top of page

స్థితప్రజ్ఞస్య కా భాషా….

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Sththaprajnasya ka bhasha' New Telugu Story Written By Vasundhara

రచన: వసుంధర

కురు పాండవ యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగస్థితి గురించి బోధిస్తాడు.

అప్పుడు అర్జునుడికి సందేహం కలిగిన సందర్భంలో ఇలా అడుగుతాడు.

'స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ

స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్'

స్థిత ప్రజ్ఞుడైన వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోగోరుతున్నట్లు అర్జునుడు శ్రీకృష్ణుడిని కోరుతాడు.

ఈ కథలో స్థిత ప్రజ్ఞులైన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో, సాధారణ వ్యక్తులు సైతం స్థిత ప్రజ్ఞులుగా ఎలా మారవచ్చో ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చాలా చక్కగా వివరించారు.

చిప్పలోకి ముడుచుకుని ఉన్న తాబేలుని చంపడానికి కొందరు పైనుంచీ కర్రలతో కొడుతున్నారు. ఆ దారిలో వెడుతున్న ఓ సాధువు ఆ దృశ్యం చూసి, “తాబేలుని తిరగేసి కొడితే సులభంగా చస్తుంది. అది మీకు తెలియకుండా చేసి ఈ తాబేలు ప్రాణాలు కాపాడిన ఆ దేవుడు ఎంత గొప్పవాడో కదా!” అని వెళ్లిపోయాడు.

ఆ సాధువు దేవుణ్ణి మెచ్చుకున్నాడా, లేక తాబేలు చావుకి కారకుడయ్యేడా అన్నది విడమర్చి చెప్పనక్కర్లేదు.

ప్రస్తుతం నాది ఆ సాధువు పరిస్థితి. నా భార్య వసుధ తాబేలు. ఆమె చావుని కోరేవారు కొందరున్నారు. వారి కోరికను సఫలం చేసే చిట్కా నాకు తెలుసు.

వసుధకీ నాకూ పెళ్లై నాలుగేళ్లయింది. మాకింకా పిల్లలు లేరు. కారణం జాగ్రత్తపడడం కాదు. వసుధ శరీరం మాతృత్వానికి అనుకూలంగా లేదన్న విషయం మాకు పెళ్లయిన రెండేళ్లకే తెలిసింది. మూడేళ్ల చికిత్స, లక్షల్లో ఖర్చు. ఈ రెండూ చేస్తే ఆమె శరీర పరిస్థితి గర్భధారణకు సానుకూలం కావచ్చన్నారు. సత్ఫలితానికి గ్యారంటీ ఇవ్వలేదు.

పురుడు మగువకు పునర్జన్మ అంటారు. కానీ వసుధకి అది జన్మవిముక్తి కావచ్చని డాక్టర్ల భయం. అద్దె గర్భం సూచించారు కానీ దానికీ లక్షలు ఖర్చవుతుంది. పైగా వసుధకి అదిష్టం లేదు. మా బిడ్డని తనే నవమాసాలూ మోసి కంటానంటుంది.


‘మనకి పిల్లలొద్దు’ అని నేను గట్టిగా అంటే వసుధ వింటుంది. కానీ అనను. అనకపోతే వసుధ కూడా నన్ను తప్పు పట్టదు.

నేను మళ్లీ మా అమ్మానాన్నలకి దగ్గరవడానికి మాకు పిల్లలు అవసరమని తనకి తెలుసు. అదీకాక తనవల్లే- నేనూ, మావాళ్లూ విడిపోయామని తనలో అపరాధభావం కూడా ఉంది. పిల్లల వంకతో మావాళ్లు నన్ను రెండో పెళ్లికి బలవంతపెట్టే అవకాశముందన్న భయం కూడా ఆమెలో ఉంది. పైకి అనదు- నేను నొచ్చుకుంటానని!


రెండో పెళ్లి విషయంలో ఆమెది భయం కాదనీ, నిజమేననీ నాకు తెలుసు. కానీ ఆమెకి చెప్పలేదు- ఎలా చెప్పాలో తెలియక!

మాది ప్రేమ పెళ్లి. దాని భవిష్యత్తు ఇప్పుడు వసుధ మాతృత్వంతో ముడిపడింది. తను రిస్కు తీసుకుంటానంటోంది. ఒప్పుకుంటే నేనామెను ఆత్మహత్యకు ప్రోత్సహించినట్లే! ఇంకా చెప్పాలంటే అది హత్య కూడా!


నేను స్వార్థపరుణ్ణి కావచ్చు కానీ దుర్మార్గుణ్ణి కాను. ఇక హంతకుణ్ణి కావడమంటే- ఆ ఆలోచనే తట్టుకోలేను.

​అందుకే మధ్యేమార్గంగా మా అమ్మమ్మని ఎన్నుకున్నాను.

-----

మనిషికి ఎంతో కొంత స్వార్థముండడం సహజం. స్వార్థం ఎంతో ఉన్నవాళ్లు దుర్మార్గులు. కొంతే ఉన్నవాళ్లు సామాన్యులు. లేనివాళ్లు స్థితప్రజ్ఞులు.

ఏ సమాజంలోనైనా సామాన్యులదే మెజారిటీ. స్థితప్రజ్ఞులది మైనారిటీ. దుర్మార్గుల సంఖ్య ఆ మైనారిటీ చూపే ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే, దుర్మార్గులుగా మారే సందర్భాలు సామాన్యులకి కూడా తరచుగా ఏర్పడుతుంటాయి.

అలా మా ఇంట్లో నేను సామాన్యుణ్ణి. మా అమ్మమ్మ స్థితప్రజ్ఞుల కోవలోకి వస్తుంది. అమ్మమ్మకు చిన్నతనంలోనే భర్త పోయాడు. అప్పటికామెకు ఇద్దరు కూతుళ్లూ, ఓ కొడుకూ.

