top of page

ప్రేమ ‘భ్రమ’రం - 7

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Prema Bhramaram - 7' New Telugu Web Series


Written By Vasundhara


రచన: వసుంధర
వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఏడవ భాగం


గత ఎపిసోడ్ లో...

రావి చెట్టు దగ్గర నాకు అమోఘ్ పరిచయం అవుతాడు.

అమోఘ్‌, రిక్తలు ప్రేమించుకున్నారు. పెద్దలు అంగీకరించక పోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

ఎవరికీ తెలియకూడదని రిక్త పురుష వేషంలో ఉంటుంది.

నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది.


ఇక ప్రేమ ‘భ్రమ’రం ఏడవ భాగం చదవండి ...


ఐదింటికల్లా లేచిపోయాను. క్షణాలమీద తెమిలాను. డ్రెస్సు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఒకటికి రెండు సార్లు తల దువ్వాను.

బైక్‌ తియ్యకుండా క్యాబ్‌ బుక్‌ చేశాను.


చెప్పినకంటే ముందుగా పావు తక్కువ ఏడుకి అమోఘ్‌ ఇల్లు చేరి తలుపు తట్టాను.

తలుపు తెరుచుకుంది.

అమోఘ్‌ తీస్తాడనుకున్నాను. కానీ కళ్లముందు ఓ మెరుపు తీగ.

కళ్లు జిగేల్మన్నాయి.


‘‘విచల్‌ గారా?’’ అందామె.

కలస్వనం. చెవులని తాకిన శబ్దతరంగాలు - వంటిని జలదరింపజేశాయి.

ఏదో అందామనుకున్నాను. నోట మాట రాలేదు.


‘‘కూర్చోండి - ఆయన స్నానం చేస్తున్నారు’’ అని లోపలకు వెళ్లిపోయిందామె.

రిక్త.


అపురూప సౌందర్యవతి. మీనాక్షి థియేటర్లో అమోఘ పక్కన చూసిన వ్యక్తి ఈమే అంటే చచ్చినా ఒప్పుకోను.


వెళ్లి సోఫాలో కూర్చున్నాను.

రిక్త రూపం నన్నింకా వెంటాడుతోంది. ఎంత బాగుంది!


‘ఈమధ్య- వయసులో ఉన్న ఆడపిల్లలు మరీ ఎక్కువ అందంగా కనిపిస్తున్నారు నీకు’ అంది మనసు.

అది నిజమనుకోను.


రోజూ ఎందరో అమ్మాయిల్ని చూస్తున్నాను. బాగుంటే ఒకటికి రెండుసార్లు చూస్తాను. తర్వాత మర్చిపోతాను.

కానీ రిక్త సౌందర్యం ఎందుకో నన్ను వెంటాడుతోంది.


ఆమె గురించి ఎక్కువగా ఆలోచించడంవల్ల కలిగిన కుతూహలమేమో!

ఆమోఘ్‌ వచ్చేసరికి ఏడు కావడానికింకా ఓ నిముషముంది.


నన్ను చూస్తూనే, ‘‘నాకు టైమంటే టైమే కానీ - బిఫోర్‌ టైం వచ్చేవాళ్లు నాకెక్కువ నచ్చుతారు. థాంక్స్‌ ఫర్‌ ఆనరింగ్‌ మై ఇన్విటేషన్‌ అండ్‌ ఆనరింగ్‌ మీ విత్‌ యువర్‌ ప్రిజెన్స్‌’’ అన్నాడు.


రొటీన్‌ మర్యాద. మాట మార్చడానికి, ‘‘నిన్న సినిమా ఎంజాయ్‌ చేశారా?’’ అన్నాను.


‘‘ఎంజాయ్‌ అంటే మామూలు ఎమజాయ్‌మెంట్‌ కాదు. ఇట్సే గ్రేట్‌ మూవీ. పౌరాణికాన్ని సాంఘిక చిత్రం అనిపించేటంత వాస్తవంగా తీశారు. హేట్సాఫ్‌ టు ది ప్రొడక్షన్‌ టీమ్‌. మొదట్నించి చివరిదాకా సినిమాలో లీనమైపోయాం. ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు. ఇంటర్వల్లో స్నాక్స్‌ తీసుకుంటూ కూడా అంతవరకూ చూసింది నెమరేసుకున్నామంతే! ఒక సినిమాని అలా ఆస్వాదించడం బహుశా జీవితంలో మొదటిసారి అనుకుంటాను. రిక్త కూడా ఆ మాటే చెప్పింది’’ అన్నాడు అమోఘ్‌.


‘‘అక్కడ మీకు తెలిసినవాళ్లెవరూ తగల్లేదా?’’ అన్నాను కుతూహలంగా.


‘‘లేదు. మీరక్కడ కనిపించారు కానీ, లక్కీగా మమ్మల్ని పలకరించలేదు. పలకరించినా, నేను గుర్తుపట్టనట్లు నటించేవాణ్ణి. నాకా అవసరం తప్పించినందుకు థాంక్స్‌!’’ అన్నాడు అమోఘ్‌.


ఘటికుడే - నన్ను చూసేడన్న మాట! కానీ ఎక్కడా దొరకలేదు.


‘‘నటించడమెందుకు? కనిపించి పలకరిస్తే తప్పేముంది?’’ అన్నాను.


