top of page

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 2


'Prema Chejarithe (bhavishyat Kalamlo) 2' New Telugu Web Series Written By Pendekanti Lavanya Kumari

(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)

గత భాగంలో షాలిని కుశాల్ను స్నానం చేయించటానికి తీస్కెళ్తూ వుంటుంది...


ఇంక చదవండి... బాత్రూమ్ దగ్గరకు రాగానే షాలిని అక్కడే వున్న వాటర్ ప్రూఫ్ సాక్స్ వేస్కుని, వాటర్ ప్రూఫ్ ఏప్రన్ కట్టుకుంది. తర్వాత కుశాల్ని బాత్రూమ్ లోనికి తీస్కెళ్ళబోతుంటే, వాడు, "రోజూ నీవెందుకవి వేస్కుంటావు, ఈ రోజు అవి నాకూ కావాలి,” అంటూ మారాం చేయసాగాడు. "నీవు వేసుకున్నవే విప్పి స్నానం చేయించాలంటుంటే ఇప్పుడు ఇవేస్కుంటానంటావేంటి, నేను ఇవ్వను...ముందు పదా లోపలికి," అంది షాలిని. "మరి నీవెందుకు వేస్కున్నావు?" అన్నాడు కుశాల్. "స్నానం చేసినంత సేపూ నా మీదంతా నీళ్ళు వేస్తుంటావు కదా, నా బట్టలు తడవకుండా ఇవి వేస్కున్నానంతే. నీ ప్రశ్నలకు సమాధానం చెప్తూ కూర్చుంటే స్కూలు కెళ్ళే టైము కాస్తా అయిపోతుంది త్వరగా పదా," అంటూ షాలిని కుశాల్ని బాత్రూమ్ లోకి లాక్కుపోయినట్టుగా తీస్కెళ్ళింది. స్నానం చేయించినంత సేపూ కుశాల్ షాలినీని తన చిన్ని బుర్రలోకొచ్చే సందేహాలన్నీ అడుగుతూనే వున్నాడు. షాలిని ఏవో తనకు తెలిసినంత వాడికి విడమరచి చెప్తూనే స్నానం చేయించేసింది. తర్వాత స్కూల్ యూనిఫామ్ వేసి రెడీ చేసి, వాళ్ళ కాలనీలోనే, ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న స్కూల్లో వదిలి వచ్చింది. వీళ్ళుండే ఈ కాలనీ గురించి తెలుసుకోవలసిన విశేషాలు చాలానే వున్నాయి. ఈ కాలనీ మామూలు కాలనీలలాగా కట్టినది కాదు. దీన్ని కట్టిన విధానాన్ని తెలుసుకోవాలంటే 2040కి కొన్ని ఏళ్ళ ముందు జరిగిన ప్రకృతి వైపరీత్యాల గురించి తెలుసుకోవలసి వుంది. అవేమంటే... అంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల కాలంలోనే భారతదేశం ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలకు లోనై ఎంతో భూమిని కోతకు, ముంపుకు గురి చేసుకుంది... అందులో బాగా చెప్పుకో తగ్గవి, 2028లో, 2033లో వచ్చిన పెద్ద, పెద్ద సునామీలైతే, మిగిలినవి ప్రతి సంవత్సరమూ దేశంలో చాలా ప్రాంతాలలో వచ్చే వరదలు. వీటికి ముఖ్యమైన కారణాలలో ఒకటి, ఎంతమంది పర్యావరణ శాస్త్రవేత్తలు (ఎకాలజిస్టులు) హెచ్చరించినా అడువుల రక్షణను పెడచెవిన పెట్టిన ప్రభుత్వాలదే. ప్రభుత్వం కన్నుగప్పి, అడవులను ఇష్టమొచ్చినట్టుగా నరికి వేసిన ప్రజలూ కారణమే(అంటే స్మగ్లింగ్ ముఠా చేసినా, వాళ్ళూ ప్రజలే కదా మరి). అడవులు