top of page

గురువు బోధన


'Guruvu Bodhana' written by Pitta Govindarao

రచన : పిట్ట గోవిందరావు

సుబ్బారావు పొద్దున్నే నిద్ర లేవగానే తన తొమ్మిదేళ్ళ కుమారుడు 'తమ పాఠశాలలో గురుపూజోత్సవం ఉందని, ఆ రోజు తమ ప్రధాన ఉపాద్యాయుడికే గురువు అయిన వ్యక్తి ముఖ్య అతిథిగా వస్తున్నారని, ఆ రోజు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు హాజరుకావాలని' చెప్పాడు.

“ఏంటీ ..గురుపూజోత్సవానికి మీ గురువుకి గురువు వస్తున్నాడా..బాగుంది వరుస! వాళ్ళని చూడ్డానికి మేము రావాలా? సరే సరే వస్తాంలే” నసుక్కుంటూ అన్నాడు సుబ్బారావు. వీధిలోనూ, అటు పట్టణంలోనూ ఎక్కడ చూసినా..గురుపూజోత్సవానికి ఏర్పాట్లు చేస్తూ కనిపించే వారే అందరూ!

‘ పాఠాలు చెప్పే గురువుకి గౌరవం ఇంతగా ఉంటుందా..మా చదువుకునే రోజుల్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫొటో పెట్టటం, నాలుగు ముక్కలు చెప్పటం, తినుబండారాలు పంచటంతో అయిపోయేది. సరే ఏం జరుగుతుందో రేపు చూద్దాం’ అనుకున్నాడు. తన కుమారుడితో పాఠశాలకు బయలుదేరి వెళ్ళాడు. అప్పటికే నిండుగా పేరెంట్స్ ఉండటంతో నిల్చుని గురువు ప్రసంగం వింటున్నాడు కుమారుడు. తోటి విద్యార్థులతో వెళ్ళిపోయాడు. అతిథికి వయస్సు పై పడినట్టు ఉంది. కానీ గంబీరంగా ఉన్నాడు. తన అనుభవాలను, తన విద్యార్థి ఐన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి అనుభవాలను తానే చెప్తూ.. గురువు యొక్క గొప్పతనం వివరిస్తున్నాడు. అతనికి చాలా గౌరవ మర్యాదలు లభించాయి.

కార్యక్రమం అయిన తర్వాత సుబ్బారావు అతన్ని కలిసి తనకు తాను పరిచయం చేసుకుని "అసలు మనిషికి గురువు అవసరమా? గురువు లేకపోతే ఏం..? మనిషి బ్రతకలేడా.." అని ప్రశ్నల వర్షం కురిపించాడు. సుబ్బారావుని అదే పనిగా చూస్తూ.."ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదు. నేను చెప్పిన చోటికి రేపు నువ్వు వస్తే మనిషికి గురువు ఎందుకు అవసరమో వివరంగా తెలుస్తుంద"ని చెప్పి వెళ్ళిపోయాడు అతిథి. 'నా ప్రశ్నలకు సమాదానం దొరక్క తప్పించుకోవటానికి సింపుల్ గా చెప్పేశాడేంటీ..పోనీ రేపు రమ్మన్నాడుగా..ఏం చెప్తాడో!' అని రేపటి రోజు కోసం ఎదురు చూశాడు. అతిథి రమ్మన్న చోటికి వెళ్లగా ఆ అతిథి మరో ఇద్దరితో అక్కడే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తమ ముందు ఓ ఆరు అంతస్థుల భారీ భవనం అది. అక్కడ ప్రపంచానికి కావల్సిన ప్రతి వస్తువు లభిస్తుంది. అది అతిథి గారిదే అని సుబ్బారావుకి అర్థం అయింది. సుబ్బారావుని తీసుకుని లోపలికి వెళ్ళాడు అతిథి. అక్కడ ఒక ఆవు‌, కుక్క ఉండటం చూశాడు సుబ్బారావు.

"మనకు ఏం కావలన్నా..లబించే ఇంత పెద్ద దుకాణంలో ఈ రెండూ ఎందుకు?" అని ప్రశ్నించాడు సుబ్బారావు. తన పరివారంతో "దుకాణంలోకి ఆవును వదలండి" అని చెప్పాడు అతిథి. అది వెళ్ళి తనకు కావలసిన ఆకు కూరలు మొదలగునవి ఉన్న గదికి వెళ్ళి తృప్తిగా తిని రెండు గంటల తర్వాత బయటకొచ్చింది. తర్వాత కుక్కని వదలమన్నాడు. అది కూడా మాంసం, చేపలు మున్నగు వాటి గదిలోకి పోయి కడుపు నిండా తిని గంటన్నరలోనే బయటకొచ్చింది. అప్పుడు సుబ్బారావుని "నీకేం కావాలో తీసుకో"

అని పంపాడు. సుబ్బారావు ఎన్ని గంటలైనా బయటకు రాలేదు. అప్పుడు సుబ్బారావు వద్దకు వెళ్లి అడగగా..

“అయ్యా! అన్నింటిలో నాకేం కావాలో నిర్ణయించుకోలేకపోయాను “ అన్నాడు. అప్పుడు అతిథి ప్రశాంతంగా "మనిషి తనకు అన్నీ తెలుసు అనుకుంటాడు. కానీ ఏం కావాలో నిర్ణయించుకోలేని అమాయకుడు. దురాశ పరుడు. కాబట్టే.. మనిషికి గురువు తప్పక అవసరం. గురువు స్థాయి తక్కువే అయినా.. ప్రతి మనిషిని కల్మషం లేకుండా ఉన్నత స్థానంలో నిలబెడతాడు. తనకంటే ఉన్నతంగా మనిషిని తీర్చిదిద్దుతాడు. కాబట్టే గురువుకి ఇంత ప్రాధాన్యత ఉంది. ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వాడైనా.. గురువు బోధనలతోనే అది సాధ్యం” అన్నాడు.

తనకు బాగా అర్థం అయినట్లు చెప్పటం నచ్చి అతిథికి పాద నమస్కారం చేసి వెనుదిరిగాడు సుబ్బారావు.

***శుభం***


166 views0 comments
bottom of page