‘‘రిక్త అప్సెట్టవుతుంది. ప్రస్తుతం తను చీకటి జీవితం గడుపుతోంది. ఆ చీకట్లో నా ఒక్కడితోనే సాహచర్యం. ఐనా ప్రేమబంధంతో మేమిద్దరం ఇంట్లో సంతోషంగా ఉండగల్గుతున్నాం. తను పక్కనుండగా బయట ఎవరైనా నన్ను పలకరించినప్పుడు - అలా తనని పలకరించేవాళ్లు ఎవరూ లేరని అప్సెట్టయి - డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది రిక్త. అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉంటాను’’ అన్నాడు అమోఘ్‌.


జాలేసింది.

బ్రతికున్న మనిషి రిక్త. చనిపోయినట్లు అంతా అనుకోవాలి.

పరిస్థితి విచిత్రమే కాదు, అనుభవానికి భయంకరం.


‘‘మీరు నాకు మీనాక్షీ థియేటరుకి వెడుతున్నట్లు చెప్పకుండా ఉండాల్సింది. తెలిస్తే, చూడాలని కుతూహలముంటుంది కదా!’’ అన్నాను నొచ్చుకుంటూ.


‘‘రిక్త పురుషవేషం గురించి మీకు చెప్పినప్పుడు, ఆ వేషంలో ఆమెను చూడాలని మీలో కుతూహలం రేగినట్లు కనిపెట్టాను. అందుకే మా సినిమా ప్రోగ్రాం గురించి చెప్పాను. ఐతే - నాకు మీ సంస్కారంపై నమ్మకమే! మీరు నన్ను పలకరించరని అనుకున్నాను. అలాగే జరిగింది’’ అన్నాడు అమోఘ్‌.


మనుషుల్ని బాగా చదివినట్లున్నాడు. నా గురించి కరెక్టుగా ఊహించాడు.

‘‘కానీ - అప్పుడు మీ పక్కనున్నది ఓ అమ్మాయని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’’ అన్నాను.


‘‘అందుకే కదా, అప్పుడప్పుడైనా ఇద్దరం కలిసి బయట తిరగగల్గుతున్నాం’’ అన్నాడు అమోఘ్‌.


నేను సాలోచనగా తల అడ్డంగా ఊపి, ‘‘నిన్న థియేటరు దగ్గర మీ పక్కనున్నది అమ్మాయి కాదు. అబ్బాయి. ఎందుకో మీరు అబద్ధం చెబుతున్నారు’’ అన్నాను దృఢంగా.

‘‘సరే, ఓసారి తనని పిలిచి, మీ ఎదుటే మేకప్‌ మార్పిస్తాను. అప్పుడు నమ్మక తప్పదు మీకు’’ నవ్వాడు అమోఘ్‌.


‘‘అలా చెయ్యండి. ఇప్పుడే నమ్ముతాను’’ అన్నాను.

అమోఘ్‌ ముఖం గంభీరంగా ఐపోయింది. ‘‘సారీ, ఇప్పుడు కుదరదు’’ అన్నాడు.

‘‘ఏం?’’ అన్నాను అనుమానంగా.


‘‘తనకి మూడ్‌ పాడయింది. రాత్రినుంచీ డిప్రెషన్లో ఉంది’’ అన్నాడు అమోఘ్‌.

‘‘ఇష్టమైన సినిమా చూసేక డిప్రెషనెందుకొచ్చింది?’’ అన్నాను మరింత అనుమానంగా.

‘‘ఆ సినిమా గురించి వాళ్ల నాన్నగారు ఇంట్లో ఎంతో గొప్పగా చెబుతూండేవారుట. సినిమా చూస్తున్నంతసేపూ బాగానే ఉంది. పూర్తయ్యేక ఆయన గుర్తుకొచ్చి అదోలాగైపోయింది. తనూ, తనవాళ్లూ కలిసే అవకాశం ఈ జన్మకి రాదనుకుంటూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది’’ అన్నాడు అమోఘ్‌.


ఇందాకనే తనని చూశాను. చలాకీగా ఉంది. మరి ఇతగాడు రాత్రినుంచీ డిప్రెషన్లో ఉందంటాడేమిటి?


పురుషవేషం విషయమై నా సవాలుని ఎదుర్కోలేక - ఇతడిలా వంక పెడుతున్నాడా?

‘‘ఒక్కసారి ఆమెని పిలిచి పరిచయం చెయ్యండి. ఇలాంటి సమయంలో వేషాలు మార్చడం గురించి మాట్లాడుకోవద్దు. తన డిప్రెషన్‌ పోయే టాపిక్సు తీసుకొద్దాం’’ అన్నాను.


‘‘సారీ! డిప్రెషన్లో ఉండగా ఎవర్ని కలవడానికీ తను ఇష్టపడదు. ఈరోజు నేనామెని మీకు పరిచయం చెయ్యలేను’’ కొంచెం నిక్కచ్చిగానే అన్నాడు అమోఘ్‌.

‘ఇందాకా నేను చూసినప్పుడు బాగానే ఉంది కదా’ - అందామనుకున్నాను.

కానీ నేనామెని చూసిన విషయం అతడికి తెలిసినట్లు లేదు. తెలిస్తే ఇలా అనడు.


అమోఘ్‌ నా సంస్కారాన్ని పొగిడి కొద్ది క్షణాలే అయింది. ఇప్పుడిలాగనడం ఆతడి నిజాయితీని శంకించడం ఔతుంది. అది సంస్కారం కాదు. ‘‘ఈ విషయం నాకు తెలియదు. సారీ! మనం టిఫినుకి ఆర్డరిద్దామా - నా మొబైల్లో స్విగ్గీ యాప్‌ ఉంది’’ అన్నాను.


కాఫీ, టిఫిను - ఇక్కడే అని అతగాడు చెప్పిన విషయం గుర్తు చేసినట్లుంటుంది. స్విగ్గీకి చెబుతాననడం మర్యాదగా ఉంటుంది.


అమోఘ్‌ నవ్వి, ‘‘మీకైతే ఇప్పుడు తెలిసింది కానీ, నాకీ పొజిషన్‌ రాత్రినుంచీ తెలుసుగా! అందుకని ఉదయమే అన్ని ఏర్పాట్లూ చేశాను’’ అని, ‘‘మిస్‌ రూపా!’’ ఆని పిలిచాడు.

కొద్ది క్షణాల్లో ఓ ట్రాలీ తోసుకుంటూ అక్కడికొచ్చింది మిస్‌ రూప.

ఆమెను చూడగానే అర్థమయింది.


ఇందాకా నేను రిక్త అనుకున్న అమ్మాయి రిక్త కాదు, రూప!

చాలా సందేహాలు ఒక్కసారిగా తీరిపోయాయి. ‘ఇంకా నయం - రిక్తని ముందే చూసినట్లు అమోఘ్‌కి చెప్పలేదు’ అనుకున్నాను.


ముందు ఇడ్లీ. తర్వాత ఉప్మా పెసరట్‌. తర్వాత కాఫీ. ఆన్నీ తాజాగా వేడి వేడిగా మహా రుచిగా ఉన్నాయి.


టిఫిన్‌ చేస్తుండగా ఆమోఘ్‌ చెప్పాడు.

పెళ్లిళ్లలో కేటరింగులా, ఇళ్లకి ఇదో మినీ కేటరింగ్‌ సర్వీసు.

మర్యాదలు ఇంట్లో లాగే ఉంటాయి.


అతడు చెబుతుంటే, రూప నాకు నాలుగు విజిటింగ్‌ కార్డులిచ్చి, ‘‘ఒకటి మీకూ, మిగతావి మీకు తెలిసినవాళ్లకి ఇవ్వడానికీ’’ అంది.


‘‘నీతో ఓ సెల్ఫీ కూడా తీసుకోనిస్తే - ఆ ఫొటో విజిటింగ్‌ కార్డుకంటే ఎక్కువగా పని చేస్తుంది’’ అన్నాడు అమోఘ్‌.


‘‘ష్యూర్‌’’ అంటూ ఆమె వెంటనే నాతో ఓ సెల్ఫీ దిగింది. ఆవెంటనే నాకా ఫొటో పంపింది.

మా టిఫిన్లయ్యేక - ఆమె వెళ్లిపోయింది.


నాకిదో కొత్త అనుభవం. తేరుకుందుకు కొద్ది క్షణాలు పట్టింది.


ఇక రిక్తని చూసే అవకాశం లేదని రూఢి అయ్యేక, ‘‘నేనిక బయల్దేరతాను. మీ ఆతిథ్యానికి థాంక్స్‌. కానీ ఒకందుకు నాకు బాధగా ఉంది’’ అన్నాను.


‘‘సరదాగా కాసేపు గడిపాం. అందుకు సంతోషించాలి. మీకు రిక్తని చూపించాలనుకున్నాను. చూపించలేకపోయాను. అందుకు నేను బాధ పడాలి, మీరు కాదు....’’


‘‘అది సరే - కానీ మీకో సమస్య ఉంది. నేను మీ ఇంటికొస్తే, ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని మీరనుకున్నారు. కానీ ఏ పరిష్కారం తోచకుండానే నేను వెళ్లిపోతున్నానని నాకు బాధగా ఉంది’’


‘‘పరిష్కారం తోచలేదని ఎందుకనుకుంటున్నారు?’’


‘‘ఐతే ఆ పరిష్కారమేమిటో చెప్పండి’’ అన్నాను.


‘‘ఆర్ట్‌ ఫిల్మ్‌ చూసి కథేమిటంటే ఏం చెబుతాం? కథేదో ఉంటుంది కానీ, విమర్శకులు చెప్పేదాకా అది మన అవగాహనకి రాదు’’ అన్నాడు అమోఘ్‌.


‘‘ఆర్ట్‌ ఫిల్ము వేరు. నిజ జీవితంలో ప్రేమ వేరు. ఇది పట్టపగలు సూర్యకాంతి అంత స్పష్టంగా తెలుస్తుంది’’ అన్నాను.


‘‘అలాగే అనుకున్నా - సూర్యకాంతి తెల్లగా ఉంటుంది. కానీ అది ఏడు రంగుల మిశ్రమం. ఏవీ ఆ ఏడు రంగులు - అంటే చూపించ డానికి ఓ పట్టకం కావాలి. ప్రస్తుతానికి నాదగ్గర పట్టకం లేదు. అది దొరకగానే - అన్నీ మీకు చెబుతాను’’ అన్నాడు అమోఘ్‌.


అమోఘ్‌ నా దగ్గర ఏదో దాస్తున్నాడు. అందుకు తన మాటకారితనాన్ని ఉపయోగిస్తున్నాడు.


రిక్తతో సినిమాకెడతా అన్నాడు. ఎవరో యువకుడితో సినిమాకొచ్చి, ఆ యువకుడే రిక్త అన్నాడు.


రిక్త చేత ఆతిథ్యమిప్పిస్తానన్నాడు. ఏదో కేటరింగ్‌ పార్టీనుంచి ఓ చక్కనమ్మని పిలిపించి చక్కగా టిఫిన్‌ పెట్టించాడు.


రిక్త ఇంట్లోనే ఉందంటాడు. డిప్రెషన్లో ఉంది కాబట్టి చూపించనంటాడు.

అసలు రిక్త ఉందా? ఉంటే ఆమెని చూపించడానికి సంకోచమెందుకు?

లేకుంటే - ఉందని అబద్ధం చెప్పాల్సిన అవసరమేమిటి?

ఇంతకీ అతడి సమస్య నావల్ల ఎలా పరిష్కారమౌతుంది?


‘‘పరిష్కారం తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. పట్టకం దొరకగానే, వెంటనే ఫోన్‌ చెయ్యడం మర్చిపోవద్దు’’ అని అతడి వద్ద సెలవు తీసుకున్నాను.

- - - - -

అమోఘ్‌ గురించిన ఆలోచనలు ఒక రోజంతా నన్ను వెన్నాడాయి.

అతడు చెప్పింది నిజమే ఐతే - అతడిదో అపూర్వ ప్రేమ కథ.


ప్రాణాలకి ప్రమాదమని తెలిసీ, అతడు రిక్తని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రాణాలకు ప్రమాదమని తెలిసి - ఆమె బ్రతికున్నా లేనట్లే నటిస్తున్నాడు.

వారిద్దరిదీ అజ్ఞాత కాపురం.


పాండవుల అజ్ఞాతవాసం ఒక్క ఏడాది. మరి వీళ్ల అజ్ఞాత కాపురం ఎన్నాళ్లు?

వాళ్ల ప్రేమకథలో ఈ అజ్ఞాత కాపురం ఎన్నాళ్లన్నది నేను నిర్ణయిస్తానని అమోఘ్‌ నమ్ముతున్నాడు. అందుకే నన్ను తనింటికి ఆహ్వానించాడు.


నాకు ఫలితమేం కనబడలేదు. కానీ అమోఘ్‌ ఉందంటాడు.

ఈ మొత్తం కథలో నాకు తెలియని ఏదో మెలిక ఉంది. దానంతటదే బయటపడేదాకా నేను చెయ్యగలిగింది లేదు.


ప్రస్తుతానికి నేనీ ప్రేమకథని పక్కన పెట్టి, మరో ప్రేమకథ గురించి ఆలోచించాలి.

అదే విచిత్రం.

ప్రేమ పెళ్లిళ్లని నిరసించే నేను - ప్రేమ పెళ్లిళ్లకి సహకరించేందుకు ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.


ముందు నేను ముక్తని కలుసుకోవాలి.

ఎందుకో ముక్తని తల్చుకోగానే వళ్లంతా ఏదో పులకరింత. ఆ వెనువెంటనే వళ్లంతా భయంతో జలదరింపు.


అపరిచిత యువతి ముక్త. ఆమెను తల్చుకుని నేనెందుకు పరవశించాలి? ఎందుకు భయపడాలి?

ఆ రాత్రి గదిలో మంచంమీద కూర్చుని ఇదే ఆలోచిస్తున్నాను.


మనసు చిక్క పట్టుకుని - మొబైల్లో కంటాక్టు నంబర్సు చూశాను. ముక్త పేరిట స్వర ఇచ్చిన మొబైల్‌ నంబరుంది.

నంబరు నొక్కేముందు స్వరకి ఫోన్‌ చేసి, ‘‘ముక్తతో అపాయింట్‌మెంట్‌ తీసుకోబోతున్నాను. ఎనీ టిప్స్‌?’’ అన్నాను.


‘‘మామూలుగా మాట్లాడండి. ఆమె మిమ్మల్ని కలుసుకుందుకు ఒప్పుకుంటుంది’’ అంది స్వర.

‘‘ఎక్కడికి రమ్మనను?’’ అడిగాను.


‘‘వేరెక్కడో వద్దు. బాగుండదు. నేరుగా ఆమె ఇంటికే వెళ్లండి’’

‘‘ఇంటికెడితే బాగుంటుందా?’’ ఆశ్చర్యంగా అడిగాను.


‘‘ఆమెకి అదే ఇల్లు, అదే ఆఫీసు. కాబట్టి ఇంటికెళ్లినా ఆఫీసుకెళ్లినట్లే! ఇక ఇంట్లో ఎప్పుడూ వాళ్లవాళ్లు ఎవరో ఒకరుంటారు. అంచేత అక్కడ కలుసుకోవడమే మర్యాదగా ఉంటుంది’’ అందామె.


ఫోన్‌ పెట్టేసేలోగా - ఆమె ముక్త ఇంటి గురించి కొన్ని వివరాలు కూడా చెప్పింది.

స్కూల్లో మొదటిసారి సాటి పిల్లలతో కలిసి ఎక్స్‌కర్షన్‌కి వెళ్లినప్పుడు కలిగిన థ్రిల్‌ మరువలేను. ఇప్పుడూ అలాంటిదే థ్రిల్‌!


ముక్త నంబరు మననం చేసుకున్నాను.

అంకెలు నొక్కుతుంటే - వేళ్లు వణికాయి.

అవతల ఫోను రింగవుతుంటే - చెవుల్లో ఏదో కలవరం.

‘‘హలో!’’ అంది అవతలి గొంతు.


ముక్త గొంతు మొదటిసారిగా వింటున్నాను.

ఫోనుకి చాలా మామూలు రింగ్‌ టోన్‌. కానీ అదే ఏదో మధుర వాద్యాన్ని మీటిన స్వరంలా ఉంది.


‘‘హలో’’ మళ్లీ అంది ముక్త.

నన్ను నేను సంబాళించుకున్నాను, ‘‘మాట్లాడుతున్నది ముక్త గారేనా?’’ అన్నాను.

‘‘ఔను. మీరెవరు?’’


ముక్తే మాట్లాడుతోంది.

నా మెదడులో ఆమె ఫొటో మెదిలింది. ఆ ఫొటో - మనిషి ఆకారంలో నా పక్కకొచ్చి చెవిలో చెబుతున్నట్లుంది.


శబ్దతరంగాలు అంత మధురంగా ఉంటాయని నాకు తెలియదు.

‘‘నా పేరు విచల్‌. ఒకసారి మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలనుకుంటున్నాను’’ అన్నాను.


‘‘ఎందుకు?’’ అందామె.

గొంతులో తిరస్కారం లేదు. కుతూహలముంది.


‘‘ఫోన్లో చెప్పలేను. కలుసుకున్నప్పుడు చెబుతాను’’ అన్నాను.

అలా చెబితే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది?


ఆమెని ఒప్పించడం సులభమని స్వర చెప్పింది. ఆ ధైర్యంతో అలా అనగలిగాను.

స్వర మాట నిజం చేస్తూ, ‘‘ఎక్కడ కలుసుకుంటారు?’’ అందామె వెంటనే.

స్వర ఇచ్చిన హింట్‌ గుర్తుంది. ‘‘మీ ఇంట్లోనే’’ అన్నాను.

క్షణం నిశ్శబ్దం.


ఏమనుకుంటుంది - ‘ఎవరీ కుర్రాడు - నాకు ఫోన్‌ చేసి, నాతో మాట్లాడ్డానికి నా ఇంటికొస్తానంటాడు -’ అనుకుంటుందా?

తీవ్రంగా మందలిస్తుందా?


అలాగేం జరుగలేదు.

‘‘ఐతే - ఉదయం పదిన్నరకి రండి’’ అంది ముక్త.


‘‘హుర్రే’’ అనుకున్నాను మనసులో. పైకి మాత్రం, ‘‘థాంక్యూ వెరీ మచ్‌’’ అని ఫోన్‌ కట్‌ చేశాను.

ఇంకా మాట్లాడాలనుంది. కానీ బెడిసికొడుతుందని భయం.


ముక్తని వాళ్లింట్లోనే కలుసుకోవడం మంచిదని స్వర చెప్పింది.

ముక్త ఆన్‌లైన్‌ జాబ్‌ చేస్తోందిగా - ఆమె ఇల్లు కదలక్కర్లేదు కానీ - ఆ సందర్భంగా కొందరామెని కలుసుకుందుకు వస్తుంటారు.


ఆడవాళ్లుంటారు, మగవాళ్లుంటారు. ఆమెను కలుసుకుని మాట్లాడి వెళ్లిపోతుంటారు.

ఎలాగూ ఇంట్లోవాళ్లకి ఆమెపైన నమ్మకం. ఆపైన వచ్చినవాళ్లతో ఆమెకి ప్రైవసీ ఏముండదు.


ఆ విషయం చుట్టుపక్కలవాళ్లకు తెలియదు కాబట్టి - ఇంటికి వచ్చేపోయేవాళ్ల గురించి కొందరు చెవులు కొరుక్కోవచ్చు. కానీ ఆ అవకాశానికి తావివ్వని హోదాని కంపెనీ ఆమెకిచ్చింది.


తనకున్న పరిచయాలతో తనుండే వీధిలో - ముగ్గురమ్మాయిలకీ, ఇద్దరబ్బాయిలకీ ఆన్‌లైన్‌ ఆసైన్‌మెంట్సు ఇప్పించిందామె. ఆ పిల్లలు ఇంట్లో కూర్చునే నెల నెలా కొంత డబ్బు సంపాదిస్తున్నారు.


ఆమె చేసే ఆన్‌లైన్‌ జాబ్‌ గౌరవప్రదమైనదని వారంతా నమ్ముతారు. నమ్మడం వారికి అవసరం కూడా. ఆమె మీద బురద చల్లితే - అది తమపైనా చిందుతుందన్న భయమూ వారికుంది.


ఇంతకీ - ముక్త ఎవర్ని కలుసుకున్నా - అది రహస్యమేం కాదు.

వాళ్లింట్లో ఓ హాల్లో - ఆఫీసుకోసం చిన్ని క్యూబికిల్‌ కట్టారు. అది సౌండ్‌ప్రూఫ్‌ గది. దాని తలుపులు గాజువి. లోపల చిన్న బల్ల. దానిమీద కంప్యూటరు.


బల్ల వెనుక ముక్త కూర్చుంటుంది. బల్లకి ఇవతల విజిటర్సు కోసం రెండు కుర్చీలు. గదిలో ఓ పక్కగా పైల్సు పెట్టుకునే అలమర.


గది పూర్తిగా ఎయిర్‌ కండిషన్డు. గది లోపల ఏంజరుగుతున్నదీ బయటివారికి కనబడుతుంది.

లోపలి మాటలు బైటకీ, బైట మాటలు లోపలికీ వినబడవు.


ఆ క్యూబికిల్‌ కట్టడానికైన ఖర్చు ఆన్‌లైన్‌ కంపెనీయే భరించింది.

ఇవీ, పనికొచ్చే మరికొన్ని వివరాలూ స్వర నాకు చెప్పింది.

- - - - -

ముక్త మామూలు అమ్మాయి కావచ్చు. కానీ నా మనసెందుకో ఆమె ఓ సెలబ్రిటీ అని ఫిక్సయిపోయింది.

ఆమె ముందు మెహర్బానీకి పోదల్చుకోలేదు. క్యాబ్‌ బుక్‌ చెయ్యకుండా బైక్‌ మీదనే బయల్దేరాను.


మొదటి సారి ఆమె ఇంటికి వెళ్లడం.

కానీ అడ్రసుని గూగుల్‌ మ్యాప్స్‌ బాగానే పట్టేశాయి.


‘గమ్యం చేరుకున్నారు’ అని జిపిఎస్‌ చెప్పగానే బైకు ఆపి చూస్తే -

అందమైన చిన్న డాబా.

‘ఇల్లు చిన్నగా ఉంటేనే అందం’ అంది మనసు.

ఇంటిముందు రోడ్డుమీద ఓ వేపచెట్టు.


‘వేపగాలి ఆరోగ్యానికి చాలా మంచిది’ అంది మనసు.

ఇంటిచుట్టూ ఆట్టే ఎత్తు లేని ప్రహరీ గోడ. గోడ మధ్యలో చిన్న గేటు.

‘ఆమాత్రం సెక్యూరిటీ ఉండాలి. ఆ మాత్రమే ఉండాలి’ అంది మనసు.


గేటు పక్కనే ఇంటి యజమాని పేరు - పి. శివశంకర్‌ అని వ్రాసి ఉంది.

ఆ పేరు కింద మరో పేరు వ్రాయడానికి కాళీ ఉంది.

‘ముక్త తండ్రి పేరు విశ్వనాథం కదా’ అనుకుంటూ కాలింగ్‌బెల్‌ స్విచ్‌ నొక్కాను.

గేటుకీ ఇంటికీ మధ్య కాళీ స్థలం ఎక్కువున్నట్లు లేదు. లోపల్నుంచి ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది.


‘సరైన ఇంటికే వచ్చానా?’ అని అనుమానిస్తూ ఎదురు చూస్తున్నాను.

గేటు పూర్తిగా కవరై ఉంది. లోపలేముందో కనబడ్డం లేదు.


కొద్ది క్షణాల్లో గేటు పైన గెడ తియ్యడానికి ఓ గాజుల చెయ్యి వచ్చింది. గేటు తియ్యగానే - ఓ నడివయస్కురాలు కనబడింది.

ఆమెని చూడగానే అందాల అప్సరసకి తల్లి కావడానికి అన్ని ఆర్హతలూ ఉన్నాయనిపించింది.


రెండు చేతులూ జోడించి, ‘‘ప్రభాదేవి గారా?’’ అన్నాను.

అవతలివాళ్ల గురించి మనకి బాగా తెలుసు అనడానికి ఇలా పరిచయం చేసుకోవడం అవసరం.


ఆమె ముక్త తల్లి కాకపోతే - ఉపాయం బెడిసికొట్టొచ్చు. కానీ ఆ మాత్రం రిస్కు అవసరం.

రిస్కేం లేదులే అన్నట్లు ఆమె ప్రసన్నంగా నవ్వి, ‘‘ఔను. నేను నీకెలా తెలుసు బాబూ!’’ అంది.


హమ్మయ్య - ఇది ముక్త ఇల్లే అని రూఢి ఆయింది.

‘‘ముక్త మేడం ఎప్పుడూ మీ గురించే చెబుతుంటుంది’’ అన్నాను.

ఆమె మొహం వెలిగింది.


‘‘ఆఫీసు పనిమీద వచ్చావా?’’ అంది.

‘‘ఔనండి. అపాయింట్‌మెంట్‌ పదిన్నరకి. పది నిముషాలు ముందే వచ్చాను. మేడంకి ఇబ్బందేం లేదు కదా!’’ అన్నాను.


తన కూతుర్ని మేడం అనడం, అపాయింట్‌మెంటూ - ఆమెకి కొత్తవునో కాదో కానీ - నా ధోరణి ఆమెను మరింత ప్రసన్నం చేసింది. ‘‘అయ్యో - అదేం లేదు, రా బాబూ!’’ అంటూ పక్కకి తప్పుకుందామె.


ఇంటిముందు చిన్న పోర్టికో. కారు పట్టదు.

రెండు బైకులు పట్టొచ్చు. కానీ అక్కడ ఒక్క టూ వీలర్‌ కూడా లేదు.


నేను బైకు లోపలకి తెచ్చి పోర్టికోలో పార్కు చేశాను. ఈలోగా ఆమె గేటు మూసింది.

గోడనానుకుని అటూ ఇటూ చెరో నాలుగు పూల కుండీలున్నాయి.


‘ఇంటిముందు మొక్కలకంటే పూలకుండీలుంటేనే బాగుంది’ అంది మనసు.

అక్కడ ఏం చూసినా - అలా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తోంది.

ఆమె ముందు. నేను వెనుక. ఇద్దరం లోపలికెళ్లాం.

చిన్న హాలు. ఆ హాల్లో ఓ క్యూబికిల్‌.


ఆమె వీధి తలుపులు మూసి - ముక్త ఉన్న క్యూబికిల్‌ చూపించి లోపలకి వెళ్లిపోయింది.

నేను వెళ్లేలోగానే క్యూబికిల్‌ తలుపు తెరుచుకుంది.

గుమ్మంలో ముక్త.

‘‘విచల్‌?’’ అంది.


తపస్సు చేసిన ఋషికి దేవుడు ప్రత్యక్షమై, ‘నరుడా, ఏమి నీ కోరిక’ అంటే వెంటనే బదులివ్వడానికి నోట మాట వస్తుందా?

ఒక్క క్షణం అప్రతిభుణ్ణయిపోయాను.

ఏమి రూపమది?


అందమంటే ఇదా అనీ, అందమంటే ఇదే అనీ, అందమంటే మరేదీ కాదనీ - ఒకేసారి రకరకాలుగా అనిపించింది.

‘‘విచల్‌?’’ అందామె మళ్లీ.


చప్పున తమాయించుకుని, ‘‘యా...’’ అన్నాను.

ఆమె లోపలకి తప్పుకుంది. కొద్ది క్షణాల్లో ఇద్దరం ఎదురెదురు సీట్లలో ఉన్నాం.

‘‘చెప్పండి’’ అంది ముక్త.


ఆమె సమక్షానికి అలవాటు పడుతున్నాను. ఆమెతో మామూలుగా వ్యవహరించడానికి అలవాటు పడుతున్నాను.

‘‘కలుసుకుని మాట్లాడతాననగానే వెంటనే ఒప్పుకున్నారు. వరమిచ్చినట్లు అనిపించింది’’ అన్నాను.


‘‘వరాలు దేవతలిస్తారు. మనం మనుషులం’’ నవ్విందామె. ఆ నవ్వు దేవత నవ్వులాగే ఉంది.

‘‘వరం దేవతలే ఇచ్చే మాటైతే, మీరు దేవత. లేదా వరాలు మనుషులు కూడా ఇస్తారని ఒప్పుకోండి. మీకు వేరే ఆప్షన్‌ లేదు’’ అన్నాను.


అన్నాక నేనే అన్నానా అని ఆశ్చర్యమేసింది.

పూర్వం భోజరాజును చూడగానే కవిత్వం పుట్టుకొచ్చేదిట. ఈ అమ్మాయిలో రాచఠీవి ఉన్న మాట నిజం.


‘‘సరే, వరమిచ్చాను. ఇక చెప్పండి’’ అందామె.

జాప్యం ఇష్టం లేక అలా అందనిపించింది.


‘‘మీకు భవన్‌ తెలుసా?’’ అన్నాను.

ఏ భవన్‌ - అనడగలేదామె. తెలుసని ఠక్కున చెప్పింది.

‘‘కవన్‌?’’ అన్నాను.

ఈసారి కూడా తెలుసని ఠక్కున చెప్పింది.


‘‘వాళ్లిద్దరూ కూడా నాకు తెలియదు’’ అన్నాను.

ఆమె ఆశ్చర్యంగా, ‘‘మీకు తెలియనివాళ్ల ప్రసక్తి నాదగ్గర ఎందుకు తెచ్చారు?’’ అంది.


‘‘వాళ్లిద్దరికీ కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది. వాళ్లలో ఏ ఒక్కణ్ణీ మీరు పెళ్లి చేసుకోవద్దని కోరడానికి నేనిక్కడికి వచ్చాను’’ అంటూ సూటిగా విషయానికొచ్చాను.

ఆమె ముఖంలో మరింత ఆశ్చర్యం.


‘‘మీరు నా దగ్గరికి ఇలాంటి టాపిక్కుతో వస్తారని ఏమాత్రం ఊహించలేదు. ఇంతకీ మీకు తెలియని వాళ్ల పెళ్లి గురించి మీకెందుకు తాపత్రయం?’’ అందామె.


‘‘వాళ్లని ప్రేమించిన అమ్మాయిలు - నాకు బాగా తెలిసినవాళ్లు. నన్ను మీ దగ్గర రాయబారానికి పంపారు’’ అన్నాను.


ముక్త అదోలా చూస్తూ, ‘‘వాళ్ల పెళ్లి వాళ్లిష్టం. నా పెళ్లి నా ఇష్టం. ఈ పెళ్లిళ్ల విషయమై కలగజేసుకోడానికి మధ్య వాళ్లెవరు, మీరెవరు?’’ అందామె.


ఆ గొంతులో కోపం లేదు, కుతూహలం లేదు.

‘‘ఏమో, వాళ్లడిగారు, నేను కాదనలేకపోయాను’’ అన్నాను.


ఆమె నిట్టూర్చి, ‘‘మీలో నిజాయితీ ఉంది. అది నాకు నచ్చింది. కాబట్టి ఓ నిజం చెబుతున్నాను. నేను ఆ భవన్‌, కవన్‌లు ఇద్దరిలో ఏ ఒక్కర్నీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అనుకోను. ఇప్పుడు మీరొచ్చారు కాబట్టి, మీకు సాయపడాలని నాకనిపిస్తే కనుక - తొందరగా ఓ నిర్ణయం తీసుకోగలను. నా నిర్ణయం వాళ్లని ప్రేమించిన అమ్మాయిలకు సానుకూలంగా ఉంటే - ఆ క్రెడిట్‌ మీరే తీసుకోవచ్చు’’ అంది.

నాకు సాయపడాలని ఆమెకి అనిపించాలన్న మాట! అందుకు ఏంచెయ్యాలో?

అడిగితే చెబుతుందో లేదో కానీ సూటిగా అడగాలనుకోలేదు.


‘‘క్రెడిట్‌ తీసుకోవాలన్న తాపత్రయం నాకు లేదు. ఆ అమ్మాయిలకి మేలు జరిగితే సంతోషిస్తానంతే! ఐతే చిన్న క్లారిఫికేషన్‌. భవన్‌, కవన్‌ - ఇద్దరూ మిమ్మల్ని పెళ్లి చేసుకుందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విన్నాను. వాళ్ల ప్రయత్నాల్ని మీరు అడ్డుకోవడం లేదని కూడా విన్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పిందాన్ని బట్టి, మీరు వాళ్లకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఔనా?’’ అన్నాను.


‘‘ఉంది. కానీ అది పూర్తిగా మీమీద ఆధారపడి ఉంది. అందుకే క్రెడిట్‌ మీరు తీసుకోవచ్చన్నాను’’

‘‘క్రెడిట్‌ విషయం పక్కన పెడదాం. ముందు నేనేం చెయ్యాలో చెప్పండి’’ అన్నాను.

ఆమె ఏదో అనేలోగా గాజు తలుపులు తెరుచుకున్నాయి.


వెనక్కి తిరిగితే - ఓ నడివయస్కుడు. ట్రాలీ ఒకటి తోసుకుంటూ వచ్చాడు.

క్షణాల్లో బల్లమీదకి రెండు గ్లాసుల మంచినీళ్లు, మూడేసి ఇడ్లీలున్న రెండు ప్లేట్లు వచ్చాయి. అతడు వాటిని మాముందు ఆమర్చి - ట్రాలీ తోసుకుంటూ వెళ్లిపోయాడు.

‘‘టిఫిన్‌ తీసుకోండి’’ అందామె.


‘‘టిఫిన్‌ చేసే వచ్చాను’’ అన్నాను మొహమాటంగా.

టిఫిన్‌ చేసి వచ్చిన మాట నిజమే కానీ - ఎదురుగా ప్లేట్లలో ఆవిర్లు కక్కుతున్న ఇడ్లీలు, నెయ్యి వేసిన కారప్పొడి, కొబ్బరి పచ్చడి - కాస్త నోరూరుతోంది.


‘‘టిఫిన్‌ నేనూ చేశాను. అందుకే లైటుగా....’’ అందామె.

ఇద్దరం ఇడ్లీ తింటున్నాం.


ఆమె స్పూన్‌ ఎలా కదుపుతోందో తెలియడం లేదు. నోట్లో ఎలా వేసుకుంటోందో తెలీడం లేదు.

ప్లేటు కాళీ ఔతోంది కాబట్టి ఆమె తింటూండాలి. దేవతలు ఆహారాన్ని కూడా చూపులతోనే గ్రహించగలరేమో!


నేనెలా తింటున్నానో, నా గురించి ఆమె ఏమనుకుంటోందో అన్న భావన నన్ను కాస్త చిన్నబుచ్చింది.

ఈలోగా ఆమె చూపులతో గ్లాసులో మంచినీళ్లని సగం కాళీ చేసింది. నా పద్ధతిలో నేనూ మంచినీళ్లు తాగేక, ‘‘ఈ పూటకి నా భోజనం ఐపోయింది’’ అన్నాను.


ఆతిథ్యాన్ని మెచ్చుకోవడంలో అదో రొటీన్‌ పద్ధతి.

ఆమె నవ్వింది, ‘‘ఇదే మాట భోజన సమయానికి అంటారనుకోను’’ అంది.

‘‘అది మీకెలా తెలుస్తుంది?’’ అన్నాను.


‘‘ఈ పూట మీ భోజనం ఇక్కడేగా?’’ అందామె.

తెల్లబోయి, ‘‘అలాగని మీరెందుకు అనుకున్నారు?’’ అన్నాను.


‘‘మీరిక్కడికి చాలా పెద్ద పనిమీద వచ్చారు. అది ఒకటి రెండు గంటల్లో తేలుతుందనుకోను. మధ్యాహ్న భోజనానికి ఇక్కడ ఏర్పాటు చేశాను. అవసరమైతే - రాత్రి భోజనానికి కూడా.....’’


నేనేదో కాసేపు మాట్లాడి వెళ్లిపోవాలనుకున్నాను.

నన్నీమె రాత్రికి కూడా ఉంచేస్తానంటోంది. ఏమిటి ఈమె ఆంతర్యం?

ఇంకా ఉంది...వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
31 views0 comments
bottom of page