top of page

మరణాన్ని జయించి బ్రతుకుదాం


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి





'Marananni Jayinchi Bratukudam' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

"అమ్మా! ఏడవకు.. ప్లీజ్.. అన్నం తిను. అన్నం తినమ్మా..." అంటూ తల్లికి దగ్గరగా జరిగి, అన్నం ప్లేట్ అందుకుని తినిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు వంశీ.


కానీ తను ప్లేట్ ని తాకలేకపోతున్నాడు. తల్లి కన్నీటిని తుడవలేక పోతున్నాడు. అప్పుడే గుర్తొచ్చింది తనకి. తను చనిపోయి రెండు నెలలవుతోంది అని.


"నేను చనిపోయాను. ఇప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి? నేను తప్ప అమ్మకి ఇంకెవరూ లేరు. ఇప్పుడు అమ్మని ఎవరు చూసుకుంటారు? " అనుకుంటూ ఏడుస్తోంది వంశీ ఆత్మ.


ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

కుసుమ ఎలాగో ఓపిక కూడదీసుకుని లేచి వెళ్లి తలుపు తీసింది..


ఒక 25 ఏళ్ల కుర్రాడు. అతను చూడడానికి ఇంచుమించు వంశీ లాగే ఉన్నాడు. "అమ్మా! లోపలికి రావచ్చా?" అని అడిగాడు.


"రా బాబూ! ఎవరు నువ్వు?" అంది.


"నేను వంశీ ఫ్రెండ్ ని. వంశీ కి ఇలా అయింది అని వచ్చాను" అంటూ వంశీ ఫోటోకి పూల మాల వేసి, అక్కడే కింద కూర్చున్నాడు.


"పైన కూర్చో బాబు "అంది వంశీ తల్లి కుసుమ.


"పర్లేదు అమ్మా..

మిమ్మల్ని అమ్మా అనొచ్చా?" అన్నాడు ఆ అబ్బాయి..


కుసుమ కంట కన్నీరు తుడుచుకుంటూ "తప్పకుండా పిలువు బాబూ ! ఆ పిలుపుకి ఎలాగూ దూరమయ్యాను"అంటూ కూలబడి ఏడుస్తోంది ...


"వద్దమ్మా! ఏడవకు. నేనూ నీ కొడుకునే" అంటూ దగ్గరికి తీసుకుని ఓదార్చాడు.


అక్కడే ఉన్న వంశీ ఆత్మకి ఎంత ఆలోచించినా వచ్చిన అబ్బాయి ఎవరనేది గుర్తుకు రావట్లేదు.

కానీ తను ఎలాగూ ఓదార్చలేక పోతున్నాడు. కనీసం ఎవరో ఒకరి ద్వారా ఐనా అమ్మకి ఓదార్పు లభిస్తోందని సంతోషించాడు.


"అమ్మా. ఆకలి వేస్తోంది! అన్నం పెడతావా?" అన్నాడు ఆ అబ్బాయి..


"అయ్యో. అలాగే బాబూ !" అంటూ లోపలికి వెళ్లి ప్లేట్ లో అన్నం పెట్టుకుని తెచ్చింది.


"అమ్మా. నాకు చాలా ఆకలి వేస్తోంది.. కానీ నువ్వు తింటేనే నేనూ తింటాను" అన్నాడు ఆ అబ్బాయి.

అతని మాటతీరు కూడా అచ్చు వంశీ లాగే ఉంది.


"నా కొడుకు కూడా అచ్చు ఇలాగే ఆకలేస్తోందమ్మా... కానీ నువ్వు తింటేనే నేనూ తింటాను అనేవాడు "అంటూ భోరున విలపించింది.

అది చూసి వంశీ ఆత్మ ఘోషించింది.


"అమ్మా. నాలో వంశీ ని చూసుకో. ఎందుకంటే నాలో ఉన్నది వంశీ గుండె" అన్నాడు.


ఆ మాటతో కుసుమ గుండె ఉప్పొంగిపోయింది “అంటే నువ్వు...నువ్వూ... " అంటూ ఆ అబ్బాయిని ఆత్రంగా చూసింది.


"అవునమ్మా.. నేను రాముని. ఎవరికైతే నువ్వు చనిపోయిన నీ బిడ్డ గుండె దానం చేసి. మళ్ళీ ఆయువు పోశావో. ఆ బిడ్డని నేనే. నా పేరు రాము.. నవమాసాలు మోయకుండా, నీకు మళ్ళీ పుట్టిన పాతికేళ్ళ కొడుకుని. నాలో గుండె కొట్టుకుంటోంది అంటే అది మీ దయ అమ్మా.. ఈ గుండె నీ బిడ్డది” అన్నాడు.

కుసుమ కన్నీటితో రామును గుండెలకి హత్తుకుంది.


"అమ్మా! ఆ రోజు జరిగిన ప్రమాదంలో నువ్వు నీ బిడ్డని కోల్పోయావు. నేను కూడా నా కన్న తల్లిని కోల్పోయాను.

నేను హార్ట్ పేషంట్ ని. నాకు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు.. నాకు సరిపడా హార్ట్ దొరకాలని మా ఆమ్మ గుడికి వెళ్లి అర్చన చేయించి,

హాస్పిటల్ కి షేరింగ్ క్యాబ్ లో వస్తోంది. అదే క్యాబ్ లో మీ అబ్బాయి వంశీ కూడా ఉన్నాడు.


డ్రైవర్ తప్పిదం వల్ల ఆ క్యాబ్ ఆక్సిడెంట్ కి గురి అయింది. మా ఆమ్మ అక్కడికక్కడే చనిపోయింది. ఇక వంశీ బ్రెయిన్ డెడ్ అయ్యాడు.కానీ అప్పటికే నేను హార్ట్ ప్రాబ్లం తో హాస్పిటల్ లో ఉన్నాను. అదే హాస్పిటల్ కి వాళ్ళని తీసుకొచ్చారు.


అప్పుడే మీకు నా పరిస్థితి తెలిసి అవయవ దానం చేసి నాకు పునర్జన్మ ని ప్రసాదించారు. నేను కోలుకోడానికి రెండు నెలలు పట్టింది. ఇవాళ హాస్పిటల్ నుండి నేరుగా నీ దగ్గరికే వచ్చానమ్మా .


"అమ్మా..నాకు కూడా ఈ లోకంలో అమ్మ తప్ప ఇంకెవరూ లేరు .ఇకనుండి నాకు పునర్జన్మని ప్రసాదించిన నిన్నే మా అమ్మ గా భావిస్తాను” అంటూ కుసుమ కాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.


"లే నాన్నా.. ఏడవకు. ఇకమీదట నువ్వే నా కొడుకువి.. నేనే నీ తల్లిని.” అంటూ దగ్గరకు తీసుకుంది.


వారిద్దరినీ చూస్తూ. వంశీ ఆత్మ సంతోషంతో ఉప్పొంగిపోయింది.

" నేను చనిపోలేదు. రాము రూపంలో బ్రతికే ఉన్నాను. ఇప్పుడు మా అమ్మకి ఒక కొడుకు దొరికాడు"అంటూ సంతోషంగా వంశీ ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది .


ఒక ప్రమాదం ఒక తల్లికి కొడుకును, ఒక కొడుకుకి తల్లిని దూరం చేసినా..

అవయవ దానంతో ఒక మనిషికి ప్రాణం పోయడంతో తిరిగి ఒక తల్లికి బిడ్డ దొరికాడు.


అవయవదానం పై అపోహలు వద్దు. ఈ విశ్వంలో మరణం సహజం,అది సృష్టి ధర్మం.

మట్టిలో కలిసిపోయేదో, అగ్నిలో కాలిపోయేదో ఈ శరీరం.

అదే అవయవాలు దానం చేస్తే... అవి ఇంకొకరికి పునర్జన్మని ప్రసాదిస్తాయి.

"మరణాన్ని జయించి బ్రతుకుదాం.. అవయవ దానం చేద్దాం.

���


��పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణం అనివార్యమైనప్పుడు. మన మరణం తో. వేరొకరికి పునర్జన్మనిద్దాం.��.


�� శుభం ��


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు

164 views1 comment

1 commento


surupa.shastry
surupa.shastry
29 mar 2021

Bagundi. Avayava danam meeda focus chesi rasaru. Nizame! Kani malli pudite......???!

Mi piace
bottom of page