![](https://static.wixstatic.com/media/acb93b_6bc638228852420582d86f4eb18f6161~mv2.jpg/v1/fill/w_420,h_586,al_c,q_80,enc_auto/acb93b_6bc638228852420582d86f4eb18f6161~mv2.jpg)
'Guruvu' written by Madduri Bindumadhavi
రచన : మద్దూరి బిందుమాధవి
ఎన్నడూ లేనిది హేమంత్ దేవుడి ముందు పావు గంట కూర్చుని దణ్ణం పెట్టుకుని, నోట్లో ఏదో గొణుక్కుంటూ "దేవుడా ఈ కోరిక తీర్చు" అంటున్నాడు.
"ఏమిటి విశేషం! ఇవ్వాళ్ళ ఏదైనా కష్టమైన పరీక్ష ఉందా?" అన్నది పార్వతి కొడుకుతో. అతని ముఖ కవళికలు ఏదో చెప్పటానికి తటపటాయిస్తున్నట్టుంది.
"ఏమయింది నాన్నా! నాతో చెప్పటానికి మొహమాటమెందుకు?" అన్నది.
నాలుగు సార్లు అడగనిచ్చి "మా సుశీల టీచర్.. 'నీకు బయాలజీ రాదు. అసలు నువ్వు టెంత్ ఎలా గట్టెక్కుతావో నాకు డౌటే' అన్నది నిన్న. మా ఫ్రెండ్స్ అందరి ముందు నాకు తల కొట్టేసినట్టయింది. అందుకే ఆవిడకి యాక్సిడెంట్ అవ్వాలని దేవుడికి దణ్ణం పెట్టుకున్నా" అన్నాడు హేమంత్.
"నలుగురిలో అలా మాట్లాడటం తప్పు కదా! టీచర్ కి ఆ మాత్రం తెలివి లేదా? మీ ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చెయ్యమని మీ నాన్నతో చెప్తానుండు" అన్నది నైంత్ క్లాస్ చదువుతున్న కొడుకుని దగ్గరకు తీసుకుని.
***
రెండో శనివారం ఉదయం పదకొండు గంటలకి పేరెంట్స్ మీటింగ్ కి రమ్మని శంకర్-పార్వతి దంపతులకి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మీటింగ్ కి వెళ్ళిన పార్వతి దంపతులకి, స్కూల్ ప్రాంగణం అనుకున్నంత కోలాహలంగా లేదు. ఏ కొద్దిమందో మాత్రమే వచ్చినట్టు అనిపించింది.
"అదేమిటండి..ఇంతకీ మీటింగ్ ఇవ్వాళ్ళేనా? మెసేజ్ సరిగా చూశారా? మనం కాక ఏ 30-40 మంది పేరెంట్సో వచ్చుంటారు" అన్నది.
ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి గారు తన రూం ముందు వరండాలో నిలబడి చుట్టూ గమనిస్తున్నారు. శంకర్ దంపతులని చూసి "రండి రండి.. అలా అసెంబ్లీ హాల్లో కూర్చోండి. జయలక్ష్మి గారూ! వచ్చిన పేరెంట్స్ ని తీసుకెళ్లి హాల్లో కూర్చో పెట్టి, అతిధి మర్యాదలు చెయ్యండి" అని ఆమెకి పురమాయించి, తన రూంలోకి వెళ్ళిపోయారు.
పేరెంట్స్ ఒక్కొక్కరే వస్తున్నారు. జయలక్ష్మి గారు వారిని హాల్లో కూర్చోబెడుతున్నారు. వచ్చిన వారికి త్రాగటానికి మంచినీరిచ్చి, వారిచేత ఒక రిజిష్టర్ లో సంతకాలు చేయిస్తున్నారు.
11.30 అయింది. హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దమయింది. ప్రిన్సిపల్ గారు, ఐదారుగురు ముఖ్యమయిన టీచర్స్, విద్యార్థి సలహాదారు, రామకృష్ణ మఠంనుంచి ఒక పెద్దాయన వచ్చారు.
పెద్దలు వేదికను అలంకరించారు. టీచర్స్ ముందు వరసలో కూర్చున్నారు.
ప్రిన్సిపల్ గారు ఆహూతులనుద్దేశించి ప్రసంగం ప్రారంభించారు.
"పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజు ఈ సమావేశం ముఖ్యంగా, మా స్కూల్ టీచర్స్ మీద ఆరోపణలు చేసిన తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఉద్దేశించినది. మీకందరికీ తెలుసు… మేము చదువుతో పాటు క్రమశిక్షణకి, ఆటపాటలకి, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యతనిస్తాము. మీలో కొంత మంది సుశీల టీచర్ మీద, కొందరు పాండురంగారావు సర్ మీద, మరి కొందరు జానీ మిస్ మీద కంప్లెయింట్ ఇచ్చారు."
"పిల్లలు ఇంటి తరువాత ఎక్కువ సమయం గడిపేది స్కూల్లోనే. తల్లిదండ్రుల, టీచర్ల సమక్షంలో ఉండే వారి ప్రవర్తనకి, వారి చాటున పిల్లల ప్రవర్తనకి చాలా వ్యత్యాసం ఉంటుందని మీకు తెలుసో, లేదో...తెలిసినా మీరు ఒప్పుకుంటారో, లేదో.. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కానీ ఖచ్చితంగా పిల్లల ప్రవర్తనలో తేడా ఉంటుంది. అది మేము అనేక కోణాల్లో, అనేక సంఘటనల్లో పరిశీలిస్తూ ఉంటాము.
అందుకే గురువుని ‘గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు:, గురుర్దేవో మహేశ్వర:, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ’ అన్నారు. ఒక చిన్నారి పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దబడేది గురువు చేతనే అని మీరు ఒప్పుకుంటారనుకుంటాను.
ఇక అసలు విషయానికి వస్తే, మీరు కంప్లెయింట్ ఇచ్చిన ఒక్కొక్క టీచర్ మీ ముందు నిలబడి మీ సందేహాలకి సమాధానమిస్తారు. సుశీల గారూ! మీరు ముందుగా మాట్లాడండి" అని మైక్ దగ్గరకి పిలిచారు.
***
శంకర్ దంపతులు లేచి "మా అబ్బాయికి అసలు బయాలజీ రాదు. వాడు టెంత్ పరీక్ష పాసవడం కష్టం అని క్లాసులో నలుగురి ముందు అన్నారుట! అలా అనడం సరైనదేనా? మా అబ్బాయి హేమంత్ నైంత్ క్లాస్ 'ఏ' సెక్షన్ లో ఉన్నాడు. ఇంటికి వచ్చి అన్నం తినడం మానేసి ఏడుస్తూ పడుకున్నాడు. రాత్రంతా నిద్ర పోలేదు" అన్నారు.
సుశీల టీచర్ మైక్ దగ్గరకొచ్చి "మీకు మీ అబ్బాయి సగమే చెప్పాడు. నేను ‘బయాలజీ చదవటానికి ఇంకా ఎక్కువ సమయం కేటాయించు. లేకపోతే టెంత్ దాటటం కష్టమవుతుంది. ఏ విషయం మీద వ్రాయమన్నా నువ్వు ఇంగ్లీష్ కాంపోజిషన్ బాగా రాస్తావు, కాబట్టి ఇంటర్ లో అందరి లాగా సైన్సెస్ చదవాలని తెలివితక్కువగా ఆలోచించి తప్పుడు నిర్ణయం తీసుకోకు. భాషా జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళు అందులో వృద్ధిలోకి రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. సివిల్స్ ని లక్ష్యంగా పెట్టుకుని అందుకు కృషి చెయ్యి’ అని చెప్పాను. ఏ విద్యార్ధులు ఏ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ గా ఉన్నారో గమనించి అందులో ప్రోత్సహించటం మా స్కూల్ విధానం!" అని చెప్పి ఆమె కూర్చున్నారు.
"పాండురంగారావు గారూ! మీరు మాట్లాడండి" అన్నారు రాజ్యలక్ష్మి గారు.
రంగారావు దంపతులు లేచి "మా అబ్బాయితో 'ఏం తింటావురా? నువ్వు గ్రౌండ్ చుట్టూ ఒక్క రౌండ్ కొట్టేసరికి మిగిలిన పిల్లలు నాలుగు రౌండ్స్ కొడుతున్నారు' అని ఎగతాళిగా మాట్లాడారుట" అన్నారు.
