top of page

చూడాలని ఉంది


'Chudalani Undi' written by Vasundhara

రచన : వసుంధర

“అన్నయ్యా! నిన్ను చూడాలనుంది. ఎప్పుడు రాను?” అన్నాడు హర్ష

ఫోన్లోబ్రతిమాలుతున్నట్లు.

హర్ష నా పిన్ని కొడుకు. నా కాలేజి రోజుల్లో వాడిది హైస్కూలు. వాడికీ నాకూ తోడబుట్టినవాళ్లకు మించిన అనుబంధముంది. ఇప్పుడు నేను రిటైర్డ్ ఇంజనీర్ని.

వాడు రిటైర్మెంటు లేని ఫైనాన్షియల్ కన్సల్టెంటు.

“ఇప్పట్లో రావద్దు. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలను” అన్నాను క్షణం కూడా తటపటాయించకుండా.

“మరీ అలా చెప్పేశారేంటీ” అంది నా భార్య గౌరి నెమ్మదిగా.

“ఆ మాట వాణ్ణడగనీ” అని నేనూ నెమ్మదిగా అన్నాను కానీ, అంతలో ఫోన్ కట్టయింది.

“నొచ్చుకున్నాడేమో!” అంది గౌరి.

నాకూ ఆ అనుమానమొచ్చి, నేనే మళ్లీ ఫోన్ చేశాను. లైను కలవలేదు.

హర్షది తిట్టే నోరు కాదు కానీ, తిరిగే కాలు. పట్టుమని పది నిముషాలు ఓ చోట

ఉండలేడు. ఆ బలహీనతకి బంధుప్రీతి అని పేరెట్టి, ఎప్పుడూ ఎవరో ఒకరింట్లో

వాలుతుంటాడు. అలాంటప్పుడు అవతలి వాళ్లకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న

ఆలోచనే మనసులోకి రానివ్వడు. పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్లు, ఈ

అలవాటు వాడికి చిన్నప్పట్నించీ ఉంది.

కాలేజి రోజుల్లో నా చదువెంత హెక్టిగ్గా ఉండేదంటే, సెలవుల్లోనూ ఇంటికెళ్లి

ఉండడానికి నాలుగైదు రోజులు దొరకడం గగనమైపోయేది. ఆ కాసిని రోజులూ

నాన్ననే కాదు- తమ్ముణ్ణీ చెల్లినీ కూడా పక్కన పెట్టి అన్నీ నాకు ఇష్టమైనవే వండేది

అమ్మ. “మేం సవతిబిడ్డలమా?” అని తమ్ముడూ చెల్లీ కోపం నటిస్తే, “అలాగే

అనుకోండర్రా, ఈ నాల్రోజులూ వాడిక్కడ కింగు. మీరే కాదు, వేరే ఎవరొచ్చినా కూడా

పట్టించుకునేది లేదు” అని నవ్వేసేది.

అలాంటి సెలవు రోజు మా ఇంటికొచ్చాడు హర్ష. “దొడ్డా, నిన్ను చూడాలనిపించింది.

ఆగలేక ఒక్కణ్ణీ వచ్చేశాను. అదృష్టం- సమయానికి అన్నయ్య కూడా ఉన్నాడు”

అన్నాడు నన్ను చూసి. “నీ చేతి వంట తినాలని దార్లో బీరకాయలు కొనితెచ్చాను”

అంటూ అమ్మకి అవి అందించి తన ఫర్మాయిషీ కూడా చెప్పేశాడు.

అమ్మ, నేను నిరుత్సాహపడ్డాం. హర్షకీ నాకూ రుచుల్లో, అభిరుచుల్లో

హస్తిమశకాంతరం. నాకు కారం, వాడికి తీపి- ఇష్టం. నాకు వంకాయ, వాడికి బీరకాయ.

నేను నో కాఫీ. వాడు ఫిల్టర్ కాఫీ. ఇలా ఎన్నో….

చెల్లెలి కొడుక్కదా, హర్షంటే అమ్మకి అభిమానమే.