కొట్టి వేయటం వల్ల, మన్నును పట్టి వుంచే చెట్లులేక ఎంతో మన్ను కొట్టుకు పోయి, సంవత్సరం, సంవత్సరానికి వందల కిలోమీటర్ల నేల సముద్రంలో కలిసిపోయింది. దానికి తోడు యంత్రాల నుండి వెలువడే కర్బన వాయువుల వల్ల భూవాతావరణం వేడెక్కి, మంచు కొండలు కరగటం మూలాన ఇంకొంచెం నేల నీట మునిగిపోయింది. దక్షిణ భారతదేశంలో వుండే పశ్చిమ, తూర్పు కనుమలలోని చెట్లు విస్తారంగా కొట్టి వేయబడటం వల్ల ఆ వైపున చాలా తీర ప్రాంతం, ఈ వైపున చాలా తీర ప్రాంతం సముద్రపు కోతకు గురికాగా, భారతమాత రెండు కాళ్ళతో నిలబడి వున్నట్లుగా కనబడే భారతదేశపటం కాస్తా భారతమాత ఒక్క కాలితో కూడా కష్టంగా నిలబడిన భారతదేశపటంలా మారిపోయింది. అంటే దక్షిణ భారతదేశపు భూమి ఇంచుమించు సగం వంతుమైను కోతకు గురయ్యి నీట కలిసిపోయింది. చెప్పాలంటే, కొన్ని వందలయేళ్ళలో ప్రకృతి ఎంత నష్టపోయిందో అంతకన్నా ఎక్కువ నష్టం కేవలం చివరి వందయేళ్ళలో మనుషులు సృష్టించిన రకరకాల కాలుష్యాల వల్ల జరిగిందనాలి. ఈ వైపరీత్యాల వల్ల ఎంతో జననష్టం జరిగి, ఎందరో అనాథలయ్యారు. వారు అనాథలు కావటానికి కారణం ఎవరు? ఒక్కరు కాదు, అందరమూ కారణమే. టెక్నాలజీని ఇష్టమొచ్చినట్టుగా ఉపయోగించకండని చెప్పినా వినని ప్రజలే కాక వాటి వినియోగంవల్ల కలిగే ఉపయోగాలను, సౌలభ్యాన్ని మాత్రమే ఆలోచించి, నష్టాలను కప్పిపుచ్చి ప్రజలలోకి వదిలిన కుహనా గొప్ప సైంటిస్టులది, వారికి అనుమతిచ్చిన ప్రభుత్వాలది కూడా. అందుకే అందరూ కారణమే, అందరూ ఆ అనాథల గురించి కూడా ఆలోచించాలి కదా. కానీ మామూలు ప్రజలకు తమ ఈతి బాధలతోనే సరిపోతుంది, ఇంక వేరేవారి గురించి ఆలోచించి, శ్రమించే అవకాశముందా? కానీ కొంతమంది గొప్ప వ్యక్తులు ఆలోచిస్తుంటారు, అలాంటి వారి వల్లనే ఇలాంటి అనాథలు బ్రతుకునడుస్తూ వుంటుంది. ఆ అనాథలలో కొందరైనా గొప్పవారై సమాజ పునరుద్ధరణ చేస్తూవుంటారు. కథ ఇంకో వైపుకు వెళ్తున్న్నట్టుగా వుంది. ఈ విషయాలు కూడా అవసరమైనవే... కాకపోతే ఇంక ముఖ్య కథలోకి వెళదాం... అలా మన నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రకృతి వైపరీత్యాలతో జనాభా తగ్గినా అంతకుమించిన భూమి నీటిపాలయ్యింది. దానితో వున్న నేల కంటే జనాభానే ఎక్కువయ్యింది. అందువల్ల భారతదేశ జనాభాకు భూమి కొరత, దానివల్ల తిండి కొరత ఏర్పడ సాగింది. ఇదంతా దృష్టిలో పెట్టుకున్న కొంతమంది ఇంజనీర్లు ఒక ఆలోచన చేసారు. అదేంటంటే, మైనింగ్ చేయటం వలనో, పరిశ్రమలు కట్టటం వలనో పాడైపోయిన నేలను ఇళ్ళు కట్టుకోటానికి వాడాలనీ, శిథిలమైపోయి, పాతవైన ఇళ్ళ క్రింద వున్న సారవంతమైన మంచి నేలను సాగు భూమిగా మారిస్తేనే ప్రజల అవసరాలు