"నేను మీ అబ్బాయి కౌశిక్ తో అలా అన్నమాట నిజమే! కానీ ఉదయమే లేచి యోగాసనాలు వెయ్యమని, అలా చేస్తే కండరాలు సాగుతాయని, అది ఆరోగ్యానికి మంచిదని చెప్పాను. మెదడు కూడా చురుకుగా పని చేస్తుందని చెప్పాను. మెదడు చురుకుగా ఉంటే చదువులో కూడా శ్రద్ధ పెరుగుతుంది. మనం తినే ఆహారం లో పదో వంతు మన మనసుగా మారుతుందని పెద్దలు చెబుతారు. పిల్లల్లో జీవక్రియ ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. అది గమనించి, వారికి పెట్టే ఆహారం మార్చాలి. అది వారి భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది.
తల్లిదండ్రులు గారాబం చేసి పిల్లలు తిన వలసిన దాని కంటే ఎక్కువ ఆహారం పెట్టి, ఆరోగ్యం పాడు చేస్తున్నామని తెలియక పాడు చేస్తారు. అది చాలక పిల్లలు ఇప్పుడు ‘ఫాస్ట్ ఫుడ్స్’ తినటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారనేది వాస్తవం! ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు చెబుతున్నారు. అయినా పిల్లల మీద అతి ప్రేమతో తల్లిదండ్రులు అవే పెడుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం పిల్లలకి ఒక ఫ్యాషన్! పిల్లల్లో ఊబకాయం అనేది పెద్ద సమస్యగా తయారయిందని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ ఘోషిస్తున్నారు.
మనం తినే ఆహారంలో, ముఖ్యంగా పిల్లలకు పోషకాలు, మాంసకృత్తులు, కొద్దిగా కార్బోహైడ్రేట్స్... ఇలా సమతులంగా ఉండాలి. ఇవి కూరగాయలు, పండ్లు ఫలాలు, సలాడ్ల ద్వారా సమకూరుతాయి. రుచిగా ఉంటాయని పిల్లలు వేపుళ్ళ కోసం వెంపర్లాడతారు. ముద్దు కోసం అవి పెట్టకూడదు. ఆ విషయం పిల్లలని ఆటపాటల్లో గమనించే మాకు తెలుస్తుంది కనుక అదే చెప్పాను" అన్నారు ఆయన.
"సాగర్ గారూ! మీరు మాట్లాడండి" అన్నారు ప్రిన్సిపల్ రాజ్య లక్ష్మి గారు.
సాగర్ దంపతులు లేచి "ఈ జానీ మిస్, మా అబ్బాయిని పట్టుమని ఒక్క సెంటెన్స్ వ్యాకరణ దోషాలు లేకుండా వ్రాయలేవా? సైన్స్, మ్యాథ్స్ వస్తే సరిపోదు. నువ్వు చెప్పదలుచుకున్నది అవతలి వారికి అర్ధం కావాలంటే భాష వచ్చి ఉండాలిరా అన్నారుట. అందరూ సైన్స్, మ్యాథ్స్ మీద దృష్టి పెడుతుంటే ఆవిడ వాడి ప్రావీణ్యం ఆ సబ్జెక్టుల్లో మెచ్చుకోకుండా, వాడి భాషను కించపరుస్తూ మాట్లాడటం తప్పు కాదా?" అన్నారు.
రాజ్యలక్ష్మి గారు జానీ మిస్ కేసి చూసి సైగ చేశారు.
ఆమె మైక్ దగ్గరకి వచ్చి “నేను వారబ్బాయిని భాష మీద దృష్టి పెట్టి, పరీక్ష పాస్ అవటానికి అది కూడా ముఖ్యమే అని చెప్పిన మాట నిజమే! పిల్లలకి విషయ పరిజ్ఞానం ఎంత ఉన్నా కూడా, అది వ్యక్తపరిచే భాష కూడా ముఖ్యమే! విదేశాలకి వెళ్ళదలచుకున్న వారికి భాషలో కూడా పరీక్ష ఉంటుందని మనందరికీ తెలుసు! అంతే కాదు.. ఎవరో పెద్దలన్నట్టు ఒక శాస్త్రవేత్త, ఒక సాంకేతజ్ఞుడు, ఒక గణితవేత్త, ఒక రాజకీయ నాయకుడు, ఒక కళాకారుడు...వీరంతా సాహిత్యం చదువుతారు. ఒక సాహిత్య వేత్తకి సైన్స్, మ్యాథ్స్ తెలిసుండకపోవచ్చు. కానీ సాంకేతిక రంగంలో ఉన్న వారందరూ ఒత్తిడి తగ్గించుకోవడానికి పుస్తకం చదవటమో, సంగీతం వినటమో చేస్తారు. అంటే భాషా సాహిత్యాల కు ఉన్న విలువ తెలుసుకోవచ్చు! అదే నేను ఆ అబ్బాయికి చెప్పాను" అన్నారు.
