top of page

ఆమె వచ్చేసింది


'Ame Vacchesindi' Written By Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

" హైమా..! హైమా..!" ఇంటి తలుపు కొడుతూ పిలుస్తోంది మధు. హైమ ఇల్లు ఆ వీధి మొత్తానికి చివరిలో మర్రిచెట్టుకి పక్కగా ఉంటుంది. ఎంతసేపైనా తలుపు తీయకపోవడంతో, పక్కింటికి వెళ్లి అక్కడ కూర్చున్న ఒక ముసలావిడని,

" ఏమండీ! మీ పక్కింట్లో హైమా వాళ్ళు ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు! తాళం కూడా వేసిలేదు. వాళ్ళు గురించి తెలుసా?" అని అడిగింది మధు.

పై నుండీ కింద దాకా ఒకసారి చూసి, " నువ్వు ఏమవుతావ్ వాళ్ళకి!? " అంది ముసలావిడ

' ఇలా అంటోంది ఏంటి ఈ ముసల్ది?' మనసులోనే అనుకుని "హైమ ఫ్రెండ్ ని అండీ! కలిసి చదువుకున్నాం. చూసి వెళ్దాం అని వచ్చాను. ఇంతకీ వాళ్లు ఉన్నారా? తలుపు తీయడం లేదు, ఫోన్ ఎత్తడం లేదు! " అంటూ ఉంటే ఆ ముసలావిడ, పైకి లేచి, " చూడమ్మాయ్! మాకేమీ తెలీదు. వాళ్లతో మేమెవరం మాట్లాడడం లేదు. ఈ కాలనీలో ఎవరూ వాళ్ల జోలికి పోము! చూడ్డానికి మంచి దానిలా ఉన్నావ్. ఆ పిల్ల నీకూ స్నేహితురాలా!? పెద్దదాన్ని చెపుతున్నా. ఆ పాడు కొంపకి పోకు. ఆ పాపిష్టి దానితో స్నేహం చేయకు" అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయి, ధడేలున తలుపు వేసేసుకుంది.

ఆవిడ ఎందుకు అలా మాట్లాడుతుందో మధుకి అర్ధం కాలేదు. మళ్ళీ హైమా వాళ్ళ ఇంటికి వెళ్లి తలుపు కొట్టింది. మళ్ళీ ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ వచ్చింది.

'సరేలే! ఇంకోసారి వద్దాం..' అనుకుని, ఇంటిదారి పట్టింది మధు. ఆ దారి నిర్మానుష్యంగా ఉంది. ఆ సమయంలో జన సంచారం కూడా లేదు. మిట్ట మధ్యాహ్నం వేళ కావడంతో, ఎండ మూలంగా ఎవరూ బయటకు రాలేదేమో అనుకుంది మధు.

'ఆ ముసలావిడ అలా ఎందుకు మాట్లాడిందో!? అసలు అది ఎందుకు తలుపు తీయడం లేదు.? ఇంట్లో ఉండి తీయడం లేదా.? అసలు ఏమైంది దానికి? నెల రోజుల క్రితం నేను ఫోన్ చేసినప్పుడు ‘ఇంట్లోనే ఉంటాను, కలుద్దాం’ అంటేనే కదా, ఇప్పుడు దాన్ని కలుద్దాం అని వచ్చాను. ఇంత శ్రమ పడ్డా, ఇంట్లో ఉండీ తలుపు తీయలేదా.? లేక ఎక్కడికైనా వెళ్లుంటారా.? వెళ్తే తాళం ఉంటుంది కదా! ఒకవేళ పడుకొని ఉంటారా?' ఇలా ఆలోచించుకుంటూ ఒక్కో అడుగు భారంగా వేస్తున్న మధుకి ఒక వికృతమైన, హృదయవిదారకమైన ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు వింటే ఎంతటి గుండె ధైర్యం ఉన్న వ్యక్తికి అయినా వెన్నులో నుండి వణుకు వచ్చేస్తుంది. ఆ రోదన వినేసరికి, అడుగు ముందుకు వేయలేక నిలబడిపోయింది మధు.

" వచ్చిన దారిలోనే ఇంటికి వెళ్ళిపో! ఇంకెప్పుడూ మా ఇంటికి రాకు" అన్న మాటకి వెనక్కి తిరిగి చూసింది మధు. అక్కడ కనిపించిన హైమ ఆకారం చూసి. బిక్క చచ్చిపోయింది మధు! వంటినిండా గాయాలతో, జుట్టు మొత్తం అట్టలు కట్టేసి ఉంది. ఎవరో బలంగా రక్కిన గుర్తులు రెండు చెంపలపైనా.. ఒక కనుబొమ్మ లేకుండా ఉన్న హైమను చూసి మధు మోహంలో రక్తం ఇంకిపోయింది. ఎప్పుడూ కరుణతో నిండి ఉండే హైమ కళ్ళలో ఒక రకమైన క్రూరత్వం చూసి మధు చిగురుటాకులా వణికిపోతూ,

" హైమా! ఏంటే.. ఇలా ఐపోయావ్!? ఈ గాయలెంటే? " అంటూ ఒక్కో అడుగు హైమ వైపు భయం భయంగా వేస్తూ ఉంది. ఇంకో రెండు అడుగుల దూరంలో మధు ఉండగానే " ఆగు. అక్కడే ఆగిపో! వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. ఆమె వచ్చేస్తుంది. మారణ హోమానికి బీజం పడిపోయింది. చీకటి లోకపు సంకెళ్లు తెంచుకుని, రక్తపుటేరులు చిందించేందుకు, సైతాన్ లోకపు చక్రవర్తి బయలుదేరాడు. ఆమె రాక అందుకు సంకేతం. వెళ్ళిపో! ఆమె రాక ముందే వెళ్ళిపో! ఆమె ఎవ్వరినీ వదలదు. స్మశానంలో చితి మంటలు ఆరవు. కాలే శవాలు, రగిలే మంటలు, పగిలే గుండెలు.. ఆమె రాకకు నిదర్శనాలు. తప్పదు! మారణ హోమం తప్పదు!" ఆపకుండా వికృతమైన మాటలు ఏవేవో మాట్లాడేస్తోంది హైమ.

