#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #రమ్యవ్యధ, #RamyaVyadha, #TeluguKathalu, #తెలుగుకథలు

Ramya Vyadha - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 13/03/2025
రమ్య వ్యధ - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
“ఏయ్! మొద్దూ! ఎక్కడ చచ్చావ్?” గదిలోంచి అరిచాడు భర్త శేఖర్.
.
వంటగదిలో వంట చేస్తున్న రమ్య గాభరాగా వచ్చి “చెప్పండి! ఏం కావాలి?” అంది.
ఆ ఫాన్ కొంచెం స్పీడు పెట్టెళ్లు. అలాగే నా మొహాన వేడిగా కాస్త కాఫీ తగలెయ్యి” అన్నాడు చిరాగ్గా.
“అలాగే!” అని వెళ్లి కాఫీ కలుపుకొని తెచ్చి భర్త చేతికిచ్చి మళ్లీ ఇంక దేనికి పిలుస్తాడోనని అక్కడే నిలుచుంది.
“ఇంక ఆ దరిద్రం మొహం ఇక్కడెందుకు? వెళ్లి వంట తగలెయ్యి” అన్నాడు శేఖర్. భర్త తీరు, ఆయన మాటలు ఇవాళ తనకి క్రొత్తేమీ కాదు. పెళ్లై నలభై సం.. నుంచి ఇదే ధోరణి.
2సం..క్రితం ఆయనకు ఘగర్ ఎక్కువై ‘గాంగ్రిన్’ వచ్చి యాంప్యుటేషన్ చేసి కుడికాలు మోకాలు దాకా తీసివేయవలసి వచ్చింది. అప్పటినుంచి మంచానికే పరిమితమైన ఆయనకి దగ్గరుండి సపర్యలు చేస్తూ, వేళకి ఘగర్, బి. పి. టెస్టులు చేసి ఆహారం, మందులు ఇస్తూ బెడ్ పాన్ వంటివి చేస్తూ, మానసికస్ధైర్యాన్ని కల్పిస్తూ నిద్రహారాలు మానేసి ఆయనకు సేవలుచేస్తోంది రమ్య.
పిల్లలు ముగ్గురికీ పెళ్లిళ్లయి భర్తా, బిడ్డలతో విదేశాల్లో సంతోషంగా ఉంటున్నారు. వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పురుళ్లు మొ..వాటినన్నిటినీ సక్రమంగా నెరవేర్చింది రమ్య.
వంటగదిలోకి వెళ్లి మిగిలిన వంటపని పూర్తి చేసి భర్తకు భోజనం తెచ్చి పెట్టి, ఆయనకు మందులిచ్చి పడుకోబెట్టింది. తర్వాత తనూ భోజనం ముగించి సోఫాలో కూర్చుంది. అన్యమనస్కంగా ఆమె ఆలోచనలు గత స్మృతులలోకి మరలింది.
“రమ్యా! రేపు నీకు పెళ్లి చూపులు. ఊరిలోని చిన్న పిల్లలను వెంటేసుకుని చెట్టు, పుట్టలు, పొలాల గట్ల వెంట తిరగక రేపన్నా ఇంటిపట్టునే ఉండు” అన్నాడు కూతురితో మురళి.
కొన్ని రోజులక్రితమే ఇంటరు పరీక్షలను పూర్తిచేసుకుని శెలవులకు ఇంటికి వచ్చింది రమ్య. చిన్నప్పటి నుండి చదువంటే ఎంతో ఇష్టమున్న ఆమె మంచిమార్కులను తెచ్చుకుంటూ స్కాలర్షిప్ ని పొందుతోంది. ‘ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్ధిరపడి తన తల్లి తండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి’ అనేది ఆమె కోరిక.
పెళ్లి చూపులని తండ్రి చెప్పిన మాట గొంతులో వెలక్కాయ పడ్డట్టయి వెంటనే తల్లితండ్రుల వద్దకు వెళ్లి తన కోరికను తెలిపి, తనకిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తన నిర్ణయాన్ని చెప్పింది రమ్య.
కూతురి నిర్ణయానికి మురళి ససేమిరా ఒప్పుకోలేదు. తాముండే ఊరు అగ్రహారం, ఇప్పటికే కూతురి పెళ్లి చేయలేదని నలుగురూ నాలుగు మాటలనుకోకుండా, కుటుంబ పరిస్ధితిని దృష్టిలో పెట్టుకొని పెళ్లి చూపులకు ఒప్పుకోమన్నారు. తల్లి కమల కూడా అదే అభిప్రాయం చెప్పడంతో ఇంక వాళ్లను నొప్పించలేక మిన్నకుండిపోయింది రమ్య.
మధ్యతరగతి కుటుంబలో పుట్టిన రమ్యకి తమ కుటుంబ స్ధితిగతులు తెలుసు.
ఆరోజు రమ్యకి పెళ్లి చూపులు. పదిహేను మంది వచ్చి రమ్యని చూసి వాళ్ల ఇంటర్వ్యూలు. సంతలో బలిపశువు లాగా ఇంతమంది అదీ పెళ్లి కొడుకు లేకుండా ఈ పెళ్లి చూపులు ఆమెకి సుతరామూ ఇష్టం లేకపోయినా తల్లితండ్రులను చూసి తన మనసుకు సర్ది చెప్పుకుంది. వాళ్లు వెళ్లాక పెళ్లివారినుండి ‘పిల్ల తమకు నచ్చింది’ అని, మీరు వచ్చి మిగిలిన విషయాలను మాట్లాడుకోమని కబురు విన్నాక మురళి దంపతులు సంతోషంగా ఊపిరిపీల్చుకున్నారు.
మురళి ఊర్లోని నలుగురు పెద్దమనుషులను వెంటనిడుకొని శేఖర్ వాళ్లింటికి వెళ్లి కట్నం, లాంఛనాలు, పెట్టుపోతలు వగైరా విషయాలను మాట్లాడుకుని తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించుకుని వచ్చి ఆ విషయాన్ని భార్యకు, కూతురికీ చెప్పారు.
రమ్యకి తన చదువు, భవిష్యత్తు మీద ఎన్నో కోరికలు, ఆశయాలు ఉన్నా, తల్లి తండ్రుల కోసం, తమ ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుని వాటినన్నింటినీ మనసులోనే అణచుకుంది.
మరో వారం రోజులలో తాంబూలాలు పుచ్చుకోవడం జరిగింది. ఈసారి కూడా శేఖర్ రాలేదు.. తెరసెల్లా పెట్టి అది తీసే సమయం దాకా వధూవరులు ఒకళ్లనొకళ్లు చూసుకోరుట. ఆ మాట శేఖర్ తల్లి గొప్పగా చెప్పింది. అనుకున్న ముహూర్తంలో రమ్య, శేఖర్ ల పెళ్లి చేశారు మురళి దంపతులు.
కొండంత ఆశలతో బెరుకు బెరుకుగా, సిగ్గుతో అత్తవారింట్లో అడుగుపెట్టిన రమ్యకి ఆఇంట్లో చాలామంది అంతా పెద్ద వయసులలో ఉన్న వారిని చూసి కొంచెం భయము, బెంగ కలిగింది. తన కూడా తల్లి, తండ్రి రాలేదు. బావగారే వచ్చి తీసుకురావడం ఆచారంట. లోపలికి అడుగిడిన రమ్య తన అత్తగారి పాదాలకు నమస్కరించింది. ఇంక వరుసగా అందరికీ నమస్కారం చేసింది.
ఇంటిని, ఇంట్లో అందరినీ చూసిన రమ్యకి ఇంత పెద్ద కుటుంబం తనకు ఉందన్న సంతోషం కలిగింది. కాస్త విశ్రాంతి తీసుకున్నాక అత్తగారు క్రొత్త కోడలు వంట చేయాలని తొలిరోజునే రమ్యచేత వంట చేయించి అందరికీ వడ్డనలను చేయించారు.
కోడలు పనిమంతురాలవునో, కాదో అని పరీక్షట. ఆ విషయం తర్వాత తెలిసింది రమ్యకి. అందరికీ, ఎంతో ఓర్పుతో వండి వడ్డించిన ఆమెని అందరూ చాలా మెచ్చుకున్నారు.
ఇంట్లో తనతో భర్త చాలా ముభావంగా ఉండడం చూసి క్రొత్త కదా అనుకుంది. ఆ రాత్రికి పాలగ్లాసుతో అడుగుపెట్టిన రమ్యకి భర్త చెప్పిన మాటలకు మనసులో చాలా బాధ కలిగింది. తనకీపెళ్లి ఇష్టంలేదని, తను వేరే అమ్మాయిని ప్రేమిస్తే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదని, తల్లి కోరికమీదట నిన్ను పెళ్లి చేసుకోవలసి వచ్చిందని చెప్పి వేరే గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
భర్త చెప్పింది విన్న రమ్యకి తన కాళ్లక్రింద భూమి కదులుతున్నట్లయింది. ఆ రాత్రి ఆమె కార్చిన కన్నీటితో తలగడ తడిసింది. తన భవిష్యత్తు అంతా అంధకారమైనట్లయింది రమ్యకి.
“ఇప్పుడేంచేయాలి? భర్తకిష్టంలేని పెళ్లి అని అమ్మానాన్నలతో చెబితే వాళ్లు తనని అర్ధంచేసుకోకపోగా పెళ్ళైన పిల్ల, భర్తనొదిలి పుట్టింటికి రాగూడదు, పరువుప్రతిష్టలు అంటూ పాకులాడే మనస్తత్వం కలవారు. ఇంక వాళ్లతో ఏం చెప్పినా ఉపయోగం ఉండదనుకుని వాళ్లను బాధపెట్టగూడదనుకుంది రమ్య.
“తనిప్పుడు అతని భార్య. తనే సర్దుకుపోవాలి. ఓర్పుతో, ప్రేమతో నెమ్మదిగా అతని మనసుని మార్చుకుని సంసారం చేసుకోవాలి. కాపురానికి పంపించేటప్పుడు “మీది ఉమ్మడికుటుంబం, భర్తకు, అత్తగారికి, మిగిలిన పెద్దవాళ్లకు మర్యాదలు, సేవలు చేస్తూ, వాళ్లు చెప్పినది వింటూ మంచికోడలు, మంచి భార్య అనిపించుకోవాలి” అని అమ్మానాన్నలు చెప్పిన మాటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తుకుతెచ్చుకుంది రమ్య.
ఆ మరురోజు నుండి ఇంట్లో అన్నీ తానే అయి అందరితో కలుపుగోలుగా ఉంటూ తన మనసులోని బాధని ఎవరితో, ఎక్కడా బయటపడకుండా పైకి నవ్వుతూ ఉండసాగింది రమ్య.
ఆ ఇంట్లో అత్తగారి మాటకు తిరుగులేదు. ఎప్పుడూ ఏదో ఒక పనిని కావాలని తనకు పురమాయించేది. పై తోటికోడళ్లిద్దరూ ఆవిడకి మేనకోడళ్లు. వాళ్లని చాలా ప్రేమగా చూసేది.
కొన్ని రోజులకు కోరిక కలిగి రమ్యకి దగ్గరయ్యాడు శేఖర్. ఆ మాత్రానికే సంతోషించింది ఆ అభాగ్యురాలు. తరువాత రెండు నెలలకి కాస్త నీరసంగా అనిపిస్తూ ఉంటే తోటికోడలిని తోడుగా తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్లింది రమ్య. ఆవిడ పరీక్షలు చేసి “నీవు తల్లి కాబోతున్నావు” అంది. అది విన్న రమ్య ఆనందానికి అంతులేదు.
ఆ శుభవార్తని విని ఇంట్లో అందరూ చాలా సంతోషించారు. ఏకాంతంలో భర్తకి చెబుదామని అనుకునేలోగా తల్లి ద్వారా విషయం తెలిసి శేఖర్ మిన్నకున్నాడు. ఆ రాత్రి ఒంటరిగా భర్తకి చెప్పిన రమ్యకి అతని ముఖంలో తండ్రిని అవుతున్న సంతోషఛాయలు ఏమాత్రం కనపడలేదు. రమ్య ద్వారా శుభవార్తను విన్న తల్లి, తండ్రి వచ్చి స్వీట్లు, పళ్లు తెచ్చి కూతురిని చూసి సంతోషించి వెళ్లారు.
కాలం గడుస్తోంది. రమ్యకి ఏడవనెల రాగానే తల్లి వచ్చి సీమంతం జరిపించింది. ఆవిడ తన కూతురిని పురిటికి తీసుకెళతామని అడిగితే అత్తగారు ‘తమకు తొమ్మిదో నెలలోనే పంపే అలవాటు’ అని చెప్పడంతో ఆవిడ వెళ్లింది.
“రమ్యా! నీవు గర్భవతివి. ఇంటిపనులు ఎంత బాగా చేస్తే కాన్పు అంత సులభమవుతుంది “ అని అత్తగారి ఆజ్ణ. ఆ ఇంట్లో ఉదయాన లేచిన మొదలు రాత్రి పడుకునే దాకా ఇంటెడు చాకిరీ రమ్య మీదే పడేది. అత్త, భర్త నిరసనలని గమనించిన తోడికోడళ్లు పినత్తగార్లు ఆమె చేత అన్ని పనులనూ చేయించుకునేవాళ్లు.
తొమ్మిదోనెల రాగానే తల్లి వచ్చి రమ్యని పురిటికి తీసికెళ్లింది. కొన్ని రోజులకు ఒక చక్కటి పాపకు జన్మనిచ్చింది రమ్య. పొత్తిళ్లలోకి తన కూతురిని పొదివి పట్టుకుని ప్రేమతో గుండెలకు హత్తుకుని మురిసిపోయి ఇంక తనకొక తోడు పాపాయి, ఇహ తన కష్టాలు తీరిపోతాయనుకుంది రమ్య.
పాప పుట్టిందని ఫోన్ చేసిన మురళితో శేఖర్, అతని తల్లి “అయ్యో! ఆడపిల్లా!” అన్నారుట. అది విన్న రమ్యా వాళ్లు బాధపడ్డారు. మూడవనెలలో బారసాల చేసి పాపకు ‘విద్య’ అని పేరుపెట్టి రమ్యని, బిడ్డని తమ ఇంటికి తీసికెళ్లారు శేఖర్ వాళ్లు.
కాలక్రమేణా విద్య చక్కగా పెరుగుతూ తన ముద్దు ముద్దు మాటలతో, బుడిబుడి అడుగులతో అందరినీ అలరిస్తోంది. “నాన్నా!” అంటూ దగ్గరగా వచ్చిన కూతురిని చూసి శేఖర్ ఏదో మొక్కుబడిగా ఎత్తుకునేవాడు. విద్యని చూసైనా అతని మనసు క్రమేణా మారుతుంది అనుకుని పిల్లను అతనికి మరింత దగ్గరయ్యేలా చేసేది రమ్య.
విద్యకి మూడవ సం..రాగానే అక్షరాభ్యాసం చేసి స్కూలులో చేర్చారు. విద్య చక్కగా చదువుతూ ఉంది. తనకి కోరిక కలిగినప్పుడే భార్య మొహం చూసేవాడు శేఖర్. మరో రెండు సం..తర్వాత రమ్య మరలా గర్భం దాల్చింది. నెలలు నిండగానే విద్యతో పుట్టింటికి వెళ్లిన రమ్యకి మరో చక్కటి పాప పుట్టింది. ఆ పాపని చూసి మురిసిపోయింది రమ్య.
కబురు విన్న అత్తింటి వాళ్లు “ఈసారీ ఆడపిల్లేనా!” అని ఆ పాపని చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. వాళ్ల ప్రవర్తనకి రమ్య మనసు కలుక్కుమంది. మురళి పదేపదే చెప్పిన మీదట మూడవనెలలో శేఖర్ వాళ్లు బారసాల చేసుకుని “సంధ్య” అని పేరుపెట్టుకుని రమ్యని, పిల్లలను తమ ఇంటికి తీసుకెళ్లాడు.
పిల్లలిద్దరిని ప్రేమగా పెంచుకుంటోంది రమ్య. తన పట్ల, తన పిల్లల పట్ల భర్త, అత్తల తీరంతే అనుకుంది. మరో రెండు సం.. కి మరో పాపకి జన్మనిచ్చింది రమ్య. ఆ పాపకి “కావ్య” అని పేరు పెట్టారు.
“ఇంకో సంబంధం చేసుకుంటే తమకి వారసుడు వచ్చేవాడని, నిన్ను చేసుకోబట్టే ఆడమూక పుట్టారని” ప్రతిరోజూ అత్త నుంచి, భర్త నుంచి సాధింపులు మరింత ఎక్కువయ్యాయి.
“ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా తన దృష్టిలో ఒకటే. ఎవరూ కష్టపడకుండా ఈ భూమి మీదకు రారు. ఏ తల్లి అయినా ఆ ఇద్దరికీ నొప్పులు పడి కంటుంది. బిడ్డలు ఆరోగ్యంగా, సుఖంగా ఉంటే చాలనుకుంటుంది. తల్లి మనసంటే అదే. ఆడపిల్ల లేనిదే సృష్టి ఎక్కడుంది? ఆడపిల్ల లక్ష్మి. తన పిల్లలు బంగారు తల్లులు” అనుకుని మురిసిపోయేది రమ్య.
“ఆడపిల్లల తల్లీ ఒక తల్లేనా!” అని ప్రతిరోజూ రమ్యని తల్లి అంటుంటే శేఖర్ మద్దతు పలికేవాడు. ఆవిడ కూడా ఒక ఆడదే కదా! అని అనాలనిపించేది రమ్యకి. కానీ ఏమనకుండా మనసులోనే దిగమింగుకునేది.
ఇంట్లో తన చేత క్రొత్త దంపతులకు గానీ, శుభకార్యాలలో గానీ ఆశీర్వాదం, మంగళ హారతులు గానీ ఇప్పించేది కాదు అత్తగారు. “నీవు దీవిస్తే నీకు లాగే వాళ్లకు కూడా ఆడపిల్లలు పుడతారు” అన్న ఆవిడ మాటలకు తన గదిలోకి వచ్చి తన పిల్లలని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ఏడ్చేది రమ్య.
“ఎందుకేలుత్తున్నావమ్మా? ఏలవద్దు” అని వాళ్లు తల్లి వెచ్చని కన్నీటిని తమ గౌన్లతో తుడిచేవాళ్లు. వాళ్లని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకునేది రమ్య.
కాలక్రమేణా అత్తగారు గతించాక ఆస్తి పంపకాలు జరిగి అందరూ విడిపోగా రమ్య, శేఖర్ లు తమ ఇంట్లో ఉంటున్నారు.
కాలం సాగిపోతోంది. చూస్తూండగానే పిల్లలు పెద్దవాళ్లై ఇంజనీర్లయ్యారు. తన తల్లిదండ్రుల సాయంతో మంచి సంబంధాలు చూసి వాళ్లకు పెళ్లిళ్లు చేసింది రమ్య. వాళ్లు హాయిగా సంసారం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు.
ఏదో చప్పుడైతే గతస్మృతులనుంచి తేరుకుని వంటగదిలోకి వెళ్లింది రమ్య.
‘భర్త వలన తనకీ కష్టాలు, వ్యధలు ఇంతే! ఆ దైవమే తనని ఒడ్డున పడేయాలి’ అని మనసులోనే దైవాన్ని స్మరించుకుంది రమ్య.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link
Comments