top of page

"తాటి చెట్టు ఎందుకెక్కావంటే దూడ మేతకి అన్నాడుట"


'Thati Chettu Endukekkavante Duda Methaki Annaduta' written by Madduri Bindumadhavi

రచన : మద్దూరి బిందుమాధవి

సంధ్య, కార్తీక్ సంఘి టెంపుల్ లో నించి బయటికొస్తున్నారు. దూరంగా కనపడిన వ్యక్తిని చూసి "ఇతను బాగా తెలిసిన మొహంలా ఉంది, ఎవరబ్బా.." అని మనసులో అనుకుంటున్నాననుకుని పైకే అనేసింది.

"ఎవరు? ఆ పువ్వుల చొక్కా అతనా?"అన్నాడు కార్తిక్. "కానీ ఆ చొక్కా అతను చూట్టానికి వింతగా ఉన్నాడు" అన్నాడు.

"ఆ! అతనే! ఎక్కడ చూశానా.." అని "ఆ! గుర్తొచ్చింది.. గుర్తొచ్చింది. కాలేజీలో మా సీనియర్. కాస్త అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ఆడపిల్లలు ఎక్కడ ఉంటే, అక్కడ దీపం చుట్టూ తిరిగే పురుగులాగా తిరుగుతుండేవాడు" అన్నది.

ఇంతలో అతను దగ్గరకు వచ్చేశాడు. సంధ్యని గుర్తుపట్టి, "హలో సంధ్యా! బాగున్నావా? చాలా రోజులయింది నిన్ను చూసి! నువ్వేం మారలేదు సుమా.." అన్నాడు.

"మీరెలా ఉన్నారు వంశీ? ఇక్కడే ఉంటున్నారా? ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఒక్కరే వచ్చారా? మీ మిసెస్.." అంటూ అటూ ఇటూ చూస్తున్న సంధ్యతో,

"ఆ! ఒక్కడినే వచ్చాను. మా అక్కా వాళ్ళు కాకినాడ వెళుతుంటే స్టేషన్ కి వెళ్ళి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కించి, ఇలా వెంకన్న బాబుకి దణ్ణం పెట్టుకుందామని వచ్చాను" అన్నాడు.

"ఓహ్.. ఇప్పుడే వచ్చారా? దర్శనం చేసుకోవాలన్నమాట!" అన్నది సంధ్య.

"ఎబ్బే! అందరు దేవుళ్ళకి ప్రదక్షిణ నమస్కారాలు, అష్టోత్తర పూజలు, సాష్టాంగ దండ ప్రణామాలు అయ్యాయి. వెళ్ళబోతుంటే మీరు కనిపించారు" అన్నాడు.

సంధ్య, కార్తీక్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. "ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అయింది. గౌతమి అంటాడు.. స్టేషన్ కి వెళ్ళొచ్చానంటాడు.. ఎన్నింటికి రైలెక్కించాడు? ఎన్నింటికి అక్కడ బయలుదేరి ఇక్కడకొచ్చి అందరు దేవుళ్ళ దర్శనాలు చేశాడు? స్టేషన్ ఎక్కడ? సంఘి టెంపుల్ ఎక్కడ? ఇన్ని అబద్ధాలు ముక్కూ మొహం తెలియని వారి ముందు ఎవరయినా ఎందుకు చెబుతారు?" అని ఆశ్చర్యపోతున్నాడు కార్తీక్.

"స్టూడెంట్ గా ఉన్నప్పుడు సరే! ఇప్పటికీ అతను మారలేదు. అదే తీరు" అన్నది సంధ్య.

"అంటే" అన్నాడు.

"మేము సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు, ఒకసారి లైబ్రరీలో నేను కామన్ హాల్లో టేబుల్ దగ్గర కూర్చుని రిఫరెన్స్ వర్క్ చేసుకుంటున్నా! మా లెక్చరర్ ఏదో బుక్ తీసుకెళదామని వచ్చారు. ఆవిడ బయాలజీ టీచ్ చేస్తారు. ఈ వంశీ బయాలజీ బుక్స్ సెక్షన్ లో సీరియస్ గా బుక్స్ వెతుకుతూ కనిపించాడు. ఆవిడ 'నువ్వు హ్యుమానిటీస్ కదా!' అని అనుమానంగా మొహం పెట్టి అన్నారు."

"ఈ వంశీ 'నాకు కావలసిన బుక్ కోసం వెతుకుతున్నాను మేడం ' అని చెప్పి రాక్స్ లో ఇంకా వెతుకుతున్నట్టు అక్కడే తచ్చాడుతూ ఉన్నాడు. తరువాత తెలిసింది.. అతను ఎవరో అమ్మాయికి లైన్ వేయడానికి అక్కడ నిలబడ్డాడని!"

"ఇంకోసారి లేడీస్ హాస్టల్ రోడ్డులో కనిపించిన వంశీని సెక్యూరిటీ గార్డ్ 'ఏయ్.. ఇక్కడేం చేస్తున్నావ్? ' అని ఆపాడుట.

‘లంచ్ టైం కదా, భోజనం చెయ్యటానికెళుతున్నాను ' అన్నాడుట. ‘లంచ్ కి మెస్ కి వెళ్ళాలి, లేడీస్ హాస్టల్ దగ్గరకి కాదు’ అని తిప్పి పంపేశాడుట. చూసిన మా ఫ్రెండ్ చెప్పింది."

"అతను చేసే పనులు, చెప్పే సమాధానాలు అలా ఉంటాయి" అన్నది సంధ్య.

"అయితే ఇన్నేళ్ళయినా అతని పోకడ అదేనల్లే ఉంది. ఇక్కడికి కూడా ఆదివారం ఎవరికో సైట్ కొట్టటానికో , ఎవరినయినా ముగ్గులోకి దింపటానికో వచ్చుంటాడు!"

"తాటి చెట్టు ఎందుకెక్కావంటే దూడ మేతకి అన్నాడుట"అనే సమాధానం ఇతనికి బాగా సరిపోతుంది" అన్నాడు కార్తీక్.

"మా ఆవిడకి లైనెయ్యకుండా ఉంటే చాలు" అని భార్యని దగ్గరగా హత్తుకుని, "జాగ్రత్తోయ్.. ఇలాంటి వారిని, పాత పరిచయస్థులు కదా అని పలకరించావో సమస్యని ఇంటికి పిలిచినట్టే! ఇంటికొచ్చి కూర్చుని, ఇబ్బంది పెడతాడు" అన్నాడు.

"అబ్బో.. ఇదంతా ప్రేమే!" అని "ఇలాంటి వారిని చూస్తే జాలేస్తుంది. కాలేజి రోజులయితే, ఆ వయసు లక్షణంలే అనుకోవచ్చు, నలభైలలోకి వచ్చినా అలాగే ఉంటే, జీవితం గాలివాటంగా తయారవుతుంది" అన్నది.

"అది వాళ్ళ పుటక తీరు. ఈ మధ్య నేను ఆఫీస్ పని మీద విజయవాడ వెళ్ళినప్పుడు మాకు తెలిసినాయన కనిపించారు. అప్పుడు రాగానే బాబి గాడి జ్వరం హడావుడిలో నీకు చెప్పడం మర్చిపోయాను. అయినా అదేం పెద్ద ముఖ్య విషయం కాకపోయేసరికి మర్చిపోయాను.

మా చిన్నప్పుడు మేము వాళ్ళు ఒకే కాంపౌండ్ లో ఉండేవారం. 'అంకుల్ బాగున్నారా ఎక్కడుంటున్నారు ' అని పలకరించాను. 'ఓహ్ ఎవరూ.. కార్తీక్?.. వెంటనే గుర్తు పట్టలేదోయ్! ఏమనుకోకు. మా అబ్బాయి దగ్గర అమెరికాలో ఉంటున్నాను. పోయిన వారమే వచ్చాను ' అన్నారు. 'ఇండియాలో ఎక్కడ ఉంటున్నారని ' అడిగాను. 'హైదరాబాద్ లో మా అమ్మాయి దగ్గర ఉంటున్నాను' అన్నారు. ‘ఈ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా' అనడిగా. 'ఆ! మా వాడి ప్లాట్ అమ్మకం గురించి కేంద్రీయ విద్యాలయంలో పని చేస్తున్న వాడి ఫ్రెండ్ ని కలిసి మాట్లాడి వెళదామని వచ్చాను' అన్నారు. అప్పుడు హడావుడిగా ఉన్న నేను ఆయన మాటల మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు ఇతన్ని చూస్తే అది గుర్తొస్తోంది. అసలు విజయవాడలో కేంద్రీయ విద్యాలయం ఎక్కడుంది అనే సందేహం నాకప్పుడు రాలేదు! అదొక విచిత్రమైన అలవాటని తెలుస్తోంది!"

"వాళ్ళు చెప్పే సమాధానంతో అవతలి వాళ్ళు వారి గురించి ఏమనుకుంటారో అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరేమో! పోనీలే ఏది ఏమైనా ఈ రోజు మనిషి ప్రవర్తనలో కొత్త కోణం తెలిసింది" అని ఇద్దరూ నవ్వుకుంటూ కారెక్కి ఇంటికి బయలుదేరారు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : మద్దూరి బిందుమాధవి

నేనొక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ని.

నాలుగేళ్ళ క్రితం ఒక స్నేహితురాలి ప్రోద్బలంతో "ముఖ పుస్తకం" లో కధలు వ్రాయటం మొదలుపెట్టాను.

ఇప్పటికి 300 కధలు వ్రాశాను. ఎక్కువగా సామెతల మీద, శతక పద్యాల మీద..సమకాలీన సామాజిక అంశాలతో అనుసంధానం చేస్తూ వ్రాశాను. కొన్ని కధలు సైన్స్ నేపధ్యంతో కూడా వ్రాయటం జరిగింది. ఇప్పుడిప్పుడే రామాయణ, భారత, భాగవత, ఇతిహాసాల్లో సమకాలీన అంశాలకి అన్వయమయ్యే పద్యాలు, శ్లోకాల మీద పిల్లల కధలు వ్రాస్తున్నాను.

"తెలుగు వెలుగు" లోను, వెబ్ పత్రికలయిన "గో తెలుగు", "నెచ్చెలి", "తెలుగు తల్లి కెనడా", "మొలకన్యూస్", "కౌముది", "కధా మంజరి" లోను నా కధలు ప్రచురించబడ్డాయి.

ముఖ పుస్తకం లో 7-8 బృందాల్లో కధలు వ్రాస్తున్నాను.

సరదాగా ప్రారంభించిన ఈ వ్యాపకం నాకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నది.

నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు.
127 views0 comments

Comments


bottom of page