top of page

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 4


'Prema Chejarithe (bhavishyath Kalamlo) 4' New Telugu Web Series Written By Pendekanti Lavanya Kumari



(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)


గత భాగంలో షాలినీని మెచ్చుకుంటూ రాఘవరావు షాలినితో మాట్లాడ్తుండగా మెట్లు దిగుతున్న శబ్దం వినిబడింది.

ప్రేమ చేజారితే - 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక చదవండి... మెట్లు దిగిన కుమార్, రాఘవరావు గదిలో కొచ్చి, "ఏంటి నాన్నా! ఏదో సంతోషంగా మాట్లాడ్తున్నారు, ఏంటి విషయం?" అని ఇద్దరినీ చూసి అడుగుతూ వచ్చి రాఘవరావు చెయ్యి పట్టుకుని ఆయన ప్రక్కనే మంచం మీద కూర్చున్నాడు. "ఏమీ లేదురా, పెళ్ళి వయసుదాటాక పెళ్ళి చేస్కున్నా కూడా నాకు బంగారం లాంటి కోడలిని తెచ్చావు. షాలిని ఏ పనైనా విసుగుపడకుండా సంతోషంగా చేస్తుందని మెచ్చుకుంటున్నానంతే. మీ అమ్మకు నీ ఉన్నతిని కానీ, కోడలినీ, మనవడిని కానీ చూసే అదృష్టం లేకుండా పోయిందిరా. అది ఉన్నన్ని రోజులూ మనం ఏదో తిండికీ, బట్టకు లోటు లేకుండా వున్నామే కానీ మీ అమ్మకు ఏనాడూ ఒక నగా, నట్రా చేయించేంత స్థోమతలో నేను లేకపోయాను. ఏమో అది అంత తొందరపడి నీ ఉన్నతిని చూడకుండానే ఈ లోకం నుండి వెళ్ళి పోయింది," అంటూ కళ్ళు తుడుచుకున్నాడు రాఘవరావు. "అవును నాన్నా, నాక్కూడా ఎప్పుడూ అదే లోటుగా అనిపిస్తుంది... పోనీలెండి, మిమ్మల్నైనా సంతోషపెట్టగలిగాను, నాకు ఆ ఆనందమన్నా మిగిలింది," అంటూ మనసులో షాలిని అసలు మీ కోడలే కాదని తెలిస్తే మీకు ఈ ఆనందం కూడా కలిగేది కాదేమో, అయితే నేను చేసింది మీకు ఆనందాన్ని కలిగించే మంచి పనే అని నాకిప్పుడు చాలా తృప్తిగా వుందనుకున్నాడు కుమార్. తర్వాత షాలినికి, "డైనింగ్ టేబుల్ పైన బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టు," అని చెప్పి, రాఘవరావును పట్టుకుని చిన్నగా డైనింగ్ టేబుల్ దాకా నడిపించుకు తీస్కెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరగా కుర్చీలో కూర్చోబెట్టి ప్రక్కనే వున్న మరో కుర్చీలో తనూ కూర్చున్నాడు కుమార్. రాఘవరావుకు టిఫిన్ మంచం దగ్గరికే తెచ్చివ్వచ్చు, కాకపోతే అలా అతనిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీస్కెళ్ళి తన చేతులతో పెట్టటమనేది ఆయనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అలా చేస్తుంటాడు కుమార్. అమ్మెలాగూ లేదు, వున్న నాన్నను ఆనందంగా చూస్కోవాలనేదే కుమార్ కోరిక. ఇంతలో షాలిని వేడి, వేడి ఉప్మా తీస్కొచ్చి టేబుల్ పైనున్న ఇద్దరి ప్లేట్లలో పెట్టింది. రాఘవరావు వణుకుతున్న చేతులతో తినటం కష్టమవుతుందని షాలిని తనే రాఘవరావుకు స్పూన్తో పెట్టబోతే, కుమార్ నేను తింటూ పెడ్తానని చెప్పి, షాలినిని నీవు కూడా తినమని చెప్పబోయి ఆపుకున్నాడు కుమార్. షాలిని వారితో, " మీకు పండ్లరసం చేసి తీస్కొస్తాను," అని చెప్పి లోనికెళ్ళింది. కుమార్ తను తింటూ, మధ్య, మధ్యలో రాఘవరావుతో మాట్లాడ్తూ, ఆయనకు నిదానంగా స్పూన్తో తినిపించసాగాడు. రాఘవరావు కొడుకలా తనకు తినిపిస్తుంటే ఎంతో ఆనందంగా తినసాగాడు. అలాగే పండ్లరసం కూడా చిన్నగా రాఘవరావు చేత తాగించి, మూతి తుడిచి మళ్ళీ రాఘవరావుని రూమ్కి