top of page

అమ్మో, వాట్సాపు!

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

https://youtu.be/8viiUjyE1rI

'Ammo Whatsapu' Written By Vasundhara

రచన : వసుంధర


భయమంటే తెలీదు సదాశివానికి.

ఒక రకంగా సిత్తరాల సిరపడి లాంటోడు.

దొంగలొచ్చినా లెక్క చేయడు.

మొసలి ఉన్న మడుగులో ముచ్చటగా ఈత కొడతాడు

దెయ్యంతో ధైర్యంగా మాట్లాడుతాడు.

ఆలాంటి సదాశివం ఒక పని చేయడానికి మాత్రం తెగ భయపడి పోయాడు.

అదేమిటో తెలుసుకోవాలంటే మెగా రైటర్ వసుంధర గారి 'అమ్మో, వాట్సాపు! '

కథ చదవల్సిదే…


“బీరువా గదిలో ఎవరో ఉన్నారండీ” అంది అమ్మ నాన్నతో.

ఆర్నెలక్రితమే ఆ ఇంట్లోకి మారాం. పెద్ద ఇల్లు. అమ్మా-నాన్న, అన్నయ్యా-వదిన, నేను– మొత్తం ఐదుగురం మా ఇంట్లో మనుషులం. పడక గదులు మూడున్నాయి. ఇంకా దేవుడికో గది, వంటకో గది. భోజనాలకో గది. ఓ హాలు.

ఇంత ఇంట్లోనూ వాస్తు కోసమని ఎందుకూ పనికిరాని ఓ చిన్నగది కూడా కట్టాల్సి వచ్చింది. బ్యాంకు లాకర్ గదిలా ఇరుగ్గా ఉంటుందది. అందులో మూడు బీరువాలు పెట్టాం. వాటిలో నిత్యావసరం కాకపోయినా కాస్త ముఖ్యమైనవి అనిపించే– పుస్తకాలు, బట్టలు, లాకర్ తాళాలు వగైరా ఉంటాయి. సాయంత్రం దూరపు చుట్టాలింట్లో పెళ్లి. వడ్డాణాలు పెట్టుకుని వెడదామనుకున్నారు అమ్మ, వదిన.

రివాజుగా అవి బ్యాంకు లాకర్లో ఉన్నాయి. నాన్నకి ఆఫీసు దారిలోనే ఉంది బ్యాంకు. సాయంత్రం ఆఫీసునుంచి కాస్త పెందరాళే బయలుదేరి వడ్డాణాలు తీసుకు రావాలని అమ్మ నాన్నకి చెప్పింది.

సరేనన్నాడు నాన్న. ఆయన ఆఫీసుకి బయల్దేరే సమయానికి, లాకరు తాళం కోసం బీరువా గదిలోకి వెళ్లిన అమ్మ, క్షణాల మీద షాక్ కొట్టిన దానిలా వెనక్కి వచ్చి అన్న మాటః “బీరువా గదిలో ఎవరో ఉన్నారండీ” అని.

నాన్న నవ్వి, “నీ మొహం! మనకి తెలియకుండా ఇంట్లో కొత్తవాళ్లెవరుంటారు? అదీ, ఆ ఇరుకు గదిలో” అని వదిన కేసి తిరిగి, “ఓసారి నువ్వెళ్లి చూడమ్మా” అన్నాడు.

“అది వెళ్లడమూ, హడిలిపోయి తిరిగి రావడమూ అయింది. పిరికిది, అనవసరంగా భయపడిందని తేలిగ్గా తీసుకుని నేనెళ్లాను. కానీ అక్కడ నిజంగానే ఎవరో ఉన్నారు” అంది అమ్మ.

“మగాడా, ఆడదా?” అన్నాడు నాన్న కొంచెం ఎకసక్కెంగా.

“అది తెలియడానికి ముందు అక్కడున్నది మనిషో కాదో తెలియాలిగా” అంది అమ్మ.

“ఏమన్నావ్?” అన్నాడు నాన్న ఉలిక్కిపడి.

“నేనేమన్నా ఎలాగూ తీసి పారేస్తారుగానీ ఓసారి మీరే వెళ్లి చూసిరండి. మీరేం చెప్పినా మేము నమ్ముతాంగా”

అమ్మ అలాగంది కానీ ఇంటికి పెద్ద మగాడు కదా, నాన్నెందుకు వెళ్తాడు- అన్నయ్యని వెళ్లమన్నాడు.

వద్దన్నట్లు అన్నయ్యకేసి చూపులతో సైగ చేస్తోంది వదిన. కానీ వాడు అటు చూడలేదు. నాన్ననే చూస్తూ బుద్ధిగా తలూపి గదిలోకెళ్లాడు. ఒక్క క్షణం, అంతే! కెవ్వుమన్న కేక వినబడింది. ఏమయిందోనని కంగారుపడి అంతా అటు తిరిగితే - అన్నయ్య పరుగున వచ్చి, “లోపల దయ్యం” అనేసి అక్కడే చతికిలబడ్డాడు.

అంతా వాడి చుట్టూ మూగాం. వాడు తేరుకున్నాక వణుకుతూనే తను చూసింది చెప్పాడు. అడుగెట్టగానే ఎదుటి బీరువా దానంతటదే పైకి లేచి కిందకి వాలిందిట. ధైర్యం చేసి ముందడుగు వెయ్యబోతే బీరువాకి అడ్డంగా ఓ అస్పష్ట ఆకారం. మొహంలో కళ్లు, పళ్లు తప్ప ఇంకేం కనబడలేదుట. ఆ ఆకారం కళ్లెర్రచేసి పళ్లు పటపటలాడించిందిట. అంతే, కెవ్వుమని అరిచి ఒక్క ఉదుటున బయటకొచ్చి పడ్డాడు.

ఈసారి నాన్న నవ్వలేదు. ఎకసక్కెం చేయలేదు. నన్ను వెళ్లమనలేదు, తను వెడతాననలేదు. అమ్మ కేసి తిరిగి, “అసలే రోజులు బాగోలేవు. చిన్నమెత్తు ఉంగరంకోసం మర్డర్లైపోతున్నాయిట. పెళ్లికి వడ్డాణం పెట్టుకోకపోవడమే మంచిది” అన్నాడు అప్పటికి లాకరు తాళం అవసరాన్ని పక్కకి నెడుతూ.

బీరువా గదిలోకి నన్ను వెళ్లమని అననందుకు రిలీఫ్‍గా ఫీలయ్యాను. కానీ అమ్మ నాన్నని వదిలేలా లేదు, “ఇప్పుడు మన సమస్య వడ్డాణం గురించి కాదు. ఆ గదిలోంచి లాకరు తాళం ఎలా తెస్తామా అని” అంది.

“అది నేను ఆఫీసుకెళ్లి ఆలోచిస్తాను. మీరు ఇంట్లో కూర్చుని ఆలోచించండి. ఉపాయం ఎవరికి ముందు తోస్తే వాళ్లు అమలు చేయొచ్చు” అని నాన్న అక్కడితో ఆ చర్చకి మంగళం పలికాడు. నా ఆఫీసుకీ రోజు సెలవు. నాన్న, అన్నయ్య ఆఫీసుల కెళ్లేదాకా లాకరు విషయం పక్కకెళ్లింది.

అప్పుడు అమ్మ, “ఈ సమయంలో సదాశివం ఉంటే ఎంత బాగుండేది?” అంది గొణుగుతున్నట్లు నెమ్మదిగా.

సదాశివం నాకంటే రెండేళ్లు పెద్ద. వాడిది అమ్మా వాళ్ల ఊరు. భయమంటే తెలియనివాడని, చిన్నప్పట్నించే పేరుపడ్డాట్ట. ఊరివాళ్ల ద్వారా విన్న అమ్మ- వాడి విశేషాలు కథలు కథలుగా మాకు చెప్పేది.

ఒకసారి ఊళ్లో చెరువులోకి మొసలి చేరిందని పుకారు పుట్టింది. చీకటి పడితే గ్రామస్థులు అటుగా వెళ్లడానికి భయపడేవారు. ఆ భయం పోగొట్టడానికి పూనుకున్న సదాశివం వరుసగా నాలుగు రోజులా చెరువులో స్నానం చేశాడు. క్రమంగా జనం మొసలి విషయం మర్చిపోయి ఎప్పటిలా చెరువు దగ్గరకెడుతున్నారు.

“నాదీ మా తాతయ్యదీ మాటలకందని గొప్ప అనుబంధం. చనిపోయినా ఆయన ఆత్మ నన్నే అంటిపెట్టుకుని సలహాలిస్తూంటుంది. చెరువులో ఏ మొసలీ లేదనీ, ఊళ్లోని ఓ ప్రేమజంట రాత్రిళ్లు అక్కడ రహస్యంగా కలుసుకుందుకు వీలవుతుందని అలాంటి పుకారు పుట్టించారనీ ఆయన నాకు చెప్పాడు. అందుకే ఆ చెరువులో స్నానం చెయ్యడానికి ధైర్యం చేశాను” అన్నాట్ట సదాశివం. ఐతే ఆ జంట ఎవరో మాత్రం ఎవరికీ చెప్పలేదు.

ఒకసారి ఓ రాత్రిపూట, చేతిలో పెద్ద కత్తితో, ముఖానికి నల్లని ముసుగుతో ఉన్న ఓ మనిషి ఓ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి తాళం బద్దలు కొట్టి లోపలికెళ్లడం– ఓ గ్రామస్థుడు చూశాడు. ఓ క్షణం తటపటాయించినా తర్వాత గట్టిగా అరిచి గోల చేస్తే- చుట్టుపక్కల జనం వచ్చి ఇంటిచుట్టూ మూగారు. పదిమంది కలిసి లోపలికెళ్లి మీదపడితే, దొంగని పట్టుకోవడం కష్టం కాదు కానీ వాడి చేతిలో కత్తి ఉందని అందరి భయం. ఏంచెయ్యాలా అని వాళ్లు ఆలోచిస్తున్న సమయంలో సదాశివం అటుగా వచ్చి విషయం తెలుసుకున్నాడు. అంతే!

వాడు క్షణం జాప్యంచెయ్యకుండా చటుక్కున లోపలకెళ్లాడు. లోపలేం జరిగిందో కానీ, కాసేపట్లో దొంగతోసహా బయటకొచ్చాడు. దొంగ మొహానికింకా ముసుగుంది. చేతిలో కత్తీ ఉంది.

అక్కడున్నవాళ్లతో, “అంతా పక్కకు తప్పుకుని. ఇతణ్ణి పారిపోనివ్వండి. పట్టుకుందుకు ప్రయత్నించొద్దు. గాయపడే ప్రమాదముంది” అని హెచ్చరించాడు సదాశివం.

జనం పక్కకు తప్పుకున్నారు. దొంగ పారిపోయాడు. తర్వాత సదాశివం జరిగిందానికిచ్చిన వివరణ ఇదిః “దొరికినవాణ్ణే దొంగ అంటాం కానీ ప్రతి మనిషిలోనూ ఎంతోకొంత దొంగబుద్ధి ఉంటుంది. అది గ్రహిస్తే చాలు, ఏ దొంగనైనా సానుభూతితో క్షమించగలం. అలా చెయ్యలేకపోతే, మనలో ఉన్న దొంగని కూడా క్షమించే అర్హత కోల్పోతాం. అందుకే దొంగతనం జరక్కుండా ఆపగల్గినప్పుడు, దొంగకి పారిపోయే అవకాశమివ్వాలి. తనెవరో తెలిస్తే, దొంగ అన్న ముద్ర పడుతుంది కాబట్టి, అతణ్ణి అజ్ఞాతంగానే ఉంచాలి. అలా చేస్తే మనకి నష్టమూ ఉండదు, ప్రమాదమూ ఉండదు, దొంగకి మారే అవకాశమూ ఉంటుంది. లేదూ, దొంగ తన ప్రాణాలు కాపాడుకుందుకూ, తానెవరో తెలియకుండా ఉండేందుకూ- ఎంతకైనా తెగిస్తాడు. తర్వాత మరిన్ని దొంగతనాలకు పాల్పడతాడు” అని తాతయ్య అతడికి చెప్పేట్ట.

“ఇప్పటికిలా జరిగినా, ఈ సిద్ధాంతం మాత్రం ఏడిసినట్లుంది” అని ఈసడించారుట కొందరు. కానీ సదాశివం మొడిధైర్యానికి మాత్రం అంతా అబ్బురపడ్డారు.

ఇంతకీ– సదాశివానికి తాతయ్య నిజంగా సలహా ఇచ్చాడో, లేక తన స్వంత వేదాంతం చెబుతున్నాడో తెలియదని అంటుంది అమ్మ.

ఆ సదాశివం కాలేజీ చదువుకి పట్నం వచ్చి మా ఇంట్లోనే రెండేళ్లున్నాడు. తనకి నేను రెండేళ్లు జూనియర్. తన గురించి చాలా విన్నానేమో, తన సావాసం నాకు మహా ఎక్సయింటింగుగా ఉండేది.

మా ఇంట్లోనూ- ఒకటా రెండా- వాడి లీలలు, వాటికి తాతయ్యతో అన్వయం- విభిన్నంగా, విడ్డూరంగా,

ఎక్సయిటింగ్‌గా ఉండేవి. మచ్చుకి ఓసారి మా బాత్రూంలో కట్లపాము దూరింది. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. అప్పుడు సదాశివం నేను వెడతానంటూ ఓ గుడ్డసంచీ తీసుకుని బాత్రూంలోకి వెళ్లాడు. ఏమవుతుందోనని భయపడ్డాం కానీ, వాడు పాముని సంచీలో కెక్కించి మూతి బిగించి కట్టి బయటకొచ్చాడు. తర్వాత స్కూటర్‌మీద వెళ్లి దాన్ని ఊరిచివర వదిలేసి వచ్చాడు.

“మనవల్ల ప్రమాదం లేదని తెలిస్తే ఏ ప్రాణీ మనకి హాని చేయదు- దానికి మనం ఆహారంగా అవసరపడితే తప్ప! పారిపోనిస్తామన్న నమ్మకముంటే విషజంతువు కూడా మన మాట వింటుంది” అని వాడికి వాళ్ల తాతయ్య చెప్పేట్ట.

