top of page
Dr. Kanupuru Srinivasulu Reddy

తస్మాత్ ...!

'Tasmath...' written by Dr. Kanupuru Srinivasulu Reddy

రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

అతను నన్ను చూస్తున్నాడు.నేను అతన్ని చూస్తున్నాను. కాని చూపులోని అర్థమే తేడా!

ప్రస్తుతం అతనొక ముద్దాయి. సాఫ్టువేరులో పెద్ద ఉద్యోగస్తుడు. పెళ్లి కావాల్సిన వయస్సు.

కానీ...?

“ఇలాంటి వెధవ పనులెందుకు , హాయిగా పెళ్లి చేసుకోక పోయావా?”అన్నాను.

“త్వరలో అనుకుంటున్నాను సార్ ! కానీ ఇప్పటి యువతుల్ని చూస్తే భయంగా ఉంది.”

“ అందుకని ఇలా వాడుకుంటే సరిపోతుందనుకున్నావా?”

“లేదు డాక్టరుగారూ! ఈ సాఫ్టువేర్లు ఎప్పుడొచ్చాయో, ఆర్థికంగా బలపడటం మొదలు పెట్టారో, వాళ్ళ ప్రవర్తనలో విడ్డూరమైన, వికృతమైన ఆలోచనలు పుట్టుకొచ్చాయి ! ఏది స్వతంత్రం, ఏది ఆధునికత అని దిక్కుతోచక, కోతి కల్లు త్రాగినట్లు,పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు అయ్యింది. 'అణుకువ మెలుకువ స్త్రీల గౌరవాన్ని విలువను పెంచుతాయి' అనే ఆలోచనను సమాధి చేసేసారు.”

“అందుకని మానభంగాలు ఎక్కువ జరుగుతున్నాయంటావా ? ప్రవర్తనలో ఆడ మగ తేడా లేదుగా?"

“అంత తొందరపాటు, ధైర్యం, మగ పిల్లలకు లేదు సార్! కానీ, మరీ నేటి ఆధునిక యువతి, ప్రతి దానికి రియాక్టు కావడం, క్షణాలలో ఎమోషనల్ అయిపోవడం, పగలగొట్టినట్లు మాటలాడటం!! డబ్బు,పెడసరితనం, తమ హక్కు, స్వతంత్రం అనే మిధ్యలో బ్రతుకుతున్నారు . అడ్డు ఆపు లేకుండా తిరుగుతున్నారు. ఒకప్పుడు మగ పిల్లలు ఆడవాళ్ళ జీవితాలతో క్యాచ్, స్కేజ్, త్రో అనే ఆట ఆడుకొనేవారు. కానీ ...?”

“ఇప్పుడు లేదా ?నలుగురైదుగురు కలిసి కర్కశంగా అనుభవించి క్రూరాతిక్రూరంగా చంపేస్తున్నారు!"

“ నీచం.. నికృష్టం! అలాంటి వారిని పబ్లిక్ గా చంపేసినా, ఉరి వేసినా తప్పు లేదని చట్టం తీసుకు రావాలి. భయం ఇద్దరిలోనూ లేదు. కానీ నా తల్లిడండ్రులు స్త్రీని గౌరవించడం నేర్పించారు,నడవడికను ఇచ్చారు.”

కళ్ళెత్తి నావైపు దీనాతి దీనంగా చూసాడు. ఆ చూపుల్లో కపటత్వం కనిపించలేదు. కానీ నమ్మడానికి లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా ఈ మానభంగాలు తగ్గటం లేదు. స్త్రీలను దారుణంగా చంపుతున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు, కన్నీళ్లు ఏ దేవుళ్ళ హృదయాల్ని కరిగించటం లేదు. ఆడపిల్లల్ని కని మృగత్వానికి బలి చెయ్యాల్సి వస్తోంది.

చాలా సార్లు గమనించాను అతను పదే పదే చొక్కాను క్రిందికి లాక్కుంటున్నాడు. ఏదో దాస్తున్నాడని పరీక్షగా చూసాను. ప్యాంటు ముందు భాగం ఉబ్బినట్లుగా కనిపిస్తోంది.

“ఎందుకలా భయం భయంగా దాచుకుంటున్నట్లు ప్రవర్తిస్తున్నావు?.”

“ఏం లేదు..ఏం లేదు. ఇంటికెళ్ళినప్పుడు జ్యూస్ తాగమని బలవంతంగా ఇచ్చింది సార్! అప్పటినుంచి....?”

అర్ధం అయ్యింది. ఆ జ్యూసులో ఎరక్టెయిల్ మందు కలిపి ఉండాలి లేదా తనే తాగి వెళ్ళిఉండాలి . చాలా అలవాటు, అనుభవం ఉన్నట్లుంది ! ‘ఎంత తీరి పోయి ఉన్నారు ఈ యంగ్ జనరేషన్!’ అని ఆశ్చర్యపోతూ అనుమానంగా చూసాను. నా కళ్ళల్లోకి చూడ లేక తలొంచుకున్నాడు.

“ఇంటికే వెళ్ళావా ? దేవుడుకూడా నిన్ను రక్షించలేడు”అన్నాను.

“నేను వెళ్ళలేదు సార్! ఆవిడే...ఆరోగ్యం బాగా లేదంటేనూ..!”

“ఎవరికి బాగా లేకపోయినా వెళతావా ?”

. “ఒకప్పుడు నాకు ఆరోగ్యం బాగా లేకపోతే వచ్చి సహాయపడింది. ఆమె మా ఆఫీసులోనే పని చేస్తుంది. అందరితో చాలా కలుపుగోలుగా, చనువుగా ఉంటుంది. అపార్థం చేసుకోలేము. స్నేహితుడుగా వెళ్లాను”

“మీకిద్దరికీ చాలా దగ్గర పరిచయం ఉందన్నమాట”

“తప్పుగా అనుకోకండి సార్! మాలో అరమరికలు ఉండేవి కాదు. నమ్మకం ఉండేది..”

“అందుకే నమ్మించి రంగంలోకి దింపావా ?”

“ లేదు సార్! ఆమె చూపిన శ్రద్ధ, తపనను చూసి చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. తరువాత మా స్నేహం పెరిగింది. క్యాంటీనుకు వెళ్ళే వాళ్ళం. చాలా విషయాలు మాట్లాడుకొనే వాళ్ళం.”

“పెండ్లి చేసుకోవాలనిపించిందా?”

“నిజమే! చాలా అందంగా ఉంటుంది సార్! కానీ కొన్ని సమయాల్లో వింతగా మాట్లాడేది . రాత్రికి హోటల్లో ఉందాం , పది రోజులు ఊటీ కెళదాం, దూరంగా ఉండలేక పోతున్నాను, అని ప్రపోజ్ చేసేది. ఆమె అతి చొరవ చూసి ఆలోచనలో పడ్డాను. రెండు మూడు రోజులు కనిపించకుండా పోయేది. చెప్పకుండా వెళ్లిందని భాధగా ఉన్నా అడిగేవాడ్ని కాదు. వచ్చిన వెంటనే ఎన్ని సారీలు చెప్పేదో ! క్షమించమని ఎంతో ప్రాదేయపడి బ్రతిమలాడేది. అన్నీ మరిచిపోయేవాడ్ని. ఇంతలో ఆమెకు, మరో కొలీగుకు గొడవ జరిగింది. అప్పుడు బయటపడ్డాయి కధలన్నీ! ఆ అమ్మాయికి బంధం మీద నమ్మకం లేదని , ‘ఆడుకున్నంతవరకు ఆడుకుందాం,ఆ తర్వాత నీదారి నీది, నా దారి నాది’ అనే తత్వమని తెలిసి, దూరం చేసాను. అయినా వదల్లేదు. అవన్నీ వట్టి పుకారులనీ, నన్ను నిజంగా ప్రేమిస్తున్నాననీ , కాదంటే పిచ్చి దాన్ని అయిపోతాననీ ప్రాధేయపడేది. రాను రాను బెదిరించడం ఎక్కువయ్యింది. ఒకరోజు అందరి ముందు గట్టిగా కోప్పడ్డాను.

‘చూస్తూండు.. నీ కళ్ళ ముందే చస్తాన’ని వెళ్లి పోయింది.

మరుసటి రోజు ఆఫీసుకు రాలేదు. వారం రోజులు గడిచిపోయాయి. భయం వేసింది. ఒక రోజు ఆమె దగ్గరనుంచే ఫోను వచ్చింది. ‘ఆరోగ్యం బాగాలేదని ,కదల్లేని పరిస్థితుల్లో ఉన్నానని, లీవు ఇమ్మని ! ఎవ్వరూ చూసుకునే వాళ్ళు లేరని, మీరు రండి…’అని ఫోను పెట్టేసింది.

