top of page

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 1


'Prema Chejarithe (bhavishyat Kalamlo)' New Telugu Web Series Written By Pendekanti Lavanya Kumariపెండేకంటి లావణ్యకుమారి గారి ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) ధారావాహిక ప్రారంభం


నమస్తే అండి! ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) అనే ధారావాహికను వ్రాసినది, చదువుతున్నది మీ లావణ్య కుమారి పెండేకంటి. సంగ్రహం: ప్రేమించిన వారికి ప్రేమ అందకుండా చేజారిపోతే, భవిష్యత్తు కాలంలోని వారయితే ఏం చేస్తారు అనే ఇతివృత్తంతో ఈ ధారావాహికను వ్రాసాను. ఇప్పుడైతే ప్రేమించిన వారు దక్కకపోయినా, తిరస్కరించినా కొందరు ఆత్మహత్యలు చేస్కుంటున్నారు, కొందరైతే ప్రేమను తిరస్కరించిన వారిని హత్యలు చేస్తున్నారు, ఇంకొందరైతే పిచ్చివాళ్ళై వాళ్ళనే తల్చుకుంటూ జీవిస్తున్నారు, మరికొందరు వారిని మర్చిపోయి వేరే వారిని పెళ్ళి చేస్కుని హాయిగా జీవిస్తున్నారు. అయితే పాతిక సంవత్సరాల తర్వాత కూడా మనుషులు ప్రేమించిన వారు దక్కకపోతే ఇలాగే వుంటారా? లేక వేరే ఏదైనా చేస్తారా? అనేదే ఈ సీరియల్లో మీరు చూడబోయేది. ఇలా జరుగవచ్చేమోనన్న ఆలోచనతో ఊహించి వ్రాసిన కథ అని గమనించగలరు. ఈ ధారావాహికంతా చూసాక ఇది ఆహ్వానించదగిన విషయమనిపిస్తే మీరూ దీని గురించి ఆలోచించండి, అలాకాక జరగకూడదనిపిస్తే దీన్నొక హెచ్చరికగా భావించి ఎవరూ అలాంటి ప్రయత్నాల జోలికి వెళ్ళకండి. ఇప్పుడిక సీరియల్ మొదటి భాగం చదువుతున్నాను. ------- ప్రేమ చేజారితే (భవిష్యత్ కాలంలో) - భాగం - 1 అది 2040 సంవత్సరం... అదో విలాసవంతమైన బంగ్లాల సమూహముండే పెద్ద కాలనీ. దాని పేరు 'ఆనందలోకం', ఆ పేరు వ్రాసి వుంచిన బోర్డు మీద దాని పేరు క్రింద 'ప్రయత్నంతో సాధ్యమే' అనే కాప్షన్ కూడా వుంది. ఆ కాలనీ అంతా డబ్బుంటే ఎన్ని హంగులతో వుండొచ్చో అన్ని హంగులతో దర్జాగా, సుందరంగా వుండి అందరికీ కనువిందు చేస్తుంటుంది. ఆ కాలనీలోని బంగ్లాల ముందు కృత్రిమమైన వృక్షాలు, మొక్కలలాంటి వాటిని సహజత్వంతో అలరారేలా చేసి అక్కడక్కడ పెట్టారు. అవే కాకుండా రకరకాల మోటివ్స్ తో, రకరకాల అందమైన శిల్పాలతో ఆహ్లాదపరుస్తూ చూడచక్కగా వుంటుందా కాలనీ. అక్కడున్న బంగ్లాలన్నీ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి కట్టినవే. అందుకే అవన్నీ ఎంతో అడ్వాన్సుడుగా వుండటమే గాక చాలా సౌకర్యవంతంగా కూడా వుంటాయి. అలాంటి ఆ కాలనీలో ఒక