top of page

పాపం పండిన రోజు


Papam Pandina Roju Written By Ramya Namuduri

రచన : రమ్య నముడూరి


రాత్రి భోజనం చేసాక... కాసేపు వార్తలు విందామని టి. వి పెట్టుకున్నాను.... టీ. వి. లో న్యూస్ రీడర్ వార్తలు చదువుతోంది...

ఇంతలో బ్రేకింగ్ న్యూస్ అంటూ... ఒక వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య గురించి... ఆ న్యూస్ రీడర్ చెబుతూ ఉంటే... నా కంటి నుండీ ధారగా కన్నీరు రాసాగింది... ఆ ఘటన నాలో ఆవేశాన్ని, ఆక్రోషాన్ని నింపింది... ఆ దుర్మార్గుల్ని నా చేతితో చంపేయాలి అనిపించింది....

దేముడా ఎందుకయ్యా ఇలాంటి దుర్మార్గులను ఇంకా ఇంకా పుట్టిస్తుంటావు.... ఆ బంగారు తల్లిని ఇంత దారుణం గా చంపడానికి వారికెలా మనసు ఒప్పింది....ఇలాంటి వారిని నడి రోడ్డుపై ఉరి తీయాలి అని నా మనసు ఆక్రోశించింది....

అప్పుడే... మా తాతయ్య భోజనం పూర్తి చేసుకుని వచ్చి నా పక్కన కూర్చున్నాడు....

ఏమయిందిరా రాము ... ఎందుకంత బాధపడుతున్నావ్ అని అడిగారు....

చూడు తాతా... పాపం ఒక అమ్మాయి ని నలుగురు కలిసి అత్యాచారం చేసి, ఆపై ఆమెను సజీవ దహనం చేసారు అని చెప్పి, కోపంతో ఊగిపోతున్న నన్ను... మా తాత శాంతపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు ....

నాన్నా రాము జరిగినది ఘోరమే ... కాదనట్లేదు... కానీ నువ్విలా ఆవేశపడి ఏమీ సాధిస్తావ్ చెప్పు... వాళ్ళని శిక్షించడానికి కోర్టు, పోలీసులు ఉన్నారు.... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోడం నేరం... అంటూ చెప్తున్న మా తాత మాటలికి నేను అడ్డొచ్చి....

ఆపు తాత..... ఢిల్లీలో జరిగిన ఘోరం లో నిందితులకే ఇంకా శిక్షపడలేదు, ఇంకా వీరికి ఎప్పటికి పడుతుంది? అసలు దేముడనే వాడే లేడు... ఉండి ఉంటే...ఇలా జరిగేదా... ఆయన ప్రసాదాలు మెక్కి పడుక్కుని నిద్రోతున్నాడు... కళ్ళు తెరిచి చూడమను.....అంటూ... నేనింకో మాట మాట్లాడే లోగా... మా తాత చేయ నా చంపను తాకింది...

ఒక్కసారి మా తాత కొట్టిన దెబ్బకి... నోరుపెగలలేదు ఇంక నాకు... షాక్ కొట్టిన వాడిలా కొయ్యబారిపోయాను...

మళ్ళీ మా తాత ప్రేమగా నా తల నిమురుతూ... వద్దు రా.. దైవ నింద చేయకు....

దేముడు సర్వాంతర్యామి... కర్మ సాక్షి....చట్టం శిక్షించడంలో విఫలం కావచ్చేమో... న్యాయస్థానం... న్యాయాన్ని గెలిపించలేకపోవచ్చేమో....

కానీ.... దేముడు ... చూస్తూ... ఊరుకోడు... పాపం పండే రోజున, వీరిని శిక్షించక మానడు....

దీనికి నా చిన్నతనంలో నేను చూసిన సంఘటనే నిదర్శనం... అంటూ తన చిన్నతనంలో జరిగిన ఒక దుర్ఘటన గురించి చెప్పడం మొదలుపెట్టాడు... *************************

నేను డిగ్రీ పరీక్షలు రాసి, సెలవలకి మా అమ్మమ్మగారి ఊరు శివపురం వెళ్ళాను.....

పగలంతా... ఎండ బెదురు లేకుండా... ఆ ఊర్లో పిల్లలతో కలసి ఆడుకుని, ఇంటికి చేరాను నేను...

రాత్రి భోజనాలు అయ్యాక... ఆరుబయట మా తాత పక్కనే మడత మంచం వేసుకుని పడుకున్నాను.... తాతతో కబుర్లు చెప్పుకుంటూ... ఎప్పుడూ నిద్రపోయానో తెలీకుండానే నిద్రపోయాను... నడి రాత్రి ఏదో ఏడుపు వినిపిస్తే లేచి చుట్టూ చూసాను...