ఆమె ఆ మాటలు మాట్లాడుతూ ఏటో శూన్యం లోకి చూస్తోంది. ఆమె గాయల నుండి వస్తున్న రక్తాన్ని చేతితో తుడుచుకుని, ఆ చేతికి అంటిన తన రక్తాన్ని తానే ఆస్వాదిస్తోంది. ఆ వికృతమైన చేష్టలు చూస్తూ నిలబడిపోయింది మధు. ఒక్క నిముషం, ఆమె బుర్ర మొద్దుబారిపోయింది.

" వెళ్ళిపో! ఇంకొన్ని రోజులు బ్రతికిపో! ఆకాశాన్నంటే ఆప్తుల ఆర్తనాదాలు వినేందుకు నీ గుండెను దిటవు చేసుకో. చీకటి లోకానికి అణిచి వేయబడిన సైతాన్ చక్రవర్తి, భూ ప్రపంచముపై యుద్ధం ప్రకటించాడు. ఆమె రాకతో, సూర్య చంద్రుల స్థితి గతులే మారిపోతాయి. సముద్రాలు ఇంకిపోతాయి. నీళ్ళకి బదులు నెత్తురు ప్రవహిస్తుంది." అంటూ.. పిచ్చిపిచ్చిగా నవ్వుతూ, బూడిద తీసి నెత్తిన జల్లుకుంటూ.. మధుని చూసి, “వెళ్ళిపో! ఇక్కడ నుండి నూరు యోజనాల దూరంలో ఒక రహస్య దీవి ఉంది. అక్కడ తల దాచుకో. నేను ఆమెతో కలిసి ఈ జాతిని నాశనం చేస్తాను. సైతాన్ రాజ్యం వచ్చిన తరువాత, నిన్ను కలిసేందుకు నేను వస్తాను. వెళ్ళు.. వెళ్ళు! ఆమె వచ్చేస్తోంది! నిన్నూ నాతో తీసుకుపోతుంది " అంటూ అరుస్తోంది హైమ.

ఐనా మధు భయంతో కదలలేకపోవడంతో హైమ, మధుని గట్టిగా తోసింది. అలా తోయడంతో, మధు పక్కనే ఉన్న తుప్పల్లోకి పడిపోయింది. ఆ పడడం, పడడం ఆ తుప్పల్లో ఉన్న రాయి తలకి తగిలేలా పడింది మధు. అంతే! ఆ నొప్పితో స్పృహ తప్పింది.

కాసేపటికి స్పృహలోకి వచ్చిన మధు, చుట్టూ చూసింది. ఒక నర్స్ వచ్చి " ఎలా ఉంది ఇప్పుడు? " అని అడిగింది.

“నేను బానే ఉన్నాను సిస్టర్. కానీ ఇక్కడికి ఎలా వచ్చాను.? ఎవరు తీసుకువచ్చారు.? " అని అడిగింది.

" ఉండు పిలుస్తాను" అంటూ బయటకు వెళ్ళింది నర్స్.

కాసేపటికి ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూనే మధుకి ఎక్కడ లేనంత ఓపికా, బలం వచ్చేసాయి. " సూరజ! నువ్వా.. నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది.? అసలు నువ్వు అక్కడికి ఎలా వచ్చావ్.? హైమా.. హైమకి.."

" పిచ్చి పట్టింది!" గంభీరంగా చెప్పాడు సూరజ్.

" పిచ్చా.? హైమకా.? " నమ్మలేనట్టుగా చూస్తూ అడిగింది మధు.

" అవును. పిచ్చి పట్టింది." అంతే గంభీరంగా చెప్పాడు సూరజ్.

" అసలు ఏమి జరిగింది.? పూర్తిగా చెప్పు సూరజ్. అంత తెలివైన హైమ, ఒక నెలకి ముందట బాగానే ఉన్న హైమ ఇప్పుడు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది!? అసలు ఏమైంది!? "అడుగుతూనే ఉంది మధు.

" నీకు ఇవాళ ఎలాంటి అనుభవం ఎదురైందో, రెండు రోజుల క్రితం నాకూ అలాంటి అనుభవమే ఎదురైంది. నేను నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ నుండి వచ్చాను. హైమ వాళ్ళ ఇంటి దగ్గర ఏదో సైట్ అమ్మకానికి ఉంది అంటే, మా డాడీ చూసి రమ్మని నన్ను పంపారు.

ఎలాగూ వెళ్ళాను కదా అని హైమని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే, హైమ పరిస్థితి చూసి, బాధేసి వచ్చేసాను." అంటూ చెప్తున్న సూరజ్ చెంప పగలకొట్టింది మధు.

" ఏరా! నాలుగేళ్లు ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం? చదువు పూర్తి అయ్యి, ఇప్పుడు ఎవరి లోకంలో వాళ్ళు ఉంటున్నాం కానీ, మన స్నేహ బంధం చెదిరిపోలేదు కదా! మరి..హైమని అలాంటి స్థితిలో చూసిన వాడివి, మన వాట్సాప్ గ్రూప్ లో చెప్పాలి కదా!" అంటూ సూరజ్ పై విరుచుకు పడింది మధు.

