'Nerasthudu' New Telugu Story
Written By Gannavarapu Narasimha Murthy
నేరస్తుడు తెలుగు కథ
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆరోజు ఇనస్పెక్టర్ శివరాం స్టేషన్‌కి రాగానే రైటర్ అప్పారావు అతని దగ్గరికి వచ్చి "సార్! రావిపిల్లి ఊళ్ళో బిటెక్ చదువుతున్న మధు అనే కుర్రవాణ్ణి ఇంకో విద్యార్థి హత్య చేసాడనీ ఆ ఊరి సర్పంచ్ సన్యాసి ఇందాక వచ్చి ఫిర్యాదు చేసాడు" అంటూ ఫిర్యాదు కాగితాన్ని అతనికిచ్చాడు.
శివరాం దాన్ని చదివి "రైటర్ గారూ! నేను, కానిస్టేబుల్ రాజు ఆ ఊరు వెళతాము" అని చెప్పి బయటకు వచ్చి మోటార్ సైకిల్ని స్టార్ట్ చేసాడు. ఆ పక్క గదిలో కూర్చున్న రాజు పరుగున వచ్చి బైకు వెనక కూర్చోగానే అది దూసుకు పోయింది.
శివరాం రావిపిల్లి చేరుకునేసరికి పంచాయితీ ఆఫీసు దగ్గర సర్పంచ్‌తో సహా చాలామంది అతని కోసం ఎదురు చూస్తూ కనిపించారు.
వెంటనే శివరాం వాళ్ళతో కలిసి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ఊరి పొలిమేరలో ఉన్న మామిడితోపులోని ఓ చెట్టుకింద ఒక యువకుడి శవం కనిపించింది. అతని మెడ మీద, తలమీద, ముఖం మీద కత్తి పోట్లు కనిపించాయి.
ముఖం నిండా రక్తపు మరకలు... బట్టలు రక్తంతో ఎర్రగా మారిపోయాయి.
"సర్పంచ్ గారూ! ఎవరీ అబ్బాయి? ఎవరు ఇతన్ని హత్య చేసారు?" అని సర్పంచ్ సన్యాసిని అడిగాడు శివరాం.
"ఎస్సైగారు! వీడు మా ఊళ్ళో పనిచేస్తున్న లెక్కల మాస్టారు రామారావు గారి అబ్బాయి.పేరు మధు ; వీడు పట్నంలో బీటెక్ ఫైనల్ చదువుతునాడు. మొన్న పండుగ శలవులకనీ వచ్చాడు. నిన్న రాత్రి ఇతన్ని ఎవరో హత్య చేసారు... అతన్ని ఎవరు హత్య చేసారో నాకు తెలియదు. ఉదయాన్నే నాకీ విషయం తెలియగానే మీకు ఫిర్యాదు చేసాను... ఈ అబ్బాయి తండ్రి రామారావు ఇక్కడే ఉన్నారు; మీతో అతను మాట్లాడుతాడట" అని రామారావుని చూపించాడు సర్పంచ్ సన్యాసి.
వెంటనే రామారావు శివరాం దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టాడు.
"మాస్టారుగారూ!ఈ హత్యకు గురైన అబ్బాయి మీకేం అవుతాడు" అని అడిగాడు శివరాం...
"వీడు మా అబ్బాయే సార్! పేరు మధు... విశాఖపట్నంలో బీటెక్ చదువుతునాడు. శలవులని మొన్న వాడు, వాడి స్నేహితుడు నాగరాజు కలిసి వచ్చారు. మూడు రోజులు ఇద్దరూ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ తిరిగారు. నిన్న రాత్రి వాళ్ళిద్దరూ ఏటివైపు వెళతామని చెప్పారు. రాత్రి 12 అయినా రాకపోయే సరికి నాకు అనుమానం వచ్చి మా రైతుతో కలిసి వెతికితే ఈ తోటలో వీడి శవం కనిపించింది. వీడితో వచ్చిన నాగరాజు కనిపించలేదు..." అని చెప్పాడు.