తీరుతాయని నిర్ణయించారు. అంతే కాకుండా మంచి సారవంతమైన భూమిపై వున్న బాగున్న ఇళ్ళను సైతం తీసేయించి, వారికి వేరే భూమో, ఫ్లాట్లో ఇచ్చి వాళ్ళుండివున్న భూమిని వ్యవసాయానికి వినియోగించాల్సిన అవసరమెంతైనా వుందని నిర్ణయించి, ప్రభుత్వం ఈ విధానాన్ని ముందుకు తెచ్చి అవలంభించేలా చేసారు. మూతబడిన పరిశ్రమలుండే నేలలూ, మైనింగ్ చేసి వదలిన నేలలూ పరిశ్రమల వ్యర్థాలతో, రసాయనపు అవశేషాలతో విషతుల్యమై వుంటాయి. కావున అవి వ్యవసాయం చేయటానికి పనికి రావు. నివాసయోగం చేయాలంటే నేలను వాటర్ ప్రూఫ్ సిమెంట్తో పూర్తిగా కప్పి వేసి, అటు తర్వాతే దాని పైన ఇళ్ళు కట్టాలనీ, అయితే ఆ భూమి క్రింది నీటిని కానీ, మట్టిని కానీ దేనికీ వాడకుండా వుండేట్టుగా చూడాలని వివరంగా చెప్పారు. అలాంటి మారకం ద్వారా దక్కిన మంచి పొలాలను వ్యవసాయానికి వినియోగించటం వల్ల భూమి కొరతను కొంతలో కొంత తగ్గించవచ్చని 2034లో ప్రభుత్వం వేసిన ప్లానింగ్ కమిటీ నిర్ణయించింది. ఆ ప్లానింగ్ కమిటీ నిర్దేశించిన విధంగా అన్నీ పరిశీలించి, తగిన జాగ్రత్తలు తీసుకొని శ్రద్ధగా కట్తామన్న వారికి మాత్రమే అలాంటి చోట కాలనీలు కట్టటానికి ప్రభుత్వం అనుమతించింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 'ఆనందలోకం' కాలనీ కూడా అలా కట్టినదే. అలాంటి ప్రదేశాలలో అయితే ఇల్లులు కావాల్సినంత పెద్దగా కట్టుకోవచ్చు, అలాగే విల్లాలైనా(బంగ్లాలైనా) కట్టుకోవచ్చు. ఈ కాలనీలో ఎనబై నుండి నూరు బంగ్లాలు వున్నాయి. ఈ 'ఆనందలోకం' కాలనీని మైనింగ్ కోసం భూమిని తవ్వటం ద్వారా పాడైపోయిన స్థలంలో కట్టారు. ఆ ప్రదేశాన్నంతా చదును చేసి అంతా ఒకే లెవెల్ కు వచ్చేలా చేసారు. ఎంత లెవల్ చేసినా ఆ ప్రాంతమంతా మామూలు భూమి లెవల్ కన్నా చాలా లోతుగా వుంది, అలా వుండటం వల్ల ఎక్కడెక్కడో పడిన వర్షపు నీరంతా లెవల్ తక్కువగావున్న ఈ ప్రాంతానికి వచ్చి ముంచేస్తుందనే వుద్దేశ్యంతో ముందే ఆ మైనింగ్ ప్రాంతం చుట్టూతా ప్రహరీలా ఎత్తైన గోడను ప్లాస్టిక్ వేస్ట్, మరియు సిమెంటు తదితరాలను వినియోగించి కట్టారు. ప్రతిచోటా చెత్తలా చేరి ఇంకెందుకూ ఉపయోగపడదన్న (అంటే రీయూజ్ చేయటానికి సైతం వీలుకాని) ప్లాస్టిక్ను వీళ్ళు దిమ్మెలుగా మార్చి కాంక్రీట్లో వుంచి కన్స్ట్రక్షన్లో వాడుతూ పర్యావరణ సంరక్షణ చేస్తున్నారు. అదే ఆ ప్లాస్టిక్ను అలాగే బయటి వాతావరణంలో వుంచటం వల్ల ఎండ, గాలి సోకుతూ ఆ ప్లాస్టిక్ అతిచిన్న, అంటే కంటికి కనిపించనంత చిన్న ప్లాస్టిక్ రేణువుల్లా (అంటే మైక్రో ప్లాస్టిక్లా) మారుతూ నశించడమైతే జరుగుతుంది. కానీ ఆ చిన్న, చిన్న ప్లాస్టిక్ రేణువులు పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారంలో కలవటం వల్ల మనుషులకు, జంతువులకు నిదానంగా బయటపడే రకరకాల రోగాలను, అనగా క్యాన్సర్ లాంటి వాటిని కలగచేస్తాయి. దాన్ని చేతనయినంత వరకు ఆపటానికే వారు ఆ ప్లాస్టిక్ను దిమ్మెలుగా చేసి కన్స్ట్రక్షన్లో ఉపయోగిస్తున్నారు. దానివల్ల అది అక్కడ మైక్రోప్లాస్టిక్గా మారే అవకాశం లేకపోవటమే కాక కట్టడాలు పటిష్ఠంగా తయారవుతాయని వారి ఆలోచన. కాలనీ బంగ్లాలపై పడే వర్షపు నీరు వృధాగా డ్రైనేజీలో కలవకుండా, అక్కడుండే ప్రతి బంగ్లా మీద పడే ప్రతి వర్షపు చుక్కనూ నిలువవుంచుకునేలా ప్రతి బంగ్లాకు అనుసంధానంగా చిన్న, చిన్న రిజర్వ్ ట్యాంకులు కట్టారు. అంతే కాకుండా ఆ కాలనీ మొత్తానికి ఒక పెద్ద వర్షపు నీటి రిజర్వ్ ట్యాంకునూ కట్టారు. ఆ కాలనీలో పడే నీరంతా ఏ మాత్రం వృధా కాకుండా ఈ ట్యాంకుకు వచ్చి చేరేలా కాలనీ లెవలింగ్ చేసారు. అలా వీలుకాని చోట పైపుల ద్వారా నీరంతా వచ్చి చేరేలా పెట్టారు. పెద్ద, పెద్ద వర్షాల వల్ల అక్కడ వరద ఏర్పడకుండా, ఎక్కువైన నీరు క్రిందనున్న భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు కూడా చేసారు. కాలనీలో ఆక్సిజన్ తయారవటానికి ఎక్కడ వీలైతే అక్కడ గడ్డి లాన్లను ఆ వాటర్ ప్రూఫ్ సిమెంట్ నేలపైనే మంచి మన్ను పరిచి పెంచుతుంటారు. అందరూ తెలుసుకోవలసిన విషయమేమంటే, 50 చదరపు అడుగుల మంచి గడ్డిలాను నలుగురు మనుషులకు సరిపడే ఆక్సిజన్ను అందించగలదు. కాలనీలో ప్రతిబంగ్లా చుట్టూ కనీసమంటే ఆ ఇంటి మనుషులకు సరిపోను ఆక్సిజన్ అందించగల గడ్డి లాన్లను వేస్కున్నారు. గడ్డికి ఎక్కువ మట్టి అవసరముండదు, పైగా మనం దానిపై ఫర్నిచర్ వేస్కోవచ్చు, కూర్చోవచ్చు, ఆడ్కోవచ్చుకూడా. అంతేకాక కాలనీలో అక్కడక్కడా ఎకరముమైనున్న ఖాళీ స్థలాలలో కేవలం కాంక్రీటే కాక ప్లాస్టిక్ వేస్టును కూడా వినియోగించి పదడుగుల ఎత్తైన గోడలను నాలుగు దిక్కులా కట్టి, వాటి లోపలి భాగాన్నంతా వాటర్ ప్రూఫ్ సిమెంటుతో పూత పూసి, ఆ తర్వాత దాంట్లో స్వచ్చమైన మట్టిని నింపి సేంద్రియ ఎరువులను వాడుతూ ఎన్నో రకాల చెట్లతో నిండిన వనాలను పెంచారు. ఇలాంటి వనాలు ఆ కాలనీలో ఆరు వరకు వున్నాయి. ఈ వనాలు కాలనీవాసులకు కావాల్సిన కూరగాయలు, పండ్లు అందించటమే కాక స్వచ్చమైన ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా కూడా ఉపయోగపడుతుంటాయి. ఆ ఆక్సిజన్ ఊరి కాలష్యాన్ని తగ్గించటమే కాక ఆ ఊరి ప్రజల ఆరోగ్యాన్ని సైతం కాపాడుతోంది. కానీ అలాంటి మైనింగ్ చేసి వదిలిన రాతి నేలలో ఇళ్ళు కట్టటానికి పునాదులు దించటం కష్టం. అందుకే ఆ మైనింగ్ వేస్టున్న రాతి నేలల పైన కూడా వేస్టు