ఒక ఆడది ఏడుస్తున్నట్టు లీలగా వినిపిస్తోంది.... నాకు భయమేసి, మా తాతను లేపాను... మా తాత లేచి... "అది నువ్వు వినకు... చెవులు మూసుకుని పడుకో" అన్నాడు... నాకేమీ అర్థంకాలేదు... ఏంటి తాతా ఆలా అంటావ్... వెళ్లి ఆవిడని కాపాడదాం అన్నాను...

ఆ ఆడమనిషి ఏడుస్తూ.... "నాయనా... రంగా... చంపేసార్రా నిన్నూ... అయ్యో... కొడకా..... వెళ్ళిపోయావురా అమ్మనోదిలేసి.... కొడకా రంగా.... చంపేసార్రా... నా కొడుకా.. నాయనా... రంగా.... చచ్చిపోయావా.... నా కొడుకుని చంపేసార్రా...." అంటూ... పిచ్చి పిచ్చిగా అరుస్తూ .... చేతులతో రోడ్డుపై ఉన్న మట్టి తీసి, నెత్తిమీద జల్లుకుంటూ.... ఆ ఊరి జమీందారు గారి ఇంటి ముందుకి వెళ్లి... "నాశనమైపోతావురా... బసవయ్యా... ఈ తల్లి శాపం నిన్ను కాల్చక మానదు...పోతావు... నా కొడుకు దగ్గరికే పోతావు అంటూ" పూనకం వచ్చినట్టు ఊగిపోతూ... శాపనార్ధాలు పెడుతోంది...

ఆ ఇంట్లో పనివాళ్ళు వచ్చి,ఆమెను కొట్టి తరిమేసారు... పిచ్చిముండా... ప్రతీ రోజూ దీని హింస పడలేకపోతున్నాం అంటూ ఆమెను దుర్భాషలాడారు... 'ఛీ... ఏ రోజూ ప్రశాంతం గా పడుకోనివ్వదు' అంటూ తిట్టుకుంటూ వెళ్లిపోయారు

జమీందారి గారిల్లు మా తాత వాళ్ళ ఇంటిముందరే కావడంతో.... నేను అదంతా చూస్తున్నాను... మా తాత మాత్రం ఏమీ కంగారుపడకుండా... 'పడుక్కోరా నాన్నా.... ఇది మా ఊరిలో రోజూ జరిగేదే... రెండ్రోజులుంటే నీకు అలవాటైపోతుంది...ఆ దేముడే... ఆవిడకి న్యాయం చేస్తాడు... నువ్వు పడుకో ' అన్నాడు...

నాకు నిద్ర పట్టలేదు... "తాతా... ఎవరు ఆవిడ, ఎందుకలా ఏడుస్తోంది? నాకు చెప్పు" అంటూ మా తాతని కూడా పాడుకొనివ్వలేదు నేను...

నా బాధ భరించలేక... మంచం కింద ఉన్న మరచెంబు అందుకుని కాసిన్ని మంచినీళ్లు తాగి... నా ప్రశ్నలకు సమాధానం గా... ఆమె కధ చెప్పడం ప్రారంభించాడు మా తాత....

"ఆమె పేరు జానకి... ఆమె కొడుకు పేరు రంగా...రంగా చిన్నతనంలోనే, తండ్రిని కోల్పోయాడు... జానకి, వాళ్లకున్న ఎకరం భూమిని సాగు చేసుకుంటూ, మిషన్ కుట్టి, ట్యూషన్స్ చెప్పుకుని, వచ్చిన డబ్బులతోనే.. రంగా ని కస్టపడి పెంచి, డిగ్రీ దాకా చదివించింది...

వాడు కూడా... మంచి ఉద్యోగం సంపాదించుకుని... తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకునే వాడు... ఒకరోజు... వాడు.. ఆఫీస్ నుండీ ఇంటికి వస్తుంటే... ఇదిగో... ఈ జమీందారు ఉన్నాడే... వీడి కూతురు ... కార్ స్పీడ్ గా నడిపి, రంగా ని గుద్దేసింది... కార్లో వీడు కూడా ఉన్నాడు

ఆ అమ్మాయి...'నాన్నా.... ఆక్సిడెంట్ కదా కేసు అవుతుంది నాకు శిక్షపడుతుంది' అంటూ ఏడుస్తుంటే...

