top of page

సత్యాన్ని దొంగిలించారు

'Satyanni Dongilincharu' written by Dr. Kanupuru Srinivasulu Reddy

రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

భద్రం చెమటలు కక్కుకుంటూ సత్యం దగ్గరకు వచ్చాడు. సత్యనారాయణ అతని భయాన్ని గమనించి, “ ఏవిటండీ.. ఏం జరిగింది? ఆ చెమటలేవిటి ? ఆ హడావిడి ఏవిటి.? మీ ఆవిడేమయినా ఆఫీసు కొచ్చిందా ?” అని ప్రశ్నించాడు.

“చస్తుంటే మీ జోకు ఒకటి. ఆ మాజీ ఎం.పీ లేడూ ...!”

“ లేడు .”

“మన రంగి లేదూ ...!”

“అబ్బా! రంగి పొంగుల్ని గురించి ఎందుకండీ.. మీ కూతురు వయస్సు. బూతు..!”

“బూతు కాదు, చెప్పులు చేటలు. దాని మూడెకరాల పొలం రౌడి ఎం.పీ వెయ్యి ఎకరాల ముందు ఉంది. దాని ద్వారానే ఈ సముద్రపు నీళ్ళు పారాలి. బోరులు కూడా అక్కడే కరెక్టు ఉప్పు శాతం నీళ్లు పడతాయి. దాన్ని కొట్టేయాలనే ఇప్పటి ప్రయత్నం. మొగుడు చచ్చి అది ఏడుస్తుంటే మన క్లర్కు సంజీవరావు, ఎం.పీ వీళ్ళిద్దరూ దాన్ని లొంగ తీసుకోవాలని సకల విధాల ప్రయత్నిస్తున్నారు.”

“నిజంగా?” ఆశ్చర్యపోయాడు సత్యం.

ఉప్పు ప్రకృతి ఇచ్చిన వరం. హిందువులకు లక్ష్మీదేవితో సమానం. సత్యం, భద్రం, సంజీవరావు ఉప్పు పొలాన్ని లీజుకివ్వడం, దొంగతనంగా ఎవరైనా అనుభవిస్తుంటే అడ్డుకోవడం చేసే గవర్నమెంట్ ఆఫీస్ లో అధికారులు. ఇందులో లాలూచీలు చాలా ఉంటాయి. కుప్పాలు అంటే బెస్తవాళ్ళు, ఉప్పు కార్మికులు ఉండే ఊరు. కుల పెద్ద మాట దాటకూడదు. తప్పు చేస్తే జరిమానాలు, బహిష్కరించను కూడా అధికారం ఉంటుంది. దానికి దూరంగా వీళ్ళ ఆఫీసులు ఉంటాయి. ఎవ్వరూ కుటుంబాలు తీసుకురారు. చిన్ననుంచి పెద్దదాకా అవకాశం దొరికితే వాళ్ళ ఆడవాళ్ళను ఏదో ఆశ చూపించి వాడుకుంటారు. సహజమైనా, అడ్డు తిరిగితే చాలా ప్రమాదం. మూర్ఖత్వం , మూఢనమ్మకాలు, క్రూరత్వం వాళ్ళ జీవన విధానం. తాగుడికి బానిసలు. ఇలాంటి ఎం.పీ లు, సంజీవరావు లాంటివారు వాళ్ళను అన్ని విధాల వాడుకుంటారు. వీటితో పాటు రంగి విషయం పెద్ద ఆలోచన అయిపోయింది సత్యానికి.

రంగి, ఆర్ముగం, భార్యా భర్తలు. సత్యం అంటే చాలా గౌరవం, ఇష్టం. ఒకరోజు సముద్రానికి చేపలకోసం వెళ్ళి, ప్రమాదవశాత్తు ఆర్ముగం చనిపోయాడు. రంగిని ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. ఒక్క సత్యమే, ఆమెను మామూలు మనిషిని చేసి, ఆఫీసులో చిమ్మే పనికి పెట్టించాడు. పని అయిపోయిన తరువాత సత్యం ఇంటికొచ్చి, అది ఇది చేసి మాట్లాడిపోనిదే ఉండదు రంగి.

భర్త చనిపోయిన తరువాత, రంగి పొలం కొట్టేయ్యాలని సంజీవరావు, ఆ ఎం.పీ చాలా చాలా ప్రయత్నించారు. రంగి దిక్కు లేనిదని అడ్డు నిలిచాడు సత్యం. వాళ్ళిద్దరూ సత్యం మీద కక్ష బూనారు.

ఒక రోజు భద్రం గారు వచ్చి చాలా సేపు కూర్చొని చెప్పలేక చెప్పాడు.

“చూడండి సత్యంగారు! ఆ రంగికి అంత చనువు ఇవ్వకండి. రోజులు మంచివిగావు. ఇప్పటికే మీ మీద లేనిపోనివి ఉన్నాయి. నిజం నిప్పులాంటిది అంటారు కానీ ఈ కాలంలో ఎప్పడూ ఆరిపొయే ఉంటుంది. సత్యాన్ని దాచలేము అంటారు కానీ ఈ సముద్ర గర్భంలో అట్టడుగున గొంతుకు ఉరి తాడు వేసుకోనుంటుంది. ప్రతీకారంలో ఇవన్నీ చూడరు.”

