top of page

అన్నింటి ‘కీ’ రాజ‘కీ’యం


'Annintiki Rajakiyam' Written By Vasundhara

రచన: వసుంధర

రాజకీయాల్లోకి చేరాక స్నేహమైనా, విరోధమైనా కలకలం ఉండదు.

అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

ప్రేమ కూడా ఆ కోవలోకే చేరుతుందని రుజువు చేశారు ఇద్దరు (రాజకీయ) ప్రేమికులు.

ఆ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో తెలీక సతమతమవుతున్న యువతి చివరికి ఏం చేసిందో ప్రముఖ రచయిత్రి వసుంధర గారి కథలో తెలుసుకోండి.


ఎన్నో కథలకీ, శ్రవ్య-దృశ్య కావ్యాలకీ ప్రేరణ ప్రేమ. ఆ ప్రేమ యువతీయువకుల మధ్యనైతే- ఆ

రచన మరింత రసవత్తరమౌతుంది.

రవి, వాసు- తమది అలాంటి ప్రేమ అంటున్నారు.

వారి ప్రేమ కూడా రసవత్తర కావ్యమయ్యేదే- ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించి ఉండకపోతే!

ఆ యువతి కుముద. ఆమెకా ఇద్దరూ ఇష్టమే!

తనకిలాగే వారికీ తనంటే ఇష్టమనుకుందామె. కానీ వారు తమ ఇష్టాన్ని ప్రేమగా ఆవిష్కరించేసరికి-

ఇద్దరిలో ఎవర్ని ప్రేమించాలో తెలియక తికమక పడింది.

వాళ్లామె లేకుండా బ్రతకలేమంటున్నారు. అంటే తను ఒకర్ని ప్రేమిస్తే రెండోవాళ్లు చచ్చిపోతారు.

ఏంచెయ్యాలో తెలియక ఆమె వాళ్లకీ, తనకీ గురువైన గురుబ్రహ్మను ఆశ్రయించింది.

“కథలు, కావ్యాలు, సినిమాలు- ప్రేమని ఆకాశమంత ఎత్తుకి తీసుకుపోవచ్చు. కానీ వాస్తవంలో

ప్రేమకి అంత సీన్ లేదు. జీవితానికి సంబంధించిన అన్నింటి- ‘కీ’ - రాజ’కీ’యంలోనే ఉంది” అన్నాడు గురుబ్రహ్మ.

అది నిజమా?

కుముద స్వానుభవం తెలుసుకుందాం…..

-----

“పిట్ట తగవూ పిట్ట తగవూ పిల్లి తీర్చింది. ఇక మీరిద్దరూ నాకోసం ఒకరిమీద ఒకరు కత్తులు

నూరక్కర్లేదు. నా ఆయుష్షింకో రెండు నెలలు. అంతే!” అంది కుముద.

ఎదురుగా సుముద్రపుటల ఒకటి కాలసర్పంలా అంతెత్తు లేచి ముందుకొచ్చి విరిగి పడి వాళ్ల

పాదాలు దాటి వెళ్లింది. ఆకాశంలో మెరుపొకటి కళ్లు మిరుమిట్లు గొలిపి తర్వాత పిడుగై చెవులు

బద్దలుకొట్టింది.


ఐతే- రవికీ, వాసుకీ- కాలికింద నేల కదిలినా, కళ్లు చీకట్లు కమ్మినా, చెవులు గళ్లెక్కినా- అందుకు

కారణం మాత్రం కుముద మాటలే!

కుముద వయసు- ఏళ్లు చూస్తే ఇరవై ఒకటి, సొగసు చూస్తే పదహారు.

కుముద అందం- పోటీలకెడితే ఐశ్వర్యారాయ్, ఇంటిపట్టునుంటే రవివర్మ బొమ్మ.

కుముద తెలివి- చదువులో కాబోయే ఇంజనీరు, మాటల్లో కాగల త్రివిక్రమ్‌ శ్రీనివాస్.

రవి, వాసు ఇంచుమించు ప్రాణమిత్రులు.


ఆరేళ్లుగా ఒకరికి తెలియకుండా ఒకరు కుముదని ప్రేమిస్తున్నారు.

ఏడాదిక్రితం ఇద్దరూ ఆమెముందు విడివిడిగా బయటపడేదాకా- ఆ విషయం కుముదకి కూడా

తెలియదు.

అప్పుడు కుముద చాలా ఇబ్బంది పడింది.

అంతవరకూ ఆమెకు వారిద్దరిపైనా అలాంటి అభిప్రాయమే లేదు.

ఐతే ఆమెకు పెళ్లంటే విముఖత లేదు. ఆసక్తి కూడా ఉంది.

ఆ ఇద్దర్లో ఒకర్ని పెళ్లి చేసుకుందుకు ఆమెకు అభ్యంతరమూ లేదు.

రవి, వాసు- ఇద్దరూ ఆమెకు మంచి మిత్రులు. ఇద్దరూ ఆమెకు ఇష్టులే.

అందుకని ఆ విషయమై నిర్ణయం వాళ్లకే వదిలిపెట్టాలనుకుంది. రవి తనని ప్రేమిస్తున్న

విషయం వాసుకీ, వాసు తనని ప్రేమిస్తున్న విషయం రవికీ చెప్పింది. అలా చెబితే ఆ విషయమై

ఇద్దరూ చర్చించుకుని ఒక అవగాహనకు వస్తారని ఆమె అనుకుంది. కానీ-

“నీకు నేనంటే ఇష్టముంటే, రవికి చెప్పేయ్ నన్నే ప్రేమిస్తున్నానని” అన్నాడు వాసు.

“నీకు నేనంటే ఇష్టముంటే, వాసుకి చెప్పేయ్, నన్నే ప్రేమిస్తున్నానని!” అన్నాడు రవి.


ఎలా చెబుతుందామె? ఆమెకు రవి అన్నా ఇష్టమే, వాసు అన్నా ఇష్టమే! కానీ ఇష్టం వేరు. ప్రేమ వేరు.

ఆమె వాళ్లని ఇష్టపడ్డప్పుడు ప్రేమతో ముడిపెట్టి ఆలోచించలేదు. కారణం- ఆమె అభిప్రాయంలో

ప్రేమకీ పెళ్లికీ ముడి ఉంది.

