top of page

ఆ గేటు తెరిచే ఉంది


'Aa Gate Teriche Undi' New Telugu Story

ఆ గేటు తెరిచే ఉంది తెలుగు కథ


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

నేను పార్క్ లోకి అడుగుపెట్టి వంద గజాలు నడవకముందే కనబడింది ఎడమప్రక్కన ఆ గేటు.

ఒక్క క్షణం ఆగి చూసాను. ఆ గేట్ తాళం తీయబడి ఆ పక్కనుంచి కూడా జనాలు లోపలకి రావడానికి వీలుగా తెరవబడి ఉంది.

********

"అబ్బబ్బబ్బ. ఎంతసేపు కదలకుండా అలా తిరగలిరాయిలా ఎలా కూర్చోగలరండి ఆ కుర్చీలో.. పనికిమాలి రాతలు మీరునూ. ఇవాళనుంచి పార్కుకెళ్ళి చెమట్లు పట్టిన శరీరంతో ఇంటికి వస్తేనే తిండి పెడతాను. ‘అదేంటమ్మా.. మీ ఆయనని మరీ కుందెరోలులా పెంచేస్తున్నావ్?’ అని బావ గారు కూడా తిట్టారు నన్ను. ఇంట్లోంచి కదులుతారా? వీధి ఎక్కి అరవనా? " అన్న మా ఆవిడ మీనాక్షి రామాద్రి.. చేసినా అన్నంతపని చేస్తుంది అన్న భయంతో 105 కేజీల శరీరాన్ని పార్కులో నడక మార్గం మీద ఐదు రౌండ్లు పూర్తి చేసి చెట్టు కింద వేసి ఉన్న ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాను.


నా ఎదురుగా బెంచీ మీద కూర్చున్న ఒక ఆవిడ "చూశారా.. ఆ పిల్లలు కాలేజీ ఎక్కొట్టి ఒకళ్ళ మీద ఒకరు పడి ఎలా సరసాలు ఆడుకుంటున్నారో.." అని నాతో చెప్పి

"ఏయ్ పిల్లలు? ఆర్ యు హేవింగ్ కామనసెన్స్ టు బిహేవ్ లైక్ దట్? కాలేజీ మానేసి ఇలా పార్కు వచ్చి పదిమంది ఉన్నారు అని కూడా లేకుండా సిగ్గు బిడియం వదిలేసి అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి సరసాలు ఆడుకోవడం ఏమిటి? మగపిల్లలకు బుద్ధి లేకపోతే ఆడపిల్లలు మీకైనా బుద్ధి లేదటమ్మా?.. గివ్ మీ యువర్ పేరెంట్స్ నెంబర్.. ఐ కెన్ కాల్ దెమ్" అని ఒక్కఅరుపు అరుపుచేసరికి ఆ పిల్లలందరూ వెంటనే సర్దుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ పార్కు గేట్లోంచి బయటికి వెళ్లిపోయి మాయమైపోయారు.


" రోజులు అలాఉన్నాయి మేడం. ఎవరిని మనం అనే పరిస్థితి కాదు." అన్నాను నేను.


"మన కళ్ళ ముందు పిల్లలు తప్పుచేస్తుంటే చెప్పకపోతే మనమెందుకు.. మన పెద్దరికం ఎందుకు? అది సరే..మీ పేరు?'" అంది ఆమె.


''చంద్రగుప్త.''


''మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో ఎవరినో చూసిన పోలికలు కనిపిస్తున్నాయి. రామచంద్రగుప్తగారు మీకు తెలుసా?''


''ఆయన మా నాన్నగారు. విశ్రాంత అకౌంట్స్ ఆఫీసర్.ఈ పార్క్ కు ఎదురుగా అవతలి ప్రధానరోడ్డులో అపార్ట్మెంట్ లో ఉంటున్నాం.''


'' అయితే రచయిత 'చంద్రగుప్త' మీరేనా?'' ఆవిడ ఆశ్చర్యపోతూ అడిగింది.


''అవునండీ..మీకెలా తెలుసు?''


