top of page

అనురాగ బంధం





'Anuraga Bandham' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


నేను వెళ్ళిపోతున్నాను. మీరు వచ్చేవరకు ఎదురు చూడను..

ఒకసారి కళ్ళద్దాలు తీసి తుడుచుకొని, మళ్ళీ చదువుతున్నారు కదూ!

సరిగ్గానే చూశారు.నేను వెళ్ళిపోతున్నాను..

‘ముప్పై యేళ్లు సర్దుకొని కాపురం చేసిన మనిషి ఇప్పుడెందుకిలా మారిపోయింది? పిచ్చి గాని పట్టలేదుకదా!’ అనుకుంటున్నారా?

మీరలా అనుకునేవారు కాదు.’కోపంలో తొందర పడింది పాపం’ అనుకొని ఉంటారు. ఆ విషయం నాకూ తెలుసు.

అయినా ఇదేమిటి? మీ మీద కోపం చూపిస్తూ ఉత్తరం వ్రాయాలని మొదలు పెట్టి, అంతలోనే పొగడ్తలలోకి దిగుతున్నానా? లేదు! ఈ సారి మాత్రం ఎందుకో సర్దుకోదలచుకోలేదు.వెళ్లిపోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను.


‘ముప్పై యేళ్ళ మీ కాపురంలో అల్లుడుగారు నిన్ను కోప్పడగా చూడలేదమ్మా’ అంటూ వుంటారు మా నాన్న.


మీ నిజస్వరూపం ఆయనకు ఏం తెలుసు? నాకు గుర్తుండి ఖచ్చితంగా మూడు సార్లయినా కోప్పడి ఉంటారు.

మరో రెండు మూడు సార్లు ఎక్కువే ఉండొచ్చు.

ఎప్పుడబ్బా...

లేదులే….మూడుసార్లు మాత్రం ఖచ్చితంగా కోప్పడ్డారు.

పెళ్ళైన నెలలోనే ఒకసారి కూరలు తరుగుతుండగా నా వేలు తెగి చిన్న గాయం అయింది.


గబగబా పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు మీరు. నా వేలికి కట్టు కడుతూ 'మరీ అంత అజాగ్రత్త అయితే ఎలా కళ్యాణీ' అంటూ ఎంతలా కోప్పడ్డారో ...


దాదాపు ఓ వారం రోజులు ఆ విషయం తలచుకుంటూ ఎంత బాధపడ్డానో...ఎవరికైనా చెబితే గానీ నా బాధ తగ్గదనిపించి మా అమ్మకు ఫోన్ చేశాను.

నేను చెప్పింది విని అమ్మ పకపకా నవ్వడం మొదలుపెట్టింది.

కోపంతో ఫోన్ పెట్టేసాను.

వెంటనే అమ్మ రెండు మూడు సార్లు కాల్ చేసింది.

కానీ నేను తీస్తేగా!

ఆ రోజు సాయంత్రం నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్లి సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ చేయించారు మీరు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నాకిష్టమైన ఐస్ క్రీం తినిపించారు.

నేను ఫిదా అయిపోతాననుకున్నారేమో.

నిజంగానే అయ్యానుకానీ, ఓ వారం రోజులు బెట్టు మైంటైన్ చేశాను.

మీతో సరిగ్గా మాట్లాడలేదు.

ఒక వారంగా నేను ఫోన్ తియ్యక పోయేసరికి అమ్మా నాన్నా నా దగ్గరకు వచ్చేసారు.

నాన్న నన్ను దగ్గరకు తీసుకొని, ఆప్యాయంగా తల నిమురుతూ 'ఎలా వున్నావు కల్యాణీ!' అని అడిగారు.

నాకు ఏడుపు ఆగలేదు. అమ్మ నన్ను కౌగలించుకుంది. కాసేపు అమ్మ దగ్గర సేద తీరాక నా మనస్సు స్థిమిత పడింది.వెంటనే అమ్మ ఆ రోజు ఫోన్ లో నవ్వినందుకు నాకు కోపం వచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది. ఇష్టం లేకపోయినా అమ్మ దగ్గర నుండి దూరంగా జరిగాను.

అమ్మ మళ్ళీ నన్ను దగ్గరకు లాక్కుని "పిచ్చి తల్లీ! ఎంత రోషం నీకు? నీ పంతం నా దగ్గర చూపిస్తే చూపించావు. అల్లుడుగారి దగ్గర చూపకే బంగారూ!" అంది.

కోపంగా అమ్మను విడిపించుకొని నాన్న దగ్గరకు వెళ్ళాను.

నాన్న అమ్మ వైపు తిరిగి 'అమ్మాయి బాధ పడితే ఓదార్చకుండా అల్లుడిని వెనకేసుకొస్తావా?"అని కోప్పడ్డారు.

తరువాత నాతో " నువ్వు ఆ రోజు నాకు ఫోన్ చేసి ఉండాల్సిందమ్మా. మీ అమ్మకు అన్నీ నవ్వులాటలే. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందమ్మా? అల్లుడుగారు నీ మీద చెయ్యి చేసుకున్నట్లున్నారు?" అన్నారు.

"అయ్యో! అలాంటిదేమీ లేదు నాన్నా." అన్నాను నేను.

"ఏమిటో! మీ అమ్మ ఏ విషయం సరిగ్గా చెప్పదు. ఆ రోజు అల్లుడుగారు నిన్ను విసురుగా నెడితే కత్తిపీట మీద పడి వేలు తెగింది కదూ!"

"లేదు నాన్నా!నేను కూరలు తిరుగుతుంటే...."

నన్ను పూర్తి చేయనీయకుండా "ఏవిటీ? కూరలు నీచేత తరిగిస్తున్నాడా అల్లుడు? నేనెప్పుడైనా మీ అమ్మను తరగనిచ్చానా? ఎంత అన్యాయం!" అన్నాడు నాన్న బాధ నటిస్తూ.

అప్పుడర్ధమయింది నాన్న కూడా నన్ను ఆట పట్టిస్తున్నారని.

నా తల మీద ఉన్న నాన్న చేతిని దూరంగా నెట్టేసి "మీ ఇద్దరి కంటే ఆయనే ఎంతో నయం. తన పైన కోపం వచ్చిందని ఆయనతో చెప్పి ఉంటే, ఓ వంద మాట్లు సారీ చెప్పి వుండే వారు." అన్నాను కోపంగా.

"అదేనమ్మా నేను చెబుతున్నది కూడా. అల్లుడుగారు కూడా మీ నాన్నలా రోజుకు పదిమార్లు ఏదో విషయంగా కసురుతూ ఉంటే నీకీ పాటికి అలవాటయిపోయి కోపం వచ్చేది కాదు" అంది అమ్మ .

"ఏ విషయాన్నైనా నా మీదకు తిప్పి సాధిస్తుంది మీ అమ్మ .చూసావా" అన్నాడు నాన్న. తరువాత అమ్మ వైపు తిరిగి " ఆ సాధించే టెక్నిక్స్ అమ్మాయికి కూడా కాస్త నేర్పవే." అన్నాడు నవ్వుతూ.


"మీరిద్దరూ ఆయన పార్టీ అని అర్థమయింది.ఇంతకీ నాకు క్లాసు పీకడానికే ఇద్దరూ పరుగెత్తుకుని వచ్చినట్లుంది.అంతే గానీ నన్ను చూడ్డానికో,ఓదార్చడానికో కాదన్నమాట. " అన్నాను కోపం తెచ్చిపెట్టుకుంటూ.

మళ్ళీ అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది.

"చిన్నప్పుడు నువ్వొకసారి వేగంగా పరుగెడుతూ గడప తట్టుకుని బోర్లా పడ్డావు. అప్పుడు నేను నిన్ను పైకి లేపి 'చూసుకొని నడవాలి కదా కల్యాణీ' అని ప్రేమగా కోప్పడ్డాను. ఇప్పుడు అల్లుడుగారు అన్నదాంట్లో కూడా ఆ తల్లిప్రేమ కనబడుతోంది" అంది నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ .

అంతలో ఏదో మరచిపోయినట్లు "అయినా నన్ను చూస్తూ పెరిగావు కదా. మీ నాన్నగారి దగ్గర రోజూ మాటలు పడుతూనే ఉన్నానుగా. అలవాటయింది కాబట్టి నాకేమీ అనిపించడం లేదు. ఇంత చిన్న విషయానికి ఫీలవుతున్నావంటే అల్లుడుగారు నిన్ను సుకుమారంగా చూసుకుంటున్నారని అర్ధం" అంది నాన్నకు చురక వేస్తూ.

"చూసావుటమ్మా మీ అమ్మ వాలకం. నాకూ ఈవిడ దెప్పుళ్ళు అలవాటయిపోయి ఏమీ బాధ అనిపించడం లేదు." అన్నాడు నాన్న.

ఇంతలో ఆఫీస్ నుండి మీరు వచ్చారు. అమ్మానాన్నలను చూసి పలకరించి, మీ చేతిలోని ఐస్ క్రీం ఉన్న కవరును ఫ్రిజ్ లో ఉంచారు.

"ఒకసారి కోప్పడ్డందుకు వారంపాటు ఐస్ క్రీంలు తెస్తారా అల్లుడుగారూ. ఆ లెక్కన మీ మామయ్యగారి జీతం ఐస్ క్రీంలకే చాలదు " అంది అమ్మ నవ్వుతూ.

