'Manasuloni Prema Episode 3/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha
'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 3/6' తెలుగు ధారావాహిక
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
ముప్పై రెండేళ్ల మురారికి ఇంకా పెళ్లి కాలేదు. ప్రేమించిన చైత్ర కు తన ప్రేమను వ్యక్తపరచక పోవడంతో ఆమెకు మరొకరితో వివాహం అవుతుంది. ఆమెను మర్చిపోలేని మురారికి మరే అమ్మాయీ నచ్చదు.
అతనికి నందిని అనే అమ్మాయినుండి ఫోన్ వస్తుంది. మురారి ప్రొఫైల్ తనకు నచ్చిందని, అతన్ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. తన బావ ఫణింద్రతో కూడా ఆ సంగతి చెబుతుంది.
ఇక మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 3 చదవండి..
మర్నాడు సాయంత్రమే మురారి తిరుగు ప్రయాణం. ఆఫీస్ లో పూర్తి చేయాల్సిన పనులెన్నో ఉన్నాయనుకుంటూ నిద్రపోయాడు.
మర్నాడు ఉదయం ఎంతకూ నిద్రలేవని తల్లి గదిలోకి లేపాలని వెళ్లారు మురారి అక్కా, చెల్లెలూ.
ఉన్నట్టుండి "ఒరేయ్ మురారీ!" అంటూ గావుకేక పెట్టింది మురారి అక్క విరజ.
గబ గబా వెళ్లాడు. తల్లి ని కుదుపుతూ లేపుతున్నారు అక్కా, చెల్లీ. ఆవిడ కదలకుండా ప్రశాంతంగా ఆదమరచి నిద్రపోతోంది.
డాక్టర్ వచ్చి చూసాడు. రాత్రి నిద్రలో కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పాడు. మురారి దుఖం చెప్పనలివికాదు. అందరూ తల్లి చుట్టూ చేరి దుఖిస్తున్నారు.
“నీ పెళ్లి పెళ్లి అంటూ కలవరించేదిరా అమ్మ. ఆ శుభకార్యం అయ్యేవరకైనా అమ్మ ఉండాల్సింది" అంటూ విరజక్క ఒకటే ఏడుపు. చెల్లెలు వినతి దుఖాన్ని ఆపలేకపోతున్నారు ఎవరూ కూడా.
అమ్మకు తన పెళ్లి మీదే బెంగ. తను అమ్మ కిచ్చిన మాట నిలపెట్టాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. తల్లికి జరపాల్సిన కార్య క్రమాలన్నీ పూర్తిచేసి హైద్రాబాద్ వచ్చేసాడు. తన సెల్ ఫోన్ చూసుకుంటే నందిని నుండి ఎన్నో మిస్డ్ కాల్స్, మెసేజస్.
"ఏమిటో ఈ జీవితం? ఇష్టపడిన వాళ్లు దూరమైతే, వద్దనుకునేవారు వెంటపడడం ఆశ్చర్యమే కదూ"!
పదిహేను రోజులు శెలవు తీసుకోవడంతో చాలా పని పెండింగ్ ఉండిపోయింది. ప్రాజక్ట్స్ డెడ్ లైన్స్ సమీపిస్తున్నాయి. మధ్య మధ్యలో అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు భారమై పోతోంది. "షాదీ డాట్ కామ్" నుండి చాలా మెయిల్స్ వచ్చాయి. "మీ ఫ్రీ సమయం చెపితే మాటలాడతామంటూ".
నందిని మనస్సులో మెదిలింది. ఆ అమ్మాయి తనని ఇష్టపడుతోంది. ఇరువురి మధ్యా ఎనిమిదేళ్ల వయస్సు వ్యత్యాసం. మరీ చిన్నపిల్లేమో? పెళ్లైనాకా తమ కాపురం సజావుగా నడిస్తే ఫరవాలేదు. అభిప్రాయబేధాలు వచ్చి జరగరానిది ఏమైనా జరిగితే?
"కానీ వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు కదా"!