''మీ నాన్నగారు అప్పట్లో మీతమ్ముడి దగ్గర ఉండేవారుగా.. మీ తమ్ముడిగారి అపార్ట్మెంట్ ముందు ఫ్లాట్ మా నాన్నగారిది. మీరు మంచి రచయిత అని మీనాన్నగారు మీ కథల సంపుటిని మానాన్నగారికిచ్చారు. నాకు చదవడం అంటే పిచ్చి. ఎలాంటి పుస్తకమేనా చదివేస్తాను. మీ పుస్తకం ఆరోజే చదివేసాను.మా నాన్నగారు ఆ ఫ్లాట్ నాకు రాసిచ్చారు. అది రాసిచ్చిన నాలుగునెలలకే ఆయన పోయారు. ఆ తర్వాత అది అమ్మేసి ఈపార్కుకు ఆ పక్క ఉత్తరం గేటు కనిపిస్తోంది చూసారుగా.. ఆ గేటు ఎదురుగా ఫ్లాట్ తీసుకున్నా. ప్రస్తుతం అందులో ఉంటున్నా. '' అంది ఆవిడ గుక్క తిప్పుకోకుండా.


''అంటే.. మీరు భాగమతి గారా..?ఆవిడ పేరుమీదేగా ఈ నగరం ఏర్పడింది..భాగ్యనగరం అని..'' నవ్వుతూ అన్నాను.


''హ.హ.హ..నాకంత సీన్ లేదులెండి. మా నాన్నగారు ఈ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. ఆ భాగమతి అన్న పేరు ఆయనకి ఎంతో ఇష్టం అని నాకు పెట్టారు. నోరు తిరక్క అందరూ నన్ను ''భానుమతి'' అని పిలుస్తుంటారు." చెప్పిందావిడ.


''అది సరే గానీ..ముందు మీ సెల్ నెంబర్ ఇవ్వండి.'' అని నా సెల్ నెంబర్ తీసుకుని వెంటనే నాకు మిస్సెడ్ కాల్ ఇచ్చి 'అదే నా నెంబర్..ఫీడ్ చేసుకోండి.'' అని చెప్పింది. నేను వెంటనే ఆమె కాంటాక్ట్ సేవ్ చేసుకున్నాను.


''అమ్మయ్య..ఇక నాకు మంచి కాలక్షేపం. మీరు రాసే ప్రతీ కధ ఇక నుంచి నాకు పంపాలి మీరు. నా దగ్గర ఉన్న పుస్తకం కాకుండా ఇంకేమన్నా రాశారా మీరు?'' అని అడిగింది ఆసక్తి గా.


''రాసానండి.. రేపు వచ్చినప్పుడు తెస్తాను. మొదటిసారిగా ఒక నవల రాసాను. ప్రచురణ కూడా అయింది. ఆవిష్కరణ చేయాలి.'' అన్నాను.


''అలాగా'' అన్న ఆమె దబ్ మని శబ్దం వినిపించిన వైపు చూసింది. అప్పటివరకు నెమ్మదిగా బాల నడక నడుస్తున్న ఒక పెద్దాయన ఏదో గోతిలో కాలు వేసిన వాడిలా దబ్బున ముందుకు తూలి పడిపోయాడు.


సన్నగా రివటలా ఉన్న భాగమతి రెండు అంగలలో అతని దగ్గరకి చేరి ఆయన్ని లేపబోయింది. ఆయన నాకన్నా భారీకాయం కలిగిఉన్నాడు. అంతలో షటిల్ ఆడుతున్న కుర్రాళ్ళు మెరుపులా వచ్చి ఆయన్ని లేపారు. వెనకాల నడుస్తున్న స్త్రీలు పురుషులు కూడా వచ్చి చుట్టూ చేరారు. బాగుండదని నేను వెళ్లాను. ఆయనది బట్టతల. నుదురు నేలకు కొట్టుకుని రక్తం వస్తోంది. అది చూసిన భాగమతి చీరకొంగును ఆయన గాయానికి నొక్కిపట్టి అంది.ఇంతలో దూరంగాపడిన ఆయన సెల్ ను ఎవరో పట్టుకొచ్చి భాగమతికి ఇచ్చారు.