ప్లాస్టిక్ని, కాంక్రీటును వుపయోగించి కాలనీని కట్టటానికి కావాల్సిన బేసు(మెత్త) వేసారు. దానివల్ల ఇండ్ల పునాదులను దించటం తేలికయ్యింది. ఆ తర్వాత నేలంతా వాటర్ ప్రూఫ్ సిమెంటుతో ప్లాస్టరింగ్ చేసారు. అలాగే ఆ కాలనీ బయటకు నడిచి వెళ్ళాలంటే క్రిందున్న కాలనీ నుండి ప్రహారీ గోడవరకున్న మెట్లెక్కి గోడకు వున్న బయోమెట్రిక్ కార్డ్ తో తెరుచుకునే సెక్యూరిటీ ద్వారం గుండా బయటకు వెళ్ళాలి. ఇలాంటి మెట్లు కాలనీకి నాలుగు వైపులా వున్నాయి. సెక్యూరిటీ ద్వారాలవల్ల కాలనీలోకి ఎలాంటి అసాంఘిక శక్తుల ప్రవేశమూ వుండదు. ఆ కాలనీ వాసులందరూ బాగా వున్న వారే కావటాన అందరికీ కాలనీ అవతలకు వెళ్ళాలంటే 'ఫ్లైయింగ్ కార్లు' వున్నాయి. కాలనీలోకి సరుకులు రావటానికి, వెళ్ళటానికి వీలుగా 'లిఫ్ట్-హై రోడ్ల'ను నాలుగు వైపులా పెట్టారు. అనగా కాలనీ ప్రహరీ గోడకు ట్రక్కులు పట్టేంత పెద్ద ద్వారాలు పెట్టి, గోడకు కాలనీ వైపు భాగంలో హెవీ వెహికిల్లను సైతం క్రిందికి, పైకి చేర్చగల లిఫ్టులు పెట్టారు. ఆ కాలనీకి కావాల్సినవన్నీ ఈ నాలుగు లిఫ్ట్- హై రోడ్ల గుండా లోపలికి, బయటికి వెళ్ళొస్తుంటాయి. ఇంకా ఎన్నో వినూత్నమైన పద్దతులతో ప్రకృతిని ఉపయోగిస్తూనే, ప్రకృతికి అపకారం జరగని విధంగా ఎన్నిటినో తయారు చేస్కున్నారు. ఉదాహరణకు, వారి కాలనీలో వుండే నీటి రిజర్వ్ ట్యాంకులోని నీటి కదలికల నుండి విద్యుత్ను తయారు చేస్కోవటం, కాలనీ చుట్టూ పవన విద్యుత్ను తయారు చేసే చెట్ల ఆకారపు స్తంభాలు వుంచి, వాటికుండే ఆకుల లాంటివి గాలికి కదలటం ద్వారా విద్యుత్ను తయారు చేస్కోవటం వంటివన్న మాట. వాళ్ళు పాకింగ్కు అస్సలు ప్లాస్టిక్ వాడటం మానేసారు... అన్నీ ఎన్ని సార్లు వాడినా పాడవనివి, పర్యావరణానికి హాని చేయనివి వాడటం మొదలెట్టారు. రోజూ వాడే ఏ సామాగ్రైనా గాజు బాటిళ్ళలో కానీ స్టీలు డబ్బాలలో కానీ ప్యాకై వస్తాయి. వీరు దాన్ని వాడి మళ్ళీ అదే సామాగ్రి తీస్కునేప్పుడు ఈ డబ్బాలు, బాటిళ్ళను తిరిగి ఇచ్చేస్తారు. వాటిని ఆయా కంపెనీల వారు తీసుకుని, అనుసరించాల్సిన జాగ్రత్తైన పద్దతులలో శుభ్రపరిచి మళ్ళీ వాటిలోనే ప్యాక్ చేసి విక్రయిస్తారు. ఇలాంటి పద్దతులనెన్నిటినో మొదలెట్టి చెత్తను ఎంతగానో అదుపుచేయగలిగారు. హోటళ్ళలో నుండి వచ్చే పార్సిల్స్ సైతం స్టీలు డబ్బాలలోనే వస్తాయి. డబ్బాలకు కూడా డబ్బిచ్చి, మళ్ళీ ఆ డబ్బాలు తిరిగిచ్చినప్పుడు డబ్బు వాపసిచ్చేలాంటి పద్దతులతో చెత్తను అదుపుచేయటమే కాక శ్రేష్ఠత తగ్గని ఆహారమూ తినగల్గుతున్నారు... ఇలాంటి కాలనీల ముఖ్యోద్దేశం సారవంతమైన భూమిని కాపాడుకోవటమే. బంగ్లాల లాంటి ఇల్లులుండటం వల్ల