కానీ నాకోసం తమ్ముణ్ణీ చెల్లినీ కూడా పక్కన పెట్టిన మనిషి, ఇప్పుడు వాడికి

ప్రాధాన్యమివ్వక తప్పదు. అదీకాక- అమ్మ అనుకుంటే తను నాకే అమ్మ. ఆడది

అనుకుంటే ఎందరికో అమ్మ. అదీ స్త్రీ ఔన్నత్యం.

మనసులో కొంత ఇబ్బందిపడ్డా అమ్మ వెంటనే సద్దుకుని వాడికోసం కాఫీ ఫిల్టరు

వేసింది. నాకోసం వంకాయ, వాడికోసం బీరకాయ కూరలు ప్లాన్ చేసి- వంటపనుల్లోకి

దిగింది.

నేను కూడా, “పదరా, అమ్మకి వంటలో సాయం చేస్తూ కబుర్లు చెప్పుకుందాం”

అన్నాను హర్షతో.

కానీ హర్షకి కాలు నిలుస్తుందా! ఓ పది నిముషాలు ఇంట్లో ఉన్నాడంతే!

“ఓసారి అలా ఊరు చుట్టొస్తా దొడ్డా” అని వెళ్లి, ఆ వెళ్లినవాడు భోజనాల టైముకి కూడా

రాలేదు.

వాడికోసం కాసేపెదురుచూసి అంతా భోజనాలు కానిచ్చేశాం.

అమ్మ బీరకాయకూర ఫ్రిజ్జిలో పెట్టి, “మనసుపడి అడిగాడు. ఫ్రిజ్జిలో పెట్టింది

తింటాడో తినడో” అనుకుంది.

కానీ వాడు రాత్రికీ రాలేదు. మర్నాడూ రాలేదు. అమ్మ కంగారుపడి పిన్నికి ఫోన్ చేస్తే,

“వాడికిది మామూలే, ఇంటికొచ్చేక నీకు ఫోన్ చేయిస్తాన్లే” అంది పిన్ని తొణక్కుండా

బెణక్కుండా.

తర్వాత తెలిసిందేంటంటే- వాడు అలా రోడ్డుమీదకెడితే బస్సొచ్చిందిట. ఎక్కి

పక్కూరెళ్లేట్ట. అక్కడో గుడి కనబడితే వాకబు చేసి పూజారిల్లు తెలుసుకుని,

ఆయనచేత గుడి తలుపులు తెరిపించి ప్రత్యేకంగా దేవుణ్ణి దర్శించేట్ట. వాడిచ్చిన

దక్షిణ తీసుకుని, “ఈ కాలం పిల్లాడివి కాదు” అని ఆయన వాడి భక్తికి అబ్బురపడ్డాట్ట.

ఇటొచ్చే బస్సులు దొరక్కపోతే, ఎటెళ్లేవి దొరికితే అటే వెళ్లి, చూడాలనుందంటూ

ఒకరిద్దరు బంధువుల్ని చూసి మూడో రోజుకి పిన్ని ఇల్లు చేరాట్ట. అప్పుడు పిన్ని

వాడిచేత ఫోను చేయించింది.

“నన్ను చూడాలనుందనొచ్చావు కదురా” అని అమ్మ అడిగితే, “చూశాను కదా దొడ్డా”

అన్నాడు.

వాడి గొంతులో ఎక్కడా అపరాధభావం లేదు.

వాడి గురించి మేము మరువలేని మరో విశేషం- విమల పెళ్లి. అప్పుడు వాడు

ఇంజనీరింగు ఫైనలియర్.

విమల మా కజిన్. ఎక్కడున్నా ఎలాగున్నా సరే పెళ్లికి రావాలని చిన్నా పెద్దా

కజిన్సందరికీ చెప్పింది.

ఆ సమయంలో హర్షకి పరీక్షలు. పెళ్లి మారుమూల పల్లెటూళ్లో. పెళ్లికెళ్లాలంటే రెండు

బస్సులు మారాలి. పది గంటల ప్రయాణం.

‘పరీక్షకి అందుకోలేవు. పెళ్లికి నీ రాక అంత ముఖ్యమేం కాదు. రిస్కు తీసుకోకు’ అని

పిన్నీ బాబాయీ వాడికి చిలక్కి చెప్పినట్లు చెప్పారు. వాడు వింటాడా?

“విమల చాలా క్లోజు. దాని పెళ్లికెళ్లకపోతే ఎలా?” అని వచ్చాడు. పెళ్లివారిల్లు చేరేసరికి,

విమల గౌరీపూజలో ఉంది. ‘పెళ్లిపీటలమీద పలకరిస్తాలే’ అని చెప్పి

మాయమయాడు. ఊళ్లో తిరుగుతుంటే, బైకుమీద పక్కూరికెడుతున్న ఓ ఆసామీ

కనిపిస్తే, లిఫ్ట్ తీసుకుని పక్కూరు వెళ్లిపోయి అక్కడి వింతలు చూస్తూండగా పెళ్లి

ముహూర్తం టైం దాటిపోయింది. పోనీ కనీసం వధూవరుల్నయినా ఓసారి

పలకరించొచ్చనుకున్నాట్ట. కానీ అనుకోకుండా ఆ ఊర్నించి ఓ కారు, వాడి కాలేజి

ఉన్న పట్నానికి వెడుతోంది. వాడికి లిఫ్టు దొరికింది.

“పెళ్లికెళ్లాను. పరీక్ష మిస్ కాలేదు” అని ఆ తర్వాత పిన్నికీ, బాబాయికీ గొప్పగా

చెప్పాట్ట.

ఇవి పాతవి. రెండేళ్ల క్రితం కాబోలు- హర్ష మా వేలు విడిచిన మేనత్త సుభద్ర

ఇంటికెళ్లడం తాజా విశేషం.

సుభద్ర కొడుకు ప్రదీప్ అమెరికాలో పైచదువులకని డబ్బూ, దస్కంతో సహా అన్నీ

సిద్ధం చేసుకున్నాడు. కానీ వీసా రాలేదు. యుద్ధంలో కన్నబిడ్దని కోల్పోయినటువంటి

విషాద వాతావరణం ఇంట్లో నెలకొని ఉన్న సమయంలో సతీ సమేతంగా వెళ్లాడు హర్ష

వాళ్లింటికి.

సుభద్రత్తయ్య నాకు మా నాన్నవైపు దూరపు బంధువు. హర్షకైతే ఏమీ కాదు.

వాడు నా పేరు చెప్పి పరిచయం చేసుకుని, “మీ గురించి చాలా విన్నాను.

చూడాలనిపించింది. వచ్చేశాను” అన్నాడు వాడు. ముందు ఇబ్బంది గానూ, తర్వాత

నిరాసక్తంగానూ చూశారు వాళ్లు.

ముందుగా చెప్పి ఉంటే ఏమో కానీ, ఎందుకొచ్చేవన్న భావాన్ని కళ్లనుంచి

దాచలేకపోయారు వాళ్లు.

హర్ష అది పసికట్టకపోలేదు, “రాంగ్ టైంలో వచ్చినట్లున్నాను” అన్నాడు ఇబ్బందిగా.

ఐతే వాళ్లు మర్యాదస్థులు, సంస్కారవంతులు కాబట్టి ఇట్టే సద్దుకున్నారు.

“రాంగ్ టైమేమిటి? ఇదే రైట్ టైం. వియార్ లుకింగ్ ఫర్ సం డైవర్షన్” అని ఆ

దంపతుల్ని సాదరంగా ఆహ్వానించారు. తమ అనాసక్తతని కప్పడానికి ఎక్కువ

మర్యాదలు చేశారు. పిండివంటలతో ఆతిథ్యమిచ్చారు. వెళ్లేటప్పుడు బట్టలు పెట్టి,

“మీ పరిచయం మా అదృష్టం. మీ బంధుప్రీతి అపూర్వం. మా ఇంటికి మళ్లీ మళ్లీ

రావాలి” అన్నారు.

హర్ష కూడా అక్కడున్న పూటలో వేరెక్కడికీ వెళ్లకుండా, ప్రదీప్ ని ఉత్సాహపర్చడానికి

ప్రయత్నించాడు.

“అమెరికా మంచి దేశం కాదు. అందుకే నేను మా పెద్దబ్బాయిని ఆస్ట్రేలియా,

రెండోవాణ్ణి ఇంగ్లండూ పంపేను. నువ్వు కూడా కెనడా కానీ, యూరప్ దేశాలు కానీ ట్రై

చెయ్యి” అని సలహా కూడా ఇచ్చాడు.

