top of page
Writer's pictureRamya Namuduri

సంక్రాంతి -కొత్త అల్లుడు


'Sankranthi - Kotha Alludu' - New Telugu Story Written By Ramya Namuduri

'సంక్రాంతి -కొత్త అల్లుడు' తెలుగు కథ

రచన: రమ్య నముడూరి


తూర్పుగోదావరి జిల్లా...

రామాపురం..గ్రామం.....

సమయం 5:45....

అప్పుడే కొద్ది కొద్దిగా... చీకట్లు చీల్చుకుంటూ...మంచు పొరల మధ్యగా సూర్యుడు ఉదయిస్తున్నాడు...

పక్షులు కిల కిల రాగాలు శ్రావ్యంగా ఆలపిస్తున్నాయి...

ప్రతీ ఇంటి లోగిలీ... ముత్యాల ముగ్గులతో, గొబ్బెమ్మలతో శోభాయమానంగా వెలిగిపోతూ...సంక్రాంతి పండగకు స్వాగతం పలుకుతున్నట్టు అందంగా వెలిగిపోతున్నాయి....

'హరి గోవింద... గోవిందా...

రామ,సీతా...రామ గోవిందా...'

అంటూ..చిడతలు వాయిస్తూ... హరిదాసు ఆలపిస్తున్న గానామృతం తో... గృహలక్ష్మలు బయటకొచ్చి... హరిదాసు కి ధాన్యం సమర్పించుకుంటున్నారు....

ఇటు హరిదాసు పాటలు, అటు గంగిరెద్దు ను ఆడిస్తూ.. అయ్య గారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ శ్రావ్యంగా పాడుతూ...సన్నాయి వాయిస్తూ వీధి వీధీ తిరుగుతున్న గంగిరెద్దు మెడ గంటల సవ్వడులతో.... ఆ పల్లెటూరు రామాపురం ఎంతో ఆహ్లాదకరం గా ఉంది....

మంచు పొరల మధ్య వెలిగిపోతూ ఉదయిస్తున్న సూర్యునికి సైతం.... ఆ పల్లెటూరి వాతావరణం ఆహ్లాదాన్ని అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు....

గలగలా ప్రవహించే గోదావరికి ఆనుకుని ఉన్న పచ్చని పంటపొలాల్లో..... పాటలు పాడుకుంటూ కల్మషం ఎరుగని రైతన్నలు.... పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు...

వాళ్ళు అలా పనులు చేసుకుంటూ ఉండగా...

పక్కనే ఉన్న గతుకుల రోడ్డు మీదగా... ఒక ఎర్ర రంగు

కార్ దుమ్ము లేపుకుంటూ వెళ్లడం చూసి...

‘మన ఊరిలోకి ఇంత పెద్ద కార్ వేసుకొచ్చింది ఎవరై ఉంటారంటావ్?’ అన్నాడు ఒకడు ..

‘అదేనెహే ... మన ఊరి పెసిడెంట్ గోరి..అల్లుడు, కూతురు.. రా.. ‘ అన్నాడు పక్కనున్న వాడు...

‘ఓ.. సంక్రాతి పండక్కి వచ్చుంటారు... ఐనా వాళ్ళ ఊసులు మనకెందుకులే..మన పనేదో మనది’ అంటూ వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోయారు....

"ఏమి రోడ్స్ ఇవి మధు... మీ నాన్న ప్రెసిడెంట్ కదా.. మంచి రోడ్స్ వేయించొచ్చుకదా... అబ్బబ్బా.. వళ్ళు హూనం ఐపోతోంది" అంటున్న భర్తను...

"హా... పల్లెటూరులో రోడ్స్ ఇలానే ఉంటాయి... హైదరాబాద్ లో రోడ్స్ కన్నా ఘోరంగా ఏమీ లేవు లెండి.. ముందు చూసి పోనివ్వండి.... అందరూ మా నాన్న ని అనే వాళ్లే "అంటూ మూతి తిప్పుకుంది మధు...

"అబ్బా... అదికాదు మధు... నైట్ నుండి డ్రైవ్ చేస్తున్నాను కదా...అందుకే అలా అన్నా... అంతే కానీ మీ నాన్నని ఏమీ అనలేదే బాబు..."అంటూ.... ముద్దులపెళ్ళానికి నచ్చచెప్తూ డ్రైవ్ చేస్తున్నాడు రాధా కృష్ణ...

‘హుమ్... సరే’ అంటూ కార్ విండో నుండి బయటకు చూస్తూ.... పుట్టి పెరిగిన ఊరి అందాల్ని ఆస్వాదిస్తూ... తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.... భర్త తో ఆ ఊసులని చెప్పుకుంటూ... ఆనందం గా సాగిపోతోంది వాళ్ళ ప్రయాణం...

అంతలో మధు చదువుకున్న స్కూల్ వచ్చింది.... "కార్ స్లోగా పోనీ రాధా.... అదిగో అది నేను చదువుకున్న స్కూల్" అంటూ చూపించింది మధు...

అంతలోనే ఆమె మొహంలో రంగులు మారిపోయాయి... అది గమనించిన రాధా... "ఏమైంది మధు" అని అడిగాడు...

"నేను చదువుకున్న స్కూల్ అది రాధా... ఇప్పుడు ఎలా ఐపోయిందో చూడు "😪 అంది బాధగా...

"సరేలే మధు... బాధపడకు" అంటూ కార్ ని ముందుకు నడిపాడు రాధా....

మధు తన ఊరి అందాల గురించి ఒక్కొక్కటిగా చెబుతూ మురిసిపోతోంటే.. ఆమె కళ్ళలో ఆనందాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ... ప్రయాణ బడలికను సైతం మర్చిపోతున్నాడు రాధా....

రాధా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఉంటాడు... అందుకని పెళ్లి ఐన వారానికే...మధు ని అమెరికా తీసుకెళ్లిపోవాల్సివచ్చింది... మళ్ళీ ఇండియా తిరిగిరావడానికి మూడేళ్లు పట్టింది....

అందువల్ల ఆ జంటకి మొదటి సంక్రాతి వేడుక జరగలేదు...

ఆ రకంగా... పెళ్లి ఐన మూడేళ్ళ తరువాత ఈసారి సంక్రాతి కి అత్తగారింటికి భార్యను తీసుకుని వెళ్తున్నాడు రాధ...

ఆరకంగా సంక్రాతి కి కొత్త అల్లుడయ్యాడు రాధా...

మధు ఆనందానికి హద్దే లేదు...

వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మధు పుట్టిల్లు వచ్చేసింది...

