
'Manasuloni Prema Episode 2/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha
'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 2/6' తెలుగు ధారావాహిక ప్రారంభం
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
ముప్పై రెండేళ్ల మురారికి ఇంకా పెళ్లి కాలేదు.
ప్రేమించిన చైత్ర కు తన ప్రేమను వ్యక్తపరచక పోవడంతో ఆమెకు మరొకరితో వివాహం అవుతుంది.
ఆమెను మర్చిపోలేని మురారికి మరే అమ్మాయీ నచ్చదు.
అతనికి నందిని అనే అమ్మాయినుండి ఫోన్ వస్తుంది.
ఇక మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 2 చదవండి..
‘ఈ నందినికి ఎంత చెప్పినా అర్ధంకాదా? ఒకటే ఫోనులు చేస్తుంది’?
'‘అమ్మా తల్లీ, నిన్ను పెళ్లి చేసుకోలేనని కఠినంగా చెప్పేసినా నవ్వుతూ తేలికగా తీసుకుని తన వెంటపడుతోంది".
అసలు దీనికంతటికీ కారణం విరజ అక్కే కదా!
ఆరునెలల క్రితం తన ప్రమేయం లేకుండా తన ప్రొఫైల్ ను షాదీ డాట్ కామ్ లో పెట్టేసింది, తన సెల్ నంబర్ తో సహా.
నెల రోజుల క్రితం అనుకుంటా, ఈ నందిని తన ఆఫీస్ అడ్రస్ తెలుసుకుని డైరక్ట్ గా ఆఫీస్ కు వచ్చేసి రిసెప్షన్ నుండి కాల్ చేయించింది.
ఎవరో అనుకుని వస్తే అప్పుడు చెప్పింది. ‘’షాదీ డాట్ కామ్ లోని మీ ప్రొఫైల్ చూసాను. నాకు మీరు నచ్చారు. మిమ్మలని చూసేసి మాట్లాడేసుకుంటే బాగుంటుంది కదా అని వచ్చానంది.
తను తెల్లబోయాడో క్షణం.
గడ గడా తన గురించి చెప్పేసింది తనని మాట్లాడనీయకుండా..
“ఫరవాలేదు మురారిగారూ, మీకు ప్రస్తుతం ముఫై రెండు నిండాయి కదా. మీకూ నాకూ మధ్య ఎనిమిది తొమ్మిదేళ్ల వయస్సు వ్యత్యాసం ఉన్నానష్టం ఏముందండీ”? " మన అమ్మమ్మల బామ్మల కాలంలో వయస్సు తేడా చాలా ఉండేదిట. వాళ్లు చక్కగా కాపురాలు చేసుకోలేదా, పిల్లలను కనలేదా అంటూ".
'అన్నీ ఈమే నిర్ణయించేస్తోందే తనకు ఇష్టమో కాదో తెలుసుకోకుండా అని చిరాకు పడ్డాడు మనసులో".
'చూడడానికి బాగానే ఉందనిపించే నందిని ఎమ్. బి. ఏ ఫైనాన్స్ చేసి శ్రీరామ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో పని చేస్తున్నానని చెప్పింది. పెళ్లి అయ్యాక హోమ్ మేకర్ ని అవుతానంటూ చెప్పింది'.
'నీవు ఏమి మేకర్ వి అయితే నాకెందుకనుకున్నాడు మనసులో'.
అసలు పెళ్లి చేసుకోడానికే సుముఖంగా లేనపుడు నందిని గురించి ఆలోచించే పరిస్తితిలో లేడు.
అందుకనే ఆమె ఫోన్ కాల్స్ కి జవాబివ్వకుండా స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడు.
ఆఫీస్ లో పని ఎక్కువగా ఉంటోంది. టీమ్ అంతా రాత్రీ పగలూ పనిచేయాల్సి వస్తోంది. ఇంతవరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా విధిగా అందరూ కంపెనీకి వెళ్లాల్సి వస్తోంది.
అమ్మ ఉగాది పండుక్కి తప్పని సరిగా రావాలంది. అక్కా, చెల్లీ, తమ్ముడూ వస్తున్నారుట. అందరూ వస్తున్నారంటే భలే సందడిగా ఉంటుందనుకున్నాడు.
ఇంక షరా మామూలే, అందరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటూ వదిలిపెట్టరు.
ఉగాది షాపింగ్ చేయాలి. అమ్మకు, అక్కకూ, చెల్లెలికీ, తమ్ముడి భార్యకూ చీరలు, పిల్లలకు డ్రెస్ లు కొనాలి. బావగార్లకు, తమ్ముడికీ అక్కడే కొనేయచ్చనుకున్నాడు.
ఆ ఆదివారం కళామందిర్ స్టోర్స్ కి వెళ్లాడు. తన చీరల సెలక్షన్ బాగుంటుందని అక్క, చెల్లీ అంటారు. బావగారైతే తనని ఆటపట్టిస్తూ “మీ సిస్టర్స్ కే ఇంత మంచి చీరలు కొంటే నీ కాబోయే భార్యకు ఇంకెంత చక్కటివి కొంటావో" అంటూ "ఎందుకింకా పెళ్లిచేసుకోవు మురారీ?" అంటూ చనువుగా అడుగుతాడు.
‘తను చైత్రను ఇంకా మరచిలేకపోతున్నాడా’? పెళ్లి అయిపోయి అమెరికా వెళ్లిపోయిన చైత్ర అంటే ఇంకా ఆశ ఎందుకు? దీనికి సమాధానం తన మనస్సుకి మాత్రమే తెలుసు. అది తన తొలి ప్రేమ. ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ వెంటాడే ఓ అద్భుతమైన ఫీలింగ్. ఆ ప్రేమ జ్ఞాపకాలు మంచి వైనా చెడ్డవైనా గుర్తొచ్చిన ప్రతిసారి గమ్మత్తుగానే ఉంటాయి. ఆ మధురమైన భావన తను ఎంత మంది అమ్మాయిలను చూసినా కలగడం లేదు'.
తను షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న సమయంలో..
“హాయ్ మురారిగారూ అన్న పిలుపుకు ఉలిక్కిపడుతూ తలెత్తేసరికి తనకు ఎదురుగా నందిని, ఆమె పక్కనే ఒక యువకుడు.
“ఏమిటీ, మొత్తం షాప్ నే కొనేసారా ఏమిటీ?”
“అబ్బ మళ్లీ తారసపడిందీ” అని గొణుక్కున్నాడు.
“ఇతను మా బావ ఫణీంద్ర మురారిగారూ”, “బావా! ఈయన మురారిగారు” అని పరిచయంచేయగానే ఇద్దరూ హలో చెప్పుకున్నారు.
“బావా నీకు చెప్పానుకదా.. నాకు కిందటి నెలలో పెళ్లి చూపులయ్యాయని. ఈ మురారిగారితోనే”.
నందిని మాటలకు విస్తుపోతూ చూస్తున్నాడు మురారి.
“నాకు మురారిగారు బాగా నచ్చేసారు. ఆయన ఇంకా ఓకే చెప్పలేదనుకో, కాస్త సమయం కావాలన్నారు".
“నాకైతే ఆలోచించుకోడాని ఏమీలేదు. నాకు నచ్చితే అమ్మా నాన్నాకూ నచ్చినట్లే”.
ఎందుకో ఫణీంద్ర ముఖం వెలతెలబోయింది.
“అదేమిటీ ఈ అమ్మాయి ఇంత చొరవతీసుకుని తన తరపున కూడా వకాల్తా తీసుకుని మాట్లాడేస్తోందీ? నాకు సమయం కావాలని ఎప్పుడన్నాను?” ఆశ్చర్యపోతున్నాడు మురారి.
తన అభిప్రాయాన్ని సూటిగా ఎప్పుడో చెప్పేసాడు. అయినా తన వెంట పడ్తూ అదే పనిగా ఇబ్బంది పెడ్తుంటే కొంచెం కాఠిన్యాన్ని తెచ్చి పెట్టుకుంటూ మరీ చెప్పాడు ఇలా అదేపనిగా తన వెంటపడద్దని.
మరోసారి స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలనుకుంటూ మౌనంగా కార్ పార్కింగ్ వైపుకి నడిచాడు.
మురారిని చూసి ఇంటిల్లిపాదీ ఆనందపడ్డారు. తల్లి నీరసంగా ఉండడం గమనించిన మురారి “అమ్మా! డాక్టర్ కి చూపించుకున్నావా ఈ మధ్య” అంటూ ఆత్రంగా అడిగాడు.
"ఏదో కాస్తంత నీరసంగా అంటోంది తప్ప బాగానే ఉన్నాను మురారీ” అంటూ ఆవిడ సమాధానిచ్చింది.
ఉగాది పండుగ చాలా సరదాగా గడిచింది. మురారి కొన్న చీరలు చూసుకుని ఇంట్లో అందరూ మురిసిపోయారు. పిల్లలు కొత్త బట్టలు తొడుక్కుని గంతులేసారు.
ఆరోజు రాత్రి లీలావతి మురారి పెళ్లి విషయం ఎత్తింది. “చేసుకుంటానమ్మా, మంచి సంబంధం చూడ"నగానే ఆవిడ కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది.
ఎప్పుడు పెళ్లి మాటెత్తినా చిరాకు పడే మురారి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఈ సంవత్సరంలో ఎలాగైనా పెళ్లి చేసేయాలనుకుంది ఆవిడ.
========================================================================
ఇంకా వుంది...
========================================================================
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


Comments