top of page

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 5


'Prema Chejarithe (bhavishyath Kalamlo) 5' New Telugu Web Series Written By Pendekanti Lavanya Kumari

(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)


గత భాగంలో... కుమార్ ఇంకా మంచి ఉద్యోగావకాశాలు కోసం కంప్యూటర్ కోర్సులు చేయసాగాడు. అక్కడే చదువుతున్న షాలినీ, ఆమె అణకువ కుమార్ను ఎంతగానో ఆకర్షించింది.

ప్రేమ చేజారితే - 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక చదవండి... షాలిని, ఆమె ఫ్రెండ్స్ ఇద్దరూ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వాళ్ళు తమ ప్రాజెక్టు కోసం కొన్ని నెలలు కంప్యూటర్ కోర్సు చేయటానికని అక్కడ చేరారు. ఈ విషయాలు కుమార్ అడిగి తెలుసుకున్నాడనుకున్నారా? కానే కాదు. కోర్సులో చేరిన మొదటిరోజు క్లాసులో లెక్షరర్ అందరి పరిచయాలు అడగగా, ఎవరికి వారు తమ గురించి తాము చెప్పినప్పుడు తెలిసిన విషయాలు. కొన్ని విషయాలు కుమార్ కూడా తెలుసు కున్నాడు లెండి ప్రతిరోజూ షాలినిని గమనిస్తూ... షాలిని రోజూ క్లాస్కి తెల్ల కైనటిక్ హోండాలో వచ్చేది. చూడ్డానికి బాగా డబ్బున్న అమ్మాయనిపించేది. అయినా కూడా నెమ్మదిగా, అణకువగా తన పనేదో తాను చేసుకుపోతూ వుండేది. ప్రక్కనున్న తనలాంటి అందమైన ఇద్దరమ్మాయిలలా కోతివేషాలు వేసేది కాదు, అందుకే స్పెషల్గా అనిపించేది కుమార్కు. క్లాసులో అడిగిన వాటికి సమాధానాలు చెప్పటమే కాక తనకు వచ్చే ఎన్నో సందేహాలను అడిగి మరీ నివృత్తి చేసుకునేది, వేరే ఎవరైనా తనని సందేహాలడిగితే తీర్చేది కూడా. అందుకే షాలిని మంచి తెలివైనదని కూడా అర్థమయ్యింది కుమార్కు. షాలిని కళ్ళు పెద్దగా చాలా అందంగా వుండేవి. అందుకే ఆ కళ్ళంటే కుమార్కి చాలా ఇష్టం. అదే సమయంలోనే పెళ్ళి, పెళ్ళి సంబంధాలని రాఘవరావు అంటుండటంతో కుమార్ చేస్కుంటే షాలినిలాంటి అమ్మాయినే చేస్కోవాలని నిర్ణయించుకున్నాడు... తర్వాత, షాలినే ఎందుకు కాకూడదు అని కూడా అనుకున్నాడు. కానీ కుమార్ బుద్ది, కుమార్కు బుద్ధి చెప్పింది, అయినా నీకేముందని ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని చెప్పి తన తాహతును గుర్తు చేసింది. నిజానికి కుమార్ తనకున్న చిన్న ఉద్యోగం చూపి షాలినిలాంటి పెద్దింటి అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తే మాత్రం ఆమె అంగీకరిస్తుందా? పోనీ పోయి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి చెప్పినా వాళ్ళు అంగీకరిస్తారా?! అలా కాక షాలిని కూడా కుమార్ని ప్రేమిస్తూ వుండి వుంటే ఒక రకంగా పని సులువయ్యేది. కానీ షాలిని ఇంతవరకూ కుమార్ వైపు చూడను కూడా లేదు. ఒకవేళ షాలినిని ఈ కోర్సయిపోయేలోపల తనను ఇష్టపడేలా చేస్కోగల్గితే, అప్పుడు ఆమెతో పెళ్ళి గురించి ఆలోచించే అవకాశం వుండొచ్చనుకున్నాడు కుమార్. అంతే అప్పటి నుండి కుమార్కు షాలిని ఆలోచనలే... షాలినిని ఎలా పరిచయం చేస్కోవాలి... ఎలా వుంటే షాలిని తనని ఇష్టపడుతుంది... ఏమి చేస్తే షాలిని తనని చూసి మాట్లాడ్తుంది... ఇవే ఆలోచనలు...