"చూశావా కల్యాణీ! నన్ను అనకుండా మీ అమ్మ ఒక వాక్యం కూడా పూర్తి చెయ్యదు" అన్నాడు నాన్న.

అందరం హాయిగా నవ్వుకున్నాం.

నా మనసు తేలిక పడింది.

***

ఇక మీరు కోప్పడ్డ రెండో సందర్భం.

ఇది మొదటిసారిలా కాదు.బాగానే కోప్పడ్డారు. గట్టిగా అరిచారు. తలచుకున్నప్పుడల్లా ఏడుపు తన్నుకొస్తుంది ఇప్పటికీ.

అప్పుడు నేను మన పెద్దబ్బాయిని కడుపులో మోస్తున్నాను. ఎనిమిదో నెల అనుకుంటాను.ఆ రోజు ఉదయం నుండి కరెంట్ లేదు. మీకు చన్నీళ్ళ స్నానం అలవాటు లేదు. అందుకని గ్యాస్ స్టవ్ మీద మీకోసం నీళ్లు కాచి బాత్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళాను. అక్కడ అనుకోకుండా కాలు జారడంతో పడబోయి తమాయించుకున్నాను. కానీ వేడి నీళ్లు పడి నా కాళ్ళు కాలాయి. హాల్లో ఉన్న మీరు పరుగెత్తుకొని వచ్చి నన్ను బెడ్ రూం లోకి తీసుకుని వెళ్లి పడుకోబెట్టారు. నా కాళ్లకు బర్నాల్ రాస్తూ "నీకేమైనా పిచ్చి పట్టిందా! వేణ్ణీళ్ళు పెట్టమని నేనేమైనా అడిగానా? కింద పడి వుంటే ఏమయ్యేది? కొద్దిలో ప్రమాదం తప్పింది. ఇంకెప్పుడూ ఇలాంటి తెలివితక్కువ పనులు చెయ్యకు” అంటూ గట్టిగా అరిచారు. కాలిన గాయం కంటే మీ అరుపులే నన్ను ఎక్కువగా బాధించాయి. ఇక యధాప్రకారంగా నన్ను హాస్పిటల్ లో అడ్మిట్ చేసి, అన్ని పరీక్షలూ చేయించి ఏమీ కాలేదని నిర్ధారించుకున్నాక శాంతించారు. విషయం తెలిసిన అమ్మా నాన్నలు హాస్పిటల్ కు వచ్చారు. మిమ్మల్ని తప్పుపట్టే మాట అటుంచి ఇద్దరూ నన్ను శతమానం తిట్టిపోశారు ‘కాస్త కూడా జాగ్రత్త లేకపోతే ఎలా’ అంటూ.

"నేను ఆయన మీద కోపంతో అలిగి మీ దగ్గరకు వచ్చేస్తానని భయపడుతున్నట్లున్నారు." అన్నాను నిష్ఠూరంగా .

“అదేమిటమ్మా! నిన్ను కాన్పుకు తీసుకుని వెళ్తామని ఎప్పుడో పిలిచాము. ఆయనకు ఇబ్బంది అవుతుంది, తొమ్మిదో నెలలో వస్తానని నువ్వేగా చెప్పావు”అన్నారు ఇద్దరూ.

"డెలివరీకి రావడం గురించి కాదు. అలిగి వచ్చేస్తానంటున్నాను" వాళ్ళు అర్థం కానట్లు నటిస్తున్నారని తెలిసి స్పష్టంగా చెప్పాను.

"సరదాకు కూడా మరెప్పుడూ ఆలా ఆనకమ్మా! రోజూ గారెలు తినేవారికి వాటి విలువ తెలీదట. నీ పరిస్థితి అలాగే ఉంది." అంది అమ్మ కాస్త బాధగా.

"నన్ను చూసి భర్తతో ఎలా ఇబ్బంది పడుతున్నానో తెలుసుకో - అనలేదేం ఈ సారి?"అన్నాను అమ్మతో.

"నేను లేచిన వేళా విశేషం బాగుందేమో. ఈ రోజు మీ అమ్మ నా జోలికి రాలేదు" అన్నాడు నాన్న.

"అదేం లేదు. మీ గురించే చెప్పబోతున్నాను. ఏరోజైనా మీ నాన్న కసురుకోకుంటే ఆ రోజే పండగ నాకు" అంది అమ్మ .


"అదే నేనూ చెప్తున్నా. ఇప్పుడే అన్నానుగా ఈ రోజు మీ అమ్మ దెప్పుళ్ళు లేవని. ఆ కొరత తీర్చేసింది." అన్నాడు నాన్న నవ్వుతూ.

"మీరిద్దరూ బాగానే ఉంటారు. నేను మీ అల్లుడి గురించి ఏదైనా చెప్పాలని చూస్తే, మీరిద్దరూ దెబ్బలాడుకున్నట్లు నటిస్తారు. మీ కూతుర్ని. ఆ మాత్రం కనుక్కోలేనా?" అన్నాను చిరు కోపంగా.

