top of page

పరాన్నజీవికి కరోనా గీత

మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ


'Parannajiviki Karona Gita' written by Vasundhara

రచన : వసుంధర

మహాభారతంలో అపార జననష్టానికి దారి తీసే కురుక్షేత్ర సంగ్రామ సమయంలో, అర్జునుడా యుద్ధానికి విముఖుడైతే – అతణ్ణి ప్రోత్సహించడానికి శ్రీకృష్ణుడికి స్ఫురించింది భగవద్గీత. అది మానవాళికి కర్తవ్యబోధ చేసే ఉద్గ్రంథమై నేటికీ ప్రచారంలో ఉంది.

మహా విపత్తులు సంభవించినప్పుడు కొన్ని నగ్నసత్యాలు సామాన్యులకి కూడా గీతలా స్ఫురించొచ్చని కరోనా కాలం చెప్పింది.

ఆ రోజు….

ఇంట్లో ఇద్దరమే…. గృహనిర్బంధంలో…

సాయంత్రం యూట్యూబులో - చిత్తశుద్ధిలేని వారి పూజల గురించి గరికపాటివారు ప్రవచిస్తుంటే,

మధ్యలో పాజ్ చేసి, “ఇది తర్వాత విందాం. నాకిప్పుడు ప్రవచనం చెప్పే మూడొచ్చింది. నువ్వు

వినాలి” అన్నారు మావారు.

మావారెప్పుడూ వేదాంతం మాట్లాడరు. అంతా కరోనా ప్రభావమేమో మరి.

నేను తలూపగానే గొంతు సవరించుకుని ఆరంభించారాయన…..

-----

మనిషి గ్రహాంతరాలకు దూసుకుపోతున్నాడు. మానవాతీత శక్తుల్ని విజ్ఞానంతో కైవసం

చేసుకుంటూ ప్రకృతినే శాసిస్తున్నాడు. ఐనా ప్రకృతిముందు అల్పుడే. ఎందుకంటే ప్రకృతికి

కొన్ని నియమాలున్నాయి. ప్రకృతి మనుగడకి ఆ నియమాలే సహకరిస్తాయి.

మనిషి మనుగడకీ నియమాలున్నాయి. వాటిలో ప్రకృతి నియమాలకి విలువనివ్వాలన్న

నియమం ముఖ్యమైనది. ఎందుకంటే మనిషి మూలాలు ప్రకృతిలో ఉన్నాయి. అది

విస్మరించడంవల్ల మనిషి ప్రకృతిముందు అల్పుడు కాక తప్పలేదు.

జ్ఞానవిజ్ఞానాల్లో ఎంత ప్రగతి సాధించినా – కర్ణుడికి అస్త్రవిద్యలా సమయానికి ఈ విషయం

మనిషికి స్ఫురించదు.

నగరాలు విచక్షణారహితంగా పెరిగిపోతున్నాయి. వాతావరణం మనిషికి నివాసయోగ్యం కానంతగా

కలుషితమైపోతోంది.

కారణాలు మనిషికి తెలుసు. వల్లిస్తాడు కానీ పట్టించుకోడు. నివారణోపాయాలూ తెలుసు.

ఆచమిస్తాడు తప్ప ఆచరించడు.

మనిషి ప్రకృతి వినాశనానికి పూనుకున్నా, ప్రకృతికి మనిషంటే చెప్పలేనంత ప్రేమాభిమానాలు.

మనిషి తప్పుల్ని సరిచేసేలా తనని తాను సవరించుకుంటుంది. వీలు పడనప్పుడు తన

పద్ధతిలో హెచ్చరిస్తుంది.

ఎప్పుడెప్పుడు ఏయే విధంగా ప్రకృతి హెచ్చరించిందో – అది చరిత్ర.

మనమిప్పుడు చరిత్రలోకి వెళ్లడంలేదు.

ప్రస్తుతం ప్రకృతి మనిషిని హెచ్చరిస్తోంది. దాని పేరు కరోనా!

చాలామంది కరోనా పేరు వింటే గడగడలాడిపోతున్నారు. తగులుకుంటే ప్రమాదమే కానీ,

తగులుకోకుండా దాన్నాపడం సులభమే!

ఇల్లు కదలకూడదు. తప్పనిసరై బయటికొస్తే మనిషికీ మనిషికీ మధ్య కనీసం ఆరడుగుల భౌతిక

దూరం పాటించాలి. ముక్కు, నోరు కప్పేలా ముఖానికి ముసుగు తొడగాలి. తరచుగా చేతుల్ని

సబ్బుతో కడగాలి. అప్పుడప్పుడు శానిటైజ్ చేసుకోవాలి.