అలాంటి సదాశివం, మా ఇంట్లో దయ్యముందన్న అనుమానం రాగానే– అమ్మకి గుర్తుకి రావడం సహజమే! కానీ నాకు తెలిసి ఇంతవరకూ, వాడు దయ్యాలతో వ్యవహరించిన గుర్తు లేదు.

అందుకని, “ఇప్పుడు వాడి ఊసెందుకమ్మా- వాడేమన్నా భూతవైద్యుడా?” అన్నాను.

“ఈ మాత్రం దానికి భూతవైద్యుడు కావాలా? వాడితో రెండేళ్లు సావాసం చేశావు. ఏం లాభం? వాడు తన తాతయ్యను నమ్మినట్లు, నువ్వు కూడా మన పెద్దల్లో ఎవరో ఒకర్ని నమ్ముకుని, వాడిలో వందోవంతు ధైర్యం తెచ్చుకున్నా, ఓసారి ఆ గదిలోకి వెళ్లి ధైర్యంగా బీరువా తలుపు తీసేవాడివి” అని ఆ పనికోసమే నన్ను కన్నదా అన్న లుక్కిచ్చింది అమ్మ. ఆ మాట వింటూనే వదిన నాకేసి ఆశగా చూసింది.

ఆ ఇద్దరి చూపులూ నన్ను దయ్యంకంటే ఎక్కువగా భయపెట్టాయి. ఇద్దరికీ వడ్డాణాలు పెట్టుకుని పెళ్లికెళ్లాలని మహా మనసుగా ఉంది. నన్ను బలవంతాన ఆ గదిలోకి తోసేస్తారో, ఏమో! కానీ కన్నతల్లి. ఆపైన పేగుబంధం. అమ్మ అంత పని చేస్తుందనుకోను. కానీ ఏమో, ఎందుకైనా మంచిదని- చిన్న పనుందన్న వంకతో బైక్ తీసుకుని ఇంట్లోనుండి బయటపడ్డాను.....


బజార్లో నడుస్తుంటే, “ఒరేయ్ రాజూ” అని వెనకనుంచి ఎవరో పిలుస్తున్నారు. పరధ్యానంగా ఉన్నానేమో నన్ననుకోలేదు. బుర్ర తిప్పి చూసేలోగా నా భుజం మీద ఓ చెయ్యి పడింది. చూస్తే సదాశివం!

వెదకబోయిన తీగ ముందునుంచి కాలికి తగలడం విన్నాను గానీ ఇలా వెనకనుంచి భుజానికి తగలడం ఆశ్చర్యం- కాదు కాదు– అదృష్టం! వాడేదో అనేలోగా నేనే, “ఈ ఊరెప్పుడొచ్చావురా?” అన్నాను.

పరిగెత్తుకుంటూ వచ్చాడేమో ఆయాసపడుతున్నాడు. “అనుకోకుండా వచ్చాన్రా. మీ ఫోన్ నంబరులేదు, కొత్తింటి అడ్రసు లేదు. కలవడ మెలాగా అనుకుంటుంటే, నువ్వే కనిపించావు. అదృష్టం అంటే నాది” అన్నాడు.

“అదృష్టం నీది కాదురా, మాది! ఇప్పుడు మాకొచ్చిన ఓ పెద్ద సమస్యని నువ్వే పరిష్కరించాలి” అన్నాను. కానీ దయ్యం విషయం ఇంటికెళ్లేదాకా చెప్పదల్చుకోలేదు.

అప్పటికి వాడు కొంచెం స్థిమితపడ్డాడు. నా మాటలకి ఆశ్చర్యపడి, “సమస్యా? మీకా? దాన్ని పరిష్కరించాలా? అదీ నేనా?” అంటూ ఒకే ప్రశ్నని నాలుగు చేసి సంధించాడు.

“అన్నీ చెబుతా. ముందు ఇంటికెళ్దాం పద” అన్నాను.

బైక్ ఎక్కేక వాడు తనెందుకొచ్చిందీ చెప్పాడు. ఆశ్చర్యంగా అది కూడా మా సమస్యా పరిష్కారానికి లింకయ్యేలా ఉంది.

