top of page

విశిష్ట సేవా పతకం


'Visishta Seva Pathakam' written by Dr. Kanupuru Srinivasulu Reddy

రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

సత్యం అంటే సత్యనారాయణ . రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయి. నెలకు ముప్పై వేలు పెన్షన్ వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ ఒక పది లక్షలు ఉంటుంది. ఆరోగ్యానికి లోటు లేదు. భార్య ఉత్తమ ఇల్లాలు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కూతురికి, కొడుక్కి పెండ్లి చేసాడు. ఇక చిన్నదానికి చూస్తున్నాడు. ఖర్చులకు డబ్బు సరిపోతుంది. మిగిలిన జీవితం స్థిమితంగా గడపగలరు .

కానీ వచ్చిన చిక్కేమిటంటే అతను భావకుడు, సున్నితుడు. ప్రతి చిన్న విషయానికి

కదిలి పోతాడు. కాస్త చతురుడు కూడా! మా పరిచయం ఐదు సంవత్సరాలదే ! కొడుకు

ఎదురు అపార్టుమెంటు కొన్నప్పటినుంచి ఏర్పడింది. కానీ చాలా ఆరోగ్యకరమైన ఆత్మీయ

స్నేహం. అతను బెంగళూరులో ఉన్నా, నాకు రోజూ ఫోన్ చేయకుండా ఉండడు. అన్నీ

అరమరికలు లేకుండా చెప్పుకుంటాడు. ఈ కోవిడ్ లాక్ డౌన్ కి ముందు కొడుకుని చూడాలని భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. రాగానే ఇక్కడే ఇరుక్కు పోయారు. అప్పటి నుంచి మొదలయ్యింది కథ. రోజూ చాలా సేపు ఎన్నో మాట్లాడుకునే వాళ్ళం. నాకు పని లేదు. విశ్రాంతి అతనితో తీసుకునేవాడిని.

ఒక రోజు ఉదయం ఏదో మ్యాగజైన్ చూస్తున్నాను. కాస్త ఉల్లాసంగా వచ్చాడు. ఏదో అడల్ట్ వాచకం వాడి “ ఏమిటి గురువుగారూ! ఏదో బూతు బొమ్మలను చూస్తున్నట్లుంది. ఇంకా ముసలితనానికి యవ్వన రసికత్వం తగ్గినట్టు లేదు.” అంటూ భళ్ళున నవ్వాడు. “పరువంలోనే ఉండిపోయినట్లున్నావు. నా మీద ప్రయోగిస్తున్నావు.”

“నిజం సార్! ఏ వయసులోనైనా స్త్రీ తలపు ఇచ్చినంత రిలీఫ్ ఈ మగ్గిన మగ ప్రాణాలకు ఏదీ ఇవ్వలేదు.ఈ వయస్సులో భగవద్గీత, పూజా పునస్కారం, మోక్షము స్వర్గము అనేది పచ్చి అబద్దాలు! ఈ వయస్సులో జ్ఞానం ఏమిటి? చెప్పు దెబ్బలు తిని నేర్చుకున్నది చాలు!”

“ఏం.. రజనీష్ ఫిలాసఫీ వంట బట్టించుకున్నట్లుంది. ఎవరి నమ్మకం వారిది. ఈ వయసులో ధ్యానం తప్ప మరేది మన ఓటమి అవమానాలను మరిపించలేదు అంటారు . నువ్వు అనేది కొంత వరకు నిజమే. పక్కదారులు తొక్కకుండా పంచుకునే ప్రేయసి తలపు, వలపు, పిలుపు అన్నింటిని మరిపిస్తుంది.”

“బాగా చెప్పారు. కొంత వరకు అంటారేమిటి నూటికి నూరుపాళ్ళు.” అంటూ మెచ్చుకోలుగా చేయి అందించాడు.

నా అభిప్రాయాలను నూరు శాతం అంగీకరించే సత్యనారాయణ ఆ రోజు మసక గమ్మిన ముఖంతో మౌనంగా వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు. అది అతని తత్వమే కాదు.

ఏదో రాసుకుంటూ ఒక సారి కళ్ళెత్తి చూసి నవ్వి పెన్ పక్కన పెట్టాను.

తలదించుకునే ఉన్నాడు గాని జోకులెయ్య లేదు. ఏదో జరిగుంటుంది ఇంట్లో

అనుకుని అతన్నే చూస్తున్నాను.

“ అసలు ఈ పిల్లల్ని ఎందుకు కన్నాము, పెంచాము, చదివించాము, పెండ్లి చేసాము?

అసలు వాళ్లకు తండ్రిగా నేను ఎందుకుండాలి అని ప్రతి క్షణం గుండెల్లో తన్నుతూ ఉంటే

ఎలా సార్, బతకడం?” అని నా వైపు చూసాడు. అతని కళ్ళల్లో తడి చూసాను.

ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రికి ఎదురయ్యే అనుమానాలే, అవమానాలే! కొత్త ఏమీ

లేదు.

నవ్వి .“అది సృష్టి రహస్యం. ఇప్పుడు రావాల్సిన అనుమానం కాదు.”అన్నాను.

“ వాళ్ళిద్దరూ వర్క్ ఫ్రమ్ హోం, చెరో రూమ్ లో కూర్చుంటారు. పిల్లల్ని చూసుకోవాలి,

ప్రాణం తీసేస్తారు., మేము టివి... అదీ సౌండ్ పెట్టకూడదు. ఈ పిల్లలు

అరవకూడదు.వాళ్ళ పరుగులు చూస్తే గుండెలు అవిసి పోతాయి. ఏమీ అనకూడదు.

ఏమరుపాటు ఉన్నప్పుడు వెళ్లి వాళ్ళ రూం తలుపు తట్టితే మాకు వాయింపులు. పిల్లలు

కదా! మొన్నటి నుంచి మా ఆవిడకు విపరీతమైన జ్వరం. పిల్లల్ని దగ్గరకు రానివ్వలేదు.

దూరం చేశారు. ఏదో మాత్ర వేసుకుంది. తగ్గలేదు. మరీ బాగులేకపోతే తప్ప పడక పట్టదు.

కోడలు ఆర్డర్ జారీ చేసింది. సాయంకాలం భోజనానికి ఎవరో వస్తారని ఓ పెద్ద లిస్ట్ ఇచ్చింది

తనకు తెలుసు ఆవిడకు బాగాలేదని; అయినా ఎందుకు చెప్పండి ఈ పార్టీలు ఈ కోవిడ్

సమయంలో..?”

“ మీ అబ్బాయికి చెప్పక పోయారా?”

“ అయ్యో రామా! చెప్తుంటే తల ఎత్తడు. మాట్లాడడు.శత్రువును చూసినట్లు

అసహ్యంగా ఒక్క చూపు చూసి, ముఖాన ఉమ్మేసినట్లు లేచి వెళ్లి పోతాడు. ఏది చెప్పినా

అంతే. కొట్టొచ్చినట్లు ఉరుముతాడు. ఎప్పుడూ అంతే. ఎక్కువ మాట్లాడకూడదు.

అడక్కూడదు. అదొక రంపపు కోత!!

నాకు వంట వచ్చు. చేస్తానంటే నా భార్య ముందు కాదన్నా, తన సూపర్ విజన్ లో వాళ్ళు

అడిగిన దానికంటే ఎక్కువే చేశాను. నా భార్య అన్నీ రుచి చూసి ‘బాగున్నాయి’ అంది. అంతే. జ్వరం ఎక్కువయ్యింది. ఇక్కడుంటే చస్తుంది.”

ముఖం తుడుచుకుంటూ నా వైపు చూసి వెలితిగా నవ్వాడు.

“టెస్టు చేయించలేదా? అడిగాను.

“అవసరం కదా! పిల్లల్ని చూసుకోవాలి వంట చెయ్యాలి. అప్పటికప్పుడు ఫోన్ చేసి

కోవిడ్ టెస్ట్ చేయించింది కోడలు. నెగిటివ్ అని తెలిసిన తరువాత అప్పటి వరకు

దూరంగా ఉంచిన పిల్లల్ని కాస్త దగ్గరకు రానిచ్చింది.”

నేనేం మాట్లాడలేదు. కానీ అతని ముఖంలో మారుతున్న భావాలను గమనిస్తూ

ఉండి పోయాను.

“ఎలా ఉందని ఒక్క మాట అడగ లేదు. వాళ్ళు వచ్చారు, తిన్నారు, వెళ్లి పోయారు. ఇక

చూసుకోండి అప్పటి నుంచి ఎన్ని చొడ్డులు పెట్టిందో ...ఉప్పు లేదని, కారం

ఎక్కువయిందని వాళ్ళని పిలిచి అవమానించాను మిమ్మల్ని నమ్ముకుని. ఒక్కటైనా

తినేటట్లు చేశారా? అని ఒకటే రొద. మా వాడు పెళ్ళాం దగ్గర నోరు మెదపడు. చేసి,

దోషుల్లాగా నిలబడాల్సి వచ్చింది. అందుకే వెళ్లి పోదామనుకుంటున్నాము.” అని నా వైపు

చూసి ముఖం తుడుచుకున్నాడు.

“ ఇప్పుడు ఎలా ఉంది ?” అని అడిగాను. జవాబు చెప్పక మళ్ళీ ముఖం తుడుచుకొని

నిట్టూర్పు వదిలి తల దించుకున్నాడు.

“భాదపడటంలో అర్థం లేదు అని అనను. వాళ్ళను పుట్టించినందుకు

సిగ్గుపడకండి.ఈ కాలంలో శ్రావణ కుమారులు, రామచంద్రులు ,సీతా, అనసూయలు పుట్టి

బ్రతకలేరు.”

“ ఏవిటి సార్! ఆ మాట అంటారు.?”

“ కీచకులు, కంసులు, శూర్పణఖలు, తాటకులు, వాళ్ళే ఈ కాలానికి కావాల్సింది. అది

కాలం నిర్ణయం. అలా ఉంటేనే పైకి రాగలరు . కుత్సితాలు కుతంత్రాలు ఉంటేనే కదా

అంతస్తులు ఎక్కుతారు ! స్వార్థం, మోసం, అబద్ధం ఇవే నేటి సద్గుణాలు. మనకు జీవితం

ఎన్నో నేర్పిస్తుంది. అవసరానికి గుర్తు రావు. పట్టించుకోకూడదు.” అవమానపు ఆలోచనలో

చిక్కుకున్న అతని మనసును విడుదల చేయాలని సహజమే అన్నట్లు తేలిగ్గా నవ్వుతూ

అన్నాను.

“ ఏవిటి బిడ్డల విషయంలో కూడానా?”

“ఎవరు చెప్పారు. మీ మాటే వినాలని అగ్రిమెంట్ రాసిస్తేనే పుట్టించారా?”

“మరీ దారుణం సార్! బిడ్డలనుంచి కనీసపు మర్యాద, కాస్త సానుభూతి, ప్రేమ

ఆశించకూడదంటారా?”

“ ఆశించడంలో తప్పు లేదు. చూపించలేదని బాధ పడకూడదు.అవి ఎంత అరుదో,

కాస్ట్లీ యో మీకు తెలియదు. వాళ్ళ ఇజ్జత్...పరువు ప్రతిష్ట తాకట్టు పెట్టినట్లు. పనికిరాని

వాళ్ళ కోసం ఎందుకు వేస్ట్ చెయ్యడం అని వాళ్ళ దృఢ అభిప్రాయం.”

“వాళ్ళు ప్రయోజకులు కావాలని అహోరాత్రులు తపించి పెంచిన మేము

అప్రయోజకులమా?”