వీళ్ళు కార్ దిగేసరికి ..

హారతి పళ్లెం పట్టుకుని నిలబడింది మధు తల్లి జానకి...వీళ్ళ రాక కోసమే ఎదురు చూస్తున్న... మధు తండ్రి భద్రయ్య...కూతుర్ని అల్లుడుని ఘనంగా స్వాగతించాడు...

రాధా, మధు లకు ఇరుమారు, ముమ్మారు దిస్టితీసి....

లోపలికి తీసుకెళ్లారు...

కూతుర్ని తనివితీరా హత్తుకుని ముద్దుపెట్టుకుంది జానకి.. అల్లుడిని గుండెలకు హత్తుకుని కుశల ప్రశ్నలు వేసాడు భద్రయ్య....

"బాబు .. ఇవాళ మీ ఇద్దరూ కలిసి మన ఊరి శివాలయం లో రుద్రాభిషేకం చేయడం కోసం... పళ్లరసాలు, పంచామృతాలు ఇతర ఏర్పాట్లు అన్ని సిద్ధం చేసి ఉంచాను... మీరు తయారై రండి" అంటూ.. వారిద్దరికీ పట్టు చీర, పట్టు పంచి ఇచ్చాడు భద్రయ్య

స్నానం చేయడానికి వేడి నీళ్లు సిద్ధం చేసి ఉంచింది... అల్లుడికి, కూతురికి గది చూపించి... ఫ్రెష్ అయిరండని పంపి... వంటగది వైపు వెళ్ళింది జానకి...

అక్కడ కాఫీ కలుపుతోన్న పంకజం... జానకిని చూసి.. "ఏమైందమ్మా ఆయాసపడిపోతున్నారు" అంది..

"అదేనే.. అమ్మాయిని, అల్లుడిని తీసుకుని గుడికి వెళ్లి రుద్రాభిషేకం,సంతర్పణ చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మీ అయ్యగారు... ఈ కార్యక్రమాలు అన్ని ఎలా గట్టెక్కుతాయా అని...." అంటూన్న జానకి తో...

"మీరేమి గాబరా పడకుండా కూకోండమ్మా..." అంటూ కాఫీ కలిపి జానకి కి ఇచ్చింది....

"ఏమోనే... అమ్మాయి, అల్లుడు మూడేళ్ళ తరువాత ఇన్నాళ్ళకి ఇంటికి వచ్చారు...నాకు సంతోషం తో కాలు చెయ్యా ఆడట్లేదే" అంటోంది పంకజం తో...

"మరేనండమ్మా.... అమ్మాయి గారు వచ్చి మూడేళ్లయిపోయింది... పోనీలెండమ్మా... ఈ సంక్రాతి అదిరిపోవాలి మరీ..." అంటూ జంతికలు తయారు చేసేస్తోంది పంకజం....

ఈలోగా మధు రెడీ అయ్యి బయటకి వచ్చింది. గ్రీన్ కలర్ పట్టు చీర కట్టుకుని అందంగా మెరిసిపోతోన్న కూతుర్ని చూసుకుని మురిసిపోతోంది జానకి...

"అమ్మా.... నాన్న ఏరి" అని అడిగింది మధు...

"అదిగో... ఊర్లో వాళ్ళు వస్తే మాట్లాడుతున్నారు... అరుగుమీద ఉన్నారు" అంది జానకి...

పంకజం వచ్చి... "బాగున్నారామ్మా..." అంది...

"హా.. బాగున్నా పంకజం... నువ్వు బాగున్నావా" అంటూ పలకరించింది మధు...

"అయ్... బాగున్నా తల్లీ... ఛాన్నాళ్ళకి వచ్చారమ్మా... మీకోసం బెంగపెట్టుకుని అమ్మగారు చిక్కి సగమైపోయారు పాపం" అంది పంకజం.

వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా రాధా కూడా రెడీ అయి వచ్చాడు... పట్టు పంచ, కండువాలో రామ చంద్రమూర్తిలా వెలిగిపోతున్న అల్లుడిని చూసుకుని మురిసిపోయింది జానకి...

వాళ్ళిద్దర్నీ.. గుడికి తీసుకెళ్లి రుద్రాభిషేకం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేయించాడు భద్రయ్య...

"అమ్మా... మధు..." అంటూ వచ్చాడు భద్రయ్య...

"నాన్నా !" అంటూ తండ్రిని అల్లుకుపోయింది మధు చిన్నపిల్లలా...

భద్రయ్య రాధా వంకా చూసి "అల్లుడుగారూ...బయలుదేరుదామా" అన్నాడు...

"హా... మేము రెడీ మామయ్యా" అన్నాడు రాధా...

వాళ్లంతా కలసి గుడికి బయలుదేరారు...

"శివాలయం రెండు వీధుల అవతలే కాబట్టి... కాలినడకనే వెళ్దాం" అన్నాడు భద్రయ్య...

అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తు ఉంటే...అందరూ రాధా, మధు లను చూసి సీతారాముల్లా అందమైన జంట అనుకున్నారు... అందరూ వాళ్ళని ఆప్యాయంగా పలకరించే వారే....

అలా వాళ్ళు గుడికి చేరే సరికి పూజారి అన్ని ఏర్పాటులతో సిద్ధంగా ఉన్నారు...

వాళ్ళిద్దరి చేత సంకల్పం చెప్పించి... అభిషేకం చేసారు పూజారి గారు...

అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తున్నంత సేపు... రాధా, మధులిద్దరు తమకు సంతానభాగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులు జోడించి🙏 భగవంతుణ్ణి వేడుకున్నారు...

పూజారి గారు రుద్రాభిషేకం శాస్త్రోక్తం గా పూర్తిచేసి...

సత్సంతాన ప్రాప్తిరస్తు అని ఆ దంపతులని దీవించారు...

తరువాత వేదంపండితులందరు కలిసి ఘన స్వస్తి చెప్పి... వారిద్దరినీ దీవించారు...

వారందరికీ ఘనంగా... పంచల చాపుతో పాటు, దక్షిణ ఇప్పించాడు భద్రయ్య...

అభిషేకం పూర్తి చేసుకుని... భక్తులందరికి అన్న సంతర్పణ చేసి... గుడి బయట ఉండే భిక్షగాళ్లకి... బట్టలు, రగ్గులు పంచిపెట్టారు...

అదంతా పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం వంటిగంట అయింది...

వాళ్లంతా... గుడిలోనే అన్నసంతర్పణ ప్రసాదం తిని... ఇంటికి చేరేసరికి రెండయ్యింది....