బంగ్లా... దాన్ని చూస్తూనే ఎవరికైనా అనిపిస్తుంది, ఆ బంగ్లా యజమాని మంచి టేస్టున్న వ్యక్తని. బంగ్లా ముందు భాగం ఎంతో వినూత్నంగా, వైవిధ్యంతో చాలా కళాత్మకంగా తీర్చిదిద్దినట్టుగా వుంది. అంతటి వైవిధ్యానికి కారణం కాలంతో పాటూ అభివృద్ధి చెందిన టెక్నాలజీయే అనక తప్పదు. అప్పుడు సమయం ఉదయం ఏడు గంటలవుతోంది... ఆ బంగ్లా మొదటి అంతస్తులోని పడకగదిలో... "కుశాల్! కుశాల్! గెటప్," అంటూ కుశాల్ కప్పుకున్న దుప్పటి తీసి కుడి బుగ్గ మీద ముద్దు పెట్తూ కుశాల్ని లేపింది షాలిని. ఆ ముద్దులోని చల్లదనాన్ని, ప్రేమానురాగాలను ఆస్వాదిస్తూ కుశాల్ మెల్లిగా కళ్ళు తెరిచి షాలిని వైపు చూస్తుంటే, షాలిని వాడితో, "గుడ్ మార్నింగ్ కుశ్," అంది. వాడు కూడా తిరిగి షాలినికి "గుడ్ మార్నింగ్ మా" అని ముద్దుగా చెప్పి మెడచుట్టూ చేతులు వేసాడు... షాలిని వాడిని ఎత్తుకుని మంచం మీది నుండి క్రిందికి దించింది. తర్వాత వెళ్ళి మొహం కడుక్కుందువురమ్మని వాష్బేసిన్ దగ్గరకు తీస్కెళ్ళసాగింది. అప్పుడు అయిదేళ్ళ కుశాల్ వాళ్ళమ్మని చూస్తూ, "అమ్మా! నీవెందుకు పొద్దున్నే నన్ను లేపినప్పుడంతా కుడి బుగ్గ మీదే ముద్దు పెట్తావు," అని అడిగాడు. దానికి వాళ్ళమ్మ వాడినొకసారి అలా చూసి, "నీవు చాలా పెద్దవాడివైపోతున్నావే, చాలానే గమనిస్తున్నావన్న మాట, సరే అయితే రేపటి నుండి ఒక్కోరోజు ఒక్కో బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాలే," అంటూ నవ్వుతూ వాడికి బ్రష్ చేయించింది. తర్వాత పాలు తీస్కొచ్చి త్రాగించింది. కుశాల్ ఈ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళమ్మ అంతగా ఆశ్చర్యపోకపోయినా, అదే సమయంలో ఆ బంగ్లా రెండవ అంతస్తులో తన పర్సనల్ రూములో, తన పర్సనల్ నెట్వర్క్ లో పని చేస్కుంటున్న కుశాల్ తండ్రి కుమార్ ఎందుకో చాలా ఆశ్చర్యపడి, మళ్ళీ సర్దుకుని, తను చేస్తున్న తన ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు తీసుకురావాలో అర్థం చేస్కుని పనిని కొనసాగించడంలో మునిగిపోయాడు. ఇక్కడ షాలిని టిఫిన్ రెడీ చేయాలని కుశాల్కు చెప్పి క్రింద నున్న వంటగది వైపుకు కదిలింది. కుశాల్ కూడా షాలినీ వెనకాలే క్రిందికి వెళ్ళి హాలులో కూర్చుని 'మాచూ కమాన్' అని అనగానే అక్కడే కుశాల్ ముందు 'మాచూ' అనే కార్టూన్ క్యారెక్టర్ వచ్చి ఆడసాగింది. వాడూ దానిలాగే ఎగురుతూ ఆడసాగాడు. ఇంతలో హాలు దగ్గరే వున్న ఇంకో పడకగది నుండి "అమ్మా షాలినీ! కాస్తా కాఫీ తెచ్చివ్వమ్మా ," అని ఒక