“ఒక విధంగా! ఇప్పుడు అవసరం లేదుగా! దండుగ తిండి, జబ్బులు, రొష్టులు. అనవసరపు యాతన తప్ప. ఇదిగొ ఇలా బేబీ సిట్టింగ్ కి తప్ప.”

అలాగే నా వైపు చాలా సేపు విస్మయంగా చూసాడు.ఏదో జ్ఞాపకం వచ్చినట్లు లేస్తూ,

” వస్తాను. ఏదో కొనాలని కార్డు కొడుకు తీసుకెళ్ళాడు. తీసుకుని మాత్రలు తెచ్చుకోవాలి.”

అన్నాడు.

“అదేవిటి మీ కార్డు.?”

ఒక సారి నా వైపు చూసి నిస్పృహతో నిట్టూర్పు వదులుతూ,” మీకు తెలియదు.

ఇక్కడకు వచ్చినప్పటినుంచి ఇంటి ఖర్చు నా డబ్బుతోనే.!” వెలితిగా నవ్వాడు.

ఆశ్చర్యపోయాను.“అదేవిటి...ఇద్దరికీ బాగానే వస్తుంది కదా? నెలకు లక్షా యాబై

వేలు దాకా !”

“అది అంతే.” అని నిస్సహాయంగా నవ్వి, “ మీరే చెప్పారు కదా మా మీద ఇన్వెస్ట్

చెయ్యడం పరమ దండుగ అని”అంటూ వెళ్ళిపోయాడు.

నాకు కాస్త తల తిరిగినట్లు అనిపించింది. ఏవిటిది తల్లిదండ్రులు గొర్రెలేనా! వాటి

అవసరాలు, ప్రార్దన ఆర్తనాదాలు కసాయి వాడికి ఏమవసరం? తల, కాళ్ళు, కడుపు, కాల్చుకు ఆవురావురుమంటూ మెక్కే వారికి దాని అడ్రస్ అవసరమా? ఇదేం నీచత్వం?

హింసాత్మకం?ఈ కాలపు ఆత్మీయ అనురాగాలకు నిర్వచనాలా?

పిల్లలు ముఖ్యంగా మగ పిల్లలు, తండ్రులు, ఒకే నీడనున్నా శత్రువుల్లాగా విరోధిస్తూనే

ఉంటారు. ఎందుకో?

చిన్నప్పుడు తండ్రి తన కొడుకుని దగ్గరకు తీసుకొని తన మనసు పంచుకోక, వాడికేంది చెప్పేది అనే తేలిక అభిప్రాయం. చిన్న దానికి పెద్దదానికి అరవడం. చిన్న చిన్న తప్పులకు క్షమించక పోవడం, క్రమశిక్షణ పేరుతో కట్టడి చెయ్యడం, ఎదిగినవాడు బాధ్యత తీసుకోగలడు అని నమ్మకపోవడం. తన వ్యాపకాల్లో మునిగి పోయి అశ్రద్ధ చేయడం.కొడుకు బాధలకు, ఆలోచనలకు విలువ ఇవ్వకపోగా అవహేళన చెయ్యడం. బానిసలాగా చూస్తున్నాడు అనే అభిప్రాయం స్థిరపడిపోతుంది. మర్యాద ఇస్తే తను మళ్ళీ అతనికి బానస అనే తలపే మనసులో తిరుగుబాటు చేయిస్తుంది.

వినరు. వినిపించుకోరు. అందుకే కసి తీర్చుకోవడానికి ఈ విధంగా ప్రయత్నిస్తారు. అందరూ అలా ఉండరు. కొందరు కొడుకులు, తండ్రి ఎంత దుర్మార్గుడైనా మన్నించి మరిచిపోయి ఆప్యాయతలను పెంచుకుంటారు.