'వాడు బ్రతికితేనే కదా' అంటూ రంగామీద నుండి కార్ పోనిచ్చి... పూర్తిగా వాడి ప్రాణాన్ని గాలిలో కలిపేశాడు... వాడి మనుషులు... రంగా శవాన్ని కూడా మాయం చేసేసారు... అప్పటికి చీకటి పడిపోయి ఉండడంతోను, ఆ ప్రమాదం పొలిమేరల దగ్గర జరగడం వలన, ఇద్దరు, ముగ్గురు కంటే జనం లేకపోడంతో... వాళ్ళని బెదిరించో, డబ్బు ఆశపెట్టొ వాళ్ళ నోరు మూయించాడు బసవయ్య...

జానకి కొడుకు కోసం వెతుకుతుంటే... 'నీ కొడుకు పట్నం లో ఎవరో అమ్మాయిని పెళ్లిచేసుకుని వెళ్ళిపోయాడు' అంటూ పుకారు పుట్టించి, ఆమెనోరు నొక్కించాడు...

'నా కొడుకు నన్ను వదిలిపోడు, నువ్వూ, నీ కూతురూ....... నా కొడుకుని కార్ తో గుద్ది చంపేశారు' .... అంటూ ... ఏడ్చి, ఏడ్చి, పిచ్చిదయిపోయింది....

ఈ ఊరిలో వాడ్ని ఎదిరించి ఎవరూ సాక్ష్యం చెప్పేవారే లేరు... వాళ్ళ అమ్మకి చివరిచూపుకూడా లేకుండా చేసారు... కానీ ఊరిలో అందరికీ తెలుసు రంగా ని చంపేసింది జమీందారు బసవయ్యా , వాడి కూతురు అని...

జానకికి ఎవరూ లేకపోవడంతో... కోర్టు, కేసు అంటూ తిరగే వారు కూడా లేకపోవడంతో... పోలీసులు, మా ఊరికి రాకుండా... డబ్బులు విసిరేయడంతో......వాడు , వాడి కూతురూ తప్పించుకున్నారు...

ఇది జరిగి పదేళ్లు అవుతోంది... ఆరోజు నుండీ ఈరోజు వరుకు... ప్రతీ రాత్రి... ఇంచు మించు ఇదే టైం కి... ఇలా అరుచుకుంటూ.... ఏడుస్తూ.... శాపనార్ధాలు పెడుతూ... ఉంటుంది..."అని చెప్పి, కళ్ళు తుడుచుకున్నాడు మా తాత....

"తాతా... మరి ఆమెకు ఇంత అన్యాయం జరిగినా, వాడ్ని దేముడు ఎందుకు శిక్షించట్లేదు తాతా" అన్నాను ఆక్రోషంగా...

"ఎందుకు శిక్షించలేదు? వాడి కూతురు కూడా ఏడాది తిరగకుండా ఇలాంటి ఆక్సిడెంట్ లో చచ్చింది. అది కూడా కుక్కచావు చచ్చింది అనే చెప్పొచ్చు" అన్నాడు తాత ఆవేశంగా... "కానీ వీడికే ఇంకా పాపం పండలేదు" అంటూ నిట్టూర్చాడు...

"వీడికీ పాపం పండే రోజూ తప్పక వస్తుంది... దేముడు అన్నీ చూస్తున్నాడు... నువ్వు ఇక పడుకో నాన్నా" అంటూ... తను నిద్రలోకి జారుకున్నాడు...

నేను పడుకున్నాను కానీ... నాకంతా... అవే ఆలోచనలు... దేముడా... ఆమెకు న్యాయంచేయి... ఆ బసవయ్య పతనం ఆమె చూసేలా చేయి అనుకుంటూ... నిద్రలోకి జారుకున్నాను... ***************** మరునాడు రాత్రి కూడా అంతే... ఆమె ఏడుస్తూ రావడం, నాశనమైపో ... నీ శవం రాబందులు పీక్కు తినాలి అంటూ శాపనార్ధాలు పెట్టడం, బసవయ్య మనుషులు వచ్చి ఆమెను కొట్టి, తరిమేయడం... ఇదే జరుగుతోంది... నేను వాళ్ళని ఎదిరించబోతే... మా అమ్మమ్మ, తాతా నన్ను వారించి... నేను అక్కడే ఉంటే ఆవేశంలో... ప్రమాదం కొని తెచ్చుకుంటానేమో అని... నన్ను బలవంతంగా మా అమ్మా, నాన్నల దగ్గరికి పంపించేశారు...

