top of page

మూడో సర్టిఫికెట్‌

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Mudo Certificate' Written By Vasundhara

రచన : వసుంధర


మొదటినుంచి చివరి వరకు ఏకబిగిని చదివించే కథలు కొన్నే ఉంటాయి.

ఆ కోవలోకి చెందినదే , తెలుగువారి అభిమాన మెగా రైటర్ వసుంధర గారు రచించిన మూడో సర్టిఫికెట్‌ కథ.


మంచి నిద్రలో ఉండగా కాలింగ్‌బెల్‌ మ్రోగింది.

ఉలిక్కిపడి నిద్ర లేచాను.

టైం చూస్తే - అర్థరాత్రి ఒంటిగంట.

‘ఈ సమయంలో ఎవరొచ్చి ఇంతలా బెల్‌ మ్రోగిస్తున్నారు చెప్మా’ అని వెళ్లి తలుపు తీస్తే - ఎదురుగా

ఓ యౌవనవతి. చుడీదార్‌ కుర్తాలో ఉంది.

నేనేదో అనేలోగా, “నా పేరు తులసి. లోపలకు రావొచ్చా?” అందామె.

అప్రయత్నంగా పక్కకు తప్పుకున్నాను. లోపలకొచ్చి చనువుగా తనే తలుపు మూసింది.

“ఎవరు నువ్వు?” అన్నాను ఇబ్బందిగా చూస్తూ.

చున్నీ లేదేమో, “అలా చూడకు. నాకిబ్బందిగా ఉంది” అని రెండు చేతులతో ఛాతీ కప్పుకుంది

తులసి.

నిజానికి అంతవరకూ నేనామె వంపుసొంపులమీద దృష్టి పెట్టలేదు. ఐనా ఆమె నన్ను

అనుమానించింది.

అంత అనుమానమున్నప్పుడు - ఇంత రాత్రి వేళ వెతుక్కుంటూ వచ్చి నా గది తలుపెందుకు

తట్టాలి?

ఆలోచిస్తున్నాను - ఈలోగా ఆమె వెళ్లి మంచం పక్కనే ఉన్న ఓ కుర్చీలో కూర్చుంది.

“అర్థరాత్రి. ఆడపిల్లవి. ఇలా ఓ బ్రహ్మచారి గదిలోకి చొరబడ్డం - నీకూ నాకూ మంచిది కాదు”

అన్నాను.

“నీ సంగతి నాకు తెలియదు. నాకు మంచిదే!” అంది తులసి.

తియ్యని గొంతు. నిర్భయత్వం. అందం - ఇవన్నీ నాలో ఏదో తెలియని ఆసక్తిని కలిగిస్తున్నాయి కానీ

నాలో ఏదో భయం.

“నీకు మంచిదా, ఎలా?” అన్నాను.

“నేనొచ్చిందే నీ గురించి తెలుసుకుని సీతకి చెప్పడానికి!” అందామె.

సీత పేరు వింటూనే ఉలిక్కిపడ్డాను.

ఆమె టెన్తులో నా క్లాస్‌మేటు. ఓ ఏడాది ఒకే క్లాస్‌రూంలో కూర్చున్నా - తనూ, నేనూ మాట్లాడుకున్న

సందర్భాలు లేవు.

ఇప్పుడు నేనున్న కంపెనీలోనే తనది హెచ్‌ఆర్‌ వింగు. ఏడాదిగా చూస్తున్నా - మా ఇద్దరికీ

​1

మాట్లాడుకునే ఆవసరం రాలేదు.

పదిరోజుల క్రితం పెద్దలు మాకు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. మాటలన్నీ పెద్దలవి. మావి కేవలం

చూపులు. అదీ ఏదో చూశామన్నట్లు!

సంద్రాయానికి తలొంచినవాళ్లం. మా ఇళ్లే మాకు స్వర్గం. పెళ్లి నిర్ణయాన్ని స్వర్గానికి వదిలేశాం.