ప్రేమంటే వ్యామోహం కాదు. కన్నవారు బిడ్డల్ని ఓ వయసుదాకా ప్రేమిస్తారు- ఏ వ్యామోహమూ

లేకుండా! అప్పుడా బిడ్డలకి జీవితమంటే తెలియదు. తెలిసినా కన్నవారే తమ జీవితం

అనుకుంటారు.

ఒక వయసు వచ్చేక మనిషి కన్నవారినుంచి విడిపోతాడు. అప్పుడు ప్రారంభమయ్యేదే ఆ

మనిషికి అసలైన జీవితం.

ఆ జీవితానికి కన్నవారికి భిన్నమైన ప్రేమ కావాలి. ఆ ప్రేమనిచ్చేవారు కూడా కన్నవారికిలాగే

ప్రేమను వ్యామోహంతో జత పెట్టకూడదు.

ప్రేమపై కుముదకు ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ‘జీవితమంటే ప్రేమ. ప్రేమంటే

జీవితం’ అంటుందామె.


ఒక వయసొచ్చేక జీవితం పెళ్లితో ముడిపడి ఉంటుందని కూడా ఆమె నమ్ముతుంది.

శారీరకంగానే కాక మానసికంగానూ ఆమె ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా ఉంది. తన జీవిత భాగస్వామి

కూడా తనకిలాగే, ‘జీవితమంటే ప్రేమ. ప్రేమంటే జీవితం’- అనుకోవాలని ఆమె ఆశ!

ఆదిలో పెళ్లి గురించిన ఆమె ఊహల్లో రవి, వాసు లేరు.

కానీ ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు తనవద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు- ఆమె కాస్త

లోతుగానే ఆలోచించింది.

ఇద్దరూ మంచివాళ్లు. నమ్మదగినవాళ్లు. తనకు జీవితభాగస్వామి కావడానికి ఇద్దరిలో ఎవరైనా

ఆమెకు అభ్యంతరం లేదు.

తను ఎటూ చెప్పలేక ఆ విషయం వాళ్లకే వదిలితే- వాళ్లా బాధ్యతని తనకే వదిలారు. అంతే కాదు-

నాటినుంచీ వాళ్లు స్నేహితుల్లా కాక ప్రత్యర్థులమన్నట్లు ప్రవర్ర్తిస్తున్నారు.

ఇక నిర్ణయం తనే తీసుకోవాలనుకుంది కుముద. జీవిత భాగస్వామిగా కొత్త కోణంలో వాళ్లని

పరిశీలించడానికి పూర్వపు స్నేహభావాన్ని కొనసాగించింది.

అప్పుడామెకి ఓ విషయం అర్థమయింది.

తను ఆ ఇద్దరిలో ఒకరినెన్నుకున్న మరుక్షణం- ముందు ఇద్దరూ పరస్పరం శత్రువులైపోతారు.

తర్వాత తనచేత తిరస్కరించబడినవాడు తనకీ శత్రువైపోతాడు.

ఆమెకు వాళ్లు విడిపోవడం కానీ, తనకు శత్రువులుగా మారడం కానీ ఇష్టం లేదు.

అందుకని తన నిర్ణయాన్ని వాయిదా వేస్తోంది.

ఐతే అలా వాయిదా వెయ్యడంవల్ల మేలుకంటే కీడే ఎక్కువని ఆమె గ్రహించింది.

ఇద్దరికీ తనమీద ఆశ ఉంది. తను జాప్యం చేసినకొద్దీ- వాళ్ల ఆశలు బలపడతాయి. చివరికో రోజున

తాను ఇద్దర్లో ఒకర్ని ఎన్నుకుంటే- ఆ జాప్యంవల్ల తిరస్కారపు గాయం మరింత తీవ్రమై

రెండోవాణ్ణి బాధిస్తుందని ఆమె భయం. ఒకటి రెండు రోజులు ఆ విషయమై తల బద్దలు

కొట్టుకున్నాక- పరిష్కారం తన తలకు మించిందని ఆమె గ్రహించింది. ఏంచేయాలో తోచక

విషయం గురుబ్రహ్మకి చెప్పింది.

గురుబ్రహ్మ ముందు రవి, వాసులకీ- తర్వాత కుముదకీ- జూనియర్‌ కాలేజిలో గురువు.

గురుబ్రహ్మ అసలు పేరది కాదు.

కానీ ఆయన తలిదండ్రులే- నామకరణమప్పుడు బియ్యంలో వ్రాసిన అసలు పేరు

మర్చిపోయేటంతగా ప్రాచుర్యం పొందిందా పేరు.

సంతకం పెట్టేలాంటి సందర్భాల్లో తప్ప తన అసలు పేరేమిటో ఆయనకే స్ఫురించదు.

గౌరవాభిమానాలతో శిష్యులు పెట్టుకున్న ఆ ముద్దు పేరు- కాలేజి ఎల్లల్నీ, జిల్లా పరిధుల్నీ,

రాష్ట్రం పరిమితుల్నీ, దేశం సరిహద్దుల్నీ దాటి- ఆకాశం అంచుల్ని ధాటిగా తాకుతోందిప్పుడు.

జీతం తీసుకుంటున్నానని కాక, జ్ఞానం పంచిపెట్టాలని పాఠం చెప్పేవాడాయన.

అదనంగా సంపాదించాలని కాక- శిష్యుల అవగాహన పెంచడంకోసం ట్యూషన్ సెంటర్

నడిపేవాడాయన.

ఆయనకి శిష్యులంటే కన్నబిడ్డలు. ఐతే వృద్ధాప్యంలో ఆదుకుందుకు మాత్రం కాదు.

‘బాల్యంలో- మీ శాయశక్తుల్నీ జాతి ప్రగతికి మాత్రమే వినియోగించాలి- అన్న భావం బలంగా

నాటుకుపోయేలా పిల్లలకు శిక్షణ ఇచ్చేవారే నిజమైన పెద్దలు’- అంటాడాయన.

ఇవన్నీ ఆయన పత్రికాముఖంగానూ, వేదికలపైనా ప్రబోధిస్తాడు. ఆయన స్వయంగా

పాటించడంవల్ల ఆ ఆదర్శాలకు విలువ పెరిగింది.

బిడ్డల్లా లాలించినా, గురువులా బోధించినా, ప్రవక్తలా ప్రవచించినా- అప్పటికప్పుడు

ఎదుటివారిని ప్రభావితం చేయగలడు గురుబ్రహ్మ.

అలా ప్రభావితం చేసేవారు సమాజంలో మరికొందరు లేకపోలేదు. కానీ ఆ ప్రభావం

అప్పటికప్పుడే. తన ప్రభావం అలా కాకూడదని గురుబ్రహ్మ ఆశయం. అందుకు శిష్యులతో తన

అనుబంధం కలకాలం కొనసాగాలనుకున్నాడు.

గురుబ్రహ్మ శిష్యులందర్నీ సమభావంతోనే చూస్తాడు. కానీ గురుశిష్యుల అనుబంధం కలకాలం

కొనసాగాలంటే, శిష్యుల్లో సరైనవాళ్లు కొందర్ని గుర్తించడం అవసరమని ఆయనకు తెలుసు.

పరమహంస వివేకానందుణ్ణి ఎన్నుకోవడానికి కారణమదే!

గురుబ్రహ్మ ఏటా కొందరు ప్రియశిష్యుల్ని గుర్తిస్తాడు. వారందర్నీ ప్రతిఏటా ఒకచోట

సమావేశపరుస్తాడు.

వాళ్లని తగిన విధంగా ప్రేరేపించడం ఆయన జీవన కార్యక్రమంలో భాగం.

శిష్యుల్లో చాలామంది ఆయనకు భక్తులు.

ఆ భక్తులు దేశవిదేశాల్లో చేసే ప్రచారమే- ఆయనకి అంతర్జాతీయ ప్రాచుర్యం తెచ్చింది.

అదిప్పుడు ఏ స్థాయి చేరిందంటే- ఎన్నో ప్రముఖ రాజకీయ పక్షాలిప్పుడాయన నాయకత్వంకోసం

అర్రులు చాస్తున్నాయి.

ఆయన మాత్రం, “నాలో నాయకత్వపు లక్షణాలుంటే ఉండొచ్చు. నావల్ల దేశానికెంతో

ప్రయోజనమున్నా ఉండొచ్చు. కానీ నావంటివాడి నాయకత్వానికి అనువైన పార్టీ, వాతావరణం

మన దేశంలో లేదు. కాబట్టి నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను” అని ప్రకటించాడు.

ఐతే-

ప్రజాస్వామ్యంలో దేశాన్ని నడిపించేది పౌరులని కొందరూ, వారెన్నుకున్న నేతలని కొందరూ

అంటారు. వారెవరికీ అభిమానుల ప్రాధాన్యం తెలియదు. సినీరంగంలో నటుల పాత్రల్నీ,

వేషధారణనీ నిర్ణయించేది అభిమానులు. సినిమా జయాపజయాల్ని నిర్ణయించేదీ అభిమానులే.

సినీరంగానికీ, రాజకీయరంగానికీ ఏమాత్రం వ్యత్సాసం లేని ప్రజాస్వామ్యం మనది.

వాళ్లు రంగులు పూసుకుంటారు. వీళ్లు పూసుకోరు. వాళ్లు కళ్లకి స్వర్గం చూపిస్తారు. వీళ్లు అరచేతిలో

స్వర్గం చూపిస్తారు. వాళ్లు తెరమీద నటిస్తారు. వీళ్లు తెర బయట నటిస్తారు. ఇద్దరూ ప్రజల్ని

రెండు చేతులా దోచేస్తారు.

వాళ్లని వేలెత్తి చూపడానికి వెయ్యి కారణాలుంటాయి. కానీ అవి బయటకు రావాలంటే లక్షలాది

​అభిమానుల్ని దాటి రావాలి.

అభిమానులే వాళ్లకి పెట్టని గోడ.

అలా చూస్తే- నిజానికి దేశాన్ని నడిపిస్తున్నది అభిమానులే కదా!

గురుబ్రహ్మకీ అభిమానులున్నారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానంటే ఊరుకుంటారా?

“మీకు తగిన పార్టీ లేకపోతే, మీరే ఓ కొత్త పార్టీ పెట్టండి. తగిన వాతావరణాన్ని మీరే సృష్టించండి”

అని ఒత్తిడి తెచ్చారు.

గురుబ్రహ్మ ఒత్తిడికి లొంగలేదు, “పార్టీలు వ్యక్తుల్నించి కాదు, సంస్థలనుంచి ఉద్భవించాలి”

అన్నాడాయన.

తన ఆశయాన్ని ఆయన స్పష్టంగానే చెప్పాడు.

ఎంత గొప్పవాడైనా సరే- కొత్త పార్టీ పెట్టాలనుకుంటే- తన దృష్టి పదవిపై ఉండకూడదు.

పార్టీ పెట్టేముందు సేవాసంస్థలు నెలకొల్పాలి.

ఆ సంస్థల్లో సభ్యులుగా చేరినవారు- ప్రజలమధ్య మసిలి వారి అవసరాలు తెలుసుకోవాలి. అవి

తీరడానికి వివిధ రంగాల్లో జనాభ్యుదయానికి కృషి చేయాలి. అలా ప్రజాసేవకు అంకితమైన

సంస్థనుంచి పుట్టినప్పుడే- ఏ రాజకీయపక్షమైనా అర్థవంతమౌతుంది. అప్పుడు ప్రజలా పక్షానికి

పట్టం కడతారు. అప్పుడా ప్రభుత్వం తన సేవా కార్యక్రమాల్ని సమర్ధవంతంగా

విస్తరించగలుగుతుంది.

ప్రారంభోత్సవాలకీ, ప్రచారానికీ బదులు- నేరుగా ప్రజలకోసమే డబ్బు ఖర్చుపెట్టే సంస్థల్నించి

పార్టీలు పుడితే- దేశంలో సగం సమస్యలు ప్రభుత్వాల అవసరం లేకుండానే తీరిపోతాయి. పార్టీల

మనుగడ అర్థవంతమౌతుంది. అనుచరులకి ప్రజల అవసరాలు తెలియడంతో పాటు,

ప్రజాసేవలో శిక్షణ కూడా లభిస్తుంది.

గురుబ్రహ్మ చెప్పిన మాటల్ని దేశవిదేశాల్లోని ఆయన భక్తులు అర్థం చేసుకున్నారు. వారు పంపే

నిధులతో- రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సేవాసంస్థలు మొదలయ్యాయి.

ఆ సంస్థలకు గురుబ్రహ్మ పేరు పెట్టాలని అభిమానులు పట్టుబట్టారు.


గురుబ్రహ్మ ఒప్పుకోలేదు, “జనాభ్యుదయానికి అంకితమైన మామూలు మనిషిని నేను. ఈ సంస్థల

సంస్థాపనలో నా వేలుండొచ్చు కానీ, నేను లేను. ఈ సేవాసంస్థలు నావి కావు. జనంకోసం జనం

నెలకొల్పినవి. వీటి పేర్లు జనంలోంచే రావాలి” అన్నాడాయన.


అలా రాష్ట్రమంతటా ప్రాంతానుగుణంగా వేర్వేరు పేర్లతో ఎన్నో సేవాసంస్థలు వెలసాయి. అవి

తొందరగానే బలపడి, క్రమంగా ప్రజల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి.

పేరాయనది కాకపోయినా, ఆ సేవాసంస్థలన్నీ గురుబ్రహ్మ కనుసన్నల్లో మెలగుతాయి.

రాజకీయాల్లో ప్రవేశిస్తే- గురుబ్రహ్మకి ఎదురే ఉండదని మీడియాలో టాక్‌.

వాసు ఇంజనీరు. రవి సైంటిస్టు.

వైజాగ్‌లో వెలసిన గురుబ్రహ్మ సంస్థలో పని చేయడానికి- ఇద్దరూ విదేశావకాశాలు కూడా

వదులుకున్నారు.

గురుబ్రహ్మ నిర్వహించే ఓ వార్షిక సమావేశంలో కుముద ఆయన ప్రియశిష్యురాలిగా పరిచయమై-

వెంటనే ఆ ఇద్దర్నీ ఆకర్షించింది.

ఆమెను వారిద్దరూ నడిపే సంస్థ ఆకర్షించింది.

గురుబ్రహ్మ ఆ ముగ్గుర్నీ కలిసి పని చేయమన్నాడు.

అప్పుడు కుముద ధ్యేయం- ఐఐటీ, మెడిసిన్‌ చదువులనుంచి తప్పుకుంది.

ఆమె వైజాగ్‌లోనే ఇంజనీరింగు చదువుతూ రవి, వాసులతో కలిసి పని చేస్తోంది.

అలా వాళ్లు ముగ్గురూ ఒకరికొకరు సన్నిహితులయ్యారు.

ఏడాది క్రితం రవి, వాసు ఆమెముందు మనసు విప్పారు.

అప్పటిదాకా- తమ సాన్నిహిత్యంలో ఈ కోణముందని కుముదకు తెలియదు. తెలిసేక ఆ వ్యవహారం

మిత్రులమధ్య మనస్పర్ధ కలిగించొచ్చన్న మరో కోణాన్ని ఆమె గుర్తించింది.

కింకర్తవ్యబోధనకు గురుబ్రహ్మను కలిసింది. పరిస్థితి వివరించింది.

గురుబ్రహ్మ సాలోచనగా, “పరమహంస ఎన్నుకున్న శిష్యుడు వివేకానందుడు బ్రహ్మచారి

కావడంలోని మర్మం నాకిప్పుడు తెలిసింది. కానీ నా శిష్యుల్ని బ్రహ్మచారులుగా ఉండిపొమ్మని

ఆదేశించలేనుకదా!” అని నిట్టూర్చాడు.

బ్రహ్మచర్యానికి కుముద కూడా సిద్ధంగా లేదు. అందుకని గురువేం చెబుతాడోనని ఆత్రుతగా

ఎదురుచూస్తోంది.

“నువ్వు వాళ్లిద్దరిలో ఎవర్నెన్నుకున్నా, ఇద్దరి మధ్యా వైషమ్యాలు తలెత్తడం ఖాయం. అందువల్ల

సమాజానికి చాలా నష్టం. కాబట్టి నువ్వు వాళ్లిద్దర్నీ కాదను. భగ్నప్రేమ వాళ్ల స్నేహాన్ని గాఢతరం

చేస్తుంది” అన్నాడాయన.

ప్రేమ భగ్నమైతే దానివల్ల మేలెలా జరుగుతుందా అని ఆశ్చర్యపడింది కుముద.

గురుబ్రహ్మపై ఆమెకు గట్టి నమ్మకమే ఉంది. ఐనా ఆయన ఆదేశాన్ని వెంటనే పాటించడానికి

కాస్త తటపటాయించింది.

ఈలోగా- కుముద తమలో ఒకరికే దక్కుతుందన్న ఊహే- వాసు, రవిల స్నేహాన్ని మరింత దెబ్బ

తీసింది.

వాళ్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు మొదలెట్టారు.

గురుబ్రహ్మ సామాన్యుడు కాడు. నిస్వార్థపరుడు. పవిత్రమూర్తి. అటువంటి ఆయన్ని ‘లాస్ట్ రిసార్ట్

ఆఫ్ స్కౌండ్రెల్స్’గా బెర్నార్డ్ షా వంటి మేధావిచేత అభివర్ణించబడ్డ రాజకీయాల రొచ్చులోకి లాగి

ప్రయోజనం పొందాలనే దురుద్దేశ్యం రవిలో మొదలైందనీ, అందుకు సంస్థ నిధుల్ని

దుర్వినియోగం చేస్తున్నాడనీ వాసు అంటాడు.

‘రాజకీయాల్ని పవిత్రం చేసిన మహారాజుల్లో జనకుడు, శ్రీరాముడు పురాణ పురుషులు.

ఆధునికుల్లోనూ అటువంటివారు కొందరున్నారు. గురుబ్రహ్మ ఆ కోవకు చెందినవాడు. ఐతే

రాజకీయాలు పవిత్రం కావడం ఏమాత్రం ఇష్టంలేని ఓ ఎన్జీవో మన దేశంలో ఉంది. అది

గురుబ్రహ్మను అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆ దుష్ప్రభావం వాసుమీద పడింది’

అని రవి అంటాడు.

అప్పుడు కుముదకి ఓ విషయం అర్థమైంది.

వాసుకీ, రవికీ కూడా గురుబ్రహ్మ ఆశయాలకంటే కుముద ప్రేమే ముఖ్యం.