"ఆగు మధు! హైమ గురించి నీకే కాదు. నాకూ చాలా బాధగా ఉంది. కానీ ఈ విషయం ఇంతటితో వదిలేస్తే అది ఒకతే పోతుంది. పట్టించుకుంటే, మనల్ని కూడా అలా మార్చేస్తారు."

" మా..ర్చేస్తారా!? ఏమన్నావ్ ఇప్పుడు? మళ్ళీ చెప్పు!" రెట్టించింది మధు.

" ఈ విషయం ఇక్కడితో వదిలేయ్ " అన్నాడు సూరజ్.

" గాజులు తొడుక్కుని కూర్చో! ఎం జరిగిందో నేనే తెలుసుకుంటాను" అంటూ లేచింది మధు.

" వద్దు మధు! నువ్వు అక్కడికి వెళ్ళకు. నేనే చెప్తాను. నిజానికి, హైమకి.. హైమకి పిచ్చి పట్టలేదు. తను అలా మారడానికి అసలు కారణం.." అంటూ అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు సూరజ్.

" ఆరోజు నేను హైమ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ కాలనీలో ఎవరూ బయట కనిపించలేదు. హైమ వాళ్ల ఇల్లు, ఆ కాలనీ చివర కాబట్టి నిశ్శబ్దంగా ఉంది. హైమ ఇంటి తలుపులు కొట్టాను. ఎవరూ తీయలేదు. సర్లే. లేరేమోలే! అని నేను వెనక్కి వచ్చేస్తుంటే, ఒక వికృతమైన, ఏడుపు వినిపించింది. హృదయ విదారకరమైన రోదన అది. ఆ ఏడుపు గుర్తు వస్తే ఇప్పటికి నా గుండె ఝల్లుమంటుంది!" అంటూ సూరజ్ చెప్తూ ఉంటే, మధ్యాహ్నం తనకు ఎదురైన అనుభవం గుర్తొచ్చింది మధుకి.

సూరజ్ చెప్తూ ఉన్నాడు. " వెళ్ళిపోతున్న వాడిని, ఆ ఏడుపు వినగానే ఆగిపోయాను. 'హైమ ఏడుస్తోందా!? భగవంతుడా..' అనుకుంటూనే వెళ్లి మళ్ళీ తలుపు కొట్టబోయి, ఆగిపోయాను.

తలుపులు బాదినా ఉపయోగం ఉండదు. లోపల ఉన్న వాళ్ళు తలుపులు తీయరు. ఏదో జరుగుతోంది. ఎలాగైనా హైమను కలిసే తీరాలి అనుకుని, మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ, వెనక వైపుకి వెళ్లాను. ఎవరికీ అనుమానం రాకుండా కిటికీ లోంచి లోపలికి చూద్దాం అనుకున్నాను. కానీ ఆ ఇంటి కిటికీలు తెరిచి లేవు. ధైర్యం చేసి, మరికొంత ముందుకు వెళ్ళాను. అక్కడ ఒక తలుపుకి ఉన్న రంధ్రం నుండి లోపలికి తొంగి చూసిన నాకు, అక్కడ కనిపించిన భీకర దృశ్యం చూస్తే, మనసు కకావికలం అయిపోయింది. హైమ తల్లిదండ్రులు తాళ్లతో కట్టివేయబడి ఉన్నారు. అక్కడ ఒక ఆడమనిషి, వారికి ఏవో ఇంజెక్షన్స్ చేస్తోంది. వారు మత్తుగా పడి ఉన్నారు. హైమని మాత్రం స్పృహలోనే ఉంచి, చిత్రవధ చేస్తోంది ఆమె. హైమ నోట్లో గుడ్డలు కుక్కి, కొడుతోంది. పాశవికంగా కనుబొమ్మ కత్తిరిస్తోంది. హైమ ఒక నిమిషం వరకూ విల విల లాడిపోయింది. నేను తలుపులు పగులగొట్టి, లోపలికి వెళ్లి, హైమను కాపాడాలి అనుకున్నాను. ఒక్క నిమిషంలో హైమ మారిపోయింది.

భీకరంగా నవ్వుతూ “కొట్టు.. ఇంకా హింసించు! నాకు ఇంకా రక్తం కావాలి.. ఆమెకి ఈ ఆహారం సరిపోదు. సైతాన్ చక్రవర్తి రాకకు ఈ హింస సరిపోదు!' అంటూ నవ్వడం మొదలుపెట్టింది. ఒక్క నిమషం నా చెవులు నేను నమ్మలేకపోయాను. ఆ తలుపుకి ఉన్న చిన్న రంధ్రంలో కుర్చీలో కూర్చున్న హైమా, కింద పడిపోయిన ఆమె తల్లిదండ్రులు తప్ప, ఆ అజ్ఞాత ఆడమనిషి నాకు కనిపించలేదు. ఏం జరుగుతోందో నాకు అర్ధం అయ్యేలోపు, హైమ కట్లు విప్పింది ఆ ఆడమనిషి. హైమ తనని తానే గాయపరుచుకుంటూ, ఆమె రక్తాన్ని ఆమే ఆస్వాదిస్తోంది. అది చూసిన నా గుండె వేగం పెరిగిపోయింది.

ఇంతలో ఆ ఆడమనిషి గుండ్రటి లాకెట్ ఉన్న చైన్ ని హైమ ముందు ఊపుతూ, 'ఇప్పుడు నేను ఏమి చెప్తే అదే నువ్వు చేయాలి. నేను చెప్పినవే గుర్తుపెట్టుకోవాలి' అంటూ చెప్తోంది" అలా సూరజ్ తను చూసినది చెప్తూ ఉండగానే, మధుకి ఒక విషయం అర్ధం అయింది.

" అంటే.. హైమని హైప్నటైజ్ చేస్తున్నారా!? కానీ ఎవరూ!? ఎందుకు!? " అంది.

" అది హిప్నటిజమ్ అని నాకూ అనిపిస్తోంది. కానీ ఎవరు చేస్తున్నారు? ఎందుకు? అని తెలుసుకోవాలి అనుకున్నాను. హైమ బాధను చూడలేకపోయాను. అక్కడ ఎంత మంది ఉన్నారో తెలీదు, లోపలికి వెళ్తే, నన్ను అలాగే మార్చేస్తారేమో అనిపించింది. కానీ హైమని కాపాడాలి అనిపించింది. వెంటనే అక్కడి నుండి పోలీసుస్టేషన్ కు బయలుదేరాను. కానీ దారి మధ్యలో నాకు ఫోన్ వచ్చింది.

కొత్త నెంబర్! లిఫ్ట్ చేయగానే. ' నువ్వు రావడం నేను చూసాను. పోలీస్ స్టేషన్ కి బయలు దేరినట్టున్నావ్. వెళ్ళు.. వెళ్ళు! వెళ్లి కంప్లైంట్ ఇచ్చుకో! వాళ్లు వచ్చేలోగా దీని పీక కోసేస్తా!" అంటూ వికృతంగా నవ్వింది ఆ ఆడమనిషి.

" వద్దు. హైమని ఏమీ చేయకు. అసలు నువ్వు తనని ఎందుకు హింసిస్తున్నావ్? నీకు ఏం కావాలి!? అసలు నా నెంబర్ నీకు ఎలా తెలుసు? హైమని వదిలేయ్!" అని బ్రతిమాలాను.

ఆమె వికృతంగా నవ్వుతూ.. “సైతాన్ సామ్రాజ్య స్థాపన కోసం..

నేను సైతం అశ్రువొక్కటి ధారపోశాను!

నేను సైతం పిచ్చి గొంతుక కోసే.. స్తా.. ను.

హా.. హా.. హా.. హా.." అంటూ వికృతంగా నవ్వింది.

అంతే కాదు. "సైట్ చూడ్డానికి వచ్చిన వాడివి, చూసుకుని పోక, నా ఇంటికి వచ్చావ్. తలుపు కొట్టావ్! తీయకపోతే, మూసుకుని పోవాలి కానీ ఈ తొంగి చూడ్డాలు ఏంది బే? చూస్తే చూసావ్! పోలీస్ లు, కంప్లైంట్స్ అంటూ వెళ్ళావో.. వాళ్లు వచ్చేలోగా దీన్ని చంపేసి, నే లొంగిపోతా!

కానీ నా మనుషులు నిన్ను, నీ కుటుంబాన్నీ కూడా వదలరు. మీ అందరికీ ఇదే గతి పడుతుంది" అంటూ వికృతంగా నవ్వింది.

ఆ క్షణం నాకు ఒకటే అర్ధం అయింది. ఎవ్వరూ కలగజేసుకోకపోతే అలాగైనా హైమ ప్రాణాలతో ఉంటుందేమో! పోలీసులకి చెప్తే, హైమని చంపేస్తుందేమో.. అనిపించింది. ఎవరికీ చెప్పలేక, వదిలేయలేక, కుమిలిపోయాను. అప్పుడే నువ్వు కూడా ఊరు నుండి నిన్ననే వచ్చావని, 'హైమని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాను' అని మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన మెసేజ్ చదివాను.

మెసేజెస్ లో కూడా నీతో మాట్లాడానికి భయమేసి, నేరుగా నీతో మాట్లాడొచ్చని మీ ఇంటికి వెళ్తే నువ్వు హైమని చూడ్డానికి వెళ్లావు అని చెప్పారు మీ ఇంట్లో.

నిన్ను ఏమైనా చేస్తారేమో అనే భయంతో, నీకు ఫోన్ చేస్తుంటే కలవలేదు. ఇక నేనే ధైర్యం చేసి, ఆ కాలనీ వైపు వస్తూ ఉంటే.. అప్పటికే నువ్వు హైమతో కాలనీ బయట నిలబడి మాట్లాడుతున్నావ్. హైమ నిన్ను తుప్పల్లోకి తోసేసింది. నువ్వు పడిపోగానే, నీపై తుప్పలు పెర్చేస్తోంది. ఒక నిమిషం నాకేమి అర్ధం కాలేదు.

అది నిన్ను ఏమైనా చేస్తుందేమో అని, దానికి కనిపించకుండా రాడ్ తీసుకుని బయలుదేరిన నేను, ఒక క్షణం భయంతో బిగుసుకుపోయాను. ఒక వాన్ వాయువేగంలో వచ్చి, హైమ ముందు ఆగింది. అందులో నుండి ఒక ఆడమనిషి దిగింది. ఇప్పుడు నేను ఆమెను చూడగలిగాను. ఆమె ఇంచుమించు మన హైమ లాగానే ఉంది. హైమను రెక్కుచ్చుకు లాగి, వాన్ లోకి తోసేసింది. హైమ పారిపోవడానికి ప్రయత్నించింది. ఏదో ఇంజక్షన్ ఇచ్చేసి, బలవంతంగా తోయబోయింది ఆ లేడీ. ఒక్క సెకండ్ లో హైమలో మార్పు వచ్చేసింది. మళ్ళీ అలాంటి మాటలేవో మాట్లాడుతూ. వాన్ దిగిపోయి, 'వస్తుంది.. సైతాన్ రాజ్యం తెస్తుంది.. ఆమె వచ్చేస్తుంది!' అంటూ రోడ్డు మీద బూడిద తీసి జల్లుకుంటోంది. ఆ ఆడమనిషి, హైమని ఒక్క తోపు లోపలికి తోసింది.