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కాన్పు కోసం మా అమ్మానాన్నలతో వైజాగ్ వెళ్ళిపోయాను.

వెళ్ళానన్న మాటే గానీ మనసంతా మీ పైనే ఉంది. అప్పటికి మామగారు ఇంకా ఉద్యోగంలో ఉండటంవల్ల అత్తమామలు నెల్లూరులోనే ఉన్నారు.మనమిద్దరమే హైదరాబాద్ లో ఉండటం.నేను వెళ్లిపోవడంతో మీరు ఒంటరి అయిపోతారు. అదే నా బాధ.

ఈ సారి అమ్మానాన్నలను అమ్మానాన్నలుగా కాక ఒక జంటగా పరిశీలించడం ప్రారంభించాను. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమే. అందులో సందేహం లేదు. కానీ అమ్మ చెప్పినట్లు నాన్న రోజులో నాలుగయిదు సార్లయినా అమ్మను కోప్పడుతుంటాడు. అయితే ఆ కోపం కాస్సేపే. నాన్నతో పోలిస్తే మీరు భార్యను ఎక్కువగా గౌరవిస్తారు. ఎప్పుడూ చులకన చేయరు. అమ్మ చెప్పినట్లు రోజూ గారెలు తినేవారికి వాటి రుచి తెలీదు. ఇంకెప్పుడూ మీతో పోట్లాడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకోవడమేమిటి? మనసులోనే ఒట్టు పెట్టుకున్నాను. దాదాపు గత ముప్పై ఏళ్లుగా మీకు తగ్గట్టుగానే నా ఆలోచనలు మార్చుకున్నాను.

***

రోజులు గడుస్తున్నాయి. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు.

పెద్దవాడు బి టెక్ మొదటి సంవత్సరం. రెండోవాడు టెన్త్ పూర్తి చేశాడు.

ఈ మధ్య కాలంలో మీరు రోజూ కంప్యూటర్ లో ‘ఐ ఫోన్’ గురించి సెర్చ్ చెయ్యడం గమనించాను. మీ తోటి ఉద్యోగులందరూ ఐ ఫోన్ కొనుక్కున్న విషయం నాతో ఒకసారి చెప్పి ఉన్నారు. మీరు ఎందుకు తటపటాయిస్తున్నారో చూచాయిగా అర్ధం అయ్యింది. ఆ విషయమే మిమ్మల్ని అడిగాను.

"నిజమే. ఐ ఫోన్ కొనుక్కోవాలని ఉంది. కానీ మొన్నేగా పెద్దవాడికి డొనేషన్ కట్టింది. ఈ సంవత్సరం రెండో వాడిని ఇంటర్లో మంచి కాలేజీలో చేర్చాలి. ఆ ఖర్చులు ఉంటాయిగా. పై సంవత్సరం కొనుక్కుంటాలే. అదేమీ నిత్యావసరం కాదుగా" అన్నారు మీరు.

నేనేమీ మాట్లాడలేదు.

సంవత్సరం గడిచింది.

మళ్ళీ మీరు ఐ ఫోన్ గురించి వెదకడం ప్రారంభించారు. ఒకసారి మీ కంప్యూటర్ లో హిస్టరీ చూసాను. దాదాపు ప్రతి రోజూ రెండు మూడు గంటలు ఐ ఫోన్ ఫీచర్స్, ధర, ఆఫర్స్ ఇలాంటి వాటి గురించి చూస్తున్నారు.

"దీని కోసం ఇంత తటపటాయింపు ఎందుకండీ ? ఈ సారి మాత్రం వాయిదా వెయ్యకుండా కొనేయండి" అన్నాన్నేను.

"పిల్లలిద్దరూ కాలేజీలో ఉన్నారు. ఈ సమయంలో ఇలా డబ్బు వృధా చెయ్యడం ఎందుకు? అనిపిస్తోంది నాకు" అన్నారు మీరు.

"మీరు అనవసరంగా భయపడుతున్నారు.ఒక ఐ ఫోన్ కొన్నంతమాత్రాన మన పరిస్థితేమీ తల్లక్రిందులు కాదు. రేపే వెళ్లి కొనుక్కుందాం. లేకుంటే నాకు కోపం వస్తుంది" గట్టిగా చెప్పాను నేను.

"అలాగే" అంటూ ఒప్పుకున్నారు మీరు.

"మా మంచి శ్రీవారు " అంటూ మీ బుగ్గమీద ముద్దు పెట్టుకొని కాఫీ తేవడానికి వెళ్ళాను.