''బాబు..రక్తం బాగా వస్తోంది. ఎవరైనా కారు వేసుకువచ్చారా?'' కళ్ళమ్మట వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ అరిచింది ఆవిడ..


''నేను వేసుకొచ్చాను మేడం.'' అన్నాడు షటిల్ ఆడుతున్న రెండో అబ్బాయి.


అంతలోనే షటిల్ ఆడుతున్న కుర్రాళ్ళలో ఒక అతను ప్రాధమిక చికిత్స చేసే కిట్ తో వచ్చి..ఆయన తలకి కారుతున్న రక్తాన్ని వాటర్ బాటిల్ లోని నీళ్ళతో తుడిచి టించెర్ వేసి గాజుగుడ్డ కట్టాడు.


''బాబు..సమయానికి దేవుడిలా వచ్చి కాపాడారు. ఎందుకైనా మంచిది పెద్దవయసు ఆయనకదా.. తలలో ఏ నరం స్థానభ్రంశం చెందినా ప్రమాదం. వెంటనే మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి.''


''మా సారూ..మేము తీసుకెళ్తాం. మీరు కంగారు పడకండి మేడం. పి.డి. సర్ పదండి.. కొంచం సాయం పట్టండయ్యా..'' అని కారు కీస్ తీసుకున్న కుర్రాడు వేగంగా వెళ్లి పార్క్ గెట్ బయట ఉన్న కారుని రివర్స్ చేసి దారిలో పెట్టాడు.


నలుగురు కుర్రాళ్ళు సాయం చేసి పెద్దాయన్ని కారులో వెనకసీట్లో పడుకోబెట్టారు.


''బాబు నేనూ..వస్తాను.'' అందావిడ కళ్ళు తుడుచుకుంటూ.


''మీరు ఎమోషనల్ అయితే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మేము తీసుకువెళ్లి డాక్టర్ గారికి చూపించి వాళ్ళ ఇంటికి ఫోన్స్ చేసి విషయం చెప్పి ఇంటిదగ్గర దిగవిడిచి వస్తాం మేడం.'' అని చెప్పి ఆ పి.డి.సార్ కారులో ఆయన తలను ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు.


''ఆయన సెల్ ఇదిగో బాబు. డిస్ - ప్లే పగిలింది పాపం. జాగ్రత్త.'' అని అతనికి అందించింది.


కారు కదిలి సందు మలుపు తిరిగి వెళ్ళిపోయింది.


నేను నెమ్మదిగా కదిలి వచ్చి మళ్ళీ సిమెంట్ బెంచ్ లో కూర్చున్నాను. ఆవిడ వెనకాలే వచ్చి కూర్చుంటూ దాదాపు అరిచినట్టుగానే కోపంగా అంది.


''అంత పెద్దాయన పడిపోయి రక్తం కారుతుంటే వెంటనే పరిగెట్టుకుని రారేమీ? ఆయన్ని నేను రెక్కపుచ్చుకుని లేపలేకపోతుంటే..''


''నాదీ భారీ కాయమేకదా మేడం. చటుక్కున కదల్లేకపోయాను.''అన్నాను ఏం మాట్లాడాలో తెలియక.


''మీరు ఎన్నైనా చెప్పండి. మీ రచయితలకి రాయడంలో ఉన్న చురుకుదనం సహాయం చెయ్యడంలో ఉండదు. ఈ సంఘటనని చూసి స్పందిచేసి కధరాసేసి ఆ పారితోషకం జేబులో వేసేసుకుంటారు. కానీ చటుక్కున మనిషి సాయానికి రారు.''అనేసింది ముక్కుచీదుతూ.


నా ముఖం మాడిందని గ్రహించిన ఆమె చనువుగా నామీద చేయి వేసి ''అయ్యో..హర్ట్ అయ్యారా..సారీఅండి. నాకు పరిచయమైన రచయితలూ చాలామందే ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి అన్నాను. ఏమీ అనుకోకండి. మీకు అభ్యంతరం లేకపోతే నాతో ఓసారి వస్తారా? ఈ పార్క్ కమిటీ ప్రసిడెంట్ గారిల్లు పక్క వీధిలోనే..ఓ సారి వెళ్లివద్దాం.'' అందామె నిలబడి చీరకొంగుకు ఉన్న రక్తం మరకలను చూసుకుంటూ.


''అలాగే..పదండి.'' అని ఆమెను అనుసరించాను.


************


ఆయన స్నానం చేసి పూజ ముగించాడు కాబోలు.. విలాసంగా పేపరు చూస్తున్నాడు.


''అయ్యా. నాపేరు భాగమతి. నేను సంఘ సంస్కర్తను కాను. కానీ పదిమందికి ఉపయోగపడే పబ్లిక్ స్థలాలలో కనీసం ఉండాల్సిన వసతులు లేకపోతే వాటికి ఒక కమిటీ ఎందుకు..ఆ పదవులు ఎందుకు చెప్పండి?'' తడి పుల్లల్ని కూడా ఫట్ మని విరిచి పొయిలో పెట్టి వాటిని కూడా మండించగల ఆమె సమర్ధతకు నీళ్ళు నమిలాను.


''ఏమిటమ్మా? ఎవరునువ్వు? పొద్దున్నే నా ఇంటికి ఎవరో 'వస్తాదు'ని వేసుకొచ్చి దెబ్బలాడుతున్నావ్..అసలేం కావాలి నీకు?'' ఆయన శాంతానికి నీళ్ళు వదిలి రయ్యిన లేవబోయాడు.


ఆయన కూర్చున్న సోఫాకు పక్కనే ఉన్న ఒక కుర్చీలో నన్ను ''కూర్చోండి'' అనిచెప్పి ఆవిడకూడా మరోకుర్చీలో స్థిరంగా కూర్చుని అడిగింది.


''చూడండి బాబాయ్ గారు. నాలుగు నెలలక్రితం వరకు పక్క కాలనీలో ఉండేవాళ్ళం. మూడు నెలలక్రితం పార్కుకి ఉత్తరంగా ఉన్న గేటుకు సరిగ్గా ఎదురుగా ఉన్న భాగ్యనగర్ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో కొనుక్కుని వచ్చేసాం. ఇల్లు సర్దు కోవడానికి రెండు నెలలు పట్టింది. నెల రోజుల నుంచి పార్కుకు వాకింగ్ కి వద్దామని ప్రయత్నంచేసి వారంరోజులక్రితం మొదలుపెట్టాను.

ఇక అసలు విషయం. ఇలా కాలనీల మధ్య ప్రభుత్వం పార్కులు కట్టించడం వల్ల ప్రయోజనం ఏమిటో మీరు చెప్తే తెలుసుకుందాం అని వచ్చాను."


అప్పటికే ఆమె ఏమిటో ఆయనకు అర్థమైనట్టుంది కొద్దిగా.

"ఇద్దరూ తెలియని విషయం ఉందమ్మా. ప్రజలకి ఆరోగ్యం ప్రసాదించడానికి, ఆహ్లాదం కలిగించడానికీను" తనకు తెలుసు అన్నట్టే నాకేసి గర్వంగా చూసాడు.


"మీ కమిటీ ఎన్నుకోబడి రెండు సంవత్సరాలు అయింది. మీ అధ్యక్షుడుగా వచ్చిన తర్వాత ప్రజోయోగం కోసం పార్కుకు మీరు, మీ కమిటీ ఏమేం పనులు చేయించారో వినాలని ఉంది."


"ఏం చేయించావ్ అంటే.. ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని, పార్కులో మొక్కలు ఎక్కువగా పెంచాలని, వాకింగ్ ట్రాక్ ఎత్తుపల్లాలు లేకుండా ఒకే లెవెల్ లో ఉండేలా సిమెంట్ చేయించాలని"..


"ఇవన్నీ చేయించేసారా సార్?"


"లేదండి ప్రపోజల్స్ పంపించాము. మన కార్పొరేటర్ గారు ఒక పార్టీ, మనం మేయర్ గా ఒక పార్టీ అవ్వడంతో.. కొంచెం లేట్ అవుతోంది. లేకపోతే ఈపాటికి.. చేసేసేవారే"


"చూడండి సార్. ప్రధానంగా మూడు అత్యవసరమైన సమస్యలు మీకు ముందు పెట్టడానికి నేను వచ్చాను. మొదటిది పార్క్ కి ఉత్తరంవైపున ఒకే ఒక గేటు ఉంది. ఆ గేటు పార్కు వేళల్లో తెరిపించి ఉంచాలి.


రెండవది పార్కు ఎత్తు పెంచడానికి సిమెంటు ఇటుకలు వాడే కన్నా మూడు అడుగుల ఐరన్ ఫెన్సింగ్ తో ఎత్తు పెంచితే లోపల జరిగేది బయటికి తెలుస్తుంది.లోపలవాళ్లకి గాలేస్తుంది. ఇక మూడోది వాకింగ్ ట్రాకు ఎత్తుపల్లాలుగా ఉండి సిమెంట్ లేచిపోయి గోతులు పడడం వల్ల, కాళ్లు నొప్పులు ఉన్న ముసలి వారు ఎంత చూసుకుని అడుగు వేసినా ఆ గోతుల్లో పడిపోయి ఈవయసులో హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ సమస్యల గురించి నేనే మీకమిటీకి వినతిపత్రం రాసి అందజేస్తాను. అవే కాపీలు, మన కార్పొరేటర్ గారికి, మన మేయర్ గారికి, మన పార్టీకి సంబంధించిన ప్రధాన వ్యక్తులకి అందరికీ, పత్రికా విలేకరులకు అందజేస్తాను. పని జరగకపోతే నేనే ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి పరిస్థితి వివరిస్తాను. ఈ విషయంలో మీరు ఎంత సత్వరచర్యలు తీసుకుంటే అంతమంచిది అని మీకు విన్నవించుకోవడం కోసం వచ్చాను. రేపు మళ్లీ వినతి పత్రాలతో వస్తాను సార్.


అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఇందాక ఒక పెద్దాయన గోతిలోపడి తల నుదురు కొట్టుకుని విపరీతమైన రక్తస్రావం అయింది. ఆయనకు అక్కడ ఉన్న సోదరులు ప్రధమచికిత్స చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఇదిగో అందుకు సాక్ష్యం" అంటూ రక్తపు మరకలు ఉన్న చీరకొంగు చూపించింది. "దీనిని ఫోటోలు తీసి ఆ కాపీలుకూడా పెడతాను సార్. కచ్చితంగా మన పార్కుకి మంచి రోజులు వచ్చేలా మీ వంతు కృషి మీరు చేయాలి. వెళ్ళొస్తాను సార్. రండి మాస్టారు" అని ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండా ముందుకు నడిచింది. విధి లేక అనుసరించా నేను. గడప దాటి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన నాకు అప్పటివరకు కంటి చూపు నోట మాటలు లేని ఆయన " ఈమె నా ఫోన్ ఎక్కడ ఉంది అర్జెంటుగా పెట్టరా " అని అరవడం కనిపించింది నాకు.


******

ఎండిపోయిన వెదురుగడకు అందమైన ఇస్త్రీ బట్టలు కట్టి, నీట్ గా బాబ్డ్ హెయిర్ చేయించి, వేటాడేందుకు సిద్ధంగా ఉన్న చూపులతో నుదుట చిన్న స్టిక్కర్ బొట్టుతో, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండి, అవసరం వచ్చినప్పుడు రామబాణంలాంటి మాటలు వాడే భాగమతి అంటే నాకు ఎంతో గౌరవం ఏర్పడింది.


ఆమె అన్నట్టుగానే వినతి పత్రాలు తయారు చేసి, కాలనీలో ఉండేటువంటి తనకు తెలిసిన అందరిలకు వెళ్లి సంతకాలు సేకరించి, వాటి కాపీలను స్వయంగా తాను ఎవరైతే కలుస్తాను అని పెద్దాయనకి చెప్పిందో వారందరికీ అందజేసిన ధీరోదాత్తురాలు ఆమె.


" ఈ పనుల అయ్యేంతవరకు మీరు నా వెనకాల ఒక సోదరునిలా నాకు సహాయం చేయాలి. ఈ సమస్యల విషయంలో ఇప్పుడైనా కదలగలరా లేదా?మీకు ఇబ్బంది అయితే చెప్పండి. మొహమాటం వద్దు. " అని అడిగేసింది నన్ను.