తను సరైన నిర్ణయం తీసుకోలేక పోవడం వలన విభిన్నరకాల సంఘర్షణల కు లోనౌతున్నాడు. ఏది కావాలో ఏది వద్దో తెలియని డోలాయమానం. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నందిని నుండి ఫోన్.
“నేను మీ ఆఫీస్ విజిటర్స్ రూమ్ లో ఉన్నాను మురారిగారూ, మిమ్మలని అర్జంట్ గా కలవాలంటూ”.
వచ్చాడు కిందకు.
“ఏమిటి మురారిగారూ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, పైగా మెసేజస్ కూడా చేసాను”.
“బిజీ గా ఉండి నా సెల్ ఫోన్ చూసుకోలేదు. సారీ, చెప్పండి ఎందుకు వచ్చారు”?
“మీ రిసెప్షన్ కి ఫోన్ చేస్తే చెప్పారు. మీ అమ్మగారు పోయారని మీరు రాజమండ్రీలో ఉన్నారని. సారీ ఫర్ యువర్ లాస్ మురారిగారూ”.
“ఇట్స్ ఓకే నందినీ"!
“బై ది బై నా పెళ్లి మా బావతో ఫిక్స్ అయిందండీ. మీకు జరిగిందంతా చెప్పాలి విత్ యువర్ కైండ్ పర్మిషన్. మిమ్మలని బోర్ కొడుతున్నానని తెలుసు. కానీ చెప్పకపోతే నా అంతరాత్మ నన్ను క్షమించదు మురారి గారూ"!
ఒక్క క్షణం ఏమి చెపుతోందో అర్ధం కాలేదు. వెంటనే తేరుకుంటూ, “చెప్పండి ఫరవాలేదన్నాడు".
“నేను మా బావను మొదటి నుండీ ప్రేమిస్తున్నానండీ. ఫణీంద్రకి కూడా నేనంటే ఇష్టమే. కానీ వాళ్ల నాన్నకు అంటే మా మామయ్యకు నన్ను వారి కోడలుగా చేసుకోవడం ససేమిరా ఇష్టంలేదు. మా మామయ్యకు నాన్నంటే పడదు. బావేమో నాన్నకు ఇష్టం లేని పని చేయను, నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్పేసరికి నాకు చాలా కోపం వచ్చింది. "మామయ్య వద్దన్న మాత్రాన మనం పెళ్లి చేసుకోకపోవడమేమిటీ, ఏం ఫరవాలేదు పెళ్లి చేసేసుకుందాం, ఆ తరువాత మీ వాళ్లే నెమ్మదిగా కన్విన్స్ అవుతారన్నానండీ".
“పెళ్లి కాకుండానే ఇలాంటి సలహాలిస్తూ నన్ను మా పేరెంట్స్ కు దూరంచేస్తావా అంటూ ఖస్సు మన్నాడండీ. నేను నిన్నుపెళ్లి చేసుకోను ఫో అంటూ వెళ్లిపోయాడు".
“ప్రేమంటే అర్ధం అదేనా మురారిగారూ? ఆ రోజు బావ ప్రవర్తనకు నేను ఎంతటి సంఘర్షణకు లోనైనానో ఆ భగవంతుడికే తెలుసు"!
"నాకు చాలా రోషం వచ్చి ఫణితో ఛాలెంజ్ చేసాను. నీవు తప్ప నాకు ఎవరూ దొరకరనుకోకు. నీకంటే అందగాడిని మంచి హోదాగలవాడిని చేసుకుంటానని".
అందుకే వెంటనే షాదీ డాట్ కామ్ లో సంబంధాలు వెతుకుతుంటుంటే మీ ప్రొఫైల్ తారసపడింది. వయస్సు ఎక్కువైనా మీరు స్మార్ట్ గా ఉన్నారు మా బావకంటే. పైగా మంచి ఉద్యోగం, పేకేజ్ కూడాను.
“మిమ్మలని చూపించి బావను ఉడికించాలనుకున్నాను. నేను మిమ్మలని ట్రాప్ చేసానని నన్ను తిట్టినా భరిస్తాను. నిజానికి మిమ్మలని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదండీ".
========================================================================
ఇంకా వుంది...
========================================================================
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments