top of page

ఊఁ అంటారా ఉఊఁ అంటారా…

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Vu Antara Vuhu Antara' New Telugu Story Written By Vasundhara

రచన: వసుంధర

మీకు పెళ్లయిందా అనడిగితే, ఊఁ అన్నారనుకోండి. ఓకే!

భార్య దగ్గర లేనప్పుడు పరాయిస్త్రీపై మనసు పోతోందా అనడిగితే కూడా ఊఁ అన్నారనుకోండి.

ఐనా ఓకే కానీ-

ఆ పరాయి ఆడది సహకరిస్తే, గీత దాటడానికి సిద్ధమా అనడిగితే మాత్రం ఉఊఁ అనాలి. ఊఁ

అన్నారూ- నాట్ ఓకే!

ఎందుకూ అంటారా- ఈ కథ చదవండి….

-----

వయసులో ఉన్న దంపతులకు ఎడబాటు ఓ శాపం. ఆ ఎడబాటులోనూ ఓ తోడు దొరికితే, అదృష్టం అనలేం కానీ గుడ్డిలో మెల్ల!

సుముఖి, చిత్ర ఒకరికొకరు అలాంటి తోడు.

ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు.

సుముఖి భర్త శివ, చిత్ర భర్త రఘు- వేర్వేరు కంపెనీల్లో మార్కెటింగు సెక్షన్లో పనిచేస్తున్నారు.

వారానికి నాలుగు రోజులు ఊళ్లోనే ఉండరు. ఊళ్లోనే ఉన్నప్పుడు కూడా, ఇంట్లో ఉండడానికి ఓ టైమూ పాడూ లేదు.

భర్తలు ఊళ్లో లేనప్పుడు రోజూ ఏదో సమయంలో వీలు చేసుకుని సుముఖి, చిత్ర ఒకరికొకరు కంపెనీ ఇస్తుంటారు.

అలా ఆ రోజు మధ్యాహ్నం సుముఖి చిత్ర ఇంటికొచ్చింది.

మాటల సందర్భంలో సుముఖి, “నిన్న రాత్రి మా ఆయన ఏదో పనిమీద బయటికెళ్లాడు. అనుకోకుండా మీ ఆయన కనపడ్డాట్ట. పలకరిద్దామనుకునేలోగా చటుక్కున ఎవరిదో ఇంట్లోకి వెళ్ళడం చూసేట్ట. మూడ్రోజుల తర్వాత ఊర్నించొచ్చిన మగాడికి, రాత్రి తొమ్మిదప్పుడు- కట్టుకున్న ఇల్లాల్నొదిలి అక్కడెక్కడో ఎవరింట్లోనో ఏం పనీ- అనిపించింది నాకు” అంది.

ఎక్కతీతా కాదు. ఆరోపణా కాదు. అదో సరదా!

మూడ్రోజుల తర్వాత నిన్న సాయంత్రం నాలుగింటికి ఇంటికొచ్చాడు రఘు. రావడానికి గంటన్నర ముందే ఫోన్ చేసి, “తిండికి మొహం వాచి ఉన్నాను. మంచి భోజనం పెట్టు” అన్నాడు.

అప్పుడు సుముఖి చిత్ర పక్కనే ఉంది.

పొరపాటున స్పీకర్ ఆన్ అయిందేమో, రఘు మాటలు విని, “మోహం వాచి ఉన్నానన్నాడు కదూ, శ్రీరాముడిలా కనబడే మీ ఆయన సరసంగా మాట్లాడ్డంలో శ్రీకృష్ణుడే సుమా!” అంది సుముఖి.

వాళ్లిద్దరికీ అలాంటి విషయాలు మరింత పచ్చిగా మాట్లాడుకునేంత చనువుంది.

చిత్ర నవ్వి, “ఆఁ మా ఆయన సరసమే చెప్పాలి. నువ్వేవేవో ఊహించేసుకోకు. ఆయనన్నది మొహమే, మోహం కాదు. ఇక వంట మొదలెట్టాలి” అంటూ లేచింది.

సుముఖి వెళ్లిపోయింది. చిత్ర చకచకా వంట చేసింది.

రఘు నాలుగింటికి వచ్చేశాడు. ఆవురావురుమంటూ తిండి తిని బ్రేవుమని త్రేన్చాడు.