"అంటే ఆ నాగరాజే మీ వాడిని చంపి పారిపోయాడంటారా?" అని అడిగాడు ఎస్సై శివరాం.
"వాడే బాబూ! అందులో సందేహం లేదు. ఇద్దరూ కలిసి వెళ్ళారు... మావాడు ఇక్కడ చనిపోయి ఉన్నాడు. నాగరాజు కనిపించటం లేదు అంటే వాడే చంపేసి పారిపోయాడు. మీరు వాడిని తక్షణం అరెస్ట్ చేస్తే నిజం తెలుస్తుంది" కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు రామారావు. అప్పటికే అతని కళ్ళ నిండా నీళ్ళు... కొడుకు చనిపోయాడన్న దుఖం అతనికి ఏడుపు రూపంలో బయటకు వస్తూ కనిపిస్తోంది.
ఆ తరువాత వారం రోజుల్లో ఆ కేసు ఒక కొలిక్కి వచ్చింది. శివరాం కేసు రిజిస్టర్ చేసి శవానికి పోస్ట్ మార్టెమ్ చేయించాడు. ఆ తరువాత నాగరాజు కోసం నలుగురు పోలీసులను కాలేజీకి, వాళ్ళ ఊరుకి పంపించాడు. మధు సెల్‌ఫోన్‌లో దొరికిన నాగరాజు నెంబరు ద్వారా నాగరాజు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టారు. మూడు రోజుల తరువాత వాడు చెన్నయ్ వెళ్ళిపోతుండగా రైల్లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.
ఆ తరువాత వాడిని ఇంటరాగేషన్ చేస్తే విషయాలన్నీ బయట పడ్డాయి. నాగరాజు, మధు ఇద్దరూ స్నేహితులు... కలిసి ఇంజనీరింగ్ చదువుతునారు. వాళ్ళతో పాటు ఇంటర్ చదివిన జమున అనే అమ్మాయిని నాగరాజు ప్రేమించాడు. కానీ మధు కూడా ఆ అమ్మాయినే ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఇద్దరితో ప్రేమని నటించింది. ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఇద్దరికీ తెలియదు... నాగరాజుతో స్నేహం వల్ల మధుకి చెడు వ్యసనాలు అలవాటయ్యాయి. సిగరెట్లు, మద్యం కలిసి తాగడం మొదలు పెట్టారు...
సంవత్సరం నుంచి గంజాయికి బాగా అలవాటుపడ్డారు. ఆ మత్తులో ఒకసారి మధు తను జమునని ప్రేమిస్తున్నట్లు నాగరాజుతో చెప్పేసాడు. దాంతో నాగరాజులో అసూయ ప్రవేశించింది.
మధు ప్రేమ విషయాన్ని జమునకు చెప్పి "అది నిజమేనా?" అని ఆమెను ప్రశ్నించాడు. ఆమె నాగరాజుతో "మీ ఇద్దరూ నన్ను ప్రేమిస్తున్నారు. నాకేం చెయ్యాలో తోచటం లేదు. ఇద్దర్లో ఎవ్వర్నీ కాదనలేను. కాబట్టి నేను ఎవరికి కావాలో మీరే నిర్ణయించుకోండి" అని చెప్పి వెళ్ళిపోయింది.
అప్పట్నుంచీ నాగరాజు మధుమీద కోపంతో రగిలిపోసాగాడు. మధుని అడ్డు తొలగిస్తే కానీ తనకు జమున దక్కదన్న అభిప్రాయానికి వచ్చి మధుని చంపాలని నిర్ణయించు కున్నాడు. ఆ సమయంలో ఉగాది శలవులు రావడంతో మధుతో కలిసి అతని ఊరు వెళ్ళాడు. అక్కడ ఓ సాయంత్రం అతనికి బాగా గంజాయి పట్టించి క్రూరంగా కత్తితో నరికి చంపేసాడు.
నాగరాజు తను మధుని చంపినట్లు అంగీకరించి వాఙ్మూలం ఇచ్చాడు.
పోలీసులు నాగరాజుని కోర్టులో హాజరు పరిచి పై వివరాలతో ఛార్జి షీట్‌ని దాఖలు చేసారు...