అంటే- వాళ్లిద్దరూ కూడా తనకిలాగే ‘జీవితమంటే ప్రేమ. ప్రేమంటే జీవితం’ అనుకునే టైపని

సంతోషించాలా? లేక వాళ్లకి గురుబ్రహ్మ ఆశయాలపట్ల అంకితభావం లేదని విచారించాలా?

రోజులు గడుస్తున్నాయి.

ఈలోగా సంస్థలో రవి ప్రాబల్యం పెరిగింది. అతడు తన ఆశయసాధనకు దూకుడు పెంచాడు.

మన ప్రజాస్వామ్యంలో- ప్రజలకి న్యాయంచేసే పార్టీలు, నేతలు లేరట. గురుబ్రహ్మ రాజకీయాల్లో

ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైందట. అదీ అతడి ప్రచారం.

అలా వాసు ఆరోపణ నిజం చేశాడు రవి.

మరి వాసు చూస్తూ ఊరుకుంటాడా? తన ప్రచారానికి అనువుగా లేదని వాసు గురుబ్రహ్మదే మరో

సంస్థలోకి మారాడు.

గాంధీ అంతటివాడు కాంగ్రెసుని రాజకీయాల్లోకి రాకుండా ఆపలేకపోయాడట. గాంధీని ఆదర్శంగా

పెట్టుకున్నా, ఆ పార్టీ ఆశ్రిత పక్షపాతానికీ, అవినీతి ఆరోపణలకీ అతీతం కాలేకపోయిందట.

గురుబ్రహ్మ ఆశయాలకు సంస్థలే తప్ప రాజకీయాలు సహకరించవట. అదీ ఆ సంస్థ ప్రచారం.

అలా రవి ఆరోపణలు నిజం చేశాడు వాసు.

గురుబ్రహ్మ సంస్థలు రెండు వర్గాలుగా విడిపోయాయి.

గురుబ్రహ్మ ఆశయసాధనకే కృషి చేస్తామంటూ రెండూ విభిన్న మార్గాలు ఎంచుకున్నాయి.

గురుబ్రహ్మ మాత్రం ఎవరి పక్షం వహించడం లేదు. మీడియాకి కూడా దూరంగా ఉంటున్నాడు.

రవి, వాసులకి సంబంధించి- ఈ వివాదానికి మూలకారణం సిద్ధాంతాలు కావనీ- తనేననీ కుముదకి

తెలుసు. ఐతే దానికి తెర దించడం తనవల్ల కాదనీ ఆమెకు తెలుసు.

పరిస్థితి చెయ్యి దాటిపోతోందన్న అనుమానంతో, అన్యథా శరణం నాస్తి అనుకుని మళ్లీ

గురుబ్రహ్మని కలుసుకుని, “మీరు మీడియా ముందుకొచ్చి రవి, వాసుల వివాదానికి తెర దించాలి”

అని కోరింది.

గురుబ్రహ్మ ఒప్పుకోలేదు, “ఈ ప్రపంచంలో ఆటకీ, పాటకీ, మాటకీ, ఆఖరికి దేవుడికీ- కూడా ‘కీ’

రాజ’కీ’యంలో ఉంది. ఆ దుర్దశను నిరసిస్తాయని నేననుకున్న సేవా సంస్థల ‘కీ’ కూడా క్రమంగా

రాజ’కీ’యం హస్తగతమయ్యేలా ఉంది. వాసు, రవిల వర్గాలు రెండూ కూడా రాజకీయానికే పట్టం

కడుతున్నాయి. విభేదమల్లా నేను నేతృత్వం వహించాలా కూడదా అన్న విషయంలోనే! ఆశయం,

ఆదర్శం, ప్రేమ, సేవ- అన్ని దారుల గమ్యమూ రాజకీయమే. నన్ను గురుబ్రహ్మని చేసిన నా

శిష్యులు- నా నొసటివ్రాతను కూడా తామే వ్రాస్తామంటున్నారు. వారిని అదుపు చేయలేని

అసహాయత నాది. కానీ రాజకీయం ప్రజాసేవని వ్యాపారంగా మార్చింది. అది నాకు సరిపడదు.

మీడియా ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేస్తుంది. అందుకే దానికీ దూరంగా ఉంటున్నాను.

ఐతే ఇలా ఎన్నాళ్లో సాగదు. నేను మాత్రం- అవసరమైతే దూరంగా ఏ హిమాలయాలకో

పారిపోతాను కానీ రాజకీయానికి దగ్గర కాను” అన్నాడాయన.

ఆయన గొంతులో అసహాయతని పసి కట్టింది కుముద. నెమ్మదిగా, “ఈ వివాదంలో నాకూ ఓ

సమస్య ఉంది. అది రవి, వాసుల ప్రేమ. ఇద్దరికీ నో చెప్పమని మీరన్నారు. అది నావల్ల

ఔతుందనిపించదు” అంది.

“వాళ్లిద్దరూ నిన్ను ప్రేమిస్తున్నామంటున్నారు. ఆ మాట నిజమైతే వాళ్లనొక్కటి చేయడం నీకు

చాలా సులభం. వాళ్లిలా ఒకర్నొకరు ద్వేషిస్తుంటే, నీ మనసు విలవిలలాడిపోతోందని చెప్పు.

ఫలితముండొచ్చు” అన్నాడు గురుబ్రహ్మ.

వాసునీ, రవినీ విడివిడిగా కలుసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది కుముద. కానీ-

రవివల్ల గురుబ్రహ్మకి మచ్చంటాడు వాసు.

వాసువల్ల దేశ ప్రయోజనానికి దెబ్బంటాడు రవి.

“ఏదేమైనా మీరిద్దరూ కలిసుండాలి. లేకపోతే గురుబ్రహ్మకి మచ్చా వస్తుంది, దేశ ప్రయోజనమూ

దెబ్బ తింటుంది” అంది కుముద.

“నువ్వు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే” అన్నారు ఇద్దరూ కూడా సానుకూల దృక్పథంతో.

కానీ ఇద్దరూ కూడా ఒకే షరతు పెట్టారు. “నువ్వు నన్ను పెళ్లి చేసుకో. మేమిద్దరం పూర్వంలా

మంచిమిత్రుల్లా ఉంటాం” అని.

అప్పుడు తను ఔనంటే వాళ్లిద్దరూ విడిపోతారన్నాడు గురుబ్రహ్మ.

వాళ్లిప్పుడు తను ఔనంటే కలిసుంటాం అంటున్నారు.

దేశం భవిష్యత్తుని మార్చేయగల సంస్థల పునాది- ఒక ఆడపిల్ల ప్రేమమీద ఆధారపడిందా అని

నొచ్చుకున్న కుముద- కింకర్తవ్య విమూఢురాలై మళ్లీ గురుబ్రహ్మనే ఆశ్రయించింది.

ఐకమత్యం పాటించడానికి- గురుభక్తికంటే కూడా ప్రేయసికే ప్రాధాన్యమిచ్చిన శిష్యులది వ్యక్తిత్వ

పతనమే కదా అని మనసులో బాధ పడ్డాడు గురుబ్రహ్మ. ఆమెతో మాత్రం అది ప్రస్తావించకుండా,

“ప్రేమంటే మనుషుల్ని కలిపేది. నువ్విప్పుడు ఒకరికి ఔనంటే ఇంకొకర్ని కాదన్నట్లే కదా!

అప్పుడు తాము విడిపోతామని బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్లది ప్రేమ కాదు. కానీ అదే ప్రేమ అని

భ్రమిస్తున్నారు. ఆ భ్రమ పోవాలంటే, ఒక్కటే మార్గం. నువ్విక రెండే రెండు నెలలకంటే

బ్రతకవని వాళ్లకు తెలియాలి” అన్నాడు.

కుముద ఉలిక్కిపడి, “అంటే నేను చచ్చిపోవాలా?” అంది.

“ఔను. మనమొక మహాయజ్ఞం ప్రారంభించాం. అది జయప్రదం కావడానికి బలి అవసరం”

అన్నాడు గురుబ్రహ్మ గంభీరంగా.

కుముద అప్పటికి తేరుకుని, “రవి, వాసుల ప్రేమే కాదు- దేశభక్తి, గురుభక్తి కూడా ఒక భ్రమే!

అలాంటివారు కలిసుండడంకోసం- నేను నా ప్రాణాలు తీసుకోవడం అవసరమా? అవసరమని

మీరు నిజంగా భావిస్తే- బలికి నేను సిద్ధమే” అంది.

గురుబ్రహ్మ నవ్వి, “ఐతే నేను చెప్పేది విను. ఉష్ణం ఉషేన శీతలమనీ, వజ్రాన్ని వజ్రంతోనే

కొయ్యాలనీ అంటారు కదా! అలా భ్రమని భ్రమతోనే ఎదుర్కోవాలి. వాళ్ల ప్రేమలాగే నీ చావు కూడా

భ్రమే!” అని, “ఇప్పుడు నీవు బలికి సిద్ధమేనా?” అన్నాడు.

కుముదకి అర్థమైంది. తను చనిపోనక్కర్లేదు. చనిపోతానని చెప్పి వాళ్లని నమ్మించాలి.

అలాంటప్పుడు గురుబ్రహ్మ- ఆ మాట సూటిగా ముందే చెప్పొచ్చుగా? బలి అంటూ తనని

భయపెట్టడమెందుకు? అందులో తనకు తెలియని రాజకీయ ఆంతర్యముందా?

ఏది ఏమైనా ఆమె బలికి సిద్ధమేనని గురుబ్రహ్మకు చెప్పింది. ఆయన ఆమెకు బలి పథకాన్ని

వివరించాడు.

ఆ ప్రకారం కుముద ముందుగా రవిని కలుసుకుని, “నువ్వు గురుబ్రహ్మని రాజకీయాల రొంపిలోకి

లాగుతున్నావ్‌- వాసు మాట నిజమౌతోంది” అని మందలించింది.

“వాసు సంగతటుంచు. గురుబ్రహ్మ ప్రజానాయకుడైతే- దేశానికి మేలు జరగడం తథ్యం.

అయన్ను ఆపడమంటే దేశం ప్రగతిని బలి తీసుకోవడమే! ఈ విషయం వాసుకి చెప్పు” అన్నాడు

రవి.

కుముద బుద్ధిగా ఆ మాట వాసుకి వినిపించింది.

వాసు నవ్వి, “నెహ్రూకి ఆశ్రిత పక్షపాతం, ఇందిరకు ఎమర్జెన్సీ, రాజీవ్‌కి బోఫర్సు, వాజపాయికి కార్గిల్‌, అద్వానీకి హవాలా, పీవీకి యూరియా. మహామహులకి రాజకీయాలు అంటించిన మచ్చలకివి మచ్చుతునకలు. కొందరికి పులిమారు. కొందరు పులుముకున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో దిగడమంటే వ్యక్తిత్వాల్ని బలి చేసుకోవడమే. రాజకీయాల్లోకొస్తే గురుబ్రహ్మ వ్యక్తిత్వం కూడా బలి కావడం తథ్యం. అందువల్ల సమాజానికి ఎంత నష్టం? రవిని ఆలోచించమను” అన్నాడు.

కుముద రవికి ఆ మాట చెప్పింది.

“వాసు చెప్పాడని కాదు. నువ్వన్నావు కాబట్టి తప్పక ఈ విషయమై ఆలోచిస్తాను. ఐతే ఒక్క మాట!

అవతల గురుబ్రహ్మ రాజకీయ ప్రవేశానికి ప్రయత్నాలు భారీగానే జరుగుతున్నాయి. వాటినాపడం

నావల్ల కాదు. ఐతే ఆ ప్రయత్నాల్ని ప్రతిఘటించడం కోసం, వాసుతో చేతులు కలపడానికి నాకు

ఓకే- నువ్వు నన్ను పెళ్లి చేసుకుందుకు ఒప్పుకుంటే!” అన్నాడు రవి.

అప్పుడు రవి వాసుతో కలవడానికి ముందుకు రావచ్చు. కానీ వాసు అతణ్ణి తనతో

కలుపుకుందుకు ఇలాంటి షరతే పెడతాడు కదా!

“పెళ్లి అనేది సామాన్యుల జీవితంలో పెద్ద మలుపే కావచ్చు. కానీ దేశ చరిత్రను మలుపు తిప్పగల

గొప్ప నిర్ణయానికి- ఆధారమయేటంత గొప్పదా? ఇంతకీ అది ప్రేమ గొప్పతనమా, మనిషి

తక్కువతనమా?” అనుకుంది కుముద.