బాగా అలిసిపోయి ఉండడంతో...రాధా, మధు లు కాసేపు పడుకుంటామని ఇద్దరూ వాళ్ల గదిలోకి వెళ్లి పడుకున్నారు....

*****************

సాయంత్రం నాలుగు అవుతోంది...

మధు బద్దకంగా వచ్చి సోఫా లో కూర్చుంది... రాత్రంతా ప్రయాణం... పొద్దున్న అభిషేకం అది అంతా చాలా అలసటగా అనిపించింది తనకి...

మధు దగ్గరికి వేడి వేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది జానకి...

ప్రేమగా... కూతురి తల నిమురుతూ.. "అల్లుడు ఇంకా లేవలేదా" అంది...

"అయన చాలా అలసిపోయారమ్మా.... కాసేపుండి లేపుతాలే" అంది మధు...

"జానకమ్మగారూ..." అంటూ లోపలికి వచ్చారు కొంతమంది ఆడవాళ్లు.

అక్కడ కూర్చుని ఉన్న మధు ని చూస్తూ... "ఎమ్మా మధు బాగున్నావా?" అని అడిగింది అందులో ఒక ఆవిడ.

" హా బాగున్నా ఆంటీ" అంది మధు...

"రేపు మా మనవడికి భోగిపళ్లు... సాయంత్రం పేరంటం.. తప్పకుండ రావాలి" అంటూ ఇద్దరికీ బొట్టు పెట్టి వెళ్ళారు ఆ వచ్చిన ఆడవాళ్లు...

మధు కి కొంచం బాధగా అనిపించింది...

అంతా బాగుండి ఉంటే నాకు కూడా ఈపాటికి పాపో, బాబో ఉండేవారు... నేను కూడా ఇలా భోగిపళ్లు పేరంటం పెట్టుకునే దాన్ని కదా అనుకుంది మనసులో...

ఆమె కన్నులవెంట సన్నని నీటిపొర .... జానకి కి కనిపించింది...

"ఏమ్మా.. ఏమైంది?" అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకుంది జానకి...

అదే అమ్మా.. పెళ్లి అయి మూడేళ్లు అవుతోంది.. ఇంకా నా కడుపు పండలేదు 😪.. డాక్టర్ చెకప్ చేయిస్తే నాకు 'పి సి ఓ డి' ఉంది అన్నారు... నేను టాబ్లెట్స్ వాడుతున్నాను.. కానీ నాకు సంతానం కలగట్లేదు😪 అంటూ దుఃఖపడింది మధు...

కూతురి కంట నీరు చూసేసరికి జానకి మనసు బాధతో మెలితిరిగిపోయింది...

"ఊరుకో తల్లీ... రేపు మీ నాన్న మీ ఇద్దరి చేతా గోదా కళ్యాణం చేయిస్తున్నారు..ఆ స్వామి దయవల్ల మళ్ళీ ఏడు సంక్రాతి కల్లా నీ చేతిలో పసి బిడ్డ ఉంటాడు, బాధపడకు" అని ఓదార్చింది జానకి.

"అవును.. చెప్పటం మరిచిపోయాను..మన పక్క ఇంటి పార్వతి గారి మనవరాలు గొబ్బిళ్లు పెట్టుకుంటోంది... ఇందాక వచ్చి పిలిచారు.. నిన్ను మరీ మరీ అడిగారు... నువ్వు పడుక్కున్నావని లేపలేదు..తొందరగా వెళ్లి రెడీ అవ్వు వెల్దువుగాని" అని తొందరపెట్టింది కూతుర్ని జానకి....

మధు కూడా... అన్ని మర్చిపోయి.. కన్నీళ్లు తుడుచుకుని... పేరంటానికి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి వెళ్ళింది....

ఆమె మెరూన్ కలర్ పట్టు చీర కట్టుకుని... నగలు పెట్టుకుని అందంగా రెడీ అయ్యేసరికి, రాధా నిద్రలేచాడు.... అందంగా రెడీ అయిన మధు ని చూస్తూ... "దేవలోకంలోంచి అప్సరస దిగివచ్చి... నా గదిలో నుంచున్నట్టుందే 😍" అంటూ మధుని వెనకనుండి గట్టిగా హత్తుకున్నాడు...

"అయ్యో.. ఆగండి... చీర నలిగిపోతుంది.. నేను పేరంటానికి వెళ్తున్నాను..."

"హ్మ్మ్... ఇలా వెల్లకే... దిష్టి తగిలేస్తుందేమో నా బంగారానికి.." అంటూ ఆమెను తనవైపు తిప్పుకుని.. గట్టిగా హత్తుకుని.. ఆమె పెదవులు అందుకున్నాడు...

ఆ ఆలుమగల ఏకాంతాన్ని భంగపరుస్తూ ....

"అమ్మా మధు... తొందరగా రామ్మా... పేరంటానికి లేట్ అవుతోంది" అని పిలిచింది జానకి...

ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు రాధా, మధు లు...

"వదలండి అమ్మ పిలుస్తోంది" అంటూ జింకపిల్లలా పరిగెడుతున్న మధుని చూసి మురిపెంగా నవ్వుకున్నాడు రాధా...

తను కూడా ఫ్రెష్ అవడానికి వాష్రూమ్ కి వెళ్ళాడు...

మధు, జానకి లు కలిసి పార్వతమ్మ ఇంటికి గొబ్బిళ్ళు పేరంటానికి వెళ్ళారు... అక్కడవారందరు.. మధుని ఎంతో ఆప్యాయంగా పలకరించారు...

పార్వతమ్మగారి మనవరాలు... పిల్లలందరితో కలసి గొబ్బిళ్ళు పెట్టుకుంటోంది...

ఆవిడ మనవరాలి చేత... గొబ్బెమ్మ లకు పూజ చేయించి, నైవేద్యం పెట్టించి...

'గొబ్బి సుబ్బమ్మా... సుబ్బన్నియ్యవే...

చామంతి పువ్వమ్టి చెల్లెల్నియ్యవే...

తమలపాకంటి తమ్ముడ్నియ్యవే...

అరటిపండంటి అత్తా నియ్యవే...

మందారపువ్వమ్టి మామనియ్యవే...

మొగలిపువ్వమ్టి మొగుడ్నియ్యవే....'

అంటూ పాట పాడించి.. పూజ ముగించింది....

ఆ పాప, మిగితా పిల్లలందరూ కలిసి..గొబ్బి గౌరమ్మ చుట్టూ తిరుగుతూ...