సదాశివం ఎలక్ట్రానిక్ ఎక్సపర్ట్. ఓ పేరాసైకాలజిస్టుతో కలిసి నెగెటివ్ ఎనర్జీతో డీల్ చేసే ఎన్‌డీల్ అనే పరికరాన్ని డెవలప్ చేసేడు. దానికి వాడుతున్న ఓ చిప్‍లో కొన్ని మార్పులు చెయ్యాలి. అది తనవల్ల కాకపోతే, ఈ ఊళ్లో ఓ కన్సల్టెన్సీ సర్వీసుని సంప్రదించాడు. వాళ్లీవేళ అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

“తమాషా ఏంటంటే- ఆ పేరాసైకాలజిస్టు మహా పిరికి. థియరీ చెబుతాడు. ప్రిడిక్షన్సు కూడా కరెక్టుగా చేస్తాడు. కానీ ప్రాక్టికల్సు అంటే వణుకు. అందుకే నన్ను ఎంపిక చేశాడు. అన్నింటికీ నన్ను ముందుకి తోసి, సేఫ్ అని తెలిసేక తను రంగంలోకి దిగుతాడు. కానీ నాకు మంచి టిప్సు ఇస్తాడులే. ఇది మహా డేంజరస్ ఫీల్డు. అతడి టిప్సు లేకుండా ముందడుగేస్తే ప్రమాదమని తాతయ్య చెప్పాడు నాకు” అని నవ్వాడు సదాశివం.

‘నీ తాతయ్య బంగారం కానూ– ఇంకా నిన్ను అంటిపెట్టుకునే ఉన్నాడన్నమాట!’ అనుకుంటూ,

“ఇంతకీ చిప్‌లో మార్పులకి నీకిచ్చిన అపాయింటుమెంటెప్పుడు?” అన్నాను.

“అదెప్పుడో ఐపోయింది” అన్నాడు సదాశివం. వాడు నిన్న రాత్రి ట్రైనెక్కి ఈరోజు ఉదయం దిగేడు.

వెయిటింగ్ రూములో కాలకృత్యాలు, స్నానం ముగించుకుని సామాను క్లోక్‍రూమ్‍లో పడేసి, ఇలా బజారుకొచ్చేడు. వచ్చిన పని క్షణాలమీద ఐపోయింది. సాయంత్రం ట్రైన్లో వెనక్కి వెళ్లిపోదామని ప్లాను. ఈలోగా అడ్రస్ దొరికితే మమ్మల్ని కలుద్దామని అనుకున్నాట్ట.

“ఇలా పనయింది. అలా నువ్వు దొరికావు. అమ్మను చూసి చాలా రోజులయింది. పద మీ ఇంటికెడదాం” అన్నాడు వాడు ఉత్సాహంగా. ఇద్దరం నా బైక్ మీద మా ఇంటికెళ్లాం.

సదాశివాన్ని చూస్తూనే అమ్మకి మొహం ఇంతయింది. “నువ్వేమిట్రా ఈ ఊర్లో! మా గురించే వచ్చావా ఏమిటి?” అని ఆనందపడి, వదినకేసి తిరిగి, “నే చెబుతుంటాగా, సదాశివం! వాడే వీడు” అని పరిచయం చేసింది.

మామూలుగా సదాశివం పనిమంతుడు. క్షణం ఖాళీగా కూర్చోడు. మా ఇంట్లో ఉండే రోజుల్లో చాలా పనులు వాడే చేసేవాడు. వాడు లేకపోతే అమ్మకి చెయ్యి విరిగినట్లుండేది. ఎప్పుడైనా స్వంతూరెళ్లి వస్తే, వచ్చీరాగానే, “హమ్మయ్య, వచ్చావా? నీకోసమే చూస్తున్నా” అంటూ వెంటనే వాడికి ఏదో పని చెప్పేది అమ్మ. వాడు కూడా ప్రయాణపు అలసటని ప్రదర్శించకుండా చకచకా ఆ పని చేసేవాడు.

ఇప్పుడూ అదే సంప్రదాయాన్ని పాటిస్తూ, మాటవరసకి మంచినీళ్లు కావాలా అనడిగి, “అదిగో ఆ పక్కనుందే, అదే బీరువా గది. తలుపు తియ్యగానే ఎదురుగా కనిపిస్తుందే, ఆ బీరువాలో మధ్య అరలో లాకరుంది. ఆ లాకరు తెరిచీ తెరవగానే, చిన్న దంతపు పెట్టె కనిపిస్తుంది. అందులో ఉంది లాకరు తాళం. అది తేవడం నీవల్లే ఔతుంది” అంటూ అమ్మ సదాశివానికి చిన్న తాళాల గుత్తి అందించి, ఏ తాళం దేనికో వివరించింది.

వాడు తాళాలందుకుని, “బీరువా ఇంట్లోనే ఉంది కదా! ఆ లాకరు తాళం నేనే ఎందుకు తేవాలి?” అన్నాడు.

“వెళ్లు, నీకే తెలుస్తుంది. ఇందాకా నే చెప్పానే, మా ఇంట్లో ఓ పెద్ద సమస్యొచ్చిందని. అది ఇదే!” అన్నాను అమ్మ కూడా దయ్యం విషయంలో గుంభనగా ఉన్నందుకు సంతోషిస్తూ.