పాపం, నేను తిట్టినందువలన అలా అయిందేమోనని ఫీల్ అయ్యాను. వెళ్లి చూసి వద్దాము అనే ఆలోచనను అదుపు చేసుకోలేక పోయాను. తన కష్టాలలో పరామర్శించక పోతే మానవత్వం అనిపించుకోదు అని వెళ్లాను. దానికి ఫలితం ఇది!.”అని గాఢ నిట్టూర్పు విడిచి నా వైపు చూసాడు.

’అతన్ని నమ్మాలా వద్దా అనేది అనవసరం. అది సాక్ష్యాధారాల మీద ఆధార పడి ఉంటుంది. ఈ మద్య మీ టూ ప్రభావం వలన పెద్దపెద్ద వాళ్లే పరువు మర్యాదలను తగల పెట్టుకుంటున్నారు . ఈ వెంపర్లాడటం ఏవిటి అంత అనుభవం అవగాహన ఉన్నప్పుడు.? స్త్రీని అనుభవించ తగిందిగానే చూస్తున్నారు. ఆమె మట్టి బొమ్మ కాదని, మనసు ఉంటుందనే ఆలోచనే రావడం లేదు. వ్యామోహం ఒక ఉన్మాదం.!

గాఢంగా నిట్టూర్పు వదిలి అతని వైపు చూసాను. అపవాదుతో కృంగి పోయి ఉన్నట్లు అనిపించింది. జాలి వేసింది.

ఇంతలో “సార్! ఆ అమ్మాయి చాలా గొడవ చేస్తుంది. త్వరగా వెళ్ళిపోవాలట.”నర్సు వచ్చి చెప్పింది.

“అదేవిటి..ఇక్కడ మానం పోయి ఏడుస్తుంటే ? లేడీ డాక్టరు లేదా?” కొంటెగా నవ్వాను.

సిగ్గును దాచి పెట్టుకుంటూ ,“మీరైతేనే న్యాయం చెయ్యగలరట.”అని అదోలా నవ్వింది నర్సు పళ్లెత్తు పరమేశ్వరి.

“నువ్వు ఇచ్చావా సర్టిఫికేట్.”

“మీ ప్రతిభ.. పాపులారిటీ సార్ !”అంటూ నన్ను ఆట పట్టించింది.

“అలాగా ? నీ బాయ్ ఫ్రెండుకు చెప్పకపోయావా.”

ముఖం ముడుచుకుంది పళ్లెత్తు పరమేశ్వరి. భాద పెట్టానని భుజం మీద తట్టి ,అతనికి మళ్ళీ వస్తానని చెప్పి, స్యాంపుల్స్ మేల్ నర్సుకిచ్చి ల్యాబులో ఇమ్మని, అబ్సర్వేషన్స్ తీసుకొని ముందుకు నడిచాను. ఇతనేం చేసినట్లు అనిపించలేదు. కాకపోతే కొద్దిగా ఇంద్రియ మరకలు ఉన్నాయి. మరి...?

వెళ్లి చూసాను .అబ్బ ఎంత చక్కగా ఉంది ఈ బిడ్డ అని అనుకోకుండా ఉండలేక పోయాను. ఆ ఎలక్ట్రో మాగ్నెటిక్ వైబ్రేషన్సే మగాడికి మతిపోగొట్టేది.

అవమానంతో కృంగిపోయి అశోకవనంలో సీతమ్మలా ఉంది. కానీ వరూధినిలా విరుచుకు పడింది.

సముదాయించి ఆలస్యానికి సారీ చెప్పాను. పరీక్ష చేస్తున్నంత సేపు మగవాళ్ళను నోటికొచ్చినట్లు తిడుతూనే ఉంది. ఏడుపు ఆపలేదు,తల బాదుకోవడం మానలేదు. మొహమాటాలు, దాపరికాలు లేవు. అంతా పదే పదే చూపించింది. చాలా మంది సిగ్గు పడతారు. ఇదేవిటి ఈవిడ ? పెద్దగా ఆనవాళ్ళు కనిపించలేదు. లైంగిక సంపర్కం జరిగినట్లు ఉన్నా బలాత్కరించినట్లు లేదు. కాని ఈమె, తనను చెరిచాడు అని నమ్మకంగా చెబుతోంది. శ్యాంపిల్సు తీసి నర్సుకు ఇచ్చాను . గుడ్డల మీద ఇంద్రియపు మరకలు తడిగా ఉన్నాయి. లోపల కూడా ఇంద్రియం ఉంది. కానీ ఎప్పడిదో అనిపించింది. ఒక్కడా ఇద్దరా ?ఒక్కసారే ఇద్దరా !??

చేస్తున్నంత సేపు మాట్లాడుతూనే ఉంది ఆ అమ్మాయి. అతనంటే ప్రాణం అట. పెళ్లి చేసుకోమందట. కాదన్నాడట, ఈ పనికి తను ఒప్పుకోలేదట. కానీ...?

“నిన్ను కాదన్నాడా?”

“ ఈ మగాళ్ళతో ఎంత చనువుగా ఉన్నా, వాళ్ళను ఎంతదూరంలో ఉంచాలో, ఈ జొల్లు కుక్కల నుంచి నా శరీరాన్ని ఎలా కాపాడు కోవాలో నాకు బాగా తెలుసు. కలుపుగోలుగా ఉంటాను. నాకు ఈ సోకాల్డు లిబరల్ ఉమన్ ప్రవర్తన నచ్చదు. ఒక మగాడు ఇద్దరు అమ్మాయిలూ, నలుగురు అబ్బాయిలతో ఒక అమ్మాయి! మేం పవిత్రం అంటే నేను నమ్మను. అది మానసిక వ్యభిచారం. అనుకున్నప్పుడు చేసేసి మరిచి పోగలిగిన వాళ్ళే ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండగలరు అని నా అభిప్రాయం. పొందాలనే తపనకే ఆరాధన అనే దొంగ ముసుగు వేసుకుంటుంది.” అంది.

“తపన కంటే తీర్చుకోవడం మంచిదని ఇంటికి పిలిపించుకున్నావన్నమాట.”

ఆ ప్రశ్నకు కోపంగా, అనుమానంగా నా వైపు చూసి “అసలు ఇవన్నీ మీకు ఎందుకు ? మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యండి.” నిలదీసినట్లు అడిగింది.

“ ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ! ఇద్దరి జీవితాలు, భవిష్యత్తు మా పరీక్షల నిర్ణయాల మీద ఆధారపడి ఉన్నాయి. తప్పులు జరగకూడదుగా? నిర్ణయించే ముందు సైకో ఎనాలసిస్ కూడా చాలా ముఖ్యం.”

“ఎవ్వరూ చెప్పలేదే? మరి పరీక్షలు చేసారుగా ! ”

“ చెప్పానుగా , ఎవిడెన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది శిక్ష . కానీ కౌన్సిలింగ్ తప్పక చెయ్యాలి. జీవితంలో మొదటి అడుగు వేస్తున్న వాళ్ళ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. కానీ క్లియర్ కట్ కేసులకు చెయ్యం.”

“మీరు పార్షియాలిటీ చూపొచ్చుగా ? డబ్బుకు అమ్ముడు పోవచ్చుగా ?”

నవ్వుతూ,”ఉండొచ్చు. కానీ ఈ నిర్భయ కేసు తరువాత మరొకరు కూడా మన మాటలు వింటూ ఉంటారు” అనగానే భయంగా అటు ఇటు చూసి నర్స్ వైపు చూసింది. ఏముందిలే అన్నట్లు, తేలిగ్గా నిట్టూర్పు వదిలింది.

“భయపడకు. పేషెంటు విషయాలు బయటకురావు. అది మా ధర్మం, ప్రమాణము కూడా ! మేము సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. నువ్వు తప్పు చెయ్యలేదు కదా?”

ఆ ప్రశ్నకు తడబడుతూ, “లేదు..లేదు. అతనే నన్ను రెచ్చగొట్టి ఆశ చూపించి ప్రేమలో పడేసి అనుభవించాడు. నా జీవితాన్నినాశనం చేసాడు. ఇక నాకు పెళ్లి ఎలా అవుతుంది.”అంటూ ఏడవడం మొదలు పెట్టింది.

ఏడుపు కాస్త తగ్గిన తరువాత,“అతన్నే చేసుకోకూడదా ? ప్రేమించానంటున్నావు. నేను ఒప్పిస్తాను.”అన్నాను.

“అతన్నా ! ఆడది వలచి వస్తానంటే ...?” అనేసి భయంగా నా వైపు, నర్సు వైపు చూసి, పైకి కిందకు చూసి, “ఆలోచించాలి. ఇంత దూరం వచ్చింతరువాత....?” అని ఎటో చూస్తూ ఉండి పోయింది..

సి సి టీవీ కెమరాలు ఉన్నాయేమొనని వెతుకుతుందని ,నవ్వుకున్నాను.

“అంటే అతనేం చెయ్యలేదంటావు?”

“ఎవరన్నారు ? చేసాడు. మీరే అర్ధం చేసుకోండి . ఏ స్త్రీ తనకు తానుగా రేప్ చేసారు అని పోలీస్ స్టేషనుకు వెళ్ళదు. అందులోనూ పరువు గల ఆడవాళ్ళు! నాకు తెలుసు తరువాత ఎంత హీనంగా చూడబడుతామో! కోర్టులో ప్రశ్నలు మమ్మల్ని వీధి కుక్కలుగా బజారు మనుషులుగా నిరూపిస్తాయి .”అంది కన్నీళ్ళు పెట్టుకుని.

ఆమె చెప్పిన మాటలో చాలా వాస్తవాలు ఉన్నాయి. కానీ నిర్భయ కేసు తరువాత స్త్రీలకు అనుకూలంగా చాలా మార్చారు. వాళ్ళు మాట చెపితే చాలు, మగవాళ్ళను అరెస్టు చెయ్యొచ్చు. కొందరు దాన్నిఅవకాశంగా తీసుకొని పగ తీర్చుకుంటున్నారు. బంగారు జీవితాలు నాశనం చేస్తున్నారు. మరి ఈవిడ .....చూడాలి?

లేచి వచ్చి నా ముందు టేబులు పైన తలవాల్చి పడుకోనేసింది . చాలా జాలి కలిగింది.

మెల్లగా తలెత్తి చూసి “ఎప్పుడు మీ మగవాళ్ళు మమ్మల్ని అర్ధం చేసుకుంటారు? మా ప్రేమ నిజం అని నమ్ముతారు?”అంది.

మౌనంగా నవ్వాను. మనసులో మాత్రం, ‘ఆడవాళ్ళ మనసు సముద్రపు లోతు బ్రహ్మకు కూడా అంతు దొరకదు’ అనుకున్నాను. ఆమె వైపు చూసాను . చాలా అసంతృప్తిగా ఉన్నట్లు అనిపించింది.

“ఇంత అందాన్ని, వయసును అర్పిస్తుంటే బజారుకు లాగాడు”

‘నువ్వా ? అతనా’ అని అడగబోయి ఆలోచనగా నవ్వాను. స్త్రీకి అందం అన్ని అనర్ధాలకు మూలం అన్నారెవరో?

తలెత్తి నా కళ్ళలోకి చూసి “మీ మగ వాళ్ళను నమ్మనే కూడదు, ప్రేమించినట్లు ఎంత గొప్పగా నటిస్తారో?”నవ్వింది.

ఇంతకు మునుపటి బాధ, అవమానం ఆమెలో కనిపించలేదు.

ఇంతలో , “పోలీసు సి.ఐ చాలా సేపటి నుంచి కాచుకోన్నున్నాడు సార్ ”అంటూ నర్సు వచ్చి చెప్పింది.

“పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు ఉదయంనుంచి సాయంకాలం వరకైనా కాచుకొని ఉండాల్సిందే! ఉండమను!” అన్నాను

“మీతో అర్జంటుగా ఏదో మాట్లాడాలట సార్. ప్రాణం తీస్తున్నాడు.”

“ఇక్కడ మానం పోయి ఏడుస్తుంటే ఏమట తొందర.! వెళ్లి చెప్పు,వెయిట్ చెయ్యమని.”

“చెప్పాను సార్! కానీ...?”

విసుక్కుంటూ లేచాను . ఆ ఆమ్మాయి నా చేతులు పట్టుకొని “ప్ల్లీజ్ ! నన్ను వాళ్లకు ఆహారంగా వెయ్యకండి.”భయంతో చేతులు వణుకుతున్నట్లున్నాయి. ఆశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూసాను.

చేతులు వదిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ “నా తల్లిదండ్రులకు పరువు ప్రతిష్టలంటే ప్రాణం. నామూలంగా వాళ్ళు చావకూడదు”అంది.