ఇంతకీ గురుబ్రహ్మ వాళ్లిద్దరి ప్రేమా భ్రమ అన్నాడు. భ్రమని భ్రమతోనే ఎదుర్కోమన్నాడు.

కుముద ఇక జాప్యంచెయ్యలేదు. అందుకామె తనకి అనారోగ్యమంటూ కొన్నాళ్లు వాళ్లని

తప్పించుకుని తిరిగింది. క్రమంగా తనకి లేని భయంకర రోగానికి సాక్ష్యాల్ని సృష్టించుకుంది.

ఒక రోజున వాళ్లని బీచికి పిలిచి, “పిట్ట తగవూ పిట్ట తగవూ పిల్లి తీర్చింది. ఇక మీరిద్దరూ నాకోసం

ఒకరిమీద ఒకరు కత్తులు నూరక్కర్లేదు. నా ఆయుష్షింకో రెండు నెలలు. అంతే!” అంది

సీరియస్‌గా.

మిత్రులిద్దరూ షాక్‌ తిన్నారు. దారుణంగా అప్సెట్టయ్యారు. తర్వాత ఆమె చెప్పింది నిజం

కాదేమోనని ఆశ పడ్డారు.

నిజమని నమ్మడానికి తగిన ఋజువులన్నీ చూపించిందామె.

ఇద్దరూ పూర్తిగా డీలా పడిపోయారు. తేరుకుందుకు టైం పట్టింది. చివరకు నీరసంగా వీడ్కోలు

తీసుకున్నారు.

ఆ రోజుకి వాళ్లని చూస్తే చెప్పలేనంత జాలి కలిగింది కుముదకి.

నిజం చెప్పి వాళ్ల మనసులకి ఉపశమనం కలిగించాలన్న భావాల్ని అతి కష్టంమీద ఆనాటికి

అదుపు చేసుకుంది.

మర్నాటికి- అబద్ధం చెప్పి తప్పు చేసానా అన్న బాధ దొలిచేస్తుంటే, ఎలాగో తట్టుకుంది.

ఆ మర్నాటికి- తనకోసం వాళ్లేమైపోతారోనని బెంగ ఆమెను రోజంతా వెంటాడింది.

ఆ తర్వాత వాళ్లే ఆత్మహత్యో చేసుకుంటారేమోనని భయమేసి, అందుకు తనే కారణమని

గ్రహించి నిలువునా వణికిపోయిం<ది.

ఇలా మానసికంగా రోజుకొక రకంగా మనసు పరిపరివిధాల పోతుంటే, “ఇంతకాలం వాళ్లు నన్ను

ప్రేమిస్తున్నారనుకున్నాను. అంతకంటే ఎక్కువగా నేనే వాళ్లని ప్రేమిస్తున్నానా?” అని

అనుమానపడిందామె.

ఐతే ఈలోగా ఆమె చుట్టూ ఊహించని ఎన్నో వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజా రాజకీయ పరిణామాల గురించి ఓ ఛానెల్‌ నిర్వహించే చర్చకి రవి, వాసు

ఆహ్వానించబడ్డారు. ఆ చర్చల్లో ఒక అజ్ఞాతయువతి ప్రసక్తి వచ్చింది.

“ఆమె పేరు చెప్పను. కానీ ఆమె గురుబ్రహ్మకి వీరాభిమాని. ఆయన రాజకీయాల్లోకి వస్తే తప్ప దేశం బాగుపడదని ఆమె గాఢనమ్మకం. ఆయన రాజకీయాలకి విముఖుడన్న అబద్ధపు ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురై డిప్రెషన్‌కి లోనైంది. ఆమె ఆరోగ్యం ఎంతలా దిగజారిపోయిందంటే- డాక్టర్లామె ఆయువు మరో రెండు నెలలలోపే అంటున్నారు. ఆమె నాకు తెలుసు. త్వరలోనే ఆమె వివరాలు బయటపెడతాను” అన్నాడు రవి.


వాసు కూడా ఆ అజ్ఞాతయువతి విషయమై రవి చెప్పింది నిజమని చాలావరకూ ధ్రువపర్చి,

“పవిత్రమైన గురుబ్రహ్మ రాజకీయాల రొచ్చులో కూరుకు పోతాడని ఆమె దిగులు. అదీ ఆమె డిప్రెషన్‌కి కారణం” అన్నాడు.

ఆ అజ్ఞాత యువతి తనేనని అర్థమైంది కుముదకి.

“నేను చస్తానంటే, విరక్తితో ఏమేమో ఐపోతారనుకున్నాను. లేదా ఇద్దరూ ఒకటౌతారనుకున్నాను.

కానీ ఈ ప్రేమికులిద్దరూ, తమ తమ ఆశయాల్ని నెరవేర్చుకుందుకు నా చావుని సాధనం

చేసుకుంటున్నారు. ఇక వీళ్లు ఒకటవడం కల్ల” అనుకుని బాధ పడింది కుముద.

కానీ ఆ మర్నాడే అనుకోని అద్భుతం జరిగింది.

ఆయుధం చేపట్టనన్న శ్రీకృష్ణుడిలా, పదవి చేపట్టనన్న షరతుతో- గురుబ్రహ్మ

రాజకీయరంగ ప్రవేశానికి ఓకే చెప్పాడు.

అంతే- ప్రేమతో, భ్రమతో కుముద చెయ్యలేని పని ఆయన చేశాడు.

విడిపోయిన రవి, వాసు వర్గాలు ఒకటైపోయాయి.

రవి వర్గం రాజకీయపక్షమై ప్రభుత్వాధికారానికి ప్రయత్నిస్తుందిట. వాసుది ప్రభుత్వానికి

కాన్షన్స్‌ కీపర్‌గా ఉంటూ సంస్థాగత ప్రజాసేవ కొనసాగిస్తుందిట.

రెండూ గురుబ్రహ్మకి విధేయమేనట.

ఇలా ఎలా జరిగిందని కుముదలో ఆశ్చర్యం. ఆమెలో రకరకాల అనుమానాలు, భయాలు….

ఒకవేళ- తన ఆయువిక కొద్ది రోజులేనన్న చిన్న అబద్ధం- రవి, వాసుల శత్రుత్వాన్ని బలి

తీసుకుని- వారి స్నేహాన్ని పునరుద్ధరించిందా?