కాఫీ కలుపుతుండగా మీ ఫోన్ రింగ్ కావడం,మీరు ఎవరితోనో మాట్లాడుతుండడం వినిపించింది.

కాఫీ కలిపి మీకందించి "ఎవరండీ " అని అడిగాను.

"పెద్దబ్బాయి ఫోన్ చేసాడు. ఫ్రెండ్స్ అందరికీ బైక్స్ ఉన్నాయట. తనూ కొనుక్కోవాలనుకుంటున్నాడట. వీలైతే డబ్బు పంపమన్నాడు" ప్రశాంతంగా చెప్పారు మీరు.

మీలో నాకు నచ్చేదీ, ఒక్కోసారి నచ్చనిదీ అదే. సంవత్సరంగా ఐ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్న మీరు, కొడుకు బైక్ కావాలని ఒక్కమాట అనగానే సరే అన్నట్టున్నారు. అంతేగానీ 'ఇప్పుడు కుదరదురా .పై సంవత్సరం చూస్తాను ' అని అనలేక పోయారు. అవతల మనిషి బాధపడకూడదనే మీ మనస్తత్వం మంచిదే. కానీ భార్యా పిల్లల దగ్గర కూడా మొహమాటపడే మనస్తత్వం ఒక్కోసారి కోపం తెప్పిస్తుంది.

క్షణాల్లోనే ఒక నిశ్చయానికి వచ్చాను.

"ఏమండీ. చాలా రోజులనుండి రాళ్ల నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మీలాగే వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీరు ఫోన్ కొనుక్కుంటారని ఊరుకున్నాను. ఫోన్ కొనని పక్షంలో నేను నెక్లెస్ కొనుక్కుంటాను. అబ్బాయితో నేను మాట్లాడుతాను. బైక్ విషయం ప్రస్తుతానికి వాయిదా వేసుకోమంటాను" అంటూ ఫోన్ అందుకున్నాను.

"చూడు కల్యాణీ! ఆఫీసులో నాకున్న విలువ నా వ్యక్తిత్వాన్ని బట్టే కానీ నాకున్న ఫోన్ వల్లో, నా దుస్తులవల్లో కాదు. అలాగని ఫోన్ కొనుక్కోనని చెప్పడం లేదు. ప్రస్తుతానికి వాయిదా వేసి అబ్బాయికి బైక్ కొనిస్తాను" అన్నారు మీరు.

"చెప్పానుగా. మీరు ఫోన్ కొనుక్కుంటారని సర్దుకున్నాను.. లేని పక్షంలో ఆ డబ్బులు నాకు ఇవ్వండి. నెక్లెస్ కొనుక్కుంటాను. చాలా రోజులనుంచి మనసులో ఉన్న కోరిక అది" అభ్యర్థనగా అడిగాను.

"మొండిగా వాదించకు .ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు నెక్లెస్ ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు" కోపంగా అన్నారు మీరు.

చాలా ఏళ్ల తరువాత మూడోసారి కోప్పడ్డారు మీరు.

"మీకు ఎందుకు కోపం వస్తోందో నాకు అర్ధం కావడం లేదు. చాలా ఏళ్లకు ఒక కోరిక కోరితే మీకు కోపం వస్తోందా?" కాస్త ఆవేశంగానే అడిగాను నేను.

"అదే నేను చెప్తున్నాను.అంత హఠాత్తుగా నెక్లెస్ మీదకు మనసు వెళ్లిందెందుకో?" మీ మాటల్లో కాస్త వ్యంగ్యం కనపడింది.

ఏమీ మాట్లాడకుండా వంటిట్లోకి వెళ్ళిపోయాను నేను.

కాస్సేపటికి మీ ఫోన్ మ్రోగింది. అబ్బాయి ఫోన్ చేసినట్లు నాకు తెలుసు. ఫోన్ ముగించి కాస్త కోపంగా నా దగ్గరకు వచ్చారు మీరు. ఏమీ తెలీనట్లు ఉన్నాను నేను.

"అబ్బాయికేమన్నా ఫోన్ చేసావా?" అన్నారు.

"లేదే. మీకు ఫోన్ చేసినట్లున్నాడు. ఏం చెప్పాడు?" అమాయకంగా అడిగాను.

"తాను కొనాలనుకున్న మోడల్ బైకు స్టాక్ లేదట. మరో ఆరు నెలల వరకూ దొరకదని చెప్పాడు"

"అలాగైతే మీరు ఐ ఫోన్ కొనుక్కోండి. ఆరునెలల తరువాత సంగతి అప్పుడు చూసుకుందాం" అన్నాను.

"నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదు. అబ్బాయికి ఫోన్ చేసి బైక్ వాయిదా వేసుకొమ్మని చెప్పి ఉంటావు. పాపం ఎంత బాధ పడ్డాడో. ఈ విషయంలో మరీ మొండిగా తయారయ్యావు" అంటూ బాధ పడ్డారు మీరు.

"అవునండీ.ఎందుకో రాళ్ల నెక్లెస్ కొనుక్కోవాలని బలంగా ఉంది. డబ్బులు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యండి"

"ఎప్పుడూ లేనిది ఈ విషయంలో మంకు పట్టుతో సాధిస్తున్నావు" చికాగ్గా అన్నారు మీరు.

" మీరు ఏమైనా అనుకోండి.ముందు డబ్బులు నా అకౌంట్లో వెయ్యండి" వీలయినంత కటువుగానే చెప్పాను నేను.

మాట్లాడకుండా ఆఫీసుకు వెళ్లారు మీరు.

నిజానికి నాకు రాళ్ల నెక్లెస్ అవసరం లేదు.పెళ్ళైనప్పటి నుంచి చాలా నగలు చేయించారు.నెక్లెస్ సాకు చెప్పి డబ్బులు నా అకౌంట్ లో వేయించుకొని, మీకు ఐ ఫోన్ కొనాలన్నదే నా ఐడియా. కానీ మీరు ఆవులించకుండానే పేగులు లెక్క పెట్టే రకం కదా. నిజంగా నా కోసం నెక్లెస్ అడిగి వుంటే మీకు కోపం రాదు. ఆ సంగతి నాకూ తెలుసు. అయినా మీరు కోప్పడ్డారంటే మీకు విషయం అర్థం అయింది. నెక్లెస్ కోసం నాకు డబ్బులు ఇస్తే, ఐ ఫోన్ కొనేస్తాను. అందుకే నన్ను కోప్పడితే ఆ ప్రయత్నం మానేస్తాననీ, కొడుక్కి బైక్ కొనచ్చనీ మీ ప్లాన్.

ఆ మొండి పట్టుదలకే నాకు ఈరోజు కోపం వచ్చింది. రోజూ మీరు ఆఫీస్ నుండి వచ్చాక ఇద్దరం కలిసి వీధి చివరనున్న రామాలయానికి వెళ్తాము. ఓ గంట సేపు అక్కడ గడిపి వస్తాము. నేను రాకూడని రోజుల్లో మీరు కూడా గుడికి వెళ్లారు. మీరు ఆఫీస్ పని వల్ల బాగా ఆలస్యంగా వచ్చిన రోజు నేనూ గుడికి వెళ్ళను. ఇది కొన్ని ఏళ్లుగా జరుగుతున్న పధ్ధతి.

కానీ ఈ రోజు మాత్రం మీరు వచ్చే లోపలే నేను గుడికి వెళ్ళిపోతున్నాను. నా కోపం ఇలాగైనా చూపించనీయండి. మీరు నా వెనకే వచ్చినా ఎవరో తెలీనట్లు ఉంటాను. మీరు పలకరించినా బదులివ్వను. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి కోపం తగ్గితే మీతో మాట్లాడుతాను. అదీ మీరు కోరుకున్న ఐ ఫోన్ కొనుక్కోవడానికి ఒప్పుకుంటేనే .

ఈ వుత్తరం ఇంతటితో ముగించి ,మీకు కనిపించేలా ఉంచి, మీరు వచ్చేసరికి గుడికి ఒక్కతినే వెళ్లిపోదామనుకున్నాను. కానీ అంతలో మీ పైన జాలి. అలా చేస్తే మీరు ఎంత బాధ పడతారో !

మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అవతలి వారి వైపు నుంచి కూడా ఆలోచిస్తారు కదా. పోనీ ఈ సారికి నేను కూడా అలా ఆలోచించినా?

మీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. బైక్ వాయిదా వేసి ఐ ఫోన్ కొనుక్కోవడం. లేదా ఐ ఫోన్ వాయిదా వేసి బైక్ కొనివ్వడం. మీరు ఐ ఫోన్ వాయిదా వేసి బైక్ కొంటారని నాకు తెలుసు . అందుకే నెక్లెస్ ప్రస్తావన తెచ్చాను. ఇప్పుడు బైక్ వర్సెస్ నెక్లెస్. మీరు నా కోరిక కాదనలేరు.పైగా బైక్ ప్రస్తుతానికి వద్దని అబ్బాయి దగ్గర చెప్పించాను. ఇక నెక్లెస్ కోసం మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నా పని అయిపోయినట్లే.

ఇంతకీ నా అకౌంట్ లోకి డబ్బులు వేయించుకున్నా మీ సహాయం లేకుండా ఐ ఫోన్ కొనగలనా? ఒక పని చేస్తాను. నా ఫ్రెండ్ సుజాత వాళ్లకు పెద్ద మొబైల్ షో రూమ్ ఉంది. తనని అడిగితే అన్ని వివరాలూ చెబుతుంది. అనుకున్నదే తడవు సుజాతకు ఫోన్ చేశాను.

