top of page

ప్రేమా?!


'Prema' Written By Bharathi Bhagavathula

రచన : భాగవతుల భారతి

"ఏయ్! ఏం చేస్తున్నారిక్కడ?" ఉరుములా అరిచాడతను .

"ఏంలేదు, ఊరికేనుంచున్నాం" చెప్పారు వాళ్ళు.

"మరి ఎందుకు భయపడుతున్నారు? నన్నుచూసి తడబడుతున్నట్లన్నారూ! నిజం చెప్పండి" బండి అక్కడ ఆపి పరుగులాంటి నడకతో, వారున్నచోటుకి వస్తూ మళ్లీ ఉరిమాడతను.

"అదీ" అంటూ ఇద్దరూ ఒకరుముఖాలొకరు చూసుకున్నారు.

"అంటే నేనూహించింది నిజమే ఆత్మహత్య చేసుకోటానికి వచ్చారు కదూ! "

తలవంచుకు నుంచున్నారు, ఆ ఇద్దరూ .

"మా ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు" చిన్నగా గొణిగాడతను. అతన్ని బలపరుస్తున్నట్లుగా తలూపింది ఆమె.

"ఇందాకే అర్థం అయింది. అక్కడినుంచి దూకితే నిమిషంలో చస్తారు. కానీ అవగాహన లేని ప్రేమల వల్ల జీవితాంతం మీరు చచ్చేదికాక మీ ఇంట్లో వాళ్ళనికూడా రోజూ చస్తూబ్రతికేటట్లు, నిలువునా చంపేస్తారురా! మీలాంటి వాళ్ళు."

"అదీ ! అన్నా! " ప్రేమికులిద్దరూ కోరస్ లో అన్నారు.

"నాకేం చెప్పక్కర్లా! నేనే ఓ కథ చెబుతా. విని మీకేం చేయాలనిపిస్తే అదిచేయండి. ప్రేమ ఏ కాలంలోనైనా అద్భుతమైన అనుభూతే !చిన్న అవగాహనా లోపం తరతరాలుగా ప్రేమను అపహాస్యం చేస్తూనే ఉంది. " చెప్పటం మెుదలెట్టాడతను.

//////////

ఆగకుండా ఫోన్ మ్రోగుతోంది. నటరాజ్ ఫోన్ తీసాడు. వార్తవిని షాకై ఫోన్ జారవిడిచి, హడావిడిగా బయలుదేరాడు. చుట్టూ ఉన్న వారంతా వింతగా చూస్తుండగా.

ఎలక్ట్రిక్ ఇంజనీర్ నటరాజ్ రెండు రోజుల క్రితం, వృత్తి రీత్యా వేరే ఊరు వెళ్ళాడు. ఫోన్లో ఇప్పుడీ వార్తవిని ఉన్నపళంగా తనఊరిలోని పోలీస్ స్టేషన్ కి పరుగెత్తుకుని వచ్చాడు.

తన తల్లిదండ్రులూ, ముద్దాయి స్థానం లో నిలబడ్డ స్నేహితుడు చారుకేశి ని చూసి గాబరాగా దగ్గరకు వెళ్ళబోయాడు నటరాజ్

పోలీసులు ఆపేశారు. “ఏం జరిగిందీ?”

ఏడుపు ముఖంతో ప్రశ్నించాడు.

"నీ చెల్లెలు నీ ఇంట్లోనే ఉందా? " వెటకారంగా ప్రశ్నించాడో పోలీసు.

"అదీ ! మీ ఫోన్ రాగానే పొరుగూరు వెళ్ళిన నేను ఇటునుండి ఇటే పరుగెత్తుకొచ్చాను .. ఏం జరుగుతోందిక్కడ? " మళ్లీ ప్రశ్నించాడు నటరాజ్.

తల్లీదండ్రీ కూడా ముద్దాయిల్లా తలదించుకుని అక్కడే నిలబడి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతడు.

మళ్ళీ అదే ప్రశ్న అతడినోటినుండి "ఏం జరిగిందీ? "

"నాలుగు గోడలమధ్యన జరగాల్సిన కొన్ని విషయాలు,బరితెగించి బయటికి వస్తే ఏం జరగాలో ఇక్కడ అదే జరిగింది. చారుకేశి నీ చెల్లెలు మధురిమ మీద హత్యా ప్రయత్నం చేసాడు . ఆమె కోమాలో ఉంది. ఇతణ్ణి అరెస్ట్ చేసాం. ఫార్మాలిటీస్ పూర్తిచేయాలి. రా! " మర్యాద లేకుండానే చెప్పాడు పోలీస్.

అవాక్కై నిలబడ్డాడు నటరాజ్, మెంటల్ గా దాదాపు స్పృహ లేని స్థితిలోనే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేస్తున్నాడు నటరాజ్.

గతమంతా కళ్ళముందు కదలాడింది.

'''''''''''''''''''''''''''''

నటరాజ్, చారుకేశి, బాల్య స్నేహితులే కాక ప్రాణ స్నేహితులు కూడా. మధురిమ నటరాజ్ ఒక్కగానొక్క చెల్లెలు. చారుకేశిది హెల్త్ డిపార్టుమెంటులో జాబ్. చిన్నప్పటి నుండీ, ముగ్గురూ కలిసే పెరిగారు, కలిసే తిన్నారు, తిరిగారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అనుబంధం ముగ్గురిదీనూ, మరి ఇంతలోనే ఏం జరిగిందీ?

చారుకేశి దగ్గరకు వెళ్ళి " చారూ! ఏంట్రా? ఇదంతా? " అడిగాడు నటరాజ్.

చారుకేశి ఇలా చెబుతున్నాడు.

