top of page

వింత మనుషులు

'Vintha Manushulu' written by Pitta Gopi

రచన : పిట్ట గోపి

సమాజంలో జరిగే కొన్ని నేరపూరితమైన సంఘటనలకు మంచి మనసు గలవారెందరో చింతిస్తూ ఉంటారు.

ఎందుకలా జరుగుతున్నాయని తమ మనసుని పాడు చేసుకునే వారు చాలామందే ఉన్నారు. అలాంంటి వారందరూ మానసికంగా బాధపడుతూ తమ బాధకు కారణం చెప్పే వ్యక్తి వద్దకు వెళ్ళారు. అతను కూడా ఈ సమాజంలో మంచిగా బ్రతకాలనుకున్నా.. బ్రతకలేక, తన స్వభావాన్ని మార్చుకోలేక, ఆ ఊరి చివర చెట్టుకింద తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఊరిలో వారు పెట్టే పండ్లు కాయలు తింటూ ఉంటాడు. అందరి మానసిక సమస్యలకు పరిష్కారం చూపుతూ వారికి ధైర్యం నూరిపోసేవాడు.

మొదటగా సుందరం అనే వ్యక్తి వచ్చి “అయ్యా! నేను వారం కిందట పట్టణానికి వెళ్లాను. అక్కడ నాకు అత్యంత సమీపంలో ఎంతోమంది చూస్తూ ఉండగా ఓ వ్యక్తి, ఒక యువతిని పది నుంచి ఇరవై సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.

అది మిగతా వారిలో ఎలా ఉందో కానీ నాకు చాలా బాధని, ముఖ్యంగా భయాన్ని కల్గించింది. ఆ షాక్ నుంచి కోలుకుంటున్నలోపే మూడు రోజుల క్రితం నా తమ్ముడి కూతురిని, ఇంకొకడు అలానే.. అందరూ చూస్తుండగా చంపేశాడు. ఏంటి ఈ మనుషులు? ఒక్కరు అడ్డుకున్నా... ఆమె బ్రతికేది. వీటి నుంచి కోలుకోవటం కష్టంగా ఉంది. నా పని మీద నేను దృష్టి పెట్టలేకపోతున్నాను” అన్నాడు.

సుందరం చెప్పింది విన్న సాధువు “బాబూ! నీకు సమీపంలో ఆడదాన్ని అన్నిసార్లు కత్తితో పొడిచినపుడు, అతన్ని నువ్వు కానీ నీ పక్కవారు కానీ అడ్టుకునే ప్రయత్నం చేయలేదు. కొన్ని రోజుల్లోనే అలాంటి సంఘటన నీ వరకు వచ్చింది. మన వరకు వస్తే కానీ ఆ బాధ మనకు తెలియదు. నువ్వు అక్కడ ఆలోచించినట్టే నీ తమ్ముడి కూతురి వద్ద కూడా అందరూ అలాగే ఊరుకున్నారు. మార్పు మొదలవ్వాలంటే అది మననుండే మొదలుపెట్టాలి. సమాజాన్ని తిట్టుకోవటం భవ్యం కాదు. తప్పు చేసినవాడు అందరూ ఉన్నారని, తననేమైనా చేస్తారని భయపడే రోజు వస్తే నీ తమ్ముడి కూతురే కాదు, అందరూ బ్రతికేవాళ్ళే!

ఓ వ్యక్తి కుటుంబం మీద ప్రేమతో వారికి తెలియకుండా దొంగతనాలు చేసి సంపాదించేవాడు. ఓ రోజు చూసుకోకుండా తన చెల్లెలు మెడలో చైను తెంపుకెళ్ళాడు. అతను తన అన్నే అని ఆమె గుర్తించింది. గాయాలతో ఇంటికొచ్చిన చెల్లిని ఏమైందని అడిగాడు.

“ మా మీద ప్రేముంటే కష్టపడి సంపాదించాలి. పదిమంది కడుపుకొట్టి కాదు” అంది అతని చెల్లెలు.

తాను చైను దొంగిలించింది తన చెల్లిదన్న విషయం అర్థం అయిందతనికి. తన చెల్లిలాగనే అందరూ బాధ పడతారని ఆలోచించి, కష్టపడటం నేర్చుకున్నాడు. మనం చేసే పనే మనకు ఆనందాన్ని బాధని ఇస్తుందే తప్ప… ఈ సమాజం నీకెటువంటి సమస్య తెచ్చిపెట్టదు. నువ్వే ఈ సమాజాన్ని మార్చే వాడివి కాగలవు. ఎందుకంటే ఎక్కడో జరిగే వాటికి నువ్వు చింతించావంటే… నీవు మంచి వ్యక్తిత్వం గలవాడివే. కానీ ఇతరులు పడే బాధని నువ్వు అర్థం చేసుకుంటే చాలు. గంగలో మునిగితే నిజంగా పాపాలే పోతే రోజూ మనం నీళ్ళు తాగుతున్నాం. మన పాపాలు కరిగిపోవాలే!

నిజంగా గుడికెళ్తే దేవుడు బ్రతుకు చూపుతాడనుకుంటే.. ముందుగా గుడి ముందు భిక్షాటన చేసేవారి బ్రతుకులే మారాలే....

ఏదైనా మనలో మనం చేసే పనిలో ఉంటుంది.

అది ఆనందమైనా.. విచారమైనా అన్నీంటికి మనమే భాద్యులం.’

అని చెప్పడం ముగించాడు ఆ సాధువు.

అంతటితో సుందరానికి ధైర్యం వచ్చినట్లయింది. సాధువు నుండి సెలవు తీసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు సుందరం.

***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.


168 views0 comments

Comments


bottom of page