top of page

ఐతే ఓకే అను తారాబలం కథ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


'Aithe Ok Anu Tharabalam Katha' written by Vasundhara

రచన : వసుంధర

చేసేది తప్పా ఒప్పా అన్న మీమాంస వచ్చినప్పుడు- మనసెప్పుడూ తప్పు వైపే మొగ్గుతుంది. అది తప్పు కాదనీ, ఒప్పనీ నిర్థారించడానికి- సంజాయిషీలు వెదుకుతుంది. కానీ మనకి మనం ఇచ్చుకునే సంజాయిషీలు మనసుకి తృప్తినివ్వవు.

ఆ సంజాయిషీ విని, ‘ఐతే ఓకే’ అనే ఓ పెద్దమనిషిని గురువుగా స్వీకరించాలి. ఆ పెద్దమనిషి నిజంగా పెద్దమనిషి కానక్కర్లేదు. పెద్దమనిషని మనం నమ్మితే చాలు.

ఆఫీసరు ఓకే చేస్తే కింది ఉద్యోగి ఫైల్సుని తారుమారు చెయ్యొచ్చు. నాయకుడు ఓకే చేస్తే పార్టీ సభ్యుడు నోటికి వచ్చినట్లు మాట్లాడొచ్చు. కెప్టెన్ ఓకే చేస్తే, వరుసగా ఫెయిలయ్యే ఆటగాణ్ణి టీంలోకి తీసుకోవచ్చు.

ఇదే సిద్ధాంతం చిత్రసీమలో ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కాస్టింగ్ కౌచ్‌కీ వర్తిస్తుంది.

కళాసేవ పేరిట ఓ ఆడపిల్లని చేరదీసినవాళ్లు- ఆదిలో ‘పక్కన నువ్వుంటే’- అని ఊరించే కబుర్లు చెప్పి- చివరకు ‘పక్కలో నువ్వుంటేనే’ భవిష్యత్తు అని తేల్చెయ్యడాన్ని ఆంగ్లంలో ముద్దుగా ‘కాస్టింగ్ కౌచ్’ అంటారు. తెలుగులో తారాబలం అనొచ్చేమో. అంటే అది తారకు బలం అని కాదు. తారని అబలని చేసే ప్రక్రియ. తార ప్లస్ అబలం- సవర్ణ దీర్ఘసంధి.

చిన్నప్పట్నించీ నేను కాస్త డిఫరెంటు. సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన పనులు చాలానే చేసేదాన్ని. నా సంజాయిషీలు నాన్నకీ, చిన్నాన్నకీ, అత్తకీ నచ్చేవి కాదు. అమ్మ ఒక్కతే అవి విని, ‘అలాగా, ఐతే ఓకే’ అనేది. అందుకని నాకు పదమూడేళ్లొచ్చేదాకా, అమ్మని అలాంటి పెద్దమనిషిగా ఎంచుకుని గురువుగా స్వీకరించాను.

ఆతర్వాత ఇంట్లో నాకే పెద్దమనిషిగా గుర్తింపొచ్చేసింది. అప్పట్నించీ అమ్మలో మార్పొచ్చింది. నా సంజాయిషీల్ని ఓకే చెయ్యడం మానేసింది. “ఇన్నేళ్లూ నిన్ను సమర్థించాను. ఇప్పుడు పెద్దదానివయ్యావు. ఇక నీ పద్ధతులు మార్చుకోవాలి” అని మందలించింది కూడా.

నన్ను సమర్థించిందని గురువుగా స్వీకరించాను కానీ, నేను మారడానికా? నేను మారకూడదంటే గురువునే మార్చాలనుకున్నాను. ఆ వెంటనే నాకు నేతాజీ స్ఫురించాడు.

నాకు ఎనిమిదేళ్లప్పుడు మా బడి వార్షికోత్సవం వేడుకలో- ఆడపిల్లలు మాత్రమే పాల్గొన్న ‘పాదుకా పట్టాభిషేకం’ నాటికలో భరతుడి వేషం వేశాను. ఆ రోజు సభకి ముఖ్యఅతిథిగా రావడమే కాక నాటికలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించిన నేతాజీ ఉత్తమ నటనా పురస్కారానికి నన్నెన్నుకున్నాడు. తర్వాత రెండ్రోజులకే ఆయన సకుటుంబంగా మా పక్కింటికి రావడంతో మా రెండు కుటుంబాలకీ మంచి పరిచయమైంది.

నేతాజీ ఆస్తిపరుడు. డిగ్రీ ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ హైదరాబాదు వెళ్లి చివరకు సినీరంగంలో నటుడు, నిర్మాత, దర్శకుడుగా వేళ్లూనుకున్నాడు. భార్యాబిడ్డల్ని

సినీరంగానికి దూరంగా ఉంచాలని మా ఊళ్లో మా ఇంటిపక్క ఇల్లు కొన్నాడు. ఆయనకి ఇద్దరాడపిల్లల తర్వాత పుట్టిన కుమార్‌ నాకంటే రెండేళ్లు పెద్ద.

ఎక్కువగా హైదరాబాదులోనే ఉన్నా వారానికి కనీసం ఓ రోజైనా మా ఊరొచ్చేవాడాయన.

