top of page

రాధా గోపాలం

#RadhaGopalam, #రాధాగోపాలం, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKathalu, #తెలుగుకథలు

Radha Gopalam - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 07/03/2025

రాధా గోపాలం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


"రాధా, ఎక్కడున్నావ్?"


"పెరట్లో బట్టలు ఆరేస్తున్నానండి"


"ముందు, ఇంట్లోకి రా!"


"ఏమైందండీ, అంత కోపంగా ఉన్నారు?" హాల్లోకి వస్తూనే

అడిగింది రాధ, భర్త గోపాల్ ని. 


"బరువు పనులు చెయ్యెద్దని నీకు చెప్పేనా, ఇలాంటి బట్టలు ఉతకడం ఆరేయడం పని మనిషి చేత చేయించుకో అంటే వినవేం? డాక్టరు, నీకు నెలలు నిండేవరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేరు కదా. మొదటి కాన్పు నెలలు నిండకుండానే అబార్షన్ జరిగింది. నీ గర్భాశయం వీక్ గా ఉన్నందున ఈసారైన జాగ్రత్తగా ఉంటూ సరైన పోషక ఆహారం తీసుకోవాలని, డాక్టరు రాసిన మందులు వేళ ప్రకారం వేసుకుంటు కడుపు మీద వత్తిడి లేని పనులు చేసుకోవాలని ఎన్నో సూచనలు చేసారు కదా! వినవేం?" క్లాస్ తీసుకున్నాడు గోపాల్ ప్రేమగా. 


"పనిమనిషికి రాత్రి నుంచి జ్వరం వచ్చి నీర్సంగా ఉందని, అంట్లగిన్నెలు మాత్రం కడిగి వెళ్లింది. రాములమ్మ వస్తుందని నేను రోజు మాదిరి బట్టలు సర్ఫ్ లో నాన పెట్టేనండి. గత్యంతరం లేక మెల్లిగా పిండి ఆరేస్తున్నాను" వివరంగా చెప్పింది భర్తకు. 


"అదికాదు రాధా, ఈ కాన్పైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెలలు నిండి నాకు బాబునో లేక నీలాంటి చక్కని చుక్కను కనిస్తావని నా ఆతృత" గోముగా భార్యను దగ్గరకు తీసుకుని తల నిమిరాడు గోపాల్.

 

భర్త ఆత్మీయ ఆపేక్షకు తడిసి ముద్దైంది రాధ. ఇంతటి ప్రేమాభిమానాలు చూపే మొగుడు లభించడం తన భాగ్యమనుకుంటు గతాన్ని నెమరువేసుకుంది రాధ. 

  *

‘అగ్రహారం గ్రామంలో నాన్న అవధాన్లు గారిది పౌరోహితం. ఊళ్ళో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు, గృహప్రవేశం వంటి శుభ సందర్భాలలో వచ్చే ఆదాయమే ఇంటి ఖర్చులకు సరిపోయేది. 


అమ్మ కూడా విస్తరాకులు, అప్పడాలు, వడియాలు తయారుచేసి శుభ కార్యాలకు అందిస్తూ కొంత ఆర్థికంగా సహాయ పడేది. తను ఊళ్లోని హైస్కూలులో టెన్తు వరకు చదువుతు వీలైనప్పుడు అమ్మకి వెనక సహాయం చేసేది. తనకి పట్నం వెళ్లి కాలేజీ చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పై చదువులుచదవలేక పోయింది. 


ఇంటి పరిస్థితుల దృష్ట్యా నాన్న అమ్మ నా పెళ్ళి గురించి అనేక సార్లు చెప్పుకు బాధ పడటం తను చాటుగా వింది. తనే మగ పిల్లాడినైతే ఈ పరిస్థితుల్లో నాన్నకి వెనక సాయంగా ఉపయోగముండేదని మనసులో బాధ పడేది. ఆర్థికంగా వెనుక బడిన మధ్య తరగతి కుటుంబాల్లో వయసొచ్చిన ఆడపిల్లల పెళ్లి చెయ్యడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో ప్రత్యక్షంగా తను చూస్తోంది. 


అగ్రహారంలో మహరాజులు దానంగా ఇచ్చిన దేవుడి మాన్యాలన్నీ ప్రభుత్వ పరం కావడంతో వాటి మీదే బ్రతికే అర్చక పురోహిత కుటుంబాలకు పోషణ కరువైంది. చాలా బ్రాహ్మణ కుటుంబాలు గ్రామం వదిలి పట్టణాలకు వలసపోయారు. నాన్నలాంటి కొందరు గత్యంతరం లేక ఊరినే నమ్ముకుని రోజులు గడుపుతున్నారు. 


ఇటువంటి సంధిగ్ద పరిస్థితుల్లో, నేను చిన్న పిల్లగా ఉన్న సమయంలో సాంప్రదాయంబద్ద పూజాకార్యక్రమాలతో నాన్నతో సన్నిహితంగా ఉండే కామేశ్వరరావు మామయ్య, అగ్రహారం స్కూలులో పనిచేసి ప్రమోషన్ మీద పట్నం వెళ్లి స్థిరపడ్డారు. వారి ఏకైక కుమారుడు గోపాల్ ను బిఇ చదివిస్తే, ఇంజినీర్ గా నీటి పారుదల శాఖలో గవర్నమెంట్ జాబ్ సంపాదించారు. 


కామేశ్వరరావు మామయ్య గారు రిటైరవడం, తర్వాత అత్తయ్య హఠాత్తుగా గుండె నొప్పితో చనిపోవడంతో మానసికంగా దెబ్బతిన్నారు. ఇంట్లో ఆడ సహాయం ఉండాలన్న ఆలోచనతో గోపాల్ కి పెళ్లి సంబంధాలు వెతుకుతు, అగ్రహారం మీదున్న అభిమానంతో నాన్న గారి పరిస్థితి, నేను పెళ్లికి ఉన్నానని తెలిసి వచ్చి, నన్ను చూసి అన్ని విషయాలు మాట్లాడి ఒక్క రూపాయి కట్నంగా తీసుకోకుండా వారి ఖర్చులతో ఊరి సుబ్రహ్మణ్యస్వామి గుడిలో ఘనంగా పెళ్లి జరిపించి తమ కోడలిగా చేసుకున్నారు. 


ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో గోపాల్ వంటి సహృదయమున్న భర్త లభింతడం నా అదృష్టం. మా పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు దాటాయి. మామయ్య గారు 

స్వంత కూతురిలా చూసుకుంటున్నారు. గోపాల్ కంటికి రెప్పలా తన ప్రేమతో ఓలలాడిస్తున్నాడు. 


మొదటిసారి నేను నెల తప్పానని తెలిసి గోపాల్, మామయ్య, నాన్న, అమ్మ ఎంతో మురిసిపోయారు. ఇంట్లో బాబో, పాపో పరుగులు పెడతారని సంబర పడ్డారు కాని దైవం చిన్న చూపు చూసాడు. నిలలు నిండకుండానే గర్భస్రావం జరిగి అందరినీ దుఃఖానికి గురి చేసాడు. కొంత కాలం వరకు అందరం ఆ షాక్ నుంచి కోలుకోలేక పోయాము. మా కుటుంబానికి మరొక పెద్ద షాక్, మామయ్య గారి హఠాన్మరణం. నాన్న, అమ్మ వచ్చి దైర్యం చెప్పి కొంతకాలం మాకు బాసటగా ఉన్నారు. 


అగ్రహారం గ్రామ పురోహితం నాన్నది కనక ఊరి శుభ కార్యాలకు వెళ్లవలసి వచ్చింది. అటు నాన్నకు, ఇటు నాకు అమ్మ తోడుగా ఉంటోంది’ 


ఆలోచనలతో గోపాల్ రాకను గమనించ లేదు రాధ. 


"ఏంటి, దేవిగారు ఏవో లోకాల్లో విహరిస్తున్నారు. ఇక్కడ మేమున్న విషయం మరిచినట్టున్నారు" అన్నాడు పరిహాసంగా బుగ్గ నిమురుతూ. 


“అత్తయ్యను వెంటనే బయలు దేరిరమ్మని కబురు చేసాను. ఇటుపైన హృదయరాణి గారు కాలు కదపడానికి వీల్లేదు. అన్నీ కాళ్ల దగ్గరకే వస్తాయి. కడుపులోని బిడ్డను కాన్పు జరిగే వరకు కాపాడుకోవాలి" హెచ్చరించాడు గోపాల్. 


 ముసుముసి నవ్వులతో అలాగేనంటు అంగీకారం తెల్పింది రాధ. 

  *

అగ్రహారం నుంచి రాధకు అమ్మ తోడుగా వచ్చింది. రెగ్యులర్ డాక్టర్ చెకప్, కడుపులో బిడ్డకు తల్లికి న్యూట్రిషన్ ఫుడ్, తేలిక పనులతో తొమ్మిదవ నెల వచ్చింది. రాధకు డాక్టరు డెలివరీ డేట్ ఇచ్చింది. పుట్టేది బాబని కన్ఫర్మ్ అయ్యింది. 


దేవుడు చల్లగా చూసి ప్రసవం సుఖంగా జరగాలని రాధ తల్లి, మొక్కని దేవత లేదు. రోజూ గుళ్లో అర్చనలు జరిపిస్తోంది. కూతుర్ని కాలు కదపకుండా అన్నీ తానై చూసుకుంటోంది. 


గోపాల్ డ్యూటీకి పది రోజులు శలవు తీసుకుని భార్య డెలివరీ అయే వరకు వెంట ఉండాలని నిశ్చయించుకున్నాడు. 


ఇంతలో ఇరిగేషన్ ప్రోజెక్టు పరిశీలనకు ముఖ్యమంత్రి వస్తున్నందున అత్యవస పరిస్థితుల్లో శలవు ఇవ్వడానికి నిరికరించారు పై అధికారులు. చేసేదిలేక రాధను 

అత్త గారికి తగిన జాగ్రత్తలు చెప్పి డాక్టరు సలహా మేరకు ధైర్యంగా వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రోజెక్టు సైటుకి బయలుదేరాడు సైట్ ఇంజినీర్ గోపాల్. 

దేవుడు కరుణించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నర్సింగ్ హోమ్ లో సుఖ ప్రసవం జరిగి పండంటి మగపిల్లాడికి జన్మ నిచ్చింది రాధ. కామేశ్వరరావు మామయ్యే మనవడి రూపంలో తమ ఇంట మళ్లీ వచ్చినట్టు మురిసిపోయింది రాధ. అవధాన్లు గారు వచ్చి మనవడి జన్మ నక్షత్రం, తిథి, సమయం శుభ ఘడియలని ఆనంద పడ్డారు. 


ఇంటికి దూరంగా ప్రోజెక్టు సైట్ లో ఆందోళనతో ఉన్న గోపాల్ కి రాధ సుఖ ప్రసవంతో కొడుకును ప్రసవించిందని తెల్సి ఆనందంతో పెద్ద పార్టీ ఇచ్చాడు సహచర మిత్రులకు. అత్యవసర సమయంలో  కూడా డ్యూటీలో తన నిబద్ధత కనబరిచిన గోపాల్ ను అభినందించారు ఉన్నతాధికారులు. 


 సమాప్తం


💐💐💐💐💐💐💐💐


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page