ఈ షరతుల్ని - అప్పుడే పుట్టిన పిల్లాడు కూడా, కుఁవ్వా కుఁవ్వా అనకుండా వల్లిస్తున్న రోజులివి.

కరోనా సోకినవారు ఆరోగ్యవంతులనుంచి తమనితాము వేరు చేసుకుని కొన్ని సాధారణ

నియమాలు పాటిస్తే, ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే రోగం దానంతటదే

కుదిరిపోతుంది. మనిషి ఆ నియమాలకూ, షరతులకూ లోబడలేదు. క్రమశిక్షణ పాటించలేదు.

దాంతో ఒక్కడితో మొదలై – ఇంతింతై వటుడింతయై అన్నట్లు విజృంభించిన కరోనా – వందలు,

వేలు దాటి లక్షల్లోకి పాకి– కోటికి పడగెత్తడానికి సిద్ధంగా ఉంది.

విజ్ఞానం - కరోనా కాళీయుణ్ణి మర్దించడానికి - టీకా తాత్పర్యాలు వెదుకుతుంటే, అజ్ఞానం - అదే

కాళీయుణ్ణి- విషం వీలైనంత దూరానికి చిమ్మేలా సమర్థిస్తోంది. ఫలితంగా దుకాణాలు, హొటళ్లు,

థియేటర్లు, క్రీడాస్థలాలు – ఇలా ఒకటేమిటి, ఆర్థిక వ్యవస్థకు పునాదులైన వ్యవస్థలన్నీ

చచ్చుబడిపోయాయి.

ఇప్పటికి సుమారు రెండొందల రోజులైంది. ఇప్పట్లో ఔట్ కానంటూ - వెస్టిండీస్ క్రికెటర్ లారాని

తలపిస్తోంది కరోనా.

ప్రతి మనిషీ ఏ పనీ చెయ్యకుండా ఇంట్లో కూర్చోవాల్సిన అగత్యం వచ్చింది. కూర్చుని తింటే

కొండలైనా కరుగుతాయంటారు. కానీ నూటముప్పై కోట్ల జనాభాలో – కరిగించడానికి కండలే తప్ప

కొండలున్నవారెందరు?

ఎందరికో ఉద్యోగాలు పోయాయి. సంపాదన పోయింది. ఉపాధి పోయింది.

వలస కూలీలకు జీవితమొక ప్రశ్నగా మారితే, లబ్దప్రతిష్ఠులకది నిస్సారమైంది. మధ్యతరగతికొస్తే

పీత కష్టాలు పీతవి.

మన విషయమే తీసుకుంటే- ఇంట్లోకి పనిమనిషి రావడం నిషిద్ధం కాబట్టి ఇంటిపన్లు మనమే

చేసుకోవాలి. పని కష్టం కాదు కానీ, ఈ వయసులో కొత్తగా అలవాటు చేసుకోవడం కష్టం. మనమిద్దరమే

ఉన్నా, ఆ వంటే కష్టమనిపించి తరచు బయట్నించి తెచ్చుకునేవాళ్లమా! ఇప్పుడు ఇంట్లో

వండుకోవడం తప్పనిసరి. దానికేమో ఇంటిపన్లు అదనం.

ఐనా అదృష్టం బాగుండి, నిత్యావసరాలూ, కూరగాయలూ ఇంకా లభ్యం ఔతున్నాయి. లేకుంటే

తిండికీ మాడిపోయేవాళ్లం…..

అక్కడ ఆగారు మావారు. “సరిగ్గా ఇక్కడే నాకు స్ఫురించిందోయ్ – మన మూలాల విషయం….”

ఆయన చెబుతున్నది బాగుండి శ్రద్ధగానే వింటున్నాను కానీ – ఆయనంటున్న ఆ మూలాలేంటో

నాకు తోచలేదు. అదే చెప్పాను.

“నీకూ స్ఫురిస్తుంది. ఒక్కసారి మన గురించీ- మన వీరభద్రం, సాయి, గోపాల్ – వీళ్ల గురించీ గుర్తు

చేసుకో. అందరిలో కామన్ ఫేక్టర్ ఒకటుంది. పట్టుకోగలవేమో చూడు” అన్నారాయన.

మేం తక్కువ స్థాయిలో జీవితాన్ని ప్రారంభించాం. క్రమశిక్షణ పాటించాం. మాకోసంకంటే

ఎక్కువ మావాళ్లకోసం కష్టపడ్డాం. కొంత స్వార్థాన్ని వదిలి, కొన్నయినా త్యాగాలు చేశాం. ప్రస్తుతం

ఏదో సాధించామన్న తృప్తితో ఉన్నాం. అబద్ధమెందుకూ – మా ప్రస్తుతస్థితికి మా గొప్పతనమే

కారణమని మురిసిపోతుంటాం.