ఇరవై ఎకరాల పొలముంది. మంచి మనసు. జాలిగుండె. అందర్నీ ఇట్టే నమ్మేస్తుంది. ఎవరి గురించీ పొల్లుమాటనదు.

తనపై నింద వేసినవారిని కూడా తప్పు పట్టదు. వీలైనంతలో సాయం చేస్తుంది. ప్రాణం పోతున్నా దేహీ అనదు.

ఇలా చెప్పుకుంటారు ఆమె గురించి. ఆమెతో సాన్నిహిత్యముంటే అది నిజమేననిపిస్తుంది.

కూతుళ్లు పెళ్లవగానే అత్తారింటికి వెళ్లిపోయారు. కొడుకు చదువయ్యేక పెళ్లి చేసుకుని

ఇల్లరికం వెళ్లిపోయాడు. తను మాత్రం డెబ్బై నిండినా పిల్లల వద్దకు వెళ్లదు. స్వగ్రామంలోనే ఉంటోంది.

అమ్మమ్మది పెద్ద చెయ్యి. అయినవాళ్లకి పెట్టుపోతల్లో లోటు రానీదు. తన భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించదు. ఇప్పటికి తనకి మిగిలింది ఇల్లూ, నాలుగెకరాల పొలమే ఐనా, అవే తనకి ఎక్కువంటుంది.

ఒంటరిదయ్యేక, అమ్మమ్మ దైవధ్యానంలో పడింది. నిత్యం ఆంజనేయస్వామి ఉపాసన చేసేది. ఆ ఫలితంగానేమో ఆమెకి అపూర్వశక్తి వచ్చిందంటారు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడెక్కడి విశేషాలో చూసి చెప్పగలదు. భవిష్యత్తులోకీ తొంగిచూడగలదు. చాలామంది ఆమె వద్దకు వచ్చి ప్రశ్నలడిగి లబ్ది పొందిన విశేషాల్లో కొన్నింటికి నేనూ ప్రత్యక్షసాక్షిని.

కొందరికి నిధులు, లంకెబిందెల ఆచూకీ చెప్పింది. కొందరికి అరుదైన పత్రాలు ఎక్కడున్నాయో చెప్పింది. కొందరికి ఏ వ్యాపారం లాభసాటో చెప్పింది. కొందరికి దొంగల్ని పట్టిచ్చింది. కొందరిళ్లలో అపార్థాలు పోగొట్టింది. ఐతే ఎదుటివారికి తనవల్ల లక్షల్లో లాభమొచ్చినా సరే, తను మాత్రం నామమాత్రంగా నూటొక్క రూపాయలే తీసుకునేది.

‘అదేంటి అమ్మమ్మా!’ అని నేనంటే, ‘స్వామి నాకు చెబుతున్నాడు. అందుకాయన నన్నేమడగడం లేదు. ఆయన చెప్పిందే చెప్పే నేనెలా అడుగుతాను? తీసుకునే ఆ నూటొక్క రూపాయలూ కూడా నాక్కాదు. ఇచ్చినవాళ్ల పేరున అర్చన జరిపిస్తాను’ అంది అమ్మమ్మ.

చిత్రంగా అనిపించింది. డబ్బుకోసం కాకపోతే, ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? పేరు కోసమా అనుకుంటే- అమ్మమ్మ తన గురించి ప్రచారం చేసుకోదు. ఆమెవల్ల లబ్ది పొందినవారే ఆమెకు ప్రచారకులు. అలా ఆమెవద్దకు వచ్చివెళ్లేవాళ్ల సంఖ్య చెప్పుకోతగ్గదే ఐనా-

మీడియాలోకి ఎక్కేటంత గుర్తింపు ఆమెకి లేదు.

హేతువాదిని కాబట్టి అమ్మమ్మ అపూర్వశక్తిని కొట్టిపారెయ్యాలి. అలా చెయ్యను. అలాగని ఆమె అపూర్వశక్తిని నమ్మనూ లేను.

కొందరికి ఎదుటివాళ్ల ఆలోచనల్ని చదివే నేర్పు ఉంటుంది. తెలిసిన విశేషాల్ని సమకూర్చి- జరిగిన పాత విశేషాల్నీ, జరుగబోయే కొత్త విశేషాల్నీ ఊహించే ప్రతిభ ఉంటుంది.

అలాంటివాళ్లు చెప్పింది నిజమైతే అది కాకతాళీయం. జనం అలా అనుకుందుకు ఇష్టపడరు. వారి శక్తిని గౌరవిస్తారు.

వాళ్లు చెప్పింది నిజం కాకపోతే- జనం వారి శక్తిని శంకించడానికి ఇష్టపడరు. అలాంటివి మర్చిపోయే ప్రయత్నం చేస్తారు.

అలాంటి ప్రతిభావంతుల్లో కొందరు జ్యోతిష్కులుగా స్థిరపడతారు. కొందరు బాబాలౌతారు.

అమ్మమ్మ తను బాబాని అనదు. తనది జ్యోతిష్కమనదు. ఆమె వద్దకొచ్చేవారు ప్రశ్నతో వస్తారు. జవాబు అందుకుని వెడతారు.

అమ్మమ్మ జవాబు తప్పు అయిన సందర్భం ఒక్కటీ నాకు తెలియదు. ఐనా నేనామె శక్తిని ఒప్పుకోను.

ఇక అమ్మమ్మతో నా అనుబంధం విషయానికొస్తే- పిల్లలెవరికైనా అమ్మమ్మలంటే ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కానీ ఆమె మనవలు, మనవరాళ్లలో- ఆమెకు నేను, నాకు ఆమె మరింత ప్రత్యేకం.

అమ్మమ్మ నీతులు చెబితే కథల్లా ఉండేవి. కథలు చెబితే ప్రవచనాల్లా ఉండేవి. పాట పాడితే లలితగీతంలా ఉండేది. తెలిసినవాళ్ల గురించే చెప్పినా- వాళ్ల గురించి అంతవరకూ తెలియనివెన్నో తెలిసేవి. ఆమె కళ్లతో చూస్తే ప్రపంచంలో అంతా మంచివాళ్లే. ఎవరిలోనైనా చెడు కనిపిస్తే- అది మనలోపం!

“అమ్మమ్మా! నువ్వో సూతమహర్షివి” అన్నానోసారి.

దానికామె నవ్వి, “నువ్వు నాకు శౌనకుడివి. ఐతే నువ్వొక్కడివే శౌనకుడివి” అని, “నువ్వు

చాలా గొప్పవాడివౌతావురా! కొంచెం స్వార్థాన్ని అదుపు చేసుకోవాలంతే!” అంది.

మామూలుగా అందనుకున్నాను కానీ- స్వార్థాన్ని అదుపు చేసుకోవడం ఎంత కష్టమో-

వసుధతో పెళ్లయినాకే తెలిసింది.

-----

పెళ్లంటే నూరేళ్లపంట కావచ్చు. కానీ ప్రేమ నూరేళ్లపంట కాదు.

పెళ్లికి ప్రాతిపదిక ప్రేమ ఐతే అప్పుడు పెళ్లీ నూరేళ్లపంట కాదు.

ఈ చేదు నిజాన్ని నేను వసుధని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక గ్రహించాను.

అదీ వసుధ కాదు- నేను మాత్రమే గ్రహించాను.

పాపం, వసుధ ఇంకా ప్రేమనీ, పెళ్లినీ కూడా నూరేళ్లపంట అనే అనుకుంటోంది.

నేను మాత్రం నా మనసులో ఏముందో బయటపడకుండా జాగ్రత్త పడుతున్నాను. నిజానికి వసుధకి ప్రేమపై నమ్మకం లేదు. ప్రేమించానంటూ నేనే తన వెంటబడ్డాను. అలాగని నాదీ ప్రేమ అనుకోను.

నేను ఆఫీసులో చేరిన రెండేళ్లకు నాకు పెర్సనల్ అసిస్టెంటుగా చేరేదాకా వసుధ ఎవరో కూడా నాకు తెలియదు.

ఆఫీసుకి ఇంచుమించు వళ్లంతా కప్పిన చుడీదార్లో వచ్చేది.

బాపు-రమణల సినిమాల్లో హీరోయిన్లలా మేకప్ లేని అందం. కళ్లలో- ఆ అందాన్ని రెట్టింపు చేసే అమాయకత్వం.

ఆఫీసులో ఆమెకి డ్యూటీ తప్ప మరేం పట్టేదికాదు. ఐతే పలకరించినవారికి ఆహ్లాదకరమైన చిరునవ్వుతో బదులిచ్చేది.

పియ్యే కావడంవల్ల నాతో సన్నిహితంగా ఉండేదామె. అప్పుడు నాలో మగాడికి మనసు చలించేది. ఐతే అది ప్రేమ కాదు.

మనసు మంచిది, వయసు చెడ్డది అన్నాడు ఓ సినీకవి. కానీ చెడ్డతనంలో మనసు వయసుకేమీ తీసిపోదని- వయసులో ఉన్న మగాడిగా నాకు తెలుసు. ఆ మగాడికి వసుధ కావాలనిపించింది.

పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు కాబట్టి ఆమెపై నాకున్నది మోహమే కానీ, ప్రేమ కాదు. అదీకాక అప్పటికే నా మేనమామ వెంకట్రావు కూతురు వేణిని నాకు అనుకుంటున్నారు. ఏడాదిలో తన డిగ్రీ పూర్తి కాగానే, నిశ్చితార్థం- ఆ వెంటనే పెళ్లి అని లోపాయికారీ కబురు. అందుకు నేను అభ్యంతరం చెప్పనూ లేదు.

వేణి కురూపి కాదు కానీ అందగత్తె కూడా కాదు. నాకైతే ఆకర్షణీయంగా అనిపించదు. ఐతే నా మేనమామ ఎంత డబ్బైనా ఇచ్చి వరుణ్ణి కొనగల ఆస్తిపరుడు. డబ్బు నాకు చేదు కాదు.

రూపం విషయానికొస్తే, మేమూ కాస్త ఉన్నవాళ్లమే ఐనా. ‘అందం కొరుక్కు తింటామా?’ అంది అమ్మ. ఇక్కడ సమస్య ఏంటంటే, వసుధది కొరుక్కు తినాలనిపించే అందం కావడం.

అంటే వేణిని పెళ్లాడే ముందు నాకు వసుధపై ఉన్న మోహం తీరాలి. ఆ ఆలోచన తప్పని నాకు అనిపించలేదు.

పెళ్లికిముందు మగాడు ఎలా తిరిగినా, పెళ్లయ్యేక మాత్రం భార్యకే కట్టుబడి ఉంటే- మంచివాడని సర్టిఫికెట్ ఇచ్చెయ్యొచ్చట. అందుకని పెళ్లికిముందు ఎలాగో తిరగడమే ​నియమంగా పెట్టుకునే మగాళ్లున్నారు.

వాళ్లని ఆదర్శంగా తీసుకున్నాను.

వసుధ ఉద్యోగిని. వయసులో ఉంది. ఆపైన నేనామెకు బాస్.