నిద్దరొస్తోందంటూ మేను వాల్చాడు.

చిత్ర వయసులో ఉంది.

ఉప్పూ కారం తింటోంది.

చూసే సినిమాలు, చదివే పుస్తకాలు ఆ కారానికి మసాలా దట్టిస్తుంటే, నిజంగానే మోహం వాచి, భర్త ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తోంది.

తీరా వచ్చేక- ఇదిగో, ఇదీ సంగతి!

రఘు ఇదివరలో ఇలా ఉండేవాడు కాదు. ఇంటికొస్తూనే ఆమెని దగ్గరగా లాక్కునేవాడు.

నెల్లాళ్లనుంచే ఇలా…

అలసిపోయున్నాడని జాలిపడి చిత్ర అతణ్ణి నిద్ర లేపలేదు.

ఐదింటికల్లా తనూ భోంచేసి, అప్పుడు స్నానం చేసింది.

స్నానాల గదిలో నిలువెత్తు అద్దం. అందులో చిత్ర తన లావణ్యాన్ని కాసేపు అదే పనిగా

చూసుకుంది.

‘మగాళ్లకి- అందులోనూ వారానికి సగంపైన పెళ్లాన్నొదిలి ఊళ్లు తిరిగే మగాళ్లకి- కళ్లు ఎప్పుడూ

పరాయి ఆడాళ్లమీదే ఉంటాయి. బుద్ధికి శ్రీరాముడైనా, కనీసం ఫిగర్స్ మైండులో రిజిస్టరౌతాయిగా!

ఆ ఫిగర్సు ముందు నా ఫిగర్ వెలితి పడుతోందా? అందుకే నిర్లక్ష్యం చేస్తున్నాడా?’ అన్న

అనుమానమొకటి ఆమెలో మొదలయింది. దాంతో స్నానమయ్యేక బట్టలు వేసుకునేలోగా

అద్దంముందు నిలబడి తననితాను నఖశిఖపర్యంతం పరీక్షించుకోవడం ఈ మధ్యే అలవాటైంది.

ఎప్పుడు చూసుకున్నా ఆమెకు తన లావణ్యం ఏమాత్రం అసంతృప్తి కలిగించడం లేదు.

పైగా, ‘ఫిగర్ మెయింటైన్ చెయ్యడానికి మోడల్సు చాలా కష్టపడతారుట. అలా కష్టపడ్డానికి నాకు టైమేదీ? రోజంతా ఇంటిపన్లతోటే సరిపోతుంది. ఎటొచ్చీ తిండి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాను. ఓ పావుగంట యోగా చేస్తాను. అంతే! ఐనా లావణ్యంలో నాకూ, పత్రికల్లో బొమ్మలై కనిపించే మోడల్సుకీ ఒక్కటే తేడా! వాళ్లు నాజూకైన వంటినీ, వంటిసొంపుల్నీ ప్రపంచానికి ప్రదర్శిస్తారు. నేను ప్రదర్శించను” అనుకుంటుంది గర్వంగా.

భర్త ఎలాగూ నిద్రపోతున్నాడుకదా అని అద్దంలో రూపలావణ్యాలు చూసుకుందుకు మరికాస్త ఎక్కువ టైం తీసుకుందామె. తర్వాత వంటికి మత్తెక్కించే బాడీ స్ప్రే కొట్టుకుంది. ముఖానికి పౌడరు పూసుకుంది. ఉత్తప్పుడు వాడేది కాక, పల్చటి నైటీ వేసుకుంది. జడలో మల్లెలు తురిమింది.

ఇన్ని చేసి బెడ్రూంలో కెళ్లేసరికి ఇంకా టైం ఏడున్నరే.

రఘు ఇంకా నిద్ర పోతూనే ఉన్నాడు.

చిత్ర కాసేపు టివి చూసింది. బుర్రకెక్కలేదు.

టైం ఎనిమిది కావస్తుంటే ఇక ఆగలేక, అతణ్ణి నిద్ర లేపింది.

“మంచి నిద్ర పాడు చేశావ్ చిత్రా!” అని ఆవులిస్తూ లేచాడు రఘు.

“మీ నిద్ర సంగతి సరే, చాలా రోజులయింది. మరి నాకూ నిద్ర పట్టాలిగా…” అందామె నోరు విడిచి.