***
రామకృష్ణ మఠం నించి వచ్చిన ప్రకాశానంద స్వామి మైక్ చేతిలోకి తీసుకుని, "ఇప్పటివరకు అందరి భావనలు, సమస్యలు, ఆరోపణలు విన్నాను. అంతా విన్నాక నా అభిప్రాయం ప్రకారం మీ తల్లిదండ్రులందరూ ఈ స్కూల్ గురించి ముందుగా వాకబు చేసి, వీరి పద్ధతులు నచ్చే మీ మీ పిల్లలని ఇక్కడికి పంపించి ఉంటారనుకుంటున్నాను. ఇందులో బలవంతమేమీ లేదని కూడా అనుకుంటున్నాను.
ఇప్పటి పిల్లలు రేపటి భావి భారత పౌరులు. అంటే వారు అన్ని రంగాల్లో నైపుణ్యాలు సంపాదించాలి. కాబట్టే పాఠశాల స్థాయి సిలబస్ లో అన్ని సబ్జక్ట్స్ కి సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఏ పిల్లలు ఏ సబ్జక్ట్ లో బలహీనంగా ఉన్నారో గమనించి దానికి తగిన శిక్షణ ఇవ్వడం పాఠశాల నిర్వాహకుల బాధ్యత. ఉపాధ్యాయ వృత్తి స్వీకరించదలచుకున్న వారికి ఆ కోణంలో తర్ఫీదు ఇచ్చి, ఆ పరీక్ష పాస్ అయితేనే ఉద్యోగం ఇస్తారని మీకు తెలుసనుకుంటాను. అది వారి వృత్తి, అందులో ఇతరులు కలగ చేసుకోకూడదు.
ఉదాహరణకి రామాయణంలో దశరధుడు తన పుత్రులని విశ్వామిత్రునితో పంపించే ముందు పది సార్లు ఆలోచించాడు కానీ, ఆ తరువాత 'మా పిల్లలు రాజ కుమారులు, వారిని నడిపించావు. కటిక నేల మీద పడుకోపెట్టావు. పసి బాలురు, నడిచి నడిచి అలిసి పోతారు కాబట్టి తెల్లవారుఝామున లేవలేరు. కాబట్టి అలా లేపి ఇబ్బంది పెట్టద్దు’ అని ఆంక్షలు పెట్టలేదు. ‘వారి బట్టలు వారి చేతే ఉతికించావు. ఆహారం సరిగా పెట్టావో.. లేదో, వారు ఇలాంటి ఆహారమే తినగలరు కాబట్టి ఇదే పెట్టు’ అని దశరథుడు చెప్పలేదు, కలగజేసుకోలేదు. ఒక సారి గురువు చేతిలో పెడితే వారిని తీర్చిదిద్ది అందమైన శిల్పాలు గా మలిచే బాధ్యత గురువుదే అని వదిలేశాడు. పైగా ‘గురువు గారి అడుగుజాడల్లో నడిచి, ఆయన ఆదేశానుసారం నడుచుకోండి అని చెప్పాడు.
"రామలక్ష్మణులు కూడా తండ్రి ఆజ్ఞానుసారం, గురువు గారిని అనుసరించడం వల్లే అన్ని అస్త్ర, శస్త్ర విద్యలు నేర్చుకున్నారు. అలా నేర్చుకున్నారు కనుకనే రాక్షస సంహారం చెయ్యగలిగారు. ప్రకృతితో మమైకమై, గురువుగారి ద్వారా అనేక గొప్ప ఋషుల గురించి, సిద్ధ పురుషుల గురించి తెలుసుకోగలిగారు. తమ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోగలిగారు.
ఈ కాలపు పిల్లలు సినిమాలు చూసి టీచర్లని గేలి చెయ్యటం, వారి మీద చెయ్యి చేసుకోవటం, వారి మీద ఇంట్లో తల్లిదండ్రులకి నేరారోపణ చెయ్యటం ఒక ఫ్యాషన్ గా నేర్చుకుంటున్నారు. ఒక వేళ తెలిసీ తెలియనితనంతో పిల్లలు చెప్పారే అనుకోండి, మీరు తగుదునమ్మా అని ప్రిన్సిపల్ కి వ్రాతపూర్వకంగా కంప్లెయింట్ ఇచ్చి, సంజాయిషీ అడగడం సబబేనా అని ఆలోచించారా? ఒక్కొక్క టీచర్ వివరణ ఇచ్చాక, మీ ఆరోపణలు ఎంత తెలివి తక్కువవో తెలిసిందా?" అని ఆగారు.
