంట్లో

కొట్టుకుంటూంటుంది.

రివాల్వర్ ఆ పాపకి గురిపెట్టాను. ఆ పాప వణికిపోతూ, ఎక్కడలేని శక్తినీ కూడగట్టుకుని, “ప్లీజ్! అంకుల్! నన్ను చంపొద్దు. మామయ్య ఎక్కడున్నాడో చూపిస్తాను” అంది. వినబడకపోతే తనని చంపేస్తానని భయపడిందేమో, కాస్త గట్టిగా అరిచి మరీ చెప్పింది.

అదో విషాద సమయం. ఐనా నా షూటింగ్ వృథా కాలేదని కించిత్తు గర్వం, అత్యంత సంతోషం ఒక్కసారిగా కలిగాయి.


రివాల్వర్ కిందకు దించాను.

పాప మాట నిలబెట్టుకుంది. ఆ ఇంట్లో దేశద్రోహ కార్యకలాపాలకోసం ప్రత్యేకంగా కట్టిన రహస్యపు గదికి దారి చూపించింది.

తను చెప్పకపోతే ఆ గదిని కనిపెట్టడం ఇంచుమించు అసాధ్యం.

రాజు దొరికాడు. అతణ్ణి ప్రాణాలతో బంధించగలగడం నా నేర్పుకి నిదర్శనం.

తర్వాత మావాళ్లకి సంకేతం పంపాను. వాళ్లు రాగానే ఆ పాపనీ, అక్కడ పడున్న శరీరాల్నీ అప్పగించి అక్కణ్ణించి తప్పుకున్నాను.

ఈ దెబ్బతో- డిపార్టుమెంట్లో ప్రమోషనూ, ప్రభుత్వం నుంచి బిరుదుతో కూడిన సత్కారమూ ఖాయం.

ఐతే దేశ భద్రతకోసం సాధించిన విజయానికి మించిన తృప్తిని- ఇవేమీ నాకివ్వలేవు.

ఆ ఇంట్లో ఆ రాత్రి నేను చేసిన ఘనకార్యమంతా నా చేతి వాచీకి అమర్చిన కెమెరాలో రికార్డయింది.

అది తీవ్రవాదులకీ, దేశద్రోహులకీ హెచ్చరికగా పనికొస్తుందనే ఉద్దేశ్యంతో నేనా ఏర్పాటు

చేసుకున్నాను.

తర్వాత డిపార్టుమెంట్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, తిరిగి మా ఇంటికెళ్లడానికి నాలుగు రోజులు పట్టింది.


అప్పటికి పక్కింట్లో జరిగిన విశేషం సంచలన వార్తగా ప్రచారంలో ఉంది. ఆ రాత్రి ఆ ఇంట్లో జరిగిన మారణహోమపు విడియోని టీవీ చానల్సుకి విడుదల చేశారు. ఎటొచ్చీ మారువేషంలో ఉన్నా కూడా నా మొహాన్ని పూర్తిగా మసక చేసేశారు.

ఆ ఘనకార్యం నాదేనని బయటివాళ్లకులాగే మావాళ్లకూ తెలియదు.

మా అబ్బాయైతే, వార్తల్లో వచ్చిందానికి తన ఊహ జోడించి- ఇంతంత కళ్లు చేసుకుని, జరిగింది నా కళ్లకి కట్టేలా చెప్పాడు.

“సమయానికిక్కడ లేను. ఉంటే, అప్పటికప్పుడే ఆ దేశభక్తుణ్ణి వెదికి పట్టుకుని అభినందించేవాణ్ణి” అన్నాను గొప్పగా.

నాన్న వెంటనే, “పెరట్లోకెడితే ఎవరో ఒకరు కనబడి, సందడిగా అనిపించేది. కొద్దిక్షణాల్లో కుటుంబం మొత్తం లేకుండాపోయిందంటే మనసు పాడయిందిరా” అన్నాడు బాధగా నిట్టూర్చి.


“టూర్లు టూర్లంటూ ఆ రాజు చేస్తున్న పని ఇదన్నమాట! మీరూ టూర్లు టూర్లంటూ తిరుగుతారు. మీదీ ఇలాంటి పని కాదు కదా” అంది నా భార్య అనుమానంగా.

గతుక్కుమని, “నీకూ ఇలాంటి అనుమానం పుట్టిందా?” అన్నాను చెల్లివంక తిరిగి.

“ఇలాంటివి పేపర్లో, టీవీలో ఎన్ని చూడలేదు! నాకైతే నీ పుట్టిన్రోజుకి నువ్విక్కడ లేకపోవడ మొక్కటే వెలితి” అంది చెల్లి.


“పాపం, కళ్లముందే వాళ్లవాళ్లంతా పోయారు. మామయ్య జైలుకెళ్లాడు. పాప ఒక్కత్తే మిగిలింది.

ఏమౌతుందో, ఎలా ఉంటుందో” అన్నారు నా కొడుకు, కూతురు.

ఆశ్చర్యమేమంటే నా దేశభక్తి గురించి ఒక్కరు కూడా మెచ్చుకుంటూ మాట్లాడలేదు. ఎవరి గొడవ వారిది!

ఆఖరి ఆశగా అమ్మవైపు తిరిగి, “అమ్మా! రాజు శత్రుదేశపు గూఢచారి. అతణ్ణి పట్టుకుందుకు వెళ్లిన మన ఏజంటుకి ప్రాణ ప్రమాదముంది. ఐనా తెగించి వెళ్లాడు….” అని ఏదో చెప్పబోతుండగా-


“నిజమేకానీ- అతగాడు ముందే ఆ చిన్నపాపను భయపెట్టుంటే, అంతమందిని చంపాల్సి ఉండేది కాదు కదురా!” అంది అమ్మ.

గతుక్కుమన్నాను. అమ్మ మానవత్వంతో చాలా లోతుగా ఆలోచించింది.

మరి నేనా అమ్మకి కొడుకునేగా- నాకా మాత్రం ఆలోచన రాకపోలేదు. ఐతే నా కారణాలు నాకున్నాయి.

అవి అమ్మకి చెప్పలేను.


“నువ్వలాగనుకున్నావా? ఆ పెద్దవాళ్లు కాస్త వివేకంతో ఆలోచించి, ముందే నిజం చెప్పినా కూడా, ఆ మారణహోమం తప్పేదని నీకు అనిపించలేదా? ఎందుకంటే- చివరికి నిజమెలాగూ బయటపడింది మరి!” అన్నాను.

“అసలా ఏజంటు మనుషుల్ని చంపడానికి ఎందుకు పూనుకున్నట్లు?” అంది అమ్మ. నిష్ఠూరంగా కాదు, మండిపడుతున్నట్లు అంది.

“ఎందుకంటే, అతడు తన దేశాన్ని ప్రేమిస్తున్నాడు కనుక!” అన్నాను.

“సరే- అతడు తన దేశాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకని అంతమందిని చంపేశాడు. రాజు, అతడి కుటుంబం వాళ్ల దేశాన్ని ప్రేమిస్తున్నారు. అందుకని వాళ్లు చావుకి సిద్ధపడ్డారు. ప్రేమంటే మానవత్వానికి పరిమళాలద్దే ఓ మాతృభావన. అందులో చావు అనే పదానికి ఆస్కారం ఉండదు. ఆ ఏజంటు దేశాన్ని ప్రేమిస్తున్నానని అనుకోవచ్చు. కానీ, అతడికి ప్రేమంటే తెలియదనడానికి బాధగా ఉందిరా” అంది అమ్మ.


అప్పటి అమ్మ వేదనలో దాగిన మానవత్వపు భావన నా స్ఫురణకు అందింది. నెమ్మదిగా, “ఒకవేళ ఆ ఏజంటు ఆ ఇంట్లో వాళ్లని చంపలేదనుకో. తగలగానే స్పృహ పోగొట్టే గుళ్లు ప్రయోగించాడనుకో. రాజు పట్టుబడ్డాక ఆ కుటుంబ సభ్యులందర్నీ ప్రభుత్వానికి అప్పగించి- బయటి ప్రపంచానికి మాత్రం వాళ్లు చనిపోయినట్లు ప్రచారం చేశాడనుకో….” అని ఇంకా ఏదో అనబోతుండగా-

“అలా చెయ్యడంవల్ల ప్రయోజనమేమిటి?” అంది అమ్మ.

