top of page

వ్యవస్థ


'Vyavastha' - New Telugu Story Written By Ch. C. S. Sarma.

'వ్యవస్థ' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఈ ప్రపంచంలో ఎవరి విషయంలోనైనా.. సిరి, సంపదలు శాశ్వతం కావు. కాలగతిలో కలిమి లేములు స్థానాలను మారవచ్చు. కానీ కుటుంబ బంధుత్వపు వ్యవస్థ ప్రేమానురాగాలతో వర్థిల్లాలి. దానికి ధనం, కొలమానం కాకూడదు. కాలవాహినిలో మార్పులు సహజం.


కామేశ్వరి గంగాధరం అక్కాతమ్ములు. వారి తల్లితండ్రులు సుశీల రామారావులు. మధ్యతరగతి కుటుంబీకులు.


రామారావు స్కూలు టీచర్. సొంతగ్రామంలోనే ఉద్యోగం. రెండు ఎకరాల మాగాణి పెంకుటిల్లు వారి ఆస్థులు. తను ఉపాధ్యాయులు అయినందన ఇరువురు పిల్లలను రామారావు, ఒక ఎకరాన్ని అమ్మి బాగా చదివించారు. సుశీల మంచి ఇల్లాలు. పొదుపుకు ప్రతిరూపం. వారి దాంపత్యం ఎంతో అన్యోన్నతం.


కామేశ్వరి బి. యస్. సి. బి. యి. డీ చదివి టీచర్ అయింది. గంగాధరం, యమ్ టెక్ గోల్డు మెడల్ తో ప్రథమ ర్యాంకులో పాసైనాడు.


వనిత గంగాధరానికి కాలేజీలో జూనియర్. గంగాధరం తెలివి తేటలు వనితకు నచ్చి అతనితో స్నేహం చేసింది. తనసందేహాలను అతని వద్ద అడిగి సమాధానాలను తెలిసికొనేది. గంగాధరం కాలేజీ నుండి సర్టిఫికేట్స్ తో బయటకి వచ్చేనాటికి వనిత ఫైనల్ ఇయ్యర్ యం. టెక్.

వనిత తండ్రి గొప్ప సివిల్ కాంట్రాక్టర్. వనిత గంగాధర్ ను గురించి తన తండ్రి గోవిందరాజులు తల్లి గౌరీదేవులకు చెప్పింది. తన పుట్టిన రోజు పండుగకు గంగాధరాన్ని తన ఇంటికి ఆహ్వానించి తల్లిదండ్రులకు పరిచయం చేసింది. ఒకే కులం అయినందున, గోవిందరాజులు తన కూతురును గంగాధర్ తగినవాడని, అతను కాలేజీ నుండి బయటకు రాగానే తన కంపెనీలో ఉద్యోగాన్ని కల్పించాడు.


గంగాధరం తన భాధ్యతను ఎంతో చక్కగా నెరవేర్చుతూ గోవిందరాజులు అభిమానానికి పాత్రుడయ్యాడు.


వనిత ఫైనల్ ఇయ్యర్ పరీక్షలు ముగిసాయి. వనిత గంగాధరం విషయంలో తన మనస్సులోని అభిప్రాయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది.


గోవిందరాజులు గౌరీలు రామారావు సుశీలలను కలసి వారి నిర్ణయాన్ని గంగాధరం వనిత ల అభిప్రాయాన్ని తెలియజేసి మంచి ముహూర్తాన వనిత గంగాధరాల వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించారు.


విశాఖపట్నంలో ఒక బ్రాంచ్ ని ఓపన్ చేసి గంగాధరాన్ని వనితను, విశాఖ వాసులను చేశారు గోవిందరాజులు. మామగారి ఆజ్ఞానుసారంగా, గంగాధర్ పూర్తిగా వ్యాపారాభివృద్ధిలో మునిగి పోయాడు. తల్లితండ్రులను మరచిపోయాడు.


కన్నతల్లి సుశీల, తండ్రి రామారావులకు దూరం అయినాడు. ఆర్థిక పరిస్థితుల రీత్యా గంగాధరం వివాహం అయిన సంవత్సరానికి కామేశ్వరి వివాహాన్ని సుశీల రామారావులు, రెండవ పెండ్లివాడు కోటయ్య దూరపుబంధువు.. వ్యవసాయదారుడితో జరిపించారు. ఆ వివాహం అయిన ఆరు నెలలకు, మూడు మాసాల వ్యవధిలో సుశీల రామారావులు గతించారు.


గంగాధరం తల్లి, తండ్రి, అక్కలను మరచిపోయాడు. వారి అంత్యక్రియలకు కూడా రాలేదు.

కాలవాహినితో పాతిక సంవత్సరాలు శరవేగంతో సాగిపోయాయి.