స్నేహం, సాన్నిహిత్యం లేవు. కానీ పరస్పరం వివరాలు తెలుసు. అందుకేనేమో, మా ప్రమేయం

లేకుండానే మా పెళ్లి ముహూర్తం పెట్టడందాకా రావడం - నాకు అదోలా అనిపించలేదు. సీతకీ

అనిపించలేదని నమ్మాను కానీ - ఇప్పుడీ యువతి ఎవరు? సీతకు నాగురించి ఏదో

చెప్పాలంటుందేమిటి?

తనని సీత పంపిందా? పంపితే ఎందుకు? నా విషయంలో ఏమైనా అభ్యంతరాలున్నాయా?

“సీత నీకేమౌతుంది?” అన్నాను.

“కూర్చో - అన్నీ వివరంగా చెబుతాను” అందామె.

రూంలో రెండు కుర్చీలున్నాయి. ఓ కుర్చీలో తను.

రెండో కుర్చీలో కూర్చుని, “చెప్పు” అన్నాను.

తులసి నవ్వి, “సీత ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. తన కాళ్ల్లమీద తాను నిలబడింది. అందముంది.

తెలివుంది. పెళ్లి కాదని కానీ, పెళ్లి కాకపోతే ఎలా అని కానీ భయపడాల్సిన అగత్యం లేదు” అని

ఆగింది.

“ఇప్పుడివన్నీ ఎందుకు? మాకు పెళ్లి నిశ్చయమైపోయింది” అన్నాను.

“సీత అలా అనుకోడం లేదు. వరుణ్ణి ఓకే చెయ్యడానికి రెండైనా సర్టిఫికెట్లుండాలనుకుంటోంది”

అంది.

“సర్టిఫికెట్లా - అవేమిటి?” అన్నాను తెల్లబోయి.

“కంగారు పడకు. ఇప్పటికే ఓ సర్టిఫికెట్‌ జాహ్నవి ఇచ్చిందిలే” అందామె.

“జాహ్నవి ఎవరు?” అన్నాను తెల్లబోయి.

“గుర్తు లేదా - టెన్త్తు క్లాసులో సీత క్లాస్‌మేట్‌”

ఆంతే - జాహ్నవి గుర్తుకొచ్చేసింది......

----

పదిహేనేళ్లకే ఇరవైఏళ్ల యువతిలా ఎత్తరిగా ఉండేది జాహ్నవి. క్లాస్‌మేటే కాదు, పక్కింటమ్మాయి

కూడా!

చదువులో కాస్త వీక్‌ ఆని - ఆమె అమ్మా నాన్నా కంబైండ్‌ స్టడీస్‌కి నా దగ్గరకు పంపేవారు.

​2

జాహ్నవి మహా చలాకీ. స్కూల్లో అందరితో కలిసిపోయేది. తిరగడానికి ఎక్కుఅవగా అబ్బాయిలమీదే

మొగ్గు చూపించేది.

అందుకని కొందరు మగరాయుడనీ, కొందరు మగాళ్లపిచ్చి అనీ అనేవారు. మదపిచ్చి అనేవారూ

కొందరున్నారు.

నేనేమో ‘రాముడు మంచి బాలుడు’ టైపు. అమ్మాయిల మాటటుంచి అబ్బాయిలతోనే ఎక్కువ

కలిసేవాణ్ణి కాను. అందుకే జాహ్నవి అంటే నాకు భయం.

జాహ్నవి నన్ను చాలా గౌరవించేది. తనే చొరవ చేసి నాతో మాట్లాడేది.

“అబ్బాయిలు హుషారుగా ఉంటే చలాకీ. అమ్మాయి హుషారుగా ఉంటే తప్పు. ఈ తేడా ఏంటో నాకర్థం

కాదు. కానీ నేనెవర్నీ లెక్కచెయ్యను” అంది కంబైండ్ స్టడీస్ మొదటి రోజునే నాతో.

కొన్నాళ్లయ్యేక, “అమ్మాయిలకి నేనంటే అసూయ. అందుకని అబ్బాయిలతో స్నేహం చేస్తే, వాళ్లు నా

చనువుని అలుసుగా తీసుకుంటున్నారు. మీద చెయ్యేసేవాడొకడు. రెండర్థాలతో మాట్లాడేవాడొకడు”

అంది.

