'Krishnagadi Vira Premagadha' written by Vasundhara
రచన : వసుంధర
‘ఆనందం ఆర్ణవమైతే, అనురాగం అంబరమైతే- అనురాగపు అంచులు చూస్తాం, ఆనందపు లోతులు తీస్తాం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ.
అభిమానం అవధి దాటితే, అసహనం పెచ్చుమీరితే- అసహనపు రూపం భూతం, అభిమానపు ఫలితం ప్రేతం- అన్పిస్తున్నారు నేటి రాజకీయ, సినీ నేతాశ్రీలు. నేడు దురభిమానపు స్పందనలు హారర్ సినిమా దృశ్యాల్ని మించి సామాన్యుల్ని వణికిస్తున్నాయి.
మచ్చుకి మా కృష్ణగాడి వీర ప్రేమగాథ……
-----
ఊరి చివర అర ఎకరం ఆవరణలో - హారర్ సినిమాల్లో భూత్ బంగళాలా ఉందా భవంతి.
గడియారం చూసుకున్నాను. రాత్రి ఎనిమిది.
రేపుదయం ఎనిమిది దాకా నేనొక్కణ్ణీ ఆ బంగళాలో గడపాలంటే వళ్లు జలదరించింది నాకు.
ఆ ఇంటికి ఎవరూ కాపలా లేరు. ఇంటికి తాళం కూడా లేదు. తొయ్యగానే ముఖద్వారం
తెరుచుకుంది.
‘లోపలికెళ్లాలా వద్దా?’ - క్షణం తటపటాయించాను.
‘లవ్ చెయ్యాలా వద్దా?’ వెంటనే చెవిలో గాయకుడు నరేంద్ర గొంతు గొణిగింది.
ప్రేమ కొందరికి ఆహ్లాదం. కొందరికి వినోదం. కొందరికి ఆట. కొందరికి కాంక్ష. ఇది నేటి కథ.
ప్రేమ అంటే- ముందు చొరవ, ఆ తర్వాతనే మిగతావి అనుకుంటే - అది నాటి కథ.
అలనాటి వీరగాథల్లో చాలావరకూ ప్రేమకథలే!
ఓ కథలో చింతామణి అనే యువతి ప్రేమకోసం వెయ్యిమంది రాకుమారులు తమ
తలల్ని సమర్పించుకుని - ఆమెని సహస్ర శిరచ్ఛేద అపూర్వచింతామణిని చేశారు. నాటి
కథని నేటికి తీసుకురాగల అభినవ చింతామణులు ఇంకా ఉన్నారనడానికి నిదర్శనం
సుపథ.
ఆమె కోసం కొన్నయినా తలలు తెగాయని నా అనుమానం.
ఐనా నా తల తెగదన్న నమ్మకంతో - ఈ రాత్రి ఈ బంగళాలో గడపడానికి సిద్ధపడ్డాను.
సుపథ గొప్పింటమ్మాయి. గొప్ప అందగత్తె. గర్వమున్నట్లు కనిపించదు. ఎవరు
పలకరించినా నవ్వుతూ బదులిస్తుంది. చొరవ చేసి ప్రేమిస్తున్నానని అన్నా చెప్పు
తియ్యదు.
‘‘నాన్న చంపేస్తాడు’’ అని హెచ్చరిస్తుంది. చంపేది తనని కాదు, ప్రియుణ్ణి.
ఆమె తండ్రి బ్రహ్మాజీకి వ్యాపారంలో సంపాదించిన కోట్లున్నాయి. రాజకీయాల్లో
సంపాదించిన పలుకుబడి ఉంది.
ఆ డబ్బు, హోదాతో ఎక్కణ్ణించైనా ఏమైనా తీసుకుని, అది చాలా మామూలు విషయం
అనిపించేలా చెయ్యగలడు.
మనిషినుంచి ప్రాణాలు తీసుకున్నా అంతే!
ఈ విషయం నాకు మూడు వారాల క్రితం కృష్ణగాడు చెప్పాడు.
-----
కృష్ణ నాకు రెండేళ్లుగా తెలుసు. అంటే హైటెక్ క్లూస్ అనే కంపెనీలో
ఉద్యోగస్థులమైనప్పట్నించీ.
ఈ రెండేళ్లుగా వాడు పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్నాడు. అమ్మా నాన్నా
సంబంధాలు చూస్తున్నారుట. కానీ అదేమిటో, అమ్మాయిలంతా ఫొటో చూసే
కాదనేస్తున్నారుట వాణ్ణి.