గురుబ్రహ్మ అనుకున్నట్లు వాళ్లకి తనమీదున్న ప్రేమ భ్రమ కాదా? లేక వాళ్లని

కలపడానికి గురుబ్రహ్మ తనకు చేసిన ఉపదేశం గొప్పదా?

అసలింతకీ రవి, వాసులు తిరిగి కలిసిపోవడానికి కారణం- తనమీద ప్రేమా లేక

గురుబ్రహ్మ రాజకీయ ప్రవేశమా?

తన సందేహాలకు సమాధానంచెప్పగలవారింకెవరున్నారు- గురుబ్రహ్మ తప్ప!

కుముద ఆలస్యం చెయ్యకుండా వెళ్లి గురుబ్రహ్మను కలుసుకుంది.

గురుబ్రహ్మ ఆమెను చిరునవ్వుతో పలకరించి, “నువ్వు బలి కాకుండా ఆపడానికి మరో మార్గం తోచలేదు నాకు. అందుకే నా ఆశయాలు బలయ్యే ప్రమాదముందని తెలిసీ రాజకీయాలకి ఓకే చెప్పాను. రోట్లో తలపెట్టాను కాబట్టి ఇక రోకటి దెబ్బలకీ వెరవను” అన్నాడు.

కుముద ఆశ్చర్యంగా, “నేను బలి కావడమేమిటి? మీరు నన్ను కాపాడ్డమేమిటి? అసలు

నిజం మీకు తెలిసిందే కదా!” అంది.

గురుబ్రహ్మ అదోలా నవ్వి, “ఇంకా అర్థం కాలేదా? నీకు ఆయువు రెండు నెలలే అని నిర్ధారణ కాగానే-

నీ చావుని షాక్‌ డెత్‌గా నిర్ధారించి, తమ తమ ప్రయోజనాలు సాధించువాలనుకున్నారు రవి, వాసు. అందుకు పునాదిగా మీడియాలో నిన్ను ఓ అజ్ఞాత యువతిగా చిత్రీకరించారు. దాంతో నేను రాజకీయాల్లోకి దిగక తప్పలేదు. నా వ్యక్తిత్వం బలి కాకుండా కాపాడుకుంటూ, రాజకీయాల్లో కొత్త సంస్కృతికి శ్రీకారం చుడతానని ప్రస్తుతానికి మనసు సరిపెట్టుకుంటున్నాను” అన్నాడు.


“మీరు కాక ఇంకెవరైనా ఇలా చెప్పి ఉంటే, అది రాజకీయాల్లోకి రావడానికి సాకు అనుకునేదాన్ని. నా ప్రాణాలు రక్షించడమనేది ఆత్మవంచన అనుకునేదాన్నితప్ప, ఆ మాటలు నమ్మేదాన్ని కాదు” అంది కుముద.

నేరుగా అనలేక, పరోక్షంగా దెప్పుతోందని గురుబ్రహ్మ గ్రహించాడు, “నామీద నీకున్న గౌరవానికి

చాలా సంతోషం. అదే గౌరవంతో- ఆ మాటన్నది నేనే కాబట్టి ఎలా అనుకుంటావో- అది

కూడా చెప్పు” అన్నాడు.

“నేనేమనుకుంటానో, లేదా ఏమనుకోవాలో మీరే చెప్పాలంటాను…” అంది కుముద గంభీరంగా.

“చూడమ్మా! నువ్వు జీవితమంటే ప్రేమ, ప్రేమంటే జీవితం అనుకుంటావు కదా! ఏ జీవితం గురించి నువ్వా మాట అనుకున్నావో కానీ, రాజకీయానికి అది వర్తించదు. అక్కడ ప్రేమాభిమానాలకు తావు లేదు. మనుగడకోసం మనిషి ప్రాణం తీయడానికి వెనుకాడని సంస్కృతి రాజ్యమేలే రాజకీయరంగంలో- బతుకే వ్యక్తిత్వపు చావు. చావే వ్యక్తిత్వపు బతుకు” అన్నాడు.

“ఐతే?” అంది కుముద

“సూటిగా చెబుతాను. గుండె చిక్కబట్టుకుని విను. నీ ఆయువిక రెండే రెండు నెలలని నమ్మకం కలగ్గానే- రవి, వాసు ముందు షాక్ తిన్నారు. కానీ అప్పుడే రాజకీయాలు వంటబడుతున్నాయేమో, తొందరగానే నీ చావుకి మానసికంగా సంసిద్ధులయ్యారు. నీ చావుని తమ భవిష్యత్తుకి పునాది చేసుకోవాలనుకున్నారు. నీ చావు వాళ్లకో ఆశాకిరణమైంది. అలాంటప్పుడు నీ జబ్బు అబద్ధమని తెలిస్తే వాళ్లు సంతోషించరు. అబద్ధాన్ని నిజం చేసి, నీకోసం కాసిని కన్నీళ్లు కార్చి, తమ భవిష్యత్తును నిర్మించుకోవడంలో బిజీ ఐపోతారు…..”


ఇంకా ఏదో చెప్పబోతూ కుప్పలా కూలబడిపోయిన కుముదని చూసి అగిపోయాడాయన.

షాక్ నుంచి తేరుకుందుకు కుముదకి కాసేపు పట్టింది. గురుబ్రహ్మ ఆమెను సముదాయిస్తూ, “మన చుట్టూ నీలాంటివాళ్లు ఎందరున్నారో నాకు తెలియదు. తమకి తెలియకుండానే తమ ప్రమేయం లేకుండానే వారంతా నా పేరిట బలి కావచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో బతుకే చావు, చావే బతుకు. అదీ సంగతి!” అన్నాడు.


కుముదకి పరిస్థితి అర్థమైంది. ఆమెకిప్పుడు వాసు, రవిలలో తానెవర్ని ప్రేమించాలా అన్న సందిగ్ధం లేదు.

‘జీవితమంటే ప్రేమ. ప్రేమంటే జీవితం’ అనుకునే వ్యక్తి కోసం తనింకా అన్వేషించాల్సి ఉందనీ, అందుకు రాజకీయరంగం వెలుపలే ప్రయత్నించాల్సి ఉందనీ ఇప్పుడామెకి తెలుసు.

---0---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.


41 views0 comments
bottom of page