top of page
Writer's pictureYasoda Pulugurtha

మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 1


యశోద పులుగుర్త గారి కొత్త ధారావాహిక మనసులోని ప్రేమ ప్రారంభం

'Manasuloni Prema Episode 1/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha

'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 1/6' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

మురారి కి ముఫ్పై రెండు సంవత్సరాలు. అందగాడు, పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు. అతని కాలేజ్ మేట్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయి వారికి పిల్లలు కూడా పుట్టేసారు.


మురారి అక్కా చెల్లెలికి పెళ్లిళ్లు అయిపోయాయి. తమ్ముడు కూడా సంవత్సరం క్రితమే పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడైనాడు. మురారి తల్లి లీలావతి కి కొడుక్కి పెళ్లికావడం లేదన్నదే దిగులు. ఎన్ని సంబంధాలను చూపించినా విముఖతగా ఉంటున్నాడు.


మొదటినుండీ తన చదువు, కెరీర్ తప్ప పెద్దగా దేని గురించి ఆలోచించేవాడు కాదు.


అటువంటి మురారికి ‘ప్రేమ’ అనే పదానికి అర్ధం తెలియదా అనుకుంటే పొరపాటే.


తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకునేవాడు. ప్రేమంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే అందమైన బంధమనీ, ఆ బంధాన్ని జీవితాంతం వరకూ కాపాడుకోవాలని భావించేవాడు.


దాదాపు పది సంవత్సరాల నాటి గతంలో ‘ప్రేమ’ అనే రెండక్షరాలు అతనికి ఎంతో ప్రీతిపాత్రమైనవి.


ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నపుడు క్లాస్ మేట్ చైత్రను ఇష్టపడ్డాడు.


చైత్ర అందమైన అమ్మాయే కాకుండా చాలా చురుగ్గా కలివిడిగా అందరితో చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఆమెను మనసులో నింపుకుని ఆరాధించడం మొదలు పెట్టాడు. తన ‘ప్రేమ’ ను డైరక్ట్ గా ప్రపోజ్ చేస్తే, ఒక వేళ చైత్ర ‘నో’ అంటే అని ఊహించుకుంటూ భయపడేవాడు.


ఫైనల్ ఇయర్ లో కేంపస్ ఇంటర్వ్యూలు జరిగి తను సెలక్ట్ అయ్యాడు. మంచి కంపెనీ, హేండ్సమ్ పేకేజ్. అందరూ తనని అభినందించారు. ఉద్యోగంలో బాగా సెటిల్ అయ్యాక చైత్రతో తన లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటూ కలలు కనేవాడు.


ఒకరోజు కాలేజ్ కేంటిన్ లో కాఫీ తాగుతున్నాడు.


“హాయ్ అన్న పిలుపుకు తలెత్తి చూసాడు”.


“ఎదురుగా చైత్ర”.


“కంగ్రాట్స్ మిస్టర్ మురారీ, కేంపస్ సెలక్షన్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసారుగా".


"ఓ ధాంక్యూ"


అంతకు మించి సంభాషణ ఏమీ జరగలేదు. సంభాషణ అనేది ఒక కళ. పదాలు భావాలను వ్యక్తం చేస్తాయి. తనకా చాకచక్యం లేదు. కొంచెం సేపు తనేమైనా మాట్లాడతాడేమోనని ఎదురుచూసిన చైత్ర 'ఆల్ ది బెస్ట్ మురారీ అని చెప్పి వెళ్లిపోయింది.



రోజూ క్లాస్ లో చైత్రను చూస్తున్నా చొరవగా పలకరించ లేకపోయేవాడు. చిన్నప్పటి నుండీ అలవాటైన స్వభావం ఎలా మారుతుంది? తనకు అందరూ ఉన్నా ఎందుకో ఇంట్రావర్ట్ గా పెరిగాడు.


ఒక నెల రోజుల్లో తన చదువు పూర్తి అయిపోతుంది.


ఒకరోజు చైత్ర చాలా స్పెషల్ గా తయారై వచ్చింది కాలేజ్ కు. అందరూ ఆమెకు అభినందనలు చెపుతున్నారు. హేండ్ బేగ్ లోనుండి బయటకు ఏవో కవర్లు తీస్తోంది.


తన దగ్గరకు కూడా వచ్చింది. చిరునవ్వుతో “హాయ్ మురారీ ఎక్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నారంటూనే" పెళ్లి శుభలేఖ అందించింది.


“అనుకోకుండా నా పెళ్లి కుదిరింది మురారిగారూ. పరీక్షలు అయిపోయిన వెంటనే నా పెళ్లి”.


“అందరూ ఎక్జామ్స్ ప్రిపరేషన్ లో హడావుడిగా ఉంటారేమోననుకుంటూ కాస్త ముందుగానే శుభలేఖలు పంచేస్తున్నాను. ఒక పెద్ద పని అయిపోతుంది కదా, తరువాత హాయిగా చదువుకోవచ్చని”.


“మీరు తప్పకుండా రావాలి, వస్తారుకదూ”?


వస్తానన్నట్లు తలూపాడు.


“ చదువు పూర్తైన వెంటనే పెళ్లేమిటంటూ సవా లక్ష ప్రశ్నలు అడుగుతున్నారు మన వాళ్లు”.


"కానీ మీరొక్కరే నన్ను ఏమీ అడగడం లేదు కాస్తంత కినుకగానే అంది".


“అవి మీ వ్యక్తిగత విషయాలు కదండీ, అందుకనే అంటూ బిడియంగా సమాధానమిచ్చాడు”.


“ఏమిటో మా పేరెంట్స్ నేనెంత చెప్పినా వినలేదు. ఒక్క రెండు సంవత్సరాలు ఆగమన్నాను".


“ఊహూ వింటేకదా”?


"మంచి సంబంధం అంటూ నా నోరు నొక్కేసారు మురారిగారూ. నా ఫియాన్సీ యూ.ఎస్ లో వర్క్ చేస్తున్నాడు. చదువు అవగానే అమెరికా వెళ్లిపోతాను".


తాను కొంచెం తేరుకుంటూ కంగ్రాట్స్ చెప్పాడు.


ఆ తరువాత కొన్నిరోజులు ఎందుకో డల్ అయిపోయాడు. మనసంతా శూన్య మావరించినట్లుగా అయిపోయింది.


చైత్ర ఎంత మంది స్నేహితుల మధ్య ఉన్నా తనను చూస్తూనే ఆ కళ్లు తళుక్కుమన్నట్లుగా అనిపించేవి. బహుశా తనకు ఆమె పట్ల గల ఇష్టం మూలాన తనే భ్రమపడుతున్నాడేమో అనుకునేవాడు.


తను చైత్ర పెళ్లికి వెళ్లలేదు.


తనకి పోస్టింగ్ హైద్రాబాద్ లో ఇచ్చారు.


చైత్రను తను ఇంకా మరచిలేకపోతున్నాడు. అందుకనే ఏ అమ్మాయినీ ఇష్టపడలేకపోతున్నాడు. ఏ అమ్మాయిని చూసినా చైత్ర లా లేదనుకునేవాడు.



నాలుగు సంవత్సరాల క్రితం నాన్నగారు పోయారు. అమ్మను తన దగ్గరకు వచ్చేయమంటే "నీవు పెళ్లి చేసుకుంటేగానీ నీ ఇంటికి రానంటూ ఖరాఖండీగా చెప్పేసింది.

రెండు సంవత్సరాల క్రితం తను కొత్త కంపెనీకి మారాడు. మంచి ఏరియాలో త్రీ బెడ్ రూమ్స్ అపార్ట్ మెంట్ కూడా కొనుకున్నాడు.


గత సంవత్సరం కంపెనీ ప్రాజక్ట్ పనిమీద ఒక సంవత్సరం కాలం యూ.ఎస్ పంపించింది. ఇంకా పొడిగిస్తామన్నా ఇష్టం లేక వచ్చేసాడు.


ప్రమోషన్ వచ్చి మేనేజర్ స్తాయికి ఎదిగాడు.


జీవితం యాంత్రికంగా గడచిపోతోంది.


ఆరోజు ఆఫీస్ కు తయావుతున్న మురారి సెల్ ఫోన్ రింగైంది.


నెంబర్ చూసి ముఖం చిట్లించాడు. అది నందిని ఫోన్.

========================================================================

ఇంకా వుంది...


========================================================================

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.









43 views0 comments

Comments


bottom of page