చివరికి తలిదండ్రులు వాడితో, ‘‘మాకు కులం, మతం పట్టింపు లేదు - ఓ అమ్మాయిని
ప్రేమించి పెళ్లి చేసుకో. ఆ పిల్ల పాటించే సంప్రదాయానికి అడ్డు కాకపోతే, వచ్చి నాలుగు
అక్షింతలు వేసి దీవించి వెళ్లిపోతాం’’ అనేశారుట.
పెళ్లి విషయంలో డెస్పరేట్ ఐపోతున్నప్పుడు వాడికి ‘మనోహరా’ పార్కు స్పురించింది.
అందులో వాడిలాంటి వాళ్లకని ఓ ‘వెడ్ లైట్ ఏరియా’ సృష్టించారు.
చూడ్డానికది కల్యాణమండపాల్లో లాన్ ఏరియాలా ఉంటుంది. కుర్చీలు, బెంచీలతో పాటు
వివిధరూపాల్లో రంగురంగుల జలయంత్రాలుంటాయి. అక్కడున్నది యువతీ
యువకులైతే - వాళ్లు పెళ్లికి సిద్ధమనుకోవచ్చు. నడివయసువారో, వృద్ధులో ఐతే వాళ్లు
మళ్లీ పెళ్లికి సిద్ధమన్నమాట!
ఆ ఏరియాలో ఎవరైనా ఎవరినైనా, ‘నన్ను పెళ్లాడుతావా?’ అని అడిగితే ‘షి’ టీమ్స్ కూడా
తప్పు పట్టవు.
కృష్ణ అక్కడ సుపథని చూశాడు. ఆమె వివరాలడిగి తన వివరాలు చెప్పాక, ధైర్యంగా పెళ్లి
మాటెత్తాడు.
ఆమెకి కృష్ణ నచ్చాడు. సమస్యల్లా ఆమె తండ్రి బ్రహ్మాజీ. ప్రేమించినందుకు కృష్ణని
చంపేస్తాడు.
‘‘నీకోసం చావడానికైనా నేను సిద్ధం’’ అన్నాడు కృష్ణ.
సుపథ ఇంప్రెసయ్యింది. మర్నాడు వాణ్ణి తన తండ్రి బ్రహ్మాజీకి పరిచయం చేస్తానంది.
ఆ మర్నాడు నాకు వాణ్ణించి ఫోను: ‘‘సుపథ నన్ను పరీక్షించాలని ఊరికే
భయపెట్టినట్లుందిరా, బ్రహ్మాజీగారు చాలా మంచివాడు. సుపథని దక్కించుకుందుకు
రెండే రెండు ఘనకార్యాలు చెయ్యాలన్నాడంతే!’’ అన్నాడు.
‘‘ఏమిట్రా ఆ ఘనకార్యాలు?’’ అన్నాను కుతూహలంగా.
‘‘ఇప్పుడు కాదు, సుపథకి చేసి చూపించేక చెబుతాను’’ అని ఫోన్ కట్ చేసి వాట్సాప్‌లో
సుపథ ఫొటో పంపాడు.
సుపథ స్టన్నింగ్ బ్యూటీ. చూస్తే చాలు, ఆమెకోసం ఏమైనా చెయ్యాలని, చెయ్యగలమనీ
అనిపిస్తుంది.
తర్వాతేం జరిగిందో తెలియదు. కృష్ణ ఆఫీసుకి ఆరు వారాలు సెలవెట్టినట్లు తెలిసింది.
ఫోను మాటటుంచి, వాడి జాడ కూడా లేదు. వాడింట్లో అడిగితే, ‘‘ఊరెడుతున్నానన్నాడు,
ఇంకా రాలేదు’’ అన్నారు.
రెండు వారాలైనా వాడి అజాపజా లేకపోయేసరికి మనసు కీడుని శంకించింది. సుపథ కానీ,
ఆమె తండ్రి బ్రహ్మాజీ కానీ వాణ్ణేమైనా చేశారా అన్న అనుమానం నన్ను తొలిచేస్తోంది.
కానీ అందుకు ఆధారాలు లేవు. ఈ విషయంలో ఏమైనా క్లూ దొరకాలంటే సుపథని
కలవాలి. ఎక్కడ?