తీస్కెళ్ళి పడుకోబెట్టాడు కుమార్. " 'నాన్నా! మీరు చిన్నప్పటి నుండి నేర్పించిన విలువలను ఎప్పటికీ మర్చిపోలేను, మర్చిపోను కూడా. అలాగే నానీకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా షాలిని చూస్కుంటుందని నేను మీకు మాటిస్తున్నాను. మీరు ఏమీ ఆలోచించకుండా హాయిగా వుండటమే కావాల్సింది' అని చెప్పి, 'నేనింక ఆఫీసుకు వెళ్ళొస్తా కొంచెం పనుంది,' "అంటూ హాల్లోకి వచ్చాడు కుమార్. హాల్లోకి వచ్చి కూర్చున్నాడే కానీ ఆఫీసుకు అప్పుడే వెళ్ళాలనిపించక అలాగే కూర్చుండిపోయాడు. ఇక్కడ 'నానీ' అంటే ఎవరో కాదు 'కుశాలే'. కుశాల్కి, కుమారే పేరు పెట్టాడు. తన పేరులోని మొదటక్షరం 'కు' తో, షాలిని పేరులోని మొదటి రెండు అక్షరాలను కలిపి కుశాల్ అని. కాకపోతే వాడ్ని 'నానీ' అని పిలిస్తేనే కుమార్కు బాగుంటుంది. కారణం, కుమార్ని కూడా వాళ్ళమ్మ చిన్నప్పుడు 'నానీ' అని పిలిచేది. అందుకే తను కూడా కుశాల్ను అలా పిలుస్తూ అమ్మను గుర్తుకు తెచ్చుకుంటుంటాడు కుమార్. అలా కూర్చున్న కుమార్కి, ఏవో ఆలోచనలు... నేను చేస్తున్నదాంట్లో నాకేమీ తప్పు కనపడటం లేదు అనుకున్నాడు కుమార్. ఏదిఏమైనా కుశాల్ జీవితమే సమాజానికి సమాధానమిస్తుంది. కుమార్ ఆలోచనలు అలా పరుగులు పెడుతూ, మనసు పొరల్లోని అతని గతాన్నంతా మళ్ళీ కనుల ముందు కదిలేలా చేసాయి. *** రాఘవరావు, సరస్వతమ్మల ఒక్కగానొక్క సంతానం కుమార్. రాఘవరావు బ్రతకలేక బడిపంతులు అన్నట్లు ఒక చిన్న ప్రవేట్ స్కూల్లో పంతులుగా చేసేవాడు. వచ్చే కొద్ది పాటి నెల జీతంతో గుట్టుగా బ్రతికేవాడు. అందరి తండ్రులలాగానే ఆయన కూడా తన కొడుకు బాగా చదువుకుని, ఏ ఇబ్బంది లేని మంచి జీవితం గడపాలని కోరుకునేవాడు. అందుకే బాగా చదివించాలనుకునేవాడు. కుమార్ కూడా బాగా చదివేవాడు, పైగా మంచి తెలివైనవాడు కూడా. రాఘవరావు కుమార్ను బాగా క్రమశిక్షణతో పెంచటమే కాక, మంచి విలువలను కూడా నేర్పుతూ పెంచాడు. అలాగే సరస్వతమ్మ కూడా భర్తకు తగిన భార్య. కుమార్ కూడా, తండ్రికి భారం కాకూడదని బాగా చదువుతూ పదవతరగతిలో పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ వ్రాసి మంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సీటు సంపాదించి ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో డిస్టింక్షన్తో డిప్లొమా పూర్తి చేసాడు. ఇంక ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడు, వాదోడుగా వుంటూ ప్రైవేటుగా ఇంజినీరింగ్కి సమానమైన ఏ.ఎమ్.ఐ.ఈ. చదవాలనుకున్నాడు. అలాగే ఒక చిన్న ఉద్యోగం చూస్కుని చేస్కుంటూ ఏ.ఎమ్.ఐ.ఈ చదవసాగాడు. అవసరాలకు వుంటాయని ఆ వచ్చిన డబ్బును తండ్రికి ఇచ్చినా, ఆయన వద్దని వారించి, ఇల్లు ఎలాగైనా గడుస్తుంది, అది నీ సంపాదన నీవే బ్యాంకులో వేస్కోమని చెప్పాడు. నేడు, రేపట్లో మంచి ఆస్తి, ఆదాయముంటే కానీ పెళ్ళిళ్ళు కావటం లేదని ఆయన అలా చేయించసాగాడు. ఏ.ఎమ్.ఐ.ఈ. సొంతంగా చదవటం చాలా కష్టమైన పనే. పైగా ఉద్యోగం చేస్తూ చదవటమంటే ఎంతో కష్టమైన విషయం. డిప్లొమా అంటే టెక్నీషియన్ పని కాబట్టి ఆఫీసులో నైట్ డ్యూటీలు కూడా వుంటాయి. అలా తన ఇరవై ఆరో ఏటికి ఏ.ఎమ్.ఐ.