ఏవిటీ ఈ అమ్మాయి? మానాభిమానాలంటే ప్రాణం ఉన్నట్లు ఉంది. పాపం ఎలా ఇరుక్కుందో ఈ రొంపిలో అనుకుంటూ వెళ్లాను.

ఇనస్పెక్టర్ తో మామూలు పరిచయాలు అయిన తరువాత “మీ పనే చేస్తున్నాను. చివరికి వచ్చింది అరగంటలో అయిపోతుంది”అన్నాను.

“అదే సార్ ! ఆ విషయమే....!” తటపటాయిస్తూనే నర్వస్ గా నవ్వాడు. ఎందుకో అర్ధం కాలేదు

“ ఏముంది అందులో? ఎవిడెన్స్ కోర్టుకు ఇస్తాము. మీకూ పంపుతాం . మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి ,మీ ఎస్ .పి కి పంపుతాం

“అందుకే సార్! ఆ అమ్మాయి... మా పెద్ద దొరగారు..!”అంటూ నసిగాడు.

ఆశ్చర్యంతో చూసాను.

“అవును సార్! ఆ అమ్మాయి తప్పు చెయ్యలేదు. ఆ వెధవ కావాలనే ..?చాలా మంచిది, మా డి.ఎస్.పి దొర మరీ మరీ చెప్పమన్నాడు. వాడ్ని ఏదో విధంగా లోపల వెయ్యమన్నాడు.”అన్నాడు.

“ఆయనకు ఎలా తెలుసు ? కేసు పెట్టింది ఆ అమ్మాయేకదా? అదెట్లా? ఎవిడెన్స్ ను పట్టేకదా ! అయినా ఆ అమ్మాయి తప్పు చేసుంటే కదా! చేసింది అంటావా?”అనుమానంగా చూసాను.

దొరికిపోయానని చెమటలు పట్టాయి అతనికి. “మా అయ్యగారు చెప్పారు. మీ ఇష్టం.”అతని కళ్ళల్లో జాగ్రత్త అనే సంకేతం కనిపించింది. కాదంటే విసిగిస్తారు. బెదిరిస్తారు. అందుకే లేడీ డాక్టర్లు జంకుతారు. వీళ్ళతో చాలా తలనొప్పులు ఉంటాయి. ఎవిడెన్స్ ను మార్చమంటారు. రాజకీయ ఒత్తిడి తెస్తారు .

నేను చూసిన చూపుకి కొంచెం తగ్గాడు. లేకుంటే అతను నన్ను ఆడిస్తాడు. ఎందుకో ‘ఏదో ఉంది దీనిలో’ అనిపించింది.

“ నిరపరాధిని శిక్షించడానికి నేను ఒప్పుకోవడం జరగదు. ఆ అమ్మాయి దోషి అయితే తప్పించడం జరగదు.”అన్నాను

.“మీ సిన్సియారిటీ తెలుసు అందుకే ఈ ప్రయత్నం.”

“చాలా తప్పు చేస్తున్నావు. హైకోర్టు దాకా వెళుతున్నారు. ఉద్యోగాలు పోతాయి. మనం చిప్పకూడు తినాల్సిందే .పైగా రూల్సు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ”

“అక్కడ కూడా మనుషులే కదా సార్ ఉంటారు. మేం చూసుకుంటాము ” అంటూ అదోలా నవ్వాడు.

అదోలా చూసాను. జోబులోనుంచి రెండు రెండు వేల రూపాయిల కట్టలు టేబుల్ మీద పెట్టాడు. కోపంగా చూసాను.

“మీకు కాదు. ఏదైనా మంచి పని హాస్పిటల్లో ....?అంటూ నసుగుతూ తడబడ్డాడు.

ఇంతలో మేల్ నర్సు వెంకట్రావు నాయుడు వచ్చాడు. డబ్బు చూసి వెనక్కి తగ్గాడు.

ఏవిటన్నట్లు చూసాను.

” లాబ్ రిపోర్ట్స్ సార్.”

“తీసుకొని రా ! పరవాలేదు”అన్నాను.

ఆ రిపోర్ట్స్ చూస్తూ “ డి.ఎన్.ఎ.టెస్టుకు పంపించావా ?” అడిగాను. నేర నిర్ధారణ , వ్యాధి నిర్ధారణకు హైదరాబాద్ గాని మెడికల్ కాలేజికి గాని పంపించాలి .