ఆమె ఇంటికి వెడితే ప్రమాదం. సేఫ్ జోన్ - ‘మనోహరా’ పార్కులో వెడ్ లైట్ ఏరియా!
మళ్లీ అక్కడికొస్తుందా అని అనుమానిస్తూనే - రెండు మూడు రోజుల తర్వాత అక్కడికి
వెళ్లాను.
నేను వెళ్లిన కాసేపటికి సుపథ అక్కడికి వచ్చింది. ఆహా, ఏమందం! ఇరవై పైనే ఉండే
ఆమె వయసుని ఆ అందం పదహారుకి దింపేసింది.
ఒకసారి చూశాను. మరి చూపు మరల్చుకోలేకపోయాను. ఏమనుకుంటుందో అని
భయపడ్డాను కానీ, ఆమె నన్ను చూసి తెలిసినదానిలా పలకరింపుగా నవ్వింది.
తనువు పులకరించింది. దగ్గరకెళ్లాను. నేను నోరు విప్పేలోగా తనే పెదవి విప్పి,
‘‘అర్థమైంది. ప్రపోజలుతో వచ్చావ్. నీ బాక్‌గ్రౌండ్ బొత్తిగా తెలియకపోయినా, సినీహీరోలా
ఉండే నీ లుక్స్‌కి నేను ఫ్లాట్!’’ అని, ‘‘కానీ ఏం లాభం? మన పెళ్లి జరుగదు. నా బావ శోధన్
నాకు తగిన వరుడని మా నాన్న ఉద్దేశ్యం. వేరెవ్వరు నాకు ప్రపోజ్ చేసినా వాళ్లని
బ్రతకనివ్వడు’’ అంటూ నిట్టూర్చిందామె.
అప్పటికి మామూలు మనిషినయ్యాను. ఈమె కృష్ణకీ ఇంచుమించు ఈ మాటలే చెప్పింది.
నేనూ వాడిలాగే స్పందిస్తే - వాడిలాగే మాయమైపోతానా అనిపించింది కానీ
భయమెయ్యలేదు. ఆపైన కుతూహలం. ‘‘నీకోసం చావడానికీ నేను సిద్ధమే!’’ అన్నాను.
సుపథ ఆశ్చర్యంగా చూసి, ‘‘నీకు మా నాన్న సంగతి తెలియదు’’ అని ఏదో చెప్పబోయింది.
ఆమెని ఆపి, ‘‘ఒక్క నిముషం. మీ నాన్న నీకు శోధన్‌ని అనుకుంటున్నాడనీ, వేరెవరైనా
నీకు ప్రపోజ్ చేస్తే చంపేస్తాడనీ నీకు తెలుసు. ఐనా నువ్వీ వెడ్ లైట్ ఏరియాకి
ఎందుకొస్తున్నట్లు? అంటే నీకు శోధన్ ఇష్టం లేదు. నీకిష్టం లేని పెళ్లి ఆపడానికి
చావడానికైనా నేను సిద్ధం. మీ నాన్న గురించి నాకు తెలియని విషయాలు చెప్పేముందు,
నా గురించి ఈమాత్రం తెలుసుకో’’ అన్నాను.
ఆమె ఇంప్రెసయింది. మెచ్చుకోలుగా నన్ను చూస్తూ, ‘‘వెరీ స్మార్ట్! శోధన్ అంటే నాకిష్టం
లేదని సరిగ్గానే ఊహించావు. ఐతే నాకిష్టం లేని వరుణ్ణి అంటగట్టడం నాన్నకీ తృప్తిగా
లేదు. కానీ ఆయన డబ్బు మనిషి. నేను శోధన్‌ని చేసుకుంటే, తనకి పది కోట్లు
కలిసొస్తాయిట. ఇంకా ఎక్కువ కలిసొచ్చేలా చెయ్యగలిగితే, అలాంటివాడికి నన్నిచ్చి
పెళ్లి చెయ్యడానికి ఆయనకి అభ్యంతరం లేదు’’ అంది.
‘‘అంటే ప్రస్తుతానికి నీ ప్రేమ విలువ పది కోట్లన్న మాట’’ అన్నాను.
‘‘అది శోధన్‌కి. నీకైతే ఇంకా ఎక్కువ’’ నవ్వింది సుపథ. ఆ నవ్వు ఆమె అందాన్ని మరింత
పెంచింది. ఆమె వయసు పద్నాలుక్కి పడిపోయింది.
‘‘మధ్యతరగతి ఉద్యోగిని. వరకట్నం వద్దనగలను కానీ, కన్యాశుల్కం కావాలంటే ఓ
పాతికవేల దాకా ఓకే. నువ్వేమో కోట్లంటున్నావ్!’’ అన్నాను.
‘‘మా నాన్న శోధన్‌ని మాత్రం నేరుగా డబ్బడిగాడా? అతడివల్ల ఆయనకి పది కోట్లు
కలిసొస్తున్నాయి. నీవల్ల అంతకంటే ఎక్కువ కలిసొస్తే చాలు, నీ పనైపోతుంది’’ అంది
సుపథ.
‘‘ఔననుకో - కానీ ఒక కోటి అంటేనే నాకది ఎండమావి’’ అన్నాను నీరసంగా.
‘‘ఒయాసిస్ నాన్న చూపిస్తాడు. అందుకాయన రెండు ఘనకార్యాలు నిర్ణయించాడు. నీలా
దృఢనిశ్చయం ఉన్నవారికే వాటి గురించి చెబుతాడు. నువ్వు సరేనంటే నిన్ను
రేపాయనకి పరిచయం చేస్తాను’’ అంది.
కొంచెం కొంచెం అర్థమౌతోంది నాకు. కృష్ణ దారిలోనే నేనూ వెడుతున్నాను.
సుపథ వెడ్ లైట్ ఏరియాకి రావడం వెనుక ఏదో కథ ఉందనిపించింది. మర్నాడు సుపథ
చెప్పిన చోట బ్రహ్మాజీని కలుసుకున్నప్పుడు ఆ కథ కొంచెం తెలిసింది.
ఊరి చివర అరెకరం జాగాలో ఓ భవంతి ఉందాయనకి. ప్రస్తుతం లెక్కల్లో దాని విలువ
ఇరవై కోట్లకు పైనే. కానీ ఎవరో ఆ ఇంట్లో దయ్యాలున్నాయని పుకారు పుట్టించారు.
అప్పట్నించీ ఆ ఇంటిని దయ్యాలకొంపగా ధ్రువీకరిస్తూ ఎన్నో కథలు ముమ్మరంగా
ప్రచారంలోకి వచ్చాయి. అవి పుకార్లని ఋజువు చెయ్యడానికి, డబ్బాశ పెట్టి
కొందర్నక్కడికి పంపిస్తే, వాళ్లు రాత్రికి రాత్రి తిరిగొచ్చి చెప్పిన కథలు విన్నాక - ఆ
ఇంట్లోకెళ్లాలంటే బ్రహ్మాజీకే భయంగా ఉంది. ఆ భయం పోయేదాకా ఆ ఇంటి విలువ సున్నా.
‘‘ఓ రాత్రి ఎనిమిదినుంచి మర్నాడుదయం ఎనిమిది దాకా అక్కడుండి నిర్భయంగా
వెనక్కి రావాలి. అదీ నాక్కావాల్సిన అసలు ఘనకార్యం’’ అన్నాడు బ్రహ్మాజీ.
ఉత్సాహంగా అనిపించింది. నేను దయ్యాల్ని నమ్మను. నాకు చీకటంటే భయం లేదు.
ఎటొచ్చీ ఆ ఇంట్లో సంఘ వ్యతిరేకశక్తులేమైనా చేరి దయ్యాలుగా నాటకమాడుతూ
ప్రమాదం తలపెడితే మాత్రం నా జాగ్రత్తలో నేనుండాలి. అంటే నేనక్కడికి వెళ్లిన
విషయం, ఆ తర్వాత ఎవరికైనా తెలిసేలా ఓ ఉత్తరం వ్రాసి ఉంచాలి.
నేనా ఘనకార్యానికి ఒప్పుకున్నట్లు తలూపి, ‘‘అసలంటున్నారు. దీనికి కొసరొకటుందా?’’
అన్నాను.
‘‘వ్యాపారస్థుణ్ణి. అసలుకి కొసరు లేకుండా ఎలా? ఎటొచ్చీ ఒకోసారి అసలుకంటే కొసరే
ఘనం కావచ్చు’’ అని, ‘‘వారంక్రితం సూపర్‌స్టార్ శశిమోహన్ కొత్త సినిమా
‘బహిష్కృతుడు’ విడుదలైంది. థియేటర్లలో ఇంకా ఆడుతోంది కానీ అట్టర్ ఫ్లాప్
అంటున్నారంతా! అసలు ఘనకార్యం చేసేక, నేను చెప్పిన రోహిత్ అనేవాణ్ణి
కలుసుకుని, ఆ సినిమా పరమ చెత్త అని చెప్పేసి రావాలి నువ్వు. అదే కొసరు
ఘనకార్యం’’ అన్నాడు బ్రహ్మాజీ.
-----
ఇప్పుడు నేనా దయ్యాలకొంప ముఖద్వారం తలుపు తోశాను. గుండె గుబగుబలాడుతున్నా,
రోట్లో తలెట్టి రోకటిపోటుకి వెరపేల - అనుకుంటూ లోపల అడుగెట్టాను. వెంటనే నా వెనుక
తలుపులు మూసుకున్నాయి.
ఉలిక్కిపడి వెనక్కి చూస్తే, ఒక్కసారి ఎన్నో దీపాలు వెలిగినట్లు పెద్దగా కాంతి. మళ్లీ అటు
తిరిగితే -
పెద్ద హాలు. నేలంతా తివాచీ పరిచి ఉంది. మధ్యలో సోఫాలు. గోడలకు తైలవర్ణచిత్రాలు.
పైకి వెళ్లే మెట్ల పక్కన రెయిలింగుకి చేతులాన్చి ఓ మనిషి అటు తిరిగినిలబడి ఉన్నాడు.
పాంటుంది, చొక్కా లేదు.
నేనో అడుగు ముందుకెయ్యబోగా ఆ మనిషి ఇటు తిరిగాడు. చూస్తే కండలు తిరిగి
వస్తాదులా ఉన్నాడు. అడుగు ముందుకి పడలేదు. అతడే నా దగ్గరకొచ్చాడు. నడిచినట్లు
లేదు. అక్కడ మాయమై నా ముందు ప్రత్యక్షమైనట్లుంది. ‘‘ఎవరు మీరు?’’ అన్నాను.
‘‘చెబుతాను, పద - కూర్చుని మాట్లాడుకుందాం’’ అన్నాడు. ఈ సారి అతడే కాదు,
నేనుకూడా అక్కడ మాయమై సోఫాలో ఉన్నట్లు అనిపించింది.
‘‘నా పేరు ధర్మా. హత్యలు నా హాబీ. నమ్ము నమ్మకపో, నూటికి పైగా హత్యలు చేశాను.
అప్పటికి నేను చంపినవాళ్ల ఆత్మలన్నీ ఒక్కటయ్యాయి. అవి నన్నిక్కడికి తీసుకొచ్చాయి.
ఇక్కణ్ణించి బయటపడ్డానికి నాకొక్కటే మార్గముంది. నువ్వు నన్ను చంపాలి. చంపుతావా?’’ ఒక్క గుక్కలో హడావుడిగా అన్నాడతడు.
ధర్మా పేరు నాకు తెలుసు. అతడి గురించి దినపత్రికల్లో చదివాను. చూడ్డం ఇదే
మొదటిసారి.
నా ఎదుటనున్నది ధర్మా అని తెలియగానే, పైప్రాణాలు పైనే పోయాయి.
ఆ నరహంతకుడు తనని చంపమంటున్నాడు. నోట మాటెలా వస్తుంది నాకు?
‘‘మామూలుగా హతుడు ప్రతిఘటిస్తాడు. చేతులెత్తి మొక్కి బ్రతిమాలతాడు.
అలాంటివాళ్లని ఎందరినో అవలీలగా చంపాను. నువ్వేమిటీ, పిలిచి
ప్రాణమిస్తానంటుంటే వెనకాడుతున్నావ్’’ అన్నాడు ధర్మా తనే మళ్లీ.
అప్పటికి పుంజుకుని, ‘‘సరే, నిన్ను చంపాననుకో. నువ్వు బయటపడతావ్. నేనేమౌతాను?’’ అన్నాను.
‘‘వెంటనే ఇంటి బయట ఉంటావ్!’’ అన్నాడు ధర్మా.
అర్థమైంది. అలా జరిగితే బ్రహ్మాజీ పరీక్షలో నేను ఫెయిలైనట్లే!
‘‘రేపుదయం ఎనిమిదిలోగా ఈ ఇంటికి బయటా - నో వే’’ అన్నాను.
ధర్మా నవ్వి, ‘‘నువ్వు నన్ను చంపకుండా ఇక్కడే ఉంటానంటే, నాదో షరతుంది. నేను
చేసిన ఒకో హత్య కథే చెబుతుంటాను. నువ్వు వినాలి’’ అన్నాడు.
ఎన్నో హారర్ సినిమాలు చూశాను. ధర్మా కథలు వినడానికి నాకేం భయం అనుకుని
ఊరుకున్నాను. ధర్మా చెప్పడం మొదలెట్టేక గానీ తెలియలేదు - అదెంత కఠిన శిక్షో!
ఆ కథలు నా ఊహకందనంత భయంకరం. వళ్లు గగుర్పొడిచింది. ప్రపంచంలో ఇలాంటి
ఘోర హంతకులు ఉంటారా అనిపించింది. అతడు చెబుతుంటే వింటున్నట్లు లేదు.
దృశ్యాలన్నీ కళ్లకు కట్టి నిలువెల్లా వణికిస్తున్నాయి.
నాలో ఓ అనుమానం. గడువు సమయంలోగా బయటికి పంపి, ఘనకార్యం చెయ్యకుండా
నన్నాపడానికి జరుగుతున్న ప్రయత్నాలు కానీ కాదు కదా ఇవి.
ఇది హైటెక్ యుగం. నేను చూస్తున్న ధర్మా నిజం కాకపోవచ్చు. అతడు చెబుతున్న
కథలు నిజం కాకపోవచ్చు. గ్రాఫిక్సో, మోర్ఫింగో నన్ను భ్రమలకు గురి చేస్తుండొచ్చు.
ఏదేమైనా ఉదయం ఎనిమిది దాకా ఎలాగో అలా అక్కడే ఉండాలని గట్టిగా
అనుకున్నాను. కానీ నాలుగు కథలు పూర్తయ్యేసరికి నా బక్కప్రాణం
తట్టుకోలేకపోయింది, ‘‘ఇక ఆపు’’ అని గట్టిగా అరిచాను.
‘‘ఆపుతాను. మరి నన్ను చంపుతావా?’’ అన్నాడు ధర్మా.
‘‘హత్య కాదు, మరో మాట చెప్పు’’ అన్నాను అభ్యర్థనగా.
ధర్మా క్షణం ఆలోచించి, ‘‘ఐతే మేడమీదకెళ్లి తెల్లారేదాకా అక్కడే ఉండు. మధ్యలో
ఇక్కడికొచ్చేవో నా కథలైనా వినాలి. నన్ను చంపనైనా చంపాలి’’ అన్నాడు.
‘‘మేడమీద కెడతాను’’ అన్నాను తప్పించుకుందుకు మరో మార్గం లేక.
అంతే, మేడమీద ఓ గదిలో ఉన్నాను. నా ఎదురుగా ఓ యువతి. అంతవరకూ అటువైపు
తిరిగున్న ఆమె అప్పుడే నావైపు తిరిగింది.
కెవ్వుమన్నాను. ఆమె ముఖం మనిషి ముఖంలా కాక, మాంసంముద్దలా ఉంది. ఆ
ముద్దలోంచీ రెండు కళ్లు నన్ను గుచ్చి గుచ్చి చూస్తున్నాయి. ‘‘భయపడ్డావా?’’ అందామె.
గొంతు సౌమ్యంగానూ, మధురంగానూ ఉంది. దాంతో కొంచెం తేరుకుని, ‘‘ఎవరు నువ్వు?’’
అన్నాను.
‘‘నా పేరు భామిని. పుట్టినప్పుడు పుత్తడిబొమ్మలాగున్న అదృష్టవంతురాల్ని.
వయసొచ్చేక వందకుపైగా అత్యాచారాలకి గురైన అభాగ్యురాల్ని. ఒకడు నాపై యాసిడ్
దాడి చెయ్యడంతో అత్యాచారాలు ఆగాయి కానీ దురదృష్టం నన్నిక్కడికి
తరుముకొచ్చింది. నేనిక్కణ్ణించి బయటపడాలంటే ఒక్కటే మార్గం - నీ అనుమతితో నేను
నీపై అత్యాచారం చెయ్యాలి’’ అందామె.
ఆ అతిలోకభయంకరి నాపై అత్యాచారమా? తలుచుకుంటేనే నరనరాలా సన్నని వణుకు.
‘‘నో’’ అన్నాను అప్రయత్నంగా.
‘‘నో అన్నావంటే, నామీద జరిగిన అత్యాచారాల కథలన్నీ వినాలి’’ అంటూనే కథలు
మొదలెట్టింది. అవి మామూలు కథలు కాదు. ‘జ్యోతి’ని ‘నిర్భయ’ను చేసిన ఘోరానికి
ఏమాత్రం తీసిపోని క్రూరకృత్యాలు. ఆమె చెబుతుంటే కళ్లకు కట్టి నిలువెల్లా వణికిస్తున్న
భయంకరాలు. కంప్యూటర్ గ్రాఫిక్సయినా సరే, వాటిని భరించడం కష్టం. మూడు కథలు విని,
‘‘ఇక ఆపు’’ అని గట్టిగా అరిచాను.
‘‘ఐతే అత్యాచారానికి ఒప్పుకుంటావా?’’ అంది భామిని. ఒప్పుకోకపోతే కిందకు పంపింది.
కాసేపు కింద, కాసేపు పైన - అలా ఉదయం ఏడున్నర దాకా ఆ ఇద్దరి కథలూ వింటూ - నా
మెదడుపై జరిగిన అత్యాచారాన్ని భరించాను.
చివరికి ధర్మా, ‘‘మన చుట్టూ క్రూరరాక్షసులు చాలామందున్నారు. సమాజంలో జరిగే
నేరాలకు, ఘోరాలకు, అవినీతి, అక్రమాలు వగైరాలే కాదు - సామాన్యుల ఇతర
ఇక్కట్లకూ వాళ్లే కారణం. ఎదిరించడంకంటే తలొంచుకోవడమే మేలు అనుకునేవాళ్లది
మెజారిటీ కాబట్టి వాళ్ల ఆటలు సాగుతున్నాయి. నేనలా తలొంచుకోలేదు. ఎన్నో
హత్యలు చేశానని నువ్వు నన్ను రాక్షసుడనుకోవచ్చు. నిజానికి నా చేతిలో చచ్చినవాళ్లే
రాక్షసులు. ఈ సమాజంలోని దుర్మార్గంపట్ల నా స్పందనే నేను చేసిన హత్యలు. కానీ ఏం
లాభం? చివరికి ఇక్కడ చిక్కడిపోయాను. ఎవరైనా నన్ను చంపేదాకా, నాకిక్కణ్ణించి
విముక్తి లేదు. విముక్తి కలిగిస్తారన్న ఆశతోనే - ఈ ఇంట్లోకెవరొచ్చినా నా కథ
చెబుతున్నాను. కానీ నా కథలకంటే భయంకరమైనది ఆ బ్రహ్మాజీ కూతురి అందం. ఆ
మాయలో పడిన నీవంటివాళ్లు నాకు ముక్తి కలిగించరు. ఐనా ఆమె నీకు
దక్కుతుందనుకోకు’’ అన్నాడు.
ధర్మా మాటలకు గతుక్కుమన్నాను. కానీ పట్టించుకోలేదు. ఎలాగైనా ఎనిమిదిలోగా నన్ను
బయటికి పంపడమే అతడి ఉద్దేశ్యమని గ్రహించి, ‘‘సరేలే, ఆ సంగతి నేను
చూసుకుంటాను’’ అన్నాను.
‘‘ఏం చూసుకుంటావ్? నా మాటమీద నమ్మకం లేకపోతే - పైనున్న భామినినడుగు’’ అని
మాయమయ్యాడు ధర్మా. అంతే నేను మేడమీద భామిని ఎదుట ఉన్నాను.
ఆమె నావంక జాలిగా చూసి, ‘‘ఇప్పుడు నేను చెబుతున్న ఈ చిట్టచివరి కథ - మునుపటి
కథల్లా నిన్ను భయపెట్టదు. కానీ ఇది విన్నాక నీకు కలిగే దుఃఖం ఇంతా అంతా కాదు’’
అంటూ మొదలెట్టింది.
భామిని ధర్మా ప్రియురాలు. ఆమె అతడి ఆరోప్రాణం. ఆమెపై అత్యాచారం చేసిన ప్రతివాణ్ణీ
క్రూరంగా వేటాడి చంపేశాడతడు. కానీ ఆడదానిపై అత్యాచారం చేసేవాళ్లని అటు
న్యాయస్థానమూ ఆపలేదు, ఇటు ధర్మాలాంటివాళ్లూ ఆపలేరు. ఆమెపై అత్యాచారాలు
కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి తనకి లొంగలేదన్న కోపంతో, ఓ దుర్మార్గుడు ఆమెపై
యాసిడ్ దాడి చేశాడు. అందువల్ల ముఖం భయంకరంగా తయారవడం ఒకటి.