వాడి సలహా ప్రదీప్ కి ఎంతవరకూ ఎక్కిందో కానీ వాడు రెండో ప్రయత్నంలో

అమెరికాకు వీసా సంపాదించాడు. హర్ష తన బంధుప్రీతి గురించీ, సుభద్రత్త మర్యాద

గురించీ సోషల్ మీడియాలో నాలాంటివాళ్లతో పంచుకున్నాడు.

మరీ ఇంతలా కాకపోయినా, హర్షతో మాకూ ఉన్నాయి కొన్ని ఇలాంటి అనుభవాలు.

ఎప్పుడొచ్చినా చెప్పి రారా అంటాను. వినడు. చివరికోసారి విసుగొచ్చి, “కనీసం

ఒక్కరోజైనా ముందు చెప్పలేకపోతే, నువ్విక మా ఇంటికి రావద్దు. పెళ్లి పిలుపులకైనా

సరే” అన్నాను.

ఎన్నడూ లేంది వాడికి నామీద కోపమొచ్చింది. “మీరు చెప్పిన పద్ధతుందే, అలా

చెబితే నేనైనా సరే మళ్లీ మీ మొహం చూడను” అని గౌరి కూడా వాణ్ణే సమర్థించింది.

వాడూ మేమూ కలుసుకుని ఏడేళ్లయింది. ఇన్నేళ్లకు మళ్లీ వాడు ఫోన్ చేశాడు. కానీ

రాంగ్ టైంలో చేశాడు.

దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. మా మటుక్కి మేమిద్దరం ఇల్లు కదలడం

లేదు. నాలుగు నిముషాల నడక దూరంలో ఉన్న మా అమ్మాయింటికి కూడా

వెళ్లడంలేదు. తనే అప్పుడప్పుడొచ్చి పలకరిస్తూంటుంది. వస్తే పది నిముషాలు

కూడా ఉండదు. రాగానే చేతులు శానిటైజ్ చేసుకుంటుంది. మాస్కులతోనే కబుర్లు.

తను వెళ్లేక ఓ నిముషం ఆవిరి పీలుస్తాం.

ఇంకా- పనిమనిషిని మాన్పించేశాం. సరుకులు, కూరలు, మందులు ఇంటికి

తెప్పించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని వాడుతున్నాం. పెరట్లో మొక్కలకి

నీళ్లోసినా, లోపలికొచ్చి సబ్బుతో చేతులు కడగడం. ఎవరైనా గేటువద్దకొచ్చి

పలకరించినా, విధిగా మాస్కులు పెట్టుకోవడం. పేమెంట్లన్నీ డిజిటల్.

మొత్తంమీద ఇంటికెవరైనా వస్తానంటే వద్దని నిష్కర్షగా చెప్పడం అలవాటయింది.

ఎన్నో ఏళ్ల తర్వాత వస్తానన్న హర్షకీ అదే ఊపులో జవాబిచ్చాను. సానునయంగా

చెప్పాల్సిందేమోనని తర్వాత అనిపించింది.

అంతలో హర్షనుంచే ఫోను. తను కట్ చెయ్యలేదుట. సిగ్నల్ ప్రోబ్లంట.

“ముందుగా చెబితే కానీ రావద్దన్నావ్. మరిప్పుడు ముందుగా చెప్పానుగా….”

అన్నాడు జాలిగా.

“కారణం అది కాదురా, కరోనా!” అంటూ వాడికి నేను తీసుకుంటున్న జాగ్రత్తలన్నీ

చెప్పి, “వెయ్యిళ్ల పూజారివి. మమ్మల్నే కాదు, ఇష్టమైనవాళ్లనెవర్నీ కూడా నువ్వు

కలవడం మంచిది కాదు” అన్నాను సానునయంగా.

“అది నాకు తెలియదా అన్నయ్యా! గత ఆర్నెల్లలో నిన్ను తప్ప మొత్తం

చుట్టాలందర్నీ చూశాను. కానీ నువ్వు నాకు స్పెషల్. నిన్ను చూడాలనుంది.

అందుకని ఆరువారాలుగా ఇల్లు కదలలేదు. ఇంట్లో అన్ని జాగ్రత్తలూ పాటిస్తున్నా.

మాస్కు పెట్టుకుని, స్వంత కార్లో నేనే డ్రైవ్ చేసుకుంటూ నీ ఇంటికొస్తా. చేతులు

శానిటైజ్ చేసుకుంటా. నిన్నూ వదిన్నీ చూసి పదంటే పది నిముషాలుండి వెళ్లిపోతా”

అన్నాడు హర్ష దీనంగా.

ఆ గొంతులో ధ్వనించిన అసలైన బంధుప్రీతి, ఆత్మీయతలకు చలించిపోయాను

కానీ, వాడి గతం తెలిసినవాణ్ణి- ఆరు వారాలుగా ఎవరిళ్లకీ వెళ్లలేదన్న విషయం

నిజమే ఐనా కూడా నమ్మలేను.

రిస్కు తీసుకుని హర్షకోసం తెరిచానో, ఆ తలుపుల్ని మరి ముయ్యడం కష్టం. మా

ఇంటి తలుపులెప్పుడు తెరుచు కుంటాయా అని ఎదురుచూస్తున్న బంధుమిత్రుల్ని

ఇక ఆపడం నా వల్లకాదు. ఇలా అలుసు తీసుకోవడంవల్లనే ‘నన్నెవ్వరాపలేరు’

అంటూ కరోనా తరంగిణి నిత్య నూత్న తరంగాలతో విజృంభిస్తోంది.

“ఏమనుకోకురా, పక్కనున్న మా అమ్మాయే వారానికోసారి కూడా రావడం లేదు….”

అని ఏదో అనబోతుండగా-

“నీది చాదస్తమో భయమో తెలియడం లేదు కానీ, నాకోసం వాటిని కాసేపు పక్కన

పెట్టలేవా?” అన్నాడు హర్ష. ఆ గొంతులో ఆత్మీయతతో కలిసిన ఆక్రోశముంది.

అతి కష్టంమీద మనసు దృఢం చేసుకుని, “నాది చాదస్తం కాదు, భయం కాదు.

క్రమశిక్షణ. బంధుప్రీతిని మించిన పౌరధర్మం. ఇప్పటి పరిస్థితి మళ్లీ రిపీట్

కాకూడదనే పంతం. ఇలా నేనొక్కణ్ణే అయితే అది ఉడతా భక్తి. నీలాంటివాళ్లూ కలిస్తే-

పటిష్టమైన వారధి తయారై లక్ష్యానికి చేరువౌతాం” అని ఫోన్ పెట్టేశాను.

దానికి హర్షకి వచ్చిన కోపం ఇంతా అంతా కాదని, తర్వాత ఆ నోటా ఈ నోటా

వాట్సాపుల్నించి తెలుసుకున్నాను.

వారం తిరక్కుండా దేశంలో కరోనా రెండో వేవ్ మొదలైంది. క్రమంగా రోజువారీ కొత్త

కేసులు నాలుగు లక్షలు దాటిపోయాయి. ఒకో రాష్ట్రమే వరుసగా లాక్‍డౌన్లను

విధించుకు పోతుంటే- అప్పుడు నేనో సత్యం గ్రహించాను.

మనది ప్రజాస్వామ్యం. ఎన్నికలొచ్చినా, కరోనా వచ్చినా ఫలితాల్ని మెజారిటీయే

నిర్ణయిస్తుంది. ఎన్నికల్లో నా ఓటూ, కరోనాకి నేనిచ్చే ట్రీటూ- జస్ట్ ఉడతాభక్తి, అంతే!

ఇప్పుడు మళ్లీ కరోనా ఉధృతం తగ్గుతోంది. లాక్‍డౌన్లు ఎత్తేస్తున్నారు. ఐనా

చూడాలనుందనేలాంటివాళ్లని నియంత్రణ పాటించమనే అంటున్నారు. కానీ

మెజారిటీకి తలొంచక తప్పదు కదా!

ఏంచేస్తాం- థర్డ్ వేవ్‍కి సిద్ధపడదాం....

--0---

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.


126 views0 comments

Comments


bottom of page