* * *


తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే.. పాపం పాపమే!! అవసానదశతో రామారావు తన మనుమడు కామేశ్వరి కొడుకు సత్యకు తనకుటుంబ కథను చెప్పి కన్నుమూశాడు. సత్య ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా విశాఖపట్నానికి వచ్చాడు.


తన మేనమామ గంగాధర్, వారి మామగారు గోవిందరాజులు వారి కుటుంబాన్ని గురించి విచారించాడు.


పాలపొంగులా పొంగిన గంగాధరం సంపద, పొంగి పొయ్యిపాలైన పాల తీరున, అక్రమ మార్గాల ఆర్జన కరిగిపోయింది. భవంతులు కార్లు పనివారు నౌకర్లు అన్నీ, అందరూ వారికి దూరం అయినారు. ఆస్థిపాస్థులు వేలం వేయబడ్డాయి. గోవిందరాజులు వారి సతీమణి గౌరి, వనిత మనోవ్యధతో మరణించారు.


కూతురు వసంత, గంగాధరం పూరి గుడిశ పాలైనారు. వసంత బి. ఎ. పాసైయింది. గంగాధరం పక్షవాతంతో మంచం పడ్డారు. బ్రతుకు తెరువు కోసం.. వసంత సత్య ఆఫీస్ కు ఇంటర్వ్యూకు వెళ్ళింది. వారి కుటుంబ కధనాన్నంతా తెలిసికొన్న సత్య.. వసంతకు ఉద్యోగాన్ని ఇచ్చాడు.


* * *


‘‘అమ్మా!.. ’’ ఇంట్లోకి ప్రవేశిస్తూ తల్లిని పిలిచాడు సత్య.


‘‘ఏం నాయనా!.. ’’

అతన్ని సమీపించి అడిగింది తల్లి కామేశ్వరి.


గంగాధరం, గోవిందరాజులు కుటుంబ కథానన్ని సత్య తన తల్లికి తెలియజేశాడు.

ఆ తల్లి.. ఒక స్త్రీమూర్తి.. బోరున ఏడ్చింది.


సత్య తల్లిని ఓదార్చాడు. కారణం అడిగాడు.

‘‘నాయనా!.. ’’ దీనంగా పిలచింది కామేశ్వరి.


‘‘ఏమ్మా!.. ’’


‘‘నేను నా తమ్ముడిని, వాడి కూతురును ఒకసారి చూడాలని వుంది నాన్నా. చూపిస్తావా!.. ’’ కన్నీటితో అడిగింది కామేశ్వరి.


ఆశ్చర్యంతో చూచాడు తల్లి ముఖంలోకి సత్య..


‘‘వారు మన కుటుంబానికి ఎంతో అన్యాయం చేసివుండవచ్చు!.. విచక్షణారహితంగా అవివేకంతో!.. నీవు, ఆదైవ కృపవల్ల నేడు మంచి స్థితిలో వున్నావు కదానాన్నా!.. వాడి తప్పులను మన్నించి వాడి ఆ అడపిల్లకు సాయం చేయలేవా!.. సాయం చేయాలనేది నాకోరిక తండ్రీ. నా మాట వినవా!.. ’’ దీనంగా కన్నీటితో అడిగింది కామేశ్వరి.


‘‘అమ్మా!.. ’’


‘‘చెప్పు తండ్రి!.. ’’


‘‘ఆ అమ్మాయి పేరు వసంత. నా ఆఫీస్ కు ఇంటర్వ్యూకు వచ్చింది. నేను ఆ అమ్మాయికి ఉద్యోగాన్ని ఇచ్చానమ్మా!.. చెప్పు ఇంకా వారికి ఏం చేయాలో!.. ’’


‘‘నాన్నా!.. ’’


‘‘అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ!.. నీవు ఆ పిల్ల నా తమ్ముడి కూతురని సాయం చేశావా!.. లేక.. అర్హతను బట్టి ఉద్యోగం ఇచ్చావా!.. ’’ ప్రశ్నార్థకంగా సత్య ముఖంలోకి చూచింది కామేశ్వరి.


‘‘మొదట నేను చూచింది అర్హత. తరువాత బంధుత్వం!.. ’’

సత్య నిశ్చల జవాబు. క్షణం తర్వాత.. ‘‘అమ్మా!.. నిజంగా నీకు నీ తమ్ముడిని చూడాలని వుందా!.. ’’ అడిగాడు.


‘‘అవును నాన్నా!.. ’’ దీనంగా చెప్పింది కామేశ్వరి.


‘‘సరే.. రడీగా!.. బయలుదేరుదాం.. ’’


‘‘ఐదు నిముషాలు.. చీరమార్చుకొని వస్తాను.. ’’ కన్నీళ్ళను పవిటతో తుడుచుకొంటూ తన గదిలోనికి వెళ్ళింది కామేశ్వరి. కాలింగ్ బెల్ మ్రోగింది..


సోఫానుండి లేచి సత్యా ద్వారాన్ని సమీపించి తలుపు తెరిచాడు.


ఎదురుగా వసంత. బిక్కముఖంతో నిలబడివుంది. సత్యాని చూడగానే బెదిరిపోయింది.

‘‘సా.. ర్!.. ’’ మెల్లగా ఆమె పెదవులు పలికాయి.


సత్య.. ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు ఆమె ముఖంలోకి చూచాడు.

‘‘నమస్తే సార్!.. ’’ చేతులు జోడించింది వసంత.


‘‘నమస్తే.. నమస్తే.. లోనికి రండి.. ’’ తొట్రుపాటుతో చెప్పాడు సత్య. అతను ఆమె రాకను వూహించలేదు.


‘‘సత్యా!.. ఎవరయ్యా!.. ’’ హాల్లోకి వచ్చింది కామేశ్వరి.

వసంతను చూచింది.


‘‘నమస్తే మేడం!.. ’’ చిరునవ్వుతో చెప్పింది వసంత.


‘‘అమ్మా!.. అమ్మాయి పేరు.. ’’


‘‘వసంత.. గంగాధరంగారి అమ్మాయిని!.. ’’ సత్యపూర్తి చెప్పకముందే వసంత చెప్పింది.

‘‘అలాగా!.. రా అమ్మా రా.. రా!.. ’’ ప్రీతిగా పిలిచింది కామేశ్వరి.


తల్లీ కొడుకుల ముఖాలను మార్చి మార్చి చూస్తూ మెల్లగా ముందుకు నడిచింది వసంత.

‘‘అమ్మా!.. ఈమెకే నేను ఉద్యోగం ఇచ్చింది!.. ’’ చిరునవ్వుతో చెప్పాడు సత్య.


‘‘కూర్చో అమ్మా!.. ’’ ప్రీతిగా పలికింది కామేశ్వరి.


‘‘సార్!.. ఆఫీస్ లో నేను మీతో అందరి ముందూ చెప్పలేకపోయాను. మిమ్మల్ని కలిసి చెప్పాలని వచ్చాను. సార్!.. నేను చాలా కష్టాల్లో వున్నాను. మానాన్నగారి ఆరోగ్యం సరిగాలేదు. దేవుడిలా మీరు నన్ను ఆదుకొన్నారు. నాకు ఉద్యోగాన్ని ఇచ్చారు. మీ సహాయాన్ని నేను నా జీవితాంతం మరువలేను సార్!.. మీకు.. మీకు.. నా ధన్యవాదములు సార్!.. ’’ కన్నీటితో చేతులు జోడించింది వసంత.


‘‘మీకు అర్హతవుంది. అందుకనే ఆ ఉద్యోగం మీకు లభించింది.. ’’


‘‘అమ్మడూ కూర్చో!.. నీవెవరు?.. ’’


‘‘గంగాధరం గారి అమ్మాయిని.. ’’


‘‘ఆ గంగాధరం ఎవరు?.. ’’


‘‘మా నాన్నగారు!.. ’’


‘‘కాదు.. నా తమ్ముడు.. ’’ ఆనందంగా నవ్వింది కామేశ్వరి.


వసంత ఆశ్చర్యపోయింది. నోరు తెరిచింది.


‘‘సత్యా పదరా!.. నేను నా తమ్ముడిని చూడాలి.. ’’


‘‘వెళ్ళి కార్లో కూర్చో అమ్మా. నేను తలుపు మూసివస్తాను.. ’’ చిరునవ్వుతో చెప్పాడు సత్య.


కామేశ్వరి వసంత చేతిని తన చేతిలోనికి తీసుకొంది.

‘నా కొడుకు వ్యవస్థను అభిమానించేవాడు’, అనుకొంది కామేశ్వరి. హాలునుండి బయటకు నడిచింది.


వసంత మంత్ర ముగ్దురాలై కామేశ్వరిని అనుసరించింది.

‘దైవనిర్ణయం ఎంతో చిత్రం. విచిత్రం. ఈ ఆఫీసర్ నాకు బావ వరసేనా!.. ఎవరూ లేరనుకొన్న నాకు మేనత్తను బావను కలిపాడు. సర్వేశ్వరా నమోన్నమహ!..’ సంతోషంతో అనుకొంది వసంత.


ఇరువురూ కారు వెనక సీట్లో కూర్చున్నారు. సత్యా కారు స్టార్ట్ చేశాడు.

సత్య.. గంగాధరాన్ని హాస్పటల్లో చేర్చి మంచి ట్రీట్ మెంట్ ఇప్పించాడు. అతని ఆరోగ్యం బాగుపడింది.


మూడు నెలల తర్వాత కామేశ్వరి గంగాధరం - అక్కా తమ్ములు సత్య వసంతల వివాహాన్ని ఆనందంగా ఘనంగా జరిపారు.


* * *


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


50 views0 comments
bottom of page