"మా వారు లేటెస్ట్ ఐ ఫోన్ కొనాలనుకుంటున్నారు. మీ దగ్గర కొత్త మోడల్ వచ్చిందా? ఆన్లైన్ లో దొరికే ధరకే ఇస్తారా? కాస్త మీ వారిని కనుక్కొని చెబుతావా?" ఆతృతగా అడిగాను.

"ఆయన్ను అడగనవసరం లేదు. నేను రోజూ షో రూమ్ కి వస్తున్నాను. కాబట్టి నాకు అన్ని వివరాలూ తెలుసు. లేటెస్ట్ మోడల్ మా దగ్గర ఉంది. అన్ని డిస్కౌంట్లు పోను ఆన్లైన్ లో ఏ ధరకు వస్తుందో, అదే ధరకు నీకు ఇస్తాను. సరేనా? మా షాపులో ‘ఈ ఎం ఐ’ లో చెల్లించే పద్దతి కూడా ఉంది. సులభంగా వాయిదాలలో తీర్చేయవచ్చు. ఇవన్నీ ఫోన్ లో ఎందుకుగానీ నేను ప్రస్తుతం షాప్ లోనే ఉన్నాను. వెంటనే ఇక్కడికి వచ్చెయ్యి. ఫోన్ సెలెక్ట్ చెయ్యవచ్చు." అంది సుజాత.

సుజాత నాకు చాలా మంచి స్నేహితురాలు. తీరా షాప్ కి వెళ్ళాక ఖచ్చితంగా కొనాల్సి వస్తుందేమో. డబ్బులు లేవని చెబితే వాయిదాల్లో ఇవ్వొచ్చంటుంది. ఆయన్ని పిలుచుకుని వచ్చి ఫైనల్ చేస్తానని చెబుతాను.

కంప్యూటర్ పక్కనే నోట్ పాడ్ లో మీరు సెలెక్ట్ చేసిన మోడల్ పేరు ,ఆన్లైన్ ధర నోట్ చేసి ఉంచారు మీరు. ఆ స్లిప్ ని హ్యాండ్ బాగ్ లో వేసుకొని సుజాత వాళ్ళ షాప్ కి బయలుదేరాను. ఈ వుత్తరం చూస్తే మీకు నా ఆలోచన తెలిసిపోతుంది. అందుకని దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ అరలో వుంచుతున్నాను. తరువాత తీరిగ్గా మీకు చూపిస్తాను.ఒక చిన్న స్లిప్ లో "నాకు కోపం వచ్చింది. గుడికి ఒక్కర్తినే వెళుతున్నాను. మీరు అక్కడకు వచ్చినా మాట్లాడను. కోపం తగ్గాక ఇంటికి వస్తాను" అని వ్రాసి మీకు కనపడేలా ఉంచుతున్నాను.”

ఉత్తరం ముగించి డ్రెస్సింగ్ టేబుల్ డ్రా లో ఉంచి, హ్యాండ్ బాగ్ తగిలించుకొని తన స్నేహితురాలు సుజాత షాప్ కి బయలుదేరింది కళ్యాణి.

***

ముందుగా భయపడ్డట్లే ఐ ఫోన్ ను ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకొమ్మని బలవంతం చేసి ప్యాక్ చేసి ఇచ్చింది సుజాత. ఆయన వద్దంటే తిరిగి ఇచ్చేస్తాననే షరతు మీద తీసుకుంది కళ్యాణి. అంత ఖరీదైన వస్తువు ఆయనకు తెలీకుండా కొనడం ఎంతో టెన్షన్ కలిగిస్తోంది. కానీ అలా చెయ్యక పోతే ఆయన ఎప్పటికీ ఫోన్ కొనడం వాయిదా వేసుకుంటూనే ఉంటారు. మొండి ధైర్యంతో ఇంట్లోకి అడుగు పెట్టింది కళ్యాణి.

హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న భర్త శ్రీనివాస్, కళ్యాణి ఇంట్లోకి రాగానే టి వి ఆఫ్ చేసి బెడ్ రూం లోకి వెళ్లి పడుకున్నాడు.మనసులోనే చిన్నగా నవ్వుకుంది కళ్యాణి.

'హమ్మయ్య! ఆయనకు కోపం రాలేదు. ఇది చిరు అలక మాత్రమే .తాను కాస్సేపాగి ఆయనను తన వైపుకి తిప్పుకొని బుజ్జగించాలి. డ్రెస్సింగ్ టేబుల్ డ్రా లో ఉంచిన లెటర్ దాచేయాలి.తరువాత చూపించ వచ్చు'"అనుకుంటూ డ్రా తెరిచింది.

లెటర్ అక్కడే ఉంది. మనసులోని టెన్షన్ తగ్గి రిలీఫ్ ఫీలయింది కళ్యాణి. లెటర్ వైపు యధాలాపంగా చూసిన కల్యాణికి దస్తూరి వేరుగా కనిపించడంతో ఒకసారి కళ్ళద్దాలు తీసి తుడుచుకొని మళ్ళీ చూసింది.

'ప్రియమైన శ్రీమతికి' అని వుంది. అది శ్రీనివాస్ దస్తూరి.

వణుకుతున్న చేతులతో ఉత్తరం అందుకొని హాల్లోకి వచ్చి చదవసాగింది.

"ప్రియమైన శ్రీమతికి,

గుడికి వెళ్తున్నానంటూ నువ్వు పెట్టిన స్లిప్, మూడు సార్లు నేను నిన్ను కోప్పడ్డానంటూ నువ్వు నన్ను పొగుడుతూ వ్రాసిన ఉత్తరం రెండూ చదివాను.

ఆ ఉత్తరం ఎవరు చదివినా నా గురించి గొప్పగానే అనుకుంటారు. ముప్పై ఏళ్లలో మూడు సార్లే కోప్పడ్డానంటే నేను చాలా సర్దుబాటు స్వభావం కలవాడిననుకుంటారు. కానీ నిజం నాకే తెలుసు. ముప్పై ఏళ్లుగా నాకు చిన్న కోపం కూడా రాకుండా చూసుకోవడం నిజంగా నీ గొప్పదనమే. .ఇందులో నా గొప్పేముంది? ఇందులో నాకెలాంటి సందేహం లేదు. ఇక ఈ ముప్పై ఏళ్లలో నువ్వు నన్ను కోప్పడ్డ సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. సరదాకు చెప్పడం లేదు. నిజంగానే ఎంత గుర్తు చేసుకుందామన్నా నాకు గుర్తుకు రావడం లేదు.

ఇంతలా నా గురించి ఆలోచించే నువ్వు భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టమే.

ఇక రాళ్ల నెక్లెస్ విషయం. ఈ ముప్పై ఏళ్లలో ఏ రోజు నువ్వు నగల ప్రస్తావన తెచ్చావని, ఈ రోజు నువ్వు నెక్లెస్ కావాలని అడగగానే నేను నిజమని నమ్మడానికి? ఎప్పుడైనా నా అంతట నేను వీలునుబట్టి కొనివ్వడమే గానీ నగల ధ్యాసే లేదు నీకు. మరి అంత ఖచ్చితంగా అడుగుతుంటే నా కోసమేనని ఎందుకు తెలుసుకోలేననుకున్నావు? కాస్త గట్టిగా మాట్లాడితేగాని ఆ ప్రస్తావన ఆపవు. నా మూడోసారి కోపానికి కారణం అదే.

అంతేకానీ నీకు నగ కొనివ్వడం ఇష్టం లేక కాదు. నువ్వు ఏ ఉద్దేశంతో అడిగినా నాకు సరైన సమయంలో సరిగ్గా గుర్తు చేసావు. ఈ మధ్య పిల్లల చదువుల విషయంలో పడి నీ గురించి ఆలోచించడం బొత్తిగా మానేసాను. ఎన్ని ఏళ్ళయిందో నీకు ఒక నగ కొని? జువెల్లరీ షాప్ లో రెండేళ్లుగా గోల్డ్ సేవింగ్ స్కీం లో డబ్బులు కడుతున్నాను. ఈ రోజే వెళ్లి మిగిలిన డబ్బులు కట్టి నువ్వు కోరుకున్న రాళ్ల నెక్లెస్ తెచ్చాను. నన్నంటావు కానీ ముందుగా చెబితే నువ్వు ఒప్పుకుంటావా? నా ఫోన్ గురించో అబ్బాయి బైక్ గురించో ఆలోచిస్తావు గానీ. ఇక అబ్బాయి బైక్ గురించి కూడా విచారించాను. సున్నా వడ్డీతో ఫైనాన్స్ దొరుకుతుందట. అబ్బాయితో మాట్లాడి బుక్ చేసేశాను .

నీకు కోపం లేదని నాకు తెలుసు. ఏ కాస్తైనా కోపం వుంటే నన్ను క్షమించేసి దగ్గరికి వచ్చెయ్యి. బెట్టు చెయ్యకు. నా ఉత్తరం రెండోసారి చదవాలనిపిస్తే తరువాత తీరిగ్గా చదుకోవచ్చు. ఆలస్యం చెయ్యకుండా వచ్చెయ్."

ఉత్తరం చదవడం ముగించి బెడ్ మీదకు దూకింది కళ్యాణి. శ్రీనివాస్ ను తన వైపుకు తిప్పుకొని ముద్దులతో ముంచెత్తింది.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి
















1 view0 comments
bottom of page