ముసలి గొంతు చిన్నగా వినబడింది... షాలిని, "ఆఁ! తెస్తున్నాను మామయ్యా" అని సమాధానం చెప్పి, కాఫీ కలపసాగింది... ఆ గొంతు వినగానే కుశాల్ ఆకర్షణ అటు వైపుకు మళ్ళి, ఆయన దగ్గరకు వెళ్ళాలనిపించి, ఎగురుతూ ఆ హాలుకు కొంచెం ప్రక్కగా వున్న ఆ ఇంకో పడక గదికి వెళ్ళాడు. అక్కడ ఎనబై ఏళ్ళ ముసలివాడైన రాఘవరావు మంచం మీద కూర్చుని వున్నాడు. తలంతా తెల్లని ముగ్గు బుట్టలా వుంది, మెత్తని కాటన్ లాల్చీ వేస్కుని, మెత్తని పంచ చుట్టుకుని వున్నాడు. ఆయన కుశాల్ని చూడగానే ఇలా రమ్మని పిలిచాడు. వాడు దగ్గరకు వెళ్ళగానే వణుకుతున్న చేతులతో వాడి చెంపను పుణికాడు. వాడు ఆనందంగా నవ్వుతూ ఆయన పక్కన మంచమెక్కి కూర్చుని, "ఎందుకు గ్రాండ్పా! నీ చేతులలా వణుకుతున్నాయి," అని అడిగాడు. దానికి ఆయన నవ్వుతూ, "నేను ముసలివాడిని కదా అందుకే నా చేతులు వణుకుతున్నాయి," అని సన్నని గొంతుతో బదులిచ్చాడు. దానికి కుశాల్, " మరి నేను ముసలి వాడినైతే నాకూ వణుకుతాయా," అని ముద్దు, ముద్దుగా అడిగితే, ఆయన నవ్వుతూ, "హాఁ! వణుకుతాయిరా," అన్నాడు. దానికి వాడు, "అయితే నేను ముసలివాడిని కానే కాను," అంటూ బుంగ మూతి పెట్టాడు. ఇంతలో షాలిని ఒక కాఫీ కప్పుతో అక్కడికి వచ్చింది. ఆ కప్పు ముసలి వారు త్రాగేప్పుడు మీద పోస్కోకుండా వుండేందుకు వీలుగా ఒక మూత కలిగి, ఆ మూతకు ఒక స్ట్రా బిగించబడినట్లుగా వుంది. అందులో త్రాగేమైను వేడిగావున్న కాఫీ వుంది. తర్వాత షాలిని అక్కడే పక్కన వున్న ఒక స్టాండ్ లాంటి దాంట్లో ఆ కాఫీ కప్పును పెట్టి, ఆ స్టాండ్ను రాఘవరావు ముందుకు జరిపింది. ఇప్పుడు ఆ కప్పులోని స్ట్రా ఆయన నోటికి అందేలా వుంది. ఆయన భక్తి పాటలు అడిగితే పెట్టింది, అవి వింటూ ఆయన చిన్నగా కాఫీ చప్పరించసాగారు. ఇంతలో కుశాల్కు ఏదో గుర్తొచ్చి, "మా నాన్న కూడా అవుతాడా ముసలివాడు," అంటూ అడిగాడు రాఘవరావుని. "మీ నాన్నే కాదు, నువ్వూ అవుతావు, నువ్వే కాదు అందరూ అవుతారురా," అన్నాడు నవ్వుతూ రాఘవరావు. అయితే మా అమ్మ కూడా అవుతుందా అని అడుగుతుండగానే, షాలిని, "కుశాల్ని లాల పోస్కుందువు పదా," అంటూ తీస్కెళ్ళసాగింది. "వీడికన్నీ వాళ్ళ నాన్న పోలికలే, ఎక్కడ లేనన్ని ప్రశ్నలడుగుతుంటాడు," అని మనసులోనే అనుకుని చిరునవ్వుతో కాఫీ చప్పరిస్తూ పాటలు వినసాగాడు రాఘవరావు. ఇంకా సందేహం తీరని కుశాల్ వాళ్ళమ్మను, మధ్యలోనే ఆపి, "అమ్మా! గ్రాండ్పా, మనమందరమూ ముసలి వాళ్ళమవుతామంటున్నారు, నిజమేనా?" అని వాళ్ళమ్మనడిగాడు. దానికి షాలిని, " అవును నాన్నా! అందరమూ ముసలి వాళ్ళము కావాల్సిందే," అంది వాడి వంకే కుతూహలంగా చూస్తూ. దానికి కుశాల్ ఎంతో విచారంగా మొహం పెట్టి, "మరి నీవు ముసలిదానివైతే నాకెవరు లాల పోస్తారు?! ఎవరు బువ్వ పెడతారు?! ఎవరు బజ్జో పెడతారు?! నీవు ముసలిదానివి కానే కావద్దు," అంటూ చూసాడు వాళ్ళమ్మ వైపు, తాను అప్పటికి పెద్ద వాడైపోయుంటాడని తెలియని పసితనం వల్ల. వాళ్ళమ్మ కూడా సరదాగా వాడితో, "మీ నాన్న పెద్ద సైంటిస్టు కదా, మరయితే మీ నాన్ననడిగి నేను ముసలి దాన్ని కాకుండా వుండటానికి ఏమైనా కనిపెట్టమని చెప్దామా," అంది. దానికి వెంటనే వాడు సంతోషంగా, "హాఁ! చెప్దాం, ఇప్పుడే చెప్దాం పదా... మళ్ళీ నీవు ముసలిదానివైపోతే చాలా కష్టం, చెప్పొచ్చాక లాల పోచుకుంటాను, సరేనా," అన్నాడు ఎంతో అమాయకంగా. దానికి షాలిని నవ్వును ఆపుకోలేక పకపకా నవ్వుతూ," అంత తొందరగా ముసలివారు కారు నాన్నా దానికి నీవు మీ నాన్నంత పెద్దవాడివి కావాలి అంటే చాలా రోజులు పడ్తుందన్న మాట," అంది మనసులో వాడి అమాయకత్వాన్ని ఆస్వాదిస్తూ, వాడికి తనపై వున్న ప్రేమకు ఆనందిస్తూ. "అంటే, నేను పెద్ద వాడినయ్యాకే నీవు ముసలిదానివవుతావా?!" అన్నాడు ఏదో ఆలోచించుకుంటూ. వెంటనే షాలిని, " ఏంటి ఆలోచిస్తున్నావు? నీవు పెద్దవాడివయ్యాక, నేను ముసలిదాన్నయినా పరవాలేదనా?" అంది చిలిపిగా. వాడు ఎంతో అమాయకంగా మొహం పెట్టి, "అది కాదమ్మా! నేను పెద్ద వాడినయ్యాకే నీవు ముసలి దానివయ్యేట్లయితే, నాన్న కనిపెట్టకపోయినా, నేను మనం ముసలివాళ్ళము కాకుండా వుండేలా కనుక్కుంటాను, సరేనా," అన్నాడు. దానికి షాలిని, " నీకున్న తెలివితేటలతో కనుక్కున్నా కనుక్కుంటావులే," అంది వాడిని మురిపంగా చూస్తూ. ఇంతలో వాడికి ఏదో గుర్తొచ్చి, " అమ్మా! మరి సైంటిస్టంటే ఏం చేస్తారు?" అంటూ అడిగాడు. "అయ్య బాబోయ్! నీ ప్రశ్నలకు అడ్డూ, ఆపూ వుండదు కానీ, వాటికి సమాధానం ఇస్తూ కూర్చుంటే ఇంక నిన్ను స్కూల్కు పంపినట్టే, త్వరగా పద లాల పోస్కుందువు కానీ," అంటూ షాలిని వాడిని బాత్రూమ్ వైపుకు తీస్కెళ్ళసాగింది. వాడు మాత్రం ఏవేవో దీర్ఘంగా ఆలోచిస్తూ వాళ్ళమ్మతో పాటూ వెళ్ళసాగాడు.

============================================================

ఇంకా వుంది


============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


Twitter Link


Podcast Linkమనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.
107 views0 comments

Comentarios


bottom of page