“అలాంటివాళ్లని దూరం పెట్టు” అన్నాను.

“దూరం పెట్టడం సమస్యకి పరిష్కారం కాదు. స్నేహానికి ఆడా మగా తేడా ఏంటని అంతా

అనుకోవాలి. అందుకే ఓపిగ్గా వాళ్లతో కంటిన్యూ చేస్తున్నాను” అంది జాహ్నవి.

‘అది మనల్నొదలదురా, దానికి మదపిచ్చి’ అని అబ్బాయిలనుకోవడం తెలిసిన నేనేమంటాను?

మరికొన్నాళ్లు గడిచేక, “అమ్మాయంటే ఆడతనం కాదు. అబ్బాయిలాగే తనూ ఓ మనిషి. అది

గుర్తించని అబ్బాయిలంటే అమ్మాయిలకి అసహ్యమని వాళ్లెప్పటికి గ్రహిస్తారో?” అని నాదగ్గర

వాపోయింది.

“అమ్మాయిలంతా నీలా ఉండనట్లే, అబ్బాయిలంతా అలానూ ఉండరు” అన్నాను ఏమనాలో

తెలియక.

“నిజమే కదూ! రోజూ నిన్ను చూస్తూ కూడా నాకీ విషయం తట్టలేదేమిటి?” అంటూ జాహ్నవి

చటుక్కున నా పెదాలమీద ముద్దు పెట్టింది.

ఒక్క క్షణం నేనేమైపోయానో నాకే తెలియదు. తేరుకున్నాక ఆమెను పక్కకి తోసి, “ఏమిటిది?”

అన్నాను.

“ముద్దొచ్చావ్‌?” అందామె సింపుల్‌గా.

వళ్లంతా ఏదో సంచలనం. ఐనా నిగ్రహాన్ని కూడగట్టుకుని, “అలగనడం తప్పు. ఇప్పుడు మన

దృష్టంతా చదువుమీదే ఉండాలి” అన్నాను.

“నిజం చెబుతున్నా. నాకు చదువొద్దు, పెళ్లి చేసుకోవాలనుంది” అంటూ దగ్గరగా జరిగింది జాహ్నవి.

“నాతో ఇలా మాట్లాడ్డానికి సిగ్గనిపించడం లేదూ!” అంటూ ఆమెని మళ్లీ నెమ్మదిగా దూరంగా నెట్టాను.

​3

కానీ ఆమెను తాకితేనే నాలో ఏవో ప్రకంపనలు. ఏదో తెలియని తడబాటు.

“ఎందుకో నాకు నీ దగ్గర సిగ్గనిపించదు” అంది జాహ్నవి.

“సిగ్గనిపించకపోతే, నేర్చుకోవాలి? అలవాటు చేసుకోవాలి?” అన్నాను.

అంతే, ఆమె చటుక్కున లేచి నిలబడి వోణీ తొలగించి, “నన్నే చూడు. సిగ్గొచ్చేదాకా ఇలాగే

నిలబడతా” అంది.

నాలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. లేచి నిలబడి ఆమెను బలంగా కౌగలించుకోవాలనిపించింది.

జాహ్నవికి ఉపదేశం చేశాననుకున్నాను కానీ, ఆ ఉపదేశాన్నే నామీద అస్త్రంలా

ప్రయోగిస్తుందనుకోలేదు.

మరికాసేపుంటే ప్రమాదమని వెంటనే అక్కణ్ణించి వెళ్లిపోయాను.

నా వయసు పదిహేనే ఐనప్పటికీ, జాహ్నవి నానుంచి ఏమాశిస్తోందో నాకు అర్థం కాకపోలేదు. ఐతే మా

పెద్దలు పాటించే సంప్రదాయాలు నాకో సంస్కారాన్ని అలవర్చాయి. అలా నాకు కొన్ని ఆదర్శాలు

ఏర్పడ్డాయి.

తప్పు చేసి పశ్ఛాత్తాపపడ్డం కాదు - తప్పే చెయ్యకుండా పవిత్రతని కాపాడుకోవాలన్నది నా

సిద్ధాంతం.

అందుకని జాహ్నవిని తప్పించుకు తిరిగాను. కానీ ఆమె ఊరుకుంటుందా?

“బాబూ! నీతో స్టడీస్‌ మొదలెట్టేక దాని మార్కులు ఇంప్రూవ్‌ అయ్యాయి. ఇబ్బందనుకోక, దానికోసం

కూడా కొంత టైం కేటాయించు” అని నాకు తన తల్లి చేత చెప్పించింది.

స్వతహాగా తెలివైనది. శ్రద్ధగా చదవక, పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చేవి. నేను దూరం పెట్టగానే

బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుని ఆ ఘనత నాకంటగట్టిన విషయం తర్వాత తనే చెప్పింది

నాకు.

తప్పలేదు. మా కంబైండ్‌ స్టడీస్‌ కొనసాగాయి.

సిగ్గు నేర్చుకుంటున్నానంటూ, నాముందు తను చేసే ప్రదర్శన సినిమాల్లో ఐటం డాన్సుని

మించిపోతోంది.

“ఇంట్లో చెప్పనా?” అని బెదిరించాను.

“ఈపాటికే చెప్పాల్సింది. మావాళ్లు నాకు పెళ్లి ప్రయత్నాలైనా మొదలెట్టేవారు” నవ్వింది జాహ్నవి.

ముందు వాళ్లింట్లో చెప్పాలనుకున్నాను. తర్వాత మా ఇంట్లో చెప్పాలనుకున్నాను.

“చెప్పలేవు. నీకు తెలియకుండానే నువ్వూ ఎంజాయ్‌ చేస్తున్నావు” అంది జాహ్నవి.

అది సవాలని తెలిసినా, మా రహస్యం ఎవరికీ చెప్పలేకపోయాను.

ఓ రోజు మా ఇంట్లో నేనొక్కణ్ణే ఉండి చదువుకుంటున్నాను. జాహ్నవి స్టడీస్‌కి వచ్చింది. ఐదు

​4

నిముషాలు తనూ నాతో పాటు పుస్తకం తిరగేసి, ఉన్నట్లుండి వళ్లు విరుచుకుని పుస్తకం పక్కన

పడేసింది.

“చాలా మంచబ్బాయివి. నీకు గిఫ్టివ్వకపోతే నన్ను నేనే క్షమించుకోలేను” అంది ఉపోద్ఘాతంగా.

నేను చిరాగ్గా చూస్తే, “మొహం అలా పెట్టావేంటి? ఎంజాయ్‌ ది గిఫ్ట్‌” అంది.

“పుస్తకం తీసి చదువుకో. లేదూ - మీ ఇంటికెళ్లిపో” అన్నాను.

“ఇది చాలా గొప్ప అవకాశం. ఉపయోగించుకోకపోతే మళ్లీ రాదు” అందామె.

ఆమె కళ్లు ఎర్రబడుతున్నాయి. వళ్లు వణుకుతోంది. అన్నాళ్లలో అలాంటి జాహ్నవిని నేనెప్పుడూ

చూడలేదు.

ఏంచెయ్యాలో పాలుపోని క్షణంలో, ఆమె చటుక్కున నన్ను బలంగా కౌగలించుకుంది. నా పెదాల్ని

తన పెదాలతో అందుకోబోతే, విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నంలో బలం

లేదని నాకే అనిపిస్తున్న సమయంలో ఉన్నట్లుండి ఎలా పుంజుకున్నానో తెలియదు. ఆమెను సాచి

లెంపకాయ కొట్టాను - అంతకుమించిన ఉపాయం తట్టక!

ఆమె నన్ను వదిలేసింది. అదోలా చూసింది. అవమానం పులుముకున్న ముఖంలో అప్పుడప్పుడే

తొంగి చూస్తున్న కోపంతో చురచుర చూస్తూ తన పుస్తకం తీసుకుని చరచరా వెళ్లిపోయింది.

మా కంబైండ్‌ స్టడీస్‌ ఆగిపోయాయి. తర్వాత పెద్ద పరీక్షల ముందురోజు మా ఇంటికొచ్చింది. “మంచి

మార్కులు తెచ్చుకుంటానని నమ్మకంగా ఉంది. క్రెడిట్‌ గోస్‌ టూ యూ. థాంక్స్‌ చెప్పడాని కొచ్చాను”

అంది.

“నువ్వు మారావ్‌! చాలా సంతోషంగా ఉంది” అన్నాను అభిమానంగా.

“నీకలా అర్థమైందా, ఒక్కసారైనా యు ఆర్‌ వెల్కం అని నీచేత అనిపించుకుందామని థాంక్స్‌

చెప్పాను. ఆయాం వెరీ డిజపాయింటెడ్‌”

“సారీ టు డిజపాయింట్‌ యూ. కానీ నేనింతే!” అన్నాను

“ఈ సారీకి సంతోషం. కానీ నాకు ఇంకో సారీ బాకీ ఉన్నావ్‌. అదీ చెప్పేసేయ్‌” అందామె.

అర్థమైంది. “మారావనుకున్నా. కానీ నువ్వు మారలేదు” అన్నాను.

“నేనింతే! సారీ బాకీ ఉన్నావుగా, ఏదో ఓ రోజు అది నీచేత చెప్పించకపోన్లే” అని వెళ్లిపోయిందామె.

ఇప్పుడు తులసి ప్రస్తావించేదాకా జాహ్నవిని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం రాలేదు.

-----

“జాహ్నవి నా గురించి సర్టిఫికెట్టిచ్చిందా - ఏమని?” అన్నాను ఆశ్చర్యంగా.

“కంగారు పడకు. నువ్వు చాలా మంచబ్బాయివనే ఇచ్చిందిలే” అంది తులసి.

​5

“ఇంతకీ ఈ సర్టిఫికెట్లేమిటి? వాటికీ నీకూ సంబంధమేంటి?” అన్నాను కొంచెం చిరాగ్గా.

“ఆడపిల్లవైతే తెలిసేది, ఈ రోజుల్లో వాటి అవసరమెంతో?” అని, “ఇక్కడికి నేనొచ్చింది, నీకు రెండో

సర్టిఫికెట్‌ ఇవ్వడానికి!” అందామె.

“అర్థం కాలేదు”

“అర్థం కావాలంటే - నా కథ వినాలి” అంది తులసి.

-----

తులసి మధ్యతరగతి అమ్మాయి. ఓ కోటీశ్వరుడు వెతుక్కుంటూ వచ్చి మరీ ఆమెని కోడల్ని

చేసుకున్నాడు. పెళ్లి ఊహకందనంత వైభవంగా జరిగితే - తులసి, ఆమె తరఫువారు - ఆమె

అదృష్టానికి మురిసిపోయారు.

భావి జీవితంపై ఎన్నో కలలతో శోభనం గదిలో అడుగెట్టిన తులసికి, మొదటి రాత్రే తెలిసిపోయింది -

భర్త స్వరూప్‌కి ఆడవాళ్లంటే ఏమాత్రం ఆసక్తి లేదని. ఖంగు తిని, “మరి పెళ్లెందుకు చేసుకున్నట్లు?”

అంది ఉక్రోషంగా.

“నా గురించి ఈ నిజం సమాజానికి తెలియరాదు. అందుకే మన పెళ్లి. వంటినిండా నగలు.

బీరువాల్నిండా పట్టుచీరలు. అడుగు కింద పెట్టక్కర్లేకుండా దాస దాసీజనం. వైభవోపేతంగా

జీవించు” అన్నాడు స్వరూప్‌.

వారం, నెల, ఏడాది - తులసికి తన వైభవం తృప్తినివ్వలేదు.

“నాకీ వైభవాలొద్దు. నేను కోరుకున్నది భర్తతో సహజీవనం. అది నీవల్ల కాకపోతే, విడాకులు

తీసుకుందాం” అంది తులసి అతడితో.

“విడాకులిస్తే మా కుటుంబం పరువు మంటగలిసిపోతుంది. కావాలంటే, నేను ఆత్మహత్య

చేసుకుంటాను. అప్పుడు విడాకులు అక్కర్లేకుండానే మరో పెళ్లి చేసుకోవచ్చు నువ్వు” అన్నాడు

స్వరూప్‌ దృఢంగా.

అది ఎమోషనల్ బ్లాక్‌మెయిలని గ్రహించిన తులసి - ఈ విషయం కన్నవారికి చెబుదామనుకుంది.

కానీ వాళ్లు తమ వియ్యాలవారి గొప్పతనాన్నీ, ఔదార్యాన్నీ, కూతురి అదృష్టాన్నీ తలచుకుని

బ్రహ్మానందపడిపోతున్నారు. బంధుగణమంతా తమని చూసి అసూయ పడుతున్నారని

గర్వపడుతున్నారు.

వారి ఆనందంమీద నీళ్లు చల్లడానికి తులసికి మనస్కరించలేదు.

-----

“పాతికేళ్లు నిండకుండానే ముసలిదాన్నైపోయాను. నాకంటూ సుఖాల్లేవు. పిల్లలుండరు. ఇంకా

యాబై అరవైఏళ్లు బ్రతకాలంటే ఏదో ఒక ఆశయముండాలి కదా! అందుకని నేనో నిర్ణయానికొచ్చాను.

నాకులాంటి దౌర్భాగ్యం కలక్కుండా కొందరైనా ఆడపిల్లల్ని కాపాడాలని అనుకున్నాను” అంది

తులసి.

ఆ ప్రకారం, తన ఎరికలో ఎవరికైనా పెళ్లి కుదిరితే, ఆమె ఆ వరుణ్ణి ఏకాంతంలో కలుస్తుంది. అతణ్ణి

​6

రెచ్చగొట్టి పురుషత్వాన్ని నిర్ధారిస్తుంది. తేడా ఉంటే వెళ్లి వధువుని హెచ్చరిస్తుంది.

ఆమెపై కొంత జాలి పుట్టినా, ‘ఇదేం ఆశయం- అదీ ఆడపిల్లకి!’ అని కూడా అనిపించింది.

“అలా నువ్వు తప్పు చేస్తున్నావు. మరో మగవాడిచేత తప్పు చేయిస్తున్నావు. ఓ వధువుకి అన్యాయం

చేస్తున్నావు” అన్నాను.

“ఉప్పూ కారం తినే మామూలు మనిషిని నేను. నా కోరికల్ని చంపుకోలేను. నా ఆశయం నా కోరికకీ ఓ

ప్రయోజనాన్నిస్తుంది. ఓ ఆడపిల్లకి నిండు జీవితాన్నిస్తుంది” అంది తులసి.

“అయితే ఇప్పుడేమంటావ్‌?” అన్నాను.

“అనడానికేం లేదు. నాకు సహకరించు” అందామె.

అప్పుడక్కడ ఆమె మరో జాహ్నవి అయింది.

వయసులో ఉన్నాను. మగాణ్ణి. వయసులో ఉన్న ఆడది నన్ను కోరి వచ్చింది. ఇద్దరికీ ఏకాంతం.

అలాంటి పరిస్థితుల్లో తనువుదే మనసుపై పైచేయి. కానీ లేత వయసులో జాహ్నవిని తట్టుకున్న

అనుభవం మనసుకి బలమైంది. కొద్దిరోజుల్లో నాతో పెళ్లికి సిద్ధంగా ఉన్న సీత రూపం ఆ బలానికి

అదనమైంది.

తులసి ఎన్ని పోకడలు పోయినా చలించకుండా నిబ్బరంగా ఉన్నాను.

“జాహ్నవి సర్టిఫికెట్టిచ్చినప్పుడే, సీతకి నీమీద అనుమానమొచ్చింది. మరో స్వరూప్‌ని కానని ఋజువు

చేసుకుందుకైనా, నువ్వు నాకు సహకరించు” అంది తులసి చివరి ప్రయత్నంగా.