వాన్ స్పీడ్ గా వెళ్ళిపోయింది. అప్పటి వరకూ చాటుగా ఉన్న నేను ఇంక ఆలస్యం చేయకుండా, పొదల్లో ఉన్న నిన్ను హాస్పిటల్ కి చేర్చాను. అదీ జరిగింది!" అని ముగించాడు సూరజ్.

"అసలు ఇదంతా ఏంటిరా? ఇప్పుడు దాన్ని ఎలా కాపాడలి? ఆ లేడీ నీకు ఫోన్ చేసింది అంటే, హైమ ఫోన్ లో నెంబర్ తీసుకుని ఉంటుంది. కానీ ఆ వచ్చింది నువ్వే అని ఎలా తెలుసు? అంటే తనకి మనము అందరం తెలిసే ఉండాలి. బయట ఏమి జరుగుతోందో తనకి తెలుస్తోంది అంటే, ఏదో చాలా తేడా కొడుతోంది" అంటూ మధు అనుకుంటూ ఉండగా

" ఒక్కటి గమనించావా మధు! హైమ నిన్ను తుప్పల్లోకి తోసే ముందు ఏమంది? ‘ఆమె వచ్చేస్తుంది. వెళ్ళిపో! ఆమె వచ్చింది అంటే, నిన్నూ నాతో తీసుకుపోతుంది!’ అనేకదా" అన్నాడు సూరజ్.

అవును అన్నట్టు తల ఊపింది మధు.

" నిన్ను తుప్పల్లోకి తోసి, నువ్వు పడిపోగానే, తుప్పలు పెర్చేసింది. అంటే దాని అర్ధం నువ్వు ఆ ఆడమనిషికి కనిపించకూడదు అని.."

" అవును! ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను సేవ్ చేసిందిరా హైమ!" అంటూ నీరు నిండిన కళ్ళతో సూరజ్ వంక చూసింది మధు.

“అవును! ఆ ఆడమనిషి ఇస్తున్న ఇంజక్షన్స్, హిప్నోసిస్ పని చేస్తున్నంతవరకు హైమ మనలో ఉండదు. ఆమె ఎలా చెప్తోందో అదే చేస్తుంది. వాటి పవర్ తగ్గాక మాములుగా అవుతోంది. నిన్ను కాపాడింది కూడా అలాంటి మెమరీ ఇంకా తనలో ఉండడం వల్లే" అన్నాడు సంజయ్.

" అవునురా! ఇదంతా సరే. ఇంతకీ అసలు ఆ లేడీ ఎవరూ? ఎవ్వరికి హాని చేయని మన హైమని ఎందుకు హింసిస్తోంది.? ఇదంతా ఎలారా ఛేదించేది? ఎలారా దాన్ని కాపాడేది!? " అంటూ మధు మాట్లాడుతూ ఉండగా

" ఎక్స్ క్యూజ్ మీ! మీరు ఏదైనా ప్రాబ్లెమ్ లో ఉన్నారా? నేను మీ డిస్కషన్ అంతా విన్నాను. మీకు హెల్ప్ చేయగలను" అన్నాడు ఒక వ్యక్తి.

చివ్వున తలెత్తి చూసారు సూరజ్, మధులు. ఆరడుగుల పొడవు ఉండి, చామనఛాయ రంగులో ఉన్న ఆ వ్యక్తి, మధు, సూరజ్ లకి దగ్గరగా వచ్చి, " హాయ్! ఐయామ్ రవి. సైకియాట్రిస్ట్. మీరు మాట్లాడుకుంటున్న మాటలు అనుకోకుండా నా చెవిన పడ్డాయి. మీ ఫ్రెండ్ ని నేను కాపాడగలను. ఆమె చాలా ప్రమాదంలో ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే అణుబాంబు కంటే ప్రమాదకరమైన మనిషి చేతిలో ఉంది" అంటున్న డాక్టర్ రవి మాటలకి షాక్ అయిపోయారు ఆ స్నేహితులు ఇద్దరూ.

"ఇతన్ని నమ్మచ్చా? లేదా ఇతను కూడా వాళ్ళ మనిషేనా.? ఇతని మాట విందామా!? వద్దా.?" అంటూ మధు చెవిలో గొణిగాడు సూరజ్.

మధు తీసుకోబోయే నిర్ణయంపైనే, హైమ భవిష్యత్తు ఆధారపడి ఉంది. డాక్టర్ రవి మాటలకి ఆలోచనలో పడింది మధు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన తను, హైమ మాట్లాడిన మాటలు ఎలా నమ్మగలదు? మానవాతీత శక్తులు, చేతబడులు, సైతాన్, చీకటి లోకం లాంటి వాటిని మొదటి నుండి నమ్మని మధు, సూరజ్ చెప్పిన మాటలతో, హైమని ఆ లేడీ హిప్నొటైజ్ చేస్తోంది అనే నిర్ధారణకు వచ్చి ఉండడం వల్ల, హైమని కాపాడాలి అంటే, ఈ సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుంటేనే మంచిది అని నిర్ణయించుకుంది.

" సరే డాక్టర్! కానీ మీరు మాకు ఏ విధంగా సాయం చేయగలరు? ఆ లేడీ మా ఫ్రెండ్ ని ఏమీ చేయకుండా వదిలేయాలి అంటే ఏమి చేయాలి..? " అంది మధు.

" మీరు ఇందాక మాట్లాడిన మాటల ప్రకారం, ఆమెకి మీరంతా తెలుసు. మిమ్మల్ని గుర్తు పట్టగలదు. అందుకే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ముందు వాళ్ళు ఉండే ఏరియాలో కరెంటు కట్ చేయాలి."

" అది నేను చేయగలను డాక్టర్. మా బ్రదర్ కరెంటు ఆఫీస్ లో పని చేస్తున్నాడు." అన్నాడు సూరజ్.

" వెరీ గుడ్! నువ్వు అతనికి చెప్పి, ఒక్క అరగంట పవర్ కట్ చేయించు. ఇప్పుడే!" అన్నాడు రవి.

సూరజ్ వాళ్ళ అన్నయ్యకి విషయం చెప్పి కరెంటు కట్ చేయమని చెప్పాడు.

"ఇప్పుడు మనము ఆమెను ఎదుర్కోబోతున్నాం! ముల్లును ముల్లుతోనే తీయాలి. ఆమెను పట్టుకునేందుకు ఆమె నడిచే దారిలోనే మనము నడవాలి. అర్ధం కాలేదా.? చెప్తాను. అంతా చెప్తాను. కానీ మనము ఆడబోయే నాటకానికి ముందు నా ఆహర్యం మారాలి" అంటూ ఒక నవ్వు విసిరాడు రవి.

ఆ నవ్వు అతని ఆత్మవిశ్వాసాన్ని సూచించేలా ఉంది. నాకు కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకోవాలి, మిగతా కథ అక్కడ నడిపిస్తాను. పదండి” అన్నాడు రవి.

అంతా కలసి హైమ ఇంటికి చేరారు. కరెంటు కట్ చేయడం వల్ల, హైమ ఇంటి సీసీటీవీ కెమెరా పని చేయలేదు. బయట ఏమి జరుగుతోందో ఆమె తెలుసుకోలేదు. మధు, సూరజ్ లను కారు దిగమని చెప్పి, రవి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు కారులోనే. రవి తను ఒక సైతాన్ సేవకుడిలా వేషం వేసుకున్నాడు. నల్లటి బట్టలు కట్టుకుని, కొన్ని వింత వస్తువులు తీసుకుని, కార్ నుండి దిగాడు. రవి ఆకారం చూసి కప్పల్లా నోరు తెరిచారు మధు, సూరజ్ లు.

" చాల్లే చూసింది! ఇక పదండి" అంటూ రవి అడుగులు ముందుకు వేస్తూ "చుట్టూ ఏమి జరుగుతోందో తెలుసుకునేందుకు పెట్టిన సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో, ఎవరు వచ్చారో తెలుసుకునేందుకు ఆమె కచ్చితంగా ప్రయత్నిస్తుంది. నా అంచనా సరైనది అయితే, ఆ ఒక్క ప్రయత్నం ఆమె వైపు నుండి జరిగితే, ఈ కథకు ముగింపు నేను చేస్తాను" అంటూ సూరజ్, మధులను వెనక వైపు నక్కి ఉండమని చెప్పి, రవి హైమ ఇంటి తలుపు కొట్టాడు. తలుపుకి పక్కనే ఉన్న కిటికీ కొద్దిగా తెరుచుకోవడం గమనించాడు రవి. ఆ కిటికీ నుండీ ఎర్రటి కళ్ళతో తీక్షణంగా తననే చూస్తున్న ఒక ఆడమనిషి కనిపించింది. అది గమనించిన రవి, ఆమెకు దగ్గరగా వెళ్లి,

" సైతాన్ చక్రవర్తి వర్తమానం పంపారు. ఆయన మారణ హోమం సృష్టించేందుకు ఇచ్చిన కొన్ని సూచనలు మోసుకు వచ్చాను. భూ మండల ఆధిపత్యం కోసం చీకటి లోకపు చక్రవర్తి ఎదురు చూస్తున్నారు. నేను ఆయన దూతని" అంటూ మాట్లాడుతున్న రవి ఆకారం వేష భాషలు ఆమెకు అతను సైతాన్ పంపిన దూత అనే నమ్మకం కల్పించాయి.

ఆమె వెంటనే ఉద్రేకంతో ఊగిపోతూ తలుపు తెరచి, రవిని లోపలికి ఆహ్వానించింది.

" నిజమా! ఇది సత్యమా. నా సేవలకి చక్రవర్తి సంతసించినారా! చెప్పండి. ఏమని సందేశం పంపినారు? " అంటూ ఒక రకమైన ఉద్వేగంతో ఊగిపోతోంది.

లోపలికి అడుగుపెట్టిన రవి, ఒక్క నిమిషం ఇల్లంతా పరిశీలనగా చూసాడు. ఆ ఇంటికి ఒక మూలగా, తాళ్లతో కట్టి వేయబడిన మొగుడు,పెళ్ళాలు కనిపించారు. మరోపక్కగా కుర్చీలో కాళ్లు, చేతులు కట్టి పడేసిన అమ్మాయి కనిపించింది.

ఇంక ఒక్క నిమిషం కూడా ఉపేక్షించకుండా, “ఇదిగో సందేశం..!” అంటూ జోలెలోనుంచి మత్తు ఇంజక్షన్ తీసి, మెరుపు వేగంతో ఆ లేడీని గట్టిగా పట్టుకుని, భుజానికి ఇంజక్ట్ చేసేసాడు.

" నన్నే మోసం చేస్తావా..? " అంటూ ఆ లేడీ రవి మీదకి విరుచుకు పడబోయి, ఆ మత్తు ప్రభావంతో రవి మీదే పడిపోయింది. ఆమెను అలాగే కింద పడుకోబెట్టి, సూరజ్, మధులను లోపలికి పిలిచాడు.

వారిద్దరూ లోపలికి వచ్చి, హైమ అమ్మ, నాన్నలకి తాళ్ళు విప్పేసి, ఆ తాళ్లతో ఇన్నాళ్లుగా వీళ్ళని హింసించిన ఆ రాక్షసి కాళ్ళు, చేతులు కట్టి పడేసారు. సూరజ్ పరుగున వెళ్లి, హైమ తాళ్ళు విప్పబోయాడు.

" ఆగు సూరజ్! ఆమె తాళ్ళు విప్పకు. ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో ఇంకా మనకు పూర్తిగా తెలీదు" అంటూ, అప్పటికీ స్పృహలో లేని హైమ తల్లి తండ్రులకు స్పృహ తెప్పించేందుకు, ఆ రాక్షసి చేసిన ఇంజెక్షన్స్ కి విరుగుడుగా పనిచేసే ఏంటి డోట్ ఇంజక్షన్ ఇచ్చి, వాళ్లకి అక్కడే సెలైన్ ఏర్పాటు చేసేసాడు. అలాగే హైమని కూడా పరీక్షించి, స్పృహలో లేని హైమకి కూడా ఇంజక్షన్ ఇచ్చి, తన హాస్పిటల్ కి ఇన్ఫార్మ్ చేసి అంబులెన్స్ పంపమని చెప్పాడు.

ఒక పది నిముషాలకి హైమ తల్లిదండ్రులిద్దరూ స్పృహలోకి వచ్చారు. మధుని సూరజ్ ని చూసి, భయంతో

" మీరిద్దరూ, మా హైమ క్లాస్మేట్స్ కదూ! లోపలికి ఎలా వచ్చారమ్మా? వెళ్లిపోండి బాబు.. ఆ రాక్షసి చూసిందంటే.." అంటుండగానే "మరేం భయం లేదు ఆంటీ! ఆమెని బంధించారు డాక్టర్ రవి గారు" అంటూ హైమ ఒంటికి తగిలిన దెబ్బలకు వైద్యం చేస్తున్న రవిని చూపించాడు సూరజ్.

" బాబూ! దేవుడిలా వచ్చారు బాబు మీరంతా. ఆ పిచ్చి దాని నుండి కాపాడండి బాబూ! ఆ రాక్షసి నా పెద్ద కూతురు హిమ " అంటూ బోరుమని ఏడుస్తున్న హైమ తల్లిని దగ్గరకు తీసుకుంది మధు.

" ఏమంటున్నారు ఆంటీ? తను మీ పెద్ద కూతురా? అంటే హైమకి అక్కా!? మరి మిమ్మల్ని, హైమని ఎందుకు ఇంత పైశాచికంగా హింసించింది? " అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మధు.

" చెప్తానమ్మా! ఆ రాక్షసి నా పెద్ద కూతురు హిమ! హిమ, హైమ కవల పిల్లలు. అసలు ఏమి జరిగింది అంటే హిమ ప్రవర్తన చిన్నప్పటి నుండీ వేరుగా ఉండేది. చిన్న చిన్న విషయాలకి గొడవచేయడం, తనని తానే గాయపరుచుకోవడం లాంటివి. మొదట్లో మేము చిన్నపిల్లే కదా, అని సాయశక్తులా నచ్చచెప్పే వాళ్ళం. అది వినేది కాదు. అలా తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు, ఒకరోజు మా అత్తయ్య గారిని గొంతు నులిమి చంపేసింది. మేము విడిపించడానికి ప్రయత్నించి, విఫలం అయ్యాం! ఇక ఆమె చనిపోయిన తరువాత కోర్ట్ తీర్పుతో దానిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాము. ఆ దుర్ఘటన జరిగిన నాటి నుండీ, ఈ కాలనీ లో మా కుటుంబం అంటే అసహ్యం ఏర్పడింది. మమల్ని వెలివేసినట్టు చూడటం మొదలుపెట్టారు.

హిమ అక్కడే, ఆ పిచ్చి ఆసుపత్రిలోనే పెరిగింది. మెరుగై తిరిగి వస్తుంది అనుకున్నాం. కానీ ఇంకా వికృతంగా మారుతుంది అని మేము ఊహించలేదు బాబూ! తనని దూరం పెట్టామని మాపైన కక్ష కట్టింది. హైమ మీద ప్రేమతోనే తనను దూరంగా పంపేసామని హైమ మీద కక్ష పెంచుకుంది.

ఎప్పటి నుండో అక్కడ నుండి తప్పించుకుని రావాలి అని ప్రయత్నం చేసేది. ఒక పది రోజుల క్రితం అక్కడ నుండి పారిపోయి, ఇంటికి వచ్చేసింది. మేము అడ్రస్ తప్పు ఇచ్చాం ఆసుపత్రి వాళ్ళకి. అందుకేనేమో, వాళ్ళు ఇక్కడికి రాలేక పోయారు. కానీ ఈ పిల్ల కూడా పిచ్చిదానిలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. పిచ్చి తగ్గడం వల్లే పంపేశారు అనుకున్నాం. కానీ, అది ఉన్మాది గా మారిపోయి వచ్చింది అని ఊహించలేదు.

ఆసుపత్రిలో వైద్యానికి వాడే కొన్ని రకాల మందులు, ఇంజెక్షన్స్ దొంగతనం చేసి తీసుకువచ్చింది. అవి మాపై ప్రయోగించడం మొదలుపెట్టింది. మా ఇద్దరినీ మత్తులో ఉంచేసి, హైమకి నరకం చూపించింది. వారం రోజులుగా అది హైమని చాలా టార్చర్ పెడుతోంది బాబూ!" అంటూ హైమ తల్లి చెబుతూ ఉండగా. హైమకి కూడా స్పృహ వచ్చింది.

అప్పటికే ఏంటీ డోట్ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల హైమ మామూలు స్థితికి వచ్చింది.

కానీ, హిమ చేసిన హిప్నాటిజం సరైనది కాకపోయినా, తనని ఏదో చేసేసింది అని నమ్మి, మానసికంగా, శారీరకంగా కూడా బలహీనంగా ఉన్న హైమ, హిమ చెప్పిన మాటలే మాట్లాడుతూ వచ్చింది. పిచ్చి దాని లాగా మారిపోయింది. ఇప్పుడు ఆమె స్పందన ఎలా ఉండబోతుందో అని అందరూ భయం, భయంగా చూస్తూ ఉండగా అంబులెన్స్ వచ్చింది.

అందరినీ దివ్య సంజీవని హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. హైమకి నిపుణులు అయిన డాక్టర్స్ పర్యవేక్షణలో, సరైన వైద్యం అందిస్తున్నాడు డాక్టర్ రవి. ఇక హిమని కూడా మానసిక రోగుల విభాగంలో పేషెంట్ గా జాయిన్ చేసుకుని, తనకి నయం చేసి ఇంటికి పంపించే బాధ్యత తీసుకున్నాడు డాక్టర్ రవి. ఒక వారం రోజుల తరువాత, హైమ, ఆమె తల్లి తండ్రులు పూర్తి ఆరోగ్యంతో ఇంటి బాట పట్టారు.

హైమ ఆరోగ్యంగా తిరిగి రావడంతో, మధు, సూరజ్ లతో పాటు, వాళ్ళ క్లాస్ మేట్స్ అందరూ కలిసి హైమ ఇంట్లోనే సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి ఆ కాలనీ వాళ్ళు అంతా కలిసి రావడం చూసి, హైమ కుటుంబం ఆశ్చర్య పోయింది. వారి ఆనందానికి హద్దే లేదు. వాళ్లలో ఇంత మార్పు ఎలా వచ్చిందా అని హైమ కుటుంబం ఆశ్చర్య పోతున్న వేళ, డాక్టర్ రవి ముందుకు వచ్చి, " ఇన్నేళ్లుగా మీ అందరితో కలిసి ఉంటున్న ఈ కుటుంబం, ఒక వారం రోజులు ఎంత నరకాన్ని అనుభవించారో! మీ కాలనీలో ఒక్కరైనా ఆ కుటుంబం ఇన్ని రోజులు బయటకు రాకపోతే, ఏమయ్యారో అని గమనించి ఉండి ఉంటే, నాలాంటి బయట వ్యక్తి సహాయం వాళ్లకు అవసరమయ్యేది కాదు.

ఆ కుటుంబానికి హిమ రూపంలో ఎదురైన ప్రమాదం, మీలో ఎవరికైనా వేరే ఏ రూపంలో అయినా ఎదురవ్వచ్చు కదా! మిమ్మల్ని అలా వెలివేసి ఉంటే, ఎలా ఉంటుంది.? ఒక్కసారి ఆలోచించండి. ఒకే చోట ఏళ్లుగా కలిసి ఉంటున్నారు కదా! ఒక మానసిక రోగి చేసిన పనికి, కుటుంబాన్నే వదిలేస్తే, ఆ కుటుంబం ఎంత వేదనకు గురి అవుతుంది? ఇకనైనా ఈ కుటుంబాన్ని మీలో ఒకటిగా గుర్తించి, మీతో కలుపుకుంటారనే ఆశతో మీ అందరినీ అభ్యర్థించాను. నా మాటను మన్నించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఇకనైనా వీరిని మీలో ఒకటిగా చూస్తారని ఆశిస్తాను." అంటూ ముగించాడు.

ఆ కాలనీ వాసులంతా కరతాళ ధ్వనులతో వారి అంగీకారం తెలిపారు. హైమ, హైమ తల్లిదండ్రులు కన్నీటితో డాక్టర్ రవికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. హిమ కూడా తొందరగా కోలుకొని, ఇంటికి రావాలని కోరుకుందాం. హైమ కుటుంబంలాగే, ఎన్నో కుటుంబాలు, వారిలో ఒక కుటుంబ సభ్యుడు చేసిన తప్పుకి, అందరిలోనూ వెలివేయబడుతుండడం, చిన్న చూపు చూడబడటం, అవమానించబడడం సమాజంలో ఎన్నో చోట్ల జరుగుతూనే ఉంటుంది. అటువంటి కుటుంబాలలో మిగిలిన సభ్యులను కూడా సమాజంలో ఒకరిగా గుర్తిద్దాం. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుందాం.

సమాప్తం

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు :

రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య. నేనొక గృహిణిని.

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు.



91 views1 comment
bottom of page