“పాపం! మంచిదండి. చిన్న పిల్లండి.” అన్నాడు సత్యం.

“ చిన్నదేం కాదు. పక్కలోకి అవన్నీ చూడరండి. ముసలి ముతక, సమయం సందర్భం వస్తే ఇవన్నీ అడ్డం కాదండి! అందుకే చెపుతున్నా!చక్కగా ఉందని, దిక్కులేనిదని పక్కలో వేసుకుంటున్నావని అందరూ అనుకుంటున్నారు. ఈ బెస్తోళ్ళు చాలా మూర్ఖులు ఎంతకైనా తెగిస్తారు”

“మా మధ్య అలాంటివేం లేవండి. ఎవరో వెదవలు...?” అన్నాడు చాలా కోపంగా సత్యం.

“అబ్బాయి1 ఇలాంటి పరిచయాల్లో అర్ధాలు ఒక్కటే. దాన్ని ఆఫీసులో పనికి కూడా రాకుండా చెయ్యాలనుకుంటున్నాడు. వాడి పక్కలోకి రాలేదని ఆ నక్క, రాబంధు సంజీవరావు. రంగి మొగుడ్ని చంపించింది వీడు, ఆ బుర్ర మీసాల ఏం.పి. సంజీవరావు.” అని చాలా రహస్యంగా చెప్పాడు భద్రం.

నమ్మలేక ఆశ్చర్యంగా చూస్తుండి పోయాడు. ఉడికి పోయాడు. వాళ్ళను చంపి సముద్రంలో పారేయ్యాలనిపించి, కోపంతో రగిలి పోయాడు సత్యం. సముద్రంలో చావులకు ఆధారాలు ఏవీ ఉండవు. పాపం రంగి! విపరీతమైన జాలి ముంచుకొచ్చింది. రంగి చాలా అందంగా ఉంటుంది. ఒంటరిగా ఎలా..? సత్యం అంటే కుప్పంలో వాళ్లకు చాలా భయం. పద్దతిగా ఉంటాడని!!

ప్రతి రోజు సాయంకాలం సముద్ర తీరం వెంబడి నడవడం సత్యానికి అలవాటు.అప్పుడప్పుడు రంగి ఎవరితోనో ఒకరితో కనిపించి, ఎన్నో మాట్లాడేది. ఎన్నో జీవన సత్యాలు, వేదాంతం మాట్లాడేది. ఇంత ఆలోచన , గ్రహింపు, ఎలా వచ్చిందా ఈ ఉప్పు చేపల పిల్లకు, అని సత్యం ఆశ్చర్యపోయేవాడు. భీష్ముని తండ్రి శాంతన మహారాజు బెస్త కన్య మత్స్యగంధిని పెళ్లి చేసుకోవడంలో ఆశ్చర్యం ఏవీ లేదని పించింది.

రంగి, ఒక రోజు వచ్చి, ‘ఆఫీసులో పనికి వెళ్ళను’ అని దిగులుగా చెప్పింది. ఏమని అడిగితే ,’మరీ చొరవగా అసహ్యంగా మాట్లాడుతున్నారు’, అని కన్నీళ్లు పెట్టుకుంది. నిజమే! ఇంత చిన్న వయసులో, అందంగా ఉండి తప్పటడుగు వెయ్యకుండా ఉన్నదంటే ఆ అమ్మాయిని మెచ్చుకోవాలి!!

ఒక రోజు సగం రాత్రి పూట తలుపు దబ దబ కొడుతున్నట్లు అనిపించి, తీసాడు. వర్షం పడుతూ ఉంది పూర్తిగా తడిసి పోయి, ఎదురుగా రంగి నిలుచుని వణుకుతూ ఉంది. ‘ఎందుకు ఇంత రాత్రిపూట అంత భయంగా దిగులుగా ఉంది’ అనుకుంటూ, లోపలికి వచ్చిన రంగికి తుడుచుకోమని తువ్వాలు ఇచ్చాడు. తీసుకుందిగాని, తుడుచుకోక ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంది. చూడలేక దగ్గరకు వెళ్లి లేవ తీసి, గుడ్డ కప్పి బలవంతంగా లేపి టీ పెట్టుకుందాం, అని వంటిట్లోకి నడిపించుకు పోయాడు. అతుక్కు పోయింది రంగి. సెగలు చిమ్ముతుంది ఆమె శరీరం. ఎదను తడుతోంది ఆమె వయసు. కోరికలు రేపుతోంది ఆమె సొగసు. చలి కాచుకోమంటోంది గాలి వాన. ఒక్క విదిలింపుతో తలలోని దరిద్రాన్ని తరిమేసి, కారణం పదే పదే అడగ్గా చెప్పింది. ఆ సంజీవరావు మరో ఇద్దరు పట్టపోళ్ళు తాగొచ్చి, ఇంటి మీద పడి, తనను బలాత్కారం చేయబోయారని ఏడవడం మొదలు పెట్టింది. ఎంతో ఓదార్చి తడిసిన గుడ్డలు తీసేసి తన పంచె చొక్కా వేసుకోమన్నాడు. లైట్లు ఆర్పి పడుకోమని చాప దిండు ఇచ్చి తను పడుకొని సంజీవరావును, మిగిలిన వాళ్ళు ఎవరో కనుక్కుని ఇక రంగి జోలికి రాకుండా చెయ్యాలి , ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్లు చూడాలి. ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటుంది? ఇలాంటి ప్రమాదాలు తప్పవు. రంగిని ఎవ్వరైనా చేసుకుంటారు. ఒప్పించి పెళ్లి చెయ్యాలని అనుకుని మాగన్నుగా పడుకున్నాడు.

ఉన్నట్లుండి తలుపులు బాదుతున్నట్లు అనిపించి ఉలిక్కిపడి లేచాడు సత్యం. అప్పటికే లేచి మూలగా ముడుక్కుని వణికి పోతున్న, రంగిని అనుమానంగా చూస్తూ తలుపు తియ్యాలని, కదిలాడు.

“తీయొద్దు. వాళ్ళు చంపేస్తారు.” అంటూ ఏడవడం మొదలు పెట్టింది.

కొంచెంసేపు అర్ధంగాలేదు. అర్ధం అయి నిలిచిపోయాడు. ఈ పరిస్థితుల్లో రంగి తను ఒకటిగా ఉండటం అనవసరంగా దొరికిపోయినట్లు అనిపించి, ఏం చెయ్యాలోనని రంగి వైపు చూసాడు.

“టౌన్ కి పారిపోదాం. మీ కాల్లకాడ పడి ఉంటాను” అని కాళ్ళ మీద పడింది. వాళ్ళను తప్పించుకొని వెళ్ళడం సాధ్యం కాదు. పారిపోయి, ఈ రంగిని... ఏం చెయ్యాలి.? ఇంటికి, వయసులో ఉన్న స్త్రీని తీసుకెళ్ళి ఎలాంటి సమర్ధన ఇవ్వాలి? ఏం చెయ్యాలో పాలు పోలేదు.

అయినా ఏం జరిగింది ఇప్పుడు? తనెందుకు భయపడుతున్నాడు? ఇంత దూరం వచ్చిన తరువాత, వాళ్ళు వెనక్కు తగ్గరు. వాళ్ళు చావడమో, వీళ్ళను చంపడమో జరుగుతుంది. ఎలాగయినా రంగికి తోడు నిలవాలి, అని ధైర్యంగా తలుపు తీసాడు. అంతే, ఎంత చెపుతున్నా బ్రతిమిలాడినా, ప్రాణాలకు తెగించి అడ్డు నిలుచున్నా, ఇద్దరినీ విచక్షణ లేకుండా కొట్టారు. నానా మాటలు అంటూ రంగిని జుట్టు పట్టుకుని లాక్కెళ్ళారు. అప్పటికీ సత్యం వదల్లేదు. వచ్చిన కుల పెద్దతో “కుప్పంలోనే ఆమెను చెరిచారు, న్యాయం జరగాలి” అని చెప్పినా వినిపించుకోలేదు. సంజీవరావుని చాలా ప్రాధేయ పడ్డాడు.

రంగిని ఎలా కాపాడాలో అర్ధంకాలేదు? అనవసరంగా రంగిని ఏమయినా చేస్తారేమోనని భయంవేసింది. తనూ వెళ్లాలని లేచాడు. మరీ గొడవ అవుతుందేమోనని కాస్త ఆలోచించి, నిజం చెపితే వాళ్ళే సర్దుకుంటారని ఆగిపోయాడు.

తెల్లవారినా చీకటిగానే ఉంది. వర్షమూ తగ్గలేదు. గాలి మరీ ఎక్కువయ్యింది. ఇక లాభం లేదు వెళ్లి తీరాలని బయటకొచ్చి పది అడుగులు వేసాడు, తోసి పారేస్తుంది. పడుతూ లేస్తూ కాస్త దూరం వెళ్ళగలిగాడు. గాలి తెరల్లో ఎవరో దూరంగా వస్తున్నట్లు అనిపించింది. తూలిపోతూ దగ్గరగా వెళ్ళాడు. ఎవరో పడిపోయి ఉన్నారు. ఆత్రుతగా వెళ్లి ప్రక్కకు తిప్పాడు. చూసి గుండె పట్టుకుని పెల్లుబికి వస్తున్న ఆర్తనాదాన్ని ఆపుకోలేక పోయాడు. అది రంగి శవం !! అబల నిస్సహాతను, మానభంగం చేసారు. సత్యాన్ని దొంగిలించారు, మూర్ఖత్వంతో ప్రతీకారానికి పట్టం గట్టారు. కుప్పకూలిపోయాడు సత్యం.

***సమాప్తం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.. నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.


96 views0 comments
bottom of page