ఆయనకి నేనంటే ప్రత్యేకాభిమానం. “మున్ముందు మీ అమ్మాయి గొప్ప సినీ నటి ఔతుంది” అన్నాడు మా వాళ్లతో.

నేను తెగ సంబరపడ్డాను. కానీ అమ్మ ఆలోచనలు కొన్నేళ్లు ముందుకు వెళ్లాయి. ఆమె ఆయనతో, “అది సినీనటిగా పేరు తెచ్చుకుంటే సంతోషమే. ఆ పేరేదో బాలనటిగా ఇప్పుడొస్తే బాగుంటుంది. మధ్యతరగతివాళ్లం. వయసొచ్చేక ఆడపిల్లని సినీరంగానికి పంపలేం కదా” అంది.

నేతాజీ ఆలోచనలు వేరే ఉన్నాయి, “ఇప్పుడు పాప సినీరంగంలో ప్రవేశిస్తే బాలనటిగా ముద్ర పడిపోతుంది. ఒకటోరెండో మినహాయింపులున్నా, బాలనటిగా రాణించి హీరోయిన్లుగా ఎదిగిన బాలనటీమణులు తక్కువ. పాప విషయంలో పాతకాలం ఆలోచనలు మానుకోండి.

తను నటి అయ్యాక మీరిక మధ్యతరగతిలో ఉండరు. ఓకేనా?” అన్నాడు.

నాకా మాటలు నచ్చాయి. అప్పుడే ఆయన్ని మానసికంగా గురువుగా స్వీకరించాలనిపించింది కానీ, అమ్మ నా సంజాయిషీల్ని ఇంకా పూర్తిగా కొట్టిపారెయ్యడంలేదు కాబట్టి, తన స్థానం తనకే ఉంచాను.

హైదరాబాదు నుంచి వచ్చినప్పుడల్లా నేతాజీ నన్ను చేరదీసి కబుర్లు చెప్పేవాడు. వాటిలో ఎక్కువ సినిమావే ఉండేవి. “సినీరంగం ఓ వైకుంఠపాళీ. అక్కడ నిచ్చెనలతో పాటు పాములూ ఉంటాయి. విచిత్రమేమిటంటే బయటకు నిచ్చెనలే కానీ పాములు కనిపించవు. వాటిని గుర్తించడానికి వివేకముండాలి. అనుభవజ్ఞుల సలహాలుండాలి. సరైన సమయంలో సరైన సలహాలు నీకు నేనిస్తానులే” అంటూ నాకు సినీరంగం పట్ల బాగా అవగాహన కలిగించేవాడు.

అప్పుడు నా కళ్లముందు నా భవిష్యత్తు కనబడేది. అందులో సూపర్‌ స్టార్‌గా నేను!

నేతాజీగారబ్బాయి కుమార్‌ నాకో మంచిమిత్రుడు. తను బాగా చదివేవాడు. మేమిద్దరం కంబైండ్‌ స్టడీస్‌ చేసేవాళ్ళం.

అబద్ధమెందుకూ, నేను చదువులో వీక్‌. మేకప్‍మీద శ్రద్ధ ఎక్కువ. మోడ్రన్ డ్రెస్సులు ఇష్టం. సాగినంతవరకూ సాగించుకునేదాన్ని. నా దృష్టంతా మోడలింగ్‌, టివి, సినిమాలు వంటి గ్లామర్‌ ప్రపంచంమీదే ఉండేది.

కుమార్‌ నాకు క్లాసు పాఠాలు అర్థం చేసుకోవడంలో సాయపడేవాడు. కానీ నాకు పన్నెండేళ్ల వయసొచ్చేసరికి కుమార్‌ ప్రవర్తనలో మార్పొచ్చింది. నన్నేదోలా చూసేవాడు. ఏవేవో మాట్లాడేవాడు. ఆ మాటలు నాకూ ఆసక్తికరంగా ఉండేవి. కొన్నాళ్లయ్యేక మాటల్లాంటివే, చేతలూ మొదలెట్టాడు.

తప్పని తెలుసు. ఎందుకో వారించలేకపోయేదాన్ని. కానీ ఒకసారి వాళ్లింట్లో మేమిద్దరం మాత్రమే ఉన్నప్పుడు తను హద్దులు దాటుతున్నట్లనిపించి సాచి లెంపకాయ కొట్ట్టి మా ఇంటికి పారిపోయాను. తర్వాతనుంచి అతణ్ణి కలవడం మానేశాను.

అది మిగతావాళ్లెవరికీ తెలియలేదు కానీ, నేతాజీ పట్నంనుంచి వచ్చినప్పుడు పసి కట్టేశాడు. నన్నోసారి పిలిచి కారణ మడిగాడు. ఆయన దగ్గర నాకు అరమరికలు లేవు కాబట్టి జరిగింది జరిగినట్లే కాకపోయినా ఊహకందేలా చెప్పాను. ముందాయన ఆ విషయం తనకు మాత్రమే చెప్పానని రూఢి చేసుకున్నాడు.

“ఇలాంటప్పుడే ఆడపిల్లకి గుట్టు అవసరం. చాలా తెలివిగా వ్యవహరించావు. కుమార్‌కి దూరంగా ఉంటున్నావే, అదీ చాలా మంచి నిర్ణయం” అని మెచ్చుకున్నాడు.