####

మధురిమ వయసుకు వచ్చినప్పటి నుండీ చారుకేశి మధురిమ పరప్పరం ప్రేమలో పడ్డారు, ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరూ ఎక్కడెక్కడో తిరిగారు, ఇంట్లో మనిషల్లే తిరుగుతున్నాడు కాబట్టి నటరాజ్ గానీ, కుటుంబ సభ్యులుగానీ చారుకేశిని అనుమానించలా.

నిన్న నటరాజ్ ఊళ్ళోలేడు. సాయంత్రం చారుకేశీ, మధురిమ శారీరకంగా ఓ చోట కలవాలని పరస్పరం ఒప్పందం చేసుకుని గదీ, ఇంకా కావాల్సిన ఏర్పాట్లు కలిసే చేసుకున్నారు.

కచ్ఛితంగా, గదిలో ఆ సమయం వచ్చేసరికి

"అవునూ! నీకు ఎయిడ్స్ లాంటి ,అంటు రోగాలేం లేవుకదా?! " అని అనుమానంగా ప్రశ్నించిందిమధురిమ.

అంతే చారుకేశి ఈగో దెబ్బతింది .

"అంటే! ఇన్నాళ్ళ మన స్నేహం, ప్రేమా బూటకమా ? ఎంతగాప్రేమించానూ! నిన్నూ! నాతో తిరిగినప్పుడు ఈ అనుమానం రాలేదా? నీకూ? నా క్యారక్టర్ నే అనుమానిస్తావా? మగాణ్ణయినంత మాత్రాన శీలం చెడగొట్టుకుని బ్రతుకుతానా? మెడికల్ డిపార్టుమెంటు అంటే చెడిపోయినట్లేనా? నీతీ, నిజాయితీ ,పవిత్రత పోతాయా? నన్ను మానసికంగా చంపేశావు కదే! హత్యకన్నా దారుణంగా చిత్రవధ చేసేసావుకదే! ఇంతకన్నా చంపేసినా బాగుండేది కదే నన్నూ!

నన్ను చిన్నప్పటి నుండీ చూస్తున్నావ్ ! అంత నీచంగా ఎలా ఊహించావే నన్నూ! నీ లాంటి దాన్ని బ్రతకనీయకూడదే" అంటూ ఆవేశంగా లాగి చెంపమీద కొట్టాడు.

కొట్టింది చిన్న దెబ్బే అయినా ఆ విసురుకి మధురిమ గోడనుతాకి, క్రిందపడి కోమాలోకి వెళ్ళింది. చారుకేశి ఆంబులెన్స్ కి ఫోన్ చేసి, ఆమెను హాస్పిటల్ కి పంపి తను పోలీసులకు లొంగిపోయాడు.

ఇదంతా నటరాజ్ కి చెప్పి....

"అయినా సూటిగా ప్రశ్నిస్తున్నా!? ఇంత జరిగీ ఓ ఆడామగా ఇంతదూరం వచ్చాక ఓ ఆడది అలాంటి సమయంలో ఆప్రశ్న అడగటం తప్పా? ఒప్పా?"

ఆ ప్రశ్నకి జవాబుకోసం,

" అసలు పెళ్ళే కాకుండా, యువతరం ఇలా, బరితెగించవచ్చా? "అని, నటరాజ్ , సభ్యసమాజం ప్రశ్నిస్తూ… చారుకేశి వేసిన ప్రశ్నకు పునరాలోచన

చేస్తుండగానే .

మధురిమ హాస్పటల్ లో కన్నుమూసింది.

చారుకేశికి 14 సం/జైలు శిక్ష . కాదు- కాదు

క్షణికావేశాలకి, నైతిక పతనానికి శిక్ష పడ్డది.

ఐతే ఇంతమంది జీవితాలని బలిగొని, సమాజాన్ని నైతిక పతనం వైపు నడిపించిన ఆ ప్రశ్నను ...

"ఆ సమయంలో ఆ అమ్మాయి ఆ ప్రశ్న అడగటం రైటా? రాంగా? మీరే చెప్పండి ?" అని మతిచెడిన వాడిలాగా కనిపించిన ప్రతీవాళ్ళనీ అడుగుతూనే ఉన్నాడు.

శిక్షాకాలం పూర్తయి ,జైలు నుండి విడుదలైనా ఆ ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు చారుకేశి.

####

"ఇప్పుడు చెప్పండి మీరు ! ఆ అమ్మాయిది తప్పా? అబ్బాయిదా? అన్ని సంవత్సరాల ప్రేమ ఏమయిపోయిందీ? అది ప్రేమా? ప్రేమ పేరుతో ఇద్దరి వంచనా?

"మళ్ళీ అడుగుతున్నాను. ఆ టైంలో ఆప్రశ్న

రైటా ?రాంగా? "

ఆత్మహత్యా ప్రయత్నం మరిచిపోయి ఉలిక్కిపడ్డారిద్దరూ , ఒకరికొకరు దగ్గరగా జరిగారు భయంతో.

"ఇంతకీ మీరు" నోరు పెగుల్చుకుని అడగాడతను.

అతను బండిని స్టార్ట్ చేయబోతూ ఆగి

"ఇంతవరకూ కథలో చెప్పిన చారుకేశి నేనే. మీ ప్రేమ ఫలించకపోతే సమాజానికి నష్టమేం లేదు. కానీ క్రిమినల్స్ గా మారి సమాజాన్ని, కుటుంబ సభ్యులనూ, నష్టపరచకండి ." అంటూ వెళ్ళిపోయాడు చారుకేశి,

కానీ, అక్కణ్ణించి వారి జీవితం ఏ మలుపు తిరిగిందీ తెలిసే అవకాశం అతనికి లేదు.

///////////////

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


171 views1 comment
bottom of page