ఈ. పూర్తి చేసి ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించాడు. ఇంక ఇంజనీరింగ్ తో ఉద్యోగం సంపాదించే ప్రయత్నం మొదలు పెట్టాడు. అప్పటికే దేశంలో అవసరానికంటే ఎక్కువ మంది ఇంజనీర్లు తయారయ్యారు. ఆలోచన లేకుండా ఇష్టమొచ్చినట్టు ప్రైవేటు కాలేజీలకు అనుమతులిచ్చిన ప్రభుత్వమే దీనికి కారణం. ఒకేసారి అంతమంది ఇంజనీర్లు చదివి బయటకు వస్తే ఉద్యోగాలు చూపించగల వెసులుబాటు దేశంలో వుందా, లేదా? అలాకాకున్నా ఉద్యోగావకాశాలున్న విదేశాలకు వీరు వెళ్ళే వెసులుబాటు ప్రభుత్వం కల్పించగలదా? ఇలాంటి విషయాలనెన్నిటినో కాలేజీలకు అనుమతులిచ్చేప్పుడు ప్రభుత్వ సలహాదారులు ఆలోచిస్తారో, లేదో కూడా అర్థం కాదు. విదేశాలకు వెళ్ళాలంటే మంచి ఉత్తీర్ణతతో, ఉత్తమ శిక్షణతో పాసవ్వాలి. అప్పట్లో చాలా మందికి ఏవో కొన్ని పెద్దగా పేరులేని ఇంజినీరింగ్ కాలేజీలలో ఫ్రీగా సీట్లయితే దొరికేవి కానీ అంత బాగా శిక్షణ వుండేది కాదు, అలాగే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా వుండేది కాదు. దానితో అలాంటి కాలేజీలలో చదివినవారు పేరుకే ఇంజనీరింగ్ చేసినట్టు. చాలామటుకు సబ్జెక్టు మీద పెద్దగా అవగాహన లేకుండానే చదువు పూర్తయ్యిందనిపించుకునేవారే ఎక్కువ. అందుకే ఉద్యోగాలందరికీ దొరకటం కష్టంగా వుండేది. ఎవరికి ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్ వుంటే వారికే ఉద్యోగావకాశం ఎక్కువగా వుండేది. మంచి కాలేజీలలో చదివిన టాలెంటెడ్ ఇంజనీర్లనంతా పెద్ద, పెద్ద కంపెనీలు కాంపస్ ఇంటర్వ్యూలలోనే సెలెక్ట్ చేస్కోని తీస్కెళ్ళిపోయేవారు. మిగిలిన వారికి ఏదో చిన్న, చిన్న కంపెనీలలో ఉద్యోగాలు వస్తుంటాయి. ఇంకా మిగిలిపోయిన వారు, వారి చదువుకు సంబంధం లేని ఏదో ఒక పనిలో సంపాదన కొరకు చేరిపోయేవారు. అలాగే ఇలా కరెస్పాండెంట్గా ఏ.ఎమ్.ఐ.ఈ. ద్వారా ఇంజినీరింగ్ చేసిన వారికి, వారు చేసే పనిలో ప్రమోషన్ల వరకు మాత్రమే ఆ డిగ్రీ ఉపయోగపడుతుంది. ఏదైనా మంచి కంపెనీలలో ఉద్యోగం దొరకటమనేది కష్టమే. అందుకే ఇంకా కొన్ని కంప్యూటర్ కోర్సులను చేయాలనుకున్నాడు కుమార్. ఏదైనా నిరూపించగల్గితే తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయని కుమార్ నమ్మకం. అనుకున్నదే తడవుగా ఎప్పటిలాగే వున్న ఉద్యోగం చేస్కుంటూ కంప్యూటర్ కోర్సులు చేయసాగాడు కుమార్. రాఘవరావు, కుమార్కు పాతికేళ్ళు దాటాయి.. ఇంక పెళ్ళి చేయాలని నిర్ణయించుకుని పెళ్ళి సంబంధాలు చూస్తానని కుమార్కు చెప్పాడు. కుమార్కు పెళ్ళి కళ వచ్చేసింది, ఎప్పుడూ ఏదో సాధించాలనే ఆలోచనలో వుండేవాడు కాస్తా కొంచెం అమ్మాయిల గురించి కూడా ఆలోచించసాగాడు. కరెక్ట్గా అలాంటి సమయంలోనే కుమార్ కంటపడింది షాలిని. కుమార్ చేరిన కంప్యూటర్ కోర్సులోనే తన ఇద్దరి ఫ్రెండ్స్ తో కలిసి షాలిని కూడా చేరింది. కుమార్కు షాలిని ఎంతగానో నచ్చింది, రూపాన్ని మించి షాలిని అణకువే బాగా ఆకట్టుకుంది కుమార్ను. ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తూ, వచ్చే భాగంలో మరిన్ని షాలిని విశేషాలతో మళ్ళీ కలుస్తాను, ఇక వుంటాను.

============================================================

ఇంకా వుంది



============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


Twitter Link



Podcast Link



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.






31 views0 comments
bottom of page