ఎంతో వ్యవసాయ భూమి వృధా అవుతుంది, అయినా మంచి గాలి, వెలుతురు కోసం అలాంటి బంగ్లాలలోనే వుండాలనుకున్నవారు ఇలాంటి కాలనీలలో వుంటుంటారు. ఆ కాలనీని కట్టటానికి అయ్యే ఖర్చంతా ఆ కాలనీవాసులే పెట్టుకోవాలి. దానివల్ల వారికి సౌకర్యం, ఆరోగ్యం లభిస్తే, కాలనీ బయట ఊర్లో వుండే వారికి ఆక్సిజన్, కాలనీవాసులకు సరిపోగా మిగిలిన పండ్లు, కూరగాయలు కూడా లభిస్తాయి. కాలనీల బయట వుండే మిగిలిన ఊరివారు ఏ మాత్రం ఆ కాలనీలకోసం ఖర్చు పెట్టకున్నా, ఇంతో, అంతో వారికే కలిసి వస్తున్నందుకు కాలనీలు కట్టటానికి అడ్డుచెప్పలేకపోయారు. కాలనీవాసులు వారి అవసరానికి కావాల్సినవన్నీ అక్కడే దొరికే విధంగా ఏర్పాటు చేస్కున్నారు. స్కూళ్ళు, ఆసుపత్రులు, పోలీస్, ఫైర్ స్టేషన్లు, బ్యాంకులు, కాంప్లెక్సులు, జిమ్ములు, బ్యూటీ పార్లర్లు ఇలా కావాల్సినవన్నీ అక్కడే వుంటాయి. వారు సామాన్యంగా ఊర్లోకి వెళ్ళే అవసరమైతే వుండదు. నిజానికి ఈ కాలనీయే ఒక ఊరనుకోవచ్చు. టెక్నాలజీలో ఎంతో ఎత్తుకు ఎదిగి, ఎన్నో యంత్రాలు కనుక్కొని, వాటివల్ల జరిగిన అనర్థాలను అనుభవించిన మనుషులుగా వారికి కావాల్సినదేమనేది తెలిసి వచ్చింది. అందుకే ఎంత మటుకు అవసరమో అంత టెక్నాలజీని మాత్రమే ఉపయోగిస్తూ, ఎన్నో విషయాలలో తిరోగమనం బాటపట్టి, సహజ వనరులను, సహజ వాతావరణాన్ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే, సామాన్య ప్రజలు వాడే వస్తువులకు టెక్నాలజీ జోడించి అభివృద్ధిని చేసే ప్రయత్నం అంతగా చేయలేదు. కావున 2036లో కట్టినదైనా, ఆ కాలనీలో పెద్దగా టెక్నికల్ అభివృద్ధి కనబడటంలేదనాలి. ఈ కాలనీకి బయట మామూలు ఊరు వుంది, అయితే అక్కడన్నీ ఆకాశహర్మ్యాలే వెలిసాయి. కారణం, ఒక్కో విపత్తు వల్ల ఇళ్ళు, భూములు కోల్పోయిన వారికి ఇళ్ళు కట్టటానికి స్థలాలు లేక అత్యవసర ప్రాతిపదికన త్వరితగతిన టెక్నాలజీ వుపయోగించి ఒక్కో దాంట్లో 300 నుండి 500 దాకా అపార్ట్మెంట్లు వుండే ఆకాశహార్మ్యాలు కట్టారు. ఈ విధంగా అయితేనే ఒక్క ఇల్లు వుండే స్థలంలోనే ఏబై నుండి వందకు పైగా ఇళ్ళను కట్టి ప్రజల అవసరాలు తీర్చే వీలుంటుంది. భూ కొరత ఏర్పడగానే, వున్న భూమినంతా ప్రభుత్వం తన పరం చేసుకుంది. వ్యక్తిగతంగా పొలాలనేవి ఎవ్వరికీ వుండే అవకాశం ఇవ్వకుండా, ప్రజలకు సరిపడినన్ని పంటలు పండించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది. ప్రభుత్వం కేవలం ప్రజలతో పొలాలకు సంబంధించిన పనులు చేయించుకుని జీతాలు ఇచ్చేది. పొలం పనులన్నీ యంత్రాలే చేస్తుంటాయి, కాకపోతే మనుషులు వాటిని కంట్రోలు చేయటం, వాటికి రిపేర్లు వస్తే చేయటం మాత్రమే చేస్తుంటారు. ఊర్లలోని