ఇదంతా వాళ్ళ వివేకం మీద విచక్షణ మీద, విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చే సంస్కారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎన్ని తేడాలున్నా కలిసిపోయి జీవించడం పుట్టుకకు అర్థం.!! లేకుంటే కుంపట్లు అవసరం లేదు తగల పడటానికి. ఆ గాయాలు అవమానాలు అసంతృప్తులు, తల్లిదండ్రులకు నిత్య నరకాలు!! ఇదే ఇలాంటి యువత ప్రవర్తనకు కారణం అని సైకలాజికల్ స్టడీ చెబుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో మూర్ఖత్వాన్ని అహంకారాన్ని అనుబంధానికి బానిస చెయ్య కూడదు. దానికి యువతలో సంస్కారపు చదువు ముఖ్యం. మరుపు మన్నింపు అవసరం!!

సత్యం ఒక నాలుగు రోజులు రాలేదు. కనిపించ లేదు. బహుశా భార్యకు సేవలు చేస్తున్నాడేమో అనుకుని గమ్మన ఉండి పోయాను. తరువాత వచ్చి కూర్చుంటూనే ,” రాత్రి చాలా గొడవ అయ్యింది. కొట్టడానికి వచ్చారు ” సత్యం అన్నాడు.

గమనించాను. మరీ బాధ పడుతున్నట్లు అనిపించి . “ ఇద్దరూనా! ఒక్కడేనా?” నవ్వుతూ అడిగాను.

“ ఇద్దరూ!” అంటూ గంభీరంగా మారిపోయాడు.

“అంత పెద్ద తప్పు ఏం చేసారేవిటి ?”

“ తప్పా నా బొందా ! ‘ఊరికి వెళతాం, ఎదిగిన బిడ్డ ఒక్కటే ఉంది’ అన్నాను. అంతే!

‘ ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు. మాకు తీరిక లేని పని ఉంది. వంట ఎవరు చేస్తారు.?’ ఇది వాళ్ళ నింద.! అందుకా మేం వచ్చింది?ఆ మనవళ్ళను చూడాలనే తపన, వాళ్ళ మాటలు, చేతల్లో అలసట మరిచి పోవాలని చివరి చిరు కోరిక. బాగా అల్లుకు పోయారు. మాకూ కష్టమే వదిలి వెళ్లాలంటే .కానీ తప్పదు.”

“ మీ చిన్న అమ్మాయి ఒంటరిగా ఉంది కదా!”

“ఆ మాట అంటే, మా కోడలు, ‘మేం మాట్లాడాము. ఇరుగు పొరుగు ఉన్నారు. నాకేం

పరవాలేదు అంది మీ అమ్మాయి. ఈ సమయంలో ప్రయాణాలు ఎందుకు? అని కూడాచెప్పింది. కాబట్టి మీరు ఇక్కడే ఉండండి’ అంది.

‘అందరూ వెళుతున్నారు కదా, మేం వెళ్ళాలి. బిడ్డకు ఏమైనా జరిగితే..?”

“వెళ్ళగానే మీకు ఏమైనా జరిగితే మేం రాలేము.దిక్కులేకుండా చావాల్సిందే!”

‘ఇప్పుడు ఎక్కడైనా అంతే కదా!” అన్నాను. వెంటనే మీదకు దూకాడు. కంట్రోల్ లో లేడు.” చెప్పడం ముగించాడు సత్యం

ఆశ్చర్యంగా చూసాను.

“అవును. రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఇద్దరూ తాగుతున్నారని నా అనుమానం.”

నవ్వుతూ, “నయం కదా ! మిమ్మల్ని కూడా కూర్చోమనలేదు” అన్నాను.

“ఖర్చు కదండీ. అదెందుకు దండుగ. అప్పుడూ నా కార్డుతోనే తెస్తాడు?”నవ్వబోయి

సీరియస్ గా మారిపోయి ఎటో చూస్తూ ఉండిపోయాడు.