కుమార్‌ని ఒక్క మాటనలేదు కానీ, “వాడు నీ జోలికి రాకుండా కౌన్సిలింగ్‌ ఇస్తాన్లే” అన్నాడు. ఆయనేం చేశాడో తెలియదు కానీ కుమార్‌ మళ్లీ నన్ను కన్నెత్తి చూడలేదు.

నాకు పదిహేనేళ్లప్పుడు నేతాజీ ఇంటికి సోమనాథ్‌ వచ్చాడు. అతడికి సినీరంగం పట్ల ఆసక్తి. అందుకు ముందుగా ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తీసి యూట్యూబులో పెట్టి బాగా లైక్స్‌ తెచ్చుకోమని నేతాజీ సలహా ఇచ్చేట్ట. సోమనాథ్‌ కన్ను నామీద పడింది. షార్ట్‌ ఫిల్మ్‌లో నటించమన్నాడు. కథ ఎంపిక చెయ్యమంటూ మూడు కథలు చెప్పాడు. అన్నీ రొమాన్సూ, సెక్సూ కలగలిసినవే.

వినాలంటే సంకోచం నాకు.

“సినీరంగంలో రాణించాలంటే, ముందు ఇలాంటివి వినడం అలవాటు చేసుకోవాలి” అన్నాడు.

ఏమనాలో తెలియక, “మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు” అన్నాను.

సోమనాథ్‌ నవ్వి, “నీకు తెలుసో తెలియదో, రొమాన్సు గురించి మాట్లాడుకోవడం పెద్దలకీ ఇష్టమే. ఎప్పుడైనా చాటుగా వాళ్ల మాటలు విని చూడు. నీకే తెలుస్తుంది” అన్నాడు.

అప్పటికే అలా నాలుగైదు సార్లు విని ఉన్నాను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. “కానీ వాళ్లు పెద్దవాళ్లు” అన్నాను పెద్దలకు అది సహజమని అంగీకరిస్తూ.

సోమనాథ్‌ మళ్లీ నవ్వాడు. “వాళ్లు పెద్దవాళ్లని నువ్వొప్పుకున్నావు. మరి నువ్వూ పెద్దదానివే. అది వాళ్లు ఒప్పుకోవాలి. కానీ పెద్దలు తమ చాటున పెరిగే పిల్లల ఎదుగుదలని గుర్తించరు. ఇది ఆడపిల్లల విషయంలో మరింత నిజం. ఇష్టమైనట్లు బట్టలేసుకుందుకు లేదు. మాట్లాడ్డానికి లేదు. ఆఖరికి కాస్త ఎక్కువగా నవ్వినా తప్పేనంటారు. ఈ ఆంక్షలు భరించలేకే, అందమైన అమ్మాయిలు స్వేచ్ఛకోసం సినీ ప్రపంచంవైపు పరుగు తీస్తున్నారు.

అక్కడిలాంటివి సర్వసాధారణం. ఒకసారి అక్కడ స్థిరపడ్డావనుకో, ఆ తర్వాత నువ్వేంచేసినా పెద్దలు కూడా నిన్నేమనరు” అన్నాడు.

నిజం చెప్పొద్దూ, అప్పుడు నాకు సినీరంగమంటే చెప్పలేనంత మోజు పుట్టింది. నటిగా రాణించడంకంటే - ఆడపిల్లగా వయసుకు తగ్గ స్వేచ్ఛని అనుభవించాలన్న కోరిక అందుకు కారణం.

సోమనాథ్‌ తెలివైనవాడు. షార్ట్‌ ఫిల్మ్‌ గురించి అతడు మా అమ్మకి చెప్పే కథలు వేరు. నాకు చెప్పేవి వేరు. షూటింగ్‌ చేసేక నాకు తెలిసిన విడియోలు వేరు. అమ్మ చూసేవి వేరు. ఆ విషయంలో నేనూ అతడికి సహకరించాను. నేను దేనికి సహకరిస్తున్నానో తెలియక, అమ్మ కూడా నన్ను ప్రోత్సహించేది.

ఐతే చాలాకాలం సోమనాథ్‌ హద్దులు దాటలేదు. వస్త్రధారణలో, శరీర ప్రదర్శనలో నాకున్న సంకోచాల్ని తొలగించే టంతవరకే అతడి చిత్రీకరణ ఉండేది. అతడు నామీద తీసిన పాటల విడియోలు కొన్నింటిని చూసుకుని- వెండితెర తారలకు నేనే మాత్రమూ తీసిపోననే నమ్మకం నాలో కలిగింది.

అతడి మాటల్లో రొమాన్సు ఉన్నా- పెద్దవాళ్ల మాటల్లాగే సభ్య పదజాలాన్నే వాడేవాడు. మూడు వారాల్లో మా మధ్య చనువు బాగా పెరిగింది. అది అతడివైపునుంచి చొరవకు దారితీసింది. ఓ రోజు సోమనాథ్‌ చొరవ కొంచెం ఎక్కువైతే, కుమార్‌ని కొట్టినట్లే అతణ్ణీ సాచి లెంపకాయ కొట్టి పారిపోయాను.

తేడాఅల్లా కుమార్‌ని కోపంతో కొట్టాను. సొమనాథ్‌ని భయంతో కొట్టాను- అతణ్ణి ఆపకపోతే నేనే లోంగిపోతానేమోనని నా భయం!.