'గొబ్బియల్లో.. సఖియా వినవె, చిన్ని కృష్ణుని సోదరి వినవె... కృష్ణుని చరితము గానారే...

గొల్లవారి వాడలకు కృష్ణ మూర్తి.. నువ్వు ఎందుకయ్యా వచ్చినావు కృష్ణ మూర్తి....

విత్తనం విత్తనం వేసారంట ఏమి విత్తనం వేసారంట.. రాజావారి తోటాలో... జామవిత్తనం వేశారంటా...

అవునాటే అక్కల్లారా... చంద్రగిరి భామల్లారా...

బామ్మలుగేరి గొబ్బిళ్ళు..

గొబ్బియల్లో.. గొబ్బియల్లో...

చందమామ, చందమామ, ఓ చందమామ

చందమామ కూతురు నీలగిరికన్య....'

అంటూ గొబిళ్ళ పాటలు అన్ని పాడుతూ... ఆడుతూ...

'బుజి బుజి రేకల పిల్లుందా...

బుజ్జారేకలా పిల్లుందా...

స్వామి దందన పిల్లుందా..

స్వరాజ్య మిచ్చే పిల్లుందా....'

అంటూ...పెళ్లి పాట కూడా పాడి.... గొబ్బిళ్ళు ముగించారు...

పార్వతమ్మ మనవరాలి చేత, వచ్చిన ముతైదువలకు, పిల్లలకు తాంబూలం, ప్రసాదం ఇప్పించింది....

అలా వాళ్ళు గొబ్బిళ్ళు ముగించుకుని ఇంటికి చేరారు...

లోపలికి వస్తున్న మధు ను వెనకనుండి వచ్చి కళ్ళు మూసాడు ఒక అతను...

అంతే... మధు పెదవులపై చిరునవ్వు విరిసింది....

"అన్నయ్యా..." అంది మధు సంతోషం గా...

"హే... రాక్షసి... గుర్తుపట్టేసావా..." అంటూ ముందుకొచ్చాడు... మధువాళ్ళ పెదనాన్న గారి అబ్బాయి శ్రీను...

"ఎప్పుడొచ్చావు రా.." అంటూ శ్రీను చేతులు పట్టుకుని గిర గిరా తిప్పేస్తూ సంతోష పడిపోతోంది మధు...

"హా... నువ్వు పేరంటానికనీ ... పాపం బావని వదిలేసి వెళ్ళావ్ కదా.. అప్పుడే..." అంటూ చెప్తున్నాడు శ్రీను..

వీళ్లిద్దరి అల్లరి చూసి మురిసిపోతున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన రాధా, భద్రయ్యలు....

వాళ్లంతా కలిసి డిన్నర్ చేసి...గార్డెన్లో కూర్చుని... కబుర్లు చెప్పుకుంటూ గడిపారు ఆ రాత్రి చాలా సేపటి వరుకు...

భద్రయ్య వచ్చి... "బాబూ ! రేపు తెల్లవారగానే లేవాలి... గుడిలో గోదా కళ్యాణం చేయవలిసిఉంది..." అంటూ వాళ్ళని ఎవరి గదుల్లోకి.... వాళ్ళని పంపేశాడు...

అలా ఆరోజు గడిచింది.....

**********

మరునాడు తెలవారుజాము అయింది....

జానకి... రాధా, మధుల గది తలుపులు కొట్టి వాళ్ళని నిద్ర లేపింది....

వారిద్దరూ కూడా రెడీ అయ్యి...

భద్రయ్య కోరినట్టుగా... తను పెట్టిన వేరొక కొత్త పట్టుచీర, కొత్త పట్టు పంచ కట్టుకుని వచ్చిన... కూతురుని, అల్లుడుని చూసుకొని పొంగిపోయాడు...

వారందరూ బయలుదేరి గుడికి చేరారు...

పూజారి గారు ఆఖరి పాశురాన్ని చదివి....

శ్రీ గోదా రంగనాధ స్వామి వారి కళ్యాణమును అత్యంత భక్తి, శ్రద్ధలతో... శాస్త్రోక్తముగా జరిపారు...

అనంతరం... గోదా దేవి కథను చెప్పడం ప్రారంభించారు....

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడను భక్తుడు ఉండేవాడు.

ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే.

విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు.

విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ పేరు పెట్టారు . ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా ఇచ్చారు . అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా తలచి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు.

ఆమెకు ‘కోదై’ అంటే - పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా ‘గోదా’గా మారింది.

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే.

యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది.

కళ్లుమూసినా, తెరిచినా కృష్ణుడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది.

అంతేకాదు! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం గుచ్చే మాలలను ముందు తనే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.

ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ, అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది.

తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై!

ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు, ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి, గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ, విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి, అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది.

ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది.

అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి, విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

అంటూ గోదా దేవి చరిత్రను, గోదా రంగనాధ స్వామి కళ్యాణం గురించి వివరించారు పూజారిగారు...

ఆ కథనంతా... శ్రద్ద గా విన్నారు ఊరు ఊరంతా....

గుడి కి దగ్గరలోనే భోగి మంట వేయించారు ఊరిపెద్దలు, భద్రయ్య గారూ కలసి...

పిల్లలందరి చేతా... భోగిదండలు వేయించి...

భోగి పండగను జరుపుకున్నారు ఊరివారందరు...

అందరూ... ఆ భోగి మంటలకు నమస్కారం చేసుకున్నారు...

కొంతమంది తల్లితండ్రులు.. తమ పిల్లలు భోగి దండలు వేస్తుంటే ఫోటోలు, వీడియో లు తీసుకుని మురిసిపోతున్నారు...

అందరికి.. గోదా, రంగనాధ స్వామి వార్ల కల్యాణ ప్రసాదం గా అన్న సంతర్పణ చేయించారు భద్రయ్య గారూ, ఆలయ ట్రస్టీలు కలసి...

రాధా , మధు లు కూడా అన్న ప్రసాదం స్వీకరించి... సత్సంతానాన్ని ఇమ్మని దండం పెట్టుకుని ఇంటికి చేరారు....

*************

శ్రీను, రాధాను తీసుకుని కోడిపందాలు చూడడానికి వెళ్ళాడు...

పోటా, పోటీ గా సాగుతున్న కోడిపందాలు చూసి కాసేపు ఎంజాయ్ చేసి... ఇంటికి వచ్చేసారు ఆ బావా బామ్మరుదులు...

శ్రీను, రాధా .. ఇద్దరూ చాలా క్లోజ్ ఐపోయారు... ఇద్దరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నారు...

భద్రయ్య... వాళ్ళతో చిన్నపిల్లాడిలా కలిసిపోయి... సంతోషం గా పండగను ఆస్వాదిస్తున్నాడు...

అలా ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తోంది...

సాయంత్రం అయింది...

భోగిపళ్లు పేరంటానికని తల్లీ కూతుళ్లిద్దరూ బయలుదేరి వెళ్ళారు....

అక్కడ....పాపను ఎత్తుకుని కూర్చుంది మీనా...

తను మధు చిన్నప్పటి స్నేహితురాలు... మధు ని చూస్తూనే నవ్వుతూ పలకరించింది...

బాలారిష్టాలు పోవాలని అందరూ ఆశీర్వదించి ఆ పాపకు భోగిపళ్లు పోసారు...

మధు కూడా ఆ పాప కు భోగిపళ్లు పోసి... ఆశీర్వదించింది....

పేరంటం అంతా చాలా బాగా జరిగింది...

మధు... మీనా తో కాసేపు మాట్లాడి... ఇంటికి చేరుకుంది తల్లితో...

************

పేరంటం నుండి వచ్చినప్పటినుండీ మధు డల్ గా ఐపోయింది.... అది రాధా గమనించాడు...

రాత్రి భోజనాలు అయిపోయాక...

గదిలోకి వచ్చిన మధు ని.... "ఎందుకు డల్ గా ఉన్నావ్" అని ప్రశ్నించాడు రాధా ....

"మనకి ఎప్పుడు పిల్లలు కలుగుతారు రాధా ?

నాకు చాలా ఏడుపు వస్తోంది... పిల్లలు లేని ఇంట్లో... ఎంత సంపద ఉన్నా వ్యర్థమే రాధా ..."

అంటూ భర్త ను హత్తుకుని ఏడుస్తోంది మధు...

"అయ్యో ఏంటి మధు... చిన్నపిల్లలాగా... మనకి ఏమంత వయసుఅయిపోయిందని...

మనకీ పిల్లలు పుడతారు... నువ్వు బాధపడకు" అంటూ ఆమెను ఓదారుస్తూ....... ఆమెను తనలో కలిపేసుకున్నాడు... ఆ ఇద్దరి మధ్యన ప్రేమ తన పరిపూర్ణతను తాను సంపాదించుకుంది...

నల్లని రంగుతో ... చుక్కల వెలుగులలో.... చంద్రుని చలువలో...ఆ రాత్రి కరిగిపోయింది....

****************

తెల్లగా తెలవారుతోంది....

సూర్యుడు మకర రాసి లోకి ప్రవేశించడంతో... మకర సంక్రాంతి అయింది...

ప్రతీ ఇల్లు .. రంగుల రంగవల్లికలు,గొబ్బెమ్మలతో కళకళలాడి పోతోంది...

హరిదాసు కీర్తనలతో...

డు డు బసవన్నల మేళ, తాళలతో...

సంక్రాంతి వేషగాళ్లతో....

వీధి, వీధి మారుమ్రోగిపోతోంది....

'సంక్రాంతి వచ్చిందే తుమ్మెద... సరదాలు తెచ్చిందే తుమ్మెద...

కొత్త అల్లుళ్లతో... కోడి పందాలతో... ఊరే ఉప్పొంగిపోదా...' అంటూ పాడుకుంటూ వెళ్తున్నాడు పాలుపోసే పిల్లాడు....

ఊరిలోని యువకులంతా.... కనుమ పండుగ నాడు జరిగే ప్రభల తీర్ధం కోసం... ప్రభను కట్టే పనిలో ఉన్నారు...

వెదురు కర్రలు, ఇంకా కొన్ని ప్రత్యేకమైన కర్రలతో ప్రభను సిద్ధం చేసి.... అలంకరణ చేసి ఉంచుతారు...

మరునాడు... అంటే కనుమ నాడు... ప్రభల తీర్ధం జరుపుతారు...

ఊరంతా... సంక్రాంతి పండగ హడావిడిలో ఉంది....

*********-

సంక్రాంతి పండగకి ప్రతీ రైతు కుటుంబం ఎంతో సంతోషం గా ఉంటుంది... పంట అమ్ముడై... చేతికి డబ్బులు అందుతాయని... అల్లుడుని, కూతురిని పిలిచి బట్టలు పెట్టుకుని పండగ చేసుకుంటారు కాబట్టి... సంక్రాంతి... కొత్త అల్లుడు అనే సామెత వచ్చింది....

కాల క్రమేణా... సంక్రాంతి అంటే అల్లుళ్ల పండగ అయిపోయింది....

**********

జానకి, భద్రయ్య లు కూడా...

కూతురికి పెళ్లి చేసిన మూడేళ్ళ తరువాత... ఈసారి సంక్రాంతి కి అల్లుడు, కూతుర్ని తీసుకురావడముతో...

వారికి పండగ చేయడం కోసం ఘనంగా ఏర్పాట్లు చేసారు....

రాధా , మధు ఇద్దరూ రెడీ అయ్యి వచ్చారు...

జానకి, భద్రయ్యల ఆశీర్వచనం తీసుకున్నారు...

కూతురికి పట్టు చీర, అరవంకీ పెట్టారు... అల్లుడికి కొత్త బట్టలు, పులిగోరు పతకం, బ్రాస్లెట్ పెట్టారు...

'ఇవన్నీ ఎందుకు' అంటున్నా వాళ్ళు వినలేదు...

'అయ్యో... సంక్రాంతి కొత్త అల్లుడివి బాబు' అంటూ వాళ్ళు పెట్టదలుచుకున్నవన్నీ పెట్టారు...

శ్రీను బద్ధకంగా వళ్ళు విరుచుకుంటూ బయటకు వచ్చి... ‘హ్మ్మ్... నాకెప్పుడు పెళ్ళవుతుందో? ఏంటో?’ అన్నాడు...

అంతే... అందరూ నవ్వుకున్నారు...

‘ఒరేయ్... ముందు వెళ్లి స్నానం చేసిరారా... నీకోసం కొత్త బట్టలు తెచ్చాను’ అంటూ శ్రీను కి ఇచ్చాడు భద్రయ్య...

*************

జానకి, పంకజం సాయంతో... పిండి వంటలు చేస్తోంది...

శ్రీను, రాధాలు డాబా మీదకి వెళ్లి గాలిపటాలు ఎగరేస్తున్నారు...

‘బావా...సంక్రాంతి, భోగి, కంటే... తరువాత వచ్చే కనుమ నే... మా ఊరిలో స్పెషల్ తెలుసా ..

మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతటికి ఫేమస్ మా జగ్గన్నతోట తీర్థం..

రేపు తీసుకెళ్తాను... అక్కడికి నిన్ను’ అన్నాడు శ్రీను...

వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా.... మధు కూడా అక్కడికి వచ్చి, వాళ్ళతో పాటు గాలిపటాలు ఎగరేస్తూ... చిన్న పిల్లలా అల్లరి చేస్తోంది...

ఆ అన్నా చెల్లిలిద్దరిని చూస్తూ ఎంతో సంతోషించాడు రాధా....

ఈలోగా... భద్రయ్య వచ్చి... భోజనానికి రండి అంటూ వారిని తీసుకెళ్లాడు....

కిందకి వెళ్లి.... జానకి చేసిన భోజనం ఏర్పాట్లు చూసి... అవాక్కయ్యాడు రాధా....

ఏంటి... ఇన్ని ఐటమ్సా... అంటూ నోరేళ్లబెట్టేసాడు....

రా... బావా.... ఇప్పుడుంటుంది నీపని అంటూ ఆటపట్టిస్తున్నాడు శ్రీను....

రా... బాబు అంటూ అన్ని ఐటమ్స్ వడ్డించేస్తోంది జానకి...

బాబోయ్.... అత్తయ్యా... అన్ని పెట్టేయకండి నేను తినలేను అంటుంటే....

ఇది ఆచారం బావా అంటూ... శ్రీను మరీ మరీ వేసేస్తూ... తినిపిస్తున్నాడు...

మధు కూడా అది చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తోంది...

ఈ కూర వేసుకో, ఈ బూరె తిను అంటూ తిన్పించేస్తుంటే.... ఇంకా నన్ను వదిలేయండి బాబోయ్ అంటున్నాడు రాధా...

అయ్యో.. సరే బాబు... నువ్వు ఎంత తినగలిగితే అంతే తిను అంది జానకి... శ్రీను ని వారిస్తూ....

వాళ్లంతా... ఎంతో సంతోషం గా సంక్రాంతి పండగ చేసుకున్నారు...

అలా అట,పాటల నడుమ ఇంకోరోజు గడిచిపోయింది

********

మరునాడు (కనుమ ) ఉదయం

సమయం 5:30....

ఊరంతా... అప్పటికే శివాలయం చేరుకున్నారు....

ఉమా, రాఘవేశ్వర స్వామి వారికి ధూప సేవ ప్రారంభం అయింది .....

భాజా, భజన్త్రీ లతో... మేళ తాళాలతో.... సాంబ్రాణీ ధూపం వేస్తూ... గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షణ గా... నృత్యాలు చేస్తూ .. ధూపం వేస్తూ...యువకులు ఆడి,పాడి... సేవ ప్రారంభించారు...

ఆ వేడుక చూడడానికి రాధా, మధులను తీసుకొచ్చాడు శ్రీను....

రాధా ఆ వేడుక చూస్తూ... తను కూడా ఆ వేడుకలో భాగం అయిపోయాడు... శ్రీను, రాధా లు కూడా ఆ యువకులతో కలిసిపోయి... వారితో పాటుగా నృత్యం చేస్తూ... స్వామి వారి సేవలో తరించిపోతుంటే... వారిని చూస్తూ మధు ఎంతో ఆనందించింది...

మధు ని...చిన్నప్పటి స్నేహితురాళ్లు, తెలిసిన వాళ్ళు వచ్చి... పలకరించారు....

ధూప సేవ ఎంతో వైభవం గా జరిగింది.. అనంతరం...

శ్రీ ఉమారాఘవేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను...

ముందు రోజు సిద్ధం చేసి ఉంచిన ప్రభ పై నిలిపి, పూజారి గారు గుమ్మిడికాయ కొట్టారు...

యువకులంతా ఎంతో భక్తిగా... ఓం నమః శివాయ అంటూ ప్రభను ఎత్తారు... రాధా, శ్రీను లు కూడా అందరితో కలసి చెరొకవైపు దండి పట్టుకున్నారు... మూడు సార్లు ప్రభను ప్రదీక్షణ గా తిప్పి... జగ్గన్నతోట తీర్దానికి తీసుకుని వెళ్తున్నారు...

పెద్ద ప్రభ ను అనుసరిస్తూ ... చిన్న ప్రభ, మరియు... చిన్న పిల్లల కోసం ప్రత్యేకం గా తయారు చేసిన బుల్లి ప్రభ కూడా జగ్గన్నతోట తీర్ధానికి వెళ్తున్నాయి...

ఆ ప్రభల వెనక్కాలే... జగ్గన్నతోట తీర్ధనికి ప్రభలను అనుసరిస్తూ... ఓం నమః శివాయ అంటూ... ఊరంతా తరలి వెళ్ళింది...

అలా హరినామ స్మరణ చేసుకుంటూ... బాణాసంచా కాలుస్తూ... ఆట, పాటల నడుమ... రామాపురం ప్రభలను జగ్గన్నతోట తీర్ధానికి తీసుకెళ్లి... అక్కడ నిలిపారు...

రాధా, శ్రీనులు కూడా ప్రభను మోయడం, అక్కడ నిలపడం.. మధుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది...

అలాగే చుట్టుపక్కల ఊర్లు...

ముక్కామల, కముజువారిలంక, నేదినూరు, ఇరుసుమండ, వ్యాఘ్రీస్వరం నుండి కూడా ప్రభలు వచ్చాయి...🙏

ఆ ప్రభలన్నిటిదగ్గరికి వెళ్లి..మిగిలిన భక్తులతో పాటుగా... వారు కూడా....పళ్ళు ఇచ్చుకుని, పాదుకలు పెట్టించుకున్నారు ముగ్గురూ...

తరువాత..రాధా, మధు లను ఒక చెట్టుకింద కూర్చోబెట్టి జీళ్ళు, పకోడీలు కొని పట్టుకొచ్చాడు శ్రీను...

వాళ్ళు ముగ్గురూ కూర్చుని... తీర్ధాన్ని చూస్తూ... కబుర్లు చెప్పుకుంటున్నారు...

ఇంతలో... అందరూ... తీర్ధం జరుగుతోన్న... పొలానికి ఆనుకుని ఉన్న కాలువ గట్టు దగ్గరికి పరుగెడుతున్నారు...

రాధా కి ఏమి అర్ధం కాలేదు... "ఏమైంది... వాళ్ళెందుకలా పరిగెడుతున్నారు' అన్నాడు...