నేను అక్కడనుండి వచ్చేసాక ... కొన్నాళ్ళకి అవన్నీ మర్చిపోయి... నా చదువు, హడావిడిలో పడిపోయాను... ********* కొన్ని నెలల తరువాత.... మా తాతా, అమ్మమ్మా మా ఇంటికి వచ్చారు... నేను సంతోషం గా వెళ్లి వాళ్ళని హత్తుకున్నాను... భోజనాలు అయిన తరువాత... మా తాత నన్ను దగ్గరికి తీసుకుని, "నాన్నా... జానకికి న్యాయం జరిగింది" అన్నాడు నా కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి... "ఏంటి తాతా? ఎలా?" అన్నాను...

"బసవయ్య కొడుకు... పొలాలు అమ్మి.. ఆ డబ్బు అదేదో షేర్ మార్కెట్ అంట... అందులో పెట్టాడు... మొత్తం ఆ డబ్బాంతా పోయి, అప్పులపాలై... పిచ్చిపట్టింది...

అతన్ని తీసుకుని పిచ్చి ఆసుపత్రికి వెళ్తుంటే .. దారిలో.. చుట్ట కాల్చుకుందామని దిగాట్ట బసవయ్య...

అంతే... వాడి కొడుకు డ్రైవర్ ని ఒక్కతన్ను తన్ని... డ్రైవింగ్ సీట్ లోకి దూకి... డ్రైవ్ చేస్తూ... బసవయ్యను గుద్దేసి... వాడిమీదనుంచే కారు పోనిచ్చాడు... ఆనాడు బసవయ్య ఎలాగైతే... రంగా మీదనుండి కార్ పోనిచ్చి చంపాడో... అచ్చు...అలాగే...'అంటూ చెప్పి ముగించాడు...

కాసేపు మౌనం తరువాత మళ్ళీ మాట్లాడాడు... "చూసావా నాన్నా... కాలం ఎలా బదులు ఇచ్చిందో వాడికి..." అంటూ... కళ్ళు తుడుచుకున్నాడు...

*****************************

నాన్నా... రాము ...... ఆరోజు నుండీ ఈరోజు వరకూ నేను అదే నమ్ముతున్నాను...పాపం పండే రోజు వస్తుంది...

""ఒకరు చేసిన పాపం వల్ల... మనం కార్చిన కంటినీరు...మృత్యుశరమై, కాలం తన అమ్ములుపోది లో పదిలపరుస్తుంది.... పాపం పండినరోజు... దైవాజ్ఞ చేత........ఆ శరమే కంటకమై... వారి కధ ముగిస్తుంది...""" అంటూ ముగించాడు మా తాత.... *****************************************

అమాటలు నాలోని ఆవేశాన్ని తగ్గించి... ఆలోచింపచేసాయి.... చేతులు జోడించి...🙏 దేముడికి క్షమాపణలు చెప్పుకుని... ఆ సోదరికి న్యాయం చేయి స్వామి అని నీరు నిండిన కళ్ళతో... మనస్ఫూర్తిగా ప్రార్ధించాను ...

నేను కూడా... నా దైనందిన జీవితంలో ముందుకుపోశాగాను .... ********************************** పది రోజుల తరువాత.....

"రాము .... ఇది విన్నావా.... ఆ అమ్మాయి ని చంపిన నలుగురూ సరిగ్గా ఆ అమ్మాయి చనిపోయినచోటే... ఎన్కౌంటర్ అయ్యారట" అంటూ... వచ్చి చెప్పాడు నా కొలీగ్ వంశీ....

నా మనసుకి ఏదో తెలియని ప్రశాంతత చేకూరింది... దేముడికి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు తెలుపుకున్నాను 🙏.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడు స్వామి అని మనసులోనే వేడుకున్నాను 🙏... *********************************************** తప్పు చేసిన వారికి వెంటనే శిక్షపడొచ్చు... లేదా... కొంత కాలం పట్టవచ్చు... కానీ... తప్పక శిక్ష పడుతుంది... అది చట్టం చేతిలో కావచ్చు... లేదా... భగవంతుడి చేతిలో కావచ్చు... కానీ శిక్ష పడే తీరుతుంది 🙏 ******************************************* 🌹సమాప్తం 🌹
రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు

117 views2 comments

2 Comments


Nijamenamdi thappu chyse manishi thananu yavaru chudaledhu siksha numchi thappimchukunnanu anukuntadu.kani thanu chysina thappukuki kalam tirigi samadhanam chyputhundhi. aa samadham manaki kanabadani dhevudi ayye vuntundhi ani chala baga rasaru.chala bagundhi.

Like

bottom of page