“ప్రయోజనం లేకనేం- దేశద్రోహానికి పాల్పడబోయేవారికి ఆ విడియో ఓ గొప్ప హెచ్చరిక. ఇక దేశద్రోహానికి పాల్పడి పట్టుబడ్డవారికి పునరావాస యోగాన్ని కలిగించడానికీ అవకాశమిస్తుంది” అన్నాను.

“అదే నిజమైతే, మారణహోమాన్ని అరికట్టడానికి ఆ ఏజంటు పెద్ద రిస్కే తీసుకున్నాడనాలి.


మానవత్వంతో అంత గొప్ప రిస్కు తీసుకున్న అతడి దేశభక్తికీ, ప్రేమ భావనకీ నా జోహార్లు. కానీ ఈ గూఢచారి సంస్థల్లో అలా జరుగుతుందంటావా?” అంది అమ్మ.

“అదే భారతదేశపు ప్రత్యేకత. ఇక్కడ అధికశాతం ఆడవాళ్లు నీలాంటి అమ్మలు. నాయకుల్ని ఎన్నుకునే అధికశాతం ఓటర్లు- నీలాంటి అమ్మలు, వారు కన్నబిడ్డలు. వీళ్లందరికీ అమ్మ భరతమాత. గూఢచర్యంలోనే కాదు, యుద్ధభూమిలోనూ- భరతమాత బిడ్డల పోరాట పటిమ మానవత్వంతో పరిమళిస్తూంటుంది.


ఉదాహరణకి- 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో జనరల్ కరియప్ప కుమారుడు యుద్ధఖైదీగా పట్టుబడ్డాడు. గతంలో జనరల్ కరియప్ప కింద పని చేసిన ఆయూబ్ ఖాన్ అప్పుడు పాకిస్తాన్ నేత. ఆ గౌరవంతో అతడు కరియప్ప కుమారుణ్ణి విడుదల చేస్తానంటే- దానికి కరియప్ప, ‘నా కొడుకిప్పుడు నా కొడుకు కాదు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకడు. విడుదల చేస్తే మా యుద్ధఖైదీలందర్నీ విడుదల చెయ్యి. లేదూ, ఎవర్నీ విడిచిపెట్టొద్దు’ అని చెప్పాడు.

ఇటీవలి కాలంలోనూ యుద్ధంలో పట్టుబడ్ద కొందరు పాకిస్తానీ యుద్ధఖైదీల్ని, ‘వారు తమ దేశంకోసం పోరాడిన వీరసైనికులు. వాళ్లని హింసించడం తగదు’ అని సగౌరవంగా వాళ్ల దేశానికి అప్పజెప్పిన ఘనత మనది. మరి మన గూఢచారి సంస్థలు కూడా సాధ్యమైన మేరకు ఆ ప్రాతిపదికపైనే పని చేస్తాయని ఎందుకు నమ్మకూడదు?” అన్నాను.

కొడుకు అబద్ధం చెబితే అమ్మ పసిగట్టగలదు. నేను అక్షరాలా నిజమే చెప్పాను కాబట్టి తను నమ్ముతుందనే నా నమ్మకం.

అమ్మకు అలా చెప్పినప్పటికీ, ‘దేశభక్తికీ, దేశంపట్ల ప్రేమభావనకీ- మానవత్వపు పరిమళాలు అంటడం అన్నివేళలా సాధ్యమా’ అన్న అనుమానం నాలో ఉంది.


ఇప్పుడు సాధ్యపడినప్పటికీ- ఆ ఘనత మా అమ్మదా, భరతమాతదా?’ అన్న సందేహం నన్నింకా వెంటాడుతూనే ఉంది.

మన సమాజంలో విశిష్టంగా భావించబడుతున్న కొన్ని వ్యక్తిత్వాలే అందుకు కారణమేమో

చెప్పలేను……

---౦---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
75 views0 comments

Comments


bottom of page