చూసి చూసి మాట్లాడక పోయేసరికి ” ఎందుకు అంతగా ఆలోచిస్తారు? ఇది అందరూ

ఈ కాలంలో చేస్తున్న పనే. పాపం, స్ట్రెస్ కదా. ఉదయం నుంచి సాయంకాలం వరకు పని

చేసి మెదడు పగిలిపోతూ ఉంటుంది . కాస్త...!”

విసురుగా లేస్తూ, ‘ అందరూ అలా ఉన్నారా?తక్కువ బుద్ధులు. తాగనీ, ఎక్కడైనా

చావనీ. ఇక్కడ ఇక ఒక క్షణం కూడా ఉండటం జరగదు. కారు పెట్టుకుని అయినా సరే వెళ్లి

పోతాము” అంటూ వెళ్ళిపోయాడు. వెళుతున్నప్పుడు చెంపలపై కారిన కన్నీరు

తుడుచుకోవడం గమనించాను.

మరుసటి రోజు రాలేదు. వెళ్ళే హడావిడిలో ఉన్నాడేమో అనుకున్నాను. ఈ

వయసులో ఇలాంటి అవమానాలు, శిక్షలు అవసరమా? కొంచెం కష్టమే ! ఈ యువతకు

అర్థం చేసుకునే తెలివితేటలుఉండవు.

రెండవ రోజు తలుపు తట్టినట్లు అనిపించి వెళ్లి చూసేసరికి ఎదురుగా సత్యం భార్య.

పది రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఎండలో పడి ఉన్న భిక్షగత్తెలాగా

నిలుచోనుంది. నోట మాట రాలేదు.

” ఇంకా ఇక్కడే ఉన్నారా?ఊరికి వెళ్లలేదా? రండి ” అన్నాను ప్రక్కకు జరుగుతూ.

భయపడుతూ అటూ ఇటూ చూసి,” వద్దులెండి. వాళ్ళు చూస్తే గొడవ అవుతుంది.ఆయన హాస్పిటల్ లో ఉన్నారు. మీతో చెప్పమన్నారు. గుడ్డలు తీసుకు వెళ్ళాలనే నెపంతో వచ్చాను.” అని నిలబడకుండా వాళ్ళ ఇంటి వైపు భయం భయంగా చూస్తూ వెళ్లి పోయింది.

ఏమీ అర్ధంగాక అట్లాగే నిలుచుండి పోయాను.

ఏవిటి ఎందుకు అని ఆలోచించక తయారయి హాస్పిటల్ కి వెళ్లాను.

ముఖం వరకు ముసుగు తన్నేసిన అవతారం కనిపించింది.

నన్ను చూసి సత్యం భార్య, అతన్ని తట్టి లేపుతూ,” ఇదిగో అన్నయ్య వచ్చారు.”

అనగానే ముసుగు తీసి నన్ను చూసి నవ్వాడు.

“ ఏం జరిగింది?’ఆత్రుతగా దగ్గర కూర్చుంటూ అడిగాను.

కన్నీరు దాచుకుంటూ నవ్వు తెచ్చుకుని,” మెడ లిచ్చారు” అని దుప్పటి క్రిందకు

తీసాడు.అప్పుడు చూసాను మెడకు సర్వికల్ కాలరు బెల్ట్.

ఏం జరిగుంటుందో ఆలోచించి తట్టుకోలేకపోయాను.వాళ్ళు

మెడలివ్వలేదు...మెడలించారు. నా మనసు మూగగా రోదించింది. మాట పెగిలి రాలేదు.

బలవంతంగా,” ఎందుకని?” అని అడగగలిగాను.

“కన్నందుకు, పెంచినందుకు, విశిష్ట సేవా పతకం.” అని నాకు ముఖం

కనిపించనీయక ప్రక్కకు ప్రయాసతో తిరిగాడు.

గుండెల్లో గునపాలు దిగుతుంటే నిర్ఘాంతపోయి కూర్చుండిపోయాను.


***సమాప్తం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి



రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.

నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.



44 views0 comments
bottom of page