ఆమె వెనకాల ఉండడంవల్లే అన్ని విషయాలు నాకు తెలుసాయి.

******


దాదాపు నెలరోజుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.

కమిటీలో ఆమెను కూడా ఒక సలహాదారుగా చేర్చారు. మరో వారం రోజుల్లోనే పనులు ప్రారంభమయ్యాయి. కాంపౌండ్ గోడకు ముందు రైలింగ్ గొట్టాలు వెల్డింగ్ చేసి వాటికి 3అడుగుల ఐరన్ ఫ్రేమ్ కట్టించారు. ఇక ఎటువంటి 'కుక్కలు' లోపలికి వచ్చే అవకాశం లేదు.

వాకింగ్ ట్రాక్ అంతటిని ఒకే లెవెల్ లో పునర్నిర్మించారు.


ఆ ఉత్తరంవైపు గేటు తీసిఉంచడం అనేటువంటి విషయం మీద తర్జనభజన జరిగింది.

దానికి ఆమె చెప్పిన సమాధానం అధికారుల నోరు మూయించింది.

కళాశాలకి బంక్ కొట్టి యువతీ యువకులు పార్కులో చేస్తున్న కార్యకలాపాలను చిత్రించిన వీడియో వారందరికీ చేరడంతో ఆ ఉత్తరంవైపు గేటు పార్కుసమయాల్లో తెరిచిఉంచవలసిన ఆవశ్యకత గుర్తించబడింది. వాచ్ మెన్ తెరిచి ఉంచుతున్నాడు కూడా.


రోజూ వాకింగ్ కు ఆ గేట్లోంచి వస్తూనే నన్ను నవ్వుతూ పలకరించే భాగమతి "మీ పుస్తకాలు నాకు ఇవ్వనే లేదు. ఇక ఇవ్వరేమో" అంది ఆరోజు.


" ఇంతకాలం మీ వెనకే పనుల్లో తిరిగాను కదమ్మా. వాటిసంగతే మర్చిపోయాను.రేపు మీ ఇంటికి పట్టుకొచ్చిఇచ్చే పూచీ నాది " అన్నాను.


" అయితే రేపు తప్పకుండా మొదటిసారి మాఇంటికి వస్తున్నారన్నమాట."


"నూరుశాతం" అన్నాను నేను.


******


ఇంటికి వచ్చాక ఆమెకి ఇద్దాం అనుకున్న పుస్తకాలన్ని తీసి సిద్ధం చేసాను.


తెల్లవారుజామున లేచి కాఫీ కూడా తాగకుండా అప్పటికే తెరిచిన పార్కు ఉత్తరంగేట్లోంచి వాళ్ళఇంట్లోకి అడుగుపెట్టాను.

హాల్లో ప్రశాంతంగా నిద్రపోతోంది ఆమె - గుండెలమీద చేతులు పెట్టుకుని.


ఐస్ బాక్స్ లో!


"బాబు.." అని పిలిచాను. కళ్ళు మసకబారుతున్నాయి. కొడుకు కాబోలు వచ్చాడు.


"తెల్లవారుఝామున రెండు, నాలుగు గంటల మధ్య.. నిద్రలోనే..మీరు..?"


''చూడు బాబు..మీకు తెలియదనుకుంటా..ఆమె తల వెనుక ఒక స్టూలు ఏర్పాటుచేసి ఒక ప్రమిదలో దీపం మీ శ్రీమతి చేత వెలిగింపచేసి నిశ్చలంగా వెలిగేలా పెట్టు. ఏ విష్ణు సహస్రనామమో ఫోన్ లో తక్కువ శబ్దంలో పెట్టు. '' అని చెప్పి నా పుస్తకాలు ఆమె చుట్టూ దండలా అమర్చి నివాళులు అర్పించి మౌనశిఖరంలా వెనుతిరిగాను.


సమాప్తం


కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు


తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

*చివరగా నా అభిప్రాయం :*

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్


57 views0 comments

Comentários


bottom of page