నాలుగు నెలల తరువాత కేసులో వాదనలు మొదలయ్యాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగరాజు ఏవిధంగా మధుని చంపాడో సాక్ష్యాలతో సహా మెజిస్ట్రేట్ గారికి విపులంగా చెప్పాడు. సాక్ష్యాలుగా ఫోన్‌లో కాల్ లిస్టు, జమున వాఙ్మూలం, నాగరాజు స్వయంగా వ్రాసిచ్చిన స్టేట్‌మెంట్ ప్రవేశ పెట్టారు...
ఆ తరువాత నాగరాజు తరపు లాయర్ రమణ తన వాదనలు వినిపించాడు.
అలా వాదనలు నెలరోజులు సాగాయి.
ఆఖరి రోజు నాడు న్యాయమూర్తి తీర్పు ఇస్తూ "ఈ కేసులో నేరస్తుడు ఎవరంటే అని చెబుతున్నప్పుడు "న్యాయమూర్తిగారు... ఆ నేరస్తుణ్ణి నేనే" అంటూ కోర్టులో వాదనలు వింటున్న రామారావు లేచి నిలబడ్డాడు.
న్యాయమూర్తి అతనివైపు ఆశ్చర్యంతో చూస్తూ "ఎవరు మీరు... మీరేమైనా చెప్పాలంటే బోనులోకి వచ్చి చెప్పండి" అని అతనితో చెప్పాడు.
ఆ తరువాత ఇద్దరు పోలీసులు అతన్ని బోను వద్దకు తీసుకు వచ్చారు. కోర్టులో అతనేం చెబుతాడోనన్న కలకలం మొదలైంది.
కొద్ది నిముషాల తరువాత అతను బోను ఎక్కి న్యాయమూర్తిని ఉద్దేశించి చెప్పటం మొదలు పెట్టాడు...
"యువరానర్! ఈ కేసులో హతుడు నా కొడుకు మధు. హత్య చేసింది నాగరాజు అనే ముద్దాయి. వాళ్ళిద్దరూ స్నేహితులు. నా కొడుకు మధు పదవ తరగతి మా ఊరి జిల్లా పరిషత్ హైస్కూల్లో చదివాడు. వాడికి నేనే సైన్స్, లెక్కలు బోధించాను. అలాగే ఇంటర్లో కూడా నా దగ్గరే చదువుకుని 90శాతం మార్కులు సాధించి జిల్లాకి ప్రథముడిగా నిలిచాడు; కానీ ఆ తరువాత వాడు నా చెయ్యి దాటిపోయాడు. ఇంజనీరింగ్ చదువుకోసం
వాడిని విశాఖపట్నం పంపించాను. అప్పటి దాకా నా ఇంట్లో ఎంతో క్రమశిక్షణతో పెరిగినవాడు ఇంజనీరింగ్ కాలేజీ మెట్లెక్కగానే చెడు వ్యసనాల బారిన పడ్డాడు. దానికి కారణం తల్లిదండ్రులు దగ్గర లేరన్న ధైర్యం, ఏం చేసినా అడిగే వాళ్ళు లేరన్న విచ్చలవిడితనం... అందుకు కారణం కాలేజీ యాజమాన్యం... తమ కళాశాలలో అందునా దేశ నిర్మాణానికి, ఎంతగానో ఉపయోగపడ్డ ఇంజనీరింగ్ వంటి గొప్ప వృత్తి విద్యలను చదువుతున్న యువతను సక్రమ మార్గంలో పెట్టాలన్న మూల సూత్రాన్ని వాళ్ళు విస్మరించడం వల్ల నా కొడుకు లాంటి ఎందరో చదువుతున్న యువకులు వక్రమార్గం పట్టారు... పడుతున్నారు కూడా...
ఇక తండ్రిగా నేను కూడా సక్రమంగా నాబాధ్యతను నేరవేర్చలేదు. వాడు ఏది కోరితే అది కొనిచ్చాను. చదువుకి ఎంతగానో ఉపయోగపడే లేప్‌టాప్, సెల్‌ఫోను, అలాగే కాలేజికి రావడానికి మోటార్ బైక్, కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు ఇవన్నీ ఇచ్చాను.
