top of page

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 3


'Prema Chejarithe (bhavishyat Kalamlo) 3' New Telugu Web Series Written By Pendekanti Lavanya Kumari

(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)


గత భాగంలో కాలనీ గురించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము. మిగిలిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమ చేజారితే - 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక చదవండి... 'ఆనందలోకం' లాంటి కాలనీలలో తిరిగే వాళ్ళందరూ ఎక్కడికెళ్ళినా సైకిళ్ళలోనే వెళ్తుంటారు. కాలనీలో కేవలం సరుకుల రవాణాకూ, నడవలేని వారి కోసం మాత్రమే సోలార్ పవర్ కార్లను వాడుతుంటారు. కాలనీ వారంతా గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ వాడుతూ, ఇప్పటికైనా పాడైన ప్రకృతిని తిరిగి బాగు చేసే ప్రయత్నం చేస్తామని వాళ్ళకు వాళ్ళు ప్రమాణం చేస్కున్నారు. అలా ఆ ప్రమాణాలు పాటిస్తూ సమాజానికి మేలు కలిగే విధంగా వుండటమే ఆ కాలనీల గొప్పతనం. అందువల్లే కాలనీలు కట్టుకోటానికి ప్రభుత్వం నుండి అనుమతి పొందటమే కాక మిగిలిన ప్రజలందరి మన్నన కూడా పొందాయి.

కాలనీలు ఎంతో నిశ్శబ్దంగా ఉంటుండగా, కాలనీలు కాక బయటి మామూలు ఊర్లు మాత్రం యథావిధిగా ట్రాఫిక్, రణగొణధ్వనులు మరియు ఎప్పుడూ ప్రజల హడావిడితో ఎంతో చైతన్యవంతంగా వున్నా నిండా కాలుష్యంతో వుంటున్నాయి. ఇప్పుడిక కాలనీలలో కాక బయట ఊర్లలోని వారు ఎలా వుంటున్నారో తెలుసుకుందాము.... అదే రోజు ఉదయం ఆరుగంటల సమయం... 'ఆనందలోకం' కాలనీ బయట వున్న వూరిలో... చాలా మటుకు అందరి అపార్ట్మెంట్లలో ఆఫీసులకు, స్కూళ్ళకు వెళ్ళేవారు లేచి తయారవుతున్న హడావిడి మొదలయ్యింది. ఒక అపార్ట్మెంట్లో భర్తను లేపుతున్న భార్య, ఇంకో అపార్ట్మెంట్లో తొందర, తొందరగా వంట చేస్తూ స్కూల్కెళ్ళాల్సిన కూతురిని అక్కడినుండే పిలుస్తూ లేపుతున్న తల్లి, ఇంకో అపార్ట్మెంట్లో తల్లిని తను ఆ రోజు వేసుకోవాలనుకున్న డ్రెస్సుకు ఐరన్ గురించి వాకబు చేస్తున్న కాలేజీకెళ్ళే కూతురు... అక్కడక్కడా, ఆరోగ్యం మీద శ్రద్ధ వున్న కొందరు వాకింగ్ చేయటానికి వెళ్ళి తిరిగి వస్తున్న దృశ్యాలు. వంటిళ్ళలో పొద్దునకు, మద్యాహ్నానికి కావాల్సిన వంటలు చేయటంలో తల పక్కకు కూడా తిప్పను సమయం లేని తల్లులూ, పిల్లలను ప్రేమగా తయారుచేయలేకపోతున్నామనే బాధ వున్నా వారినే చేస్కునేలా తర్ఫీదివ్వటం వల్ల వాళ్ళే చేతనయ్యీ కాకుండా, మధ్య, మధ్యలో తల్లిని అడిగి చేస్కుంటున్న పిల్లలూ. ఇలా ఎవరికివారు తమ, తమ పనులను చేస్కుంటూ అదిలేదూ, ఇదిలేదూ, అది కావాలి, ఇది కావాలని తల్లులతో గొడవపడ్తూ బిజీగా వున్నారు. ఎంత హడావిడి వున్నా అదే వారి జీవితం, దాన్నే వారు ఇష్టపడతారు, అలా అందరూ ఎప్పుడూ ఏదో ఒక పనిలో వుండటమే వారికి ఇష్టం. ఏదో చేయాలి, ఏదో సాధించాలని వారందరి ఆశ. ఏదో సాధించాలని పొద్దున లేచినప్పటి నుండి ఒకటే పరుగులు పెట్టేవారు కొందరైతే, బ్రతకేందుకు సంపాదించడం తప్పనిసరై పరుగులు పెట్టేవారు మరి కొందరు. అక్కడున్న వారి మధ్యన ఒకరికొకరికి ప్రతిసారీ, అన్నీ ప్రియమైన విషయాలే జరగకపోయినా, వారి మధ్యన ఎంతో ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు కలగలిసి వుంటాయి. ఒకరి బాగు కొరకు ఇంకొకరు కష్టపడటం, అందరూ మాట్లాడుకుంటూ ఆప్యాయంగా గడుపుతూ కలిసి పనులు చేస్కోవటం లాంటివి చేస్తూ జీవితం మీద ఎక్కడ లేనంత ఆసక్తిని పెంపొందించుకునే ప్రేమైక జీవనం వారిది. బంధాలకు, బంధుత్వాలకు ఎంతో విలువ ఇస్తారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసి తమ ప్రేమను చాటుకుంటుంటారు. త్యాగమే అయినా కూడా అది వారికి ఆనందమే. ఇలాగే వుంటుంది సామాన్యంగా భారతీయ జీవన విధానం, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల జీవన చిత్రం. ఇక్కడ కూడా అదే తీరు, అది భవిష్యత్తు కాలమైనా సరే మనిషి మాత్రం ప్రేమ, ఆప్యాయతలకే కట్టుబడ్తాడు. ఇవే మనిషిని మనిషిగా వుంచుతున్న మానవత్వపు లక్షణాలు. వాటి కొరకే పరుగులు, సంపాదనా ప్రయత్నాలు అన్నీ కూడా. ఇక్కడా అంతే. అలాంటి ఒక అపార్ట్మెంట్లో లలిత ఆపసోపాలు పడుతోంది. తన రెండేళ్ళ కూతురు మౌనిక తనని పని చేస్కోనివ్వకూండా ఒకటే గుక్కపట్టి ఏడుస్తోంది. పూర్తి నిద్ర తీరక ముందే లేచేసింది అందుకే అలా ఏడుస్తోందని అర్థమయ్యింది లలితకు. కాకపోతే తను ఆఫీసుకు వెళ్ళాలంటే పొద్దున్నే లేచి టిఫిన్, భోజనం తయారు చేసి క్యారియర్ కట్టుకుని, పాపను బేబీ క్రెష్ లో వదిలి తను ఆఫీసుకు వెళ్ళాలి. లలిత భర్త రమేష్కు నిన్న నైట్ డ్యూటీ, వచ్చే సరికి ఎనిమిది పైనే అవుతుంది, వస్తూనే పడుకుంటాడు, పాపను చూస్కోలేడు. ఎనిమిది లోపల తన పనులన్నీ అయిపోతే కానీ తను ఆఫీసుకు వెళ్ళలేదు. అయినా సరే పాప తనతో పాటూ లేచిందని, పడుకో బెట్టటానికి చాలా ప్రయత్నించింది. పడుకుంటుంది కానీ ప్రక్కకు కదిలితే చాలు లేచి ఏడుస్తోంది. ఇంక టైమయిపోతుందని, ఏడుస్తున్న పాపను కాసేపు ఎత్తుకుని, కాసేపు దించుతూ పని చేయటం మొదలెట్టింది. ఎలాగో వంట పూర్తి చేసి, పాపకు స్నానం పోసి, తనూ రెడీ అయిపోయింది. అంతలో భర్త రమేష్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు... రమేష్కు టిఫిన్, భోజనం చేసిపెట్టాను, పెట్టుకు తినమని చెప్పి ఆఫీసుకు బయలుదేరింది లలిత... దారిలో పాపను క్రెష్ లో దించబోయింది, పాప దిగకుండా గట్టిగా పట్టుకుంది, కానీ బలవంతంగా దింపి లోపల వదిలి పెట్టే సరికి, ఏడ్వటం మొదలెట్టింది. లలితకు పాప అలా ఏడుస్తుంటే చూసి చాలా బాధేసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఒక్క నిమిషం పాటు ఈ రోజటికి ఇంటికి తీస్కెళ్ళిపోదామా అనిపించింది, కానీ పాపను చూస్కోటానికి ఆఫీసుకు లీవ్ పెట్టాల్సి వస్తుంది. అప్పటికే ఈ నెలలో చాలా సెలవులు పెట్టాల్సి వచ్చింది. అందుకే మనసుకు బాధనిపించినా క్రెష్లో వదలక తప్పటంలేదు. ఒక అరగంటో, గంటో లేటయినా పర్వాలేదు కాసేపు పాపను నిద్రపుచ్చి పోవాలని నిర్ణయించుకుంది. ఒక పది నిమిషాలు పాప దగ్గరే కూర్చుని బాగా సముదాయించి అక్కడే వున్న ఊయలలో పడుకోబెట్టి చిన్నగా ఏదో పాడుతూ ఊపసాగింది...