“ఇందులో నీ ప్రసక్తి లేదు. అది సీతకీ, నాకూ మధ్య విషయం” అన్నాను.

“శీలం పోతుందని భయపడకు. నేనొక స్వామీజీనడిగి కొన్ని తాయెత్తులు తెచ్చుకున్నా. తాయెత్తు

చేతికి కట్టుకుంటే, నీకూ నాకూ కూడా పవిత్రతకు భంగం రాదు. భారతంలో దుర్వాసముని

కుంతికిచ్చాడూ, ఆ వరంలాంటిదీ తాయెత్తు. నేనొకటి కట్టుకుని, నీకొకటి కడతాను” అందామె.

“సారీ! నేను మనస్సాక్షిని నమ్ముతాను. తాయెత్తుల్ని కాదు” అన్నాను.

కాసేపు వాగ్వివాదాలాయ్యేక, “నన్ను కాదనకపోతే, నీకు నేనిచ్చే రెండో సర్టిఫికెట్టుతో పోయేది.

కాదనడంవల్ల జాహ్నవి టైంనుంచి ఇప్పటిదాకా నీలో ఏ మార్పూ లేదని నీకు రెండో సర్టిఫికెట్‌

ఇస్తున్నాను. కానీ మూడో సర్టిఫికెట్‌ లేకుండా నీకు సీతతో పెళ్లి జరుగదు” అంటూండగా మళ్లీ

కాలింగ్‌బెల్‌ మ్రోగింది.

ఆమె టైం చూసుకుని, “సీత వచ్చినట్లుంది” అంది.

ఉలిక్కిపడి, “ఏమన్నావ్‌? అన్నాను.

బదులివ్వలేదు. వెళ్లి తలుపు తీసింది. బయటకు చూసి, “వచ్చేవా సీతా!” అంది. చటుక్కున గది

బయటికెళ్లి భళ్లున తలుపు మూసింది.

​7

అప్రతిభుణ్ణై తలుపువంకే చూస్తున్నాను.

బయటేం జరుగుతోంది? సీత నిజంగా వచ్చిందా? తులసి ఆమెతో సర్టిఫికెట్ల గురించి

మాట్లాడుతోందా?

ఆలోచిస్తున్నాను. అంతలో గది తలుపు తెరుచుకుంది.

సీత!

నిజంగానే సీత!

ఆమె లోనికొచ్చి తలుపు మూసింది. నా దగ్గరకొచ్చింది.

ఆశ్చర్యంనుంచి తేరుకుని, “సీతా! నువ్విక్కడ?” అన్నాను.

ఆమె నా కళ్లలోకీ చూసి, “పెళ్లికిముందా, వెనుకా అన్నది కాదు, నాకు మూడో సర్టిఫికెట్‌ చాలా

ముఖ్యం” అని తల దించుకుంది. ఏమనాలో తెలియక అప్రతిభుణ్ణైపోయాను.

చూస్తూండగా ఆమె నా చేతికి తాయెత్తు కడుతోంది. అప్పటికే ఆమె చేతికి ఓ తాయెత్తు ఉంది.

-----

మర్నాడు నిద్ర లేచేసరికి టైం తొమ్మిది కావస్తోంది.

పక్కలో సీత లేదు. తెల్లవారు ఝామున తను వెళ్లిపోతూ నన్ను తలుపేసుకోమనడం లీలగా

గుర్తుంది.

అనుభవం అపూర్వం. కానీ మనసులో తప్పు చేసిన భావన. కానీ ఆ తప్పులో సీత కూడా భాగస్వామి

కావడమూ, ఆ తప్పు ఆమె ప్రోద్బలంతోనే జరుగడమూ కొంత ఊరట! ఏ కారణంవల్లనైతేనేం -

పెళ్లికిముందే తనని తాను అర్పించుకుంది సీత!

వచ్చిన పనైపోయిందనో ఏమో, తను కట్టిన తాయెత్తు తీసుకెళ్లిపోయినట్లుంది. నా చేతికి తాయెత్తు

లేదు.