సదాశివం మరి మాట్లాడలేదు. కళ్లు మూసుకుని కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయాడు. తర్వాత కళ్లు తెరిచి నెమ్మదిగా బీరువా గది వైపు వెళ్లాడు.

మాలో ఎవ్వరూ కూడా వాడి వెనుక నడవలేదు. వాడు బీరువా గదిలో అడుగెడితే, మేమంతా ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందా అని ఆత్రుతగా చూస్తున్నాం. వాడు లోపలికెళ్లాడు. లోపలి భాగం మా చూపుల పరిధిలో లేదు. కాసేపట్లో బీరువా తెరిచిన చప్పుడయింది. చెవులు రిక్కిస్తే లాకర్ తలుపు తీసిన చప్పుడు కూడా అయింది. మరికొద్ది క్షణాల్లో సదాశివం గది బయటకు వచ్చాడు- చేతిలో లాకరు తాళం అందరికీ కనపడేలా పట్టుకుని!

వదిన మొహం ఇంతయింది. అమ్మ వాణ్ణి, “అనుకున్నాన్రా. ఈ పని నీవల్ల ఔతుందని!” అని అభినందించింది.

నేను ఆశ్చర్యంగా, “గదిలో నీకు ఎవరూకనపడలేదా?” అనడిగాను వాణ్ణి.

వాడు నన్నదోలా చూసి, “లోపల దయ్యమున్న విషయం ముందుగా నాకెందుకు చెప్పలేదు?” అన్నాడు.

అమ్మ చేతిలో లాకర్ తాళం కింద పడిపోయింది. వంగి తాళం తీసుకుంటూ, “మేమైతే పిరికివాళ్లం, భ్రమ అనుకున్నాం. దయ్యం నీకూ కనబడిందా? మరి బీరువా తలుపెలా తీశావు?” అంది ఆశ్చర్యంగా.

“దయ్యాలు కనబడతాయి. భయపెడతాయి. కానీ మనని ఏంచేయలేవు. దేనికీ అడ్డుకోలేవు- అని తాతయ్య చెప్పాడు. నాకు దయ్యం కనబడింది. పళ్లికిలించింది. గుడ్లురిమింది. దాని మానాన అది దాని పని చేసుకు పోతుంటే నేను నా మానాన నా పని చేసుకొచ్చాను” అన్నాడు సదాశివం.

“అంటే దయ్యం ఇంకా అక్కడే ఉందన్న మాట. ఎలాగో అలా దాన్ని అక్కడినుంచి తరిమెయ్యరా బాబూ! నీకున్న ధైర్యం మాలో ఎవరికీ లేదు!” అంది అమ్మ వేడుకోలుగా.

“అది, అది అనకండి. ఈ దయ్యం ఆడది కాదు. మగాడు. ఏదో చెప్పాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. సైగలు అర్థం కాలేదు. గొంతులోంచి కీచుకీచుగా ఏవో శబ్దాలొస్తున్నాయి. వాటి అర్థం తెలియడం లేదు. మీకు కావాల్సింది లాకరు తాళం కదా! ఇదిగో, తెచ్చాను” అంటూ అమ్మకి తాళం అందించాడు.

అమ్మ ఆనందంగా తాళాన్నందుకుని, “తాళం తెస్తే సరిపోదు. దయ్యాన్ని కూడా తరిమెయ్యాలి. దానికీ ఏదో ఉపాయం చూడు” అంది.

సదాశివం ఓ క్షణం ఆలోచించి, “ఈ ప్రపంచానికి మూలం ఎనర్జీ. మనిషి రూపం పాజిటివ్ ఎనర్జీ. దయ్యం నెగెటివ్ ఎనర్జీ. నా దగ్గర ఎన్‌డీల్ అనే పరికరం ఉంది. అందులో నెగెటివ్ ఎనర్జీ శబ్దాల్ని డీకోడ్ చేసి అక్షరాలుగా మార్చి రికార్డు చేసే సదుపాయం ఉంది. ఇప్పుడెళ్లి వివరాలు తెలుసుకొస్తాను” అని మళ్లీ బీరువా గదిలోకి వెళ్లాడు.

దయ్యాలున్నాయంటూనే- అవి మననేంచెయ్యవనీ, చెయ్యలేవనీ నమ్మడమే కాదు, ఋజువు కూడా చేశాడు సదాశివం. ఒకసారి ఆ గదిలోకి వెళ్లి దయ్యాన్ని చూసినా తొణుకూ బెణుకూ లేకుండా లాకరు తాళం తెచ్చిచ్చి, ఇప్పుడు మళ్లీ వెళుతున్నాడు. పైగా దయ్యం మాటలు రికార్డు చేసి, డీకోడ్ చేస్తానని కూడా అంటున్నాడు.

అసలక్కడ దయ్యముందా లేక సదాశివం మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడా? అదే నిజమైతే– అమ్మ, వదిన, అన్నయ్య- ఏదో భ్రమలో పడి అనవసరంగా భయపడ్డారా? అక్కడేం లేదా?!

ఇలాంటి ప్రశ్నలు బుర్రని దొలిచేస్తున్నా కూడా నేను వాణ్ణనుసరించి వెళ్లే సాహసం చేయలేదు. కానీ వాడికి ఏమవుతుందోనని మనసులో పీకుతోంది. ఐతే అమ్మకి అలాంటి బెంగేం ఉన్నట్లు లేదు.

“మూడింటికి రమ్మని ఆటో నరసింహాకి ఫోన్ చేయరా బాబీ! నేనూ, వదినా బ్యాంకుకెళ్లొస్తాం” అంది నాతో.

బీరువా గదిలోంచి రెండు మగగొంతుకలు సన్నగా వినిపిస్తున్నాయి. ఒకటి సదాశివానిది. రెండోది దయ్యానిది కావచ్చు. మేముండే ఈ ఇంట్లోకి చొరబడ్డ ఆ దయ్యం ఎవరిదై ఉంటుందా అని ఆలోచిస్తుంటే, సంజీవరావు గుర్తుకొచ్చాడు.

సంజీవరావు వ్యాపారస్థుడు. వార్తల్లో ఉండాలని తాపత్రయపడే మనిషి. ఏణ్ణర్థం క్రితం మాకీ స్థలం అమ్మాడు. ఈ ఊళ్లో ఉండేది తక్కువ. రెండు వారాలక్రితం కారు ప్రమాదంలో మరణించాడు. అది ప్రమాదం కాదనీ, హత్య అనీ కుటుంబసభ్యులు ఆరోపించారు. హత్య విషయంలో నలుగురు అనుమానితులున్నారు. నలుగురూ రాజకీయవాదులే- అధికారపక్షం వాళ్లిద్దరు, విపక్షం వాళ్లిద్దరు.

అందువల్ల ఈ చావుని రాజకీయం చేసే అవకాశం పోయింది. పోలీసులు అది హత్య కాదనీ, ప్రమాదమేననీ నిర్ధారించి- వారం తిరక్కుండా కేసు మూసేస్తే, కుటుంబసభ్యులూ ఊరుకున్నారు.

“అమ్మా! మన సదాశివం చూసింది- మనకీ స్థలం అమ్మిన సంజీవరావుని కానీ కాదు కదా!” అన్నాను అమ్మతో.

అమ్మ చటుక్కున, “అవున్రా బాబీ! నాకు స్ఫురించనేలేదు. ప్రాణం పోయినా, అమ్ముకున్న స్థలంమీద కూడా మోజు తీరినట్లు లేదు. ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతాడో ఏమో” అంది అమ్మ బెంగగా.

అంతలో సదాశివం గది బయటకొచ్చాడు. బాగానే ఉన్నాడు. వంటిమీద గాయాల్లాంటివేం లేవు. అమ్మ మాటలు విన్నట్లున్నాడు, “మీ ఊహ కరెక్టే పిన్నీ! ఆ గదిలో ఉన్నది ఆ సంజీవరావే! ఆయనకి ఇప్పట్లో ఇక్కణ్ణించి వెళ్లే ఉద్దేశ్యం లేదు. మరోలా పంపిద్దామంటే, ఆయన మంత్రగాళ్లకి లొంగే రకం కాదు. నన్నడిగితే, మీరాయనకి అలవాటు పడ్డం మంచిది. తను మిమ్మల్ని ఏం చెయ్యడని నాదీ గ్యారంటీ” అన్నాడు.

దయ్యానికి అలవాటు పడాలనగానే- అమ్మ, వదిన- ఇద్దరూ ఒక్కసారే ఇంచుమించు ఆర్తనాదం లాంటిది చేశారు. ఐతే అమ్మ కొంచెం తొందరగానే సద్దుకుని, “అంటే ఆయన్ని ఇంట్లోంచి పంపించే ఉపాయమే లేదా?” అంది.

“కంగారు పడకు పిన్నీ! అన్నీ వివరంగా చెబుతాను. కూర్చుని మాట్లాడుకుందాం” అన్నాడు సదాశివం.

అంతా హాల్లో సోఫాల్లో కూర్చున్నాక, “వచ్చిన సమస్యేమిటంటే- ఆ సంజీవరావుకి గుర్తింపు గురించి మహా తాపత్రయం. ఇప్పుడు తన చావునెవరూ పట్టించుకోవడం లేదని కుమిలిపోతున్నాడు. అప్పటికీ తనవాళ్లకి కలలో కనిపించి, తన చావుకి రాజకీయపు రంగు పులిమి, తన పేరు నలుగురి నోళ్లలో నానేలా చెయ్యమని చెప్పేట్ట. వాళ్లు పట్టించుకోకపోతే, ఇదిగో తను స్థలమమ్మిన ఈ ఇంట్లో చేరాడు. ఎవరైనా దగ్గరికొచ్చి అడిగితే, తనని వదుల్చుకునే ఉపాయం కూడా చెబుతాట్ట!” అన్నాడు సదాశివం.

“ఏడ్చినట్లుంది. చెప్పాలనుకుంటే మంచిగా నవ్వుతూ ప్రేమగా పిలవాలిగానీ, ఇలా గుడ్లురిమి పళ్లు పటపటలాడించి హడలగొడితే దగ్గిరకెవరు వెడతారు?” అంది అమ్మ.

సదాశివం నవ్వి, “అందుక్కారణముంది పిన్నీ! సంజీవరావుకి కావాల్సిన పని చేయడానికి బాగా ధైర్యం ఉండాలి. మీలో ధైర్యవంతులు ఎవరో తెలుసుకుందుకే మిమ్మల్నలా భయపెడుతున్నాడు" అన్నాడు.

“సరే, ఇంతకీ ఏం చేయాలిట?” అంది అమ్మ.

సదాశివం వెంటనే, “అదీ ఆయనే చెప్పాడు. మనమో మెసేజ్ వాట్సాప్ చెయ్యాలిట” అంటూ ఆ మెసేజ్ చదివి వినిపించాడు.

‘ప్రముఖ వ్యాపారి సంజీవరావు కారు ప్రమాదంలో మరణించాడు. అది ప్రమాదమా, హత్యా? హత్యే అయితే- కారణాలు వ్యక్తిగతమా, రాజకీయమా? పోలీసులు ఎవరికైనా కాపు కాస్తున్నారా? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలుగా మీకు తోచడం లేదా?” ఇదీ ఆ మెసేజ్!

సదాశివం చదవడం ఆపి, “ఇప్పుడీ మెసేజ్ ఎన్‌డీల్‌లో ఉంది. ఎన్‌డీల్ మొబైల్ కాదు కాబట్టి, ఈ మెసేజ్‌ని నేను ఎక్కడికీ పంపలేను. మీలో ఎవరైనా ఈ మెసేజ్ టైపు చేసుకోండి. ఇంట్లోవాళ్లకి కాకుండా బయటివాళ్లెవరికైనా వాట్సాప్ చెయ్యండి. అక్కణ్ణించి చెయిన్ మొదలౌతుంది. మొదటి వాట్సాప్ ఫార్వర్డుకే, సంజీవరావు మీ ఇల్లొదిలి వెళ్లిపోతాడు” అన్నాడు.

“ఓస్, ఇంతేనా, ఈ మాత్రానికేనా ఆ సంజీవరావు అంత హడావుడి చేశాడు! ఆ మెసేజ్ నీ ఫోన్లోనే టైపు చేసి, అక్కణ్ణించి ఎవరో ఒకరికి నువ్వే ఫార్వర్డ్ చేసి, మాకాయన బెడద వదిలించి వెళ్లు బాబూ" అంది అమ్మ తేలికగా నిట్టూర్చి.

అంతే– ఆర్తనాదం లాంటిది ఒకటి వినిపించింది. ఆశ్చర్యంగా అది సదాశివంనుంచి! అటు చూస్తే అతడి వళ్లంతా వణుకు. కళ్లలో భయం.

“ఏమయిందిరా – నిన్నెప్పుడూ ఇలా చూడలేదు!” అంది అమ్మ ఆశ్చర్యంగా.

సదాశివానికి తేరుకుందుకు కొద్ది నిముషాలు పట్టింది. అప్పుడు నెమ్మదిగా, “మీలో ఎవరి ఫోన్నించి ఈ మెసేజ్ వాట్సాప్ చేస్తారో మీ ఇష్టం! కానీ, అమ్మో – నా ఫోన్ నుంచి మాత్రం ఇలాంటి వాట్సాప్ ఫార్వర్డు చెయ్యడం- నావల్లకాదు” అన్నాడు.

మళ్లీ వాడి గొంతులో వణుకు. కాళ్లలో వణుకు. కళ్లలో భయం.

ఆ మొండివాడు అంతగా భయపడ్డం చూడడం నా జీవితంలో అదే మొదటిసారి!

(మే 2020లో గుంటూరు ప్రాంతంలో జరిగిన- రంగనాయకమ్మ అనే సామాన్య మహిళకు

సంబంధించిన వాట్సాపు ఫార్వర్డు ఉదంతం స్ఫూర్తితో)

---0---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

మూడో సర్టిఫికెట్‌

ఐతే ఓకే అను తారాబలం కథ

కృష్ణగాడి వీర ప్రేమగాథ

ఎదవ బతుకు

నా బిడ్డకి తండ్రి దొరికాడు!

చూడాలని ఉంది

పరాన్నజీవికి కరోనా గీత


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.


62 views0 comments
bottom of page