"అయ్యో.. బావా! నీకు తెలీదు కదా...

ఇప్పుడు ఇక్కడికి గంగలకుర్రు ప్రభ రాబోతోంది...

అదే...ఈ తీర్ధనికి హైలెట్..." అంటూ.. రాధాని, మధుని అక్కడికి తీసుకుని వెళ్ళాడు చూపించడానికి...

"జగ్గన్నతోటలో జరిగే ఈ ప్రభల తీర్ధానికి ఏకాదశరుద్రులు వస్తారు బావా...

ముక్కామల, నేదినూరు,కముజువారీలంక, వ్యాఘిరేశ్వరం, ఇరుసుమండ,ఇంకా మనా ఊరు రామ పురం తో పాటు మరికొన్ని ఊరులనుండి ప్రభలపై ఆ ఊరిదేముళ్ళు వస్తారు బావా...

అలాగే గంగలకుర్రు నుండి కూడా ఆ ఊరి దేముడి ప్రభ వస్తుంది...

అలా మొత్తం పదకొండు ఊరుల నుండి ప్రభలు వస్తాయి... పదకొండు రుద్రులు కాబట్టి ఏకాదశ రుద్రులు అంటారు బావా.కాకపోతే ఇదే హైలెట్ అని ఎందుకు అన్నానంటే...

ఆ ఊరి ప్రభను ఇక్కడికి తీసుకొచ్చే దారిలో... ఈ కాలువ అడ్డంఐనా కూడా... ఆ ఊరి వాళ్ళు.. కాలువను సైతం లెక్కచేయకుండా... నీటిలో నుండే ప్రభను తీసుకువచ్చి ఇక్కడ నిలుపుతారు...

ఆరకంగా... ఈ కనుమ పండగ నాడు ..భక్తులందరికి ఏకాదశ రుద్రుల దర్శనం.. ఒకేచోట కలుగుతుంది 🙏"

అంటూ శ్రీను...ప్రభలతీర్ధం విశిష్టతను రాధాకు తెలియచేసాడు...

వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉండగానే... గంగలకుర్రు పెద్దప్రభను తీసుకువస్తున్నారు... మేళ తాళాలతో... ప్రభను.. తీసుకువస్తూ... కాలువను దాటుకుని వస్తున్న ప్రభను చూస్తూ... హర హరా.... ఓం నమః శివాయ అంటూ భక్తులంతా జయ జయధ్వానాలు చేస్తున్నారు...

చేతులు జోడించి 🙏 ఓం నమః శివాయ అంటూ భక్తిపారవస్యం పొందుతున్నారు...

గంగలకుర్రు ప్రభను కూడా తీర్ధం లో నిలిపి... యువకులు ఆడి, పాడి పండగ చేసుకున్నారు... భక్తులంతా... పళ్ళు సమర్పించుకుని... పాదుకలు పెట్టించుకున్నారు...

రాధాకు అదంతా చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరింది...

మధు మాత్రం చిన్నపిల్లలా తీర్ధం అంతా తిరుగుతూ... గాజులు, గొలుసులు కొనిపించుకుంది...

శ్రీను, మధు లు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ... చిన్నపిల్లల్లా అల్లరి చేస్తుంటే.. వాళ్ళిద్దరినీ చూసి మురిసిపోతున్నాడు రాధా...

అలా వాళ్ళు ప్రభల తీర్ధాన్ని ఎంజాయ్ చేసి... ఇంటికి వెళ్లేసరికి... సాయంత్రం అయిపోయింది...

"హమ్మా....వచ్చారా... ఏమి తినకుండా వెళ్లిపోయారు...

నువ్వుకూడా ఏంటమ్మా మధు... పాపం అబ్బాయి ని కూడా పండగకి పూట పస్తు పెట్టారు కదా" అంటూ... వాళ్ళని లోపలికి తీసికెళ్లి భోజనం పెట్టింది జానకి...

భద్రయ్య వచ్చి.. "ఎలా ఉంది బాబు మా జగ్గన్నతోట తీర్ధం" అన్నాడు...

"చాలా బాగుంది మామయ్యా... అసలు నేను ఊహించనంత అద్భుతాన్ని చూసాను..

ఏకాదశ రుద్రుల దర్శనం అయింది 🙏" అన్నాడు రాధా...

వారంతా... ఎంతో సంతోషం గా కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు...

అలా కనుమ పండగ కూడా ముగిసింది...

*****

మరునాడు ఉదయం...

మధు లేచి రెడీ అయ్యి కాఫీ తాగుతూ అమ్మా, నాన్నలతో కూర్చుని కబుర్లు చెబుతోంది...

"అమ్మా.... రేపే మా ప్రయాణం..." అంది మధు బెంగగా...

"అయ్యో... అదేంటే.. ఇంకో పదిరోజులు ఉండి వెళ్ళకూడదా...

హైదరాబాదే కదా... నేను నాన్న తీసుకొచ్చి దింపుతాము... అబ్బాయిని అడుగుతాం" ఉంచమని అంది జానకమ్మ...

"వద్దు అమ్మా... ఇండియా షిఫ్ట్ అయిపోయాము కదా... అందులోను హైదరాబాద్ నే గా... మళ్ళీ వస్తామూలే...నేను లేకపోతే అయన ఉండలేరు" అంటూ సిగ్గుపడుతున్న కూతురిని చూసి సంతోషం గా అనిపించినా.. 'రేపే వెళ్ళిపోవాలి' అనే సరికి ఆ తల్లిదండ్రుల కి చాలా బెంగొచ్చింది

'ఆడపిల్ల అన్నాక తప్పదుకదా' అని సర్దుకున్నారు ఇద్దరూ...

ఇంతలో రాధా కూడా రెడీ అయ్యి వచ్చాడు...

అల్లుడుని చూస్తూనే "రండి బాబు... కాఫీ తెస్తా ఉండండి" అంటూ లోపలికి వెళ్ళింది జానకి...

భద్రయ్య కూడా రాధాని పలకరించి, ఊరి వాళ్ళు వచ్చారని పనివాడు చెబితే... ఇప్పుడే వస్తను బాబు అంటూ ఊరివాళ్ళతో మాట్లాడానికి అరుగుమీకి వెళ్ళాడు...

రాధా మధు ని చూస్తూ.."మధు... నాకు మీ ఊరు, కట్టుబాట్లు... ఆచార వ్యవహారాలు అంతా చాలా నచ్చాయి...సంక్రాతి పండగ ఇంత బాగుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది... చిన్నప్పుడే అమ్మా నాన్న లను పోగొట్టుకుని, బంధువుల ఇంట్లో పెరిగిన నాకు... ఇవన్నీ తెలీవు...