నేను మీకు చెప్పిన పై యంత్రాలు అన్నీ రెండువైపులా పదునున్న కత్తిలాంటివి. జాగ్రత్తగా వాడక పోతే మనుషుల ప్రాణాలను తీసేస్తాయి...
కావలసినవైతే కొనిచ్చాను కానీ వాటిని వాడు సక్రమంగా ఉపయోగిస్తున్నాడో లేదో అనీ ఒక్కనాడు కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. నేనే గాని అలా చేసి ఉంటే వాడు అలవరచుకున్న చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్ళు ,చెడు స్నేహితులు... ఇవన్నీ తెలుసుకునే అవకాశం నాకు కలిగేది; తద్వారా వాడి చెడు అలవాట్లకు అడ్డుకట్ట వేసే వీలు కలిగేది;
ఒక తండ్రిగా నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించక పోవడం వల్లే వాడు మద్యానికి, గంజాయికి అలవాటు పడ్డాడు. చదువు తద్వారా విజ్ఞానం కోసం ఉపయోగించవలసిన కంప్యూటర్లను చెడు విషయాల కోసం వాడటం వల్ల వాళ్ళు పోర్నోగ్రఫీ అంటే బూతు చిత్రాలకు అలవాటుపడి, తద్వారా అమ్మాయిల మోజులో పడ్డారు... ఒక మనిషి చెడిపోవడానికి వైన్, వుమన్, వెల్త్... అంటే మద్యం, స్త్రీ, డబ్బు ఈ మూడు కారణాలవుతాయి. ఈ లేప్‌టాప్, సెల్‌ఫోను, డబ్బు వల్ల చాలామంది పైవాటికి అలవాటుపడి తాము చెడిపోతూ సమాజాన్ని తద్వారా దేశాన్ని పాడు చేస్తున్నారు.
సాక్ష్యాల ప్రకారం నాగరాజు నా కొడుకుని హత్య చేసిన కేసులో నేరస్తుడు కావచ్చు... కానీ నేను, కాలేజీ యాజమాన్యం అందుకు పరోక్షంగా కారణం కాబట్టి మేము కూడా నేరస్తులమే; కాబట్టి మమ్మల్ని కూడా శిక్షించండి" అనీ బోరున ఏడుస్తూ చెప్పాడు రామారావు...
అతను చెబుతుంటే కోర్టు హాలంతా సూది మొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దంగా ఉంది.
అతని ఆవేదనని న్యాయమూర్తితో సహా కోర్టులోని వారంతా వినీ అర్థం చేసుకున్నారు...
ఆ తరువాత న్యాయమూర్తి తన తీర్పుని వెలువరిస్తూ ``ఈ కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు, ఆధారాలతో కోర్టు ఏకీభవిస్తూ నాగరాజుని నేరస్తుడిగా నిర్ధారించింది. ఇతనికి శిక్ష రేపు వెలువరిస్తాను... ఈ కేసులో హతుని తండ్రి రామారావు ఆవేదనని కోర్టు అర్థం చేసుకుంది;
కానీ చట్టప్రకారం వాళ్ళని నేరస్తులుగా పరిగణించలేము;అందుకు మన చట్టాలు ఒప్పుకోవు;అయినా ఇటువంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలనీ ప్రభుత్వాన్ని ఈ కోర్టు ఆదేశిస్తోంది;
యువత దేశానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. వాళ్ళకు సరియైన విద్య అందించి వాళ్ళు సక్రమమైన మార్గంలో నడిచేటట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది... అలాగే తల్లితండ్రులు కూడా తమ పిల్లల పట్ల సక్రమంగా వ్యవహరించి వాళ్ళు చెడు దారి పట్టకుండా చూడాలి. అప్పుడే ఇటువంటి సంఘటనలు జరగవు...`` అంటూ తన తీర్పుని చదివి వినిపించారు న్యాయమూర్తి.
(సమాప్తం)
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments