top of page

పుల్ల ఐస్


'Pulla Ice' - New Telugu Story Written By Penumaka Vasantha

'పుల్ల ఐస్' తెలుగు కథ

రచన: పెనుమాక వసంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఇప్పటికీ, వేసవి అనగానే.. సెలవులు గుర్తుకు వస్తాయి. సెలవులకు మా మేనత్త గారి ఊరు వెళ్లి బాగా ఆడుకునే వాళ్ళం. ఆ వూళ్ళో తాటి చెట్లు ఎక్కువగా ఉండి ఎండ తెలిసేది కాదు. మధ్యాహ్నం తాటి ముంజలు తినే వాళ్ళం. ఇంకా ఆకలి వేస్తే సపోటాల గంప మీద పడి తినే వాళ్ళం. జామ చెట్టు ఎక్కి జామకాయల మీద దాడి. సాయంత్రాలు నిమ్మకాయ నీళ్ళు తాగే వాళ్ళం. మా అత్త, వాళ్ళ పిల్లలని తీసుకుని తిరిగి మా ఊరికి వచ్చే వాళ్ళము. ఇలా! సెలవులకు ఆ ఊరు.. ఈ ఊరు తిరగటమే, మా పని.

మాకేమో పిల్లలకి సెలవులు ఇష్టం అయితే మా అమ్మ వాళ్లకి కష్టం. మేము ఇంట్లో ఉండి గొడవ చేస్తామని.. వేసవి పోయి స్కూల్స్ ఎపుడూ తెరుస్తారా.. అని ఎదురుచూస్తుంటారు.


ఎండకు బయట తిరిగితే వడదెబ్బ అని మా అమ్మా వాళ్ళు బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఇంట్లో చింతపిక్కెలతో గిల్లాలాట ఆడుకునే వాళ్ళం. సాయంత్రంపూట ఊరి లో ఉన్న టూరింగ్ టాకీస్ లో సినిమా చూసే వాళ్ళం. ఆ సినిమాకి, మమ్ముల్ని, మా అమ్మ తీసుకెళ్లటం కోసం ఇంటి పని అంతా.. చేసేవాళ్ళం.

రాత్రిళ్ళు, కరెంట్ పోయేది. లాంతరు వెలుగులో, దొడ్లో చందమామను, చూస్తూ అన్నం, కొత్తావకాయ, తిని దానికి విరుగుడుగా.. పెరుగన్నం మళ్ళీ దానిలో రసం మామిడికాయ, తింటే ఆ రుచే.. వేరయా!


వేసవిలో మామిడి పళ్ళు, పుల్ల ఐసు కోసమే నేను ముఖ్యంగా.. ఎదురు చూసేది.

పగలు పన్నెండు ఇంటికి కరెంట్ తీసి రెండు గంటలకు ఇచ్చేవారు. ఆ లోపు మా వీధిలో పెంకుటిల్లు చూర్లకింద, ఉండే అరుగుల మీద ఆడవాళ్ళు విసనకర్ర తో విసురుకుంటూ.. ఆ పూట ఇంటి వంటల తో పాటు కరెంట్ వాళ్ళని, తిట్టుకుంటూ ఉండేవారు. ఈలోపు ఐస్ బండి వెంకయ్య "పుల్ల ఐస్ "అని గంట కొట్టుకుంటూ.. వచ్చేవాడు.

మా బామ్మ, పుల్ల ఐస్ అమ్ముతాడనీ వెంకయ్యకు పుల్లయ్య అని నామకరణం చేసింది. చివరికి ఊరందరికీ పుల్లయ్య గానే పేరు పడ్డాడు.

మా అమ్మ, బామ్మ తో "హాయిగా పేరు దేవుడి పేరు వెంకయ్యా.. అయితే, అది పిలవకా.. ఏమిటో మీరు.. పుల్లయ్య, గిల్లయ్య" అంటూ.. బామ్మ తో దెబ్బలాడేది.

"పోన్లే అమ్మా! ఏ పేరుతో పిలిస్తే యేంటిలే?" అని పాపం కొట్టి పారేసేవాడు పుల్లయ్య. "అలా చెప్పు మా కోడలికి తనకే.. పేద్ద భక్తీ ఉన్నట్లూ.. నాకు లేనట్లూ.. " అంటూ మూతి మూడు వంకర్లు తిప్పేది మా బామ్మ.