ప్రయత్నిస్తే లొంగుతుందనే నమ్మకం. మా సంబంధాన్ని రహస్యంగా ఉంచితే అది తప్పుగా భావించదనీ నాకు నమ్మకమే.

నిజానికి నాది ఆశ. దాన్ని నమ్మకంగా భ్రమిస్తున్నానని అనుమానముంది. ఐనా నా ఆలోచన మారలేదు కానీ ఇతరత్రా ఏమాత్రం చనువివ్వని ఆమెకు నా మనసులో ఉద్దేశ్యం తెలియజేసేదెలా?

అందులోనూ- ఆమె ఎప్పటికప్పుడు నన్నెక్కడుంచాలో అక్కడే ఉంచుతోంది.

కాలేజి రోజుల్లో మురళి అనే మిత్రుడుండేవాడు. అమ్మాయిలతో ఎక్కువగా తిరిగేవాడు.

“యువతీయువకులకి పరస్పరం ఆకర్షణ సహజం. అందుకు ఇద్దరికీ తాత్కాలికమైన ఆసరా ఇచ్చేదే ప్రేమ. నూటికి తొంబైతొమ్మిది ప్రేమలు అలాంటివే. కొన్నాళ్లు ప్రేమికుల్లా కలిసి తిరగడం, తర్వాత విడిపోవడం. పూర్వం దాన్ని మోసం అనేవారు. ఇప్పుడు దాని పేరు లవ్ బ్రేకప్. మోసపోయానని అనుకునే బదులు లవ్ బ్రేకప్ అంటే గౌరవంగానే కాదు, గొప్పగా కూడా ఉంటుంది. బ్రేకప్ సంప్రదాయం పుంజుకున్నాక సమాజంలో ప్రేమజంటల సంఖ్య పెరుగుతోంది” అన్నాడు.

నేను బ్రేకప్ కోసమే వసుధని ప్రేమించాలనుకున్నాను. అందుకు ఏకాంతంలో మురళి చిట్కాలు వాడాను.

వసుధ నా పియ్యే కదా, ఆఫీసులో మా ఇద్దరికీ ఏకాంతం తరచుగానే లభిస్తూంటుంది. కాఫీకి పిలిచాను, రానంది. తన పుట్టినరోజు తెలుసుకుని ఖరీదైనదే గిఫ్టిచ్చాను, వద్దంది. తన అందాన్ని పొగిడాను, అయిష్టంగా వింది తప్ప థాంక్సు కూడా చెప్పలేదు.

మరే దారీ తోచక, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పేశాను ఓసారి.

ఆమె నన్నదోలా చూసి, “మీ ఇంట్లో చెప్పారా?” అంది.

ఖంగు తిన్నాను. అది ప్రశ్నో, షరతో తెలియలేదు. అందుకని, “ఇది అర్థం లేని ప్రశ్న.

చెప్పానని నీతో అన్నాననుకో. చెప్పానో లేదో నీకెలా తెలుస్తుంది?” అన్నాను.

“మీరు ఇంట్లో చెబితే చాలు. నాకు తెలియడమెందుకు?” అందామె.

అర్థం కాలేదు, “అంటే?” అన్నాను.

“మీ పెద్దలు ఒప్పుకుంటే, నా అన్నావదినెలు వాళ్లని కలుసుకుంటారు” అంది వసుధ. అర్థమయింది. నేను ప్రేమ గురించి మాట్లాడితే ఆమె పెళ్లి గురించి మాట్లాడుతోంది. “మరి నీకు అభ్యంతరం లేదా?” అని జవాబు వినడానికి చెవులు రిక్కించాను. నన్ను కాస్త పొగుతుందేమోనని ఆశ!

“అభ్యంతరమెందుకు?” అందామె.

నా ఛాతీ ఉబ్బింది, “అంటే నువ్వూ నన్ను ప్రేమిస్తున్నావా?” అన్నాను.

“అమ్మానాన్నా ఉన్నప్పుడు ప్రేమంటే కొంత తెలిసేది. ఇప్పుడు నాకు ప్రేమంటే తెలియదు” అందామె.

గతుక్కుమన్నాను.

తనకు అమ్మానాన్నా లేరనీ, అన్నావదినెలకు భారంగా ఉంటోందనీ- మాటల సందర్భంలో చెప్పిందోసారి. ఆ నేపథ్యంలో ఇప్పుడన్నది గుండెలు పిండేసే మాట. కానీ నేను ముందుకెళ్లాలంటే, గుండెను దూరం పెట్టక తప్పదు.

“ప్రేమించకుండా పెళ్లెలా చేసుకుంటావ్?” అన్నాను అట్నించి నరుక్కొద్దామని.

“పెళ్లయ్యాకనే ప్రేమంటే తెలుస్తుందని ఎక్కడో చదివాను” అందామె.

అర్థమైపోయింది నాకు. ఆమె ప్రేమకు లొంగదు. ఆమెను స్వంతం చేసుకోవాలంటే పెళ్లి చేసుకోక తప్పదు.

అందంగా ఉంది. మంచమ్మాయి. ఉద్యోగం చేస్తోంది.

పెళ్లి చేసుకోవచ్చు- పర్యవసానానికి తట్టుకోగలిగితే….

మేనక కోసం విశ్వామిత్రుడు ఏళ్ల తరబడి చేసిన తపోఫలాన్ని వదులుకున్నాడు. ఐనా

ఆయన మేనకని పెళ్లీ చేసుకోలేదు, కూతురి బాధ్యతా తీసుకోలేదు.

వసుధ నాకిప్పుడో మేనక. ఎటొచ్చీ తనకితానుగా నా వెంటబడలేదు కాబట్టి- ఆమెను నా దాన్ని చేసుకుందుకు నేనామెను పెళ్లి చేసుకోక తప్పదు.