"పిల్లల పట్ల ప్రేమ ఉండచ్చు! అది వారి భవిష్యత్తుని పాడు చేసేదిగా ఉండకూడదు. వారు చెప్పారని, వారి ముందే గురువులని ప్రశ్నించటానికి మీరు వచ్చారని తెలిస్తే, రేపు ఆ గురువులు వాళ్ళకేమి బుద్ధి నేర్పుతారు? వాళ్ళేం నేర్చుకుంటారు? పాఠశాలల పని వారిని చేసుకోనివ్వాలి. బుద్ధులు నేర్పడంలో ఇంటి దగ్గర మీ పని మీరు చెయ్యాలి. అందరూ సమగ్రంగా పని చేస్తేనే, పిల్లలు బాధ్యతాయుత పౌరులుగా పెరుగుతారు.
స్కూల్ కి పంపకుండా ఇళ్ళల్లోనే ఉంచి ఎందుకు చదివించటం లేదు? వారికి సమిష్టి జీవనం, తమ దగ్గర ఉన్నది నలుగురితో పంచుకోవటం, ఇతరులను చూసి తమని తాము ఎలా అభివృద్ధి చేసుకోవాలి, భవిష్యత్తులో సామాజిక బాధ్యత ఎలా పెంచుకోవాలి అనేవి నేర్చుకుంటారనే కదా! కాబట్టి పాఠశాల పవిత్రతని కాపాడి, టీచర్ల బాధ్యతాయుత శిక్షణని గౌరవించండి" అని ముగించారు.
సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులు సిగ్గుతో తల వంచుకొని, ‘మా తప్పు తెలుసుకున్నాము’ అని ముక్త కంఠంతో పలికి స్వామీజీకి నమస్కరించి, ప్రిన్సిపల్ కి ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు తమ కృతజ్ఞతలు తెలియ జేసి, తమ పిల్లల పట్ల మాతృ -పితృ ప్రేమతో బాధ్యతగా వ్యవహరిస్తున్న టీచర్లకి మరొక సారి తమ అభినందన నమస్కారాలని తెలియజేసి వెళ్ళారు.
ఆ తరువాత ఆ స్కూల్లో అలాంటి సమావేశం నిర్వహించే అవసరం పడలేదు!
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
![](https://static.wixstatic.com/media/acb93b_3816fb824ee041979f513af220efb792~mv2.jpg/v1/fill/w_187,h_329,al_c,q_80,enc_auto/acb93b_3816fb824ee041979f513af220efb792~mv2.jpg)
రచయిత్రి పరిచయం : మద్దూరి బిందుమాధవి
నేనొక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ని.
నాలుగేళ్ళ క్రితం ఒక స్నేహితురాలి ప్రోద్బలంతో "ముఖ పుస్తకం" లో కధలు వ్రాయటం మొదలుపెట్టాను.
ఇప్పటికి 300 కధలు వ్రాశాను. ఎక్కువగా సామెతల మీద, శతక పద్యాల మీద..సమకాలీన సామాజిక అంశాలతో అనుసంధానం చేస్తూ వ్రాశాను. కొన్ని కధలు సైన్స్ నేపధ్యంతో కూడా వ్రాయటం జరిగింది. ఇప్పుడిప్పుడే రామాయణ, భారత, భాగవత, ఇతిహాసాల్లో సమకాలీన అంశాలకి అన్వయమయ్యే పద్యాలు, శ్లోకాల మీద పిల్లల కధలు వ్రాస్తున్నాను.
"తెలుగు వెలుగు" లోను, వెబ్ పత్రికలయిన "గో తెలుగు", "నెచ్చెలి", "తెలుగు తల్లి కెనడా", "మొలకన్యూస్", "కౌముది", "కధా మంజరి" లోను నా కధలు ప్రచురించబడ్డాయి.
ముఖ పుస్తకం లో 7-8 బృందాల్లో కధలు వ్రాస్తున్నాను.
సరదాగా ప్రారంభించిన ఈ వ్యాపకం నాకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నది.
నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు.
Comments