పాట వినిపిస్తూ వుండటం వల్ల, వాళ్ళమ్మ అక్కడే వుందన్న భద్రతా భావం వల్ల, త్వరగా లేచిన కారణం చేత కొద్ది సేపటికే నిద్ర పోయింది పాప. అక్కడుండే ఆయమ్మకు అప్పుడప్పుడూ ఊయలను కాస్తా ఊపుతూ వుండమని చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయింది లలిత. రమేష్, లలితలు దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. వాళ్ళు తాము అన్నీ చూస్కోని, చూస్కోని వాడు కుంటూ, అద్దె ఇళ్ళలో వుంటూ, మాటిమాటికి ఇళ్ళు మారుతూ ఇబ్బందులు పడ్తూ పెరిగారు. తమ పిల్లలన్నా ఏ ఇబ్బందులు లేకుండా సొంత ఇంట్లో పెరగాలన్న తపన వారిది. అందుకే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. లోన్ తో అపార్ట్మెంట్ తీస్కున్నారు, ఇంకా ఇంటికి ఫర్నిచర్ కూడా సరిగ్గా లేదు. ఒకరి జీతం ఈ.ఎమ్.ఐ. లకు పోతే ఇంకొకరి జీతంతో ఇల్లు గడుపుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు పాప కోసం ఉద్యోగం మానెయ్యటానికి లేదు. అందరి పిల్లలు క్రెష్లో వుంటున్నారు కదా, అలాగే తన పాప కూడా వుంటుందిలే అనుకుందే కానీ పిల్లలు పసి వయసులో తల్లులకు దూరంగా వుండటానికి ఎంత బాధ పడతారనేది, తను తన కూతురిని కన్నాక, ఆ పాపను వేరేవారికి అప్పగించి వెళ్తున్నప్పుడే లలితకు బాగా అర్థమయ్యింది. మొదట్లో పాపను క్రెష్లో వదిలి ఆఫీసుకు వెళ్ళినప్పుడు, ఆఫీసులో వున్నంత సేపూ మనసు పాప మీదే వుండేది, పాలు త్రాగిందో, లేదో... ఏమన్నా తినిందో, లేదో... వాళ్ళు సరిగ్గా చూస్కుంటున్నారో లేదో... ఏడ్వటం లేదు కదా అని ఇవే ఆలోచనలు... ఆలోచన వచ్చినప్పుడంతా వీడియో ఆన్ చేసి పాపను ఎలా చూస్కుంటున్నారో చూసేది... పాపను వదిలి పెట్టిన క్రెష్లో ఎప్పుడూ సి.సి.టీ.వీ కెమెరాలు ఆన్లోనే వుంటాయి. ఆ కనెక్షన్ ఒకటి పిల్లల పేరెంట్సుకు, కానీ గార్డియన్సుకు కానీ ఇచ్చుంటారు. అందువల్ల అక్కడ ఏమి జరుగుతుందో వాళ్ళు ఎప్పుడు కావాలన్నా చూసే అవకాశముండేలా వుంటుంది. అలా, కొద్ది, కొద్దిగా వాళ్ళు బాగానే చూస్కుంటున్నారన్న నమ్మకం కలిగాకనే లలిత స్థిమితంగా కూర్చుని ఆఫీసు పని సక్రమంగా చేయగలగసాగింది. పసి పిల్లలను దూరంగా వదలాలంటే పిల్లలెంత బాధపడ్తారో తల్లులు కూడా అంతకన్నా ఎక్కువే బాధ పడ్తారు, అయినా ఆ పిల్లల భవిష్యత్తు కోసమే వారు ఆ బాధనంతా భరిస్తారు. ఇలాంటి కుటుంబాలు ఆ అపార్ట్మెంట్లలో ఎన్నో వున్నాయి. అందరూ అంతే, కొన్ని సంపాదించుకోటానికి కొన్నిటిని వదులుకుంటూ, కావాల్సిన వాటినన్నా పొందుతున్నామన్న తృప్తితో జీవించాలనుకునేవారే. ****** ఇంకిక్కడ కాలనీలో షాలిని కుశాల్ని స్కూల్లో వదిలి ఇంటికి తిరిగి వచ్చింది. అంతలోపల రాఘవరావు కాఫీ త్రాగటం పూర్తి చేసి, అలాగే కూర్చుని వినబడుతున్న దేవుడి పాటలతో చిన్నగా స్వరం కలుపుతూ వింటున్నాడు. ఇంక రాఘవరావు కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి రావటానికిగాను ఆయనను షాలిని బాత్రూమ్కి తీస్కెళ్ళాల్సి వుంది. అందుకోసం షాలిని బాత్రూమ్లోకి వెళ్ళి మొదట వేడి నీళ్ళను కావాల్సిన టెంపరేచర్లో వచ్చేట్టుగా అన్నీ అడ్జస్ట్ చేసింది. తర్వాత టవలు, పంచ అందుబాటులో వుంచి, ఒక కుర్చీ తీస్కెళ్ళి షవర్ క్రింద వుంచి వచ్చి రాఘవరావును పట్టుకుని చిన్నగా నడిపించుకుని బాత్రూమ్కి తీస్కెళ్ళి కమోడ్ దగ్గర నిలబెట్టి వచ్చేసింది షాలిని. రాఘవరావు పని ముగించుకుని, స్నానం చేయాలనుకున్న వెంటనే అక్కడున్న కుర్చీలో కూర్చుని 'షవర్ ఆన్' అనగానే పోసుకునేమైను టెంపరేచర్తో నీళ్ళు వచ్చాయి. ఆయన స్నానం చేసి పంచ అక్కడే వదిలేసి టవల్తో తుడుచుకుని పిండిన పంచను చుట్టుకుని షాలినిని పిలిచాడు. మళ్ళీ షాలిని వచ్చి ఆయనను బెడ్ దగ్గరకు తీస్కెళ్ళి కూర్చో బెట్టి, బాత్రూమ్ లో అన్నీ యథావిధిగా సర్ది పెట్టి, పిండటానికి వెయ్యాల్సినవి ప్రక్కన పెట్టి వచ్చి, ఆయనకు లాల్చీ వేస్కోటానికి సాయం చేస్తుంటే రాఘవరావు అభిమానంగా షాలినితో "నీవు నా కోడలిగా రావటం నిజంగా నా అదృష్టం," అన్నాడు. దానికి షాలిని, "ఏదో మీ అభిమానం మామయ్యా! మీకు చేసే ఈ చిన్న, చిన్న పనులు పెద్ద పనులే కావసలు. మీరు నన్నేమీ ఇబ్బంది పెట్టటం లేదు. మీరు ఏనాడూ నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు, ఎప్పుడూ ఆప్యాయంగా మాట్లాడ్తారు. మీలాంటి వారికి ఏదైనా చేయాలనే అనిపిస్తుంది ఎవరికైనా కూడా," అంది షాలిని మనస్పూర్తిగా. ఇంట్లో పనులన్నీ షాలినీయే చూస్కుంటుంది. ఇంటి పనులకు పెద్ద శ్రమపడే అవసరమే లేకుండా కసుకొట్టి, అలకటానికి, అంట్లు కడగటానికి, బట్టలుతకటానికి అందరూ మెషీన్లే వాడుతారు, వీళ్ళూ అంతే. ఇంటి పనంటే కేవలం మనిషికి, మనిషి తోడుగా వుంటూ, పిల్లలకు, ఇంట్లో వుండే పెద్దవారికి అన్నింటిని సమకూర్చటం మాత్రం చేస్తే చాలు. అలా ఇంటిపట్టునుండి అందరినీ కనిపెట్టుకు చూస్కునే ఇల్లాల్లు కరువయ్యారు. "అదే ఆ చిన్న, చిన్న పనులు ఇబ్బంది పెట్టకుండా చేసే నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం అంటున్నాను," అన్నారు రాఘవరావుగారు ఆర్ద్రతగా. వీళ్ళు ఇలా మాట్లాడ్తుండగానే హాల్లో మెట్లు దిగుతున్న శబ్దం వినబడింది. ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తూ, తర్వాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. ఇక వుంటాను.

-------ఇంకావుంది-----

============================================================

ఇంకా వుంది============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


Twitter LinkPodcast Linkమనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.


38 views0 comments

Comments


bottom of page