నాది మోహమేనని తెలుసు. ఐనా దానికి ప్రేమ అన్న పేరెట్టి ఇంట్లో చెప్పాను.

పెద్ద గొడవయింది. నేను దృఢంగా ఉన్నాను.

మాకూ వెంకట్రావు మామయ్యకీ చెడిపోయింది. నేను దృఢంగా ఉన్నాను. ఆవేశంలో అమ్మ, నాన్న కూడా నాతో తెగతెంపులు చేసుకుంటామన్నారు. నేను దృఢంగా ఉన్నాను.

అప్పుడు రంగంలోకి దిగింది అమ్మమ్మ. అమ్మమ్మకి నా మరదలు వేణి అంటే కూడా చాలా ఇష్టం. నాకూ, వేణికీ పెళ్లి చెయ్యలన్న ఆలోచన మొదట తనలోనే పుట్టిందట. అలా మొదలెట్టి, నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. నేను దృఢంగా ఉన్నాను.

అప్పుడు అమ్మమ్మ అమ్మకీ, మామయ్యకీ నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. వాళ్లూ దృఢంగా ఉన్నారు.

“వాణ్ణి సమర్థిస్తే- నీకూ మాకూ కూడా చెడిపోతుంది” అని వాళ్లామెను హెచ్చరించారు కూడా.

తర్వాత అమ్మమ్మ వసుధతో మాట్లాడింది. తర్వాత నాతో, “వసుధ చాలా మంచిది. తనని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎంతో బాగుంటుంది. మీ మధ్య ఏ తేడాలొచ్చినా నీవల్లే తప్ప తనవల్ల జరుగవు. ఆ విషయం మర్చిపోకు” అంది. నిజానికది నాకు హెచ్చరిక. అప్పటికది దీవెన అనుకున్నాను నేను.

కానీ నాలుగేళ్ల కాపురం తర్వాత-

-----

నాతో దాంపత్యజీవితాన్ని అంకితభావంతో స్వీకరించింది వసుధ.

ఆమె అందం, అమాయకత్వం, మంచితనం, నిబద్ధత ఏమాత్రం తగ్గలేదు. క్రమంగా నాకే ఆమెపై మోహం చల్లారింది.

అమ్మా నాన్నల కోపం ఇంకా అలాగే ఉంది. వాళ్ల సంపదకి ప్రస్తుతం నా తమ్ముడే ఏకైక వారసుడు.

నామీద కోపంతో నా మేనమామ వెంకట్రావు డబ్బుపోసి నా పెళ్లయిన ఆర్నెల్లకే నన్ను తలదన్నే అల్లుణ్ణి తెచ్చుకున్నాడు. ఆ అల్లుడి వైభోగం విన్నాక నేనేం కోల్పోయానో తెలిసొచ్చి, ‘అందం కొరుక్కు తింటామురా’ అన్న అమ్మ మాట జీవితవాస్తవంలా తోస్తోంది.

ఇప్పుడు వసుధ అందం కొరుక్కు తినాలనిపించడంలేదు. ఆమెనే కొరికి చంపెయ్యాలనిపిస్తోంది.

ఐనా మధ్యతరగతిలో దుర్మార్గంతో పాటే సంస్కారమూ కొంతైనా సహజీవనం చేస్తుంది కాబట్టి- మనసులోని అసంతృప్తిని వసుధకి కూడా తెలియనివ్వకుండా రోజులు గడిపేస్తుంటే- అనుకోకుండా ఘోరం జరిగిపోయింది.


పెళ్లై ఏడాదైనా తిరిగిందో లేదో, వేణి భర్త కారు ప్రమాదంలో చనిపోయాడు.

మనసులో ఎంత కోపమున్నా, రక్తసంబంధంకదా! ఓదార్పుకి మామయ్యింటికి వెళ్లాను. అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని వసుధని మాత్రం తీసుకెళ్లలేదు.

ఆశ్చర్యంగా అక్కడ అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య అంతా నాపట్ల సుహృద్భావం చూపించారు. మామధ్య ఏమీ జరుగనట్లే మసిలారు.

మేమంతా మళ్లీ ఎప్పటిలా కలిసిపోగలమని ఆశ పుట్టింది నాలో.

ఐతే, వెళ్లేటప్పుడు అమ్మ నన్ను పక్కకు పిలిచి, “పిల్లలు పుట్టే యోగ్యత లేనిదానికి పెళ్లామయ్యే అర్హత లేదు. ఎలాగో అలా ఆ దరిద్రాన్ని వదిలించుకో. మనం మళ్లీ ఎప్పటిలా కలిసుండొచ్చు” అనడంతో నా భ్రమలన్నీ తొలగిపోయాయి.

అప్పుడు మాకు కాస్త దూరంలో అమ్మమ్మ ఉంది. తనా మాటలు విన్నట్లే ఉంది.

“ఒక్కసారి నేను వీడితో మాట్లాడతాను. కాస్త పక్కకి వెడతావా?” అంది అమ్మతో.

అమ్మ అక్కణ్ణించి వెళ్లిపోయేక, “మీ అమ్మ చెప్పిందాన్నిబట్టి నీకేమర్థమయింది?” అంది అమ్మమ్మ నాతో.

ఒకసారి అమ్మ మాటలు విశ్లేషించుకున్నాను మనసులో.

అర్థం కావడానికేముంది- మేం మళ్లీ కలవాలంటే- వసుధకి పిల్లలు పుట్టాలి. లేదూ- వసుధని వదుల్చుకోవాలి. అదే అమ్మమ్మకి చెప్పాను.