అందరూ అపార్ట్మెంట్లలోనే వుండటం మొదలయ్యింది. ఇంక బీద, సాదలకు కూడా అలాంటి వాటిల్లోనే నివాసం. ఇంట్లో ఎన్ని జంటలుంటే అన్ని బెడ్రూములుండే అపార్ట్మెంట్లను వారికి ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఊర్లోని సారవంతమైన భూమిపైనున్న ఇళ్ళు, బంగ్లాలను పడగొట్టి వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేసింది. ఆ వ్యవసాయక్షేత్రాలను, ముందు చేసిన తప్పును సవరించుకుని పూర్తిగా సేంద్రీయ పద్దతులనవలంభించి పండించటం మొదలెట్టింది. అందరికీ ఆకాశహార్మ్యాలలోనే నివాసాలు. ఒక్కో ఆకాశహార్మ్యం ఒక్కో గ్రామమనుకోవచ్చు. అపార్ట్మెంటు పద్దతి అవటం వల్ల అన్ని ఫ్లాట్లకు గాలీ, వెలుతురు అన్ని వేళలా, అన్ని కాలాలలో అందే అవకాశం తక్కువ, అయినా అందరూ వాటిల్లోనే వుండక తప్పదు. కరెంటు లేకపోతే కొంచెం సేపు కూడా లోపల వుండలేరు, అందుకే 24 గంటలూ కరెంటు వుండాల్సిందే. ప్రతి ఆకాశహర్మ్యంలో ఆక్సిజన్ మోనిటర్ వుంటుంది. వాతావరణంలో ఆక్సిజన్ శాతం వుండాల్సిన దానికంటే తక్కువ చూపించగానే ప్రతి అపార్ట్మెంట్లోకి కృతిమంగా ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ సరఫరా చేస్తారు. బయటకు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కచ్చితంగా వారివెంట చిన్న ఆక్సిజన్ కాన్ తీసుకెళ్ళాల్సిందే. టెక్నాలజీలో మనుషులు ఎంతో ఎత్తుకు ఎదిగి, ఎంతో సాధించారేమో కానీ వాటికి బదులుగా అంతకు మించిన వాటిని ఎన్నిటినో కోల్పోయారు. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది మంచి గాలి, మంచి నీరు, మంచి భూమి, వెలుతురు లాంటి ఖర్చు లేకుండా ఉచితంగా, శ్రమ పడకుండా దొరికే వాటిని కోల్పోయారు. అంతేకాక స్వతహాగా ఆరోగ్యంగా వుండటాన్ని కోల్పోయారు. అంటే, ఆరోగ్యంగా వుండటానికి టెక్నాలజీని వినియోగించి శరీరంలోని వ్యవస్థను గమనిస్తూ తగిన విధంగా కంట్రోల్ చేస్కుంటూ వుండాల్సిందే కానీ అలా ఊర్కే ప్రకృతిలో బ్రతికే అవకాశాన్ని చేజేతులా దూరం చేస్కున్నారు. ఇంతటితో కథ రెండవ భాగాన్ని ముగిస్తున్నాను. ఈ భాగంతో మీకు బోరు కొట్టించానేమో, అయినా అందరూ ఈ విషయాలను ఆకళింపు చేసుకుని ఆలోచించాలనే ఇలా విపులంగా వివరించాను. తర్వాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. ఇక వుంటాను. ============================================================

ఇంకా వుంది============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


Twitter Link


Podcast Linkమనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.

39 views0 comments

Comments


bottom of page