మధ్యతరగతి ఆడపిల్లని. సంప్రదాయం వయసునీ, మనసునీ కూడా శాసించగలదు. ఐనా అప్పుడైతే కుమార్ని దూరం పెట్టేశాను. కానీ ఇప్పుడు సోమనాథ్‌కి ముఖం చాటేస్తే

ముందు మా ఇంట్లో అమ్మకే అనుమానమొస్తుంది. అడిగితే ఏంచెప్పాలి? నా సమస్యను పరిష్కరించడానికే అన్నట్లు ఆ మర్నాడే నేతాజీ వచ్చాడు.

నేను చెప్పింది విని, “సినీ సంప్రదాయాలు వేరని ముందే చెప్పానుగా! అక్కడ ‘కాస్టింగ్ కౌచ్’ సాధారణం. దాన్ని మేము గుంభనగా తారాబలం అంటాం. అంటే తార అబలగా ఉంటేనే తారగా బలపడుతుందని! రెండుమూడేళ్లలో సినీరంగానికొస్తున్నావు కాబట్టి, ఇది నీకు అదృష్టవశాత్తూ దొరికిన ట్రయినింగనుకో! నీ జాగ్రత్తలో నువ్వుంటూ, సోమనాథ్‌కి అందీఅందకుండా ఆ ప్రోజెక్ట్‌ పూర్తి చెయ్యి. ఒక విషయం నమ్మకంగా చెప్పగలను. సోమనాథ్‌ టాలెంటెడ్‌. ఆ షార్ట్‌ ఫిల్మ్‌ హిట్టవుతుంది. నీకూ పేరొస్తుంది. ఎటొచ్చీ నువ్వతణ్ణి భరించక తప్పదు. ఫిల్ము హిట్టయితే చాలు, అన్నీ ఓకే” అన్నాడు.

ఆయన సోమనాథ్‌ని ఒక్కమాట కూడా అనలేదు. ఆ క్షణంనుంచీ ఆయనే నాకు గురువయ్యాడు. అప్పుడు నా ఉత్సాహమింతా అంతా కాదు. హద్దుల్లో ఉంటూ- ఆడా మగా ఎంత చనువుగా ఉన్నా తప్పు కాదనే ఓ కొత్త సంస్కృతిని నేనప్పుడు స్వాగతించాను. గ్లామర్‌ ప్రపంచంలో

ఆడదానివైపు చూసే ఆకలి చూపుల్ని భరించగల సహనాన్నీ నేర్చుకున్నాను.

అందువల్లనే ఇంటర్‌ కాగానే చదువుకు స్వస్తి చెప్పి నాకై నేనుగా గ్లామర్‌ ప్రపంచంలో అడుగెట్టగలిగాను. బహిరంగ రహస్యాల్ని కూడా ఇంకా ఎవరికీ తెలియనట్లు నటించగల కాపట్యాన్ని అలవర్చుకున్నాను. ఇప్పటి ఈ స్థాయికి ఎదగడానికి మధ్యమధ్య తప్పటడుగులు వేసినా, నేతాజీకి చెప్పుకుని, ఆయన చేత ఓకే అనిపించుకుంటూ - విలువలకు కొత్త నిర్వచనాల్ని ఇచ్చుకుంటున్నాను.

నే చేసిందానికి నా గురువు నేతాజీ ఓకే అంటే చాలు. దేనికైనా తెగించగల ధైర్యముంది. బరి తెగించానని నా గురించి కన్నవారే అన్నా లెక్క చెయ్యను. నేతాజీకి ఓకే కాకపోతే ఆయనకు మాత్రం సంజాయిషీ ఇస్తాను. అదీ ఓకే కాకపోతే, తప్పొప్పుకుని దిద్దుకుంటాను. అలాగని ఆయనకు మాటిచ్చాను కూడా.

పాతికేళ్ల వయసు దాకా ఆ మాటను నిలబెట్టుకున్న నాకిప్పుడు అనుకోకుండా అగ్నిపరీక్ష వచ్చింది.

అప్పటికి నాకు టివి షోలలో కొంత పేరొచ్చింది. సినీనటిగానూ కొంత గుర్తింపొచ్చింది. ఐనా ఇంకా శతకోటి లింగాలలో నేనూ ఓ బోడి లింగాన్ని. మంచి బ్రేక్‌ కోసం చూస్తుండగా - ఒకరోజు ఓ స్టుడియోలో ప్రవీణ్‌ అనే కొత్త యువనిర్మాత నన్ను పలకరించాడు. “కొత్తమ్మాయిని పరిచయం చెయ్యాలనుంది. ఓసారి మా ఇంటికొస్తే అన్నీ మాట్లాడుకుందాం” అని ఆహ్వానించాడు.

అప్పటికే నాకీ గ్లామర్‌ ప్రపంచంలో ఆరేడేళ్ల అనుభవముంది. అతడి చూపుల్లో కాంక్షని ఇట్టే పసిగట్టాను.

“నేను ఇండస్ట్రీకి కొత్త కాదు. నా వయసు కూడా పాతికేళ్లు. ఇప్పుడు నన్నేం పరిచయం చేస్తారు?” అనేశాను.

నేను బాగా రాటుదేలినదాన్ని అని గ్రహించడానికి ఆ సమాధానం చాలు. కానీ అతడివద్ద జవాబు రెడీగా ఉంది, “నువ్వు సినిమాల్ల్లో చిన్నచిన్న వేషాలేస్తున్నావని తెలుసు. కానీ ఇలాంటమ్మాయిని తెలుగు తెర ఇన్నేళ్లెలా నిర్లక్ష్యం చేసిందని అంతా ముక్కుమీద వేలేసుకునే రూపలావణ్యాలు నీవి. నా మూడు గంటల సినిమాలో నీకో గంట కేటాయిస్తాను. ఆ గంటలో ముప్పైఐదు నిముషాలు హీరో పక్కనే ఉంటావు” అన్నాడతడు.

నాలో ఆశ పుట్టింది. అతడింటికి వెళ్లాను.

ముందుగా ప్రవీణ్ ఓ రొటీన్‌ కథని కొత్త కథ అన్న బిల్డప్‌తో క్లుప్తంగా వినిపించాడు. తర్వాత హీరోకీ నాకూ ప్లాన్‌ చేసిన రొమాంటిక్‌ సీన్లకి ఒరిజినల్‌ ఫారిన్‌ విడియోలు కొన్ని చూపించాడు.

అవి ఆ సమయంలో నన్ను రెచ్చగొట్టడానికా అన్నట్లున్నాయి. అవి చూడ్డమయ్యేక నా భుజంమీద చెయ్యి వేశాడు.

ఆ చేయి మృదువుగా తొలగించి, “మన సినిమా మొదటి క్లాప్‌ తర్వాత మనం మళ్లీ మాట్లాడుకుందాం” అని లేచాను.

“అప్పుడే వెళ్లిపోతే ఎలా? నీకో ఆల్బం చూపించాలి” అంటూ ఓ ఫొటో ఆల్బం తెచ్చాడు ప్రవీణ్.

ఏం చూడాల్సొస్తుందోనని జంకాను కానీ, అది అతడి కాబోయే పెళ్లి ఫొటో ఆల్బం. ఫొటోల్లో వరుడి స్థానంలో ప్రవీణ్‌. వధువు స్థానంలో అందంగా అలంకరించిన నిలువెత్తు అమ్మాయి బొమ్మ. ఆ బొమ్మకి ముఖం కనిపించకుండా మేలిముసుగుంది. ఆల్బం చివరి పేజీలో నా ఫొటో చూసి ఆశ్చర్యపడ్డాను.

“పెళ్లి గురించి నా కలల ప్రతిరూపమే ఈ ఆల్బం. ఇందులో కనిపించే బొమ్మకి మేలిముసుగు తీసేస్తే- అది నువ్వు” అన్నాడతడు.

“వెరీ రొమాంటిక్‌” అనుకుంటూ, “మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?” అనడిగాను ఆశ్చర్యంగా.

అంతవరకూ నన్ను ఇష్టపడ్డవాళ్లే తప్ప పెళ్లి చేసుకుంటానన్నవాళ్లు లేరు.

నా ప్రశ్నకి అతడిచ్చిన బదులు ఏ యువతికైనా గర్వకారణం.

“నీకు తెలియదు కానీ నిన్ను తొలిచూపులోనే ప్రేమించాను. ఇప్పుడే ప్రపోజ్‌ చేస్తే, అంతా

నీకది గొప్ప వరం అనుకోవచ్చు. అది నాకిష్టంలేదు. నువ్వో పెద్ద హీరోయినువై, దేశంలో కోట్లాది అభిమానులు ఉన్నప్పుడు నా ప్రపోజల్‌కి ఒప్పుకుంటే, అది నాకు వరమని అంతా అనుకుంటారు. నేను నీకు వరమిచ్చే దేవుణ్ణి కాకూడదు. నువ్వు నాకు వరమిచ్చే దేవతవు కావాలి. అందుకే నేను నిన్ను హీరోయిన్ని చెయ్యడానికే సినిమా తియ్యాలనుకున్నాను. అది కూడా నీకు వరమిస్తున్నట్లు కాదు. ఓ మహానటిని తెలుగు తెరకి అందించిన గౌరవం నేనే దక్కించుకోవాలన్న తాపత్రయం” అన్నాడు.

ములగచెట్టు ఎక్కేస్తుండగా, “సినీరంగంలో అంత సులువుగా ఎవర్నీ నమ్మద్దు. ఒకోసారి రిస్కు తీసుకోవాలి. దెబ్బ తిన్నా తట్టుకోగల మనోస్థయిర్యముంటేనే ఆ రిస్క్‌ ఓకే” అన్న నేతాజీ హెచ్చరిక గుర్తుకొచ్చింది.

ఆ హెచ్చరికవల్లనే, అంతవరకూ ఆశపెట్టి నమ్మించిన మోసాల్ని తట్టుకున్నాను. కానీ ఇలా అడక్కుండానే, అదీ ఇంత మనోహరంగా, పెళ్లి ప్రపోజల్‌ చేసిన మొదటి మనిషి ప్రవీణ్‌.

దానికి పడిపోయాను.

నెల్లాళ్లు ఇద్దరం చాలా సన్నిహితంగా మసిలాం. మగాడు నాకు కొత్త కాదు కానీ, ఒక్క మగాడిలో అన్ని రకాల సరదా లుంటాయని తెలియడం మాత్రం కొత్త.

తర్వాత ప్రవీణ్‌ మొహం చాటెయ్యసాగాడు. తన సినిమాలో అప్పటికే పేరున్న ఓ ముంబై తారని ఎంపిక చేసినట్లు కూడా తెలిసింది.

నేనూరుకోలేదు. వెంటనే కలుసుకుని, ఇస్తానన్న హీరోయిన్‌ ఛాన్సు గురించి నిలదీశాను.

“ఏంచేసేది? నీ ఫొటోకి, ఒక్కడంటే ఒక్క బయర్‌ దొరకలేదు” అని నెపం నామీదకు

నెట్టేశాడు. ఆ గొంతులో బయర్‌ దొరకలేదన్న బాధ లేదు. ‘ఆ విషయం నేను చెప్పాలా?’ అన్న తేలిక భావం ఉంది.

“బయర్స్‌ సంగతి సరే, నీ విషయం చెప్పు. మన పెళ్లన్నావుగా, ఆ మాటేమిటి?” అన్నాను ఉక్రోషంగా.

“పెళ్లి విషయంలో ఇప్పటికీ నాది అదే మాట! ముందు నువ్వు పెద్ద హీరోయిన్‌వి కావాలి. అప్పుడే నేను నీకు ప్రపోజ్‌ చేసేది” అన్నాడు ప్రవీణ్‌. అది తనిచ్చిన మాటలా కాక, నాకు సవాలులా ఉంది.

“నమ్మి దగ్గరైనందుకు ఇలా మోసం చేస్తావా?” అన్నాను అసహాయంగా.

“నెల్లాళ్లలో నీమీద ఆరు లక్షలు ఖర్చు చేశాను. నేను మోసగాణ్ణా?” అన్నాడు ప్రవీణ్‌.

పెళ్లి అన్నాడని దగ్గరైతే, దగ్గరైందానికి వెలకట్టి నన్ను వెలయాల్ని చేశాడని కడుపు మండింది. రక్తం మరిగింది. ఐనా ఛీకొట్టడం మినహా ఏంచెయ్యలేకపోయాను.

కానీ అక్కసు ఉంటుందిగా - అది భీమన్న దగ్గర కక్కాను.

భీమన్న మగాడు కాని మగాడు. ఆడవాళ్ల్లతో ఆడదానికిలా కలిసిపోతాడు. అందుకో మరెందుకో కానీ– సినీ రంగంలో మహామహా మగాళ్ల దగ్గరే వాడికి బాగా చనువుంది.

భీమన్న నా బాధ విని, “జీవితానికి సరిపడ సరదాలు నెల్లాళ్లలో తీర్చేశావుట. ఇంకా ఏం మిగిలిందని నిన్ను పెళ్లి చేసుకుంటాడు!?” అన్నాడు. అది భీమన్న మాట కాదు. అతడి నోట పలికిన ప్రవీణ్‌ అభిప్రాయం.

నమ్మిన ఆడపిల్ల ప్రియుణ్ణి దేవుడిగా భావించి సర్వస్వం అర్పించింది. ఆ ప్రియుడు కేవలం మగాడిలా స్పందించాడు. అప్పుడా ఆడపిల్ల ఏంచెయ్యాలని ఆలోచిస్తుంటే- నేతాజీ గుర్తొచ్చాడు. మధ్యతరగతి సంప్రదాయాలకీ, సినీరంగ సంప్రదాయాలకీ ఉన్న తేడాల్ని ఎన్నోమార్లు నాకు స్పష్టం చేసి ఉన్నాడాయన. అసహాయదశ వస్తే కనుక ఎవరెవర్ని కలుసుకోవాలో కొన్ని పేర్లు చెప్పాడు.

వాళ్లలో ఇద్దరు ఆడవాళ్లు. ముందు వాళ్లని కలిశాను. కానీ వాళ్లు ‘చద్దన్నం తిన్న అమ్మలు’ అని వెంటనే తెలిసిపోయింది. తమకి అలాంటి అనుభవాలు ఎదురు కానే లేదని ఆశ్చర్యపడ్డారు వాళ్లు.

తర్వాత ఇద్దరు మగాళ్లని కలిశాను. మగాళ్లు కదా, ముందు భుజాలు తడుముకున్నారు.

తర్వాత, “ఇది అత్యాచారమైతే సాక్ష్యాలతో పోలీసుల దగ్గరకెళ్లు. మోసమైతే అందుకు ఆస్కారమెలా ఇచ్చావో ఆత్మవిమర్శ చేసుకో” అన్నారు.

మొదటి సలహాలో వ్యంగ్యముంది. రెండో సలహా నన్నే దోషిని చేసింది. దాంతో పరిస్థితి అర్థమౌతోంది. నాకు న్యాయం జరుగదు, ఓదార్పు దొరకదు.

ఐనా నేతాజీ సూచించిన మరికొందర్ని కలుసుకున్నాను. వాళ్లు ఇంకా దారుణమైన అభిప్రాయాలు కొన్ని వినిపించారు. ఆ ప్రకారం - సినీరంగంలో ఇది మామూలు. ఉత్త మాటలతో సరిపెట్టేవాళ్లెక్కువ.