మిగతా ఆ ముగ్గురూ మాకంటే తక్కువ స్థాయిలో జీవితాలు ప్రారంభించి, మాకంటే ఎత్తుకి ఎదిగారు.

వాళ్లు తమకంటే మేమే గొప్పంటారు. మమ్మల్ని చూసి అసూయ పడుతున్నట్లూ అనిపిస్తూంటుంది.

మావారనే ఆ కామన్ ఫేక్టరేమిటా అని - మా గురించీ, వాళ్ల గురించీ ఆలోచించడం మొదలెట్టాను……

మేము – అంటే - నేనూ, మావారూ - ఇండియాలో ఇద్దరంటే ఇద్దరం.

స్వంతిల్లుంది. ఏటా పన్నెండొందలు ఆస్తిపన్ను కడితే చాలు. నెలనెలా అద్దె కట్టాలన్న బాధ లేదు.

ఆయనకో పది వేలు పెన్షనొస్తుంది. డిపాజిట్లమీద ఐదారువేలు వడ్డీ వస్తుంది.

ఓమాదిరి రోగాలకి తడుముకోనక్కర్లేకుండా – హెల్త్ ఇన్సూరెన్సుంది.

ఆయన స్వగ్రామంలో మూడెకరాల పొలముంది. ప్లాట్లకి అమ్మేసి బ్యాంకులో వేసుకుందామని

ఆలోచన. కానీ మాలాంటివాళ్లు నలుగురైదుగురి పొలాలు కలిపి సాగు చేస్తున్న

సూర్రావున్నాడక్కడ. తను కొనలేడు, మమ్మల్ని అమ్మనివ్వడు. అతణ్ణి కాదనలేక అందాకా

దానిమీదొచ్చే అంతో ఇంతో అయివేజుతో సరిపెట్టుకుంటున్నాం. కానీ అలా ఎన్నాళ్లో

ఆగుతామనుకోను.

మాకిద్దరు పిల్లలు. ఇద్దరూ అమెరికాలో.

రావాలంటే రాలేరు కానీ, కావాలంటే డబ్బు పంపిస్తారు.

వాళ్లని అడక్కూడదన్న ఆశయంతో పాటే, అడగాల్సొస్తుందన్న సంశయమూ ఉంది.

ఎందుకంటే -

తిరగడానికి కారుంది కానీ, ఆయన రిటైరయ్యేక పెట్రోలు ధర అమ్మో అనిపించి వాడకంలో జోరు

తగ్గింది.

వ్యసనాలు లేవు కానీ చిన్న చిన్న సరదాలకూ, అడపాతడపా షాపింగులకూ - వచ్చే డబ్బు

బొటాబొటీగా సరిపోతుంది.

ఈ వయసులోనూ చిలకా గోరింకలమని మేమంటే కొందరికి ముచ్చట, కొందరికి అసూయ.

చిత్రమేమిటంటే మాకూ వాళ్లంటే ముచ్చట, అసూయ.

అలాంటిది కరోనా మా పరిస్థితి మార్చేసింది.

పని చెయ్యకున్నా పనివాళ్లకి జీతాలివ్వాల్సిందేనని సర్కారు ఆదేశం. కానీ సర్కారువారే

జీతాలివ్వలేక కోతలు పెడుతున్నారు. మా పెన్షనుకీ కోత పడింది. డిపాజిట్లకి వడ్డీల రేట్లు తగ్గాయి.

అవి పండాయంటే ఆ ఆదాయమూ తగ్గుతుంది.

ఇప్పట్లో ఈ కరోనా ఎక్కడికీ పొయ్యేలా లేదు కాబట్టి పనిమనిషిని మానిపించెయ్యాలని

మేమాలోచిస్తున్నాం. కానీ మమ్మల్నే ఆధారం చేసుకుని బ్రతుకుతున్న తను ఏమైపోతుందని బాధ!

“ఇది ఇతరుల గురించి ఆలోచించే సమయం కాదు. మనని మనమే చూసుకోవాలి! ముందు

సూర్రావుకి పోన్ చేసి పొలాన్ని అమ్మకానికి పెట్టమని చెప్పేద్దాం. ఇంకా అక్కడ గిరాకీ పట్నంలోలా

పడిపోలేదులే. వచ్చిన డబ్బు డిపాజిట్లో వేస్తే, పంటమీదొచ్చే అయివేజుకంటే కనీసం పది

రెట్లొస్తుంది” అన్నారు మావారు.

ఆ ఫోనందుకుని సూర్రావు లబోదిబోమన్నాడు కానీ – ఈ నిర్ణయంతో, పిల్లలముందు చెయ్యి

చాచకూడదన్న మా ఆశయానికి తూట్లు పడకుండా కనీసం మరికొన్నేళ్లు ఆపొచ్చని ఆశ!

-----

వీరభద్రం….

పదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని ఈ మహానగరానికొచ్చాడు.

వంట చేస్తానంటూ ఎన్నిళ్లు తిరిగాడో, మా ఇంటికీ వచ్చాడు.

“మధ్యతరగతివాళ్ల సౌభాగ్యం ఓ మేడిపండు. వాళ్లకి వంటమనిషిని పెట్టుకునే స్తోమతుండదు. వళ్లు

వాచిన వాళ్లిళ్లలో కుదిరే స్థాయి నీకు లేదు. ఇలా తిరిగే బదులు బజ్జీలేసి అమ్ముకో. కూటికి

లోటుండదు” అని మావారు సలహా ఇచ్చారు.

విషయమేంటంటే- వీరభద్రం తండ్రికి రాజమండ్రికి పక్కూళ్లో కొంచెం పొలముంది. వ్యవసాయం

పన్లు లేనప్పుడు, రాజమండ్రిలో బజ్జీలేసి అమ్ముతాడు. తన బజ్జీలకి గిరాకీ బాగా ఉన్నా

వ్యవసాయానికే ప్రాధాన్యమిచ్చాడు. ‘నువ్వు రాజమండ్రిలో బజ్జీల వ్యాపారం చేస్తే, క్రమంగా మనం

మరికాస్త పొలం కొనుక్కోవచ్చు. ఇద్దరం కలిసి వ్యవసాయం చెయ్యొచ్చు’ అని కొడుక్కి చెప్పాడు.

ఎదుగూబొదుగూ లేని వ్యవసాయం తనకి వద్దుకాక వద్దన్నాడు వీరభద్రం. దర్జాగా కాలరెత్తుకుని

హైస్కూల్లో చదివినూళ్లో, బజ్జీలేసి అమ్మాలా అని రోషమొచ్చి ఇక్కడికొచ్చాడు. ఇప్పుడు మావారూ

అదే సలహా ఇచ్చారు.

కోపం రావాల్సిందే కానీ వీరభద్రానికి– ‘అవి జీవితం తెలియని రోజులు. ఇవి అనుభవం పాఠాలు

నేర్పుతున్న రోజులు’.

అదీకాక ఈ నగరమతడికి పూవులమ్మిన ఊరేం కాదు.

వీరభద్రం బజ్జీలకు మొదటి బోణీ మాదే.

తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు.

రెణ్ణెల్లలో బండి కొన్నాడు.

ఏణ్ణర్థంలో టిఫిన్ సెంటరు తెరిచాడు.

నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. రోజులో ఎక్కువ భాగం దంపతులిద్దరూ టిఫిన్ సెంటర్లోనే గడుపుతారు.

వాళ్ల ధర్మమా అని అక్కడ మరో పదిమంది బ్రతుకుతున్నారు.

రెండేళ్ల క్రితం ఒకసారి మా ఇంట్లో పార్టీ జరిగితే, డబ్బిచ్చే షరతుమీద వంటసాయానికి ఇంటికి

రమ్మని అడిగితే, “మీకేం కావాలో ఆర్డరివ్వండమ్మా! చేసి పంపిస్తాను. సెంటరొదిలి వచ్చే వీలు లేదు.

ఏమనుకోకండి” అన్నాడతడు.

నొచ్చుకోలేదు. కళ్లముందే అంతగా ఎదిగిపోయాడని మనసులో సంతోషించాను.

మన సమాజం చిత్రమైనది. హోదాలు డబ్బునిబట్టి కాక చేసే పనినిబట్టీ, ఆ మనిషి చెందిన

వర్గాన్ని బట్టీ ఉంటాయి.

ఆర్థికంగా మాకంటే బలంగా ఉన్న వీరభద్రం దంపతులకి మేమంటే గౌరవాభిమానాలున్నాయి. కానీ

వాళ్లు తమ పిల్లలు తమకిలా కాక మా పిల్లలకిలా ఉండాలని మనసు పడతారు.

వాళ్లు మా హోదాకి అసూయ పడితే, మామీద మాకే జాలెయ్యదూ మరి!

కానీ ఇప్పుడు వీరభద్రంమీద మాకు అసూయ కాదు, జాలి పుట్టేలా చేసింది కరోనా.

“ఆదాయం బాగుందని మిడిసిపడ్డాం. ఖర్చులకి బాగా అలవాటు పడ్డాం. ఇప్పుడు మా టిఫిన్ సెంటర్

మూత పడింది. ఇప్పట్లో తెరిచే అవకాశాలు కనబడ్డం లేదు. పూట గడవడం కష్టంగా ఉంది. మీరు

పెద్దవారు. పన్లు చేసుకోలేక కష్టపడుతున్నారు. మాకు తిండిపెట్టి, మీకు తోచిందివ్వండి. మేమిద్దరం

మీ ఇంటిపనీ, వంటపనీ చూసుకుంటాం. మాస్కులు, శానిటైజర్లు సక్రమంగా వాడుతూ, భౌతికదూరం

పాటిస్తూ జాగ్రత్తగా పని చేస్తాం” అని ఒక రోజు వీరభద్రం నుంచి ఫోను.

ఒక్క పూట మా ఇంటికొచ్చి వంట చెయ్యడానికి వీలు పడదన్న వీరభద్రం – ఇప్పుడు మా ఇంట్లో

వంటపనికి కుదురుతానని అంటుంటే కడుపులో దేవినట్లయింది.

కానీ అతడికి నిజంగా సాయం చెయ్యాలనుకుంటే అది మాకు మిడిసిపాటు ఔతుందని తెలుసు.

-----

సాయి…..

అతడి నాన్నకి పల్లెటూళ్లో చిన్న వ్యవసాయం.

సాయి ఇంటరు దాకా చదివి, పరీక్ష తప్పాడు.

తండ్రికున్న పలుకుబడితో పంచాయతీలో అటెండరుద్యోగం వచ్చేది. ససేమిరా అన్నాడు.

ఇంటర్లో ఉండగా నాటకాల్లో వేషాలేశాడు. ఒడ్డూ పొడుగూ బాగుండి ఎర్రగా బుర్రగా ఉంటాడని హీరో వేషాలే వచ్చేయక్కడ.

అప్పట్నించి కలలు మొదలు! సిటీకి పోతే – వెండితెరమీద కాకపోతే, కనీసం బుల్లితెరమీదైనా

వెలిగిపోగలనని!

తండ్రితో దెబ్బలాడి ఈ ఊరొచ్చాడు. మావారికి సినీరంగంలో ఏవో చిన్న పరిచయాలున్నాయని

తెలిసి మా ఇంటికొచ్చాడు.

మావారి సిఫారసుమీద సాయికో సినిమాలో ఎక్స్ ట్రా వేషం దొరికింది.

చురుకైనవాడు. అనుకున్నది సాధించడానికి ఎవరి కాళ్లయినా పట్టుకోగలవాడు, ఏమైనా

చెయ్యగలవాడు. జాగ్రత్త కలవాడు.

అక్కడ నిలదొక్కుకుందుకు సాయికా ఆధారం సరిపోయింది.

ఎందుకంటే - పాక హొటల్లో ఆర్రూపాయల ఇడ్లీకి, స్టారు హొటల్లో అరవై పలికినట్లు – సినీ రంగంలో అర నిముషం పాత్రకి – ఇచ్చేవాళ్ల స్తోమతుని బట్టి – వెయ్యినుంచి పదివేలు దాకా

ముట్టొచ్చు. హీరోకైతే ఏదాదికి ఒకటో రెండో సినిమాలు. కానీ ఎక్స్ ట్రాలకి నెలకి పది సినిమాలు

దాటినా దాటొచ్చు. ఎటొచ్చీ స్టుడియోలో చక్కర్లు కొట్టే ఓపికుండాలి. నటుడిగా పేరు

తెచ్చుకోవడంకంటే, వచ్చే డబ్బే ముఖ్యమని సరిపెట్టుకోగలగాలి. అప్పుడు పరుగెత్తే జనంలోనూ,

దెబ్బలు తినే గూండాల్లోనూ, పోరాడే సైనికుల్లోనూ, క్లాసులో విద్యార్థుల్లోనూ, షాపులో

కస్టమర్లలోనూ, వగైరా వగైరాల్లోనూ – తానూ ఒకడయ్యే అవకాశాలు - ఒకోసారి నెలకి పదిని

మించిపోవచ్చునని సాయి నిరూపించాడు.

జాగ్రత్తగా ఉంటే, ఈ తరహా జీవితం నెలజీతగాడికంటే బాగుంటుందన్నది సాయి స్వానుభవం.

ఎప్పుడైనా మా ఇంటికొచ్చినా, బయట కనిపించినా, తెలిసినవారికి మావారు సాయిని సినీనటుడిగా పరిచయం చేస్తారు. అప్పుడు వాళ్లు సహజంగానే, అతడు నటించిన సినిమాల

గురించి అడుగుతారు.

సాయి సినిమాల పేర్లు చెప్పగలడు కానీ పాత్రల పేరు చెప్పడానికి ఇబ్బంది పడతాడు.

ఓసారి అతడు ఆయనతో అన్నాడు, “మీరు మీ ఉద్యోగం గురించి చెప్పుకున్నట్లు, నేను నా

సినిమాల గురించి చెప్పుకోలేను సార్! ప్రస్తుతానికి నన్నెవరికీ సినీనటుడిగా పరిచయం

చెయ్యకండి” అని వేడుకున్నాడు.

“నా బుల్లి ఆఫీసరు పోస్టు - కలెక్టరుద్యోగంలా అనిపిస్తున్నట్లుంది మనవాడికి” అని మావారు నా దగ్గర నవ్వారు.

ఏడాది తిరక్కుండా సాయికి నాలుగు వేళ్లూ నోట్లోకి పోతున్నాయి.

నాలుగేళ్లలో బైక్ కొన్నాడు.

స్వంతిల్లు లేదు కానీ, ఎక్కడో చిన్న ప్లాటొకటి కొన్నాడు.

సంపాదన బాగున్న ఓ బుల్లి నటి ఇలాకాలో ఉన్నాడని విన్నట్లు మావారు నాతో అన్నారు.

కుర్రాడు చెడిపోతాడని భయపడ్డాను కానీ, ఏడాదిక్రితం సాయికి బంధువులమ్మాయితోనే పెళ్లయింది.

లక్ష కట్నం ఇచ్చారుట.

పెళ్లాం పేరు సీత. ఆమెను తీసుకుని మా ఇంటికొచ్చాడు.

జంట చూడముచ్చటగా ఉంది. ఆహ్వానిస్తే మేమూ వాళ్లింటికెళ్లాం.

వాళ్లిల్లు మా ఇల్లంతా ఉంది. మేము పెళ్లయిన పదేళ్లదాకా అమర్చుకోలేకపోయిన

సదుపాయాలున్నాయి.

ఇల్లు బాగా సద్దుకున్నారని మెచ్చుకుంటే, “ఎంత బాగా సద్దినా మీ ఇల్లంత బాగాలేదంటుంది మా

సీత. ఏం సంపాదించినా, మీ చదువుకున్నోళ్ల సాటి రాలేం మేము” అంటూనే సాయి – ఏదైనా మంచి

కాలనీలో ఇండెపెండెంట్ హౌస్ తీసుకోవాలన్న తన ఆశయాన్ని కూడా చెప్పాడు.

ఏదో మర్యాదకి మమ్మల్ని పొగిడాడు కానీ, మాకైతే ఇండెపెండెంట్ హౌస్ ఎప్పటికీ కలే!

ఇటీవలే సాయి అనుకోకుండా ఓ ప్రముఖ హీరోని, పెద్ద ప్రమాదంనుంచి కాపాడేట్ట. ఆ కృతజ్ఞతతో ఆ

నటుడతడికి - ఓ భారీ బడ్జెట్ చిత్రంలో కనీసం ఐదు నిముషాలుండే మంచి పాత్ర ఇప్పిస్తానన్నాట్ట.

అది తెలిసేక మావారు, “ఇప్పుడే నీతో ఓ సెల్ఫీ దిగాలి. ముందుముందు నువ్వు మాకు దొరుకుతావో

లేదో!” అన్నారతడితో.

“అదేంటి సార్, అలాగంటారు. ఈరోజు నేనిలా ఉండడానికి కారణం మీరు……” అన్నాడు సాయి

వినయంగా.

“అప్పుడు సాయి చూపుల్ని బట్టి, తను రజనీకాంత్ లాగా, నేనతడికి సాయం చేసిన బస్సు డ్రైవరు

రాజ్ బహదూర్ లాగా అనిపించింది” అని తర్వాత మావారు నా దగ్గర నవ్వుతూ అన్నారు.

అదే సాయికి కరోనా పేరు చెప్పి షూటింగులు ఆగిపోవడంతో, సినిమాలు లేవు. ఆదాయానికి గండి

పడి అల్లల్లాడిపోతున్నాడు. ఆదుకోమని తనకు తెలిసిన పెద్ద హీరో నడిగితే, ‘నా భవిష్యత్తే

చీకటైపోయింది. ఇక నీ గురించి ఏమాలోచిస్తాను? షూటింగులు మొదలై, పూర్వపు స్థితి వచ్చేదాకా

నన్ను కలవకు’ అన్నాడు. కొన్న ప్లాటు అమ్మేద్దామనుకుంటే, దాని ధర బాగా పడిపోయింది.

అమ్మడంకంటే – అందులో కూరగాయలు పండించి అమ్ముకుంటే ఎక్కువ డబ్బొస్తుందని ఎవరో

జోకేశారుట.

ఇప్పుడు కమిషను తీసుకుని కిరాణా సామాన్లు తెచ్చిపెడతానని తెలిసినవారిని వేడుకుంటున్నాడు.

-----

గోపాల్….

అతడిది మావారి ఊరే. వాళ్ల నాన్నా వ్యవసాయదారుడే.

ఎదుగూ బొదుగూ లేని రైతు జీవితం తనకొద్దనుకున్నాడు. టెన్తు తర్వాత మరి చదవలేనన్నాడు.

వ్యాపారం చెయ్యాలనుంది. కానీ పెట్టుబడిచ్చే స్తోమత తనకి లేదని తండ్రి చెప్పేశాడు.

పదిహేడేళ్ల వయసులో ఇక్కడికొచ్చి మా ఇంటికొచ్చి, మావార్ని ఏదైనా దారి చూపమన్నాడు.

గుట్టుగా బ్రతుకుతున్నాం. ఒక్క మనిషి అదనమైనా భారమే.

కానీ ఆ మాట పైకనడానికి బింకం. గోపాల్ని ఇంకెక్కడైనా ఉండమనడానికి మొహమాటం.

మావారు గోపాల్ గురించి తన ఆఫీసులో కొలీగ్సు కొందర్ని సంప్రదిస్తే – డ్రైవింగు నేర్పించమన్నారు.

ఇక్కడ డ్రైవర్సుకి మంచి డిమాండుంది కాబట్టి అది మంచి సలహాయేనని మావారికి అనిపించింది.

కుర్రాడు కదా - కార్లలో తిరిగే ఉద్యోగమని సరదాపడి, గోపాల్ వెంటనే ఒప్పుకున్నాడు.

గోపాల్ డ్రైవింగు స్కూలుకయ్యే ఖర్చు పల్లెనుంచి వాళ్ల నాన్న భరించాడు.

కొడుకు మా దగ్గరుంటున్నాడని అతడు – పల్లెనుంచి మాకు బియ్యం, పప్పులు వగైరాలు

పంపేవాడు.

అలా గోపాల్ మాకు మరీ అంత భారం కాలేదు.

ఏడాదిలో గోపాల్‍కి డ్రైవింగు లైసెన్సొచ్చింది.

ఈలోగానే అతడు మావారికి తెలిసినవాళ్లు కొందరికి అవసరమైనప్పుడు డ్రైవరుగా పని చేసేవాడు.

అంతలో ఓలా, ఊబర్ వగైరాలొచ్చాయి. డ్రైవర్లకి మంచి ఆదాయం లభించడమే కాక – సొంతంగా

కారు కొనుక్కునే అవకాశమూ వచ్చింది.

అది బొత్తిగా కొన్నేళ్లే! తర్వాత కిట్టుబాటవడం లేదని ఓలా, ఊబర్లని వదిలేశాడు సాయి.

మిగతావాళ్లకిలాగే గోపాల్ కూడా ఆర్థికంగా ఎదిగాడు. పెళ్లి చేసుకున్నాడు. స్వంత కారుని టాక్సీగా

నడుపుతూనే, తనకి బేరాల్లేనప్పుడు పూలింగ్ ద్వారా ఇతరుల కార్లకి డ్రైవరుగా పనిచేస్తూ - క్షణం

తీరుబడి లేకుండా సంపాదిస్తున్నాడు.

నిజం చెప్పాలంటే, అతడి పని మాకంటే బాగుంది. కానీ తనలా అనుకోవడం లేదు. మా స్థాయి

చేరుకోవాలని మనసు పడతాడు.

అతడిపై మాకు అసూయ ఉండొచ్చని ఊహించలేడతడు.

కరోనా వచ్చేక - వాహనాలున్నవారే వాటిని వాడకుండా ఇంట్లో కూర్చుంటే, ఇక గోపాల్ వంటి డ్రైవర్లకి

పనేముంటుంది?

అందాకా వందా రెండొందలకోసం తెలిసినవారిని బిచ్చం కాని బిచ్చం అడుక్కుంటున్నాడు.


నేను నా ఆలోచనల్లోంచి బయటపడ్డాక అప్రయత్నంగా ఓ వేడి నిట్టూర్పు వచ్చింది. “వీళ్లకీ మనకీ

కామన్ ఫేక్టరుంటుందని నాకు తోచడంలేదు. పోనీ ఉందే అనుకుందాం. అప్పుడు వీళ్లు

మాత్రమేనా? వార్తల్లో వింటున్నాం - టీచర్లు పొలం దున్నుతున్నారనీ, ఇంజనీర్లు

కూరలమ్ముతున్నారనీ! ఇంకా కోట్లు మూలుగుతున్న సినీ ప్రముఖులు, పేరు మోసిన ఆటగాళ్లు,

పాటగాళ్లు, వేటగాళ్లు –భవిష్యత్తుని తల్చుకుని డీలా పడిపోతున్నారు. మీరనే కామన్ ఫేక్టరు మొత్తం


అందరికీ వర్తించాలి” అన్నాను.

“ఔను. వర్తించాలి. అందరికీ ఒక్కటే కామన్ ఫేక్టర్. మనమంతా పరాన్నజీవులం” అన్నారాయన

నవ్వుతూ.

“అంటే?” అనడిగాను. ఆయన వివరించారు.

వీరభద్రం వ్యాపారం జనంమీద ఆధారపడింది. జనం తన దుకాణానికొచ్చి కొనుక్కు తింటేనే,

అతడికి ఆదాయం. జనం రాకపోతే అంతే సంగతులు. అదే – కోట్లలో పారితోషికాలు తీసుకునే

తారలకూ, ఆటగాళ్లకూ కూడా వర్తిస్తుంది. వారిలో ఎంత ప్రతిభ ఉన్నా – వారి ఆదాయం

జనాలనుంచే రావాలి. థియేటర్లు, స్టేడియాలు మూతబడితే హీరోలంతా జీరోలే కదా!

“ఔననుకోండి. కానీ మనిషి సంఘజీవి. ఒకరిమీద ఒకరు ఆధారపడకుండా ఎలా కుదురుతుంది? మరి

అసలు పరాన్నజీవి కాని మనిషి ఉంటాడా?” అన్నాను.

“లేకేం? రైతంటే ఎవరు మరి? తనకి కావాల్సింది తను పండించుకు తింటాడు. పదిమందికి సరఫరా

చేస్తాడు. మనిషి మూలాలు వ్యవసాయంలో ఉన్నాయి. ఆ వ్యవసాయం గ్రామాల్లో ఉంది. ఆ

గ్రామాల్లోనే ప్రకృతి సజీవమై ఉంటోంది. మనమా మూలాల్ని వదిలి పట్టణాలు చేరి, ప్రకృతిని

నిర్జీవం చేస్తూ, పరాన్నజీవులుగా బ్రతుకుతున్నాం. రైతు లేనిదే మనకి జీవితం లేదని విస్మరించి,

అతణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకోసారి అణగద్రొక్కుతున్నాం కూడా. కాదంటావా?” అన్నారాయన.

“నిజమే కానీ, రైతుకుండే అవసరాలెన్నో పట్టణాలు తీరుస్తున్నాయి కదా!” అన్నాను సాలోచనగా.

“కావచ్చు. కానీ ఈ లాక్‍డౌన్‍ సమయంలో తెలిసిందిగా – మనిషికి ముఖ్యావసరం తిండి ఒక్కటే!

మిగతావన్నీ కల్పించుకున్నవే! అలాగని మిగతావాటిని నిర్లక్ష్యం చెయ్యాలనను. కానీ వినోదంకంటే,

పరిశ్రమలకంటే ఎక్కువగా వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వద్దూ? రైతుకి ఎదుగూబొదుగూ ఉండదన్న

అపోహని యువతనుంచి తొలగించేందుకే - కరోనా మహా విపత్తు రూపంలో వచ్చింది. నాకు గీతను

స్ఫురింపజేసింది. ఇది మామూలు గీత కాదు. సామాన్యుడికోసం సామాన్యుడికి స్ఫురించిన గీత.

ఇప్పుడీ గీతకు ప్రచారం కావాలి! అందుకు పట్టణవాసులే పూనుకోవాలి. ఎందుకంటే, అసలీ కరోనా

వచ్చిందే, పట్టణసంస్కృతినుంచి! వ్యాపించిందీ పట్టణవాసులవల్లే! ” అన్నారు మావారు కొంచెం

ఆవేశంగా.

“అంటే ముందు మనమే మొదలెట్టాలి? కానీ ఎలా” అన్నాను సాలోచనగా.

“ఇలా…” అంటూ మావారు ఫోనందుకున్నారు.

“ఓహో – వాట్సాప్ మెసేజిలు పంపిస్తారా? మంచి ఐడియాయే – మన దగ్గర చాలా నంబర్లే

ఉన్నాయిగా…..” అన్నాను.

“వాట్సాప్ కాదు. సూర్రావుకి ఫోన్ చేస్తా, మన పొలం అమ్మే ఆలోచన మానుకున్నామని!” అని

నవ్వేరాయన.

ఆ నవ్వు కరోనాకు శానిటైజర్లా అనిపించింది నాకు.

---0-

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.


72 views0 comments
bottom of page