రఘు ఉలిక్కిపడ్డాడు. ఓసారి కళ్లు నులుముకుని ఆమెని పరీక్షగా చూసి ఉలిక్కిపడ్డాడు.

“నిన్ను తలచుకుంటేనే, కళ్లు మూతపడవు. అలాంటిది నువ్వు ఎదురుగా, అదీ రంభలా ఉన్నావ్!

ఐనా నిద్ర పోయాను. అదే పెద్ద తప్పు. ఆపైన వరమిచ్చే దేవతలా, నువ్వే నిద్ర లేపావు. అప్పుడు నేనేం చెయ్యాలి- పరవశించి నీకు వశమై పోవాలి. కానీ నిద్ర పాడయిందని విసుక్కోవడమేమిటి” అని తనని తనే విసుక్కున్నాడు.

అతడి మూడ్ కోరుకున్న దిశకి మళ్లుతోందని అర్థమై, ఆనందంతో ఏదో అనబోయిందామె.

అంతలో అతడామెని బలంగా కౌగలించుకున్నాడు.

ఎక్కడెక్కడో తిరిగి ఇంటికొచ్చి, స్నానమైనా చెయ్యకుండా భోంచేసేసి, నిద్ర పోయాడేమో- అతడి వళ్లంతా చెమట వాసన.

ఐనా చిత్రకి అ కౌగిలి ఎంతో హాయిగా, ఆహ్లాదంగా ఉంది. స్నానం చేసి రమ్మంటే,

విడిపోతామేమోనని భయమేమో!

విడిపోవాలని రాసిపెట్టుంటే, స్నానానికే వెళ్లాలా అన్నట్లు- అంతలోనే ఫోను మ్రోగింది.

అంతే, రఘు చటుక్కున ఆమెను వదిలి, ఫోన్లో మాట్లాడాడు.

మాట్లాడ్డం అవగానే, “ఎవరు?” అందామె.

ఎవరో చెప్పలేదు కానీ, “బయటికెళ్లాలి. స్నానం చేసొస్తాను” అన్నాడతడు చిత్రతో.

“నా స్నానం ఐపోయింది. నే చెబుతున్నాగా, మీరు స్నానం తర్వాత చెయ్యొచ్చు” అందామె అతడి చేయి గట్టిగా పట్టుకుని.

అతడికి అర్థమైంది.

మామూలుగా ఐతే ఆమెను దగ్గరగా లాక్కునేవాడు.

కానీ ఆ రోజెందుకో, “స్నానం చేసి అర్జంటుగా బయటికెళ్లాలి. ఇప్పుడొద్దు” అన్నాడు.

“ఇప్పుడు కాక ఇంకెప్పుడు?” అందామె కాస్త ఉక్రోషంగా.

బదులివ్వలేదు. బట్టలు, తువ్వాలు తీసుకుని బాత్రూం వైపు నడిచాడు.

“నేనూ వస్తాను” అందామె.

మామూలుగా ఐతే ఉత్సాహపడాలి. కానీ అతడు కంగారుగా, “వద్దు” అన్నాడు.

ఆమె తన మాట ఖాతరు చెయ్యదన్న భయమో ఏమో, రెండంగల్లో బాత్రూంలో దూరి హడావుడిగా తలుపేసుకున్నాడు.

భర్త ప్రవర్తన చిత్రకి ఆశ్చర్యంగా ఉంది.

రఘు ఐదు నిముషాల్లో స్నానం ముగించుకుని బట్టలు మార్చుకుని బయటకు వచ్చాడు. భార్య ముఖం చూడకుండా, “టైం ఎనిమిది దాటింది. తొందరగానే వచ్చేస్తాన్లే” అని వీధిలోకి వెళ్లాడు.

చిత్ర ఇస్సురని నిట్టూర్చింది. తను వీధిలోకి వెళ్లలేదు.

అంతలోనే బైక్ స్టార్టయిన చప్పుడయింది.

అమె అప్పుడు- ఎక్కడికెడుతున్నాడు, ఎందుకెడుతున్నాడు- అని ఆలోచించలేదు.

ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తోంది.

అతడు వచ్చేసరికి పదయింది.

అప్పుడు కూడా ఆమె అతణ్ణి ఎక్కడికెళ్లాడో, ఎందుకెళ్లాడో- అడగలేదు.