“లేదు సార్ ! మిమ్మల్ని కనుక్కొని.....?’ అని మళ్ళీ పోలీసు వైపు చూసాడు.

ఆ రిపోర్ట్ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇనస్పెక్టర్ వైపు చూసాను. చాలా ధీమాగా ఉన్నట్లు అనిపిచింది.

డబ్బును ,”తీసి దాచండి.” అంటూ పెన్నుతో అతని ముందుకు నెట్టి, రిపోర్ట్ ఇచ్చాను. దీర్ఘంగా చూసి చటుక్కున తలెత్తి నా వైపు చూసాడు. అతన్నే గమనిస్తూన్నాను. చెమటలు పోస్తున్నట్లు అనిపించింది. ఎందుకో?

“ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ చేసారా?” తీక్షణంగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగాను.

“లేదు సార్! మిమ్మల్ని… అదే.. సారూ...?”

ఆశ్చర్యంగా నమ్మలేనట్లు చూసాను. ఎంత దుర్మార్గం ?

“అంటే ఆ అబ్బాయిని ...ఈ అమ్మాయిని..!” విపరీతమైన కోపం వచ్చింది. ఈ వెధవలు అనుకుంటే జీవితాలను సర్వ నాశనం చేయగలరు. కోపాన్ని అదుపు చేసుకుంటూ “రండి! ఆ ఆమ్మాయికి చెపుదురు గాని”అంటూ ఆ గది వైపు నడిచాను.

నన్ను చూడగానే లేచి నిలుచుంది. ఇన్స్పెక్టర్ ని చూడగానే ఎందుకో ముఖం వెలిగింది.

ఆ అమ్మాయిని చూస్తూ “కంగ్రాచ్యులేషన్స్ మీరు రేప్ చెయ్యబడలేదు.” అన్నాను.

పిచ్చిగా ఒక అరుపు అరిచి “లేదు...లేదు. అతను నన్ను నానా హింసలు పెట్టి అనుభవించాడు. మీరు అతన్ని తప్పించాలని చూస్తున్నారు..” అంటూ విషం చిమ్మింది.

“ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నిన్ను అతను ఏం చెయ్యలేదు” .

“చేసాడు...చేసాడు...చేసాడు! మీరు మార్చేసారు. ఎంత ఇచ్చాడు? మిమ్మల్ని వదలను. అంతు చూస్తాను”.

“ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. అతని శరీరం మీద కొరికినట్లు గిచ్చినట్లు బాగా గాయాలు ఉన్నాయి”.

“ ఉంటే ?అవన్నీ రక్షించుకోవడానికి. ఎక్కడ.. వదిలితేకదా, కదలనిస్తే కదా ! నెత్తీ నోరు బాదుకుంటూ లొంగిపోవాల్సి వచ్చింది. ప్రాణాలు తీసాడు. ఎన్ని సార్లని ?” ఆయాసంతో బుసలు కొడుతూ నా మీదకు వచ్చింది.

“ పాపం ఎయిడ్సు పేషంటు బారిన పడ్డావు..”

“వాట్!’అంటూ ఒక్క అరుపు అరిచింది.

“అవును.బ్లడ్ రిపోర్టులో చాలాఎక్కువగా ఉన్నట్లు చూపిస్తుంది.”

చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయి,“అదృష్టం.బ్రతికి పోయాను”అంది.

నాకు కావాల్సిన మాట అదే , “ వాట్!. అతనేం చెయ్య లేదా ? భయ పడకండి. మందులు జాగర్తగా వాడితే ప్రమాదం చెయ్యదు. మీ పేరు ఎయిడ్స్ కంట్రోల్ వాళ్లకు చెప్పి నమోదు చేయిస్తాను. మందులు ఉచితంగా నెల నెలా ఇస్తారు. నిజం చెప్పండి”

“నిజం..నిజం. అతను నన్ను ఏం చెయ్యలేదు.”

అప్పుడు తెలుసుకుందేమో తను బయట పడిపోయానని, భయంగా మా ఇద్దరివైపు చూస్తూ ఏడుస్తూ కూలపడిపోయింది.

“మా పెద్దయ్య ?” అంటూ చేతులు నలుపుకుంటూ గొణిగాడు.విసురుగా చూసాను అతని వైపు ,జంకాడు.