అదేం చిత్రమో - రాత్రి మామధ్య మాటలు తక్కువ, చేతలు ఎక్కువ.

ఆమె వెళ్లిపోతుంటే - తలుపేసుకున్నానే తప్ప సరిగ్గా బై కూడా చెప్పలేదు. ఇంటికెలా వెళ్లిందో ఏమో!

మొహమాటంగా అనిపించినా, ఓసారి ఫోన్‌ చెయ్యడం కనీస మర్యాద అనిపించి నంబరు నొక్కాను.

“మీరు ఫోన్‌ చేసిన వ్యక్తి ఏ కాల్‌నూ స్వీకరించుటలేదు.....” అని మొదలైంది.

ఫోన్‌ తియ్యడానికి మొహమాటపడుతోందా? రాత్రి జరిగిందానికి సిగ్గుపడుతోందా?

జరిగిందానికి బాధపడుతుంటే కనుక, ఆ బాధకు కారణం నేనూ కనుక, ఆమె నోదార్చడం నా బాధ్యత!

ఏమని ఓదార్చాలా అని ఆలోచిస్తుండగా ఫోన్‌ మ్రోగింది. చూస్తే సీత!

​8

నాలో ఉద్వేగం. భయం. అపరాధభావన......

“సీతని మాట్లాడుతున్నాను. ఫోను వెంటనే తియ్యనందుకుసారీ! అనుకోకుండా వైజాగ్‌

వెళ్లాల్సొచ్చింది....”

“వైజాగా, ఎప్పుడు?”

“మొన్న రాత్రి నా క్లోజ్‌ ఫ్రెండ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు, నిన్న పొద్దుట తెలిసింది. వెంటనే కాబ్‌

బుక్‌ చేసుకుని ఆదరాబాదరాగా వెళ్లాను. అంకుల్‌, ఆంటీ ఒకటే ఏడుపు. కనీసం రేపటిదాకా వెనక్కి

రాలేను. ఫోనెందుకు చేశావ్‌?”

నిన్న వైజాగ్‌ వెడితే, తనింకా అక్కడే ఉంటే - మరి నిన్న రాత్రి నా గదికెలా వచ్చింది?

ఆలోచిస్తూనే, “ఇంతకీ ఆ ఫ్రెండెవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?” అన్నాను.

“ఆమె పేరు తులసి. అదంతా ఓ పెద్ద విషాద గాథలే!” నిట్టూర్చింది సీత.

నాకు షాక్‌, “తులసి అంటే - ఆ స్వరూప్‌ భార్యా?” అన్నాను.

సీత గొంతులో ఆశ్చర్యం, “స్వరూప్‌ నీకెలా తెలుసు?” అంది.

నాకు నోట మాట రాలేదు. అంటే నిన్న రాత్రి నన్ను కలసిన తులసి సీతకి క్లోజ్‌ఫ్రెండ్‌! ఆమె మొన్న

రాత్రి ఆత్మహత్య చేసుకుందని సీత చెబుతోంది.

నన్ను కలిసిందెవరు? సీతకి నా గురించి మూడో సర్టిఫికెట్‌ ఇవ్వడానికొచ్చిన తులసి ఆత్మ

అనుకోవాలా?

ఆత్మయితే అనుకున్నచోటకి వెళ్లగలదు. అనుకున్న రూపాన్ని పొందగలదు....

నిన్న రాత్రి జరిగింది తలచుకుంటే ఇప్పుడు నా వళ్లు జలదరిస్తోంది. ఐతే - ఆ విశేషాల్లో మూడో

సర్టిఫికెట్టుకి నా శీలం చెడదన్న తులసి హామీతో సహా - అంతవరకూ నాక్కలిగిన సందేహాలెన్నింటికో

సమాధానాలు కూడా ఒకొక్కటిగా స్ఫురించసాగాయి.....

---0---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.


82 views1 comment

1 Comment


కథనం బాగుంది కాని ఒక అతీంద్రయ శక్తి సర్టిఫికేట్ ఇవ్వడం

వాస్తవానికి దూరంగా వుంది.

Like
bottom of page