“నెల్లాళ్లలో ఆరు లక్షలిచ్చాడా? ఐతే ఓకే” అని ప్రవీణ్‌ ఔదార్యాన్ని పొగిడి, “ఇంకా ఏదో కావాలనుకోవడం అత్యాశ” అని మందలించారు.

పురుషాధిక్య ప్రపంచం నగ్నరూపం స్పష్టమైంది. ఆ ప్రపంచానికి అర్థమవాలంటే, అది గీసిన గీతలున్నాయే, వాటిని దాటి వెళ్లాలనుకున్నాను.

స్వతహాగా తెగింపు ఉన్నదాన్ని. గ్లామర్‌ ప్రపంచంలో మహిళ స్థానమేమిటో ఇంత స్పష్టంగా తెలిసేక, మానసికంగా రెచ్చిపోయాను.

నేతాజీ సూచించినవారిలో చివరి ఇద్దర్నీ కలిసి, “సూక్తులొద్దు. సలహాలొద్దు. ప్రవీణ్‌పై తీసుకునే చర్యలేంటో చెప్పండి. చెప్పలేరూ, నేనే పూనుకుని అంతా బట్టబయలు చేసేస్తాను” అన్నాను.

అర్థింపు లేని బెదిరింపది. ఆ పెద్దల అహానికి నచ్చుతుందా?

“సెంటు భూమి లేనివాడు రాజకీయాల్లో చేరి వందల ఎకరాలు సంపాదిస్తున్నాడు. నెలకు వెయ్యి రూపాయల ప్రభుత్వోద్యోగి కోట్లకి అధిపతి ఔతున్నాడు. ప్రభుత్వం అవినీతిపై యుద్ధం ప్రకటిస్తే విజయ్‌ మాల్యాలు, నీరవ్‌ మోదీలు వేలకోట్ల రూపాయలతో విదేశాలకు వెళ్లి కులుకుతున్నారు. వీటి వెనుక రహస్యం అందరికీ తెలిసినా ఎవరూ బయటకు చెప్పరు.

వాటిని బట్టబయలు చెయ్యాలనుకునే వారిలో అరవింద్‌ ఖేజ్రీవాల్‌లా ప్రతిఫలంగా తగిన పదవిని ఆశించడం వివేకం. అన్యాయాన్నెదిరిస్తున్నామని భ్రమపడ్డం అమాయకత్వం. ఆ అమాయకుల్లో కొందరు అన్నా హజారేలాంటి నాయకులు. తాత్కాలికంగా నాలుగు రోజులు వెలిగినా, చివరకు మీడియా కూడా పట్టించుకోని అనామకులౌతారు. కొందరు అశోక్‌ ఖేంకా లాంటి ఆఫీసర్లు. వీళ్ల ఆరోపణలకు గురైనవాళ్లంతా లుట్యెన్స్‌ భవనాల్లో విలాస జీవితం గడుపుతుంటే, వీళ్లు మాత్రం బదిలీలమీద బదిలీలతో మారుమూల ప్రాంతాల్లో మగ్గుతుంటారు. నువ్వు వీళ్లలో ఎవరి కాలిగోటికీ పోలవు కాబట్టి, జరిగిన అన్యాయాన్ని బట్టబయలు చేస్తే, నువ్వే నవ్వులపాలౌతావు” అన్నారు వాళ్లు- నామీద జాలికంటే ఈసడింపునే ఎక్కువగా ప్రదర్శిస్తూ.

“నేను బట్టబయలు చేసేది జరిగిన అన్యాయాన్ని కాదు. నా శరీరాన్ని” అని బాంబు పేల్చాను.

ముందు వాళ్లకి అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెబితే నమ్మలేదు. కానీ వాళ్ల నమ్మకంతో నాకేం పని.....?

ముందుగానే టైం చెప్పాను. ఓ పెద్ద సినీనిర్మాత కార్యాలయానికి వెళ్లాను. అక్కడున్నవారు చూస్తుండగా మీడియా వారి కెమేరాలముందు నిలబడ్డాను. నా వంటిమీంచి ఒకొక్కటిగా దుస్తులు తీయడం మొదలెట్టాను.

అది నైట్‌ క్లబ్‌ కాదు. పబ్లిక్‌ ప్లేస్‌.

నాది కాబరే డాన్స్‌ కాదు. నిరసన ప్రదర్శన.

అప్పుడు నాలో ఏ ఆవేశముందో, ఏ ఆలోచనుందో చెప్పలేను. అర్థనగ్నంగా నిలబడ్డ నన్ను దేశంలోని ప్రజలందరూ టివి ఛానెల్సు ద్వారా చూస్తున్నారని తెలుసు.

అంతే - ఆ తర్వాతనుంచి దేశమంతటా సంచలనం.

నన్ను తప్పు పట్టినవారున్నారు. సమర్థించినవారున్నారు. ఎవరెలాగున్నా మీడియా నాకిచ్చిన ప్రాధాన్యం ధర్మమా అని - నాకు మద్దతు కూడా క్రమంగా పెరుగుతోంది.

ఐతే, ఈ విషయమై నా గురువు నేతాజీ ఓ విలేకరి ప్రశ్నకు బదులిస్తూ, “ఆమె నా శిష్యురాలు. అన్నింటికీ నా సలహా తీసుకునేది. ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను తనని తప్పు పట్టేలా ఎన్నడూ ప్రవర్తించనని నాకు మాటిచ్చి ఇంతవరకూ నిలబెట్టుకుంది. అందుకు ఆమెని అభినందిస్తున్నాను. కానీ ఒక భారతనారిగా నేడామె చేసినది తప్పు. అది నేను సమర్థించను” అన్నాడు.

బాధ పడ్డాను. నా చర్యని ఆయన ఓకే చెయ్యడానికి ఏ సంజాయిషీ ఇవ్వాలా అని తీవ్రంగా ఆలోచించాను. అప్పుడోసారి నేతాజీతో నాకున్న అనుబంధాన్ని స్మరణకుతెచ్చుకున్నాను....

ఆడపిల్లని. అందగత్తెని. లావణ్యవతిని. జీవితంలో ఎదగడానికి ఈ మూడూ ఉపయోగించుకోవాలన్న వివేకం, ఉపయోగించుకోగల తెలివి నాకున్నాయి. జీవితంలో మోసపోవడానికీ మూడూ కారణమౌతాయన్న భయమూ నాకుంది. నేతాజీ శిష్యరికంల్లో నేనా భయాన్ని పక్కకు నెట్టి- వివేకాన్నీ, తెలివినీ ఉపయోగించుకోగలిగాను.

నిజానికి ఇతరదేశాల్లో ఐతే, నాలాంటివారికి సరైన మార్గనిర్దేశం కన్నవారే చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ల సలహా పాటిస్తే, వయసొచ్చేక ఏ కోన్‌ కిస్కాగాడికో ఇల్లాలినై, వాడికి సేవలు చేసుకుంటూ, వాడి పిల్లలకి తల్లినై, నా ఉనికి కెలాంటి ప్రత్యేకతా లేకుండా, వాడి మనిషిగానే ఓ రోజు కన్ను మూస్తాను.

బంధువుల విషయానికొస్తే, బురద చల్లడం మినహా మరో వ్యాపకముండదు వాళ్లకి.

​మిత్రుల్లో- అందమైన ఆడపిల్లకి శ్రేయోభిలాషుల కంటే ఆశపడేవారే ఎక్కువ.

అందుకే నేతాజీ పరిచయం నా అదృష్టమనుకుంటాను.

ఇప్పటికి ప్రవీణ్‌ చేతిలో మోసపోయినా సాహసించి అర్థనగ్నంగా నిరసన ప్రదర్శన చేస్తే-

మొదటిసారిగా నేతాజీ నన్ను భారతనారికి తగని పని చేసిన మహిళగా నిర్ధారించాడు. ఆయన మాటల్ని బట్టి నాకో విషయం స్పష్టమైంది. నేతాజీ నా చర్యని తప్పు పట్టలేదు. తనని ఒప్పించే సంజాయిషీకోసంఎదురుచూస్తున్నాడాయన.

నాకు కన్నవారితో కానీ, బంధుమిత్రులతో కానీ, సమాజంలో ఏ ఒక్కరితోనూ నిమిత్తం లేదు. కేవలం నేతాజీ ప్రోత్సాహంతోనే ఇంతవరకూ వచ్చాను. ఒక్క నేతాజీ సమర్థిస్తే చాలు- నా పద్ధతిలో నేను దూసుకుపోతాను. ఆయన నన్ను తప్పు పడితే- ఇక అంతే! ఈ గ్లామర్‌ ప్రపంచానికే గుడ్‌ బై చెప్పాలి.

ఓ రాత్రంతా ఆలోచిస్తే నేతాజీని ఒప్పించే ఉపాయం తట్టింది. ఆ ప్రకారం మర్నాడు మీడియాలో చెప్పాను, “జరిగింది నిరసన కాదు. ‘తారాబలం’ అనే ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కోసం జరిగిన షూటింగ్‌” అని.

అంతవరకూ రేగిన దుమారంపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. సినీ, రాజకీయరంగ ప్రముఖులందరూ తేలికగా ఊపిరి పీల్చుకుని- “షార్ట్‌ ఫిల్మా? ఐతే ఓకే” అన్నారు.

వాళ్లతో నాకు నిమిత్తమేమిటి కానీ- నేతాజీ మీడియాతో, “నా శిష్యురాలి నిరసన ప్రదర్శన- షార్ట్‌ఫిల్మ్‌లో భాగమట! ఐతే నాకది ఓకే! ఆమె నా శిష్యురాలయినందుకు గర్వపడుతున్నాను” అన్నారు.

ఆ తర్వాత కరోనా కాలం వచ్చింది. వెండితెర థియేటర్లకు తెరపడి, బుల్లితెరపై ఓటీటీల్లో సెన్సారు లేని చిత్రాలకు తెర లేచింది. నటిగా నాకు అవకాశాలు పెరిగాయి.

ఇప్పుడు నేతాజీయే కాదు, మొత్తం సమాజమే, ‘అది ఓటీటీ చిత్రమా, ఐతే ఓకే’ అంటున్నారు నా గురించి…

---0--

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.


64 views0 comments

Commentaires


bottom of page