“హమ్మయ్య, వచ్చారు” అని ఉత్సాహపడింది.

ఈసారి రఘు కూడా ఆమెను నిరుత్సాహపర్చలేదు.

చెప్పాలంటే అతడప్పుడు ఆమెకంటే ఉత్సాహంగా ఉన్నాడు.

చిత్రకైతే వాళ్ల తొలిరేయి గుర్తుకొచ్చింది.

ఇద్దరూ హాయిగా, తృప్తిగా, వళ్లెరక్కుండా నిద్రపోయారు.

మర్నాడుదయం భోంచేసి రఘు సేల్సు రిపోర్టు ఇవ్వడానికి ఆఫీసుకెళ్లాడు.

మధ్యాహ్నం సుముఖి వచ్చింది.

నిన్న రాత్రి తొమ్మిదికి రఘు ఎక్కడో ఎవరి ఇంట్లోకే వెడుతూండగా ఆమె భర్త శివ చూశాడని అంటోంది.

ఆ ఇల్లెవరిది? ఏం జరిగిందక్కడ?

“సేల్సు ఉద్యోగం కదా, సవాలక్ష ఇళ్లూ సవాలక్ష పనులూ” అంది చిత్ర టాపిక్ తేల్చెయ్యాలని.

కానీ సుముఖి వదల్లేదు, “ఏం పనని నువ్వడగలేదా?” అంది.

“అడిగేందుకు అవకాశమిచ్చాడా? మూడ్రోజులుగా ఊళ్లో లేడు. ఇద్దరం మోహం వాచి ఉన్నాం” అంది చిత్ర.

సుముఖి నవ్వి “నాలుగింటికొచ్చాడు. ఎనిమిద్దాకా ఉన్నాడు. మోహం వాపు తీరేకే బయటికెళ్లాడేమో అనుకున్నా” అంది.

చిత్రకి ఏమనాలో తెలియలేదు.

కానీ ఏదో అని ఆమె నోరు మూయించాలని అనుకుని, “మీ ఆయనేమో మన వీధిలో ఎవరెవరు ఏయే టైముల్లో ఎవరెవరిళ్లకు వెడుతున్నారో చూడ్డానికి రోడ్లమీదుంటాడు. నువ్వేమో ఇంట్లో వేరే కాలక్షేపం లేక వీధిలో ఎవరెవరు ఇళ్లలోంచి ఏయే టైముల్లో బయటి కొస్తున్నారో నిఘా వేస్తున్నావ్. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మారాలి” అని ఎదురుదాడి చేసింది.

తగలాల్సిన చోటే తగిలినట్లుంది.

మరో ఐదు నిముషాల్లో సుముఖి వాళ్లింటికెళ్లిపోయింది.

రాత్రి ఆరింటికి రఘునుంచి ఫోను.

రేప్పొద్దున్నే మళ్లీ టూరుట. తిరిగి రావడానికి వారం పట్టొచ్చుట.

“గంటలో వస్తున్నా. బయటేం తినలేదు. మంచి ఆకలిమీదున్నా. వంట రెడీగా ఉండాలి”

అన్నాడతడు.

“వెనకటికొకాయన గోవాలో బీచికెళ్లి, టూ పీసెస్ వేసుకున్న ఓ యువతిని పలకరించి, గాగుల్సెక్కడ కొన్నారూ- అనడిగేట్ట. అలాగుంది మీ వరస. రంభలాంటి పెళ్లానికి ఫోను చేసి- తిండి గురించి మాట్లాడతారా?” అని విసుక్కుంది చిత్ర.

ఐతే అప్పటికే కొంత వంటయింది. అదనంగా బంగాళాదుంపల వేపుడు, టమేటా పెరుగుపచ్చడి చేసింది.

రఘు ఏడింటికొచ్చాడు. స్నానం చేశాడు.

ఇద్దరూ కలిసి భోంచేసేక, “టివి పెట్టు. కలిసి టివి చూసి చాలా కాలమైంది” అన్నాడు.

మళ్లీ ఎప్పుడు దొరుకుతాడోనన్న భయమేమో, “నో టివి. నాకు నిన్నే చూడాలనుంది” అని అతణ్ణి వాటేసుకుందామె.

ఇదివరలో అలాంటి పరిస్థితిలో తనే ఆమెకంటే ఎక్కువ ఉద్రేకపడేవాడు రఘు.

అప్పుడు మాత్రం, “ఇప్పుడు కాదు” అంటూ ఆమెను మృదువుగా విడిపించుకునేందుకు

ప్రయత్నించాడు.

“ఇప్పుడు కాక ఇంకెప్పుడు?” అంటూ చిత్ర వదలకుండా పట్టు బిగించింది.

కొద్ది క్షణాల్లోనే అతడిలో చలనం మొదలైంది.

తనూ ఆమెని బలంగా హత్తుకున్నాడు.

అంతే- హిస్టరీ రిపీట్స్!

ఫోన్ మ్రోగింది. ఆమెనొదిలి ఫోన్ తీశాడు.

మాట్లాడ్డం అయ్యేక బట్టలు మార్చుకుని, “ఇప్పుడే వస్తాను” అని నిన్నటిలాగే బైక్ మీద

బయటికెళ్లాడు.

గంటన్నరలో తిరిగొచ్చాడు. వచ్చేక మాత్రం శోభనం పెళ్లికొడుకే అయ్యాడు.

ఆ రాత్రి ఆమెకు మధురమైన మరో తొలిరేయి.

చిత్రకి చిత్రంగా అనిపించింది.

కానీ తృప్తి చెందిన తనువు- అప్పటికే మనసును జోకొట్టేసి- ముంచుకొస్తున్న నిద్రకు ఏ ఆటంకం రాకుండా జాగ్రత్తపడింది.

మర్నాడుదయం రఘుకి మళ్లీ టూర్ ప్రయాణం.

ఆమెనుంచి నిట్టూర్పుతో కూడిన వీడ్కోలు.

మధ్యాహ్నం సుముఖి వచ్చింది.

వస్తూనే, “మీ ఆయన నిన్న రాత్రి కూడా అదే ఇంటికెళ్లేట్ట. ఈసారైనా కనుక్కున్నావా?” అంది.

చిత్ర ఉలిక్కిపడింది.

ఇది చాలా సీరియస్ మేటరా?

తను లైట్ తీస్కుంటోందా?

ఫోను రాగానే, కౌగిలిలో ఉన్న తనని కూడా వదిలి ఎవరింటికో పరుగెడుతున్నాడు రఘు.

ఎవరిదా ఫోను? ఎవరిదా ఇల్లు?

ఏమనాలో తెలియక, “ఈసారొచ్చినప్పుడు కనుక్కుంటాలే కానీ, ఇందులో నీకేంటీ అంత

ఇంట్రస్టు?” అంది.

“ఇంట్రస్టే మరి. నువ్వేం చెబుతావో విని, అదే మా ఎదురింటి వెంకటలక్ష్మికి చెప్పాలి” అంది సుముఖి.

చిత్రకి అర్థం కాలేదు, “మన మధ్యకి ఈ వెంకటలక్ష్మి ఎందుకొచ్చింది?” అంది.

“నీ దగ్గర దాచేదేముంది? నాదీ నీదీ ఒకటే కేసు. నేను నిన్నడిగినట్లే, నన్ను వెంకటలక్ష్మి

అడుగుతోంది” అంది సుముఖి.

అప్పుడు సుముఖి వాళ్లాయన శివ గురించి చెప్పిన వివరాలు చిత్రకు ఆశ్చర్యం కలిగించాయి.

కొన్నాళ్లుగా శివ టూర్నించి రాగానే ఆమెతో అంటీముట్టనట్లు ఉంటున్నాట్ట.

తనే నిగ్రహించుకోలేక చొరవ చేస్తే, “ఇప్పుడు కాదు” అంటాట్ట.

“ఇప్పుడు కాక ఇంకెప్పుడు?” అంటూ తను పట్టు బిగిస్తే, రెచ్చిపోతాట్ట.

అంతలో ఫోను మ్రోగుతుందిట.

అంతే! ఆమెనొదిలి బైటకెళ్లి గంటన్నరలో తిరిగొస్తాట్ట.

తర్వాత పూర్వమంత సరసంగానూ ఉంటాట్ట.

ఇదంతా కథలా అనిపించింది చిత్రకి.

“రాత్రి తొమ్మిదికి మీ ఆయనకా ఇంట్లో ఏం పని- అని ఎదురింటి వెంకటలక్ష్మి నన్నడిగేదాకా నేను విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అప్పుడాయన్ని నిలదీశాను….” ఆగింది సుముఖి.

“నువ్వన్నది నిజమే! మనిద్దరిదీ ఒకలాంటి కేసే! ఎటొచ్చీ నేనింకా మా ఆయన్ని నిలదియ్యలేదు.

ఇంతకీ నువ్వడిగిందానికి మీ ఆయనేమన్నాడు?” అనడిగింది కుతూహలంగా.

“మార్కెటింగ్ వాళ్లం. అన్నీ కట్టుకున్నదానికి కూడా చెప్పకూడదు. కావాలంటే నిన్నా వెంకటలక్ష్మి అడిగినట్లే నువ్వూ రఘు పెళ్లాన్నడిగి ఏమంటుందో చూడు- అన్నాడాయన” అంది సుముఖి.

చిత్ర ఆశ్చర్యం రెట్టింపయింది. “మార్కెటింగుకీ, వీళ్ల ప్రవర్తనకీ సంబంధమేంటి?” అంది.

“నాకంటే తెలివైనదానివీ, చురుకైనదానివీ కదా- నువ్వు తెలుసుకుంటావేమోనని ఆశ పడ్డాను. కానీ ఇప్పుడు నువ్వే నన్ను ప్రశ్నలడుగుతున్నావ్” అంది సుముఖి.

“ఆ వెంకటలక్ష్మి కూడా నీకులాగే తన భర్త గురించి తెలుసుకోవాలని నిన్నలా అడిగిందేమో…”

సాలోచనగా అంది చిత్ర.

సుముఖి తల అడ్డంగా ఊపింది.

వెంకటలక్ష్మి భర్త సుబ్బరామయ్యకి అంత సీను లేదు.

గవర్నమెంటుద్యోగం. ఆఫీసు మూడు షిఫ్టుల్లో పని చేస్తుంది.

ప్రైవేట్ కంపెనీల్లో ఐతే ఉద్యోగులు నైట్ షిఫ్ట్ వద్దనుకుంటారు- ఇంట్లో పగలు నిద్ర పోవడం ఇష్టం లేక!

సుబ్బరామయ్యది గవర్నమెంటాఫీసు కదా, అక్కడ ఎప్పుడైనా నిద్ర పోవచ్చు.

ఇంట్లో ఐతేనేం, ఆఫీసులో ఐతేనేం- నిద్ర నిద్రే కదా అని అక్కడ అంతా నైట్ షిఫ్టుకే పోటీ

పడతారుట.

ప్రస్తుతం సుబ్బరామయ్యకి నైట్ షిఫ్టు నడుస్తోంది.

అయనకి అంత చప్పున నిద్ర పట్టదు.

ఆఫీసు టైంలో ఎంతసేపు మెలకువగా ఉంటే అంతసేపు డ్యూటీకి భంగమైనట్లే మరి.

వ్యాయామం చేస్తే నిద్ర బాగా పడుతుందని, కొన్నాళ్లుగా రాత్రి తొమ్మిదికి ఆఫీసునుంచి

బయటకొచ్చి కాసేపు వాకింగు చేయడం మొదలెట్టాడాయన.

“ఆ వాకింగులోనే ఓసారి మా ఆయన ఏదో ఇంట్లోకి వెళ్లడం చూసేడాయన. చూసి ఊరుకోకుండా, ఇంటికొచ్చేక పెళ్లాం చెవిలో ఊదాడు….” అంది సుముఖి.

“పోనీ, ఆ ఇల్లెక్కడో తెలిస్తే, మనమక్కడికి వెళ్లి వాకబు చెయ్యొచ్చు” అంది చిత్ర.

“ఆఁ కనుక్కున్నాను. వాకబు చేస్తే అదో మహిళా పోలీసు కార్యాలయమని తెలిసింది” అంది సుముఖి.

“మనవాళ్లకి పోలీసులతో ఏం పని?” అంది చిత్ర.

“అదే అనుమానం నాకూ వచ్చింది” అంది సుముఖి సాలోచనగా.

“ఔనూ, నువ్వు మహిళా పోలీసులని కదూ అన్నావు” అంది చిత్ర తనూ సాలోచనగా.

“ఐతే?” అంది సుముఖి తేలికగా.