ఒక్కో రోజు మా బామ్మ కొంగులో చిల్లర లేక పోతే "రేపు ఇద్దరు గానీలే.. పాపం పిల్లల్ని చూడండి!" అంటూ మేము "ఐస్.. " అని ఏడుస్తుంటే.. సగ్గుబియ్యం తో చేసిన పుల్ల ఐస్ ఇచ్చేవాడు.

"పుల్లయ్యా.. ఆ ఐస్ బండి ఇక్కడ పెట్టీ మా పిల్లలని తీసుకెళ్ళిపో.. వీళ్ల గోల పడలేక పోతున్నాము" అనేది మా బామ్మ.

"పంపండి, మా ఇంట్లో మా పిల్లలతో పాటు ఉంటారు" అనేవాడు.

మాకు అపుడు పుల్లయ్య దేవుడి లాగా కనపడేవాడు. ఒక్కోసారి డబ్బులకు బదులు బియ్యం తీసుకునేవాడు. ఒక్క రోజు రాక పోయినా మేమందరం పుల్లయ్య కోసం ఎదురుచూసే వాళ్ళం. ఎక్కడ గంట వినపడినా.. పిల్లలందరం "ఐస్.. పుల్ల ఐస్" అంటూ బయటకు వచ్చేవారం.


అలా.. ఎన్నో యేళ్ల నుండి పుల్లయ్య ఐస్ బండి నడుపుతూనే.. ఉన్నాడు. మేము కాలేజిలకు, వచ్చినా పుల్లయ్య ఐస్, కొనుక్కోవటం మాత్రం మానుకోలేదు. ఇంట్లోనే ఐస్ తయారు చేసేవాడు పుల్లయ్య. వాళ్ల దగ్గర అందరూ చెరుకు రసం లోకి, సొడాల్లోకి ఐస్ దిమ్మెలు కొనుక్కొని వెళ్లేవారు. వేసవి సాయంత్రాలు సోడాలు అమ్మే వాడు. పగలు ఐస్ కోసం, సాయంత్రం సోడా కోసం ఎదురు చూసే వాళ్ళం.

ఎపుడన్నా.. పుల్లయ్యకు ఒంట్లో.. బాగాలేకపోతే వాళ్ల అబ్బాయి ఐస్ బండి నడిపేవాడు. అలా వాళ్ళింట్లో అందరూ ఐస్ అమ్మేవారు. మా ఇంట్లో ఫంక్షన్లకు, మంచనీళ్ళలో వేయటానికి ఐస్ సరఫరా చేసేవాడు పుల్లయ్య.

ఊరందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు పుల్లయ్య. ఖాళీ టైం లో అందరికి పనులు చేసి పెట్టేవాడు. పిల్లలని మంచి చదువు చదివించాడు. పెద్ద పిల్లాడు పట్నంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చిన్న అబ్బాయికు చదువు అబ్బలేదు అని పక్క ఊరిలో ఐస్ ఫ్యాక్టరీ పెట్టీ ఐస్ అమ్ముతుంటాడు. పిల్లలు వాళ్ల దగ్గరకు, వచ్చేయమంటే కాలు, సేయి ఆడినంత కాలం పల్లెలో నే.. ఉంటాము, తర్వాత మీ కాడికి వస్తాములే.. అని పుల్లయ్య వెళ్ళలేదు పిల్లల దగ్గరికి.


మాకు పెళ్ళిళ్ళు అయి మాకు పుట్టిన పిల్లలకు కూడా.. పుల్లయ్య, పుల్ల ఐసు ఎంత ఇష్టమో!.. వాళ్ళు "పుల్లయ్య ఐస్" అంటుంటే "మా అమ్మ యేయి! ఏంటది? పుల్లయ్య కు బొడ్డుకోసి పేరు పెట్టారా !? మీరు.. తాత అని పిలవండి" అని మా పిల్లల్ని కేక లేసింది. అప్పటినుండి పిల్లలూ" తాతా ఐస్" అంటం మొదలెట్టారు.


మా పిల్లలకు ఐస్ ఇచ్చి డబ్బులు తీసుకోలేదు పుల్లయ్య. "అదేంటి ? పుల్లయ్య మాకేమో.. డబ్బులిస్తేనే ఐస్ ఇచ్చేవాడివీ.. మరీ మా పిల్లలకు తీసుకోవటం లేదేంటీ?" అంటే.. "అమ్మాయి గారు అసలు కన్నా వడ్డీ ముద్దు" అంటూ మా పిల్లల్ని ముద్దు చేసి మరీ ఐసు ఇచ్చి వెళ్ళే వాడు.


సెలవుల ఆ.. నెల రోజులు పుల్లయ్య ఐస్ గంట వినపడితే మా పిల్లలు "ఐస్.. పుల్ల ఐసు" అంటూ పుల్లయ్య గొంతులో ఫ్ట్ తు గొంతు కలిపేవారు


పుల్లయ్య నవ్వుకుంటూ బండి ఆపి ఐస్ ఇచ్చి వెళ్ళేవాడు. "పుల్లయ్య ఎండ ఎక్కువగా ఉంది. తలకు గుడ్డ చుట్టుకో" అని అమ్మ చెప్పింది. నేను ఇలా వినడు అని "పుల్లయ్య ఇదిగో " అంటూ ఒక టోపీ ఇచ్చాను, పుల్లయ్య కి. "పుల్లయ్యా.. ఇది తల పైనుండి తీయకు" అని చెప్పాను.


"మా పిల్లలు కూడా టోపీ పెట్టుకో అని గొడవ చేత్తారు. నాకు టోపీ పెట్టుకుంటే నెత్తి మీద ఏదో బరువు గా ఉంటది.. చెమట పోస్తది. అయినా అమ్మాయి గారు ఇచ్చారు పెట్టుకుంటా".. లే అని టోపీ పెట్టుకున్నాడు.


సెలవులు అయిపోయాయి ఇక రేపు ఊరు వెళ్తాము అంటే పిల్లలు "వూ.. హు ఇక్కడే ఉందాం బావుంది" అని మారం చేశారు. ఆ రోజు ఐస్ అమ్మటానికి పుల్లయ్య బదులు భార్య లక్ష్మి వచ్చింది.


" నేను అదేంటి? పుల్లయ్య రాలేదు ఇవాళ ఐస్ అమ్మటానికి" అన్నాను.


ఏడ వత్తాడు? నిన్న రేతిరి నుండి లెగలేదు.. మడిసి. వడదెబ్బ తగిలి జొరమొచ్చింది. మూసిన కన్ను తెరవలేదు. తడి గుడ్డ నెత్తి మీద పెట్టి ఐస్ అమ్మటానికి వచ్చా. సెపితే వినడు వయసు మీద పడింది. కూస్త జాగత్ర గా వుండాలి.. అంటే వినడాయే" అంది లక్ష్మి.


"లక్ష్మి ముందు డాక్టర్ దగ్గరికి తీసికెళ్లు" అంది అమ్మ. "ఆ వినడు అమ్మ గారు పిల్లలకి ఫోన్ చేశా వాళ్లు వచ్చి తీసుకెళ్లాలిసిందే.


మరుసటి రోజు పొద్దుట మా పనిమనిషి వెంకీ అమ్మ తో "అమ్మ గారు పుల్లయ్య రేతిరి నిద్రలోనే పోయాడంటా అని చెప్పింది. వాళ్ల పిల్లలు వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకుపోదాము.. అనుకునే లోపు కళ్ళు తేలేసాడంటా"

"అయ్యో? పోయాడా! నిన్న వాళ్ళావిడ లక్ష్మి వడదెబ్బ తగిలింది అని చెప్పింది. పోయేంత వయసు కూడా కాదు పుల్లయ్యది" అంది అమ్మ.


"సానా మంచోడు అమ్మగారు! ఇద్దరబ్బాయిల పెళ్ళిళ్ళు చేశాడు. ఒక అమ్మాయి వుంది, ఆ పిల్లకు పెళ్ళి చేస్తే ఏదో వూరు.. సాన దూరంలో వుందంటా. ఆ పిల్ల వచ్చే వరకు శవాన్ని వుంచుతారంటా. అంతే కాదు పేదోళ్లు ఎవరన్నా? పోతే.. వాల్ల కింద పెట్టటానికి ఐస్ గడ్డలు ఫ్రీ గా ఇత్తాడంటా! డబ్బులు తీసుకోమంటే సాలినంత సంపాదించాను. నేను పోతూ ఏమి? కట్టుకుపోనూ అనే వాడమ్మగారు అంది వెంకీ


అమ్మ, పుల్లయ్య ను "చూసి వస్తా" అని బయలుదేరు తుంటే "నేను వస్తా "అని బయలు దేరా. పుల్లయ్య, ఇంటికి వెళ్లేసరికి ఊరి జనాలు, పుల్లయ్య చుట్టాలు, అందరూ ఉన్నారు అక్కడ.


తాను తయారు చేసే ఐస్ గడ్డలుపైనే పుల్లయ్య ను పడుకోబెట్టారు. నిద్ర పోతునట్లుగా ఉన్నాడు.

అమ్మను చూసి లక్ష్మి! "అమ్మ గారు చూసారా.. నన్ను అన్నాయం చేసి పోయాడు పుల్లయ్య! నేను ఎట్టా బతకనూ!?" అంటూ ఒకటే ఏడుపు.

"లేదు లక్ష్మి ఇలాంటి చావు! ఎవరికో.. కానీ రాదు. బాధ్యతలు అయిపోయాయి. నీకు మటుకు తీరని లోటే.. ఉంటుంది.. ఓర్చుకో!" అంటూ అమ్మ, లక్ష్మిని సముదాయించింది.


మరుసటి రోజు మా పిల్లలు ఎండ ఎక్కువ అవ్వగానే "తాత! ఐస్" అని ఐస్ బండి గంట కోసం చూస్తూంటే "ఇక పుల్ల ఐస్ లేదు, బండి రాదు ఊరుకోండి?! అంటే పిల్లలు "ఆ.. ఐస్ కావాలి" అని మారాం చేసారు.


వాళ్లకి చెపితే అర్థం కాదు.. పుల్లయ్య పోయాడు.. అని. వాళ్లకి కార్టూన్ నెట్వర్క్ టీవీ లో పెట్టీ అప్పటికి ఆ సంగతి మర్చిపోయేట్లు.. చేశా. కానీ! ఆ రోజంతా పుల్లయ్య జ్ఞాపకాలతోనే గడిచింది.


'ఇప్పటికీ ఎక్కడన్నా?.. పుల్ల ఐస్, సోడాలు కనపడితే పుల్లయ్య గుర్తుకు వస్తాడు. సిటీస్ లో ఎంత ఐస్ క్రీం తిన్నా ఆ పుల్ల ఐస్ ను చప్పరించి లాస్ట్ లో కొరుక్కుని ఆ ఐసు గడ్డలను నమిలి తింటే ఆ కిక్కే వేరపా!'


అపుడే సంవత్సరం తిరిగి వేసవి సెలవులు వచ్చాయి. మళ్ళీ నేను పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరాను. సూరీడు నెత్తి మీదకి వచ్చేసరికి పిల్లలు "అమ్మా! తాత, పుల్ల ఐసు" అని గోల చేస్తున్నాడు. ఐస్ లేదు ఏమి లేదు అని నేను కేకలే శాను. ఇంతలో" పుల్ల ఐస్"అనే మాట వినపడితే.. మా పిల్లలు "తాత ఐసు" అన్నారు. మేమందరం బయటికి వచ్చాం. పుల్లయ్య వాళ్ల అబ్బాయి "ఐస్.. పుల్ల ఐస్!"అని గంట కొట్టుకుంటూ వచ్చాడు.


"అదేంటి!? నువ్వు పట్నం లో జాబ్ చేస్తున్నావు అన్నాడు పుల్లయ్య! మరీ నువ్వూ.. ?" అని పుల్లయ్య పిల్లాడు సాంబు ని అడిగా. "


"అదా!.. నేను పక్కఊరిలోనే ఉండేది. అక్కడి ఐస్ ఫ్యాక్టరీ

సొంత ఊరు, సొంత ఇంట్లో, ఉండి.. ఐస్ అమ్ముతూ ఉంటేనే బాగుంది. నాన్న ఎపుడూ.. అనేవాడు. నా తర్వాత ఈ ఐస్ ఇట్లాగే మీరు అమ్మాలి.. అని. అన్నయ్య నువ్వు చూసుకో ఐస్ బండిని అంటే నేను వచ్చి ఇక్కడ ఉంటున్నా. ఐస్ క్రీం కావాలా?.. పుల్ల ఐసా.. " అంటే.. మా పిల్లలు పుల్ల ఐసే.. అన్నారు.


కొంచం పుల్లయ్య, పోలికలతో ఉండే సాంబు లో పుల్లయ్య తాతను, చూసుకున్నారు మా పిల్లలు. నేను పైకి చూసి పుల్లయ్యకు '"థాంక్స్" చెప్పాను. 'నువ్వు లేకున్నా.. నీ కొడుకు రూపంలో ఐస్ అమ్ముతున్నందుకు, మా అందరి, వేసవి తాపాన్ని తీరుస్తున్నందుకు. '

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/vasantha/profile

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


41 views0 comments
bottom of page