అమ్మమ్మ తల అడ్డంగా ఊపింది, “ఇది సమయం కాదని డొంకతిరుగుడుగా చెప్పింది మీ అమ్మ. నాకలాంటి బాధ లేదు కాబట్టి సూటిగా చెబుతున్నా, విను” అంది.

ఆమె చెప్పింది విని షాక్ తిన్నాను.

వేణి ఇప్పటికీ నన్నే ఇష్టపడుతోందిట. తండ్రి బలవంతంమీద పెళ్లి చేసుకుని అయిష్టంగా కాపురానికెళ్లింది. ఇప్పుడు భర్త పోతే పోయేడన్న దిగులు కూడా లేదు తనలో.

నేను వసుధని వదుల్చుకుంటే, వేణిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని మామయ్య ఉద్దేశ్యం. దానికి అమ్మ సపోర్టుంది.

“మనం మళ్లీ ఎప్పటిలా కలిసుండొచ్చు” అన్న అమ్మ మాటల వెనుక ఇంత గూఢార్థముంది.

అమ్మలో అంత దుర్మార్గమా అని ఆశ్చర్యపడుతుంటే, “ఇంతకీ నీకు ఆశ్చర్యం కలిగిందా, కోపమొచ్చిందా?” అంది మనసు.

“కిరీటం ఇట్టా పెట్టుకుంటావా, ఇట్టా పెట్టుకుంటావా?” అన్న ‘రాజరాజ చోర’ సినిమాలో సరదా డైలాగులాంటిది కాదు ఆ ప్రశ్న!

నా వ్యక్తిత్వాన్ని సవాలు చేసే ప్రశ్న అది!

నాదాకా వచ్చేసరికి ఇబ్బందిగా ఫీలై, మనసుని పక్కకి తోసి, “ఇంతకీ నేనేం చెయ్యాలని నీ ఉద్దేశ్యం?” అన్నాను అమ్మమ్మతో.

మనుమరాలు జీవితం బాగుపడాలని అమ్మమ్మకీ ఉంటుంది. తనెంత మంచిదైనా తనదాకా వస్తే ఆలోచనలు వేరే వెడతాయి.

అమ్మమ్మ నా ప్రశ్నకి తడుముకోలేదు, “మనసు చిక్కబట్టుకుని ఇంటికెళ్లు. వసుధతో ఇక్కడ జరిగింది చెప్పు. ఇద్దరూ ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి” అంది.

ఆశ్చర్యపోయాను.

‘నువ్వు చాలా గొప్పవాడివౌతావురా! కొంచెం స్వార్థాన్ని అదుపు చేసుకోవాలంతే!’ అని హెచ్చరించిన అమ్మమ్మ- ఇప్పుడు అమ్మ మాటల్లోని స్వార్థాన్ని నిరసించకుండా, ఆలోచించమని అంటుందేమిటి?

స్థితప్రజ్ఞుల కోవలోకి వస్తుందనుకున్న అమ్మమ్మలో ఇంత స్వార్థమా?

బాగా ఆలోచిస్తే అమ్మమ్మ నేననుకున్నంత గొప్పది కాదనిపించింది. ఆమె అపూర్వశక్తీ పూర్తిగా నిజం కాదనిపించింది.

తనకే గనుక అపూర్వశక్తి ఉంటే- నా పెళ్లికీ, వేణి పెళ్లికీ పర్యవసానాలు ముందే తెలిసేవి. ముందే హెచ్చరించేది!

ఈ విషయం స్ఫురించగానే వసుధని వదుల్చుకునే విషయంలో, అమ్మమ్మ మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను.

స్వార్థం తెలివిని మింగేస్తుందంటారు. కానీ అది నా తెలివికి పదునెక్కించింది. నా మనసులో ఓ పథకం రూపు దిద్దుకుంది….

-----

ఇంటికెళ్లేక అమ్మమ్మ మాటలు మినహాయించి, మామయ్యింట్లో జరిగింది చెప్పాను. ముందు వసుధకి కలిగింది సంతోషం, “అంటే మీవాళ్లు మనవాళ్లయ్యే సమయం దగ్గర్లోనే ఉంది” అంది.

“అది నీ ప్రాణాలకి రిస్కు. ఆ రిస్కు నాకిష్టం లేదు” అన్నాను మనస్ఫూర్తిగా కాకపోయినా.

“నాకేమీ కాదు. మీరున్నారు” అంది వసుధ. అప్పుడు నాకామె గొర్రెలా కనిపించింది.

అద్దంలాంటి ఆమె ముఖంలో నేను కసాయి రూపంలో ప్రతిఫలించాను.

మాతృత్వంపైన కాంక్షో, నన్ను మావాళ్లతో కలపాలన్న అభీష్టమో, అసహాయతో చెప్పలేను.

ఆమె తన ప్రాణాలు రిస్కులో పడినా సరే, తల్లి కావడానికే నిశ్చయించుకుంది.

రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. ఆమె తల్లి కావాలంటే నేనామోదించాలి. ఆమోదిస్తే- అది హత్యే అంది మనసు. కాదనడం ఆత్మవంచనే ఔతుంది. చివరికి నన్నెంతగానో నమ్మిన వసుధకి కూడా మనసులో ఏదో మూల చివుక్కుమనకుండా ఉండదు.

ముందే ఆలోచించుకున్న పథకం ప్రకారం- అప్పుడామెకు అమ్మమ్మ అపూర్వశక్తిని మరింత గొప్పగా వివరించి, “ఓసారి తన సలహా తీసుకుందాం” అన్నాను.

“నాకైతే ఈ విషయంలో ఎవరి సలహా అక్కర్లేదు. నిర్ణయం ఐపోయింది” అంది వసుధ దృఢంగా.

“నీకోసం కాదు. నాకోసం” అన్నాను లౌక్యంగా.

“ఏదో యథాలాపంగా అడగడం వేరు. ఈ విషయమై పనికట్టుకుని ఆమెవద్దకెళ్లడం బాగుండదు” అంది వసుధ.

“అదీ ఆలోచించాను. మీ అన్నావదినెల్ని తీసుకెడదాం” అన్నాను ఠక్కున.

వసుధ వదిన పద్మ తండ్రికి ఓ కూతురు, తర్వాత ఓ కొడుకు, ఆ తర్వాత పద్మ. అంతా పెళ్లిళ్లై కాపురాలు చేసుకుంటున్నారు. ఆయన రెండేళ్ల క్రితం చనిపోయాడు. పోయేముందు తను కొన్న స్థలాల్లో రెండింటిని చెరో ఆడపిల్ల పేరిటా వ్రాసి, ఆ కాగితాలు పోస్టులో పంపేట్ట. ఇటీవల ఆ స్థలాల ధర బాగా పెరగడంతో పద్మ అక్క వాటిని అమ్మబోతూ, ఆ విషయం చెల్లికి చెప్పింది. అంతవరకూ పద్మకి ఆ స్థలం గురించి తెలియదు. తండ్రి పంపేడంటున్న కాగితాలు పద్మకి అందలేదు. అక్క మాటమీద ఆ స్థలాన్ని చెల్లికివ్వడానికి అన్నగారు ఒప్పుకోవడం లేదు. రెణ్ణెల్లుగా వాళ్లింట్లో ఈ విషయమై గొడవలౌతున్నాయి.

“మా అమ్మమ్మని ప్రశ్న అడుగుదాం. పని జరిగిందీ, మీవాళ్లకి లాభం. మనకీ ఆమె సలహామీద ధైర్యం” అన్నాను.

వసుధ కళ్లలో తడి. “మీకు నామీదే కాదు. మావాళ్లమీద కూడా ఎంత కన్సర్న్ అండీ” అంది.

గతుక్కుమన్నాను. నా ఆలోచనే వేరు. గత అనుభవాల్ని బట్టి అమ్మమ్మ ఆ కాగితాల ఆచూకీ చెప్పగలదనే నా నమ్మకం. ఐతే మెడికల్ సైన్సుకే కొరుకుపడని సమస్య వసుధది. ఐనా తన మనుమరాలు వేణి భవిష్యత్తు బాగుండాలని, తప్పక వసుధని తల్లి కమ్మని ప్రోత్సహిస్తుంది అమ్మమ్మ. అన్నగారి విషయంలో జరిగిన అద్భుతమే తన విషయంలోనూ జరుగుతుందని వసుధ నమ్ముతుంది. నా నిజాయితీని కూడా నమ్ముతుంది.

“మీ వాళ్లకి ఫోన్ చెయ్యి” అన్నాను వసుధతో.

-----

అంతా అనుకున్నట్లే జరిగింది.

“మీ ఇంటిపక్క విజయేశ్వరి అని ఒకావిడుంది. మీరింట్లో లేకపోతే, ఆ ఉత్తరాన్ని ఆమె తీసుకుంది. అదామె తన బీరువా లాకర్లో ఎడం పక్క మూలగా దాచి, తర్వాత ఆ విషయం మర్చిపోయింది. ఆమెకి మతిమరుపెక్కువ కదా! ఐనా ఫరవాలేదు. ఆ కవరింకా పెట్టినచోటే ఉంది. వెళ్లి తెచ్చుకోండి” అంది అమ్మమ్మ వసుధ అన్నా వదినెలతో.

తమ ఇంటిపక్క విజయేశ్వరి గురించి ఖచ్చితంగా అన్ని వివరాలు చెప్పడంతో వసుధ అన్నావదినెల అశ్చర్యానికి అంతు లేదు.

పద్మ వెంటనే విజయేశ్వరికి ఫోన్ చేస్తే అమ్మమ్మ చెప్పింది నిజమేనని తేలింది. ఆ కాగితాలు దొరికాయి.

వసుధ అన్నావదినెలు అమ్మమ్మకు సాష్టాంగపడిపోయారు.

అబద్ధమెందుకూ ఆ క్షణంలో నేనే షాక్ తిన్నాను.

పద్మకి ఆ క్షణంలో వచ్చిన లాభం లక్షల్లో ఉండొచ్చు. కానీ అమ్మమ్మ వాళ్ల దగ్గర నూటొక్క రూపాయలు మాత్రమే తీసుకుంది.

ఎలాగూ వచ్చాం కదా అన్నట్లు మా సమస్య కూడా అమ్మమ్మకి చెప్పాను. వేణికి అమ్మమ్మగా- తనేం చెబుతుందని ఊహించానో, ఇంచుమించు అదే చెప్పింది అమ్మమ్మ.

“నీకు మహాలక్ష్మిలాంటి ఆడపిల్ల పుడుతుంది. అత్తవారి ఆదరణ లభిస్తుంది. ఐతే నీ పురుడు హాస్పిటల్లో కాదు. ఇక్కడే ఈ ఊళ్లో నా ఇంట్లో పోస్తాను” అంది అమ్మమ్మ.

అమ్మమ్మ పట్ల అరాధనాభావంతో చూస్తున్న వసుధ కళ్లలో సంతోషంతో కూడిన మెరుపు కనిపించింది.

అర్థమైపోయింది నాకు. అమ్మమ్మలో స్వార్థం దుర్మార్గం స్థాయి కూడా దాటిపోతోంది.

“అమ్మమ్మా! నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ, పురుడు మంచి హాస్పిటల్లో పోయడం మంచిదేమో!” అన్నాను.

​అమ్మమ్మ నవ్వి, “డాక్టర్లు వాళ్లు చెప్పాల్సింది చెప్పారుకదా! వాళ్లకి తెలిసినంతవరకూ వాళ్లు చెప్పింది నిజమే! కానీ ఈ లోకంలో విజ్ఞానానికి అందని విశేషాలు చాలా ఉన్నాయి. అవి చర్చలతో అర్థం కావు. స్వామి నాకు చెప్పాడు- వసుధకి ఇక్కడ పురుడు పొయ్యమనీ, అందుకు మనూరి మంత్రసాని ఎల్లాయమ్మ సాయం తీసుకోమనీ. పురుడు పొయ్యడంలో తనకి తెలిసిన ఒడుపులు- పేరుపడ్డ వైద్యులకి కూడా తెలియవని పేరు. నీకు తెలుసో తెలియదో, అప్పుడప్పుడు పట్నంనుంచి తనకోసం కబురొస్తుంటుంది. తనకి అనుభవమే తప్ప, శిక్షణ లేదు. వయసుమీద పడ్డప్పట్నించీ మంత్రసాని పని మానేసింది కానీ, నేను చెప్పిన కేసులు మాత్రం కాదనదు. మా ఆధ్వర్యంలో వసుధ పండంటి బిడ్డని ఎత్తుకోవడం గ్యారంటీ. అదే గ్యారంటీ ఇచ్చే డాక్టరుంటే మాత్రం వసుధ పట్నంలోనే పురుడు పోసుకోవచ్చు” అంది.

అమ్మమ్మ ఇచ్చే గ్యారంటీ మేలు చేసేది వసుధకా, వేణికా అన్నది నాకు అనుమానమే! కానీ పట్నంలో అలాంటి గ్యారంటీ ఇచ్చే డాక్టర్లు, హాస్పిటల్సు లేవు.

అక్కడున్న గ్యారంటీ- ఖర్చుకే!

మా ఇద్దరి ఓటూ అమ్మమ్మకే పడింది…..

-----

వసుధకి మూడో నెల. హాస్పిటలుకి తీసుకెడితే డాక్టర్లు బాగా తిట్టారు. వసుధ మాత్రం చాలా సంతోషంగా ఉంది.

చిప్పలోకి ముడుచుకుని ఉన్న తాబేలులా ఉంది వసుధ. అమ్మ, నాన్న, మామయ్య, అత్త, వేణి- అదృశ్యంగా ఉన్నారు ఆమె చుట్టూ. పెద్దదౌతున్న పొట్ట ఆమె మృత్యురహస్యంలా ఉంది. ఆ రహస్యం తెలిసీ, ఉపేక్షిస్తున్న వాళ్లం నేను, అమ్మమ్మ!

అపరాధభావం వేధిస్తుంటే, తప్పించుకునే దారి వెదుకుతుంటే- అప్పుడు తట్టింది నాకు! వేణికి నేనంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమె భర్త అకాలమరణానికి కారణమైంది. అంటే- మన అభీష్టం మంచిదైతే- దేవుడే దారి చూపిస్తాడు. వసుధ విషయంలోనూ ఏది మంచో ఏది చెడో నిర్ణయం దేవుడికే వదలడం మంచిది.

అదే చేశాను. వసుధకి ఐదో నెల రాగానే అమ్మమ్మ ఇంట్లో దిగవిడిచి వచ్చాను.

తర్వాత అంతా యాంటీక్లైమాక్స్-

అంతా అమ్మమ్మ చెప్పినట్లే జరిగింది.

వసుధకి సుఖప్రసవమై శ్రీమహాలక్ష్మిలాంటి ఆడపిల్ల పుట్టింది.

చూడ్డానికి అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య, వేణి కూడా వచ్చారు. పాపని ముద్దులాడారు.

వసుధని స్నేహభావంతో పలకరించారు.

అమ్మమ్మ ఇంట్లో ఉన్నందున వసుధ గురించి నాకు హాస్పిటలు ఖర్చులు కూడా లేవు. పురుడు పోసిన మంత్రసాని ఎల్లాయమ్మని కానుకలతో ముంచెత్తాలనుకున్నాను. కానీ అమ్మమ్మ, “తనిప్పుడు వెయ్యిన్నూట పదార్లు మించి ఒక్క పైసా తీసుకోదురా” అంది. మనిషికి ఎంతో కొంత స్వార్థముండడం సహజం. స్వార్థం ఎంతో ఉన్నవాళ్లు దుర్మార్గులు. కొంతే ఉన్నవాళ్లు సామాన్యులు. లేనివాళ్లు స్థితప్రజ్ఞులు.

సమాజంలో లబ్దప్రతిష్ఠులైన చాలామంది రాగద్వేషాలకు అతీతం కాదనడానికి ఎన్నో నిదర్శనాలున్నా- వారిని వేదికలపై ‘స్థితప్రజ్ఞులు’ అని పొగడ్డం రివాజు. నాకు తెలిసిన స్థితప్రజ్ఞుల జాబితా వెయ్యమంటే- ఇంతవరకూ నేను వెయ్యగల పేరు అమ్మమ్మది మాత్రమే. వసుధ పురుడు తర్వాత ఇప్పుడా జాబితాలో అమ్మమ్మకు తోడుగా ఎల్లాయమ్మ కూడా చేరింది!

నాకూ ఆ జాబితాలో చేరాలని ఉంది. అందుకు ఏం చెయ్యాలి?

“నువ్వు చాలా గొప్పవాడివౌతావురా! కొంచెం స్వార్థాన్ని అదుపు చేసుకోవాలంతే!” అన్న అమ్మమ్మ మాటలు చెవుల్లో గింగురు మన్నాయి.….

---౦---

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.


581 views

Comentarios


bottom of page