బాగా ఆలోచించి, ముందు షాలిని గురించి తెలుసుకోవాలనుకున్నాడు... తన ఇష్టాయిష్టాలు ఏమిటో పసిగట్టాలి... అప్పుడే తనకు ఇష్టమైన రీతిలో ప్రవర్తించి తనను ఆకర్షించగలననుకున్నాడు. అంతే, అప్పటి నుండి, షాలిని తన ఫ్రెండ్స్ తో పాటూ కూర్చునే డెస్కు పక్కనే వున్న డెస్కులో కూర్చోవటం మొదలెట్టి, సమయం దొరికినప్పుడంతా మాట్లాడటానికి ప్రయత్నించేవాడు కుమార్. అయినా షాలిని కనీసం కుమార్ వంక చూడను కూడా చూసేది కాదు. ఇదంతా గమనిస్తున్న షాలిని ఫ్రెండ్స్ కుమార్ అవస్థను చూసి లోపల్లోపల తెగ నవ్వుకునేవారు. అలా రాను, రాను పైకే నవ్వడం మొదలెట్టారు. అది చూసి కుమార్కు కూడా సిగ్గనిపించడమే కాక, షాలినికి అనవసరంగా ఎవ్వరితో మాట్లాడటం పెద్దగా ఇష్టముండదని అర్థమయ్యింది, అందుకే ఇంక షాలినిని పరిచయం చేస్కునే ప్రయత్నం మానుకున్నాడు. అయినా కుమార్కు ఆశ మాత్రం చావక ఏనాడైనా, తను కూడా గొప్ప వాడు కాకపోడా, తన ప్రేమను తెలపక పోడా అని అనుకుంటూ వుండేవాడు. ఒకసారి షాలిని, షాలిని ఫ్రెండ్సుకు ఇంజనీరింగ్ ఫైనలియర్ ఇంటర్నల్స్ వుండి మూడు రోజులపాటూ ముగ్గురూ కంప్యూటర్ క్లాసుకు రాలేదు. నాల్గవ రోజు ఒక్క షాలిని మాత్రమే కంప్యూటర్ క్లాసుకు వచ్చింది. తను క్లాసుకు రాని మూడు రోజులు క్లాసులో ఏమి జరిగిందో ఎవరినైనా అడుగుదామని ప్రక్కకు చూస్తే, అక్కడే ప్రక్క డెస్కులో కూర్చున్న కుమార్ కనిపించాడు. వెంటనే కుమార్నడిగి ఏమేమి జరిగాయో తెల్సుకోటానికి అతని నోట్సు ఇమ్మని అడిగింది. అంతే, దానికే కుమార్, ఆకాశమంత ఎత్తుకు ఎగిరొచ్చాడనొచ్చు. ఆనందపడిపోతూ వెంటనే తన నోట్సును షాలినికిచ్చాడు.


ఆ నోట్సు చూసిన షాలిని కుమార్తో, "మీరు నోట్సు చాలా బాగా ప్రిపేర్ చేసార"ని చెప్పింది. అంతే మన వాడు ఒక్క నిముషంలో ఎన్ని లోకాలు తిరిగొచ్చాడో అతనికే తెలియాలి, అంత ఇదిగా ఊహాలోకాలలో తేలిపోతూ అవసరమనుకుంటే ఇంటికి తీస్కెళ్ళి వ్రాస్కోని తెచ్చిమ్మని ఆఫర్ కూడా ఇచ్చేసాడు షాలినికి. కానీ షాలినీయే వద్దులే ఇక్కడే ఏం చెప్పారో చూసి ఇచ్చేస్తానని చెప్పి చూడసాగింది. అదే మొదటిసారి కుమార్ షాలినితో రెండు మాటలు మాట్లాడగల్గింది. దానికే కుమార్ ఉబ్బితబ్బిబ్బయి పోయాడు. ఎలాగో ఒకలా షాలినితో పరిచయం ఏర్పడిందని తెగ సంతోషపడి పోయి, ఆరోజు ఎంతో ఉత్సాహంగా ఇంటికి వెళ్ళిపోయాడు కుమార్. ఇంటికి వెళ్ళినప్పటి నుండి మళ్ళీ ఎప్పుడెప్పుడు కంప్యూటర్ క్లాస్కు వెళ్తానా, ఎప్పుడెప్పుడు షాలినిని మళ్ళీ చూస్తానా అనే ఆలోచనతోనే సరిపోయింది కుమార్కు. మరుసటి రోజు ఎక్కడ లేనంత ఉత్సాహంతో తనకున్న డ్రెస్సులలోంచి ఒక మంచి డ్రెస్సు తీసివేస్కుని, ఎప్పుడెప్పుడు షాలినిని చూస్తానా, మాట్లాడ్తానా అని ఒక అరగంట ముందే క్లాస్కెళ్ళి కూర్చుని ఎదురు చూడసాగాడు కుమార్. పాపం! కుమార్ బ్యాడ్ లక్, ఆ రోజే షాలిని, తన హోండా ట్రబులిచ్చి క్లాస్కి రాలేకపోయింది... అంతే! కుమార్ ఉత్సాహమంతా నీరుకారిపోయి బేలగా అయిపోయాడు పాపం. ఒన్ వే లవ్ లన్నీ ఇలానే వుంటాయి. వాళ్ళకు తెలుసు అవతలివారు ఒప్పుకోరని, అయినా ప్రేమిస్తారు, ఆశగా ఎదురు చూస్తారు, చేసేదిలేక సంస్కారవంతులైతే తప్పుకుంటారు. దుర్మార్గులైతే ఎలాగైనా, అంటే మోసపూరితంగానైనా అవతలివారు తనని ప్రేమించేలా చేస్కోవాలనుకుంటారు. కుమార్ చాలా విలువలతో పెరిగిన వాడు కాబట్టి కచ్చితంగా తప్పుకునే వాడే. ఆ రోజు షాలిని రాలేదన్న బాధతో నిరుత్సాహంగా ఇంటి దారి పట్టాడు కుమార్. ఆ తర్వాత కుమార్ మళ్ళీ షాలినిని చూసిందే లేదు. కారణం, కరోనా విజృంభించటంతో క్లాసులన్నీ ఆన్లైన్లోనే చెప్పసాగారు. *** ఇక ఇంట్లో రాఘవరావు కుమార్కు సంబంధాలు చూడబోతే తగిన ఆడపిల్లలు దొరకటం చాలా కష్టమయ్యింది. ఆస్తిపాస్తులుండి, మంచి సంపాదవచ్చే ఉద్యోగం వుంటే కానీ పిల్లనివ్వనంటున్నారు. అయినా కుమారు కానీ, రాఘవరావు కానీ పెళ్ళికూతురి గురించి పెద్దగా ఆశించను కూడా లేదు. ఏదో అంతో, ఇంతో చదువుకుని ఒక మోస్తరుగా వుంటే చాలనుకున్నా దొరకటం కష్టంగా వున్నింది. నిజానికి ఆ రెండు, మూడు దశాబ్దాలలో, దేశంలో చాలా మధ్య తరగతి కుటుంబాలలో మగ పిల్లలకు తగిన సంబంధం తెచ్చి పెళ్ళిళ్ళు చెయ్యటం ఎంతో కష్టమైపోయిందంటే అతిశయోక్తి కాదు. కారణం... మధ్యతరగతి కుటుంబాలలోని యువకులతో పోల్చుకుంటే యువతుల నిష్పత్తిలో కొంతమేర తగ్గుదల వుండటమే. అందుకే ఆ కాలంలో ఆడపిల్లలకు బాగా డిమాండ్ ఏర్పడింది. అన్ని బాగా వున్న వ్యక్తికి ఓ మోస్తరు అమ్మాయి దొరకటమే అదృష్టమనుకునేవారు. నూరు మందిలో పది మంది యువకులకు పెళ్ళికొరకు యువతులు దొరకటమనేది కష్టతరమయ్యిందనాలి. అలాంటి కేటగిరీ లోకి కుమార్ కూడా పడిపోయాడు. దీనికంతటికీ కారణం ఆడపిల్లలను కనాలంటేనే భయపడిన ఒకప్పటి తల్లిదండ్రులు. తర్వాత్తర్వాత ప్రభుత్వం ఆడపిల్లలను కన్నవారికి ఇచ్చే పథకాల వల్ల, ప్రెగ్నెన్సీ స్కానింగులను రిస్ట్రిక్ట్ చేయటం వల్ల కొద్దిగా మార్పైతే వచ్చిందనాలి. ఎంతైనా, ఆడపిల్లలను కంటే పెంచి జాగ్రత్తగా కాపాడుకోవటం ఒక ఎత్తైతే, మంచి వ్యక్తిని వెతికి, కట్నకానుకలు ఇచ్చి పెళ్ళి చేయటం ఇంకొక ఎత్తైపోయింది. 1970 ల ప్రాంతంలో విదేశాల్లో మెడికల్ ఫీల్డ్లో జరిగిన కొన్ని ఆవిష్కరణలలో ఒకటి, కడుపులోని బిడ్డ ఆడో, మగో తెలుసుకునే స్కానింగ్ టెక్నాలజీ. మన దేశంలోకి 1980ల ప్రాంతంలో ఏవో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వెసులుబాటు వుండేది. రాను,రాను 2000 నాటికి దాదాపు ప్రతి చిన్న ప్రైవేటు ఆసుపత్రులలో సైతం ఇది అందుబాటులోకి వచ్చేసింది. విదేశాలలో ఈ ప్రక్రియను పుట్టబోయే శిశువులలో ఏవైనా లోపాలు వుంటే సరిదిద్దటం కొరకు కనిపెడితే, మన వారు దాన్ని ఆడపిల్లైతే అబార్షన్ చేయించుకుని భ్రూణహత్యలకు పాల్పడటానికి ఉపయోగించసాగారు. దానితో ఆ సమయంలో పుట్టిన మగపిల్లలకంటే, ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా నమోదయ్యింది. అందువల్ల అప్పుడు పుట్టిన వారికి పెళ్ళి వయసు వచ్చేసరికి పెళ్ళి చేస్కోటానికి ఆడపిల్లలు దొరకటం చాలా కష్టమైపోయింది. అందుకే ఆడపిల్లల అత్యాచారాలు బాగా పెరిగి పోవటానికి ఇదీ ఒక కారణమంటారు. ఇవన్నీ సమాజానికెంతో సిగ్గు చేటనాలి. మగవారి అహంకారాన్ని అణచి, ఆడవారి విలువను తెలియచేయటం కోసమే ఇది ప్రకృతి చేసిన ప్రయత్నం అనుకోవచ్చు. తమలాగా ఉద్యోగం మీదే ఆధారపడి బ్రతికే మధ్య తరగతి వారందరి పరిస్థితి ఇంచుమించు అలాగే వుందని తన స్నేహితులు ద్వారా విన్నాడు రాఘవరావు. అందుకే ఏదో ఇంత అక్షరం ముక్క వచ్చి ఇంటిపనులు చూస్కోగల్గిన అమ్మాయయినా చాలనుకుని చూడాలనుకున్నాడు. చివరికి అలాంటివేవో కుమార్కు ఒకటి, రెండు సంబంధాలు వచ్చాయి, ఆలోచించే లోపలే కరోనా అనే వైరస్ ప్రపంచమంతా విజృభించటం మొదలెట్టింది. ఎన్నో దేశాల్లో అప్పుడప్పుడూ నెలల పాటూ లాక్డౌన్లను (అంటే స్వచ్ఛందంగా అందరూ ఇళ్ళను, అంగళ్ళను, అన్నిటినీ మూసుకుని ఇంట్లోనే వుండటం.) కూడా విధించారు.