“పోలీసులకి ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. మహిళా పోలీసులంటే సినిమా హీరోయిన్ల

ఫిగరుంటుందేమో…..”

చిత్ర ఏదో అనబోతుండగా, “అలాంటనుమానమేం పెట్టుకోనక్కర్లేదు. మా ఆయన శ్రీరామచంద్రుడన్న విషయంలో నాకేం అనుమానం లేదు. అదలాగుంచితే- పోలీసులంటే ఆయనకి చచ్చేటంత భయం. మహిళా పోలీసుల సంగతటుంచు. పోలీసు వేషమేస్తే నాలుగేళ్ల కుర్రాణ్ణి చూసినా జడుసుకుంటాడు మా ఆయన” అంది సుముఖి నమ్మకంగా.

చిత్ర ఏదో అనబోయింది. అంతలో ఫోన్లో వాట్సాప్ అలర్ట్ వచ్చింది.

ఏమిటా అని చూస్తే, ఆశ్చర్యంగా అది మహిళా పోలీసు కార్యాలయం నుంచి.

ఆ మాట సుముఖికి చెప్పి, “వీళ్ల వాట్సాపు గ్రూపులో మననెప్పుడు చేర్చారు?” అంది చిత్ర.

“ఆ విషయం తర్వాత- ముందా మెసేజ్ ఏమిటో చూడు” అంది సుముఖి.

చూస్తే….

అందులో నాలుగు తేదీలు ఇచ్చారు.

ఆ నాలుగు తేదీల్లో ఫలానా ఫలానా సమయాల్లో రఘు అనే అతడు చిత్ర అనే మహిళతో గడిపాట్ట.

‘చిత్ర నా భార్య’ అంటున్నాడు రఘు.

నిజంగా చిత్ర అతడి భార్యేనా?

ఒకవేళ చిత్ర అతడి భార్య కాకపోతే తనకు ఇష్టమయ్యే అతడితో గడిపిందా?

‘ఈ ప్రశ్నలకి అదే వాట్సాపు నంబరుకి జవాబు పంపగలరు’- అదీ సందేశం.

“వాళ్లడిగిన తేదీల్లో మా ఆయన నాతోనే ఉన్నాడు. ఐనా భార్యాభర్తలం. మేం కలుసుకోవడం గురించి వీళ్లెవరో అడగడ మేంటి?” అంది చిత్ర కొంచెం అసహనంగా.

సుముఖి కుతూహలంగా తనూ ఆ మెసేజ్ చదివి, “మెసేజ్ చివర ఓ అడ్డగీతకింద ఇంకా ఏదో రాసున్నట్లుంది” అని, “ఏమైనా సందేహాలుంటే, ఈ మెసేజికి అటాచ్ చేసిన పిడిఎఫ్ ఫైలు చదవాలిట” అంది.

ఇద్దరికీ కుతూహలమే- ఆఫైలు ఓపెన్ చేసి చదివారు.

అప్పుడు తెలిసిన తెలిసిన విశేషం వాళ్ల ఊహకందనిది!

ఆడవాళ్లని వేధించడం అనాదిగా మగాళ్ల హాబీ.

అదిప్పుడు మరింత ఎక్కువై, అత్యాచారాల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఇది అరికట్టడానికి మహిళా పోలీసు కార్యాలయంలో ‘కాళి’ అనే ప్రత్యేక విభాగాన్ని

రూపొందించింది ప్రభుత్వం.

అందులో పనిచేసేవారిది- విదేశీ గూఢచారుల స్థాయి!

వాళ్లు తీసిన ఆరాల్లో- వార్తలకెక్కని ఎన్నో నేరాలు బయటపడ్డాయి. వాటిలో చాలావరకూ అక్రమ సంబంధాలే!

అవి వ్యక్తిగతమని ఉపేక్షించడానికి లేదు.

అరికట్టకపోతే సమాజంలో మరెన్నో నేరాలకు, ఘోరాలకు అవే మూలమౌతాయి.

అక్రమ సంబంధాల విషయంలో- తప్పు మగాడిది మాత్రమే అనలేం! కానీ ఎక్కువ నేరాల్లో స్త్రీది అసహాయస్థితి.

తప్పు స్త్రీదే అయినా- రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లని కొందరంటారు.