“ఆ విధంగా రాసి సంతకం పెడతావా? లేదా జైలుకు వెళతావా?.” అధికారంతో నిర్మోహమాటంగా దబాయించాను. ఆ అమ్మాయి మాట అబద్దమైనా, రాసి ఇవ్వక పోతే , అతని జీవితం నాశనం అయిపోతుంది.

నర్సుని పిలిచి ఆ అబ్బాయిని పిలవమన్నాను.

ఎక్కడో చూస్తూ చాలా సేపు ఏడుస్తూ కూర్చుంది. ఆలోచించి ఆలోచించి చివరకు విధి లేదన్నట్లు ముఖం తుడుచుకొని ఇనస్పెక్టర్ వైపు నిరసనగా చూస్తూ రాసిఇచ్చింది. అతను తల దించుకున్నాడు.

ఆమె రాసిచ్చిన స్టేట్మెంటు తీసుకుని చదివి “అన్ని రోజులు నీవి కావు. ఇక నైనా బుద్ధి తెచ్చుకుంటావని నిన్ను వదిలేస్తున్నాను,ఇది మరో జన్మ నీకు.నీతిగా గౌరవంగా బ్రతుకు. స్త్రీ వీధి కుక్క అనే అప్రతిష్ట తీసుకు రాకు. స్త్రీ తెగువ చొరవ అన్ని అనర్థాలకు మూలం అని చెప్పు. హక్కులను దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పు. ఈ నాటి యువతులు ఎన్నో సమస్యలతో నిరాశ నిస్పృహలతో ఈ సొసైటీలో బ్రతక లేక పోతున్నారు. వాళ్లకు అండగా నిలిచి నీ ఆడ పుట్టుకకు విలువ తీసుకురా!అందరికి నియమాలు, కట్టుబాట్లు ఉంటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే తగలబడుతుంది. బ్లాక్ మెయిల్ చెయ్యకు, బ్లాంకు అయిపోతావు. జాగ్రత్త.!” నా కళ్ళల్లోని తీక్షణతకు తలదించుకొని ఏడుస్తూ ఆ గది లోనుంచి వెళ్లి పోయింది..

అంత తేలిగ్గా ఈ యువత మేలుకుంటుందా?

నర్సుతో అతనొచ్చి, ఇనస్పెక్టర్ని చూసి భయంగా నా వైపు చూసాడు.

ఇనస్పెక్టర్ ముందుగా మేలుకున్నాడు.

“సారీ.” అంటూ చాలా బరువు దిగిపోయినట్టు నిట్టూర్పు వదిలి చేయి అందించాడు .

అర్థం కానట్లు నా వైపు చూస్తూ, చేయి ఇచ్చాడు

“పండుగులకు ఏం చేస్తావు.”

“పండగలా?’అంటూ ఆశ్చర్యంగా నా వైపుచూసి పోలీసు ఆఫీసర్ని చూసాడు.

“సంక్రాంతి కదా!”

గుర్తు తెచ్చుకున్నట్లు,” ఓహ్ ! మరిచే పోయాను.నా బ్రతుక్కేం పండుగ?” నిరాశగా అన్నాడు.

“ఏదైనా ప్రత్యేకత ఉందా?’

“పెండ్లి చూపులు ... కానీ....?’బాధగా తలదించుకున్నాడు.

“శుభాకాంక్షలు . వెళ్ళు.!”అంటూ నవ్వాను.

మా ఇద్దరి వైపు అయోమయంగా చూస్తున్న అతనితో “అన్నీ మర్చిపోయి సంతోషంగా వెళ్ళు. గుడ్ లక్.”అంటూ భుజం తట్టాడు పోలీస్ ఆఫీసర్.

“సాఫ్టువేర్ జాగర్త! సెలక్షన్లో! వెళ్ళు.!!’అని చేయి చూపించాను.

ఇనస్పెక్టర్ అతన్ని చూసి “తస్మాత్ జాగర్త !,” అంటూ వేలు చూపించి, బరువు దిగి పోయినట్లు నిట్టూర్పు వదిలి, నా చేతులు గట్టిగా పట్టుకొని సంతోషంగా నవ్వాడు.

నాకు నవ్వు రాలేదు. తప్పు చేసానా అనే భావన మెదిలింది. కానీ ఒక జీవితాన్ని కాపాడాను కదా అనే సంతృప్తి!.

*** శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి



రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి..

నమస్తే !

నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష.

చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.

56 views0 comments

Comments


bottom of page