భరింపసాధ్యంకాని బాధ ఒకటి. ఆమెకి బ్రతకాలని లేదు. ఆత్మహత్య చేసుకునే
మనఃస్థైర్యం లేదు. అప్పుడొకామె ఆమెకి ‘ఈ ఊళ్లో సూపర్‌స్టార్ శశిమోహన్‌కి రోహిత్ అనే
వీరాభిమాని ఉన్నాడు. నువ్వా రోహిత్‌ని కలుసుకో. శశిమోహన్ ప్రస్తావన తెచ్చి అతడి
సినిమాని పరమచెత్త అని తిట్టు. పక్కాగా చెబుతున్నాను. అతగాడు నిన్ను
బ్రతకనివ్వడు. కానీ నువ్వేమయ్యావో ఎవరికీ తెలియదు’’ అని సలహా ఇచ్చింది.
భామిని నమ్మలేదు. రోహిత్ గురించి ధర్మాకి చెప్పింది. ‘‘అంత చిన్న విషయానికి
మనుషుల్ని చంపేస్తాడా? అలాంటివాణ్ణి బ్రతకనివ్వకూడదు. నేను వాడి దగ్గరికెళ్లి
శశిమోహన్‌ని ఇష్టమొచ్చినట్లు తిడతాను. నన్నేమైనా చెయ్యబోయాడా, వాడుండడు’’
అని ఆవేశంగా వెళ్లాడు.
ఆ తర్వాత అతడేమయ్యాడో తెలియదు. అప్పుడు భామిని కూడా వెళ్లి రోహిత్‌ని
కలుసుకుంది.
‘‘తర్వాత నాకేమయిందో తెలియదు. మేమిద్దరం ఇక్కడ తేలాం’’ అని మాయమైంది
భామిని.
నివ్వెరపోయాను. కాసేపు మెదడు పని చెయ్యలేదు. నెమ్మదిగా తేరుకున్నాక విషయం
కొంచెం కొంచెం అర్థమౌతోంది. కొందరికి విడియో గేమ్సులా - బ్రహ్మాజీ, సుపథలు
ఘనకార్యాల పేరు చెప్పి ఈ ఇంట్లో ఇలాంటి ఆటొకటి ఆడుతున్నారన్న మాట!
‘‘అమ్మ బ్రహ్మాజీ! నువ్విచ్చిన అసలు ఘనకార్యం సాధించకుండా ఆపడానికి ధర్మా,
భామినిలను సృష్టించావ్! ఆపడం వాళ్లవల్ల కాకపోతే, వాళ్లిద్దరి ద్వారా భయపెట్టి, కొసరు
ఘనకార్యం చెయ్యకుండా ఆపాలనుకుంటున్నావన్న మాట! కానీ నువ్వు నన్నాపలేవు’’
అనుకుంటూ కిందకొచ్చి సింహద్వారం వైపు నడిచాను.
తలుపులకు దగ్గరవుతుంటే గుమ్మం దగ్గర ఓ వ్యక్తి కనిపించాడు. ఎవరా అని చూస్తే,
ఆశ్చర్యంగా కృష్ణ!
‘‘కృష్ణా, నువ్విక్కడ!?’’ అని ఏదో అనబోతే -
‘‘నిన్ను బ్రతిమాలుకుంటున్నానురా. నా మాట విని రోహిత్‌ని కలుసుకునే ప్రయత్నం
మానేసేయ్. సుపథని మర్చిపో’’ అన్నాడు కృష్ణ.
తెల్లబోయాను. ‘‘ఏమిట్రా, నువ్వేనా....’’ అంటున్నాను. కానీ కృష్ణ అక్కడ కనిపించలేదు.
భ్రమ పడ్డానా, నిజంగా చూశానా?
ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు ఘనకార్యం సాధించాను. కొసరు విషయం ఏంచెయ్యాలి?
‘‘నా మాట విని రోహిత్‌ని కలుసుకునే ప్రయత్నం మానేసేయ్. సుపథని మర్చిపో’’ - అన్న
కృష్ణ మాటలు మళ్లీ మళ్లీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి.
---0---
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
వసుంధర పరిచయం మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
Comments