కొన్ని నెలలు ఎలాంటి ఉత్సవాలను ప్రోత్సహించలేదు. పెళ్ళిళ్ళను యాబై మందిని మించని బంధుజనంతో మాత్రమే చేస్కోవాలని నియమం పెట్టారు. ఎక్కడా గుంపుగా వుండ కూడదని, ప్రతి ఒక్కరూ మాస్కులతోనే తిరగాలని, సినిమా హాల్లలో, బస్సుల్లో సీటు వదిలి సీటులో కూర్చునే విధంగా మార్చారు. పిల్లలందరూ ఆన్లైన్ లోనే క్లాసులకు అటెండ్ అవసాగారు. ఉద్యోగస్తులలో ఆన్లైన్లో తమ పనులు చేయగలిగిన వారంతా ఆన్లైన్లోనే చేయసాగారు. ఇంక కుమార్ కంప్యూటర్ కోర్సు కూడా ఆన్లైన్లోనే జరగసాగింది. అంతే ఆ తర్వాత కుమార్కు షాలినిని మళ్ళీ కలిసే అవకాశమే రాలేదు. అలా కుమార్ మూగ ప్రేమ అక్కడితో ముగిసిపోయింది. (ముగిసి పోయిందంటూ మళ్ళీ కథలో షాలిని గురించి వ్రాస్తున్నారే అనేదేగా మీ డౌట్!?. వెయిట్... వెయిట్... ఇంకా కథ అయిపోలేదు, ఏమి జరుగుతుందో చివరి దాకా చదివితేనే అర్థమవుతుంది మరి🙂) (ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తూ మరో భాగంతో మళ్ళీ కలుస్తాను, ఇక వుంటాను, బై.)

============================================================

ఇంకా వుంది============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.48 views0 comments

टिप्पणियां


bottom of page