థాంక్ యూ మధు నా జీవితంలోకి వచ్చినందుకు" అంటూ మధు చేయ పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు...

"లవ్ యూ రాధా" అంది మధు...

"బాబూ కాఫీ ...."అన్న జానకి మాటకి ఈలోకం లోకి వచ్చారు ఇద్దరూ...

రాధా కాఫీ తాగుతూ, మధు, జానకీలతో రేపు ప్రయాణం అని చెప్పాడు... వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా శ్రీను... పొలం నుండి బొండాలు, సీతాఫలాలు తీసుకొచ్చాడు..

వాళ్లంతా.. కబుర్లు చెప్పుకుంటూ ఉండగా...

భద్రయ్య లోపలికి వచ్చి... "మన ఊరి స్కూల్ కూలిపోయిందిట..అదృష్టవశాత్తు సెలవలు కాబట్టి పిల్లలు లేరు కనక సరిపోయింది" అంటూ చెప్పి, మళ్ళీ బయటకి వెళ్ళిపోయాడు...

తను చదివిన స్కూల్ అలా ఐపోయింది అని మధు ఎంతో బాధపడింది...

"చూసివద్దాం పదండి" అంటూ రాధా, మధు లతో పాటు శ్రీను కూడా భద్రయ్య, ఇంకా ఊరి వారితో కల్సి స్కూల్ దగ్గరికి వెళ్ళారు...

ఆ స్కూల్ ని చూసి...

ఊర్లో వాళ్ళు కొంతమంది... "ఇప్పుడు ఏమి చేద్దాం ప్రెసిడెంట్ గారు... పిల్లలకి స్కూల్ లేకపోతే ఎలాగా "అంటూ ఒక్కక్కరు ఒక్కోలాగ మాట్లాడం మొదలెట్టారు...

"నేను కలెక్టర్ గారికి ఎన్నో సార్లు మన స్కూల్ పరిస్థితి వివరించాను, కానీ వారి నుండి ఎటువంటి సహకారం అందలేదు" అంటూ వాపోయాడు భద్రయ్య...

రాధా ముందుకొచ్చి "స్కూల్ కట్టించడానికి ఎంత అయితే అంతా నేను పెట్టుకుంటాను మామయ్యా...వెంటనే ఏర్పాట్లు చుడండి" అన్నాడు...

ఆ మాటతో ఊరు ఊరంతా కరతాళ ధ్వనుల తో హర్షం వ్యక్తం చేసారు...

భద్రయ్య కి రాధా అలా అనడంతో... ఎంతో గర్వంగాను సంతోషం గాను అనిపించింది...

రాధా మాట ఇచ్చినట్టుగానే... స్కూల్ నిర్మాణానికి 20లక్షల చెక్ రాసి, భద్రయ్య కు ఇచ్చాడు...

అల్లుడు అంటే భద్రయ్య గారి అల్లుడే అంటూ ఊరంతా.. రాధాను వేయినోళ్ల పొగిడారు...

సంక్రాతి కొత్త అల్లుడు అంటే... పండగ చేసుకుని వెళ్లిపోయేవాడు కాదు... భాద్యత పంచుకునే వాడే ఇంటి అల్లుడు అంటే... అనే కొత్త అర్ధాన్ని ఆ ఊరివారికి పరిచయం చేసాడు రాధా...

మధు కి తన భర్త పై ప్రేమ తో పాటు ఆరాధన కూడా ఏర్పడింది ఇప్పుడు...

మరునాడు వారు బయలుదేరి వెళ్తుంటే... ఊరివారంతా... పొలిమేరలదాకా... కార్ వెనక్కాలే వెళ్లి... వారికి వీడ్కోలు పలుకుతూ... మళ్ళీ ఏడు సంక్రాంతి కి ముగ్గురయ్ రండి అని దీవించారు....

********************

ఒక సంవత్సరం తరువాత

రామాపురం

తెల్లవారుజాము 4 :45

ఊరంతా... గోదా రంగనాధ స్వామి వార్ల కళ్యాణం చూడడానికి... గుడికి చేరుకున్నారు

ఊరందరి ఆశీర్వాదబలమో..దేవానుగ్రహమో....లేక ఆ దంపతుల నోముల ఫలమో...కానీ...

రాధా, మధులు.. వారి ముద్దుల బిడ్డ... కృష్ణ ను వడిలో కూర్చోబెట్టుకుని...గోదారంగనాధ స్వామివార్ల కళ్యాణం చేసుకుంటున్నారు....

కూతురిని, అల్లుడుని, మనవడిని చూసుకుని మురిసిపోతున్నారు... జానకి, భద్రయ్యలు...

***************************************-

🌹శుభం 🌹

మన సాంప్రదాయాలు వర్ధిల్లాలి అని కోరుకుంటూ....

రమ్య నముడూరి


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం :

నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు


740 views5 comments

5 comentarios


phani_kiran
26 dic 2020

సంక్రాంతి పండుగ, కళ్ళ ముందు కదలాడింది...

భోగి, సంక్రాంతి, కనుమ పండగల వైభవం చక్కగా వర్ణించారు...

గోదా, కళ్యాణ ఘట్టం చాలా బాగుంది... ప్రభాల తీర్ధం కళ్ళకు కట్టినట్టు రాసారు... అద్భుతం, అమోఘం 👌👌👌👌👌👏👏👏👏👏👏

Me gusta

మన సంక్రాంతి పండుగ వైభవాన్ని, ఆలు మగల బంధాన్ని, తల్లిదండ్రుల అనురాగాన్ని,కష్టం వస్తే ముందుండాలనే మనస్తత్వాన్ని, సహాయం చేసిన వారిని దైవంగా భావిస్తారనే విషయాన్ని ఇలా చాలా మంచి విషయాలు ఒక కథలో చూపించారు. చాలా బాగుందండి.

Me gusta

పల్లెటూరు పండుగ శోభ , కళ్ళకు కట్టినట్టు వ్రాసారు 👍... చాలా అద్భుతం గా ఉంది... అందమైన కావ్యములా మనసుకు హత్తుకునేలా వ్రాసారు 🌹👌👌👌👌👌

Me gusta

pavan.jan26
18 dic 2020

చాలా అద్భుతంగా ఉంది సంక్రాంతి అల్లుడు.

Me gusta

Sudheendra Sudhy
Sudheendra Sudhy
18 dic 2020

Very nice story👏👏👍

Me gusta
bottom of page