top of page

జవాను జీవితం


'Jawanu Jeevitham' written by Pitta Govindarao

రచన : పిట్ట గోవిందరావు

చూడచక్కని శరీరం. చూసేందుకు గొప్ప దైర్యవంతుడిలా ఉన్నాడు కానీ... అతని కుడి చెయ్యి సగబాగం తెగిపడినట్లుంది. అది మాత్రం చూసేందుకు ఇబ్బంది గా ఉంటుంది. విమానం ఎక్కి ఎయిర్ హోస్టెస్ కి టికెట్ చూపించాడు వీరేందర్ సింగ్. అతను కూర్చునే సీటు చూపి వెళ్ళిపోయింది ఆమె. కొంతసేపటికి ఓ మహిళ వీరేందర్ సింగ్ పక్కగా ఉన్న సీటు వద్దకు వచ్చి, అతణ్ణి చూసి వెళ్ళిపోయింది.

ఎయిర్ హోస్టెస్ వచ్చి “సార్.. తెగిపడినట్లు ఉన్న మీ యొక్క చేతిని చూసి అసహ్యించుకున్న సంస్కారం లేని ఒక మహిళ పక్కన కూర్చుని ప్రయాణించే అవసరం లేకుండా మీకు మరో సీటు కేటాయించాను. దయచేసి కాదనకండి” అంది.

ఈ షాక్ నుంచి తేరుకుని “ఆమె నన్ను అసహ్యించుకుందనే బాధ కంటే నేనెవరో… తెలుసుకోలేకపోయిందనే బాధే నన్ను కలచి వేస్తుంది” అని చెప్పి ఎయిర్ హోస్టెస్ చెప్పిన సీటులో కూర్చుని ప్రయాణించాడు. అనంతరం రైల్లో బయలుదేరగా... అతన్ని అసహ్యించుకున్నోళ్ళే అధికంగా కనిపించారు. ఏదో అవమానంగా బావించి 'స్టేషన్ ఎప్పుడొస్తుందా..' అని మనసులో అనుకున్నాడు. ఇంతలో స్టేషన్ వచ్చింది. దిగగానే అతని కోసం ఒక్కరు రాలేదు. ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు వచ్చినా.. కూతురి కోసం కుడిచేతిలో చాక్లెట్లు పట్టుకుని వెనక్కి దాచేవాడు. తన భార్య తలుపు తీయగానే 4 ఏళ్ల వీరేందర్ కూతురు వచ్చింది. తెగిపడిన చెయ్యి కూతురికి చూపించలేక వెనక్కి పెట్టాడు వీరేందర్. తండ్రి తనకోసం చాక్లెట్ లు తెచ్చాడని సంబరంతో అతని వెనక్కి వెళ్ళిన కూతురు, తండ్రి చెయ్యి కనపడకపోయే సరికి వెక్కివెక్కి ఏడవసాగింది. బాధని దిగమింగి ఇంటికి వెళ్ళిన వీరేందర్ ఫోన్ రింగ్ అయింది.

“హలో.. మిస్టర్ వీరేందర్! నేను ఆర్మీ చీఫ్ ని మాట్లాడుతున్నాను. కల్నల్ గా నీ త్యాగం గొప్పది. నిన్ను అన్ని విధాలా ఆదుకుంటాం”

“సార్...నేను చేసిన త్యాగాన్ని నా భారతీయులు ఎవరు గుర్తించలేదు సార్”

“వాట్....?”

“అవును సార్…” అంటూ విమానం, రైలు ప్రయాణంలో అతనికి జరిగిన అవమానం వివరించాడు. అతనికి 'కూతురిని మోయలేకపోయాననే బాధ కంటే ఒక ఆర్మీ కల్నల్ శత్రువుతో పోరాడి చెయ్యి కోల్పోతే నా దేశ ప్రజలు గుర్తించలేదు' అన్న బాధే ఎక్కువగా ఉంది.

“సార్.. నన్ను మళ్ళీ విధుల్లోకి తీసుకోండి. ఒంటిచేత్తో వందమంది శత్రువులను అడ్డుకుంటాను. నేను దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తాను. 30 ఏళ్లుగా దేశం కోసం పనిచేస్తున్న నన్ను ఆర్మీ జవాన్ ని అని కూడా గుర్తెరగలేనందుకు చాలా విచారిస్తున్నా… శత్రువు తో పోరాడి వీరమరణం పొందినప్పుడైనా… నా దేశ ప్రజలు నన్ను స్మరించుకుంటే నా ఆత్మ శాంతించగలదు. కాదనకండి సార్”.

“మిస్టర్ వీరేందర్ సింగ్! నీ బాధ అర్థం అయింది. ఇక్కడ పరిస్థితి కూడా ఏ క్షణంలో అయినా శత్రువుతో పోరాటం తప్పదన్నట్లు ఉంది. నీ నిర్ణయం గౌరవిస్తున్నాం.”

''థాంక్యూ' సార్…”

ప్రత్యేక అనుమతితో వీరేంద్రసింగ్ తిరిగి మిలిటరీలో చేరాడు.

చెయ్యి తెగిపడినా.. ఒంటి చేత్తో విధులు నిర్వహిస్తానన్న ఆర్మీ కల్నల్ వీరేందర్ సింగ్ అని దేశం మొత్తం ప్రచారం జరిగింది. అది చూసిన విమానంలో అసహ్యించుకున్న మహిళ కంటతడిపెట్టింది. అనుకున్నట్లే తన సైన్యానికి ముందుండి నడిపాడు. శత్రువులను చీల్చి చెండాడి కల్నల్ గా తను నడిపిన సైన్యంలో ఒకే ఒక్క ప్రాణ నష్టం - అది వీరేందర్ సింగ్ దే! దేశం యావత్తు విషాదంలో మునిగిపోగా.... అతని కుటుంబాన్ని ,విమానంలో మహిళను ఓదార్చటం ఎవరి తరం కాలేదు. వీరమరణంతో వీరేందర్ సింగ్ దేశ ప్రజల మనసులను గెలిచాడు కానీ బ్రతికుండగా కాదు.

***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.

128 views0 comments
bottom of page