అది నిజమే కానీ- రెండు చేతుల్లో ఒక చేతిని అదుపు చేస్తే- ఆ నేరాలు అలాంటి నేరాలు

అదుపులోకొస్తాయి కదా!

మరి మన సమాజంలో ప్రస్తుతానికి సామాజికంగా, శారీరకంగా పురుషుడే బలవంతుడు.

అందుకని ‘కాళి’ లక్ష్యం పురుషుడే!

‘కాళి’ వద్ద అక్రమ సంబంధాల జాబితా ఉంది.

రోజురోజుకీ దాని పరిమాణం పెరుగుతోంది.

అక్రమ సంబంధాలకు పాల్పడ్డవాళ్లని పట్టుకుందుకు మెరుపు దాడులు చేయిస్తుంది ‘కాళి’.

రెయిడ్సులో పట్టుబడ్డ పురుషుల్ని స్పెషల్ సైంటిఫిక్ టెక్నాలజీతో టాగ్ చేస్తుంది.

ఒకసారి టాగ్ చేసిన పురుషుడు, తర్వాతనుంచి స్త్రీతో గడిపేందుకు మానసికంగా సిద్ధపడితే చాలు, ‘కాళి’ కార్యాలయానికి సిగ్నల్ వెడుతుంది.

ఆ స్త్రీ పరాయిదా, అతడు కట్టుకున్న భార్యా అన్న విషయం సిగ్నల్ని బట్టి తెలియదు.

సిగ్నల్ అందిన వెంటనే ‘కాళి’ నుంచి ఆ పురుషుడికి ఆటోమాటిక్‍గా ఫోన్ వెడుతుంది.

అతడు గంట లోపులో దగ్గర్లోని ‘కాళి’ కార్యాలయానికి వెళ్లి, తానెవరితో గడుపబోతున్నదీ

వివరాలిచ్చి సంతకం పెట్టి వెళ్లాలి.

తర్వాత ‘కాళి’ వీలునిబట్టి ఆ వివరాలు సరైనవో కావో నిర్ధారిస్తుంది.

అతడు అబద్ధమాడి ఉంటే, అరెస్టవడమే కాదు- గుట్టు కూడా రట్టవుతుంది.

‘నిజానికి శృంగారమంటే స్వేచ్ఛగా అనుభవించాల్సిన ఒక మధురానుభూతి. పూర్తిగా వ్యక్తిగతం.

దానికి అనుమతి కావాల్సి రావడం పురుషుడికి అవమానకరమైన శిక్ష. ఈ శిక్షను అమలు

పర్చడంలో మా నిర్ధారణకు సహకరించడం బాధిత మహిళలకు బాధ్యత మాత్రమే కాదు- వారికి శ్రీరామరక్ష’

అదీ ఆ సందేశంలోని చివరి వాక్యం.

చదవడం పూర్తయిందో లేదో, సుముఖి ఫోనుకీ వాట్సాపులో అదే అలర్ట్ వచ్చింది.

చదివితే చిత్రకీ ఆమెకీ వచ్చిన మెసేజెస్- సేమ్ టు సేమ్.

అప్పుడు సుముఖి, చిత్రల సందేహాలన్నింటికీ జవాబులు దొరికాయి.

“నాకు ‘కాళి’ ఇచ్చిన శ్రీరామరక్షకి మురిసిపోవాలా, శ్రీరాముడనుకున్న నా భర్త నన్ను బాధితమహిళని చేసిన నిర్వాకానికి కృంగిపోవాలా- ఇప్పుడు కాక ఇంకెప్పుడు అని నోరు విడిచి అడిగితే- సమాధానం ఆయన్నించి కాక- ‘కాళి’ నుంచి రావాలని సిగ్గుతో చావాలా- ఇప్పుడిదీ నా మీమాంస” అని వాపోయింది చిత్ర.

“నాదీ సేమ్ టూ సేమ్” తనూ వాపోయింది సుముఖి.

-----

వాపోతున్నది వాళ్లిద్దరేనా?

అవతల ‘కాళి’ విజృంభిస్తోంది.

పురుషపుంగవులారా-

పరాయిస్త్రీ గీత దాటడానికి సిద్ధమైతే- ఊఁ అంటారా, ఉఊఁ అంటారా-

మీరే ఆలోచించుకోండి!

---0---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.


111 views0 comments
bottom of page